మీకు జ్ఞాపకమున్నాయా?
మీకు జ్ఞాపకమున్నాయా?
మీరు ఇటీవలి కావలికోట సంచికలను చదివి ఆనందించారా? అయితే, ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి:
• మీకా పుస్తకంలో ఎన్ని అధ్యాయాలున్నాయి, అది ఎప్పుడు వ్రాయబడింది, ఆ సమయంలో ఎలాంటి పరిస్థితి ఉంది?
మీకా పుస్తకంలో ఏడు ఆధ్యాయాలున్నాయి. సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్దంలో మీకా ప్రవక్త ఆ పుస్తకం వ్రాశాడు, ఆ సమయంలో దేవుని నిబంధన ప్రజలు ఇశ్రాయేలు, యూదా అనే రెండు జనాంగాలుగా విడిపోయి ఉన్నారు.—8/15, 9వ పేజీ.
• మీకా 6:8 ప్రకారం, దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు?
మనం ‘న్యాయముగా నడుచుకోవాలి.’ దేవుడెలా వ్యవహరిస్తాడో అదే న్యాయానికి ప్రమాణం, కాబట్టి నిజాయితీ యథార్థతల విషయంలో మనం ఆయన సూత్రాలను ఉన్నతపరచాలి. ‘కనికరమును ప్రేమించమని’ ఆయన మనకు చెబుతున్నాడు. ఉదాహరణకు విపత్తుల తర్వాత ఇతరుల అవసరాలను తీర్చడానికి ముందుకు రావడం ద్వారా క్రైస్తవులు కనికరం చూపించారు. యెహోవా ‘యెదుట దీనమనస్సు కలిగి ప్రవర్తించడానికి’ మనం మన పరిమితులను గుర్తించి, ఆయనపై ఆధారపడాలి.—8/15, 20-2 పేజీలు.
• ఒక క్రైస్తవుడు తన ఉద్యోగాన్ని పోగొట్టుకుంటే అతడు ఏమి చేయాలని కోరుకోవచ్చు?
ఒకరు తమ జీవిత విధానాన్ని పునఃపరిశీలించుకోవడం జ్ఞానయుక్తమైనది. చిన్న ఇంట్లోకి మారడం ద్వారా లేక అనవసరమైన వస్తుసామాగ్రిని వదిలించుకోవడం ద్వారా తమ జీవితాన్ని సరళం చేసుకునే సాధ్యత ఉంది. అనుదిన అవసరాల గురించి చింతిస్తూ ఉండడం మానుకుని దేవుడు మనకు అవసరమైనవి లభించేలా చేయగలడని నమ్మడం ఖచ్చితంగా ప్రాముఖ్యమైనదే. (మత్తయి 6:33, 34)—9/1, 14-15 పేజీలు.
• పెళ్ళి బహుమతులు ఇచ్చేటప్పుడు లేదా తీసుకునేటప్పుడు మనం ఏమి గుర్తుంచుకోవాలి?
విలువైన బహుమతులు ఇవ్వవలసిన అవసరం లేదు, ఇవ్వాలని ఆశించకూడదు కూడా. ఇచ్చే వ్యక్తి హృదయ దృక్పథమే అత్యంత అమూల్యమైనది. (లూకా 21:1-4) బహుమతి ఇచ్చే వ్యక్తి పేరును ప్రకటించడం దయాపూర్వకమైన చర్య కాదు. అలా చేయడం ఇబ్బందికరంగా ఉండవచ్చు. (మత్తయి 6:3)—9/1, 29వ పేజీ.
• మనమెందుకు ఎడతెగక ప్రార్థించాలి?
క్రమంగా ప్రార్థించడం దేవునితో మన సంబంధాన్ని బలపరచుకోవడానికి సహాయం చేసి, తీవ్రమైన శ్రమలను ఎదుర్కోవడానికి మనల్ని సంసిద్ధులను చేస్తుంది. అవసరాన్ని, పరిస్థితులను బట్టి మనం క్లుప్తంగానైనా సుదీర్ఘంగానైనా ప్రార్థించవచ్చు. ప్రార్థన విశ్వాసాన్ని పెంపొందింపజేసి, సమస్యలను ఎదుర్కోవడానికి మనకు సహాయం చేస్తుంది.—9/15, 15-18 పేజీలు.
• కొన్ని బైబిలు అనువాదాల్లో “మృతుల కొరకు బాప్తిస్మం తీసుకోవడం” అని అనువదించబడిన 1 కొరింథీయులు 15:29వ వచనాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి?
• క్రీస్తువలెనే యథార్థంగా మరణించడానికి నడిపే జీవన విధానంలో ప్రవేశించడానికి అభిషిక్త క్రైస్తవులు బాప్తిస్మం పొందుతారని లేదా నీటిలో ముంచబడతారని పౌలు భావం. ఆ తర్వాత వాళ్లు క్రీస్తు మాదిరిగా ఆత్మసంబంధ జీవానికి పునరుత్థానం చేయబడతారు.—10/1, 29వ పేజీ.
• క్రైస్తవులు కావడంలో 1 కొరింథీయులు 6:9-11 వచనాల్లో ప్రస్తావించబడిన తప్పులను చేయకుండా ఉండడం కంటే మరెంతో ఇమిడి ఉందని మనకెలా తెలుసు?
అపొస్తలుడైన పౌలు వ్యభిచారం, విగ్రహారాధన, త్రాగుబోతుతనం వంటి తప్పిదములను మాత్రమే ప్రస్తావించి ఊరుకోలేదు. అదనపు మార్పులు అవసరం కావచ్చునని చూపిస్తూ తర్వాతి వచనంలో ఆయనిలా కొనసాగించాడు: “అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని అన్నియు చేయదగినవి కావు.”—10/15, 18-19 పేజీలు.
• దేవుని హృదయాన్ని సంతోషపరచిన ప్రాచీనకాల స్త్రీలు కొందరు ఎవరు?
వారిలో మంత్రసానులైన షిఫ్రా, పూయా ఉన్నారు, వారు ఫరో చెప్పినట్లుగా ఇశ్రాయేలీయుల నవజాత మగ శిశువులను చంపలేదు. (నిర్గమకాండము 1:15-20) కనానీయురాలైన రాహాబు అనే వేశ్య ఇశ్రాయేలీయులైన ఇద్దరు వేగులవారిని కాపాడింది. (యెహోషువ 2:1-13; 6:22, 23) అబీగయీలు బుద్ధిని ప్రదర్శించి అనేకుల ప్రాణాలను కాపాడడానికి, దావీదును రక్తాపరాధం నుండి రక్షించడానికి సహాయం చేసింది. (1 సమూయేలు 25:2-35) వారు నేటి స్త్రీలకు మాదిరులు.—11/1, 8-11 పేజీలు.
• న్యాయాధిపతులు 5:20లో చెప్పబడినట్లుగా, “నక్షత్రములు ఆకాశమునుండి” సీసెరాతో ఎలా “యుద్ధము చేసెను”?
ఇది దైవిక మద్దతును సూచిస్తున్నట్లు కొందరు భావిస్తారు. ఇది దేవదూతల సహాయాన్ని, విచ్ఛిన్నమైన ఉల్కలు కురవడాన్ని లేదా సీసెరా ఖగోళశాస్త్ర ప్రవచనాలపై ఆధారపడడాన్ని సూచిస్తోందని కొందరు అంటారు. బైబిలు ఎలాంటి వివరణా ఇవ్వడం లేదు కాబట్టి, ఆ వ్యాఖ్యానం ఇశ్రాయేలు సైన్యం తరఫున దేవుడు కలుగజేసుకోవడాన్ని సూచిస్తోందని మనం అర్థం చేసుకోవచ్చు.—11/15, 30వ పేజీ.
• మతంపట్ల ఉదాసీనత, అశ్రద్ధ భూవ్యాప్తంగా విస్తృతంగా ఉన్నప్పటికీ చాలామంది ప్రజలు తమకు దేవుని మీద నమ్మకం ఉందని ఎందుకు చెప్పుకుంటున్నారు?
కొంతమంది మనశ్శాంతి కోసం చర్చికి వెళతారు. ఇతరులు మరణం తర్వాత నిత్యజీవం కోసం, ఆరోగ్యం కోసం, ధనసంపదల కోసం, విజయం కోసం నిరీక్షిస్తారు. కొన్ని ప్రాంతాల్లో, కమ్యూనిస్ట్ సిద్ధాంతాల స్థానాన్ని పెట్టుబడిదారీ వ్యవస్థపై ఆధారపడిన ఆశలు ఆక్రమించుకోవడం ద్వారా కలిగిన ఆధ్యాత్మిక వెలితిని నింపుకోవడానికి ప్రజలు ప్రయత్నిస్తారు. అలాంటి కారణాల గురించి తెలుసుకొని ఉండడం, ఒక క్రైస్తవుడు అర్థవంతమైన సంభాషణలు జరపడానికి సహాయం చేస్తుంది.—12/1, 3వ పేజీ.