కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యుద్ధ స్వరూపం మారింది

యుద్ధ స్వరూపం మారింది

యుద్ధ స్వరూపం మారింది

యుద్ధం ఎప్పుడూ క్రూరంగానే ఉంది. అది అన్ని సందర్భాల్లోనూ సైనికుల ప్రాణాలను బలిగొన్నది, సాధారణ పౌరులను కష్టాలపాలు చేసింది. కానీ ఇటీవలి సంవత్సరాల్లో యుద్ధ స్వరూపం మారింది. ఏ విధంగా మారింది?

నేటి యుద్ధాలు ముఖ్యంగా అంతర్యుద్ధాలు​—⁠ఒకే దేశంలో ప్రతికూల వర్గాలకు చెందిన పౌరుల మధ్య అవి జరుగుతున్నాయి. ఈ అంతర్యుద్ధాలు తరచూ ప్రజలను కష్టాలపాలుజేస్తూ ఎక్కువ కాలం కొనసాగుతూ, వేర్వేరు దేశాల మధ్య జరిగే యుద్ధాల కంటే మరియెక్కువగా ఇవి దేశాలను పాడుచేస్తాయి. “అంతర్యుద్ధాలు క్రూరమైనవి, రక్తపాతంతో కూడుకొని వేలాదిమంది ప్రాణాలు కోల్పోవడానికి, మానభంగాలకు, బలవంతంగా దేశం లేక ఇల్లు వదిలి పారిపోవడానికి, మరీ విపరీత సందర్భాల్లో జాతి నిర్మూలనానికి కూడా కారణమవుతున్నాయి” అని స్పానిష్‌ చరిత్రకారుడు హూలియాన్‌ కసనోవా పేర్కొన్నాడు. నిజమే ఇరుగు పొరుగు వర్గాలు పరస్పరం దారుణకృత్యాలకు ఒడిగట్టినప్పుడు, ఆ గాయాలు మానడానికి శతాబ్దాలు పట్టవచ్చు.

ప్రచ్ఛన్న యుద్ధం ముగిసినప్పటి నుండి, విభిన్న దేశాలకు చెందిన సైనికుల మధ్య జరిగిన యుద్ధాలు తక్కువే. “1990 నుండి 2000 మధ్య నమోదైన భారీ సాయుధ పోరాటాల్లో మూడు తప్ప మిగిలినవన్నీ అంతర్యుద్ధాలే” అని స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (SIPRI) నివేదిస్తోంది.

నిజమే అంతర్యుద్ధాలు అంత ప్రమాదకరమైనవిగా కనిపించకపోవచ్చు, అంతర్జాతీయ వార్తా మాధ్యమాలు వాటిని ఎక్కువగా పట్టించుకోకపోవచ్చు కానీ ఆ పోరాటాల వల్ల కలిగే కష్టాలు, నష్టాలు అంతే తీవ్రంగా ఉంటాయి. అంతర్యుద్ధాల్లో కోట్లాదిమంది మరణించారు. వాస్తవానికి గత రెండు దశాబ్దాల్లో యుద్ధం కారణంగా ఛిన్నాభిన్నమైన కేవలం మూడు దేశాల్లో అంటే ఆఫ్ఘనిస్తాన్‌, డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో, సూడాన్‌లలో దాదాపు 50 లక్షలమంది తమ ప్రాణాలు కోల్పోయారు. బాల్కన్‌ రాష్ట్రాల్లో, తీవ్ర జాతిపోరాటంలో దాదాపు 2,50,000 మంది మరణించారు, కొలంబియాలో దీర్ఘకాలం కొనసాగిన గెరిల్లా పోరాటం 1,00,000 మంది ప్రాణాలను బలిగొంది.

అంతర్యుద్ధ క్రూర ప్రభావం ఎక్కువగా పిల్లల మీదే పడిందని రుజువవుతోంది. యునైటెడ్‌ నేషన్స్‌ హైకమీషనర్‌ ఫర్‌ రెఫ్యూజీస్‌ ప్రకారం, గత దశాబ్దకాలంలో 20 లక్షల కంటే ఎక్కువ మంది పిల్లలు అంతర్యుద్ధాల్లో మరణించారు. మరో 60 లక్షలమంది పిల్లలు గాయపడ్డారు. అంతకంతకు ఎక్కువమంది పిల్లలకు సైనిక శిక్షణ ఇవ్వబడుతోంది. ఓ బాల సైనికుడు ఇలా చెబుతున్నాడు: “వారు నాకు శిక్షణనిచ్చారు. నాకొక తుపాకి ఇచ్చారు. నేను మాదకద్రవ్యాలకు అలవాటుపడ్డాను. నేను చాలామంది పౌరులను చంపాను. అది కేవలం యుద్ధం . . . నేను కేవలం ఆజ్ఞలను పాటించాను. అది మంచిది కాదని నాకు తెలుసు. కానీ నేను కావాలని అలా చేయలేదు.”

అంతర్యుద్ధం ఒక జీవన విధానంగా మారిన దేశాల్లోని అనేకమంది పిల్లలు, శాంతి అంటే ఏమిటో తెలియకుండానే పెరుగుతున్నారు. స్కూళ్ళు నాశనం చేయబడిన లోకంలో, కేవలం తుపాకులతో మాట్లాడుకునే లోకంలో వారు నివసిస్తున్నారు. 14 ఏండ్ల డూంజా ఇలా అంటోంది: “చాలామంది చంపబడ్డారు . . . ఇకపైన మీరు పక్షుల కిలకిలారావాలు వినలేరు, తమ తల్లినో తండ్రినో అన్ననో అక్కనో కోల్పోయిన పిల్లల ఆక్రందనలు మాత్రమే వింటారు.”

కారణాలు ఏమిటి?

అలాంటి క్రూరమైన అంతర్యుద్ధాలకు ఏది ఆజ్యం పోస్తోంది? జాతి, వర్గ విద్వేషాలు, మత విభేదాలు, అన్యాయం, రాజకీయ సంక్షోభం వంటివే ప్రధాన కారణాలు. మరో ముఖ్య కారణం అత్యాశ​—⁠అధికారం మీద, డబ్బుమీద అత్యాశ. రాజకీయ నాయకులు తరచూ అత్యాశతోనే పురికొల్పబడి, పోరాటాలకు ఆజ్యం పోస్తున్నారు. స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రచురించిన ఒక నివేదిక, సాయుధ పోరాటాల్లో పాల్గొంటున్నవారిలో చాలామంది “స్వలాభాపేక్షతో పురికొల్పబడ్డవారే” అని పేర్కొంది. ఆ నివేదిక ఇంకా ఇలా అంటోంది: “సైన్యాధికారులు మరియు రాజకీయ నాయకులు చేసే విస్తృతమైన వజ్రాల వ్యాపారం మొదలుకొని గ్రామ స్థాయిలో యువకులు తుపాకులతో బెదిరించి దోచుకోవడం వరకూ పేరాశ అనేక రూపాల్లో కనబరచబడుతోంది.”

తక్కువ ధరకే సులభంగా లభ్యమయ్యే మారణాయుధాలు ఈ మానవ సంహారాన్ని అధికం చేస్తున్నాయి. చిన్న చేతి తుపాకుల ద్వారానే సంవత్సరానికి దాదాపు 5,00,000 మంది, ముఖ్యంగా స్త్రీలు పిల్లలు హతమవుతున్నారు. ఆఫ్రికాలోని ఒక దేశంలో, ఎకె-47 తుపాకి కేవలం ఒక కోడి ధరకే లభిస్తుంది. విచారకరంగా, కొన్ని ప్రాంతాల్లోనైతే దాదాపు ఈ కోళ్ళలాగే రైఫిళ్ళు అధికసంఖ్యలో లభ్యమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 50 కోట్ల మేరకు అంటే బ్రతికివున్న ప్రతీ 12 మందికి ఒకటిచొప్పున చేతి తుపాకులు లేదా తేలికరకం ఆయుధాలున్నాయని అంచనా.

శత్రుభావంగల ఈ పౌర పోరాటాలు, 21వ శతాబ్దపు ప్రమాణ చిహ్నమవుతాయా? అంతర్యుద్ధాలను అదుపుచేయవచ్చా? చివరకు ప్రజలు చంపుకోవడాన్ని ఆపుతారా? దీని తర్వాతి ఆర్టికల్‌ ఈ ప్రశ్నలను పరిశీలిస్తుంది.

[4వ పేజీలోని బాక్సు]

అంతర్యుద్ధాల విషాదకర మూల్యం

అంతర్యుద్ధాల్లో ఉపయోగించేవి అత్యాధునిక ఆయుధాలు కాకపోయినా అవి క్రూరమైనవే, క్షతగాత్రుల్లో 90 శాతం మంది పోరాడేవారు కాదుగానీ పౌరులే. “సాయుధ పోరాటంలో పిల్లలు పొరపాటున గాయపడడం లేదుకానీ వాళ్ళే లక్ష్యాలవ్వడం ఎక్కువవుతోంది” అని పిల్లలపై సాయుధ పోరాటాల ప్రభావం గురించి ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్స్‌ ఎక్స్‌పర్ట్‌ అయిన గ్రేసె మాషల్‌ పేర్కొంది.

అత్యాచారం ఉద్దేశపూర్వక సైనిక తంత్రంగా మారింది. కొన్ని యుద్ధవిచ్ఛిన ప్రాంతాల్లో, తిరుగుబాటుదార్లు తమ ఆధీనంలోకి వచ్చిన గ్రామాల్లో కనబడ్డ దాదాపు ప్రతి యువతిని బలత్కరిస్తారు. భయాందోళన వ్యాప్తిచేయడం లేదా జాతి విరోధులమధ్య కుటుంబ బంధాల్ని నాశనం చేయడమే ఆ బలాత్కారుల లక్ష్యం.

యుద్ధం వెన్నంటే కరువు, రోగాలు ఉంటాయి. అంతర్యుద్ధం అంటేనే వ్యవసాయం అంతంత మాత్రమే ఉంటుంది, వైద్య సదుపాయాలు ఒకవేళ ఉంటే కొద్ది మాత్రమే అందుబాటులో ఉంటాయి, అవసరంలో ఉన్నవారికి అంతర్జాతీయ సహాయం కొద్దిమాత్రమే అందుతుంది. ఆఫ్రికాలో జరిగిన ఒక అంతర్యుద్ధానికి సంబంధించి జరిపిన ఒక అధ్యయనం, బాధితుల్లో 20 శాతం మంది వ్యాధితో, 78 శాతం ఆకలితో మరణించారని వెల్లడించింది. కేవలం 2 శాతం మాత్రమే ఆ పోరాటంలో మరణించారు.

మందుపాతర్ల కారణంగా సగటున ప్రతీ 22 నిమిషాలకు ఒక వ్యక్తి ఒక అవయవాన్ని లేదా తన ప్రాణాన్ని కోల్పోతున్నాడు. దాదాపు 60కి పైగా దేశాల్లో ఆరు నుండి ఏడు కోట్లవరకు చెల్లాచెదురుగా మందుపాతర్లు ఉన్నాయని అంచనా.

ప్రజలు బలవంతంగా తమ ఇండ్లను వదిలిపెట్టి పారిపోవాల్సి వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు స్వదేశం వదిలి పారిపోయిన అయిదు కోట్ల మంది శరణార్థులు ఉన్నారు, వారిలో సగం మంది పిల్లలే.

[2వ పేజీలోని చిత్రసౌజన్యం]

ముఖచిత్రం: అబ్బాయి: Photo by Chris Hondros/Getty Images

[3వ పేజీలోని చిత్రసౌజన్యం]

Photo by Chris Hondros/Getty Images