కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

ఆదికాండము 38:​15, 16లో చెప్పబడినట్లుగా యూదా, వేశ్య అని తాను తలంచిన స్త్రీతో లైంగిక సంబంధం పెట్టుకోవడానికి ఏ పరిస్థితులు కారణమయ్యాయి?

యూదా, వేశ్య అని తాను తలంచిన స్త్రీతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నాడు. కానీ ఆమె వేశ్య కాదన్నది వాస్తవం. ఆదికాండము 38వ అధ్యాయం ప్రకారం, ఇలా జరిగింది.

యూదా జ్యేష్ఠకుమారుడికి తన భార్య తామారు ద్వారా కుమారులెవరూ కలుగకముందే అతడు ‘యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున’ మరణించాడు. (ఆదికాండము 38:⁠7) ఆ కాలంలో దేవరధర్మం ప్రకారం వివాహం చేసుకోవడం వాడుకలో ఉండేది. ఆ వాడుక ప్రకారం, ఏ పురుషుడైనా వారసుడు లేకుండా చనిపోతే అతని సోదరుడు ఆ విధవరాలిని వివాహం చేసుకొని వారసుణ్ణి కనాలి. అయితే యూదా రెండవ కుమారుడు ఓనాను ఆ బాధ్యతను నెరవేర్చడానికి నిరాకరించాడు. దానితో అతడు దేవుని తీర్పు కారణంగా మరణించాడు. యూదా తన మూడవ కుమారుడు షేలా పెద్దవాడయ్యేంతవరకూ వేచి ఉండేందుకు కోడలు తామారును ఆమె తండ్రి ఇంటికి పంపించాడు. అయితే, కాలం గడిచిపోయినా యూదా మాత్రం తామారును షేలాకిచ్చి పెళ్లిచేయలేదు. కాబట్టి, యూదా భార్య మరణించిన తర్వాత, ఇశ్రాయేలీయుడైన తన మామ యూదా ద్వారా వారసుణ్ణి కనేలా తామారు పథకం వేసింది. ఆమె దేవదాసిలా అలంకరించుకొని, యూదా ప్రయాణిస్తాడు అని తనకు తెలిసిన మార్గంలో కూర్చొని తన పథకాన్ని అమల్లో పెట్టింది.

ఆమె తామారు అని గుర్తించకుండా యూదా ఆమెతో లైంగిక సంబంధం ఏర్పరచుకున్నాడు. ఆమె తెలివిగా అతని దగ్గర కుదువ వస్తువులు సేకరించి, ఆ తర్వాత వాటిని ఉపయోగించి అతని ద్వారానే తాను గర్భవతినయ్యానని నిరూపించింది. సత్యం ఏమిటో తేలినప్పుడు, యూదా ఆమెను నిందించలేదు గానీ వినయ స్వభావంతో ఇలా అన్నాడు: “నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు గనుక ఆమె నాకంటె నీతిమంతురాలు.” ఆ తర్వాత ఆయన యుక్తంగా ప్రవర్తిస్తూ, “మరి యెప్పుడును ఆమెను కూడలేదు.”​—⁠ఆదికాండము 38:​26.

మాట ఇచ్చిన ప్రకారం తామారుకు తన కుమారుడైన షేలాను ఇవ్వకుండా యూదా తప్పుగా ప్రవర్తించాడు. దేవదాసి అని తాననుకున్న స్త్రీతో ఆయన లైంగిక సంబంధం కూడా ఏర్పరచుకున్నాడు. కేవలం వివాహ ఏర్పాటులోనే పురుషుడు లైంగిక సంబంధాలు కలిగివుండాలనే దేవుని సంకల్పానికి ఇది విరుద్ధం. (ఆదికాండము 2:​24) అయితే, వాస్తవానికి యూదా ఒక వేశ్యతో లైంగిక సంబంధం పెట్టుకోలేదు. బదులుగా, అతను అనుకోనివిధంగా దేవరధర్మ వివాహంలో తన కుమారుడైన షేలా తీసుకోవలసిన స్థానాన్ని తాను తీసుకొని చట్టబద్ధ సంతానానికి తండ్రయ్యాడు.

తామారు విషయానికొస్తే, ఆమె అవలంబించిన విధానం దుర్నీతి సంబంధమైనది కాదు. ఆమెకు కలిగిన కవల కుమారులు జారత్వపు కుమారులుగా పరిగణించబడలేదు. దేవరధర్మం ప్రకారం బోయజు మోయాబీయురాలైన రూతును వివాహం చేసుకున్నప్పుడు, బేత్లెహేము పెద్దలు తామారు కుమారుడైన పెరెసు గురించి సదభిప్రాయంతో బోయజుతో ఇలా అన్నారు: “యెహోవా యీ యౌవనురాలివలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరెసు కుటుంబమువలె నుండునుగాక.” (రూతు 4:​12) యేసుక్రీస్తు పితరుల్లో పెరెసు కూడా చేర్చబడ్డాడు.​—⁠మత్తయి 1:1-3; లూకా 3:23-33.