కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా దినము కోసం సన్నద్ధులై ఉన్నట్లు నిరూపించుకోండి

యెహోవా దినము కోసం సన్నద్ధులై ఉన్నట్లు నిరూపించుకోండి

యెహోవా దినము కోసం సన్నద్ధులై ఉన్నట్లు నిరూపించుకోండి

“మీరు అనుకోని గడియలో మనుష్యకుమారుడు వస్తాడు కాబట్టి మీరు సన్నద్ధులై ఉన్నట్లు నిరూపించుకోండి.”​—⁠మత్తయి 24:​44, NW.

“యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము” యుద్ధం ఉగ్రతల దినము, బాధావేదనల దినము, దుఃఖం అంధకారాల దినమై ఉంటుంది. నోవహు కాలంలోని దుష్టలోకాన్ని జలప్రళయం ముంచేసినట్లుగానే యెహోవా యొక్క “భయంకరమైన ఆ మహాదినము” ఈ దుష్ట విధానంపైకి తప్పక వస్తుంది. అది రాక మానదు. అయినప్పటికీ “యెహోవా నామమునుబట్టి ఆయనకు ప్రార్థనచేయు వారందరును రక్షింపబడుదురు.” (యోవేలు 2:30-32; ఆమోసు 5:​18-20) దేవుడు తన శత్రువులను నాశనం చేసి తన ప్రజలను కాపాడతాడు. అత్యవసర భావంతో జెఫన్యా ప్రవక్త ఇలా ప్రకటిస్తున్నాడు: “యెహోవా మహా దినము సమీపమాయెను. యెహోవా దినము సమీపమై అతిశీఘ్రముగా వచ్చుచున్నది.” (జెఫన్యా 1:​14) అయితే ఈ దైవిక తీర్పు ఎప్పుడు అమలు చేయబడుతుంది?

2 “ఆ దినమును గూర్చియు ఆ గడియనుగూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు” అని యేసు అన్నాడు. (మత్తయి 24:​36) మనకు ఖచ్చితమైన సమయం తెలియదు కాబట్టి, “సదా అప్రమత్తంగా ఉండండి . . . సన్నద్ధులై ఉన్నట్లు నిరూపించుకోండి” అని చెబుతున్న మన 2004వ సంవత్సరపు వార్షిక వచనంలోని మాటలను మనం లక్ష్యపెట్టడం ఆవశ్యకం.​—⁠మత్తయి 24:​42, 44, NW.

3 సన్నద్ధులై ఉన్నవారు సురక్షితంగా సమకూర్చబడడం, ఇతరులు విడువబడడం ఎంత హఠాత్తుగా జరుగుతుందో సూచిస్తూ యేసు ఇలా అన్నాడు: “ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసికొనిపోబడును ఒకడు విడిచిపెట్టబడును; ఇద్దరు స్త్రీలు తిరుగలి విసరుచుందురు, ఒకతె తీసికొని పోబడును, ఒకతె విడిచిపెట్టబడును.” (మత్తయి 24:​40, 41) ఆ క్లిష్ట సమయంలో మన పరిస్థితి ఎలా ఉంటుంది? మనం సన్నద్ధులమై ఉంటామా లేక అనుకోకుండా దొరికిపోతామా? అది మనమిప్పుడు తీసుకునే చర్యలపైనే ఎంతో ఆధారపడి ఉంటుంది. యెహోవా దినము కోసం సన్నద్ధులమై ఉన్నట్లు నిరూపించుకోవడానికి నేడు ప్రబలమైవున్న నిర్దిష్ట దృక్పథాన్ని మనం విడనాడాలి, ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక స్థితిలో పడిపోకుండా మనల్ని మనం కాపాడుకోవాలి, కొన్ని రకాల జీవన విధానాలకు మనం దూరంగా ఉండాలి.

స్వయం-సంతృప్తి దృక్పథాన్ని విడనాడండి

4 నోవహు కాలాన్ని పరిశీలించండి. “విశ్వాసమునుబట్టి నోవహు అదివరకు చూడని సంగతులనుగూర్చి దేవునిచేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, తన యింటివారి రక్షణకొరకు ఒక ఓడను సిద్ధముచేసెను” అని బైబిలు చెబుతోంది. (హెబ్రీయులు 11:⁠7) ఓడ అసాధారణంగా, అందరికీ కనిపించేలా ఉంటుంది. అంతేగాక, నోవహు ‘నీతిని ప్రకటించాడు.’ (2 పేతురు 2:⁠5) నోవహు నిర్మాణ కార్యక్రమం గానీ ప్రకటనాపని గానీ ఆయన కాలంనాటి ప్రజలు చర్య తీసుకునేలా వారిని కదిలించలేదు. ఎందుకు? ఎందుకంటే వారు “తినుచు త్రాగుచు పెండ్లి చేసికొనుచు పెండ్లికిచ్చుచు” ఉన్నారు. నోవహు ఎవరికైతే ప్రకటించాడో వారు తమ వ్యక్తిగత వ్యవహారాల్లో, విలాసాల్లో ఎంతగా మునిగిపోయి ఉన్నారంటే వారు “జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపోవు వరకు ఎరుగక పోయిరి.”​—⁠మత్తయి 24:​38, 39.

5 లోతు కాలంలో కూడా అలాగే జరిగింది. లేఖనాలు మనకిలా చెబుతున్నాయి: “జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరిని నాశనము చేసెను.” (లూకా 17:​28, 29) రానున్న నాశనం గురించి దేవదూతలు లోతును హెచ్చరించిన తర్వాత, జరగబోయేదాని గురించి ఆయన తన అల్లుళ్లతో మాట్లాడాడు. అయితే ఆయన వారి దృష్టికి “ఎగతాళి చేయువానివలె నుండెను.”​—⁠ఆదికాండము 19:​14.

6 నోవహు లోతుల కాలం ఎలా ఉండేదో “మనుష్యకుమారుని రాకడ [“ప్రత్యక్షత,” NW]” కూడా అలాగే ఉంటుందని యేసు చెప్పాడు. (మత్తయి 24:39; లూకా 17:​30) వాస్తవానికి, నేడు అనేకులలో ప్రబలంగా ఉన్న దృక్పథం అలాంటి స్వయం-సంతృప్తి దృక్పథమే. అలాంటి దృక్కోణంచే ప్రభావితం కాకుండా మనం అప్రమత్తంగా ఉండాలి. మంచి ఆహారాన్ని, పానీయాలను మితంగా సేవించడంలో తప్పేమీ లేదు. అదేవిధంగా, వివాహం దేవుడు చేసిన ఏర్పాటు. అయితే, అలాంటి విషయాలు మన జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనవిగా తయారై, ఆధ్యాత్మిక ఆసక్తులు ప్రక్కకు నెట్టివేయబడితే, యెహోవా భయంకరమైన దినము కోసం మనం వ్యక్తిగతంగా సన్నద్ధులమై ఉన్నట్లేనా?

7 “కాలము సంకుచితమై యున్నది గనుక ఇకమీదట భార్యలు కలిగినవారు భార్యలు లేనట్టు . . . ఉండవలెను” అని అపొస్తలుడైన పౌలు చెప్పాడు. (1 కొరింథీయులు 7:​29-31) దేవుడిచ్చిన రాజ్యప్రకటనా పనిని ముగించడానికి మనకిక పరిమిత సమయం మాత్రమే ఉంది. (మత్తయి 24:​14) వివాహమైనవారు కూడా తమ భాగస్వాముల గురించి శ్రద్ధ తీసుకోవడంలో, రాజ్యాసక్తులు తమ జీవితాల్లో రెండవ స్థానానికి నెట్టివేయబడేంతగా నిమగ్నమై పోకూడదని పౌలు ఉపదేశిస్తున్నాడు. పౌలు సిఫారసు చేసిన మానసిక దృక్పథం స్వయం-సంతృప్తికి పూర్తి వ్యతిరేకమైనదని స్పష్టమవుతోంది. యేసు ఇలా అన్నాడు: “రాజ్యమును ఆయన [దేవుని] నీతిని మొదట వెదకుడి.” (మత్తయి 6:​33) ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు లేదా ఏదైనా పని చేపట్టే ముందు మనం వేసుకోవలసిన ప్రాముఖ్యమైన ప్రశ్నేమిటంటే, ‘నా జీవితంలో రాజ్యాసక్తులకు ప్రథమస్థానం ఇవ్వడాన్ని ఇదెలా ప్రభావితం చేస్తుంది?’

8 మనం ఇప్పటికే మన జీవితంలో ఆధ్యాత్మిక విషయాలకు స్థానమే లేనంతగా అనుదిన సాధారణ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నామని గ్రహిస్తే అప్పుడేమి చేయాలి? మన జీవిత విధానానికీ లేఖనాల గురించిన ఖచ్చితమైన జ్ఞానములేని, రాజ్య ప్రచారకులు కాని మన పొరుగువారి జీవిత విధానానికీ పెద్దగా తేడా లేదా? పరిస్థితి అలావుంటే, మనం ఆ విషయం గురించి ప్రార్థించాలి. మనం సరైన మానసిక వైఖరి కలిగివుండడానికి యెహోవా మనకు సహాయం చేయగలడు. (రోమీయులు 15:5; ఫిలిప్పీయులు 3:​15) రాజ్యాసక్తులను ప్రథమస్థానంలో ఉంచుకోవడానికి, సరైనది చేయడానికి, ఆయనపట్ల మన బాధ్యతను నెరవేర్చడానికి ఆయన మనకు సహాయం చేయగలడు.​—⁠రోమీయులు 12:2; 2 కొరింథీయులు 13:⁠7.

ఆధ్యాత్మిక నిద్రమత్తులో పడిపోకుండా మనల్ని మనం కాపాడుకోవాలి

9 త్వరలో అర్మగిద్దోనులో, “సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధము” గురించి మాట్లాడుతున్న ప్రవచనమే, కొంతమంది మెలకువగా ఉండకపోవచ్చునని హెచ్చరిస్తోంది. “ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను; తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిసమొలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు” అని ప్రభువైన యేసుక్రీస్తు చెబుతున్నాడు. (ప్రకటన 16:​14-16) ఇక్కడ ప్రస్తావించబడిన వస్త్రము, మనల్ని క్రైస్తవ యెహోవాసాక్షులుగా గుర్తించే దాన్ని సూచిస్తుంది. దీనిలో రాజ్యప్రచారకులముగా మన పని, మన క్రైస్తవ ప్రవర్తన ఇమిడివున్నాయి. మనం నిద్రావస్థవంటి అచేతన స్థితిలోకి జారిపోతే, మనం మన క్రైస్తవ గుర్తింపును కోల్పోవచ్చు. అది అవమానకరమైనది, ప్రమాదకరమైనది. మనం ఆధ్యాత్మిక నిద్రమత్తులోకి, జడత్వంలోకి జారిపడిపోకుండా కాపాడుకోవాలి. అలాంటి దృక్పథాన్ని మనమెలా అధిగమించవచ్చు?

10 మెలకువగా ఉండి మత్తులము కాకుండా ఉండవలసిన అవసరం గురించి బైబిలు పదే పదే నొక్కిచెబుతోంది. ఉదాహరణకు, సువార్త వృత్తాంతాలు మనకిలా గుర్తుచేస్తున్నాయి: “సదా అప్రమత్తంగా ఉండండి” (మత్తయి 24:​42, NW; 25:13; మార్కు 13:​35, 37); “సన్నద్ధులై ఉన్నట్లు నిరూపించుకోండి” (మత్తయి 24:​44, NW); ‘జాగ్రత్తపడండి; మెలకువగా ఉండండి’ (మార్కు 13:33); ‘సిద్ధంగా ఉండండి’ (లూకా 12:40). అపొస్తలుడైన పౌలు, యెహోవా దినము ఈ లోకముపైకి ఊహించని రీతిగా వస్తుందని చెప్పిన తర్వాత తన తోటి విశ్వాసులకు ఇలా ఉద్బోధిస్తున్నాడు: “ఇతరులవలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులముకాక యుందము.” (1 థెస్సలొనీకయులు 5:⁠6) బైబిలులోని చివరి పుస్తకంలో, మహిమపరచబడిన యేసుక్రీస్తు “నేను త్వరగా వచ్చుచున్నాను” అని చెబుతూ తాను హఠాత్తుగా రావడం గురించి నొక్కిచెబుతున్నాడు. (ప్రకటన 3:11; 22:​7, 12, 20) యెహోవా తీర్పు యొక్క మహా దినము గురించి హెబ్రీ ప్రవక్తలు చాలామంది కూడా వర్ణించారు, హెచ్చరించారు. (యెషయా 2:12, 17; యిర్మీయా 30:7; యోవేలు 2:11; జెఫన్యా 3:⁠8) దేవుని వాక్యమైన బైబిలును రోజు చదవడం, చదివినదాని గురించి ఆలోచించడం మనం ఆధ్యాత్మికంగా అప్రమత్తంగా ఉండడానికి ఎంతగానో సహాయపడతాయి.

11 “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” అందజేస్తున్న బైబిలు ఆధారిత ప్రచురణలను ఉపయోగిస్తూ లేఖనాలను శ్రద్ధతో వ్యక్తిగతంగా అధ్యయనం చేయడం మనం ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండడానికి ఎంత చక్కని ప్రేరకమో కదా! (మత్తయి 24:​45-47) అయితే వ్యక్తిగత అధ్యయనం ప్రయోజనకరంగా ఉండాలంటే, అది అభివృద్ధిదాయకంగా, సంగతంగా ఉండాలి. (హెబ్రీయులు 5:14-6:⁠3) మనం బలమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని క్రమంగా తీసుకోవాలి. ఈ రోజుల్లో దాని కోసం సమయాన్ని సంపాదించుకోవడం ఒక సవాలుగా ఉండవచ్చు. (ఎఫెసీయులు 5:​15, 16) అయినా, బైబిలును లేఖనాధారిత ప్రచురణలను వీలైనప్పుడు మాత్రమే చదివితే సరిపోదు. మనం ‘విశ్వాసవిషయమున స్వస్థులమై’ మెలకువగా ఉండడానికి క్రమమైన వ్యక్తిగత అధ్యయనం ఆవశ్యకం.​—⁠తీతు 1:​13.

12 ఆధ్యాత్మిక నిద్రమత్తుతో పోరాడడానికి క్రైస్తవ కూటాలు, సమావేశాలు కూడా మనకు సహాయం చేస్తాయి. ఎలా? మనం అందుకునే ఉపదేశం ద్వారా. ఈ సమావేశాల వద్ద, యెహోవా దినం ఎంత సమీపంలో ఉందో మనకు క్రమంగా గుర్తుచేయబడడం లేదా? వారం వారం జరిగే క్రైస్తవ కూటాలు, ‘ప్రేమచూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరినొకరు పురికొల్పుకోవడానికి’ కూడా చక్కని అవకాశాలనిస్తాయి. అలాంటి పురికొల్పు లేదా ప్రేరణ ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండేందుకు సహాయపడతాయి. ‘ఆ దినము సమీపించుట చూచిన కొలది’ క్రమంగా సమకూడమని మనకు ఆజ్ఞాపించబడడంలో ఆశ్చర్యమేమీలేదు.​—⁠హెబ్రీయులు 10:​24, 25.

13 మనం క్రైస్తవ పరిచర్యలో హృదయపూర్వకంగా పాల్గొన్నప్పుడు కూడా మనం మెలకువగా ఉండడానికి మనకు సహాయం లభిస్తుంది. కాలాలకు సంబంధించిన సూచనలను, వాటి భావాన్ని మనస్సులో ఉంచుకోవడానికి వాటి గురించి ఇతరులతో మాట్లాడడం కన్నా శ్రేష్ఠమైన మార్గం ఏముంది? మనం బైబిలు అధ్యయనం చేసేవారు అభివృద్ధి సాధించడం, తాము నేర్చుకుంటున్నవాటి ప్రకారం నడుచుకోవడం చూసినప్పుడు మన అత్యవసర భావం కూడా అధికమవుతుంది. “మీ మనస్సు అను నడుముకట్టుకొని నిబ్బరమైన బుద్ధిగలవారై” ఉండుడని అపొస్తలుడైన పేతురు చెప్పాడు. (1 పేతురు 1:​13) ‘ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికీ ఆసక్తులై’ ఉండడం, ఆధ్యాత్మిక నిద్రమత్తుకు చక్కని ఔషధం.​—⁠1 కొరింథీయులు 15:58.

ఆధ్యాత్మికంగా హానికరమైన జీవన విధానాలకు దూరంగా ఉండండి

14 యేసు తన ప్రత్యక్షతను గురించి చెప్పిన గొప్ప ప్రవచనంలో మరో హెచ్చరికను ఇచ్చాడు. ఆయనిలా అన్నాడు: “మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమియందంతట నివసించు వారందరిమీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించుకొని, మనుష్యకుమారుని యెదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడును ప్రార్థనచేయుచు మెలకువగా ఉండుడి.” (లూకా 21:​34-36) ప్రజలు సాధారణంగా అనుసరించే జీవన విధానాలను యేసు ఖచ్చితంగా వర్ణించాడు: అతిగా తినడం, త్రాగుబోతుతనం, చింతలు కలిగించే జీవన విధానం.

15 అతిగా తినడం, అతిగా త్రాగడం బైబిలు సూత్రాలకు అనుగుణమైనవికావు, వాటిని మానుకోవాలి. “ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైను సహవాసము చేయకుము” అని బైబిలు చెబుతోంది. (సామెతలు 23:​20) అయితే ఒకరు తమ ఆధ్యాత్మికతను ప్రమాదంలో పడవేసుకోవడానికి అతిగా తినే, అతిగా త్రాగే స్థితికి చేరుకోనవసరం లేదు. ఆ స్థితికి చేరుకోకముందే అవి ఒక వ్యక్తిని స్తబ్ధుగా, సోమరిగా చేయగలవు. “సోమరి ఆశపడును గాని వాని ప్రాణమున కేమియు దొరకదు” అని ఒక బైబిలు సామెత చెబుతోంది. (సామెతలు 13:⁠4) అలాంటి వ్యక్తి దేవుని చిత్తం చేయాలని కోరుకోవచ్చు గానీ అలక్ష్యం మూలంగా అతని ఆశ నెరవేరదు.

16 యేసు హెచ్చరించిన జీవిత చింతలేమిటి? వాటిలో వ్యక్తిగత విషయాలు, కుటుంబ పోషణ వంటివి ఉన్నాయి. అవి మనల్ని కృంగదీయడానికి అనుమతించడం ఎంత అవివేకం! యేసు ఇలా ప్రశ్నించాడు: “మీలో నెవడు చింతించుటవలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు?” ఆయన తన శ్రోతలకిలా ఉపదేశించాడు: “ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును.” మన జీవితాల్లో రాజ్యాసక్తులకు ప్రథమస్థానం ఇవ్వడం, మన అవసరాలను యెహోవా తీరుస్తాడనే నమ్మకం కలిగివుండడం చింతలను వాటి స్థానంలో ఉంచి మనం మెలకువగా ఉండడానికి సహాయం చేస్తాయి.​—⁠మత్తయి 6:​25-34.

17 వస్తుపరమైన ప్రయాసలవల్ల కూడా చింత కలుగవచ్చు. ఉదాహరణకు, కొంతమంది తమ తాహతుకు మించిన వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా తమ జీవితాలను చిక్కులమయం చేసుకుంటారు. మరికొందరు స్వల్పకాలంలో అధిక ధనం సంపాదించుకునే పథకాలు, ప్రమాదకరమైన ఆర్థిక పెట్టుబడులు వంటి ప్రలోభాలలో పడ్డారు. ఇంకా కొందరికి ఆర్థిక సాఫల్యం సాధించడానికి లౌకిక విద్యను ఒక మార్గంగా ఉపయోగించడం ఉరిగా తయారవుతుంది. నిజమే ఏదైనా ఉద్యోగం సంపాదించుకోవడానికి కొంతస్థాయి వరకు విద్య ప్రయోజనకరమైనదే. అయితే, ఉన్నత విద్య సంపాదించుకోవాలనే సమయాన్ని మింగేసే ప్రయాసతో కొందరు ఆధ్యాత్మికంగా తమకు హాని చేసుకున్నారన్నది వాస్తవం. యెహోవా దినము సమీపిస్తుండగా అలాంటి స్థితిలో ఉండడం ఎంత ప్రమాదకరమైనదో కదా! “ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు, అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును” అని బైబిలు హెచ్చరిస్తోంది.​—⁠1 తిమోతి 6:⁠9.

18 వస్తుపరమైన జీవన విధానంలోకి ఆకర్షించబడకుండా ఉండేందుకు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు తప్పేదో ఒప్పేదో గ్రహించగల సామర్థ్యం ఎంతో అవసరం. ఈ సామర్థ్యాన్ని, ‘వయస్సు వచ్చినవారు తీసుకోవలసిన బలమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని’ క్రమంగా తీసుకోవడం ద్వారా, ‘అభ్యాసము చేత మన జ్ఞానేంద్రియములను సాధకము చేసుకోవడం’ ద్వారా వృద్ధి చేసుకోవచ్చు. (హెబ్రీయులు 5:​13, 14) ఏవి ప్రాముఖ్యమైనవనేది నిర్ణయించుకునేటప్పుడు “శ్రేష్ఠమైన కార్యములను” వివేచించడం కూడా తప్పు ఎంపికలు చేసుకోకుండా మనల్ని కాపాడగలదు.​—⁠ఫిలిప్పీయులు 1:​9, 10.

19 వస్తుపరమైన జీవన విధానం మనల్ని అంధులను చేసి, ఆధ్యాత్మిక కార్యకలాపాలకు తగినంత సమయం లేకుండా లేదా అసలే సమయం లేకుండా చేస్తుంది. మనల్ని మనం ఎలా పరీక్షించుకోవచ్చు, అలాంటి జీవన విధానంలో చిక్కుకుపోకుండా ఎలా తప్పించుకోవచ్చు? మనం మన జీవితాన్ని ఎలా సరళం చేసుకోవచ్చో, ఎంత మేరకు సరళం చేసుకోవచ్చో ప్రార్థనాపూర్వకంగా పరిశీలించుకోవాలి. ప్రాచీన ఇశ్రాయేలుకు చెందిన సొలొమోను రాజు ఇలా అన్నాడు: “కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు; అయితే ఐశ్వర్యవంతులకు తమ ధనసమృద్ధిచేత నిద్రపట్టదు.” (ప్రసంగి 5:​12) అనవసరమైన వస్తుసంపదల గురించి శ్రద్ధ తీసుకోవడం మన సమయాన్ని శక్తిని ఎక్కువగా హరించివేస్తోందా? మన దగ్గర ఎంత ఎక్కువగా ఉంటే అంతగా వాటిని కాపాడుకోవాలి, సంరక్షించుకోవాలి, భద్రపరచుకోవాలి. కొన్ని వస్తువులను వదిలించుకోవడం ద్వారా మన జీవితాలను సరళం చేసుకోవడం మనకు ప్రయోజనం చేకూర్చగలదా?

నిశ్చయంగా, సన్నద్ధులై ఉన్నట్లు నిరూపించుకోండి

20 నోవహు కాలం ముగింపుకు వచ్చింది, ప్రస్తుత విధానం కూడా ముగుస్తుంది. అపొస్తలుడైన పేతురు మనకిలా హామీ ఇస్తున్నాడు: “ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును.” సూచనార్థక ఆకాశములు అంటే దుష్ట ప్రభుత్వాలుగానీ, సూచనార్థక భూమి అంటే దేవుని నుండి దూరమైపోయిన మానవజాతిగానీ దేవుని ఉగ్రత అనే తీవ్రతను తప్పించుకోలేవు. ఆ దినం కోసం మనం సన్నద్ధులమై ఉన్నట్లు ఎలా నిరూపించుకోవచ్చో సూచిస్తూ పేతురు ఇలా అన్నాడు: “ఇవన్నియు ఇట్లు లయమైపోవునవి గనుక, . . . దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.”​—⁠2 పేతురు 3:10-12.

21 మనం క్రైస్తవ కూటాలకు క్రమంగా హాజరు కావడం, సువార్త ప్రకటనలో భాగం వహించడం పరిశుద్ధమైన ప్రవర్తనలోనూ భక్తిలోనూ భాగమైవున్నాయి. యెహోవా మహా దినము కోసం మనం ఓర్పుతో ఎదురుచూస్తూ దేవునిపట్ల హృదయపూర్వక భక్తితో వాటిని నిర్వర్తించుదాము. ‘[దేవుని] దృష్టికి నిష్కళంకులముగాను నిందారహితులముగాను కనబడునట్లు జాగ్రత్త పడదాము.’​—⁠2 పేతురు 3:​14.

మీకు గుర్తున్నాయా?

• యెహోవా దినము కోసం మనం సన్నద్ధులమై ఉన్నట్లు ఎందుకు నిరూపించుకోవాలి?

• జీవితంలోని సాధారణ కార్యకలాపాలు మన జీవితంలో ప్రధాన విషయాలుగా మారితే మనమేమి చేయాలి?

• ఆధ్యాత్మిక నిద్రమత్తులోకి జారుకోకుండా ఉండేందుకు మనకేమి సహాయం చేస్తుంది?

• హానికరమైన ఎలాంటి జీవన విధానాలను మనం మానుకోవాలి, ఎలా?

[అధ్యయన ప్రశ్నలు]

1. యెహోవా దినమునకు మనమెందుకు అవధానమివ్వాలి?

2, 3. యెహోవా దినము కోసం మనల్ని మనం సిద్ధం చేసుకోవడం ఎందుకు ఆవశ్యకం?

4. నోవహు కాలంనాటి ప్రజలకు ఎలాంటి దృక్పథం ఉండేది?

5. లోతు కాలంలో సొదొమ నివాసుల దృక్కోణం ఎలా ఉంది?

6. మనం ఎలాంటి దృక్పథం నివారించాలి?

7. ఏదైనా పని చేపట్టే ముందు మనం ఏ ప్రాముఖ్యమైన ప్రశ్న వేసుకోవాలి, ఎందుకు?

8. జీవితంలోని అనుదిన కార్యకలాపాల్లోనే మనం పూర్తిగా మునిగిపోయివుంటే మనమేమి చేయాలి?

9. ప్రకటన 16:14-16 వచనాల ప్రకారం, ఆధ్యాత్మిక నిద్రమత్తులోకి జారకుండా ఉండడం ఎందుకు ప్రాముఖ్యం?

10. ఆధ్యాత్మికంగా అప్రమత్తంగా ఉండడానికి ప్రతీరోజు బైబిలు చదవడం ఎందుకు సహాయం చేస్తుంది?

11. ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండడానికి వ్యక్తిగత బైబిలు అధ్యయనం ఎందుకు ఆవశ్యకం?

12. ఆధ్యాత్మిక నిద్రమత్తుతో పోరాడడానికి క్రైస్తవ కూటాలు, సమావేశాలు మనకెలా సహాయం చేస్తాయి?

13. మనం ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండడానికి క్రైస్తవ పరిచర్య ఎలా సహాయం చేస్తుంది?

14. లూకా 21:34-36 వచనాల్లో వర్ణించబడినట్లు, యేసు ఎలాంటి జీవన విధానాల గురించి హెచ్చరించాడు?

15. మనం అతిగా తినడం, అతిగా త్రాగడం ఎందుకు మానుకోవాలి?

16. మన కుటుంబం గురించిన చింతలతో కృంగిపోవడాన్ని మనమెలా నివారించవచ్చు?

17. వస్తుపరమైన ప్రయాసలు చింతను ఎలా కలిగించగలవు?

18. వస్తుపరమైన జీవన విధానంలోకి ఆకర్షించబడకుండా ఉండేందుకు, మనం ఏ సామర్థ్యాన్ని వృద్ధి చేసుకోవాలి?

19. మనకు ఆధ్యాత్మిక కార్యకలాపాలకు చాలా తక్కువ సమయం ఉందని గ్రహిస్తే మనమేమి చేయాలి?

20, 21. (ఎ) యెహోవా దినము గురించి అపొస్తలుడైన పేతురు ఏ హామీ ఇచ్చాడు? (బి) మనం యెహోవా దినము కోసం సన్నద్ధులమై ఉన్నట్లు నిరూపించుకోవడానికి ఏ కార్యాలను, చర్యలను చేయడంలో కొనసాగాలి?

[20, 21వ పేజీలోని చిత్రాలు]

నోవహు కాలంనాటి ప్రజలు రానున్న తీర్పును ఏమాత్రం పట్టించుకోలేదు —⁠మరి మీరు?

[23వ పేజీలోని చిత్రం]

ఆధ్యాత్మిక కార్యకలాపాలకు ఎక్కువ సమయం వెచ్చించగలిగేలా మీరు మీ జీవితాన్ని సరళం చేసుకోగలరా?