కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆదికాండములోని ముఖ్యాంశాలు—I

ఆదికాండములోని ముఖ్యాంశాలు—I

యెహోవా వాక్యము సజీవమైనది

ఆదికాండములోని ముఖ్యాంశాలు​—⁠I

“ఆది” అంటే “ఆరంభం” లేదా “ప్రభవం.” ఈ విశ్వం ఎలా ఉనికిలోకి వచ్చింది, మానవులు నివసించడానికి భూమి ఎలా సిద్ధం చేయబడింది, భూమిపైకి మానవుడు ఎలా వచ్చాడు అనే విషయాలను తెలియజేసే పుస్తకానికి ఆదికాండము అనే పేరు యుక్తమైనదే. మోషే ఆ పుస్తకాన్ని సీనాయి అరణ్యంలో వ్రాశాడు, బహుశా ఆయన దాన్ని సా.శ.పూ. 1513లో పూర్తి చేశాడు.

జలప్రళయానికి ముందున్న లోకం గురించి, జలప్రళయం తర్వాతి శకం ప్రారంభమైనప్పుడు జరిగిన విషయాల గురించి, యెహోవా దేవుడు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపులతో వ్యవహరించిన విధానం గురించి ఆదికాండము మనకు చెబుతోంది. ఆదికాండము 1:​1–11:9 వచనాల్లోని ముఖ్యాంశాలను అంటే ప్రాముఖ్యంగా, పితరుడైన అబ్రాహాముతో యెహోవా వ్యవహరించడం ప్రారంభించిన కాలం వరకు జరిగిన సంఘటనలను ఈ ఆర్టికల్‌ పరిశీలిస్తుంది.

జలప్రళయానికి ముందున్న లోకం

(ఆదికాండము 1:1-7:24)

ఆదికాండములోని ప్రారంభపు మాటలు అంటే “ఆదియందు” అనే మాటలు కోటానుకోట్ల సంవత్సరాల పూర్వం సంగతిని తెలియజేస్తున్నాయి. ఆరు సృష్టి “దినములు” అంటే ప్రత్యేకమైన సృష్టికార్యాల కోసం కేటాయించబడిన కాలాలు, ఆ సమయంలో ఒకవేళ మానవుడు భూమిపై ఉండివుంటే ఆయనకు అవి ఎలా కనిపించేవో అదే విధంగా వర్ణించబడ్డాయి. ఆరవ దినం ముగిసేసరికి దేవుడు మానవుణ్ణి సృష్టించాడు. ఆ తర్వాత కొంతకాలానికే మానవుడు తన అవిధేయత మూలంగా పరదైసును కోల్పోయినప్పటికీ యెహోవా నిరీక్షణ ఇస్తున్నాడు. బైబిలులోని మొట్టమొదటి ప్రవచనం, పాపపు ప్రభావాలను తొలగించి సాతాను తలను చితకగొట్టే ఒక “సంతానము” గురించి చెబుతోంది.

ఆ తర్వాతి 16 శతాబ్దాల కాలంలో, కొంతమంది విశ్వసనీయులైన మానవులు అంటే హేబెలు, హనోకు, నోవహు వంటివారిని తప్ప మిగతా మానవులందరిని దేవుని నుండి వేరు చేయడంలో సాతాను విజయం సాధించాడు. ఉదాహరణకు కయీను, నీతిమంతుడైన తన తమ్ముడు హేబెలును హత్య చేశాడు. ఆ తర్వాత “యెహోవా నామమున ప్రార్థన చేయుట” అంటే భక్తిలేకుండా యెహోవా నామాన్ని ఉపయోగించడం ప్రారంభమైంది. ఆ కాలంలోని దౌర్జన్యపూరితమైన స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ, లెమెకు తన ఆత్మరక్షణ కోసం తాను ఒక యువకుడిని ఎలా హత్య చేశాడో చెబుతూ ఒక కవిత వ్రాశాడు. దేవుని కుమారులైన అవిధేయ దేవదూతలు, స్త్రీలను వివాహం చేసుకొని నెఫీలులు అనబడే దౌర్జన్యపూరితులైన మహాకాయులను ఉత్పత్తి చేయడంతో పరిస్థితులు మరింత క్షీణించిపోయాయి. అయినప్పటికీ, విశ్వసనీయుడైన నోవహు ఓడను నిర్మించి, రాబోయే జలప్రళయం గురించి ధైర్యంగా ఇతరులకు హెచ్చరించి, ఆ జలప్రళయపు వినాశనం నుండి తన కుటుంబంతోపాటు తప్పించుకున్నాడు.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

1:​16​—⁠నాలుగవ దినము వరకూ జ్యోతులు చేయబడనప్పుడు, దేవుడు మొదటి రోజునే వెలుగును ఎలా రప్పించగలిగాడు? 16వ వచనంలో “చేసెను” అని అనువదించబడిన హీబ్రూ పదం, ఆదికాండము 1వ అధ్యాయం 1, 21, 27 వచనాల్లో “సృజించెను” అని అనువదించబడిన పదం ఒకటి కాదు. ‘ఆకాశములు,’ వాటిలోని జ్యోతులు మొదటి ‘దినము’ ప్రారంభంకాకముందే ఎంతో కాలం పూర్వమే సృష్టించబడ్డాయి. కానీ వాటి వెలుగు ఇంకా భూమికి చేరలేదు. మొదటి దినమున ‘వెలుగు కలిగింది’ ఎందుకంటే ప్రసరింపజేయబడిన కాంతి మబ్బు తెరలను ఛేదించుకొని భూమిపై కనిపించింది. పరిభ్రమించే భూమిపై అలా పగలు, రాత్రి కలగడం ప్రారంభమైంది. (ఆదికాండము 1:​1-3, 5) ఆ వెలుగు ఉత్పత్తి చేసే జ్యోతులు అప్పటికింకా అదృశ్యంగానే ఉన్నాయి. అయితే నాలుగవ సృష్టి కాలంలో ఒక గమనార్హమైన మార్పు వచ్చింది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు ‘భూమ్మీద వెలుగు’ ప్రసరించేలా ఏర్పాటు చేయబడ్డాయి. (ఆదికాండము 1:​17) ఆ విధంగా ఆ జ్యోతులను భూమిపైనుండి చూడడానికి వీలుగా దేవుడు ‘వాటిని చేశాడు.’

3:​8​—⁠యెహోవా దేవుడు ఆదాముతో నేరుగా మాట్లాడాడా? దేవుడు మానవులతో మాట్లాడినప్పుడు తరచూ ఒక దేవదూత ద్వారా మాట్లాడేవాడని బైబిలు వెల్లడి చేస్తోంది. (ఆదికాండము 16:7-11; 18:1-3, 22-26; 19:1; న్యాయాధిపతులు 2:1-4; 6:11-16, 22; 13:​15-22) “వాక్యము” అని పిలువబడే ఆయన అద్వితీయ కుమారుడే దేవుని ప్రధాన వాగ్దూత. (యోహాను 1:⁠1) కాబట్టి దేవుడు ఆదాము హవ్వలతో ఆ “వాక్యము” ద్వారానే మాట్లాడివుండవచ్చు.​—⁠ఆదికాండము 1:26-28; 2:16; 3:8-13.

3:​17​—⁠ఏ విధంగా నేల శపించబడింది, ఎంత కాలం అలా ఉంది? నేల శపించబడడం అనేది, దాన్ని సేద్యపరచడం చాలా కష్టమవుతుందనే భావాన్నిచ్చింది. ముండ్ల తుప్పలను, గచ్చపొదలను మొలిపించిన ఆ శపించబడిన నేల ప్రభావాలను ఆదాము వారసులు ఎంతగా అనుభవించారంటే, నోవహు తండ్రి లెమెకు “భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము” గురించి మాట్లాడాడు. (ఆదికాండము 5:​29) జలప్రళయం తర్వాత, యెహోవా నోవహును ఆయన కుమారులను ఆశీర్వదించి, వాళ్ళు భూమిని నింపాలనేది తన సంకల్పమని తెలియజేశాడు. (ఆదికాండము 9:⁠1) అప్పుడు నేలపైనుండి దేవుని శాపం తొలగించబడి ఉంటుంది.​—⁠ఆదికాండము 13:10.

4:​15​—⁠యెహోవా కయీనుకు ఎలా ‘గురుతు వేశాడు?’ కయీను శరీరంపై ఒక గురుతు వేయబడిందని బైబిలు చెప్పడం లేదు. ఆ గురుతు, ఇతరులు కయీనుపై పగబట్టి ఆయనను చంపకుండా ఉండేందుకు వాళ్ళు తెలుసుకొని పాటించవలసిన ఒక ఖండితమైన శాసనం అయివుండవచ్చు.

4:​17​—⁠కయీనుకు భార్య ఎక్కడ లభించింది? ఆదాము ‘కుమారులను కుమార్తెలను కన్నాడు.’ (ఆదికాండము 5:⁠4) కాబట్టి కయీను తన చెల్లెళ్ళలో ఒకరిని లేదా తన సోదరి లేదా సోదరుడి కూతురినో భార్యగా చేసికొన్నాడు. ఆ తర్వాత, దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రం క్రింద స్వంత అక్కచెల్లెళ్ళను లేదా అన్నదమ్ములను వివాహం చేసుకోవడం అనుమతించబడలేదు.​—⁠లేవీయకాండము 18:⁠9.

5:​24​—⁠దేవుడు ఏ విధంగా ‘హనోకును తీసికొనిపోయాడు?’ హనోకు చంపబడే ప్రమాదం ఉందని స్పష్టమవుతోంది, అయితే హనోకు తన శత్రువుల చేతుల్లో బాధ అనుభవించడానికి దేవుడు అనుమతించలేదు. “హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (హెబ్రీయులు 11:⁠5) అయితే దానర్థం, హనోకు పరలోకంలో జీవించడానికి దేవుడు ఆయనను అక్కడకు తీసుకువెళ్ళాడని కాదు. పరలోకానికి వెళ్ళినవారిలో యేసు మొదటివాడు. (యోహాను 3:13; హెబ్రీయులు 6:​19, 20) హనోకు ‘మరణము చూడకుండునట్లు కొనిపోబడడం’ అంటే దేవుడు ఆయనను ప్రవచనాత్మక అపస్మారానికి గురిచేసి ఆయన ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆయన జీవితం ముగించాడని సూచించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో హనోకు తన శత్రువుల చేతుల్లో బాధ అనుభవించలేదు లేదా ‘మరణం చూడలేదు.’

6:​6​—⁠యెహోవా మానవుణ్ణి చేసినందుకు ఏ భావంలో ‘సంతాపము నొందాడు’ అని చెప్పవచ్చు? ఇక్కడ ‘సంతాపము నొందాడు’ అని అనువదించబడిన హీబ్రూ పదం, దృక్పథంలో లేదా ఉద్దేశంలో వచ్చిన మార్పుకు సంబంధించినది. యెహోవా పరిపూర్ణుడు కాబట్టి ఆయన మానవుణ్ణి సృష్టించడంలో తప్పు చేయలేదు. అయితే, జలప్రళయానికి ముందున్న దుష్ట తరం విషయంలో ఆయన దృక్పథం మారింది. దేవుడు తన దృక్పథాన్ని, మానవుల సృష్టికర్తకుండే దృక్పథం నుండి వాళ్ళ దుష్టత్వాన్ని బట్టి అసంతృప్తి చెంది వాళ్ళను అంతమొందించే వ్యక్తి దృక్పథంగా మారింది. ఆయన కొంతమందిని రక్షించాడు అనే వాస్తవం, ఆయన కేవలం దుష్ట ప్రజల విషయంలోనే సంతాపము నొందాడని చూపిస్తోంది.​—⁠2 పేతురు 2:5, 9.

7:​2​—⁠పవిత్ర జంతువులకి, అపవిత్ర జంతువులకు మధ్య తేడా చూపించడానికి ఏది ఆధారంగా ఉపయోగించబడేది? ఈ వ్యత్యాసం ఏ జంతువులను ఆరాధనలో బలులుగా ఉపయోగించవచ్చు అనే విషయానికి సంబంధించినది కానీ ఏ జంతువులను తినవచ్చు, వేటిని తినకూడదు అనే విషయానికి సంబంధించినది కాదు. జలప్రళయానికి ముందు జంతువుల మాంసం మానవుల ఆహారంలో భాగంగా ఉండేది కాదు. ఆహారం విషయంలో “పవిత్రమైనది” “అపవిత్రమైనది” అనే పేర్లు మోషే ధర్మశాస్త్రంతోనే ప్రారంభమయ్యాయి, ఆ ధర్మశాస్త్రం రద్దుచేయబడినప్పుడు అవి కూడా అంతమయ్యాయి. (అపొస్తలుల కార్యములు 10:9-16; ఎఫెసీయులు 2:​15) యెహోవా ఆరాధనలో ఉపయోగించడానికి ఏ జంతువులు యోగ్యమైనవో నోవహుకు తప్పక తెలిసివుండవచ్చు. ఆయన ఓడనుండి బయటకు వచ్చిన వెంటనే “యెహోవాకు బలిపీఠము కట్టి, పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసికొని ఆ పీఠముమీద దహనబలి అర్పిం[చాడు].”​—⁠ఆదికాండము 8:20.

7:​11​—⁠భూవ్యాప్తంగా జలప్రళయం రావడానికి కారణమయిన నీరు ఎక్కడి నుండి వచ్చింది? రెండవ సృష్టి కాలంలో లేదా “దినము”న భూమియొక్క వాతావరణపు విశాలము కలిగినప్పుడు “విశాలము క్రింద” మరియు “విశాలము మీద” జలములు ఉండేవి. (ఆదికాండము 1:​6, 7) “క్రింది” జలములు, అప్పటికే భూమిపై ఉన్న జలములు. “మీది” జలములు, భూమికి ఎంతో ఎత్తున భారీ మొత్తాల్లో తేమగా తేలియాడే “మహాగాధజలముల ఊటలు”గా రూపొందాయి. ఆ జలములు నోవహు కాలంలో భూమిపై పడ్డాయి.

మనకు పాఠాలు:

1:​26.మానవులు దేవుని స్వరూపములో చేయబడ్డారు కాబట్టి వాళ్ళకు దైవిక లక్షణాలను ప్రతిబింబించే సామర్థ్యం ఉంది. మనలను చేసిన దేవుణ్ణి ప్రతిబింబిస్తూ మనం ప్రేమ, కృప, దయ, మంచితనం, సహనం వంటి లక్షణాలను పెంపొందించుకోవడానికి తప్పకుండా ప్రయత్నించాలి.

2:​22-24.వివాహం దేవుని ఏర్పాటు. వివాహ బంధం శాశ్వతమైనది, పవిత్రమైనది, భర్త కుటుంబానికి శిరస్సు.

3:​1-5, 16-​23.మనం మన వ్యక్తిగత జీవితంలో యెహోవా సర్వాధిపత్యాన్ని గుర్తించడంపైనే మన సంతోషం ఆధారపడివుంది.

3:​18, 19; 5:⁠5; 6:⁠7; 7:​23.యెహోవా వాక్కు ఎల్లప్పుడూ నిజమౌతుంది.

4:​3-7.హేబెలు విశ్వాసంగల నీతిమంతుడు కాబట్టి ఆయన అర్పించిన బలినిబట్టి యెహోవా సంతోషించాడు. (హెబ్రీయులు 11:⁠4) మరోవైపున, కయీనుకు విశ్వాసం లేదని అతని క్రియలు సూచించాయి. అతని క్రియలు దుష్టమైనవి, అసూయతో, ద్వేషంతో, నరహత్యతో నిండినవి. (1 యోహాను 3:​12) అంతేకాక అతను తన అర్పణ గురించి పైపైన మాత్రమే ఆలోచించి కేవలం మొక్కుబడిగా దానిని అర్పించాడు. మనం యెహోవాకు అర్పించే స్తుతియాగాలు హృదయపూర్వకమైనవిగా, సరైన వైఖరితో, సరైన ప్రవర్తనతో జతచేయబడినవిగా ఉండవద్దా?

6:⁠22.ఓడ నిర్మించడానికి ఎన్నో సంవత్సరాలు పట్టినప్పటికీ నోవహు దేవుడు ఆజ్ఞాపించినట్లే చేశాడు. కాబట్టి నోవహు ఆయన కుటుంబం జలప్రళయం నుండి రక్షించబడ్డారు. యెహోవా తన లిఖిత వాక్యం ద్వారా మనతో మాట్లాడి, తన సంస్థ ద్వారా మనకు మార్గనిర్దేశం ఇస్తాడు. యెహోవా చెప్పినది విని, దానికి విధేయత చూపించడం మనకు ప్రయోజనం చేకూరుస్తుంది.

7:​21-24.యెహోవా దుష్టులతోపాటు నీతిమంతులను నాశనం చేయడు.

మానవజాతి ఒక కొత్త శకంలోకి ప్రవేశించింది

(ఆదికాండము 8:​1–11:9)

జలప్రళయానికి ముందున్న లోకం గతించిపోవడంతో, మానవజాతి ఒక కొత్త శకంలోకి ప్రవేశించింది. మానవులకు మాంసం తినేందుకు అనుమతి ఇవ్వబడింది. అయితే రక్తం విసర్జించాలని వాళ్ళకు ఆజ్ఞాపించబడింది. యెహోవా, నరహంతకులకు మరణ శిక్ష విధించడాన్ని ఆమోదించి, మరెన్నటికీ జలప్రళయం తీసుకురానని వాగ్దానం చేస్తూ వర్షధనుస్సుతో నిబంధన చేశాడు. నోవహు ముగ్గురు కుమారులు మొత్తం మానవజాతికి పూర్వికులయ్యారు, అయితే ఆయన మునిమనవడైన నిమ్రోదు “యెహోవాయెదుట పరాక్రమముగల వేటగాడి”గా తయారయ్యాడు. భూమి నింపబడేలా మానవులు అన్ని ప్రాంతాలకు వ్యాపించే బదులు వారు బాబేలు అనే పట్టణాన్ని, గోపురాన్ని నిర్మించి పేరు సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నారు. యెహోవా వారి భాషను తారుమారు చేసి వారు భూమంతా విస్తరించేటట్లు చేయడంతో వారి పథకాలు అడ్డగించబడ్డాయి.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

8:⁠11​—⁠జలప్రళయంవల్ల చెట్లు నాశనమైపోతే మరి ఆ పావురానికి ఓలీవచెట్టు ఆకు ఎక్కడ లభించింది? రెండు సంభావ్యతలు ఉన్నాయి. ఓలీవ చెట్టు చాలా బలమైనది కాబట్టి, జలప్రళయం సమయంలో అది కొన్ని నెలలపాటు నీటి క్రింద బ్రతికివుండవచ్చు. జలప్రళయం తగ్గుముఖం పట్టినప్పుడు, మునిగిపోయిన ఓలీవ చెట్లు పొడినేలమీద మళ్ళీ చిగురించే అవకాశం ఉంది. అయితే పావురము నోవహు దగ్గరకు తీసుకువెళ్ళిన ఓలీవచెట్టు ఆకు, నీళ్ళు ఇంకిపోయిన తర్వాత మొలిసిన చిన్న మొక్క నుండి తీసుకోబడినది కూడా అయివుండవచ్చు.

9:​20-25​—⁠నోవహు కనానును ఎందుకు శపించాడు? కనాను తన తాత అయిన నోవహుపట్ల ఏదోక రీతిలో అనుచితంగా ప్రవర్తించి ఉండవచ్చు. కనాను తండ్రి హాము అది చూసినప్పటికీ, దానిని అడ్డుకోవడానికి ప్రయత్నించే బదులు దాని గురించి అందరికీ చెప్పాడు. అయితే నోవహు మిగతా ఇద్దరు కుమారులు అంటే షేము, యాపెతు తమ తండ్రి దిసమొలను కప్పడానికి చర్య తీసుకున్నారు. ఆ కారణాన్ని బట్టి వాళ్ళు ఆశీర్వదించబడ్డారు కానీ కనాను శపించబడ్డాడు, తన పిల్లలపై తీసుకురాబడిన అవమానం వల్ల హాము బాధ అనుభవించాడు.

10:​25​—⁠పెలెగు దినములలో భూమి ఎలా ‘విభాగింపబడింది?’ పెలెగు సా.శ.పూ. 2269 నుండి 2030 వరకు జీవించాడు. “అతని దినములలో”నే యెహోవా బాబెలును నిర్మిస్తున్న ప్రజల భాషను తారుమారు చేసి వాళ్ళను భూవ్యాప్తంగా చెదరగొట్టి వాళ్ళు విభాగింపబడేలా చేశాడు. (ఆదికాండము 11:⁠9) అలా పెలెగు దినములలో ‘భూమి [లేదా భూమ్మీది జనాభా] విభాగింపబడింది.’

మనకు పాఠాలు:

9:⁠1; 11:⁠9.యెహోవా సంకల్పాన్ని, ఏ మానవ పథకం గానీ ప్రయత్నం గానీ అడ్డగించలేదు.

10:​1-32.జలప్రళయానికి ముందు, దాని తర్వాత కాలానికి సంబంధించిన వంశానుక్రమపు నివేదికలు రెండు, అంటే 5వ అధ్యాయం మరియు 10వ అధ్యాయంలోని నివేదికలు మొత్తం మానవజాతిని నోవహు ముగ్గురు కుమారుల ద్వారా మొదటి మానవుడైన ఆదాముకు జతచేస్తున్నాయి. అష్షూరీయులు, కల్దీయులు, హెబ్రీయులు, సిరియన్లు, కొన్ని అరేబియన్‌ తెగలకు చెందినవారు షేము వారసులు. ఇతియోపియన్లు, ఐగుప్తీయులు, కనానీయులు, కొన్ని ఆఫ్రికా తెగలకు మరియు అరేబియన్‌ తెగలకు చెందినవారు హాము వంశస్థులు. ఇండో-యూరోపియన్లు యాపెతు వంశస్థులు. మానవులందరూ బంధువులు, అందరూ దేవుని ఎదుట సమాన స్థానంతో జన్మించారు. (అపొస్తలుల కార్యములు 17:​26) ఈ వాస్తవం, మనం ఇతరులను ఎలా దృష్టిస్తాము, వారితో ఎలా వ్యవహరిస్తాము అనే విషయాన్ని ప్రభావితం చేయాలి.

దేవుని వాక్యము బలముగలది

ఆదికాండములోని మొదటి భాగం, తొలి మానవ చరిత్రకు సంబంధించిన ఏకైక ఖచ్చితమైన నివేదికను కలిగివుంది. ఆ నివేదికలో, దేవుడు మానవుణ్ణి భూమిపై ఉంచడం వెనుకగల సంకల్పానికి సంబంధించిన అంతర్దృష్టి మనకు లభిస్తుంది. నిమ్రోదు వంటి మానవులు చేసే ఎటువంటి ప్రయత్నాలైనా ఆ సంకల్ప నెరవేర్పును అడ్డగించలేవని తెలుసుకోవడం ఎంత ప్రోత్సాహకరమో కదా!

దైవపరిపాలనా పరిచర్య పాఠశాల కోసం సిద్ధపడుతూ మీరు మీ వారపు బైబిలు పఠనం చేసుకునేటప్పుడు, “లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు” అనే భాగం క్రింద ఇవ్వబడిన విషయాలను పరిశీలించడం మీరు కొన్ని కష్టమైన లేఖన భాగాలను అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది. “మనకు పాఠాలు” అనే భాగం క్రింది వ్యాఖ్యానాలు, ఆ వారానికి సంబంధించిన బైబిలు పఠనం నుండి మీరు ఎలా ప్రయోజనం పొందవచ్చో చూపిస్తాయి. సముచితమైనప్పుడు, సేవా కూటంలో స్థానిక అవసరాలు అనే భాగాన్ని నిర్వహించడానికి ఆధారంగా కూడా అవి ఉపయోగపడవచ్చు. యెహోవా వాక్యం నిజంగా సజీవమైనది, అది మన జీవితాలపై ప్రభావం చూపగలదు.​—⁠హెబ్రీయులు 4:⁠12.