కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా మహిమను అందరూ ప్రకటించుదురు గాక

యెహోవా మహిమను అందరూ ప్రకటించుదురు గాక

యెహోవా మహిమను అందరూ ప్రకటించుదురు గాక

“మహిమబలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి.”​కీర్తన 96:7, 8.

యెష్షయి కుమారుడైన దావీదు బేత్లెహేము పరిసరాల్లో పశువుల కాపరిగా పెరిగాడు. జనసంచారం ఉండని పచ్చిక మైదానాల్లో తన తండ్రి పశువులు కాస్తూ, ప్రశాంతమైన రాత్రివేళల్లో నక్షత్రాలు పొదిగినట్లున్న సువిశాల ఆకాశాన్ని ఆయనెంత తరచుగా చూసివుంటాడో గదా! దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి 19వ కీర్తనలోవున్న ఈ మనోహరమైన మాటలను కూర్చి వాటిని పాడినప్పుడు, తన మనస్సుపై చెరగని ముద్రవేసిన అలాంటి సందర్భాలను ఆయన ఖచ్చితంగా గుర్తుచేసుకొనివుంటాడు: “ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది. . . . వాటి కొలనూలు భూమియందంతట వ్యాపించియున్నది లోకదిగంతములవరకు వాటి ప్రకటనలు బయలువెళ్లుచున్నవి.”​—⁠కీర్తన 19:1, 4.

2 యెహోవా సృష్టించిన అద్భుతమైన ఆకాశములు భాష, మాటలు, స్వరము లేకుండానే పగలనక, రాత్రనక ఆయన మహిమను ప్రకటిస్తున్నాయి. సృష్టి, దేవుని మహిమను ప్రకటించడం ఎన్నడూ మానుకోదు, భూనివాసులందరూ చూసేలా ఈ నిశ్శబ్ద సాక్ష్యం “భూమియందంతట” దానంతటదే వెల్లడికావడం ఆలోచించినప్పుడు దానిముందు మనమెంత అల్పులమో తెలుస్తుంది. అయితే సృష్టియొక్క నిశ్శబ్ద సాక్ష్యం మాత్రమే సరిపోదు. నమ్మకమైన మానవులు కూడా సాక్ష్యమివ్వడంలో తమ స్వరాలను కలపాలని ప్రోత్సహించబడ్డారు. పేరు ప్రస్తావించబడని ఓ కీర్తనకర్త నమ్మకమైన ఆరాధకులను ఈ ప్రేరేపిత మాటలతో సంబోధించాడు: “మహిమబలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి.” (కీర్తన 96:​7, 8) యెహోవాతో సన్నిహిత సంబంధం ఉన్నవారు ఆ విన్నపానికి ప్రతిస్పందించేందుకు ఎంతో ఆనందిస్తున్నారు. అయితే దేవునికి మహిమ చెల్లించడంలో ఏమి ఇమిడివుంది?

3 దేవుణ్ణి మహిమపరచడానికి కేవలం మాటలు మాత్రమే సరిపోవు. యెషయా కాలంలోని ఇశ్రాయేలీయులు దేవుణ్ణి తమ పెదవులతో ఘనపరిచారు కానీ వారిలో చాలామందికి చిత్తశుద్ధి లోపించింది. యెషయా ద్వారా యెహోవా ఇలా చెప్పాడు: “ఈ ప్రజలు నోటిమాటతో నాయొద్దకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసికొనియున్నారు.” (యెషయా 29:13) అలాంటి వ్యక్తులు చేసే ఎలాంటి స్తుతి అయినా అర్థరహితమైనది. స్తుతి అర్థవంతంగా ఉండాలంటే, అది యెహోవాపై ప్రేమతో నిండిన హృదయం నుండి, ఆయన అసాధారణమైన మహిమను చిత్తశుద్ధితో గుర్తించడం నుండి రావాలి. యెహోవాయే సృష్టికర్త. ఆయన సర్వశక్తిమంతుడు, న్యాయవంతుడు, ప్రేమకు ప్రతిరూపం. మన రక్షణకు మూలాధారం ఆయనే, అటు పరలోకంలో ఇటు భూమిపై జీవించేవారందరూ విధేయత చూపించవలసిన న్యాయమైన సర్వాధిపతి ఆయనే. (ప్రకటన 4:10; 19:⁠1) మనం నిజంగా ఈ విషయాలను నమ్మితే, మనం ఆయనను మన పూర్ణ హృదయంతో మహిమపరచుదాం.

4 దేవుణ్ణి ఎలా మహిమపరచాలో యేసుక్రీస్తు మనకు తెలియజేశాడు. ఆయన ఇలా చెప్పాడు: “మీరు బహుగా ఫలించుటవలన నా తండ్రి మహిమపరచబడును; ఇందువలన మీరు నా శిష్యులగుదురు.” (యోహాను 15:8) మనం బహుగా ఎలా ఫలించవచ్చు? మొదటిగా, “రాజ్య సువార్త”ను ప్రకటించడంలో మనస్ఫూర్తిగా భాగం వహించి తద్వారా సృష్టింపబడిన వస్తువులతోపాటు దేవుని “అదృశ్యలక్షణముల”ను ‘ప్రచురపరచడం’ ద్వారా మనం అలా చేయవచ్చు. (మత్తయి 24:14; రోమీయులు 1:20) అంతేకాక ఈ విధంగా మనందరం, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా, యెహోవా దేవుణ్ణి మహిమపరచడంలో తమ స్వరాలను కలిపే కొత్త శిష్యులను చేయడంలో భాగం వహిస్తాము. రెండవదిగా, మనలో పరిశుద్ధాత్మ ఫలింపజేసే ఆత్మఫలాల్ని అలవరచుకొని యెహోవా దేవుని అత్యున్నతమైన లక్షణాలను అనుకరించడానికి మనం కృషి చేస్తాము. (గలతీయులు 5:22; ఎఫెసీయులు 5:1; కొలొస్సయులు 3:⁠9) తత్ఫలితంగా మన దైనందిన ప్రవర్తన దేవుణ్ణి మహిమపరుస్తుంది.

“భూలోకమందంతటికిని”

5 పౌలు రోమీయులకు వ్రాసిన పత్రికలో, క్రైస్తవులు తమ విశ్వాసాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారా దేవుణ్ణి మహిమపరిచే బాధ్యతను నొక్కి చెప్పాడు. యేసుక్రీస్తుపై విశ్వాసముంచే వారు మాత్రమే రక్షించబడతారు అనే విషయం రోమీయుల పుస్తకపు ప్రధానాంశం. తన కాలంలోని సహజ ఇశ్రాయేలీయులు మోషే ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా నీతియుక్తమైన స్థానం సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారని, అయితే “క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తియై యున్నాడు” అని పౌలు తన పత్రికలోని 10వ అధ్యాయంలో తెలియజేశాడు. కాబట్టి “యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు” అని పౌలు చెబుతున్నాడు. ఆ సమయం మొదలుకొని “యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు; ఒక్క ప్రభువే అందరికి ప్రభువైయుండి, తనకు ప్రార్థన చేయువారందరియెడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై యున్నాడు. ఎందుకనగా—ప్రభువు [యెహోవా] నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడో వాడు రక్షింపబడును.”—రోమీయులు 10:4, 9-13.

6 ఆ తర్వాత పౌలు న్యాయసమ్మతంగా ఇలా ప్రశ్నిస్తున్నాడు: “వారు విశ్వసింపనివానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విననివానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండ వారెట్లు విందురు?” (రోమీయులు 10:14, 15) అయితే ఇశ్రాయేలు గురించి పౌలు ఇలా చెప్పాడు: “అందరు సువార్తకు లోబడలేదు.” ఇశ్రాయేలు ఎందుకు లోబడలేదు? వాళ్ళు ప్రతిస్పందించకపోవడానికి కారణం వారికి అవకాశం లేకపోవడం కాదు కాని వారికి విశ్వాసం లేకపోవడమే. పౌలు కీర్తన 19:4వ వచనాన్ని ఉల్లేఖిస్తూ, దానిని సృష్టి ఇచ్చే నిశ్శబ్ద సాక్ష్యానికి కాకుండా క్రైస్తవ ప్రకటనా పనికి అన్వయించడం ద్వారా ఆ విషయాన్ని చూపించాడు. ఆయన ఇలా అన్నాడు: “వారి స్వరము భూలోకమందంతటికిని, వారిమాటలు భూదిగంతములవరకును బయలువెళ్లెను.” (రోమీయులు 10:16, 18) అవును, నిర్జీవమైన సృష్టి యెహోవాను మహిమపరచినట్లే, మొదటి శతాబ్దపు క్రైస్తవులు రక్షణ సువార్తను అన్ని ప్రాంతాలలోను ప్రకటించడం ద్వారా యెహోవాను “భూలోకమందంతట” స్తుతించారు. పౌలు కొలొస్సయులకు వ్రాసిన పత్రికలో, సువార్త ఎంత విస్తారంగా వ్యాపించిందో కూడా వర్ణించాడు. సువార్త ‘ఆకాశముక్రింద ఉన్న సమస్తసృష్టికి ప్రకటింపబడింది’ అని ఆయన చెప్పాడు.—కొలొస్సయులు 1:23.

ఆసక్తిగల సాక్షులు

7 యేసుక్రీస్తు చనిపోయి దాదాపు 27 సంవత్సరాలు గడిచిన తర్వాత పౌలు కొలొస్సయులకు పత్రిక వ్రాసివుంటాడు. అంత తక్కువ సమయంలో ప్రకటనా పని కొలొస్సయ వరకూ ఎలా వ్యాపించింది? మొదటి శతాబ్దపు క్రైస్తవులు అత్యంతాసక్తిగలవారు కాబట్టి, యెహోవా వారి ఆసక్తిని ఆశీర్వదించాడు కాబట్టి అలా జరిగింది. “సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను” అని చెప్పినప్పుడు యేసు తన అనుచరులు చురుకుగా ప్రకటిస్తారని ప్రవచించాడు. (మార్కు 13:10) ఆ ప్రవచనానికి, యేసు మత్తయి సువార్తలోని ఆఖరి వచనాల్లో నమోదు చేయబడిన ఆజ్ఞను జోడించాడు: “కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి.” (మత్తయి 28:​19, 20) యేసు పరలోకానికి ఆరోహణమైన అనతికాలంలోనే ఆయన అనుచరులు ఆ మాటలను నెరవేర్చడం ప్రారంభించారు.

8 సా.శ. 33 పెంతెకొస్తు రోజున పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన తర్వాత, యేసు విశ్వసనీయ అనుచరులు చేసిన మొదటి పని, “దేవుని గొప్పకార్యములను” గురించి యెరూషలేములోని జనసమూహాలకు చెబుతూ ప్రకటించడానికి వెళ్ళడమే. వారి ప్రకటనా పని ఎంతో ఫలవంతంగా ఉండి, “ఇంచుమించు మూడువేలమంది” బాప్తిస్మం పొందారు. శిష్యులు అత్యంతాసక్తితో బహిరంగంగా దేవుణ్ణి మహిమపరచడంలో కొనసాగి మంచి ఫలితాలను సాధించారు.​—⁠అపొస్తలుల కార్యములు 2:4, 11, 41, 46, 47.

9 ఆ క్రైస్తవుల కార్యకలాపాలు త్వరలోనే మతనాయకుల దృష్టికివచ్చాయి. పేతురు యోహానుల ధైర్యంచూసి కలవరపడి వారు ప్రకటనా పని ఆపుచేయమని అపొస్తలులకు ఆజ్ఞాపించారు. అపొస్తలులు దానికిలా ప్రతిస్పందించారు: “మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక యుండలేము.” బెదిరించబడి, విడుదల చేయబడిన తర్వాత పేతురు యోహానులు తమ సహోదరుల వద్దకు తిరిగిరాగా, వారందరూ కలిసి యెహోవాకు ప్రార్థన చేశారు. వాళ్ళు ధైర్యంగా యెహోవాను ఇలా అడిగారు: “నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్రహించుము.”—అపొస్తలుల కార్యములు 4:13, 20, 30.

10 వాళ్ళు ఆ రోజు చేసిన ప్రార్థన యెహోవా చిత్తానికి అనుగుణంగా ఉందని ఆ తర్వాత స్పష్టమయ్యింది. అపొస్తలులు బంధించబడి, ఆ తర్వాత అద్భుత రీతిలో ఒక దేవదూత ద్వారా విడుదల చేయబడ్డారు. ఆ దేవదూత వారికిలా చెప్పాడు: “మీరు వెళ్లి దేవాలయములో నిలువబడి ఈ జీవమునుగూర్చిన మాటలన్నియు ప్రజలతో చెప్పుడి.” (అపొస్తలుల కార్యములు 5:18-20) అపొస్తలులు విధేయత చూపించారు కాబట్టి యెహోవా వారిని ఆశీర్వదిస్తూవచ్చాడు. కాబట్టి వాళ్ళు “ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి.” (అపొస్తలుల కార్యములు 5:42) తీవ్రమైన హింస కూడా, యేసు అనుచరులు బహిరంగంగా దేవునికి మహిమ చెల్లించకుండా ఆపలేకపోయిందని స్పష్టమవుతోంది.

11 ఆ తర్వాత స్తెఫను బంధించబడి, రాళ్ళతో కొట్టబడి చంపబడ్డాడు. ఆయన హత్య యెరూషలేములో తీవ్రమైన హింసాగ్ని ప్రబలడానికి దారి తీసింది, దానితో అపొస్తలులు తప్ప మిగతా శిష్యులందరూ యెరూషలేము నుండి సుదూర ప్రాంతాలకు చెదరిపోయారు. ఆ హింస కారణంగా వాళ్ళు నిరుత్సాహపడ్డారా? ఎంతమాత్రం లేదు. మనం ఇలా చదువుతాము: “చెదరిపోయినవారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి.” (అపొస్తలుల కార్యములు 8:1, 4) దేవుని మహిమను ప్రకటించడంలో వాళ్ళకున్న ఆసక్తి మళ్ళీ మళ్ళీ వెల్లడయ్యింది. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో, తార్సుకు చెందిన పరిసయ్యుడైన సౌలు దమస్కులోవున్న యేసు శిష్యులపై హింస ప్రబలించడానికి అక్కడికి వెళ్తున్నప్పుడు యేసు దర్శనంతో గుడ్డివాడయ్యాడు. దమస్కులో అననీయ అద్భుత రీతిలో సౌలు గుడ్డితనాన్ని బాగుచేశాడు. ఆ తర్వాత అపొస్తలుడైన పౌలు అని పిలువబడిన ఆ సౌలు చేసిన మొదటి పనేమిటి? ఆ నివేదిక ఇలా చెబుతోంది: ‘వెంటనే సమాజమందిరములలో, యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించాడు.’—అపొస్తలుల కార్యములు 9:20.

ప్రకటించడంలో అందరూ పాల్గొన్నారు

12 తొలి క్రైస్తవ సంఘంలోని వారందరూ ప్రకటనా పనిలో భాగం వహించారనేది జగమెరిగిన సత్యం. ఆ కాలమందలి క్రైస్తవుల గురించి ఫిలిప్‌ షాఫ్‌ ఇలా వ్రాశాడు: “ప్రతి సంఘం ఒక మిషనరీ వ్యవస్థలా ఉండేది, ప్రతీ క్రైస్తవ విశ్వాసి ఒక మిషనరీగా ఉండేవాడు.” (హిస్టరీ ఆఫ్‌ ద క్రిస్టియన్‌ చర్చ్‌) ద గ్లోరియస్‌ మినిస్ట్రీ ఆఫ్‌ ద లేయిటీ అనే పుస్తకంలో డబ్ల్యు. ఎస్‌. విలియమ్స్‌ ఇలా చెబుతున్నాడు: “తొలికాలపు చర్చిలోని క్రైస్తవులందరూ, ప్రత్యేకించి అద్భుతమైన వరాలు [ఆత్మ వరాలు] ఉన్నవారు సువార్తను ప్రకటించేవారు అనేది అందరికీ తెలిసిందే.” ఆయన తన బలమైన అభిప్రాయాన్ని ఇంకా ఇలా వ్యక్తం చేశాడు: “ప్రకటనా పని, పరిచర్యలోని విశిష్ట వర్గాలకు చెందినవారికి మాత్రమే పరిమితమైన ప్రత్యేకమైన ఆధిక్యతగా ఉండాలని యేసుక్రీస్తు ఎన్నడూ ఉద్దేశించలేదు.” పూర్వకాలంలో క్రైస్తవత్వానికి శత్రువుగా ఉన్న సెల్సస్‌ కూడా ఇలా వ్రాశాడు: “ఉన్ని అల్లేవారు, చెప్పులు కుట్టేవారు, చర్మకారులు, మానవజాతిలో ఏమాత్రం చదువురానివారు, సామాన్యులు సువార్తను ఆసక్తితో ప్రకటించేవారు.”

13 ఆ వ్యాఖ్యానాల ఖచ్చితత్వాన్ని అపొస్తలుల కార్యములలోని చారిత్రక నివేదికలో చూడవచ్చు. సా.శ. 33 పెంతెకొస్తు రోజున పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన తర్వాత స్త్రీపురుషులతోసహా శిష్యులు అందరూ, దేవుని గొప్పకార్యాల గురించి బహిరంగంగా ప్రకటించారు. స్తెఫను హత్య తరువాత హింస చెలరేగినప్పుడు చెదిరిపోయిన క్రైస్తవులందరూ సువార్తను ఇతర దేశాల్లో విస్తృతంగా ప్రకటించారు. దాదాపు 28 సంవత్సరాల తర్వాత, “ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము” అని పౌలు అన్నప్పుడు ఆయన కేవలం ఓ చిన్న మతనాయకుల గుంపుకు కాదుగానీ హీబ్రూ క్రైస్తవులందరికీ ఆ మాటలు వ్రాశాడు. (హెబ్రీయులు 13:15) ప్రకటనా పనికి సంబంధించి తన సొంత అభిప్రాయాన్ని చెబుతూ పౌలు ఇలా అన్నాడు: “నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయకారణములేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నామీద మోపబడియున్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ.” (1 కొరింథీయులు 9:16) మొదటి శతాబ్దంలో నమ్మకమైన క్రైస్తవులందరూ అదే విధంగా భావించారు.

14 నిజమే యథార్థ క్రైస్తవుడు ప్రకటనా పనిలో తప్పకుండా భాగం వహించాలి ఎందుకంటే అది ఆయన విశ్వాసంతో విడదీయరానంత బలంగా ముడిపడివుంది. పౌలు ఇలా అన్నాడు: “నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును.” (రోమీయులు 10:10) సంఘంలో కేవలం ఒక చిన్న గుంపు మాత్రమే, అంటే మతనాయకులు మాత్రమే విశ్వసించి తద్వారా ప్రకటించవలసిన బాధ్యతను స్వీకరించాలా? * అలా కానేకాదు! నిజ క్రైస్తవులందరూ ప్రభువైన యేసుక్రీస్తుపై బలమైన విశ్వాసాన్ని పెంపొందించుకొని, ఆ విశ్వాసం గురించి ఇతరులకు బహిరంగంగా ప్రకటించడానికి కదిలించబడతారు. అలా కానట్లయితే వారి విశ్వాసము మృతము. (యాకోబు 2:​26) మన సామాన్య శకంలో మొదటి శతాబ్దానికి చెందిన విశ్వసనీయులైన క్రైస్తవులందరూ తమ విశ్వాసాన్ని ఆ విధంగా ప్రదర్శించారు కాబట్టి, యెహోవా నామం ఎంతగానో స్తుతించబడింది.

15 మొదటి శతాబ్దంలో సంఘం లోపలా, వెలుపలా సమస్యలు ఉన్నప్పటికీ యెహోవా తన ప్రజలను అభివృద్ధితో ఆశీర్వదించాడు. ఉదాహరణకు అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయం, క్రైస్తవులుగా మారిన హీబ్రూ మాట్లాడే వారికి, గ్రీకు మాట్లాడే వారికి మధ్య తలెత్తిన వివాదం గురించి నివేదిస్తోంది. ఆ సమస్యను అపొస్తలులు పరిష్కరించారు. దాని ఫలితం గురించి మనమిలా చదువుతాము: “దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను; మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి.”—అపొస్తలుల కార్యములు 6:7.

16 ఆ తర్వాత, యూదయ రాజైన హేరోదు అగ్రిప్పకు, తూరు సీదోనులోని ప్రజలకు మధ్య రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఆ నగర నివాసులు శాంతి కోసం చేసిన విన్నపాలు హేరోదు అగ్రిప్పను సంతోషపరిచాయి, వాటికి ప్రతిస్పందనగా ఆయన ఒక ఉపన్యాసమిచ్చాడు. అక్కడ సమకూడిన ప్రజలు “ఇది దైవస్వరమేకాని మానవస్వరముకాదు!” అని కేకలు వేశారు. వెంటనే యెహోవా దూత హేరోదు అగ్రిప్పను మొత్తగా, “అతడు దేవుని మహిమపరచనందున” మరణించాడు. (అపొస్తలుల కార్యములు 12:20-23) మానవ పరిపాలకులపై ఆశలు పెట్టుకొన్నవారిని అది ఎంత దిగ్భ్రాంతికి గురిచేసిందో కదా! (కీర్తన 146:3, 4) అయితే క్రైస్తవులు మాత్రం యెహోవాను మహిమపరుస్తూ వచ్చారు. తత్ఫలితంగా, అలాంటి రాజకీయ అనిశ్చయతలు ఉన్నప్పటికీ “దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను.”—అపొస్తలుల కార్యములు 12:24.

అప్పుడు, ఇప్పుడు

17అవును, మొదటి శతాబ్దంలోని ప్రపంచవ్యాప్త క్రైస్తవ సంఘం యెహోవా దేవుణ్ణి అత్యంతాసక్తికలిగి చురుకుగా స్తుతించేవారితో రూపొందించబడింది. విశ్వసనీయులైన క్రైస్తవులందరూ సువార్తను విస్తరింపజేయడంలో భాగం వహించారు. కొందరు చక్కగా ప్రతిస్పందించినవారిని కలిశారు, యేసు చెప్పినట్లుగా వాళ్ళకు ఆయన ఆజ్ఞాపించిన సంగతులన్నింటికి విధేయత చూపించడం నేర్పించారు. (మత్తయి 28:​19) తత్ఫలితంగా ఆ సంఘం అభివృద్ధి చెందింది, యెహోవాను స్తుతించడంలో పూర్వకాలపు దావీదు రాజుతో అంతకంతకూ ఎక్కువమంది కలిశారు. అందరూ ఈ ప్రేరేపిత మాటలను ప్రతిధ్వనింపజేశారు: “నా పూర్ణహృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ నామమును నిత్యము మహిమపరచెదను. ప్రభువా, నా దేవా, నాయెడల నీవు చూపిన కృప అధికమైనది.”​—⁠కీర్తన 86:12, 13.

18 దీని దృష్ట్యా, వేదాంతశాస్త్ర ప్రొఫెసర్‌ అయిన ఆల్లిసన్‌ ఏ. ట్రైట్స్‌ మాటలు ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. ఆధునిక దిన క్రైస్తవమత సామ్రాజ్యాన్ని మొదటి శతాబ్దపు క్రైస్తవత్వంతో పోలుస్తూ ఆమె ఇలా అన్నది: “నేడు చర్చీలు సాధారణంగా కుటుంబపరమైన పెరుగుదల ద్వారా (స్థానిక చర్చి కుటుంబంలోని పిల్లలు తమ విశ్వాసాన్ని వ్యక్తిగతంగా వ్యక్తం చేసినప్పుడు) లేదా బదిలీ పెరుగుదల ద్వారా (ఒక కొత్త సభ్యుడు/సభ్యురాలు వేరే స్థానిక చర్చి నుండి తన సభ్యత్వాన్ని బదిలీ చేసుకున్నప్పుడు) వృద్ధవుతాయి. అయితే అపొస్తలుల కార్యములలో చెప్పబడిన పెరుగుదల మతం మార్చుకోవడం వల్ల కలిగిన పెరుగుదల ఎందుకంటే చర్చి అప్పుడప్పుడే తన పని ప్రారంభించింది.” అంటే యేసు చెప్పిన విధంగా ఇప్పుడెంతమాత్రం నిజ క్రైస్తవత్వం వృద్ధి కావడంలేదని దానర్థమా? కానేకాదు. నేడు నిజ క్రైస్తవులు, మొదటి శతాబ్దపు క్రైస్తవులవలే ప్రతి విషయంలోను దేవునికి బహిరంగంగా మహిమను చెల్లించడంలో అత్యంతాసక్తితో పనిచేస్తున్నారు. మనం ఈ విషయాన్ని తర్వాతి ఆర్టికల్‌లో చూద్దాము.

[అధస్సూచి]

^ పేరా 19 మతనాయకులు అని అనువదించబడిన “క్లెర్జీ” మరియు “క్లెరిక్‌” అనే ఆంగ్ల పదాలు క్లీరోస్‌ అనే గ్రీకు పదం నుండి తీసుకోబడ్డాయి, ఆ పదానికి ప్రాథమికంగా “వాటా” లేదా “వారసత్వం” అని భావం. 1 పేతురు 5:2, 3 వచనాల్లో క్లీరోస్‌ “దేవుని మంద”లోని వారందరూ దేవుని స్వాస్థ్యం అనే భావంతో అన్వయించబడింది.

మీరు వివరించగలరా?

• మనం ఏయే విధాల్లో దేవుణ్ణి మహిమపరుస్తాము?

కీర్తన 19:4ను పౌలు ఎలా అన్వయించాడు?

• విశ్వాసానికి, ప్రకటనా పనికి ఎలాంటి సంబంధం ఉంది?

• మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘానికి సంబంధించి ఏ విషయం గమనార్హంగా ఉంది?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. యెహోవాకు ఏ మూలం నుండి మహిమ చెల్లించబడుతోంది, ఎవరు కూడా దానిలో కలవాలని ప్రోత్సహించబడ్డారు?

3. మానవులు దేవునికి ఏయే విధాలుగా మహిమ చెల్లిస్తారు?

4. దేవుణ్ణి మహిమపరచడానికి సంబంధించి యేసు ఏ ఆదేశాలు ఇచ్చాడు, మనం వాటిని ఎలా నెరవేర్చవచ్చు?

5. క్రైస్తవులు తమ విశ్వాసాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారా దేవుణ్ణి మహిమపరచవలసిన బాధ్యతను పౌలు ఎలా నొక్కిచెప్పాడో వివరించండి.

6. పౌలు కీర్తన 19:4వ వచనాన్ని ఎలా అన్వయించాడు?

7. యేసు చెప్పిన ప్రకారం, క్రైస్తవులకు ఏ బాధ్యత ఉంది?

8, 9. అపొస్తలుల కార్యముల ప్రకారం, క్రైస్తవులు యేసు ఆజ్ఞలకు ఎలా ప్రతిస్పందించారు?

10. ఎలాంటి వ్యతిరేకత ఎదురయ్యింది, నిజ క్రైస్తవులు ఎలా ప్రతిస్పందించారు?

11. ప్రకటనా పనిపట్ల తొలి క్రైస్తవుల దృక్పథం ఏమిటి?

12, 13. (ఎ)చరిత్రకారుల ప్రకారం, తొలి క్రైస్తవ సంఘానికి సంబంధించి గమనార్హమైన విషయమేమిటి? (బి) చరిత్రకారుల వ్యాఖ్యానాలతో అపొస్తలుల కార్యముల పుస్తకం ఎలా ఏకీభవిస్తోంది?

14. విశ్వాసానికి, ప్రకటనా పనికి ఎలాంటి సంబంధం ఉంది?

15, 16. సమస్యలు వచ్చినా ప్రకటనా పని పురోగమిస్తూనే ఉందనడానికి ఉదాహరణలు ఇవ్వండి.

17. మొదటి శతాబ్దంలో, అంతకంతకూ ఎక్కువమంది ఏమి చేశారు?

18. (ఎ) మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘానికి, నేటి క్రైస్తవమత సామ్రాజ్యానికి మధ్య ఎలాంటి తేడా గమనించబడింది? (బి) తర్వాతి ఆర్టికల్‌లో ఏమి పరిశీలించబడుతుంది?

[8, 9వ పేజీలోని చిత్రం]

ఆకాశములు ఎడతెగక దేవుని మహిమను వెల్లడి చేస్తున్నాయి

[చిత్రసౌజన్యం]

Courtesy of Anglo-Australian Observatory, photograph by David Malin

[10వ పేజీలోని చిత్రాలు]

ప్రకటనా పనికి, ప్రార్థనకు సన్నిహిత సంబంధం ఉంది