కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మిషనరీ స్ఫూర్తిని కాపాడుకున్నందుకు సమృద్ధిగా ఆశీర్వదించబడ్డాను

మిషనరీ స్ఫూర్తిని కాపాడుకున్నందుకు సమృద్ధిగా ఆశీర్వదించబడ్డాను

జీవిత కథ

మిషనరీ స్ఫూర్తిని కాపాడుకున్నందుకు సమృద్ధిగా ఆశీర్వదించబడ్డాను

టామ్‌ కుక్‌ చెప్పినది

ఒక్కసారిగా తుపాకుల శబ్దంతో మధ్యాహ్న ప్రశాంతత పటాపంచలైంది. మా తోటలోని చెట్లను ఛిన్నాభిన్నం చేస్తూ బుల్లెట్లు రివ్వున దూసుకువెళ్లాయి. ఏమి జరుగుతోంది? అది అధికారం కైవసం చేసుకోవడానికి ప్రభుత్వంపై జరిగిన సైనికదాడి అనీ, ఇప్పుడు ఉగాండా జనరల్‌ ఈదీ ఆమీన్‌ హస్తగతమైందనీ అర్థంచేసుకోవడానికి మాకు అట్టే సమయం పట్టలేదు. అది 1971.

నేనూ నా భార్య ఆన్‌, దాదాపు ప్రశాంతంగా ఉండే ఇంగ్లాండు నుండి ఆఫ్రికాలోని అట్టుడికే పరిస్థితులున్న ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చాం? నాది కాస్త సాహసిక స్వభావమే, కానీ రాజ్య సేవలో అత్యాసక్తి చూపించిన మా తల్లిదండ్రుల ఆదర్శమే ప్రాముఖ్యంగా నాలో మిషనరీ స్ఫూర్తిని నింపింది.

1946 ఆగస్టులో ఎండ ఎక్కువగావున్న ఆ రోజు మా తల్లిదండ్రులు యెహోవాసాక్షులను మొట్టమొదటిసారి కలుసుకోవడం నాకు గుర్తుంది. ఆ ఇద్దరు సందర్శకులతో గుమ్మం దగ్గరే నిలబడి వారు చాలాసేపు మాట్లాడారు. ఆ సందర్శకులు ఫ్రేసర్‌ బ్రాడ్‌బరీ, మామీ ష్రీవ్‌లు. వారు ఆ తర్వాత కొన్ని నెలలపాటు అనేకసార్లు మా ఇంటికి వచ్చారు, మా కుటుంబ జీవితం నాటకీయంగా మారిపోయింది.

ధైర్యవంతమైన మా తల్లిదండ్రుల ఉదాహరణ

మా తల్లిదండ్రులు అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఉదాహరణకు వారు బైబిలు అధ్యయనం ప్రారంభించడానికి కాస్త ముందు, విన్‌స్టన్‌ చర్చిల్‌ చిత్రపటాలు మా ఇంటినిండా ఉండేవి. యుద్ధానంతర జాతీయ ఎన్నికల్లో, మా ఇల్లు స్థానిక సాంప్రదాయవాద పార్టీ కమిటీ కేంద్రంగా ఉపయోగించబడింది. మా కుటుంబానికి మత ప్రముఖులతోను, సమాజ ప్రముఖులతోను పరిచయాలు ఉండేవి. నాకప్పుడు తొమ్మిదేండ్లే ఉన్నప్పటికీ, మేము యెహోవాసాక్షులం అవుతున్నామని తెలిసినప్పుడు మా బంధువుల్లో కలిగిన ఆశ్చర్యాన్ని నేను గ్రహించాను.

మేము సహవాసం చేసిన సాక్షుల చిత్తశుద్ధి, నిర్భయత్వాల మాదిరి, మా తల్లిదండ్రులు ప్రకటనా పనిలో చురుకుగా పాల్గొనేందుకు పురికొల్పింది. త్వరలోనే మా నాన్న మా స్వగ్రామమైన స్పాన్‌డన్‌లోని ప్రధాన వ్యాపార కూడలిలో, మైకు ఉపయోగించి బహిరంగ ప్రసంగాలివ్వడం మొదలెట్టాడు, పిల్లలమైన మేము కావలికోట, తేజరిల్లు! పత్రికలు పట్టుకొని అందరికీ కనబడే స్థలాల్లో నిలబడేవాళ్ళం. మా స్కూలు విద్యార్థులు నా దగ్గరకు వచ్చినప్పుడు, నేను వారికి కనబడకుండా మాయమైపోతే బాగుణ్ణు అనిపించిందని నేను ఒప్పుకోవాల్సిందే.

మా తల్లిదండ్రుల ఆదర్శంవల్ల ప్రోత్సహించబడి మా అక్క డాఫ్నీ పయినీరింగు ప్రారంభించింది. 1955లో ఆమె వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌కు హాజరై, ఆ తర్వాత జపానులో మిషనరీగా నియమించబడింది. * మా చెల్లి జోయి మాత్రం యెహోవాను సేవించడం మానేసింది.

ఈ లోపల నేను చిత్రకళ, గ్రాఫిక్‌ ఆర్ట్స్‌ నేర్చుకోవడం పూర్తి చేశాను. ఆ రోజుల్లో నా తోటి విద్యార్థుల్లో ఖచ్చితంగా దేశ సేవ చేయాలి అనే విషయం చాలా ప్రాముఖ్యంగా ఉండేది. అలాంటి సేవకు నా మనస్సాక్షి అంగీకరించదని చెప్పినప్పుడు, నేనేదో వేళాకోళానికి అలా అంటున్నానని వారు అనుకున్నారు. ఆ వివాదం కొందరు విద్యార్థులతో అనేక బైబిలు చర్చలు జరిపేందుకు నాకు అవకాశమిచ్చింది. త్వరలోనే, నేను మిలటరీ సేవను నిరాకరించినందుకు నాకు 12 నెలల జైలు శిక్ష విధించబడింది. ఆర్ట్‌ కాలేజీలో బైబిలు సందేశం పట్ల ఆసక్తి చూపించిన ఒక విద్యార్థిని ఆ తర్వాత నా భార్య అయింది. ఆన్‌ సత్యాన్ని ఎలా నేర్చుకుందో ఆమెనే చెప్పనివ్వండి.

సత్యంతో ఆన్‌ పరిచయం

“మా కుటుంబీకులు మతాభిమానులు కారు, నేను కూడా ఏ మతానికి సంబంధించి బాప్తిస్మం తీసుకోలేదు. కానీ నాకు మతం విషయంలో జిజ్ఞాస ఉండేది కాబట్టి నా స్నేహితులు ఏ చర్చికి వెళ్లితే నేను కూడా వాళ్ళతోపాటు వెళ్లేదాన్ని. టామ్‌ మరో సాక్షితోపాటు కలిసి కాలేజిలోని ఇతర విద్యార్థులతో జరుపుతున్న ఉత్సాహవంతమైన చర్చలను విన్నప్పుడు నాలో బైబిలు పట్ల ఆసక్తి కలిగింది. మిలటరీ సేవను నిరాకరించినందుకు టామ్‌తోపాటు, మరో సాక్షి జైలు శిక్ష విధించబడినప్పుడు నేను నిర్ఘాంతపోయాను.

“టామ్‌ జైల్లో ఉన్నప్పుడు నేను ఆయనకు ఉత్తరాలు వ్రాయడం మానలేదు, బైబిలు పట్ల నాలో ఆసక్తి గాఢమైంది. నేను పైచదువుల కోసం లండన్‌ వెళ్ళినప్పుడు, మురియల్‌ అల్‌బ్రెక్ట్‌తో బైబిలు అధ్యయనం చేసేందుకు అంగీకరించాను. మురియల్‌ ఈస్టోనియాలో మిషనరీగా సేవ చేసింది, ఆమె, ఆమె తల్లీ నన్ను చాలా ప్రోత్సహించారు. కొన్ని వారాల్లోనే నేను కూటాలకు హాజరవడం, విక్టోరియా స్టేషన్‌ బయట నిలబడి కావలికోట, తేజరిల్లు! పత్రికలను అందించడం ప్రారంభించాను.

“నేను దక్షిణ లండన్‌లోని సౌత్‌వార్క్‌ సంఘానికి హాజరవుతూ ఉండేదాన్ని. అది విభిన్న జాతీయులైన ఆధ్యాత్మిక సహోదర సహోదరీలున్న సంఘం, వారిలో చాలామంది ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. నేను వారికి కొత్తదాన్నే అయినా వారు నన్ను తమ సొంత వ్యక్తిగా చూశారు. నిజానికి, ఆ సంఘంలోని ప్రేమే, ఇదే సత్యము అనే నమ్మకాన్ని నాలో కలిగించింది, నేను 1960లో బాప్తిస్మం తీసుకున్నాను.”

లక్ష్యాలు ఒకటే​—⁠పరిస్థితులు వేర్వేరు

ఆ తర్వాత 1960లో నేనూ ఆన్‌ వివాహం చేసుకున్నాం, మిషనరీ సేవ మా లక్ష్యంగా ఉండేది. కానీ మాకు బిడ్డ పుట్టబోతున్నదని తెలిసేసరికి మా పరిస్థితులు మారాయి. మా కూతురు సారా పుట్టిన తర్వాత కూడా, నాకూ ఆన్‌కు రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువగా ఉన్న దేశంలో సేవ చేయాలనే కోరిక ఉండేది. నేను ఉద్యోగం కోసం చాలా దేశాల్లో ప్రయత్నించాను, అలా చివరకు 1966 మే నెలలో ఉగాండాలోని విద్యాశాఖ నుండి నాకు ఉద్యోగం ఖాయం చేస్తూ ఉత్తరం వచ్చింది. అయితే ఆ సమయానికి ఆన్‌ కడుపులో మా రెండవ బిడ్డ ఉంది. అలాంటి సమయంలో అంత దూరం వెళ్ళడం మంచిదేనా అని కొందరు అనుమానం వ్యక్తంచేశారు. మేము మా డాక్టర్‌ను సంప్రదించాం, “మీరు వెళ్ళాలనుకుంటే మీ భార్యకు ఏడు నెలలు నిండకముందే వెళ్ళాలి” అని ఆయన అన్నాడు. దానితో మేము వెంటనే ఉగాండాకు బయల్దేరాం. ఆ కారణంగా మా తల్లిదండ్రులు మా రెండవ కూతురు రేచల్‌ను రెండేండ్ల వరకు చూడలేదు. ఇప్పుడు మాకే మనవలు మనవరాండ్రు ఉన్నారు, మేము మా తల్లిదండ్రుల స్వయం త్యాగ స్ఫూర్తిని పూర్తిగా గ్రహించాం, ఆ విషయంలో మేమెంతో కృతజ్ఞులం.

1966లో ఉగాండాకు చేరుకోవడం ఉత్తేజవంతంగాను కొంచెం భయం కలిగించేదిగాను ఉండింది. విమానంలోంచి బయటకు వచ్చిన వెంటనే ఆ ప్రాంతపు రంగులను చూసి మేమెంతో ముగ్ధులమయ్యాం. అవి ఎంతో మనోహరంగా ఉన్నాయి. మా మొదటి నివాసం ఈగాంగా అనే ఒక చిన్న పట్టణం దగ్గర ఉండేది, అది నైలునది పుట్టిన జింజాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. జింజాలో ఉన్న ఐసోలేటెడ్‌ గ్రూపే మాకు సమీపంలో ఉన్న సాక్షులు. గిల్బర్ట్‌ మరియు జోవాన్‌ వాల్టర్స్‌, స్టీవన్‌ మరియు బార్బర హార్డీ అనే మిషనరీలు ఆ గ్రూపును చూసుకుంటున్నారు. మేము ఆ గ్రూపుకు ఇంకా ఎక్కువ సహాయం చేయాలనే ఉద్దేశంతో నా ఉద్యోగాన్ని జింజాకు బదిలీచేయమని దరఖాస్తు పెట్టుకున్నాను. రేచల్‌ పుట్టిన కొద్దికాలానికి మేము జింజాకు మారాం. అక్కడ మేము విశ్వసనీయులైన సాక్షుల చిన్న గుంపుతో కలిసి ఆనందంగా సేవచేసాం, అది అలా అలా పెరిగి ఉగాండాలో రెండవ సంఘంగా మారింది.

విదేశీ ప్రాంతంలో ఒక కుటుంబంగా సేవ చేయడం

మా కుటుంబం ఎదగడానికి ఇంతకంటే మంచి పరిసరాలను ఎంచుకోగలిగేవాళ్ళం కాదని నేనూ ఆన్‌ భావించాం. వివిధ దేశాల నుండి వచ్చిన మిషనరీలతో కలిసి పనిచేయడంలో, కొత్తగా రూపొందించిన సంఘాలు ఎదగడానికి తోడ్పడడంలో మేము ఆనందించాం. మేము మన ఉగాండా సహోదర సహోదరీల సహవాసాన్ని ఎంతో ఇష్టపడ్డాం, వారు తరచూ మా ఇంటికి వస్తుండేవారు. ప్రత్యేకించి స్టాన్‌లీ మరియు ఎసీనాలా మకూంబా మాకు ప్రోత్సాహకరంగా ఉండేవారు.

మమ్మల్ని సందర్శించే వారిలో కేవలం మన సహోదరులే లేరు, మా చుట్టుపక్కల ప్రాంతమంతా అద్భుతమైన వివిధ రకాల వన్య ప్రాణులతో నిండివుండేది. రాత్రుళ్ళు అప్పుడప్పుడు నైలు నదిలో నుండి నీటి గుర్రాలు బయటకు వచ్చి సరిగ్గా మా ఇంటివరకూ వచ్చేవి. తోటలో మేమొకసారి ఆరు మీటర్ల కొండచిలువ చూడడం నాకింకా స్పష్టంగా గుర్తుంది. కొన్నిసార్లు మేము వన్యప్రాణులను చూసేందుకు వన్యప్రాణి సంరక్షణా పార్కులకు వెళ్ళేవాళ్ళం, ఆ పార్కుల్లో సింహాలవంటి క్రూర మృగాలు స్వేచ్ఛగా తిరుగుతాయి.

పరిచర్యలో, చిన్న పిల్లల తోపుడుబండిని ఎన్నడూ చూడని స్థానిక ప్రజలు మమ్మల్ని వింతగా చూసేవారు. మేము ఇంటింటికి వెళ్తున్నప్పుడు సాధారణంగా మాతోపాటు చిన్నపిల్లల గుంపు ఉండేది. ప్రజలు మమ్మల్ని గౌరవపూర్వకంగా చూసేవారు, ఆ తర్వాత తెల్లగా ఉండే మా పాపను తాకేవాళ్ళు. వారెంతో మర్యాద చూపించేవారు కాబట్టి సాక్ష్యమివ్వడం ఆనందకరంగా ఉండేది. బైబిలు అధ్యయనాలు ప్రారంభించడం చాలా సులభంగా ఉండేది కాబట్టి ప్రతి ఒక్కరూ సత్యంలోకి వస్తారని మేము భావించాం. కానీ అనేకమందికి లేఖన విరుద్ధమైన ఆచారాలను మానుకోవడం కష్టమనిపించింది. అయినా చాలామంది బైబిలులోని ఉన్నత నైతిక ప్రమాణాలను అలవరచుకున్నారు, సంఘ సభ్యుల సంఖ్య పెరిగింది. 1968లో మేము జింజాలో జరుపుకున్న మొదటి ప్రాంతీయ సమావేశం ఒక మైలురాయి. మేము బైబిలు అధ్యయనం చేసినవారిలో కొందరు నైలు నదిలో బాప్తిస్మం పొందడం ఓ మరువలేని సంఘటన. కానీ త్వరలోనే మా శాంతి చెల్లాచెదురు కానుంది.

నిషేధం​—⁠విశ్వాసానికీ చాతుర్యానికీ పరీక్ష

1971లో జనరల్‌ ఈదీ ఆమీన్‌ అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. జింజాలో పరిస్థితి అదుపుతప్పింది, ప్రారంభంలో వర్ణించిన ఆ సంఘటన మేము తోటలో కూర్చొని టీ తాగుతున్నప్పుడు జరిగింది. ఆ తర్వాతి రెండు సంవత్సరాల్లో చాలామంది ఏషియన్లు బహిష్కరించబడ్డారు. విదేశీయులు చాలామంది వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు, స్కూళ్ళు ఆసుపత్రుల్లో తీవ్ర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ తర్వాత, యెహోవాసాక్షులు నిషేధించబడ్డారనే ఘోరమైన ప్రకటన వచ్చింది. మేము క్షేమంగా ఉండాలని విద్యాశాఖ మమ్మల్ని రాజధాని నగరమైన కంపాలాకు తరలించింది. అలా మారడం మాకు రెండు విధాలుగా ప్రయోజనం చేకూర్చింది. మా గురించి కంపాలాలో ఎక్కువగా తెలియదు కాబట్టి మాకు మరింత స్వేచ్ఛ లభించింది. అక్కడ కూడా సంఘంలోనూ క్షేత్ర పరిచర్యలోనూ చేయవలసింది ఎంతో ఉంది.

బ్రైయన్‌ మరియు మారియోన్‌ వాల్లేస్‌, వారి ఇద్దరు పిల్లల పరిస్థితీ మాలాంటిదే, వారుకూడా ఉగాండాలో ఉండడానికే నిర్ణయించుకున్నారు. మేము ఆ కష్ట కాలంలో కంపాలా సంఘంతో కలిసి సేవ చేయడంలో వారి సహవాసాన్ని ఎంతో ఆనందించాం. వేరే దేశాల్లో నిషేధం కింద సేవచేస్తున్న మన సహోదరుల గురించి మేము చదివిన వృత్తాంతాలు, ఆ సమయంలో మాకు ప్రత్యేక ప్రోత్సాహాన్నిచ్చాయి. మేము చిన్న చిన్న గుంపులుగా నెలకు ఒకసారి కలుసుకునేవాళ్ళం, పెద్ద సమావేశాలను ఎంటెబే బొటానికల్‌ గార్డెన్స్‌లో ఏదో పార్టీ జరుగుతుందన్నట్లుగా జరుపుకున్నాం. మా అమ్మాయిలకు ఇది భలే ఐడియా అనిపించింది.

మేము ప్రకటనా పనిలో పాల్గొనే విధానంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వచ్చేది. తెల్లవాళ్ళు ఉగాండా ప్రజల ఇళ్లు సందర్శించడం అందరికీ సులభంగా తెలిసిపోయేది. ఆ కారణంగా దుకాణాలు, అపార్టుమెంట్లు, కొన్ని విద్యా కేంద్రాలే మా సేవా క్షేత్రాలయ్యాయి. దుకాణాల్లో నేను ఉపయోగించే ఒక పద్ధతి ఏమిటంటే, ఇకపైన లభ్యం కాదని తెలిసిన ఒక సరుకును అంటే పంచదార, బియ్యం వంటివాటిని అడిగేవాడిని. ఒకవేళ దుకాణదారు దేశంలో జరుగుతున్నదాని పట్ల విచారం వెలిబుచ్చితే, నేను రాజ్య సందేశాన్ని పరిచయం చేసేవాడిని. ఈ పద్ధతి బాగా పనిచేసింది. నేను దుకాణం నుండి తిరిగివచ్చేటప్పటికి పునర్దర్శనం లభించే అవకాశంతోపాటు, అప్పుడప్పుడు అరుదైన ఆ సరుకు కూడా కొంత లభ్యమయ్యేది.

ఈలోగా, మా చుట్టుపక్కల అంతా దౌర్జన్యం పెచ్చుమీరడం మొదలైంది. ఉగాండా, బ్రిటన్‌ల మధ్య సంబంధాలు మరింత క్షీణించిపోవడంతో, అధికారులు నా కాంట్రాక్టును రిన్యూవల్‌ చేయలేదు. ఆ కారణంగా 1974లో, ఉగాండాలో 8 సంవత్సరాలు గడిపిన తర్వాత, మన సహోదరులకు మేము వీడ్కోలు చెప్పాల్సి వచ్చింది. అప్పటికీ మా మిషనరీ స్ఫూర్తి తగ్గిపోలేదు.

న్యూ గినియాకు మారడం

1975 జనవరిలో, మాకు పాపువ న్యూ గినియాలో పనిచేసే అవకాశం లభించింది. పసిఫిక్‌లోని ఆ ప్రాంతంలో మొదలైన ఆనందకరమైన సేవ 8 సంవత్సరాలు కొనసాగింది. సహోదరులతో మా జీవితం, పరిచర్యా ఎంతో ఫలదాయకంగా ఉంది.

మేము పాపువ న్యూ గినియాలో ఉన్న కాలాన్ని, మా కుటుంబం బైబిలు నాటకాల కాలమని గుర్తుచేసుకుంటుంది. ప్రతీ సంవత్సరం జిల్లా సమావేశం కోసం నాటకం సిద్ధం చేయడంలో మేము సహాయపడేవాళ్లం, మేమెంత ఉల్లాసంగా గడిపామో! ఆధ్యాత్మిక చింతగల అనేక కుటుంబాల సహవాసాన్ని మేము ఆనందించాం, అవి మా అమ్మాయిలపై సానుకూల ప్రభావం చూపాయి. మా పెద్దమ్మాయి సారా, రే స్మిత్‌ అనే ఒక ప్రత్యేక పయినీరును వివాహం చేసుకుంది, ఆ తర్వాత ఇద్దరూ కలిసి ప్రత్యేక పయినీర్లుగా ఇరియన్‌ జాయ (ఇప్పుడు పాపువ, ఇండోనేషియాలోని ఒక మండలం) సరిహద్దుకు దగ్గర్లో సేవ చేశారు. వాళ్ళ ఇల్లు స్థానిక గ్రామంలో ఒక పూరి గుడిసె, ఆ నియామకంలో ఉన్న కాలం తనకు చక్కని శిక్షణనిచ్చిందని సారా చెబుతోంది.

మారుతున్న పరిస్థితులతో సర్దుకుపోవడం

ఆ సమయానికి మా తల్లిదండ్రులకు అదనపు శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఏర్పడింది. మేము ఇంగ్లాండుకు తిరిగి వెళ్ళే బదులు మా తల్లిదండ్రులు మా దగ్గరకే వచ్చి మాతో ఉండడానికి ఒప్పుకున్నారు, ఆ తర్వాత మేమందరం 1983లో ఆస్ట్రేలియా వెళ్ళాం. ఇంకా జపానులోనే ఉన్న మా అక్క డాఫ్ని దగ్గర కూడా వాళ్ళు కొంతకాలం గడిపారు. మా తల్లిదండ్రులు మరణించిన తర్వాత, నేనూ ఆన్‌ క్రమ పయినీరు సేవ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం, అది నాకొక సవాలుగా అనిపించిన ఆధిక్యతకు నడిపింది.

మేము పయినీరుసేవ ప్రారంభించిన అనతికాలంలోనే, సర్క్యూట్‌ సేవ చేయమని మాకు ఆహ్వానం వచ్చింది. చిన్నప్పటినుండి ప్రాంతీయ పైవిచారణకర్త సందర్శనాన్ని నేను ఒక ప్రత్యేక సందర్భంగా చూశాను. ఇప్పుడు ఆ బాధ్యత నా మీదుంది. సర్క్యూట్‌ పని, మేము మా జీవితంలో అప్పటివరకూ చవిచూసిన వాటిలోకెల్లా ఓ పెద్ద సవాలుగా అనిపించింది, కానీ ఎన్నోసార్లు మేము ఇంతకుముందు అనుభవించని రీతుల్లో యెహోవా మాకు సహాయం చేశాడు.

సహోదరుడు థియోడోర్‌ జారస్‌ 1990లో ఆస్ట్రేలియాకు జోన్‌ సందర్శనానికి వచ్చినప్పుడు, విదేశాల్లో పూర్తికాల సేవ చేయడానికి మాది పెద్ద వయసుగా భావిస్తున్నాడేమోనని మేమాయనను అడిగాం. ఆయనిలా అన్నాడు: “సాలమన్‌ దీవుల గురించి మీ అభిప్రాయమేంటి?” అలా చివరకు, నేనూ ఆన్‌ ఇద్దరం మా 50వ పడిలో, అధికారికంగా మా మొదటి మిషనరీ నియామకం కానున్న చోటుకు వెళ్ళాం.

“సంతోషపు దీవుల”లో సేవ చేయడం

సాలమన్‌ దీవులు సంతోషపు దీవులుగా ప్రఖ్యాతిగాంచాయి, మేము గత దశాబ్దం కంటే ఎక్కువ కాలం ఇక్కడ చేసిన సేవ నిజంగానే సంతోషకరమైన కాలం. నేను సాలమన్‌ దీవుల్లో జిల్లా పైవిచారణకర్తగా సేవ చేస్తున్నప్పుడు మేము అక్కడి సహోదర సహోదరీల ఉదార దయను చవిచూశాం. వారు చూపించిన ఆతిథ్యం మమ్మల్నెంతో కదిలించింది. నేను సాలమన్‌ దీవుల్లో అంగీకృతమని భావించిన పిడ్జిన్‌ భాషలో విషయాలను వివరించేందుకు ప్రయత్నించినప్పుడు ప్రతీ ఒక్కరు ఎంతో అవగాహన చూపారు, ప్రపంచంలో అత్యల్ప శబ్దావళివున్న భాష అది.

మేము సాలమన్‌ దీవులకు చేరుకున్న కొద్దికాలానికే, మా అసెంబ్లీ హాలు విషయంలో విరోధులు అంతరాయం కలిగించాలని ప్రయత్నించారు. హోనియారాలో మేము కట్టిన అసెంబ్లీ హాలు స్థలం తమదని ఆంగ్లికన్‌ చర్చి యెహోవాసాక్షులకు వ్యతిరేకంగా ఆరోపించింది. ప్రభుత్వం వారి వాదనను సమర్థించింది, దాంతో మేము హైకోర్టుకు అప్పీల్‌ చేసుకున్నాం. అక్కడి నుండి వచ్చే తీర్పు మేము 1,200 సీట్లున్న మా అసెంబ్లీ హాలు అక్కడే ఉంచడమో తీసేయడమో నిర్ణయిస్తుంది.

మా కేసు ఒక వారమంతా కోర్టులో ఉంది. మాకు వ్యతిరేకంగా కేసు ఫైల్‌ చేస్తున్నప్పుడు వాళ్ళ లాయర్‌ అహంకారపూరిత ధీమా వ్యక్తంచేశాడు. అప్పుడు న్యూజిలాండ్‌ నుండి వచ్చిన మా లాయరు, సహోదరుడు వారన్‌ కాథ్‌కర్ట్‌, ఏకబిగిన చేసిన వాదన ప్రత్యర్థుల కేసులోని ప్రతీ అంశాన్ని నీరుగార్చింది. శుక్రవారానికల్లా కోర్టు కేసు విషయాలు వార్తలకెక్కాయి, చర్చి ప్రముఖులతో, ప్రభుత్వ అధికారులతో, మన క్రైస్తవ సహోదరులతో కోర్టుహాలు కిక్కిరిసిపోయింది. అధికారిక కోర్టు షెడ్యూలు నోటీసులో ఉన్న పొరపాటు నాకు గుర్తుంది. అదిలా ఉంది: “సాలమన్‌ దీవుల ప్రభుత్వం, మెలనీసియ చర్చి వర్సెస్‌ యెహోవా.” మేమే గెలిచాం.

అయినప్పటికీ సంతోషపు దీవులలో ఉన్న ఆ కొద్దిపాటి ప్రశాంతత ఎక్కువ కాలం నిలువలేదు. అధికారం కైవసం చేసుకోవడానికి జరిగిన సైనిక దాడితో చెలరేగిన అల్లకల్లోలం, దౌర్జన్యపూరిత వాతావరణంలో నేనూ ఆన్‌ మళ్ళీ చిక్కుబడ్డాము. జాతి విద్వేషం అంతర్యుద్ధానికి దారి తీసింది. 2000, జూన్‌ 5వ తేదీన ప్రభుత్వం పతనమై, రాజధాని సాయుధ మిలిటెంట్ల ఆధీనంలోకి వచ్చింది. మా అసెంబ్లీ హాల్‌ కొన్నివారాలపాటు నిరాశ్రయులకు ఆశ్రయ స్థలంగా మారింది. వైరి జాతుల నుండి వచ్చిన మన సహోదరులు శాంతియుతమైన కుటుంబంగా ఒకే కప్పు కింద అసెంబ్లీ హాల్లో కలిసి మెలసి ఉండడం చూసి అధికారులు అచ్చెరువొందారు. అది ఎంతో చక్కని సాక్ష్యంగా నిరూపించబడింది!

యెహోవాసాక్షుల తటస్థతను మిలిటెంట్లు కూడా గౌరవించారు. అందువల్ల, వ్యతిరేకుల ఆర్మీ ఆధీన ప్రాంతంలో ఉండిపోయిన ఒక చిన్న గ్రూపుకు సాహిత్యాలను చేరవేసేందుకు ఒక ట్రక్కును అనుమతించమని ఒక కమాండరును అడగడం సాధ్యమయ్యింది. కొన్ని నెలలపాటు మా నుండి దూరమైన కుటుంబాలను మేము తిరిగి కలుసుకున్నప్పుడు, మాలో కంటతడి పెట్టనివారు లేరు.

కృతజ్ఞత చూపాల్సింది ఎంతో ఉంది

యెహోవా సేవలో మా జీవితాన్ని నెమరువేసుకుంటే, మేము కృతజ్ఞత చూపాల్సింది ఎంతో ఉంది. తల్లిదండ్రులుగా మేము మా ఇద్దరు అమ్మాయిలు వారి భర్తలు రే, జాన్‌లు యెహోవా సేవలో విశ్వసనీయంగా కొనసాగడాన్ని చూసే ఆనందం మాకు దక్కింది. వారు మా మిషనరీ నియామకంలో నిజమైన మద్దతుగా ఉన్నారు.

గత 12 సంవత్సరాల నుండి ఆన్‌కు నాకు సాలమన్‌ దీవుల బ్రాంచి కార్యాలయంలో సేవ చేసే ఆధిక్యత లభించింది, ఈ కాలంలో సాలమన్‌ దీవుల్లో రాజ్య ప్రచారకులు రెండింతలై 1,800 కంటే ఎక్కువయ్యారు. నాకు ఇటీవల న్యూయార్కులో, ప్యాటర్‌సన్‌లో, బ్రాంచి కమిటీ సభ్యుల స్కూల్లో పాల్గొనే అదనపు ఆధిక్యత లభించింది. మేము మిషనరీ స్ఫూర్తిని కాపాడుకున్నందుకు నిజంగా సంతృప్తికరమైన జీవితాన్ని అనేక ఆశీర్వాదాలను అనుభవించాం.

[అధస్సూచి]

^ పేరా 10 కావలికోట, జనవరి 15, 1977 (ఆంగ్లం)లో “మేము జాప్యం చేయలేదు” అనే ఆర్టికల్‌ చూడండి.

[23వ పేజీలోని చిత్రం]

1960లో మా పెళ్లిరోజున

[24వ పేజీలోని చిత్రం]

ఉగాండాలో స్టాన్‌లీ మరియు ఎసీనాలా మకూంబా మా కుటుంబానికి ప్రోత్సాహకరంగా ఉండేవారు

[24వ పేజీలోని చిత్రం]

పొరుగువాళ్ళ గుడిసెలోకి వెళ్తున్న సారా

[25వ పేజీలోని చిత్రం]

బొమ్మలు గీయడం సాలమన్‌ ద్వీపస్థులకు బోధించడానికి నాకు సహాయపడింది

[25వ పేజీలోని చిత్రం]

సాలమన్‌ దీవుల్లోని ఐసోలేటెడ్‌ సంఘాన్ని సందర్శించడం

[26వ పేజీలోని చిత్రం]

ఇప్పుడు మా కుటుంబం