కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘వారి స్వరం భూలోకమంతటికి బయలువెళ్లింది’

‘వారి స్వరం భూలోకమంతటికి బయలువెళ్లింది’

‘వారి స్వరం భూలోకమంతటికి బయలువెళ్లింది’

‘సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మియ్యుడి.’​—⁠మత్తయి 28:19.

పరలోకానికి ఆరోహణమవడానికి ముందు యేసు తన శిష్యులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన వారికిలా చెప్పాడు: ‘సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మియ్యుడి.’ (మత్తయి 28:​19) అది ఎంతటి బృహత్తర కార్యమో కదా!

2 ఒక్కసారి ఆలోచించండి! సా.శ. 33 పెంతెకొస్తు రోజున 120 మంది శిష్యులపై పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది, దాంతో వాగ్దానం చేయబడిన మెస్సీయ యేసేనని, ఆయన ద్వారానే రక్షణ పొందవచ్చని ఇతరులకు తెలియజేస్తూ వాళ్ళు ఆ ఆజ్ఞను నెరవేర్చడం ప్రారంభించారు. (అపొస్తలుల కార్యములు 2:​1-36) అంత చిన్న గుంపు ‘సమస్త జనులకు’ ఎలా ప్రకటిస్తారు? మానవ పరిభాషలో అది అసాధ్యం, కానీ “దేవునికి సమస్తమును సాధ్యము.” (మత్తయి 19:​26) తొలి క్రైస్తవులకు యెహోవా పరిశుద్ధాత్మ మద్దతు ఉంది అలాగే వాళ్ళు అత్యవసర భావంతో ప్రకటించారు. (జెకర్యా 4:6; 2 తిమోతి 4:⁠2) అందువల్ల కేవలం కొన్ని దశాబ్దాల్లోనే “ఆకాశముక్రింద ఉన్న సమస్తసృష్టికి” సువార్త ప్రకటించబడుతోందని అపొస్తలుడైన పౌలు చెప్పగలిగాడు.​—⁠కొలొస్సయులు 1:23.

3 మొదటి శతాబ్దంలో ఎక్కువభాగం సత్యారాధన విస్తరిస్తూనే ఉంది. అయితే సాతాను “గురుగులు” విత్తే కాలం వస్తుందని, అప్పుడు నిజ క్రైస్తవులైన “గోధుమలు” అనేక శతాబ్దాలపాటు అంటే కోతకాలం వచ్చే వరకూ మరుగుచేయబడతారని యేసు ప్రవచించాడు. అపొస్తలుల మరణం తర్వాత ఆ ప్రవచనం నెరవేరింది.​—⁠మత్తయి 13:24-39.

నేటి త్వరిత పెరుగుదల

4 1919వ సంవత్సరంలో గురుగుల నుండి స్వచ్ఛమైన క్రైస్తవ గోధుమలను వేరుచేయవలసిన సమయం వచ్చింది. యేసు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ ఇంకా అనువర్తిస్తుందని అభిషిక్త క్రైస్తవులకు తెలుసు. తాము “అంత్యదినములలో” జీవిస్తున్నామని వాళ్ళు బలంగా నమ్మారు, అలాగే వాళ్ళకి యేసుచెప్పిన ఈ ప్రవచనమూ తెలుసు: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.” (2 తిమోతి 3:1; మత్తయి 24:​14) అవును, ఇంకా చాలా పని జరగవలసి ఉందని వాళ్ళకు తెలుసు.

5 అయితే సా.శ. 33లో శిష్యుల మాదిరిగానే ఆ అభిషిక్త క్రైస్తవులు కూడా ఒక పెద్ద సవాలు ఎదుర్కొన్నారు. వాళ్ళు కేవలం కొన్ని వేలమంది, కొన్ని దేశాల్లో మాత్రమే ఉన్నారు. వాళ్ళు సువార్తను “లోకమందంతట” ఎలా ప్రకటించగలరు? కైసరు కాలంలో బహుశా 30 కోట్లున్న ప్రపంచ జనాభా మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత దాదాపు 200 కోట్లకు చేరుకుందని గుర్తుంచుకోవాలి. 20వ శతాబ్దమంతటిలో అది త్వరిత గతిన పెరుగుతూనే ఉంటుంది.

6 అయినప్పటికీ యెహోవా అభిషిక్త సేవకులు, తమ మొదటి శతాబ్దపు సహోదరులవలే, యెహోవాపై పూర్తి విశ్వాసముంచి తమ ముందున్న పనిని చేయడం ప్రారంభించారు, ఆయన ఆత్మ వారికి తోడయ్యింది. 1930వ దశాబ్దపు మధ్యకాలానికల్లా దాదాపు 56,000 మంది సువార్తికులు 115 దేశాల్లో బైబిలు సత్యాన్ని ప్రకటించారు. అప్పటికే చాలా పని చేయబడింది, అయితే దానికంటే ఇంకా ఎక్కువ పని మిగిలివుంది.

7 ఆ తర్వాత, ప్రకటన 7:9వ వచనంలో ప్రస్తావించబడిన “గొప్ప సమూహము” గుర్తింపును లోతుగా అర్థం చేసుకోవడం ఓ కొత్త సవాలు తీసుకు రావడమే కాక కష్టపడి పనిచేస్తున్న క్రైస్తవులకు సహాయం లభిస్తుందనే వాగ్దానం కూడా చేసింది. “వేరే గొఱ్ఱెల” సమూహానికి చెందిన భూ నిరీక్షణగల అసంఖ్యాక విశ్వాసులను “ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలో నుండియు” సమకూర్చాలి. (యోహాను 10:​16) అలా సమకూర్చబడినవారు యెహోవాకు “రాత్రింబగళ్లు” సేవచేస్తారు. (ప్రకటన 7:​15) అంటే వాళ్ళు ప్రకటనా పనిలో, బోధనా పనిలో సహాయం చేస్తారు. (యెషయా 61:⁠5) తత్ఫలితంగా సువార్తికుల సంఖ్య వేలకు పెరిగి, ఆ తర్వాత లక్షలకు చేరుకోవడం చూసి అభిషిక్త క్రైస్తవులు పులకించిపోయారు. 2003వ సంవత్సరంలో ఓ కొత్త శిఖరాగ్ర సంఖ్యగా 64,29,351 మంది ప్రకటనా పనిలో భాగం వహించారు​—⁠వారిలో అత్యధికులు గొప్ప సమూహానికి చెందినవారే. * గొప్ప సమూహానికి చెందినవారు అందిస్తున్న ఈ సహాయానికి అభిషిక్త క్రైస్తవులు కృతజ్ఞత కలిగివుండగా, తమ అభిషిక్త సహోదరులకు మద్దతునిచ్చే ఆధిక్యత లభించినందుకు వేరే గొఱ్ఱెలు కృతజ్ఞతతో ఉన్నారు.​—⁠మత్తయి 25:34-40.

8 గోధుమల తరగతివారు మరోసారి స్పష్టంగా కనిపించడం ప్రారంభమైనప్పుడు, సాతాను వారికి వ్యతిరేకంగా తీవ్రమైన యుద్ధం ఆరంభించాడు. (ప్రకటన 12:​17) గొప్ప సమూహం గుర్తించబడినప్పుడు అతను ఎలా ప్రతిస్పందించాడు? తీవ్రమైన హింసతో! రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో సత్యారాధనపై జరిగిన ప్రపంచవ్యాప్త దాడి వెనుక అతను ఉన్నాడనడంలో సందేహముందా? ఆ యుద్ధకాలంలో రెండు వైపులా క్రైస్తవులు తీవ్రమైన ఒత్తిడికి గురయ్యారు. చాలామంది సహోదరసహోదరీలు ఘోరమైన కష్టాలను అనుభవించారు, కొంతమంది తమ విశ్వాసం కోసం మరణించారు. అయినప్పటికీ వాళ్ళు కీర్తనకర్త మాటలను ప్రతిధ్వనింపజేశారు: “దేవునిబట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను దేవునియందు నమ్మికయుంచి యున్నాను నేను భయపడను శరీరధారులు నన్నేమి చేయగలరు?” (కీర్తన 56:4; మత్తయి 10:​28) యెహోవా ఆత్మచే బలపరచబడిన అభిషిక్త క్రైస్తవులు మరియు వేరే గొఱ్ఱెలు స్థిరంగా నిలబడ్డారు. (2 కొరింథీయులు 4:⁠7) తత్ఫలితంగా ‘దేవుని వాక్యము ప్రబలమైంది.’ (అపొస్తలుల కార్యములు 6:⁠7) 1939వ సంవత్సరంలో యుద్ధం ప్రారంభమైనప్పుడు, 72,475 మంది నమ్మకమైన క్రైస్తవులు ప్రకటనా పనిలో భాగం వహించినట్లు నివేదించారు. అయితే యుద్ధం ముగిసిన 1945 వ సంవత్సరపు అసంపూర్ణ నివేదిక, 1,56,299 మంది చురుకైన సాక్షులు సువార్తను ప్రకటించారని వెల్లడిచేసింది. సాతాను ఎంత ఘోరంగా ఓడిపోయాడో కదా!

9 రెండవ ప్రపంచ యుద్ధం సృష్టించిన గందరగోళం, ప్రకటనా పని జరుగుతుందా అని యెహోవాసాక్షులు సందేహించేలా చేయలేదని స్పష్టమవుతోంది. నిజానికి, 1943లో యుద్ధం తారస్థాయిలో సాగుతున్నప్పుడు, రెండు కొత్త పాఠశాలలు ప్రారంభించబడ్డాయి. వాటిలో ఒకటి, ఇప్పుడు దైవపరిపాలనా పరిచర్య పాఠశాల అని పిలువబడుతున్న పాఠశాల, ప్రకటనా పని చేయడానికి శిష్యులను చేయడానికి సాక్షులకు శిక్షణనిచ్చేందుకు అన్ని సంఘాల్లోను నిర్వహించడానికి అది రూపొందించబడింది. మరొకటి, వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ అనే పాఠశాల, విదేశాల్లో ప్రకటనా పనిని పురోగమింపజేసేలా మిషనరీలకు శిక్షణనిచ్చేందుకు ఆ పాఠశాల ప్రారంభించబడింది. అవును, యుద్ధం ముగిసేనాటికి నిజ క్రైస్తవులు తమ కార్యకలాపాలను అధికం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.

10 వాళ్ళు ఎంత అద్భుతంగా పని చేశారో! దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో శిక్షణ పొందిన యౌవనులు, వృద్ధులు, తల్లిదండ్రులు, పిల్లలు, శారీరకంగా బలహీనులైనవారు కూడా యేసు ఇచ్చిన గొప్ప ఆజ్ఞను నెరవేర్చడంలో భాగం వహించారు, ఇప్పటికీ భాగం వహిస్తున్నారు. (కీర్తన 148:12, 13; యోవేలు 2:​28, 29) 2003వ సంవత్సరంలో ప్రతీ నెల సగటున 8,25,185 మంది తాత్కాలికంగా లేదా క్రమంగా పయినీరు సేవ చేయడం ద్వారా తమకున్న అత్యవసర భావాన్ని ప్రదర్శించారు. అదే సంవత్సరంలో యెహోవాసాక్షులు ఇతరులతో రాజ్య సువార్త గురించి మాట్లాడుతూ 123,47,96,477 గంటలు గడిపారు. తన ప్రజల ఆసక్తిని బట్టి యెహోవా సంతోషిస్తున్నాడనడంలో సందేహం లేదు!

విదేశాల్లో

11 గిలియడ్‌ స్కూల్‌ నుండి ఉత్తీర్ణులైనవారు, అంతేకాక ఇటీవలి సంవత్సరాల్లో నిర్వహించబడుతోన్న మినిస్టీరియల్‌ ట్రైనింగ్‌ స్కూల్‌ నుండి ఉత్తీర్ణులైనవారు గడిచిన సంవత్సరాల్లో చక్కని రికార్డును స్థాపించారు. ఉదాహరణకు బ్రెజిల్‌లో, 1945లో మొదటి మిషనరీలు చేరుకున్నప్పుడు అక్కడ 400 కంటే తక్కువమంది ప్రచారకులు ఉన్నారు. ఆ మిషనరీలు, వారి తర్వాత అక్కడకు వెళ్ళిన మిషనరీలు, అత్యంతాసక్తిగల బ్రెజిలియన్‌ సహోదరులతో కలిసి కష్టపడి పనిచేశారు, యెహోవా వారి కృషిని ఎంతగానో ఆశీర్వదించాడు. ఆ తొలి రోజులు గుర్తున్నవారెవరైనా 2003లో బ్రెజిల్‌ రిపోర్టు చేసిన కొత్త శిఖరాగ్ర సంఖ్య అయిన 6,07,362 చూసి ఎంత పులకించిపోతారో కదా!

12 జపాన్‌ విషయం పరిశీలించండి. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు ఆ దేశంలో దాదాపు వందమంది రాజ్య ప్రచారకులు ఉన్నారు. యుద్ధ సమయంలో ఎదురైన ఘోరమైన హింస ప్రచారకుల సంఖ్యను తగ్గించి వేసింది, యుద్ధం ముగిసే సమయానికి అక్కడ కేవలం కొంతమంది సాక్షులు మాత్రమే శారీరకంగా మరియు ఆధ్యాత్మికంగా సజీవంగా ఉన్నారు. (సామెతలు 14:​32) తమ యథార్థతను కాపాడుకొన్న మెచ్చుకోదగిన ఆ కొంతమంది సహోదరులు 1949లో మొదటి 13 మంది గిలియడ్‌ శిక్షణపొందిన మిషనరీలను ఆహ్వానించడానికి సంతోషించారనడంలో సందేహం లేదు, కొంతకాలానికే ఆ మిషనరీలు ఉత్సాహవంతులూ, ఆతిథ్యమిచ్చే గుణంగలవారూ అయిన జపనీస్‌ సహోదరులపై ప్రేమ పెంచుకున్నారు. 50 కంటే ఎక్కువ సంవత్సరాలు గడిచేసరికి అంటే 2003వ సంవత్సరంలో జపాన్‌ శిఖరాగ్ర సంఖ్య అయిన 2,17,508 మంది ప్రచారకులను రిపోర్టు చేసింది! ఆ దేశంలో యెహోవా నిజంగా తన ప్రజలను మెండుగా ఆశీర్వదించాడు. అనేక ఇతర దేశాల నుండి కూడా అలాంటి రిపోర్టులే వచ్చాయి. విదేశాల్లో ప్రకటించగలిగిన వారు సువార్తను విస్తరింపజేయడంలో ప్రాముఖ్యమైన పాత్రను పోషించారు కాబట్టి 2003వ సంవత్సరంలో సువార్త ప్రపంచవ్యాప్తంగా 235 దేశాల్లో, ద్వీపాల్లో, ప్రాంతాల్లో మారుమ్రోగింది. అవును గొప్ప సమూహము “ప్రతి జనములోనుండి” సమకూర్చబడుతోంది.

“ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలో నుండియు”

13 సా.శ. 33 పెంతెకొస్తు రోజున శిష్యులపై పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన తర్వాత జరిగిందని నివేదించబడిన మొదటి అద్భుతం, అక్కడ సమకూడిన జన సమూహంతో శిష్యులు వేర్వేరు భాషల్లో మాట్లాడడం. అక్కడ సమకూడిన వారందరికీ అప్పటి అంతర్జాతీయ భాష అంటే బహుశా గ్రీకు భాష తెలిసివుండవచ్చు. వాళ్ళు “భక్తిగల” పురుషులు కాబట్టి ఆలయ సేవల సంబంధంగా మాట్లాడే హీబ్రూ భాష కూడా వాళ్లకు తెలిసివుంటుంది. అయితే తాము చిన్నప్పటి నుండి నేర్చుకున్న భాషలో సువార్తను విన్నప్పుడు వాళ్ళు ఎంతగానో కదిలించబడ్డారు.​—⁠అపొస్తలుల కార్యములు 2:5, 7-12.

14 నేడు కూడా ప్రకటనా పనిలో ఎన్నో భాషలు ఉపయోగించబడుతున్నాయి. గొప్ప సమూహానికి చెందినవారు ప్రతి జనములోనుండే కాక “ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలో నుండియు” వస్తారని ప్రవచించబడింది. దానికి అనుగుణంగా యెహోవా జెకర్యా ద్వారా ఇలా ప్రవచించాడు: “ఆ యా భాషలు మాటలాడు అన్యజనులలో పదేసిమంది యొక యూదుని చెంగుపట్టుకొని—దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతోకూడ వత్తుమని చెప్పుదురు.” (ఇటాలిక్కులు మావి.) (జెకర్యా 8:​23) యెహోవాసాక్షులకు వేర్వేరు భాషల్లో మాట్లాడే అద్భుత శక్తి లేకపోయినా, ప్రజలకు తమ స్వంత భాషలో నేర్పించడంలోవున్న విలువ వాళ్ళకు తెలుసు.

15 నిజమే, నేడు ఆంగ్లం, ఫ్రెంచ్‌, స్పానిష్‌ వంటి విస్తృతంగా ఉపయోగించబడే భాషలు కొన్ని ఉన్నాయి. అయితే, ఇతర దేశాల్లో సేవ చేయడానికి తమ స్వదేశాలను విడిచిపెట్టిన సహోదరులు, “నిత్యజీవం పట్ల సరైన మానసిక వైఖరిగల”వారికి సువార్త మరింత అర్థవంతంగా ఉండేందుకు స్థానిక భాషలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. (అపొస్తలుల కార్యములు 13:​48, NW) అది కష్టంగా ఉండవచ్చు. దక్షిణ పసిఫిక్‌ ద్వీపమైన టువాలులోని సహోదరులకు తమ స్వంత భాషలో ప్రచురణలు కావలసి వచ్చినప్పుడు, ఒక మిషనరీ ఆ పనిని చేపట్టాడు. ఆ భాషలో నిఘంటువు లేదు కాబట్టి ఆయన టువాలువన్‌ భాషా పదాల సంకలనం కూర్చడం ప్రారంభించాడు. కొంతకాలానికి మీరు పరదైసు భూమిపై నిరంతరం జీవించగలరు * పుస్తకం టువాలువన్‌ భాషలో ప్రచురించబడింది. మిషనరీలు కురాసోవ్‌కు చేరుకున్నప్పుడు, స్థానిక భాష అయిన పాపియామెంటోలో బైబిలు ప్రచురణలు గానీ నిఘంటువు గానీ లేవు. ఆ భాష ఎలా వ్రాయబడాలి అనే విషయంపై ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉండేవి. అయినప్పటికీ మొదటి మిషనరీలు అక్కడకు చేరుకున్న రెండు సంవత్సరాల తర్వాత ఆ భాషలో మొదటి క్రైస్తవ బైబిలు కరపత్రం ప్రచురించబడింది. నేడు, కావలికోట పత్రిక ఆంగ్లంతోపాటు ఏకకాలంలో ప్రచురించబడుతున్న 133 భాషల్లో పాపియామెంటో కూడా ఒకటి.

16 నమీబియాకు వెళ్ళిన మొదటి మిషనరీలకు, అక్కడి భాషలో అనువదించేందుకు తమకు సహాయం చేయడానికి స్థానిక సాక్షి ఎవ్వరూ అక్కడలేరు. అంతేకాక, ఒక స్థానిక భాష అయిన నామాలో, మనం సాధారణంగా ఉపయోగించే “పరిపూర్ణం” అనే భావాలను వ్యక్తంచేయడానికి పదాలు లేవు. ఒక మిషనరీ ఇలా చెప్పాడు: “అనువదించడానికి నేను ప్రాముఖ్యంగా బైబిలును అధ్యయనం చేస్తున్న పాఠశాల ఉపాధ్యాయులను ఉపయోగించాను. వాళ్ళకు సత్యం గురించి అంత ఎక్కువగా తెలియదు కాబట్టి నేను వారితోపాటు కూర్చొని ప్రతి వాక్యం ఖచ్చితంగా అనువదించబడేలా చూడాల్సి వచ్చింది.” చివరకు నూతనలోకంలో జీవితం అనే కరపత్రం నాలుగు నమీబియన్‌ భాషల్లోకి అనువదించబడింది. నేడు క్వనియామా మరియు డోంగా భాషల్లో కావలికోట పత్రిక క్రమంగా ప్రచురించబడుతోంది.

17 మెక్సికోలో ముఖ్య భాష స్పానిష్‌. అయితే స్పెయిన్‌ జాతీయులు అక్కడకు చేరుకోకముందు, అక్కడ అనేక భాషలు వాడుకలో ఉండేవి, వాటిలో చాలా భాషలు ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి. కాబట్టి యెహోవాసాక్షుల ప్రచురణలు ఇప్పుడు ఏడు మెక్సికన్‌ భాషల్లోనే కాక మెక్సికన్‌ సంజ్ఞా భాషలో కూడా ఉత్పత్తి చేయబడుతున్నాయి. అమెరికన్‌ ఇండియన్‌ భాషలో క్రమంగా ప్రచురించబడుతున్న మొదటి ప్రచురణ మాయా భాషలోని మన రాజ్య పరిచర్య. నిజానికి, మెక్సికోలోని 5,72,530 రాజ్య ప్రచారకుల్లో ఎన్నో వేలమంది మాయా భాష మాట్లాడేవారు, అజ్‌టెక్‌లు ఉన్నారు.

18 ఇటీవలి కాలాల్లో, లక్షలాదిమంది శరణార్థులుగా విదేశాలకు పారిపోయారు లేదా ఆర్థిక కారణాలను బట్టి వలస వెళ్ళారు. తత్ఫలితంగా ఇప్పుడు మొదటిసారిగా చాలా దేశాల్లో, విదేశీ భాషలు మాట్లాడే ప్రజల సంఖ్య ఎక్కువగా ఉంది. యెహోవాసాక్షులు ఈ సవాలును కూడా స్వీకరించారు. ఉదాహరణకు ఇటలీలో, ఇటాలియన్‌ భాషకు సంబంధించినవి కాక 22 వేర్వేరు భాషలకు సంబంధించిన సంఘాలు, గుంపులు ఉన్నాయి. ఇతర భాషలు మాట్లాడే ప్రజలకు ప్రకటించడానికి సహోదరులకు సహాయం చేసేందుకు, ఇటీవల ఇటాలియన్‌ సంజ్ఞా భాషతోపాటు 16 భాషలు నేర్పించడానికి విద్యాకోర్సులు వ్యవస్థీకరించబడ్డాయి. అనేక ఇతర దేశాల్లోని యెహోవాసాక్షులు వలస వచ్చిన అనేకమంది ప్రజలకు సువార్త ప్రకటించడానికి అలాంటి ప్రయత్నాలే చేస్తున్నారు. అవును యెహోవా సహాయంతో గొప్ప సమూహం నిజంగానే అనేక భాషా గుంపుల నుండి సమకూర్చబడుతోంది.

“భూలోకమందంతటికి”

19 మొదటి శతాబ్దంలో అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “వారు వినలేదా? విన్నారు గదా? వారి స్వరము భూలోకమందంతటికిని, వారిమాటలు భూదిగంతములవరకును బయలువెళ్లెను.” (రోమీయులు 10:​18) ఆ మాటలు మొదటి శతాబ్దంలోనే నిజమైతే, మన కాలంలో అవి ఇంకెంత నిజమో కదా! లక్షలాదిమంది, బహుశా చరిత్రలో మునుపెన్నడూ లేనంత ఎక్కువమంది, ఇలా అంటున్నారు: “నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును.”​—⁠కీర్తన 34:⁠1.

20 అంతేకాక, ఆ పని మందకోడిగా సాగడం లేదు. రాజ్య ప్రచారకుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రకటనా పని కోసం అంతకంతకూ ఎక్కువ సమయం వెచ్చించబడుతోంది. కోట్లకొలది పునర్దర్శనాలు చేయబడుతున్నాయి, లక్షలసంఖ్యలో బైబిలు అధ్యయనాలు నిర్వహించబడుతున్నాయి. కొత్తవాళ్ళు ఆసక్తి చూపిస్తూనే ఉన్నారు. గత సంవత్సరం, కొత్త శిఖరాగ్ర సంఖ్యగా 1,60,97,622 మంది యేసు మరణ జ్ఞాపకార్థదిన ఆచరణకు హాజరయ్యారు. కాబట్టి చేయవలసిన పని ఇంకా చాలావుందని స్పష్టమవుతోంది. తీవ్రమైన హింసను సహించిన మన సహోదరుల స్థిరమైన యథార్థతను అనుకరించడంలో మనం కొనసాగుదుము గాక. 1919 నుండి యెహోవా సేవ కోసం తమ జీవితాలను అంకితంచేసిన సహోదరుల ఆసక్తిని మనం ప్రదర్శిద్దాము. అందరం కీర్తనకర్త మాటలను ప్రతిధ్వనించడంలో కలిసి కొనసాగుదాం: “సకలప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక యెహోవాను స్తుతించుడి.”​—⁠కీర్తన 150:⁠6.

[అధస్సూచీలు]

^ పేరా 10 ఈ పత్రికలోని 18 నుండి 21 పేజీల్లోవున్న వార్షిక నివేదికను చూడండి.

^ పేరా 20 యెహోవాసాక్షులు ప్రచురించినది.

మీరు వివరించగలరా?

• 1919లో మన సహోదరులు ఏ పనిని చేపట్టారు, అది వారికెందుకు సవాలుగా ఉండింది?

• ప్రకటనా పనికి మద్దతునివ్వడానికి ఎవరు సమకూర్చబడ్డారు?

• విదేశాల్లో సేవచేస్తున్న మిషనరీలు మరియు ఇతరులు ఎలాంటి రికార్డు స్థాపించారు?

• నేడు యెహోవా ప్రజలు చేస్తున్న పనిపై ఆయన ఆశీర్వాదం ఉందని చూపించడానికి మీరు ఎలాంటి రుజువు ఇవ్వగలరు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. (ఎ) యేసు తన శిష్యులకు ఏ ఆజ్ఞ ఇచ్చాడు? (బి) మొదటి శతాబ్దపు క్రైస్తవులు అంత ఎక్కువ పని ఎలా సాధించగలిగారు?

3. స్వచ్ఛమైన క్రైస్తవ “గోధుమలు” కనిపించకుండా వాటిని ఏవి మరుగుచేశాయి?

4, 5. అభిషిక్త క్రైస్తవులు 1919 మొదలుకొని ఏ పని చేయడం ప్రారంభించారు, అది వారికి ఒక గొప్ప సవాలుగా ఎందుకుంది?

6. 1930లకల్లా అభిషిక్త క్రైస్తవులు ఎంతమేరకు సువార్తను విస్తరింపజేశారు?

7. (ఎ) అభిషిక్త క్రైస్తవులు ఏ కొత్త సవాలును ఎదుర్కొన్నారు? (బి) “వేరే గొఱ్ఱెల” మద్దతుతో, సమకూర్చే పని ప్రస్తుతం ఎంతమేరకు వృద్ధి చెందింది?

8. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో యెహోవాసాక్షులపై తీసుకురాబడిన తీవ్రమైన ఒత్తిళ్ళకు వాళ్ళు ఎలా ప్రతిస్పందించారు?

9. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతుండగా ఏ కొత్త పాఠశాలలు ప్రారంభించబడ్డాయి?

10. యెహోవా ప్రజల ఆసక్తి 2003వ సంవత్సరంలో ఎలా చూపించబడింది?

11, 12. మిషనరీల చక్కని రికార్డును ఏ ఉదాహరణలు ప్రదర్శిస్తున్నాయి?

13, 14. సువార్తను ‘ఆ యా భాషల్లో’ ప్రకటించడానికివున్న విలువను యెహోవా ఎలా చూపించాడు?

15, 16. మిషనరీలు మరియు ఇతరులు, స్థానిక భాషల్లో ప్రకటించే సవాలును ఎలా స్వీకరించారు?

17, 18. మెక్సికోలో మరియు ఇతర దేశాల్లో ఎలాంటి సవాళ్ళు స్వీకరించబడుతున్నాయి?

19, 20. పౌలు చెప్పిన ఏ మాటలు నేడు గమనార్హమైన విధంగా నెరవేర్చబడుతున్నాయి? వివరించండి.

[18-21వ పేజీలోని చార్టు]

ప్రపంచవ్యాప్త యెహోవాసాక్షుల 2003వ సేవా సంవత్సరపు నివేదిక

(బౌండ్‌ వాల్యూమ్‌ చూడండి)

[14, 15వ పేజీలోని చిత్రాలు]

రెండవ ప్రపంచ యుద్ధం సృష్టించిన గందరగోళం కారణంగా, సువార్త ప్రకటించబడుతుందా లేదా అని క్రైస్తవులు సందేహించలేదు

[చిత్రసౌజన్యం]

విస్ఫోటనం: U.S. Navy photo; others: U.S. Coast Guard photo

[16, 17వ పేజీలోని చిత్రాలు]

గొప్ప సమూహం ప్రతి వంశంలో నుండి, ఆ యా భాషలు మాట్లాడేవారి నుండి వస్తుంది