కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆదికాండములోని ముఖ్యాంశాలు—II

ఆదికాండములోని ముఖ్యాంశాలు—II

యెహోవా వాక్యము సజీవమైనది

ఆదికాండములోని ముఖ్యాంశాలు​—⁠II

మొదటి మానవుడైన ఆదాము సృష్టించబడినప్పటి నుండి యాకోబు కుమారుడైన యోసేపు మరణం వరకు, అంటే 2,369 సంవత్సరాల మానవ చరిత్రను ఆదికాండము చూపిస్తోంది. సృష్టి వృత్తాంతం మొదలుకొని బాబెలు గోపురం వరకు జరిగిన సంఘటనలను వివరించిన మొదటి 10 అధ్యాయాలు అలాగే 11వ అధ్యాయంలోని 9 వచనాలు ఈ పత్రిక ముందటి సంచికలో పరిశీలించబడ్డాయి. * ఈ ఆర్టికల్‌ అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపులతో దేవుని వ్యవహారాలకు సంబంధించి ఆదికాండములోని మిగతా భాగంలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తుంది.

అబ్రాహాము దేవుని స్నేహితుడు కావడం

(ఆదికాండము 11:10-23:20)

జలప్రళయం తర్వాత దాదాపు 350 సంవత్సరాలు గడిచాక, నోవహు కుమారుడైన షేము సంతతిలో దేవునికి చాలా ప్రత్యేకమైన వాడని నిరూపించబడిన పురుషుడు జన్మించాడు. ఆయన పేరు అబ్రాము, ఆ తర్వాత ఆయన పేరు అబ్రాహాముగా మార్చబడింది. దేవుని ఆజ్ఞమేరకు అబ్రాము కల్దీయుల పట్టణమైన ఊరును విడిచిపెట్టి, యెహోవా తనకూ తన సంతానానికీ ఇస్తానని వాగ్దానం చేసిన దేశంలో గుడారాల్లో నివసించడం ప్రారంభించాడు. అబ్రాహాము తన విశ్వాసం, విధేయతనుబట్టి ‘యెహోవా స్నేహితుడు’ అని పిలువబడ్డాడు.​—⁠యాకోబు 2:23.

యెహోవా సొదొమలోను దాని చుట్టుపక్కల పట్టణాలలోను నివసించే దుష్ట ప్రజలపై చర్య తీసుకొని, లోతును అతని కుమార్తెలను సజీవంగా కాపాడాడు. అబ్రాహాము కుమారుడు ఇస్సాకు పుట్టుకతో దేవుని వాగ్దానం నెరవేరింది. చాలా సంవత్సరాల తర్వాత, తన కుమారుణ్ణి బలిగా అర్పించమని యెహోవా ఆదేశించినప్పుడు అబ్రాహాము విశ్వాసం పరీక్షించబడింది. అబ్రాహాము ఆ మాటకు లోబడేందుకు సిద్ధపడుతుండగా దేవదూత ఆయనను అడ్డుకొన్నాడు. అబ్రాహాము విశ్వాస పురుషుడనడంలో సందేహం లేదు, అందుకే తన సంతానం ద్వారా సకల జనాంగాలు ఆశీర్వదించబడతాయనే హామీ ఆయనకివ్వబడింది. అబ్రాహాము ప్రియసతి శారా మరణం ఆయనకెంతో దుఃఖాన్ని తీసుకొచ్చింది.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

12:​1-3​—⁠అబ్రాహాము నిబంధన ఎప్పుడు అమల్లోకి వచ్చింది, అది ఎంతకాలం ఉంటుంది? “భూమియొక్క సమస్తవంశములు నీయందు [అబ్రామునందు] ఆశీర్వదించబడునని” యెహోవా అబ్రాముతో చేసిన నిబంధన, అబ్రాము కనానుకువెళ్లే దారిలో యూఫ్రటీసు నదిని దాటినప్పుడు అమల్లోకి వచ్చివుంటుంది. అది బహుశా సా.శ.పూ. 1943 నీసాను 14న అంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి విడుదల కావడానికి 430 సంవత్సరాలకు పూర్వం కావచ్చు. (నిర్గమకాండము 12:2, 6, 7, 40, 41) అబ్రాహాము నిబంధన ఓ “నిత్యనిబంధన.” భూమ్మీది సమస్త వంశములు ఆశీర్వదించబడి, దేవుని శత్రువులందరూ నాశనమయ్యేంతవరకు అది అమల్లోవుంటుంది.​—⁠ఆదికాండము 17:7; 1 కొరింథీయులు 15:23-26.

15:​13​—⁠అబ్రాహాము సంతానం 400 సంవత్సరాలు బాధలనుభవిస్తారనే ప్రవచనం ఎప్పుడు నెరవేరింది? సా.శ.పూ. 1913లో దాదాపు 5 సంవత్సరాల వయసున్న అబ్రాహాము కుమారుడు ఇస్సాకు పాలు విడిచినప్పుడు 19 సంవత్సరాల అతని అన్న ఇష్మాయేలు అతనిని ‘పరిహసించినప్పుడు’ ఆ బాధలనుభవించే కాలం మొదలయ్యింది. (ఆదికాండము 21:8-14; గలతీయులు 4:​29) అది సా.శ.పూ. 1513లో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాసత్వం నుండి విడుదలైనప్పుడు అంతమయ్యింది.

16:​2​—⁠శారయి తన దాసియైన హాగరును అబ్రాముకు భార్యగా ఇవ్వడం సరైనదేనా? ఆ కాలంలో గొడ్రాలైన భార్య వారసుణ్ణి కనడం కోసం తన భర్తకు ఉపపత్నిని ఏర్పాటు చేయడం వాడుకగా ఉండేది, ఆ వాడుకకు అనుగుణంగానే శారయి అలా చేసింది. బహుభార్యత్వం ఆచరించడం మొట్టమొదట కయీను కుటుంబంలో కనిపిస్తుంది. చివరకు అది ఒక వాడుకగా మారడంవల్ల యెహోవా ఆరాధకుల్లో కొంతమంది కూడా దానిని ఆచరించడం ప్రారంభించారు. (ఆదికాండము 4:17-19; 16:1-3; 29:​21-28) అయితే, ఒక పురుషునికి ఒకే భార్య ఉండాలని తాను చేసిన ప్రాథమిక కట్టడను యెహోవా ఎన్నడూ విడిచిపెట్టలేదు. (ఆదికాండము 2:​21, 22) “ఫలించి అభివృద్ధిపొంది భూమిని నింపుడి” అనే ఆజ్ఞ మళ్ళీ ఇవ్వబడిన నోవహు, అతని కుమారులు ఏకపత్నీ పురుషులే. (ఆదికాండము 7:7; 9:1; 2 పేతురు 2:⁠5) ఒకే భార్యను కలిగివుండాలనే కట్టడను యేసుక్రీస్తు తిరిగి నొక్కిచెప్పాడు.​—⁠మత్తయి 19:4-8; 1 తిమోతి 3:2, 12.

19:​8​—⁠లోతు తన కుమార్తెలను సొదొమీయులకు ఇవ్వాలని చూడడం తప్పుకాదా? ప్రాచ్యదేశ నైతిక సూత్రాల ప్రకారం, అవసరమైతే తన ప్రాణంపోయినా సరే ఇంటిలోని అతిథులను కాపాడడం అతిథేయి కర్తవ్యం. లోతు అలా చేయడానికి సిద్ధపడ్డాడు. ఆయన ధైర్యంగా బయటకు వెళ్ళి, తన వెనకాల తలుపు మూసి, ఆ అల్లరిమూకను ఒంటరిగానే ఎదుర్కొన్నాడు. లోతు తన కుమార్తెలను ఇవ్వాలనుకున్న సమయానికి, తన దగ్గరకొచ్చిన అతిథులు దేవుని వార్తాహరులని బహుశా గుర్తించి, తన చిన్నమ్మ శారాను ఐగుప్తులో కాపాడినట్లే తన కుమార్తెలనూ దేవుడు కాపాడగలడని ఆలోచించి ఉంటాడు. (ఆదికాండము 12:​17-20) లోతు అనుకున్నట్లుగానే జరిగింది, ఆయనా ఆయన కుమార్తెలూ సురక్షితంగా కాపాడబడ్డారు.

19:​30-38​—⁠లోతు తప్పతాగి ఆ తర్వాత తన ఇద్దరు కుమార్తెల ద్వారా కుమారులను కనడాన్ని యెహోవా మన్నించాడా? రక్తసంబంధుల మధ్య లైంగికత్వాన్ని గానీ త్రాగుబోతుతనాన్ని గానీ యెహోవా మన్నించడు. (లేవీయకాండము 18:⁠6, 7, 29; 1 కొరింథీయులు 6:​9, 10) వాస్తవానికి లోతు సొదొమ వాసుల “వికారయుక్తమైన నడవడి” చూసి బాధపడ్డాడు. (2 పేతురు 2:​6-8) లోతు కుమార్తెలు ఆయనకు ద్రాక్షారసము త్రాగించారనే వాస్తవం, ఆయన తెలివితోవుంటే తమతో లైంగిక సంబంధానికి ఒప్పుకోడని వారికి తెలుసు అని సూచిస్తోంది. కానీ వాళ్ళు ఆ దేశంలో పరవాసులు కాబట్టి, లోతు వంశం అంతరించిపోకుండా కాపాడేందుకు ఇదొక్కటే మార్గమని ఆయన కుమార్తెలు భావించారు. అబ్రాహాము వంశస్థులైన ఇశ్రాయేలీయులకు, మోయాబీయులకు (మోయాబు ద్వారా) మరియు అమ్మోనీయులకు (బెన్నమ్మి ద్వారా) ఉన్న సంబంధాన్ని వెల్లడిచేయడానికే ఆ వృత్తాంతం బైబిల్లోవుంది.

మనకు పాఠాలు:

13:​8, 9. భిన్నాభిప్రాయాలతో వ్యవహరించడంలో అబ్రాహాము ఎంతచక్కని మాదిరినుంచాడు! ఆర్థిక లాభంకోసం, వ్యక్తిగత అభిరుచుల కోసం లేదా అహంకారం కారణంగా మనమెన్నటికీ శాంతియుత సంబంధాలను బలిచేయకుండా ఉండాలి.

15:​5, 6. అబ్రాహాము వృద్ధుడవుతున్నా కూడా ఆయనకు కుమారుడు కలుగనప్పుడు ఆయన ఆ విషయం గురించి దేవునితో మాట్లాడాడు. బదులుగా యెహోవా ఆయనకు ఓదార్పుకరమైన హామీ ఇచ్చాడు. దాని ఫలితమేమిటి? అబ్రాహాము ‘యెహోవాను నమ్మాడు.’ మనం ప్రార్థనలో యెహోవా ఎదుట మన హృదయాలు విప్పి, బైబిల్లోని ఆయన ఓదార్పుకరమైన హామీలు అంగీకరించి, ఆయనకు లోబడితే మన విశ్వాసం బలపడుతుంది.

15:​16. అమోరీయులపై (లేదా కనానీయులపై) యెహోవా నాలుగు తరాలవరకు తన తీర్పును నిలిపివుంచాడు. ఎందుకు? ఎందుకంటే ఆయన ఓపికగల దేవుడు. పరిస్థితి మెరుగవుతుందనే ఆశ అడుగంటిపోయేవరకు ఆయన వేచిచూశాడు. యెహోవాలానే మనమూ ఓపిక చూపాలి.

18:​23-33. యెహోవా విచక్షణారహితంగా ప్రజలను నాశనం చేయడు. ఆయన నీతిమంతులను రక్షిస్తాడు.

19:​16. లోతు “తడవు” చేశాడు, కాగా దేవదూతలు ఆయననూ అతని కుటుంబాన్నీ సొదొమ పట్టణంనుండి దాదాపు లాక్కొనివెళ్లారు. దుష్టలోకాంతం కోసం ఎదురుచూస్తుండగా మనం అత్యవసర భావం పోగొట్టుకోకుండా ఉండడం జ్ఞానయుక్తం.

19:​26. లోకంలో మనం విడిచిపెట్టినవాటివైపు ఆకర్షించబడడం లేదా ఆశతో వెనక్కిచూడడం ఎంత తెలివితక్కువ పనో కదా!

యాకోబుకు 12 మంది కుమారులు కలగడం

(ఆదికాండము 24:1-36:43)

అబ్రాహాము యెహోవాపై విశ్వాసమున్న రిబ్కాతో ఇస్సాకు వివాహానికి ఏర్పాటు చేశాడు. ఆమె ఏశావు, యాకోబు అనే కవలలకు జన్మనిచ్చింది. ఏశావు తన జన్మహక్కును తృణీకరించి దానిని యాకోబుకు అమ్ముకున్నాడు, ఆ తర్వాత యాకోబు తన తండ్రి దీవెనలు పొందాడు. యాకోబు పద్దనరాముకు పారిపోయి అక్కడ లేయాను, రాహేలును పెళ్లిచేసుకొని తన కుటుంబంతోపాటు అక్కడినుండి వెళ్లిపోయే ముందు 20 సంవత్సరాలపాటు వారి తండ్రి మందలు కాశాడు. లేయా, రాహేలు, వారి ఇద్దరు దాసీల ద్వారా యాకోబుకు 12 మంది కుమారులు, అలాగే కుమార్తెలు కలిగారు. యాకోబు ఒక దేవదూతతో పెనుగులాడి ఆశీర్వదించబడ్డాడు, అలా ఆయన పేరు ఇశ్రాయేలుగా మార్చబడింది.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

28:​12, 13​—⁠యాకోబుకు కలలో ఒక “నిచ్చెన” కనిపించింది, ఆ కల ప్రధాన భావమేమిటి? బహుశ పేర్చిన రాతిమెట్లవలే కనబడిన ఈ “నిచ్చెన” భూమికి పరలోకానికి మధ్య సమాచార సంబంధముందని సూచిస్తోంది. దానిపై దేవదూతలు ఎక్కడం దిగడం, యెహోవాకు ఆయన ఆమోదంగల మానవులకు మధ్య ఏదో ప్రాముఖ్యమైన రీతిలో దేవదూతలు పరిచర్య చేస్తారు అని చూపిస్తోంది.​—⁠యోహాను 1:51.

30:​14, 15​—⁠పుత్రదాతవృక్షపు పండ్లకోసం రాహేలు గర్భధారణా అవకాశాన్ని ఎందుకు వదులుకుంది? ప్రాచీన కాలాల్లో పుత్రదాతవృక్ష పండ్లు బాధనివారణకు, కండరాల బిగువును సడలించడానికి లేదా నొప్పి తగ్గించడానికి మందుగా ఉపయోగించబడేవి. ఆ పండ్లకు లైంగిక కోరికను అధికంచేసే సామర్థ్యం ఉందనీ, మానవుల్లో సంతాన సాఫల్యాన్ని వృద్ధిచేస్తుందనీ లేదా గర్భధారణకు సహాయంచేస్తుందనీ కూడా నమ్మబడేది. (పరమగీతము 7:​13) పుత్రదాతవృక్ష పండ్ల కోసం రాహేలు తన భర్తతో శయనించే అవకాశాన్ని వదులుకోవడంలో ఆమె ఉద్దేశమేమిటో బైబిలు వెల్లడించడం లేదు, అయితే పుత్రదాతవృక్ష పండ్లు తాను గర్భం ధరించడానికీ తాను గొడ్రాలనే నింద తొలగిపోవడానికీ సహాయం చేస్తాయని ఆమె తలంచివుండవచ్చు. ఏదేమైనా, కొన్ని సంవత్సరాల తర్వాతే యెహోవా ఆమె ‘గర్భము తెరిచాడు.’​—⁠ఆదికాండము 30:22-24.

మనకు పాఠాలు:

25:​23. ఇంకా జన్మించని శిశువు జన్యు విధానాన్ని కనిపెట్టి, తన భవిష్య జ్ఞానం ఉపయోగిస్తూ తన సంకల్ప నెరవేర్పు కోసం తాను ఎంపిక చేసుకునే వ్యక్తిని ముందే నిర్ణయించగల సామర్థ్యం యెహోవాకు ఉంది. అయినప్పటికీ, ఆయా వ్యక్తుల కడవరి ప్రారబ్ధాన్ని ఆయన ముందే తీర్మానించడు.​—⁠హోషేయ 12:3; రోమీయులు 9:10-12.

25:​32, 33; 32:​24-29. జన్మహక్కు సంపాదించడంలో యాకోబుకున్న చింత, ఒక ఆశీర్వాదం కోసం రాత్రంతా దేవదూతతో పెనుగులాడడం ఆయన నిజంగా పవిత్ర సంగతులను విలువైనవిగా పరిగణించాడని చూపిస్తున్నాయి. యెహోవా మనకు కూడా అనేక పవిత్ర సంగతులను అంటే ఆయనతో ఆయన సంస్థతో సంబంధం కలిగివుండడం, విమోచన క్రయధనం, బైబిలు, రాజ్య నిరీక్షణ వంటిని దయచేశాడు. వాటిని విలువైనవిగా పరిగణించడంలో మనమూ యాకోబులాగే ఉన్నామని నిరూపించుకుందాం.

34:​1, 30. యెహోవాను ప్రేమించని ప్రజలను దీనా తన స్నేహితులుగా చేసుకోవడంతో యాకోబు ‘బాధలు’ ప్రారంభమయ్యాయి. మనం జ్ఞానయుక్తంగా మన సహవాసులను ఎంచుకోవాలి.

యెహోవా యోసేపును ఐగుప్తులో ఆశీర్వదించడం

(ఆదికాండము 37:1-50:26)

యాకోబు కుమారులు ఈర్ష్యచే ప్రేరేపించబడి తమ సోదరుడైన యాకోబును దాసునిగా అమ్మివేశారు. ఐగుప్తులో యోసేపు దేవుని నైతిక ప్రమాణాలకు నమ్మకంగా, ధైర్యంగా కట్టుబడి ఉన్నందుకు చెరసాల పాలయ్యాడు. తగిన కాలంలో ఆయన ఫరో కలల భావం చెప్పడానికి చెరసాలనుండి విముక్తుడయ్యాడు, ఆ కలలు సమృద్ధిగా ఉండే ఏడు సంవత్సరాలను వాటి తర్వాతవచ్చే ఏడు కరవు సంవత్సరాలను ముందుగానే సూచించాయి. అలా యోసేపు ఐగుప్తులో ఆహార నిర్వాహకుడయ్యాడు. కరవు కారణంగా ఆయన సహోదరులు ఆహారంకోసం ఐగుప్తుకు వచ్చారు. వారి కుటుంబమంతా మళ్లీ కలుసుకొని సారవంతమైన గోషెను ప్రాంతంలో స్థిరపడ్డారు. యాకోబు తన మరణానికి ముందు తన కుమారులను ఆశీర్వదించి రానున్న శతాబ్దాల్లో గొప్ప ఆశీర్వాదాలు కలుగుతాయనే నిశ్చయమైన నిరీక్షణనిచ్చే ప్రవచనం ప్రకటించాడు. సమాధికోసం యాకోబు శరీరం కనానుకు తీసుకెళ్లబడింది. యోసేపు తన 110వ యేట మరణించినప్పుడు ఆయన శరీరం భద్రపరచబడి, చివరకు వాగ్దానదేశానికి తరలించబడింది.​—⁠నిర్గమకాండము 13:19.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

43:​32​—⁠హెబ్రీయులతో కలిసి భోజనం చేయడం ఐగుప్తీయులకు ఎందుకు హేయము? ఇది ఎక్కువగా మత వివక్ష లేదా జాత్యహంకారం కారణంగా కావచ్చు. ఐగుప్తీయులు గొల్లల్ని సైతం అసహ్యించుకునేవారు. (ఆదికాండము 46:​34) ఎందుకు? గొల్లలు బహుశా ఐగుప్తు కులవ్యవస్థలో అట్టడుగు స్థాయిలో ఉండవచ్చు. లేదా సేద్యం చేసుకోవడానికి స్థలం తక్కువగా ఉండడంవల్ల, తమ మందల కోసం పచ్చికను వెదికేవారిని ఐగుప్తీయులు తృణీకరిస్తుండవచ్చు.

44:​5​—⁠శకునము చూడ్డానికి యోసేపు నిజంగా ఓ గిన్నె ఉపయోగించాడా? ఆ వెండి గిన్నె, దాని గురించి చెప్పబడింది యోసేపు ఉపయోగించిన పథకంలోని ఒక భాగమని స్పష్టమవుతోంది. యోసేపు యెహోవాకు నమ్మకమైన ఆరాధకుడు. నిజానికి బెన్యామీను ఆ గిన్నెను దొంగిలించలేదు, అలాగే యోసేపు దానిని శకునం చూడడానికి ఉపయోగించలేదు.

49:​10​—⁠“దండము,” “రాజదండము” వీటి భావమేమిటి? దండము ఓ పరిపాలకుడు తన రాజరిక అధికారానికి సూచనగా ఉపయోగించే కర్ర. రాజదండము అతని ఆజ్ఞాధికారాన్ని సూచించే పొడవైన కర్ర. యాకోబు వీటిని ప్రస్తావించడం, షిలోహు వచ్చేవరకు యూదా గోత్రానికి ఉండే విశేషమైన అధికారాన్ని, బలాన్ని సూచిస్తోంది. ఈ యూదా గోత్ర సంతతివాడే యేసుక్రీస్తు, యెహోవా పరలోక పరిపాలనను ఆయనకే అప్పగించాడు. క్రీస్తుకు రాజరిక బలం, ఆజ్ఞాధికారం ఉన్నాయి.​—⁠కీర్తన 2:⁠8, 9; యెషయా 55:⁠4; దానియేలు 7:​13, 14.

మనకు పాఠాలు:

38:​26. విధవరాలిగా ఉన్న తన కోడలు తామారుతో యూదా వ్యవహరించిన విధానం సరైనది కాదు. అయితే, ఆమె గర్భం ధరించడానికి తానే బాధ్యుడని చెప్పబడినప్పుడు, యూదా వినయంతో తన తప్పు ఒప్పుకున్నాడు. మనం కూడా వెంటనే మన తప్పులు అంగీకరించాలి.

39:⁠9. పోతీఫరు భార్య విషయంలో యోసేపు ప్రతిస్పందన, నైతికసూత్రాల విషయంలో ఆయన తలంపులు దేవుని తలంపులతో పొందిక కలిగివున్నాయనీ, ఆయన మనస్సాక్షి దేవుని సూత్రాలతో నిర్దేశించబడిందనీ చూపించింది. సత్యానికి సంబంధించి ఖచ్చితమైన జ్ఞానం సంపాదించుకోవడంలో మనం ఎదిగేకొలది మనం కూడా అలాగే ఉండేందుకు కృషిచేయవద్దా?

41:​14-16, 39, 40. తనకు భయపడేవారి పరిస్థితులను యెహోవా పూర్తిగా మార్చివేయగలడు. కష్టాలు వచ్చినప్పుడు, మనం యెహోవాపై నమ్మకముంచి, ఆయనపట్ల నమ్మకంగా నిలిచి ఉండడం జ్ఞానయుక్తం.

వారికి నిలకడగల విశ్వాసం ఉంది

అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపులు నిజంగానే దైవభయంగల విశ్వాసులైన పురుషులు. ఆదికాండములోవున్న వారి జీవిత వృత్తాంతాలు మన విశ్వాసాన్ని బలపరచి మనకు అనేక విలువైన పాఠాలు బోధిస్తున్నాయి.

దైవపరిపాలనా పరిచర్య పాఠశాలకు సంబంధించిన బైబిలు పఠన పట్టికను మీరు పాటిస్తుండగా ఈ వృత్తాంతం నుండి మీరు ప్రయోజనం పొందవచ్చు. పైవిషయాలు పరిశీలించడం ఆ వృత్తాంతానికి జీవం పోయడానికి సహాయం చేస్తుంది.

[అధస్సూచి]

^ పేరా 3 కావలికోట జనవరి 1, 2004 సంచికలో “యెహోవా వాక్యము సజీవమైనది​—⁠ఆదికాండములోని ముఖ్యాంశాలు​—⁠I” అనే ఆర్టికల్‌ చూడండి.

[26వ పేజీలోని చిత్రం]

అబ్రాహాము విశ్వాస పురుషుడు

[26వ పేజీలోని చిత్రం]

యెహోవా యోసేపును ఆశీర్వదించాడు

[26వ పేజీలోని చిత్రం]

నీతిమంతుడైన లోతు, ఆయన కుమార్తెలు రక్షించబడ్డారు

[29వ పేజీలోని చిత్రం]

యాకోబు పవిత్ర విషయాలను విలువైనవిగా పరిగణించాడు, మరి మీరు?