కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనిషిని కాదు దేవుణ్ణి మహిమపరచండి

మనిషిని కాదు దేవుణ్ణి మహిమపరచండి

మనిషిని కాదు దేవుణ్ణి మహిమపరచండి

ఇటీవలి నెలల్లో ప్రపంచవ్యాప్తంగా నీతిని ప్రేమించేవారు, “దేవుణ్ణి మహిమపరచండి” అనే యెహోవాసాక్షుల జిల్లా సమావేశాల్లో దేవుణ్ణెలా మహిమపరచాలో నేర్చుకున్నారు. అక్కడ అందించబడిన విద్యా కార్యక్రమాన్ని మనం పునఃసమీక్షిద్దాం.

బైబిలు ఆధారిత ఆ కార్యక్రమం చాలావరకూ ప్రతినిధుల కోసం మూడురోజుల పాటు సాగితే, ప్రత్యేక అంతర్జాతీయ సమావేశాలకు హాజరు కాగలిగిన వారి కోసం మాత్రం అది నాలుగు రోజుల పాటు కొనసాగింది. ఈ సమావేశాలకు హాజరైనవారు ఆధ్యాత్మిక ప్రశంసను ప్రగాఢపరచిన ప్రసంగాలు, విశ్వాసాన్ని బలపరచిన అనుభవాలు, బైబిలు సూత్రాల ఆచరణాత్మకతను నొక్కిచెప్పిన ప్రదర్శనలు, మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఎదుర్కొన్న సవాళ్లను కళ్లకుకట్టినట్టు చూపిన ఫుల్‌ కాస్ట్యూమ్‌ నాటకంతోసహా మొత్తం 30 లేఖన ప్రసంగాలు విన్నారు. ఈ సమావేశాల్లో ఒకదానికి మీరు హాజరైనట్లయితే, ఈ ఆర్టికల్‌ చదువుతున్నప్పుడు మీరు వ్రాసుకున్న నోట్సును ఒకసారి ఎందుకు పునఃసమీక్షించకూడదు? అది తప్పకుండా ఆ గొప్ప ఆధ్యాత్మిక విందుయొక్క మధుర జ్ఞాపకాలను గుర్తుచేస్తుందనీ, అది ఉపదేశాత్మకంగా ఉంటుందనీ మేము విశ్వసిస్తున్నాం.

మొదటిరోజు అంశం: ‘యెహోవా, నీవే మహిమను పొందనర్హుడవు’

ప్రారంభ పాట, ప్రార్థన తర్వాత మొదటి ప్రసంగీకుడు అలా సమావేశం కావడానికిగల ముఖ్య కారణంపై దృష్టినిలుపుతూ “దేవుణ్ణి మహిమపరిచేందుకు సమావేశమయ్యాం” అనే ప్రసంగంతో హాజరైన వారందరిని ఆప్యాయంగా ఆహ్వానించాడు. ప్రకటన 4:⁠11వ వచనాన్ని ఉదహరిస్తూ ఆ ప్రసంగీకుడు సమావేశపు మూలాంశాన్ని నొక్కితెలిపాడు. ఆ వెంటనే ఆయన దేవుణ్ణి మహిమపరచడమంటే ఏమిటో వివరించాడు. కీర్తనల పుస్తకాన్ని ఉపయోగిస్తూ, దేవుణ్ణి మహిమపరచడంలో ‘ఆరాధన,’ ‘కృతజ్ఞతార్పణలు చెల్లించడం,’ ‘స్తుతించడం’ ఉన్నాయని నొక్కిచెప్పాడు.​—⁠కీర్తన 95:​7, NW; 100:4, 5; 111:1, 2.

దాని తర్వాత, “దేవుణ్ణి మహిమపరిచేవారు ఆశీర్వదించబడతారు” అనే ప్రసంగం ఇవ్వబడింది. ప్రసంగీకుడు ఓ ఆసక్తికరమైన విషయాన్ని ప్రస్తావించాడు. ప్రపంచవ్యాప్తంగా 234 దేశాల్లో 60 లక్షలకుపైగా యెహోవాసాక్షులున్నారు కాబట్టి, యెహోవాను మహిమపరిచే వారి విషయంలో సూర్యుడు అస్తమించడని చెప్పవచ్చు. (ప్రకటన 7:​15) ఏదోక రీతిలో ప్రత్యేక పూర్తికాల సేవలోవున్న చాలామంది క్రైస్తవ సహోదరసహోదరీలను ఈ భాగంలో ఇంటర్వ్యూ చేయడం ప్రేక్షకుల హృదయాలను ఉత్తేజపరిచిన అంశంగా ప్రశంసించబడింది.

ఆ తర్వాత “సృష్టి దేవుని మహిమను వెల్లడిచేస్తోంది” అనే ప్రసంగం ఇవ్వబడింది. మౌనంగా ఉన్నప్పటికీ భౌతిక ఆకాశాలు దేవుని గొప్పతనాన్ని ఘనపరుస్తూ, ఆయన ప్రేమపూర్వక శ్రద్ధపట్ల మన కృతజ్ఞతా భావం ప్రగాఢం కావడానికి సహాయం చేస్తున్నాయి. ఈ అంశం జాగ్రత్తగా వివరించబడింది.​—⁠యెషయా 40:​26.

హింస, వ్యతిరేకత, లోక ప్రభావాలు, పాపభరిత స్వభావాలు నిజ క్రైస్తవుల యథార్థతను సవాలు చేస్తాయి. అందుకే “యథార్థమైన మార్గంలో నడవండి” అనే ప్రసంగాన్ని ప్రేక్షకులు అత్యంత శ్రద్ధతో విన్నారు. 26వ కీర్తనలోని ప్రతీ వచనాన్ని పరిశీలించడంతోపాటు ప్రసంగీకుడు, నైతికత్వం విషయంలో స్థిరంగా నిలబడిన పాఠశాలకెళ్లే సాక్షిని, అలాగే ప్రశ్నార్థకమైన వినోదం కోసం మరీ ఎక్కువ సమయం గడిపే సమస్యను అధిగమించడానికి తగిన చర్యలు తీసుకున్న మరో సాక్షిని ఇంటర్వ్యూ చేశాడు.

“అద్భుతమైన ప్రవచనాత్మక దర్శనాలు మనల్ని ఉత్తేజపరుస్తాయి” అనే ముఖ్యాంశ ప్రసంగంతో ఉదయపు కార్యక్రమం ముగిసింది. దేవుని మెస్సీయ రాజ్యం స్థాపించబడడానికి సంబంధించిన, దాని కార్య నిర్వహణకు సంబంధించిన మహిమాన్వితమైన ప్రవచనాత్మక దర్శనాల ద్వారా విశ్వాసం బలపడినవారిగా దానియేలు ప్రవక్త, అపొస్తలులైన పేతురు, యోహానుల ఉదాహరణలను ప్రసంగీకుడు ప్రస్తావించాడు. మనం అంత్యకాలంలో ఉన్నామని నిరూపించే స్పష్టమైన రుజువుపట్ల తమ దృష్టి కోల్పోతున్న వారినుద్దేశించి ప్రసంగీకుడు ఇలా అన్నాడు: “అలాంటివారు రాజ్య మహిమలోని క్రీస్తు ప్రత్యక్షత వాస్తవికతపై మళ్ళీ దృష్టి సారించి, ఆధ్యాత్మిక బలాన్ని తిరిగిపొందేందుకు సహాయాన్ని తీసుకుంటారని మేము గట్టిగా నమ్ముతున్నాం.”

“యెహోవా అణకువగలవారికి తన మహిమను వెల్లడిచేశాడు” అనే ప్రసంగంతో మధ్యాహ్న కార్యక్రమం మొదలయ్యింది. యెహోవా విశ్వంలో సర్వోన్నత వ్యక్తి అయినప్పటికీ వినయం చూపడంలో ఆయన మాదిరి ఉంచుతున్నాడని ప్రసంగీకుడు చూపించాడు. (కీర్తన 18:​35) నిజమైన వినయస్థులపై యెహోవా తన అనుగ్రహాన్ని చూపిస్తాడు, అయితే తమ సన్నిహిత స్నేహితులతో లేదా తమ పై అధికారులతో వ్యవహరించేటప్పుడు మాత్రమే వినయస్థులుగా కనబడుతూ తమ పర్యవేక్షణ క్రిందవున్న వారితో కఠినంగా వ్యవహరించేవారిని ఆయన వ్యతిరేకిస్తాడు.​—⁠కీర్తన 138:6.

ఆ తర్వాత “ఆమోసు ప్రవచనం​—⁠మన కాలం కొరకైన దాని సందేశం” అనే మూలాంశానికి సంబంధించిన వివిధ అంశాలను నొక్కితెలిపిన గోష్ఠిలో బైబిలు ప్రవచనం వివరించబడింది. మొదటి ప్రసంగీకుడు ఆమోసు ఉదాహరణను సూచిస్తూ, రానున్న యెహోవా తీర్పుల గురించి ప్రజలను హెచ్చరించే బాధ్యత మనకుందనే విషయంపైకి శ్రద్ధ మళ్లించాడు. ఆయన ప్రసంగ అంశం, “దేవుని వాక్యం ధైర్యంగా ప్రకటించండి.” రెండవ ప్రసంగీకుడు ఈ ప్రశ్న వేశాడు: “యెహోవా ఎప్పటికైనా ఈ భూమ్మీది దుష్టత్వాన్ని, బాధను అంతం చేస్తాడా?” “దుష్టులకు వ్యతిరేకంగా దైవిక తీర్పు” అనే అంశంగల ఆయన ప్రసంగం దైవిక తీర్పు అన్ని సందర్భాల్లో తగినదిగా, తప్పించుకోలేనిదిగా, విచక్షణా సహితంగా ఉంటుందని చూపించింది. గోష్ఠిలోని చివరి ప్రసంగీకుడు, “యెహోవా హృదయం పరిశోధిస్తాడు” అనే అంశంపై అవధానం నిలిపాడు. యెహోవాను సంతోషపరచాలని ఆకాంక్షించేవారు ఆమోసు 5:15లోని ఈ మాటలు లక్ష్యపెడతారు: ‘కీడును ద్వేషించి, మేలును ప్రేమించండి.’

హృదయాన్ని సంతోషపరచే ద్రాక్షారసంవంటి మద్యపానీయాలను దుర్వినియోగపరిచే అవకాశముంది. “మద్యపాన ఉచ్చును తప్పించుకోండి” అనే అంశంపై ఇచ్చిన ప్రసంగంలో ప్రసంగీకుడు, ఒక వ్యక్తి త్రాగుబోతు కాకపోయినా కూడా మద్యాన్ని మితిమీరి సేవించడంలోని శారీరక, ఆధ్యాత్మిక ప్రమాదాలను పేర్కొన్నాడు. ఆయన ఈ మార్గదర్శక సూత్రాన్ని తెలియజేశాడు: మద్యానికి తట్టుకునే శక్తి ఒక్కోవ్యక్తికి ఒక్కో విధంగా ఉంటుంది కాబట్టి, మీ “లెస్సయైన జ్ఞానమును వివేచనను” బలహీనపరిచే ఎంత మొత్తమైనా అది మీకు ఎక్కువే.​—⁠సామెతలు 3:​21, 22.

మనం అపాయకరమైన కాలాల్లో జీవిస్తున్నాం కాబట్టి “‘బాధ కలుగునప్పుడు యెహోవాయే మన ఆశ్రయ దుర్గము’” అనే తర్వాతి అంశం ఓదార్పునిచ్చింది. ప్రార్థన, పరిశుద్ధాత్మ, మనతోటి క్రైస్తవులు మనం తాళుకోవడానికి సహాయం చేయగలరు.

ఆ రోజు చివరిగా ఇవ్వబడిన “మంచి దేశము​—⁠పరదైసుకు ముంగుర్తు” అనే ప్రసంగం అనేక బైబిలు మ్యాప్‌లున్న కొత్త ప్రచురణ అందించి అందరినీ ఆనందాశ్చర్యాల్లో ముంచివేసింది. దానిపేరు మంచి దేశమును చూడండి.

రెండవరోజు అంశం: “అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి.”

దినవచనం పరిశీలించిన తర్వాత, “యెహోవా మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయండి” అనే మూలాంశంతో సమావేశపు రెండవ గోష్ఠి నిర్వహించబడింది. “ప్రతిచోట సువార్తను వ్యాపింపజేయడం” అనే విషయాన్ని వివరించిన మొదటి భాగంలో క్షేత్రసేవలో నిజంగా కలిగిన అనుభవాల పునర్నటనలు చేర్చబడ్డాయి. “అంధులైనవారి ముసుగును తొలగించడం” అనే అంశంగల రెండవ భాగంలో ప్రసంగీకుడు తన ప్రసంగంలో పునర్దర్శనానికి సంబంధించిన ఓ ప్రదర్శన ఏర్పాటు చేశాడు. “మన పరిచర్యలో మరింత సమగ్రంగా పాల్గొనడం” అనే చివరి భాగంలో క్షేత్రసేవ అనుభవాలుగల ఆసక్తికరమైన ఇంటర్వ్యూలు చేర్చబడ్డాయి.

ఆ తర్వాత “నిర్హేతుకంగా ద్వేషించబడ్డారు” అనే అంశంగల ప్రసంగమివ్వబడింది. దానిలో వ్యతిరేకత ఉన్నప్పటికీ దేవుని బలంవల్ల తమ యథార్థతను కాపాడుకున్న నమ్మకమైన ఆయావ్యక్తులతో ప్రోత్సాహకరమైన ఇంటర్వ్యూలు చేర్చబడ్డాయి.

సమావేశాల్లో బాప్తిస్మ ప్రసంగం, ఆ తర్వాత యోగ్యులైన అభ్యర్థులందరికి నీటిలోముంచి బాప్తిస్మమిచ్చే సన్నివేశం అత్యంత ఆకాంక్షగా ఎదురుచూడబడే సందర్భాలు. యెహోవాకు ఒక వ్యక్తి సంపూర్ణంగా సమర్పించుకోవడానికి నీటి బాప్తిస్మం చిహ్నంగా ఉంటుంది. కాబట్టి, ప్రసంగ అంశం యుక్తమైన రీతిలో ఇలావుంది: “మన సమర్పణకు అనుగుణంగా జీవించడం దేవుణ్ణి మహిమపరుస్తుంది.”

మధ్యాహ్న కార్యక్రమం స్వీయపరీక్షను ప్రోత్సహించిన “గొప్పతనం విషయంలో క్రీస్తువంటి దృక్పథాన్ని అలవరచుకోవడం” అనే ప్రసంగంతో మొదలయ్యింది. ప్రసంగీకుడు ఆసక్తికరమైన ఈ అంశాన్ని ప్రస్తావించాడు: క్రీస్తులోని అణకువను అనుకరించడం ద్వారా గొప్పతనం వస్తుంది. కాబట్టి ఒక క్రైస్తవుడు సొంత కోరికలను తీర్చుకోవాలనే ఆశతో బాధ్యతలు చేపట్టడానికి ప్రయత్నించకూడదు. అతడు తననుతాను ఇలా ప్రశ్నించుకోవాలి, ‘పైకి వెంటనే కనబడని సహాయక కార్యాలను చేయడానికి నేను ఇష్టపడుతున్నానా?’

మీరెప్పుడైనా అలసిపోయినట్లు భావించారా? ప్రతీ ఒక్కరూ ఆయా సందర్భాల్లో అలసిపోతారనేది వాస్తవమే. “అలసిపోతారు కానీ సొమ్మసిల్లరు” అనే ప్రసంగం అందరినీ సంతోషపరచింది. దీర్ఘకాల సాక్షుల ఇంటర్వ్యూలు యెహోవా మనలను ‘తన ఆత్మవలన బలపరచగలడని’ చూపించాయి.​—⁠ఎఫెసీయులు 3:15.

ఔదార్యమనే లక్షణం మనకు పుట్టుకతోనే ఉండదు, కానీ మనం దానిని అలవరచుకోవాలి. ఈ కీలకాంశం “ఔదార్యముగలవారిగా పాలుపంచుకునేవారిగా ఉండండి” అనే ప్రసంగంలో నొక్కిచెప్పబడింది. ఆలోచన రేకెత్తించే ఈ ప్రశ్న వేయబడింది: “మన సహోదర సహోదరీల్లోని వృద్ధులతో, అనారోగ్యులతో, క్రుంగినవారితో, ఒంటరివారమని భావిస్తున్నవారితో మన రోజులోని కొన్ని నిమిషాలను పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నామా?”

“‘అన్యుల స్వరము’ విషయంలో జాగ్రత్త” అనే ప్రసంగం ప్రేక్షకుల శ్రద్ధచూరగొంది. ఈ ప్రసంగం యేసు అనుచరులను, అపవాదిచే ప్రభావితమైన అనేక మానవ మూలాల ద్వారా పలుకబడే “అన్యుల స్వరము” వినకుండా ‘మంచి కాపరియైన’ యేసు స్వరం మాత్రమే వినే గొర్రెలతో పోల్చింది.​—⁠యోహాను 10:5, 14, 27.

గాయక బృందం పాడే పాట అందరికీ అర్థమవ్వాలంటే వారు ఏకగ్రీవముగా పాడాలి. దేవుణ్ణి మహిమపరచడానికి ప్రపంచవ్యాప్త సత్యారాధకులు ఐక్యంగా ఉండాలి. కాబట్టి, మనమందరం ‘స్వచ్ఛమైన భాష’ మాట్లాడి “యేకమనస్కులై” యెహోవాను ఎలా సేవించవచ్చు అనే విషయానికి సంబంధించి “దేవుణ్ణి ‘ఏకగ్రీవముగా’ మహిమపరచండి” అనే ప్రసంగం ప్రయోజనకరమైన ఉపదేశమిచ్చింది.​—⁠జెఫన్యా 3:​9, NW.

తల్లిదండ్రులు, ప్రత్యేకంగా చిన్నపిల్లలున్న తల్లిదండ్రులు, ఆ రోజు ఇవ్వబడిన “మన పిల్లలు​—⁠ఒక అమూల్య స్వాస్థ్యము” అనే చివరి ప్రసంగం విని సంపూర్ణంగా ఆనందించారు. ప్రేక్షకులకు ఆనందాశ్చర్యాలు కలిగిస్తూ 256 పేజీల ఓ కొత్త సాహిత్యం విడుదల చేయబడింది. గొప్ప బోధకుడి నుండి నేర్చుకోండి (ఆంగ్లం) పుస్తకం, దేవుడు తమకు స్వాస్థ్యంగా ఇచ్చిన పిల్లలతో ఆధ్యాత్మిక ప్రతిఫలమిచ్చే సమయం గడపడానికి తలిదండ్రులకు సహాయం చేస్తుంది.

మూడవరోజు అంశం: “సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి”

సమావేశపు చివరి దినాన్ని దినవచన జ్ఞాపికలు ఆధ్యాత్మిక తలంపుతో ఆరంభించాయి. ఈ దిన కార్యక్రమంలోని తొలిభాగం కుటుంబ ఏర్పాటుపట్ల అధిక శ్రద్ధచూపింది. “తల్లిదండ్రులారా, కుటుంబ బంధాన్ని బలోపేతం చేసుకోండి” అనే ప్రసంగం ప్రేక్షకుల మనస్సులను సిద్ధంచేసింది. కుటుంబ భౌతిక అవసరాలు తీర్చవలసిన తలిదండ్రుల బాధ్యతలను పునఃసమీక్షించిన తర్వాత, వారి ఆధ్యాత్మిక అవసరాలు తీర్చడం తల్లిదండ్రుల ప్రాథమిక బాధ్యత అని ప్రసంగీకుడు నిరూపించాడు.

ఆ తర్వాతి ప్రసంగీకుడు పిల్లలనుద్దేశించి ప్రసంగిస్తూ “యువత యెహోవాను స్తుతిస్తున్న విధానం” అనే అంశాన్ని వివరించాడు. యౌవనులు అసంఖ్యాకంగా ఉన్నారు, అలాగే వారి యౌవన బలం ఉత్తేజం కలిగించేదిగా ఉంది కాబట్టి వారు ‘మంచు బిందువుల్లా’ ఉన్నారని ప్రసంగీకుడు అన్నాడు. పెద్దవారు యౌవనులతో కలిసి యెహోవా సేవ చేయడానికి సంతోషిస్తారు. (కీర్తన 110:⁠3) ఆదర్శవంతమైన యౌవనుల ఆనందకరమైన ఇంటర్వ్యూలు ఈ భాగంలో చేర్చబడ్డాయి.

జిల్లా సమావేశాల్లో ఫుల్‌ కాస్ట్యూమ్‌ నాటకాలు ఎప్పుడూ ఉత్తేజకరమైన భాగంగా ఉంటాయి, ఈ సమావేశంలో కూడా దానికి మినహాయింపులేదు. “వ్యతిరేకత ఉన్నప్పటికీ ధైర్యంగా సాక్ష్యమివ్వడం” అనే నాటకం యేసు మొదటి శతాబ్దపు అనుచరులను వర్ణించింది. అది కేవలం వినోదాన్ని అందించేదిగా కాక మరి ప్రాముఖ్యంగా ఉపదేశాత్మకంగా ఉంది. నాటకం తర్వాత ఇవ్వబడిన “సువార్తను ‘మానకుండా’ ప్రకటించండి” అనే ప్రసంగం ఆ నాటకపు ప్రధానాంశాలను నొక్కిచెప్పింది.

ఆదివారపు కార్యక్రమానికే తలమానికంలాంటి “నేడు దేవుణ్ణి ఎవరు మహిమపరుస్తున్నారు?” అనే బహిరంగ ప్రసంగం కోసం ప్రేక్షకులంతా ఎదురుచూశారు. వైజ్ఞానిక, మతసంబంధ సమాజాలు దేవుణ్ణెలా మహిమపరచలేదో ప్రసంగీకుడు నిదర్శనాధారంగా వివరించాడు. యెహోవా గురించిన సత్యాన్ని ప్రకటిస్తూ, బోధిస్తూ ఆయన నామం ధరించిన ప్రజలు మాత్రమే నిజానికి ఆయన నామాన్ని నేడు మహిమపరుస్తున్నారు.

బహిరంగ ప్రసంగం తర్వాత, ఆ వారం కొరకైన కావలికోట పత్రికలోని పాఠ్య సారాంశం ఇవ్వబడింది. దాని తర్వాత “యెహోవాకు మహిమ కలిగేవిధంగా ‘బహుగా ఫలిస్తుండండి’” అనే చివరి ప్రసంగం ఇవ్వబడింది. సృష్టికర్త అయిన యెహోవాకు మహిమ తీసుకొచ్చే వివిధ మార్గాలపై కేంద్రీకృతమైన పది అంశాల తీర్మానాన్ని స్వీకరించేందుకు వీలుగా ప్రసంగీకుడు దానిని ప్రేక్షకులకు చదివి వినిపించాడు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన సమావేశాలన్నింటిలో ప్రతీ ఒక్కరు ఏకగ్రీవంగా ఒప్పుకుంటున్నాను అని చెప్పారు.

ఆ విధంగా హాజరైన ప్రతీ ఒక్కరి చెవుల్లో “దేవుణ్ణి మహిమపరచండి” అనే మూలాంశం మారుమ్రోగుతూ సమావేశం ముగిసింది. యెహోవా ఆత్మ మరియు ఆయన సంస్థ దృశ్యభాగం సహాయంతో మనం అన్ని సందర్భాల్లో మనుషులను కాదు దేవుణ్ణే మహిమపరచుదము గాక.

[23వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

అంతర్జాతీయ సమావేశాలు

ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా, ఐరోపా, ఉత్తర దక్షిణ అమెరికాల్లో పూర్తిగా నాలుగు రోజులపాటు అంతర్జాతీయ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు ప్రతినిధులుగా హాజరుకావడానికి ప్రపంచ నలుమూలలనుండి నిర్ధారిత సాక్షులు ఆహ్వానించబడ్డారు. ఈ విధంగా అతిథులు అతిథేయులు ‘ఒకరిచేత మరొకరు’ పరస్పరం ప్రోత్సహించబడ్డారు. (రోమీయులు 1:​11) పాత పరిచయాలు పునర్నూతనం చేయబడ్డాయి, కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి. “ఇతర దేశాలనుండి నివేదికలు” అనే ప్రత్యేక భాగం అంతర్జాతీయ సమావేశాల కార్యక్రమంలో చేర్చబడింది.

[25వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

దేవుణ్ణి మహిమపరిచే కొత్త సాహిత్యాలు

“దేవుణ్ణి మహిమపరచండి” జిల్లా సమావేశాల్లో రెండు కొత్త సాహిత్యాలు విడుదల చేయబడ్డాయి. నాణ్యమైన అట్టతో తయారుచేయబడిన మంచి దేశమును చూడండి అనే 36 పేజీల బైబిలు అట్లాసులో బైబిలు స్థలాల మ్యాప్‌లు, ఫోటోలు ఉన్నాయి. ప్రతీ పేజీ పూర్తి రంగులతో ఉండడమే కాక అష్షూరు, బబులోను, మాదీయ-పారసీక, గ్రీసు, రోమ్‌ సామ్రాజ్యాల మ్యాప్‌లు ఇవ్వబడ్డాయి. యేసు పరిచర్యను, క్రైస్తవత్వపు విస్తరణను వివరించే ప్రత్యేక మ్యాప్‌లు కూడా అందులో ఉన్నాయి.

గొప్ప బోధకుడి నుండి నేర్చుకోండి (ఆంగ్లం) అనే 256 పేజీల పుస్తకంలో దాదాపు 230 బొమ్మలున్నాయి. పిల్లలతో కలిసి కేవలం బొమ్మలు చూస్తూ, ఆ పుస్తకంలో ఇవ్వబడిన ఆలోచన రేకెత్తించే ప్రశ్నలకు జవాబులివ్వడం ద్వారా వారితో ఎన్నో ఆనందకరమైన సమయాలు గడపవచ్చు. మన చిన్న పిల్లల నైతిక విలువలను పాడుచేయడానికి ప్రయత్నిస్తున్న సాతాను ముట్టడులను త్రిప్పికొట్టేందుకు ఈ కొత్త సాహిత్యం రూపొందించబడింది.

[23వ పేజీలోని చిత్రం]

మిషనరీలు విశ్వాసాన్ని బలపరిచే అనుభవాలు వివరించారు

[24వ పేజీలోని చిత్రాలు]

“దేవుణ్ణి మహిమపరచండి” జిల్లా సమావేశాల్లో బాప్తిస్మం ప్రధానాంశం

[24వ పేజీలోని చిత్రాలు]

బైబిలు నాటకాలు పిన్నలను పెద్దలను మురిపించాయి