కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనం అప్రమత్తంగా ఉండడం ఇప్పుడు మరింత అత్యవసరం

మనం అప్రమత్తంగా ఉండడం ఇప్పుడు మరింత అత్యవసరం

మనం అప్రమత్తంగా ఉండడం ఇప్పుడు మరింత అత్యవసరం

“మీ ప్రభువు ఏ రోజున వస్తాడో మీకు తెలియదు కాబట్టి సదా అప్రమత్తంగా ఉండండి.”​—⁠మత్తయి 24:​42, Nw.

“ప్రాథమికంగా, ఇరవయ్యో శతాబ్దాన్ని యుద్ధాలు ఎంతో ప్రభావితం చేశాయి” అని బిల్‌ ఎమొట్‌ అనే రచయిత అంటున్నాడు. మానవ చరిత్రంతటిలో యుద్ధాల మూలంగా, దౌర్జన్యం మూలంగా జరిగిన దుఃఖకరమైన సంఘటనలు ఉన్నాయని అంగీకరిస్తూనే ఆయన ఇంకా ఇలా అంటున్నాడు: “ఇరవయ్యో శతాబ్దం ఆ విషయంలో ఏమాత్రం భిన్నంగా లేకపోయినా, తీవ్రత విషయంలో అది ఎంతో భిన్నంగా ఉంది. మొదటిసారిగా నిజమైన భూవ్యాప్త పోరాటం జరిగింది ఆ శతాబ్దంలోనే . . . ఇక ఆ విషయాన్ని నొక్కిచెప్పడానికన్నట్లు, అలాంటి భూవ్యాప్త పోరాటాలు ఒకటి కాదు రెండు జరిగాయి.”

2 “జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును” లేచే యుద్ధాల గురించి యేసుక్రీస్తు ప్రవచించాడు. అయితే, అవి ‘క్రీస్తు రాకడకు [“ప్రత్యక్షతకు,” NW], ఈ యుగసమాప్తికి సూచనలో’ కేవలం ఒక అంశం మాత్రమే. ఈ గొప్ప ప్రవచనంలో యేసు కరవులు, తెగుళ్ళు, భూకంపాల గురించి కూడా ప్రస్తావించాడు. (మత్తయి 24:3, 7, 8; లూకా 21:6, 7, 10, 11) అలాంటి బాధలు పరిధిలోనూ తీవ్రతలోనూ అనేకవిధాలుగా అధికమయ్యాయి. మానవుడికి దేవునిపట్ల తోటిమానవునిపట్ల ఉన్న దృక్పథంలో కనిపిస్తున్నట్లుగా మానవుని చెడుతనం పెరిగిపోయింది. నైతిక పతనం, నేర దౌర్జన్యాలు పెరిగిపోవడం స్పష్టంగా కనిపిస్తున్నాయి. మానవులు సుఖాలకు మరిగి దేవునికంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ఇదంతా మనం ‘అపాయకరమైన కాలములలో’ జీవిస్తున్నామని రుజువుచేస్తోంది.​—⁠2 తిమోతి 3:​1-5.

3 మానవ వ్యవహారాల్లో దిగజారిపోతున్న ధోరణిని మీరెలా దృష్టిస్తారు? చాలామంది ప్రస్తుతం జరుగుతున్న వేదనకరమైన సంఘటనల పట్ల ఉదాసీనంగా, కఠినంగా ఉంటున్నారు. లోకంలోని పలుకుబడిగలవారు, మేధావులు “కాలముల సూచనల” భావాన్ని గ్రహించరు; మతనాయకులు కూడా ఈ విషయంలో సరైన నడిపింపును ఇవ్వలేదు. (మత్తయి 16:​1-3) కానీ యేసు తన అనుచరులకు ఇలా ఉపదేశించాడు: “అందుకే, మీ ప్రభువు ఏ రోజున వస్తాడో మీకు తెలియదు కాబట్టి సదా అప్రమత్తంగా ఉండండి.” (మత్తయి 24:​42, NW) యేసు ఇక్కడ మనల్ని కేవలం మెలకువతో ఉండమనే కాదు “సదా అప్రమత్తంగా” ఉండమని ప్రోత్సహిస్తున్నాడు. అప్రమత్తంగా ఉండడానికి మనం చురుకుగా, కనిపెట్టుకొని ఉండాలి. ఇందుకోసం మనం అంత్యదినాల్లో జీవిస్తున్నామని కేవలం అంగీకరించడం కంటే, ఇవి కష్టభరితమైన కాలాలని గుర్తించడం మాత్రమే సరిపోదు. “అన్నిటి అంతము సమీపమైయున్నది” అనే దృఢ నిశ్చయత మనకుండాలి. (1 పేతురు 4:⁠7) అప్పుడు మాత్రమే మనం అత్యవసరభావంతో అప్రమత్తంగా ఉంటాము. కాబట్టి, ‘అంతం సమీపంలో ఉందనే మన నిశ్చయతను దృఢపరచుకోవడానికి మనకు ఏమి సహాయం చేస్తుంది?’ అనే ప్రశ్న గురించి మనం ఆలోచించాలి.

4 మానవ చరిత్రలో జరిగిన ఒక విశేషమైన సంఘటన, అంటే నోవహు కాలంనాటి గొప్ప జలప్రళయం సంభవించడానికి ముందటి కాలంలోని పరిస్థితులను పరిశీలించండి. ప్రజలు ఎంత చెడ్డగా ఉండేవారంటే, అది చూసి యెహోవా ‘తన హృదయములో నొచ్చుకొన్నాడు.’ ఆయనిలా ప్రకటించాడు: ‘నేను సృజించిన నరులను భూమిమీద నుండకుండ తుడిచివేయుదును.’ (ఆదికాండము 6:​6, 7) ఆయన సరిగ్గా అలాగే చేశాడు. ఆ కాలానికి మన కాలానికి మధ్యనున్న సారూప్యతల గురించి వ్యాఖ్యానిస్తూ యేసు ఇలా అన్నాడు: “నోవహు దినములు ఏలాగుండెనో మనుష్యకుమారుని రాకడయును [“ప్రత్యక్షత,” NW] ఆలాగే ఉండును.”​—⁠మత్తయి 24:​37.

5 యెహోవా, జలప్రళయానికి ముందున్న లోకం గురించి ఎలా భావించాడో ప్రస్తుతమున్న లోకం గురించి కూడా అలాగే భావిస్తాడని విశ్వసించడం సహేతుకం. ఆయన నోవహు కాలంనాటి భక్తిహీన లోకాన్ని అంతం చేశాడు కాబట్టి నేటి దుష్టలోకాన్ని కూడా ఆయన తప్పక నాశనం చేస్తాడు. ఆ కాలానికి మన కాలానికి మధ్య ఉన్న సారూప్యతల గురించి స్పష్టమైన అవగాహన కలిగివుండడం, ప్రస్తుత లోకాంతం సమీపంలో ఉందనే మన దృఢనమ్మకాన్ని బలపరచాలి. అయితే ఆ సారూప్యతలేమిటి? కనీసం ఐదు సారూప్యతలున్నాయి. మొదటిదేమిటంటే, రానున్న నాశనం గురించిన హెచ్చరిక సుస్పష్టంగా ఇవ్వబడింది.

అదివరకు చూడని సంగతుల” గురించి హెచ్చరించబడడం

6 నోవహు కాలంలో యెహోవా ఇలా ప్రకటించాడు: “నా ఆత్మ నరులతో ఎల్లప్పుడును వాదించదు; వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై యున్నారు. అయినను వారి దినములు నూట ఇరువది యేండ్లగును.” (ఆదికాండము 6:⁠3) సా.శ.పూ. 2490లో ఈ దైవిక ఆజ్ఞ వెలువడడం, దైవభక్తిలేని ఆ లోకాంతం యొక్క ఆరంభాన్ని సూచించింది. అప్పుడు జీవిస్తున్నవారికి దాని భావమేమై ఉండగలదో ఒకసారి ఆలోచించండి! ఇక 120 సంవత్సరాలకు యెహోవా “జీవ వాయువుగల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండ నాశము చేయుటకు భూమిమీదికి జలప్రవాహము” రప్పిస్తాడు, అలా చేస్తానని ఆయన నోవహుకు ఆ తర్వాత చెప్పినట్లు స్పష్టమవుతోంది.​—⁠ఆదికాండము 6:​17.

7 రానున్న వినాశనం గురించి నోవహుకు దశాబ్దాలు ముందుగానే హెచ్చరిక ఇవ్వబడింది, ఆ వినాశనాన్ని తప్పించుకొని జీవించడానికి సిద్ధపడేలా ఆయన ఆ సమయాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించుకున్నాడు. “నోవహు అదివరకు చూడని సంగతులనుగూర్చి దేవునిచేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, తన యింటివారి రక్షణకొరకు ఒక ఓడను సిద్ధముచేసెను” అని అపొస్తలుడైన పౌలు చెబుతున్నాడు. (హెబ్రీయులు 11:⁠7) మన విషయమేమిటి? ఈ విధానపు అంత్యదినాలు 1914లో ప్రారంభమై దాదాపు 90 సంవత్సరాలు గడిచిపోయాయి. కాబట్టి మనం ఖచ్చితంగా “అంత్యకాలము”లో ఉన్నాము. (దానియేలు 12:⁠4) మనకివ్వబడిన హెచ్చరికకు మనమెలా ప్రతిస్పందించాలి? “దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును” అని బైబిలు చెబుతోంది. (1 యోహాను 2:​17) కాబట్టి తీవ్రమైన అత్యవసరభావంతో యెహోవా చిత్తాన్ని చేయవలసిన సమయం ఇదే.

8 ఆధునిక కాలాల్లో, ఈ విధానం నాశనం కాబోతోందని శ్రద్ధగల బైబిలు విద్యార్థులు ప్రేరేపిత లేఖనాల నుండి తెలుసుకున్నారు. దీన్ని మనం విశ్వసిస్తున్నామా? యేసుక్రీస్తు స్పష్టంగా ఏమని చెప్పాడో గమనించండి: “లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు.” (మత్తయి 24:​21) యేసు తాను దేవుని నియమిత న్యాయాధిపతిగా వస్తానని, గొఱ్ఱెలకాపరి గొఱ్ఱెలను మేకలను వేరుచేసినట్లు తాను ప్రజలను వేరుచేస్తానని కూడా చెప్పాడు. అనర్హులుగా గుర్తించబడినవారు “నిత్యశిక్షకును, నీతిమంతులు నిత్యజీవమునకును పోవుదురు.”​—⁠మత్తయి 25:​31-33, 46.

9 యెహోవా తన ప్రజలకు, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” అందజేస్తున్న ఆధ్యాత్మిక ఆహారం ద్వారా సమయానుకూలంగా గుర్తుచేస్తూ వారి అవధానాన్ని ఈ హెచ్చరికల వైపుకు మళ్ళించాడు. (మత్తయి 24:​45-47) అంతేగాక, ‘దేవుడు తీర్పుతీర్చు గడియ వచ్చెను గనుక ఆయనకు భయపడి ఆయనను మహిమపరచడానికి’ ప్రతి జనము, ప్రతి వంశము, ఆ యా భాషలు మాట్లాడేవారు, ప్రతి ప్రజ ఆహ్వానించబడుతున్నారు. (ప్రకటన 14:​6, 7) యెహోవాసాక్షులు భూవ్యాప్తంగా ప్రకటిస్తున్న రాజ్య సందేశంలో, దేవుని రాజ్యం త్వరలోనే మానవ పరిపాలనను నిర్మూలిస్తుందన్న హెచ్చరిక ప్రాథమిక అంశం. (దానియేలు 2:​44) ఈ హెచ్చరికను తక్కువ అంచనా వేయకూడదు. సర్వశక్తిమంతుడైన దేవుడు ఎప్పుడూ తన వాగ్దానాలను నెరవేరుస్తాడు. (యెషయా 55:​10, 11) ఆయన నోవహు కాలంలో నెరవేర్చాడు, మన కాలంలోనూ నెరవేరుస్తాడు.​—⁠2 పేతురు 3:​3-7.

లైంగిక దుర్నీతి ప్రబలం కావడం

10 మరో విషయంలోనూ మన కాలం నోవహు కాలాన్ని పోలి ఉంది. దేవుడిచ్చిన లైంగిక శక్తులను వివాహ ఏర్పాటులో గౌరవప్రదంగా ఉపయోగించుకుంటూ మానవులతో ‘భూమిని నిండించమని’ యెహోవా మొదటి స్త్రీపురుషులకు ఆజ్ఞాపించాడు. (ఆదికాండము 1:​28) నోవహు కాలంలో, అవిధేయులైన దేవదూతలు అసహజ లైంగిక సంబంధాలతో మానవజాతిని కలుషితం చేశారు. వాళ్ళు భూమిపైకి వచ్చి, శరీరాలు దాల్చి, అందమైన స్త్రీలతో సహజీవనం చేసి, సగం మానవ స్వభావం సగం దయ్యాల స్వభావం ఉన్న నెఫీలులకు జన్మనిచ్చారు. (ఆదికాండము 6:​2, 4) కామోద్రిక్తులైన ఈ దేవదూతల పాపం సొదొమ గొమొఱ్ఱా ప్రజల దుష్ప్రవర్తనతో పోల్చబడింది. (యూదా 6, 7) తత్ఫలితంగా, ఆ రోజుల్లో లైంగిక దుర్నీతి విస్తృతంగా వ్యాపించింది.

11 నేటి నైతిక వాతావరణం ఎలా ఉంది? ఈ అంత్యదినాల్లో, చాలామంది జీవితాలు లైంగిక సంబంధాల చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. పౌలు అలాంటివారిని “సిగ్గులేనివారు” అని విస్పష్టంగా వర్ణిస్తున్నాడు; చాలామంది ‘నానావిధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మునుతామే కాముకత్వమునకు అప్పగించుకొన్నారు.’ (ఎఫెసీయులు 4:​19) అశ్లీల చిత్రాలు, వివాహానికి ముందే లైంగిక సంబంధాలు, పిల్లలపై లైంగిక అత్యాచారాలు, సలింగ సంపర్కం సర్వసాధారణమైన విషయాలుగా ఉన్నాయి. కొంతమంది ఇప్పటికే సుఖవ్యాధులు, కుటుంబ విచ్ఛిన్నం, ఇతర సామాజిక సమస్యల రూపంలో ‘తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుతున్నారు.’​—⁠రోమీయులు 1:​26, 27.

12 నోవహు కాలంలో యెహోవా గొప్ప జలప్రళయాన్ని రప్పించి ఆ కామోన్మాద లోకాన్ని అంతం చేశాడు. ఈ కాలాలు కూడా నిజంగా నోవహు కాలంలానే ఉన్నాయనే వాస్తవాన్ని మనం ఎన్నడూ మరచిపోకూడదు. రాబోయే “మహా శ్రమ” భూమి మీది నుండి ‘జారులను, వ్యభిచారులను, ఆడంగితనముగలవారిని, పురుషసంయోగులను’ నిర్మూలిస్తుంది. (మత్తయి 24:21; 1 కొరింథీయులు 6:9, 10; ప్రకటన 21:⁠8) మనం చెడుపట్ల అసహ్యతను పెంచుకొని, లైంగిక దుర్నీతికి పాల్పడేలా చేయగల పరిస్థితులకు దూరంగా ఉండడం ఎంత అత్యవసరమో కదా!​—⁠కీర్తన 97:10; 1 కొరింథీయులు 6:​18.

భూమి ‘బలాత్కారముతో నిండిపోవడం’

13 నోవహు కాలంనాటి మరో విలక్షణాన్ని సూచిస్తూ బైబిలు ఇలా చెబుతోంది: “భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయియుండెను; భూలోకము బలాత్కారముతో నిండియుండెను.” (ఆదికాండము 6:​11) బలాత్కారం లేదా దౌర్జన్యం క్రొత్త విషయమేమీ కాదు. ఆదాము కుమారుడైన కయీను నీతిమంతుడైన తన తమ్ముణ్ణి హత్యచేశాడు. (ఆదికాండము 4:⁠8) లెమెకు తన కాలంనాటి దౌర్జన్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ, తనను తాను కాపాడుకోవడానికి ఒక యౌవనస్థుడిని తానెలా చంపాడో ప్రగల్భాలు పలుకుతూ ఒక పద్యం కూర్చాడు. (ఆదికాండము 4:​23, 24) అయితే నోవహు కాలంలో భిన్నంగా ఉన్నదేమిటంటే దౌర్జన్య స్వభావపు తీవ్రత. దేవుని అవిధేయ కుమారులైన దేవదూతలు భూమిపైనున్న స్త్రీలను వివాహం చేసుకొని సంతానానికి అంటే నెఫీలులకు జన్మనిచ్చినప్పుడు బలాత్కారం లేదా దౌర్జన్యం అంతకు ముందెన్నడూ లేనంతగా అధికమయ్యింది. దౌర్జన్యపూరితులైన ఈ శూరులు “బలాత్కారులు,” అంటే ఇతరులపై దౌర్జన్యం చేసేవారు. (ఆదికాండము 6:​4, అధస్సూచి) ఫలితంగా, భూమి “బలాత్కారముతో నిండి” పోయింది. (ఆదికాండము 6:​13) అలాంటి వాతావరణంలో తన పిల్లలను పెంచడానికి నోవహు ఎన్ని సమస్యలను ఎదుర్కొని ఉంటాడో ఊహించండి! అయినప్పటికీ నోవహు ‘ఆ తరమువారిలో యెహోవా ఎదుట నీతిమంతునిగా’ నిరూపించుకున్నాడు.​—⁠ఆదికాండము 7:⁠1.

14 మానవ చరిత్రంతటిలోనూ బలాత్కారం లేదా దౌర్జన్యం ఉండనే ఉంది. అయితే నోవహు కాలంలోలాగే మన కాలంలోనూ అది విపరీతమైన స్థాయిలో ఉంది. మనం తరచూ గృహదౌర్జన్యం, తీవ్రవాదుల కార్యకలాపాలు, జాతినిర్మూలన ప్రచారాలు, ఎలాంటి స్పష్టమైన సంకల్పం లేకుండా తుపాకులతో సామూహిక హత్యలు చేయడం వంటివాటి గురించి వింటుంటాము. వాటికి తోడు యుద్ధాల వల్ల కలిగే రక్తపాతం. భూమి మళ్ళీ దౌర్జన్యంతో నిండిపోయింది. ఎందుకు? అది అధికం కావడానికి ఏమి దోహదపడింది? దానికి సమాధానం నోవహు కాలానికి సంబంధించి మరో సారూప్యతను వెల్లడి చేస్తుంది.

15 దేవుని మెస్సీయ రాజ్యం 1914లో పరలోకంలో స్థాపించబడినప్పుడు, సింహాసనాసీనుడైన రాజు యేసుక్రీస్తు చారిత్రాత్మకమైన చర్య తీసుకున్నాడు. అపవాదియైన సాతాను, అతని దయ్యాలు పరలోకం నుండి భూమి మీదికి పడద్రోయబడ్డారు. (ప్రకటన 12:​9-12) జలప్రళయానికి ముందు అవిధేయులైన దేవదూతలు తమ పరలోక స్థానాలను తమకై తాము వదులుకున్నారు; అయితే ఆధునిక కాలాల్లో వారు బలవంతంగా వెళ్ళగొట్టబడ్డారు. అంతేగాక, అక్రమమైన శారీరక ఆనందాలు అనుభవించడానికి మానవ శరీరాలు దాల్చే శక్తి కూడా ఇప్పుడు వారికి లేదు. కాబట్టి వారు అశాంతితో, కోపంతో, రానున్న తీర్పును గురించిన భయంతో, నోవహు కాలంలో కంటే ఎక్కువ తీవ్రతతోకూడిన అమానుష నేరాలు, దౌర్జన్యాలు చేసేలా మానవులను సంస్థలను ప్రభావితం చేస్తున్నారు. అవిధేయ దేవదూతలు వారి సంతానము భూమిని చెడుతనంతో నింపేసిన తర్వాత యెహోవా జలప్రళయానికి ముందున్న లోకాన్ని నిర్మూలించాడు. తప్పకుండా మన కాలంలో కూడా ఆయన అదే చేస్తాడని మనం నిశ్చయతతో ఉండవచ్చు! (కీర్తన 37:​10) అయితే, నేడు అప్రమత్తంగా ఉండేవాళ్ళు తమ విడుదల సమీపించిందని తెలుసుకుంటారు.

సందేశం ప్రకటించబడడం

16 ప్రస్తుత దినానికి జలప్రళయానికి ముందున్న లోకానికి మధ్యనున్న నాలుగవ సారూప్యతను, నోవహుకు అప్పగించబడిన పనిలో చూడవచ్చు. నోవహు ఒక పెద్ద ఓడను నిర్మించాడు. అంతేగాక ఆయన ‘ప్రకటించాడు’ కూడా. (2 పేతురు 2:⁠5) ఆయన ఏ సందేశాన్ని ప్రకటించాడు? నోవహు ప్రకటించిన దానిలో పశ్చాత్తాపపడమని ఇవ్వబడిన పిలుపు, రానున్న నాశనం గురించిన హెచ్చరిక ఉన్నాయని స్పష్టమవుతోంది. నోవహు కాలంనాటి ప్రజలు “జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపోవు వరకు ఎరుగక పోయిరి” అని యేసు అన్నాడు.​—⁠మత్తయి 24:​38, 39.

17 అదే విధంగా, ప్రకటించమని తమకు ఇవ్వబడిన నియామకాన్ని యెహోవాసాక్షులు శ్రద్ధగా నెరవేరుస్తుండగా, దేవుని రాజ్య సందేశం ప్రపంచవ్యాప్తంగా ప్రకటించబడుతోంది. భూగోళంలోని దాదాపు ప్రతి భాగంలో, ప్రజలు రాజ్య సందేశాన్ని తమ సొంత భాషలో వినవచ్చు, చదవవచ్చు. యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తున్న కావలికోట పత్రిక 140 కంటే ఎక్కువ భాషల్లో 2,50,00,000 పైచిలుకు ప్రతులు ముద్రించబడుతోంది. నిజమే, దేవుని రాజ్య సువార్త “సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడు[తోంది].” ఆ పని దేవునికి సంతృప్తికరమైన విధంగా ముగించబడినప్పుడు, తప్పక అంతం వస్తుంది.​—⁠మత్తయి 24:​14.

18 జలప్రళయానికి ముందటి కాలంలో ఆధ్యాత్మిక విషయాల్లో ప్రజలకున్న నిరాసక్తతను, నీతిరాహిత్యాన్ని పరిశీలిస్తే నోవహు కుటుంబం తమ ఇరుగుపొరుగువారి అవహేళనకు అపనిందలకు అపహాస్యానికి ఎందుకు గురయ్యిందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే అంతం రానే వచ్చింది. అదేవిధంగా, అంత్యదినాల్లో “అపహాసకులు అపహసించుచు” అంతకంతకూ ఎక్కువవుతున్నారు. “అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును” అని బైబిలు తెలియజేస్తోంది. (2 పేతురు 3:​3, 4, 10) నియమిత సమయంలో అది తప్పక వస్తుంది. అది ఆలస్యంగా రాదు. (హబక్కూకు 2:⁠3) మనం సదా అప్రమత్తంగా ఉండడం ఎంత జ్ఞానయుక్తమైనదో కదా!

కేవలం కొద్దిమందే తప్పించుకుంటారు

19 నోవహు కాలానికీ మన కాలానికీ ఉన్న సారూప్యతలు, ప్రజల చెడుతనం, వారి నాశనం మాత్రమే కాదు. జలప్రళయాన్ని తప్పించుకున్నవారు ఉన్నట్లుగానే ప్రస్తుత విధానాంతాన్ని తప్పించుకునేవారు కూడా ఉంటారు. జలప్రళయాన్ని తప్పించుకున్నవారు ఆనాటి ప్రజల్లో అనేకులు జీవించినట్లు జీవించని దీనులు. వారు దైవిక హెచ్చరికను లక్ష్యపెట్టి, ఆ కాలంనాటి దుష్టలోకానికి దూరంగా ఉన్నారు. “నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను. . . . నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై యుండెను” అని బైబిలు చెబుతోంది. (ఆదికాండము 6:​8, 9) మొత్తం మానవజాతి అంతటిలో నుండి ఒక కుటుంబం, ‘కొందరు, అనగా ఎనిమిది మంది నీటిద్వారా రక్షణపొందారు.’ (1 పేతురు 3:​19) వారికిలా చెబుతూ యెహోవా ఒక ఆజ్ఞ ఇచ్చాడు: “మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి.”​—⁠ఆదికాండము 9:⁠1.

20 ‘ఒక గొప్ప సమూహం మహా శ్రమల నుండి’ తప్పించుకొని వస్తుందని దేవుని వాక్యం మనకు హామీ ఇస్తోంది. (ప్రకటన 7:​9, 14) ఆ గొప్ప సమూహంలో ఎంతమంది ఉంటారు? యేసే స్వయంగా ఇలా చెప్పాడు: “జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే.” (మత్తయి 7:​13, 14) ఇప్పుడు భూమిపై నివసిస్తున్న కోటానుకోట్ల మందితో పోలిస్తే రానున్న మహా శ్రమను తప్పించుకునేవారు చాలా కొద్దిమందే ఉంటారు. కానీ వారికి, జలప్రళయాన్ని తప్పించుకొని జీవించినవారికి ఇవ్వబడినటువంటి ఒక అవకాశం ఇవ్వబడవచ్చు. తప్పించుకొని జీవించేవారు, క్రొత్త భూసమాజంలో భాగంగా కొంతకాలంపాటు సంతానం కనే అవకాశం ఉండవచ్చు.​—⁠యెషయా 65:​23.

“సదా అప్రమత్తంగా ఉండండి”

21 జలప్రళయం పూర్వమెప్పుడో సంభవించినట్లు అనిపిస్తున్నప్పటికీ మనం అలక్ష్యం చేయకూడని ఒక హెచ్చరికను అది స్పష్టంగా తెలియజేస్తోంది. (రోమీయులు 15:⁠4) నోవహు కాలానికి మన కాలానికి మధ్యనున్న సారూప్యతలు, జరుగుతున్నదాని ప్రాముఖ్యతను మనం పూర్తిగా గ్రహించేలా చేసి, దుష్టులకు శిక్ష విధించడానికి యేసు దొంగవలె రావడాన్ని గురించి మనల్ని అప్రమత్తులను చేయాలి.

22 నేడు, యేసుక్రీస్తు ఒక ఆధ్యాత్మిక బృహత్‌ నిర్మాణ కార్యానికి నాయకత్వం వహిస్తున్నాడు. సత్యారాధకుల భద్రత కోసం, రక్షణ కోసం ఓడవంటి ఆధ్యాత్మిక పరదైసు ఉనికిలో ఉంది. (2 కొరింథీయులు 12:​3, 4) మహా శ్రమ నుండి తప్పించుకోవడానికి మనం ఆ పరదైసులోనే ఉండాలి. ఆ ఆధ్యాత్మిక పరదైసు చుట్టూ సాతాను ప్రపంచం ఉంది, అది ఆధ్యాత్మికంగా నిద్రమత్తులోకి జోగిన వారెవరినైనా మ్రింగివేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మనం “సదా అప్రమత్తంగా” ఉంటూ యెహోవా దినం కోసం సన్నద్ధులమై ఉన్నట్లు నిరూపించుకోవడం అత్యంతావశ్యకం.​—⁠మత్తయి 24:​42, 44, NW.

మీకు గుర్తున్నాయా?

• యేసు తన ప్రత్యక్షత గురించి ఏ హెచ్చరిక ఇచ్చాడు?

• యేసు తన ప్రత్యక్షత సమయాన్ని దేనితో పోల్చాడు?

• మన కాలం ఏ యే విధాలుగా నోవహు కాలాన్ని పోలి ఉంది?

• నోవహు కాలానికీ మన కాలానికీ మధ్య ఉన్న సారూప్యతల గురించి ఆలోచించడం మన అత్యవసర భావాన్ని ఎలా ప్రభావితం చేయాలి?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. మనం ప్రస్తుత విధానాంతంలో జీవిస్తున్నామని ఏది చూపిస్తోంది?

3. ‘కాలముల సూచనలు’ మనపై ఎలాంటి ప్రభావం చూపించాలి?

4, 5. (ఎ) ఈ దుష్టవిధానాంతం సమీపంలో ఉందనే మన దృఢనమ్మకాన్ని ఏది బలపరుస్తుంది, ఎందుకు? (బి) నోవహు కాలానికి మనుష్యకుమారుని ప్రత్యక్షత సమయానికి మధ్యనున్న ఒక సారూప్యత ఏమిటి?

6. నోవహు కాలంలో యెహోవా ముందుగా ఏ హెచ్చరిక ఇచ్చాడని తెలుస్తోంది?

7. (ఎ) జలప్రళయం గురించి ఇవ్వబడిన హెచ్చరికకు నోవహు ఎలా ప్రతిస్పందించాడు? (బి) ఈ విధానాంతం గురించి ఇవ్వబడిన హెచ్చరికలకు మనమెలా ప్రతిస్పందించాలి?

8, 9. ఆధునిక కాలాల్లో యెహోవా ఏ హెచ్చరికలు ఇస్తున్నాడు, అవి ఎలా ప్రకటించబడుతున్నాయి?

10. నోవహు కాలంనాటి లైంగిక దుర్నీతి గురించి ఏమి చెప్పవచ్చు?

11. నైతికంగా ఎలాంటి వాతావరణం మన కాలాన్ని నోవహు కాలం వలె చేస్తోంది?

12. చెడుపట్ల మనం అసహ్యతను ఎందుకు పెంచుకోవాలి?

13. నోవహు కాలంలో, భూమి ఎందుకు “బలాత్కారముతో నిండి” పోయింది?

14. నేడు లోకం ఎంతమేరకు ‘బలాత్కారంతో నిండిపోయింది’?

15. (ఎ) అంత్యదినాల్లో బలాత్కారం లేదా దౌర్జన్యం అధికం కావడానికి ఏమి దోహదపడింది? (బి) ఏ పర్యవసానం గురించి మనం నిశ్చయతతో ఉండవచ్చు?

16, 17. నోవహు కాలానికి మన కాలానికి మధ్యవున్న నాలుగవ సారూప్యత ఏమిటి?

18. నోవహు కాలంలో జరిగిన ప్రకటనా పనికి అనేకులు ప్రతిస్పందించిన విధానానికీ నేడు జరుగుతున్న ప్రకటనా పనికి అనేకులు ప్రతిస్పందిస్తున్న విధానానికీ ఎలాంటి పోలిక ఉంది?

19, 20. జలప్రళయానికి, ప్రస్తుత విధాన నాశనానికి మధ్య ఏ సారూప్యతను మనం చూడవచ్చు?

21, 22. (ఎ) జలప్రళయానికి సంబంధించిన ఈ వృత్తాంతాన్ని పరిశీలించడం మీకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చింది? (బి) 2004 వార్షిక వచనం ఏమిటి, అది ఇచ్చే ఉపదేశాన్ని మనమెందుకు లక్ష్యపెట్టాలి?

[18వ పేజీలోని బ్లర్బ్‌]

2004 వార్షిక వచనం: “సదా అప్రమత్తంగా ఉండండి . . . సన్నద్ధులై ఉన్నట్లు నిరూపించుకోండి.”​—⁠మత్తయి 24:​42, 44, NW.

[15వ పేజీలోని చిత్రం]

నోవహు దైవిక హెచ్చరికను లక్ష్యపెట్టాడు. మనం కూడా అదేవిధంగా ప్రతిస్పందిస్తామా?

[16, 17వ పేజీలోని చిత్రాలు]

“నోవహు దినములు ఏలాగుండెనో మనుష్యకుమారుని రాకడయును [“ప్రత్యక్షత,” NW] ఆలాగే ఉండును”