“అపూర్వ ఇంజనీరింగ్ కార్యాల్లో ఇదొకటి”
“అపూర్వ ఇంజనీరింగ్ కార్యాల్లో ఇదొకటి”
దాదాపు 3,000 సంవత్సరాల క్రితం సొలొమోను రాజు పరిపాలనలో యెరూషలేములో యెహోవా ఆలయం నిర్మించబడినప్పుడు, నీళ్లు నిలువజేయడానికి ఇత్తడితో చూడ ముచ్చటైన ఓ పెద్ద బేసిన్ తయారుచేయబడి ఆలయ ముఖద్వారం వెలుపల ఉంచబడింది. 30 టన్నుల బరువుండే ఆ పెద్ద బేసిన్‌లో 40,000 లీటర్ల నీరు పట్టేది. ఈ పెద్ద బేసిన్ సముద్రమని పిలువబడేది. (1 రాజులు 7:23-26) నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ కెనడాలో మాజీ సాంకేతిక అధికారియైన ఆల్‌బర్ట్ జాయిడోఫ్, బిబ్లికల్ ఆర్కియాలజిస్ట్ అనే పుస్తకంలో ఇలా చెబుతున్నాడు: “హీబ్రూ జనాంగంలో చేపట్టబడిన అపూర్వ ఇంజనీరింగ్ కార్యాల్లో ఇదొకటి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.”
ఆ సముద్రం ఎలా తయారుచేయబడింది? “యొర్దాను మైదానమందు . . . జిగట భూమియందు రాజు వాటిని [ఇత్తడి పాత్రలను] పోతపోయించెను” అని బైబిలు చెబుతోంది. (1 రాజులు 7:45, 46) ఆ పోతవిధానం పెద్దకంచు గంటలు తయారుచేయడానికి ఇప్పటికీ ఉపయోగించబడుతోన్న ‘లాస్ట్ వేక్స్’ పద్ధతికి పోలివుండవచ్చు” అని జాయిడోఫ్ చెబుతున్నారు. ఆయన ఇలా వివరిస్తున్నారు: “ప్రాథమికంగా దీనిలో బాగా ఆరిన మట్టిదిమ్మపై తలక్రిందులుగా ఆ సముద్రపు ఆకారంలో మైనపు అచ్చు తయారుచేయబడుతుంది. . . . ఇది పూర్తయిన తర్వాత పోతపోసేవారు ఆ మైనపు అచ్చుమీద మరో మట్టిదిమ్మను తయారుచేసి ఆరబెడతారు. అది ఆరిన తర్వాత చివరిగా లోపలి మైనపు అచ్చు కరిగి బయటకు వచ్చేలా వేడిచేసి, ఆ ఖాళీనిండేలా కరిగించిన ఇత్తడి పోస్తారు.”
విస్తారమైన పరిమాణంగల, ఎంతో బరువున్న ఆ సముద్రాన్ని తయారుచేయడానికి ఎంతో ప్రావీణ్యం కావాలి. లోపలా బయటా మట్టితోచేసిన దిమ్మలు 30 టన్నుల కరిగిన ఇత్తడి కలిగించే ఒత్తిడిని తట్టుకోవాలి, అలాగే పగుళ్లు లేదా ఇతర లోపాలు రాకుండా కరిగించిన ఆ ఇత్తడిని ధారగా పోస్తూవుండాలి. ఇలా చేయాలంటే కరిగిన లోహాన్ని ఆ అచ్చులో పోయడానికి ఒకదానికి మరొకటి కలిసివుండే బట్టీలు వరుసగా ఉండాలి. అది ఓ బృహత్తర కార్యం!
ఆలయ ప్రారంభోత్సవ ప్రార్థనలో దేవాలయ నిర్మాణంలో చేయబడిన పనంతటికీ యెహోవా దేవునికే ఘనత చెల్లిస్తూ సొలొమోను రాజు ఇలా అన్నాడు: “నీవు చేసిన వాగ్దానమును స్థిరపరచి, నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చియున్నావు.”—1 రాజులు 8:24.