కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు నమ్మగల వాగ్దానాలు

మీరు నమ్మగల వాగ్దానాలు

మీరు నమ్మగల వాగ్దానాలు

వాగ్దానాలు తరచూ నమ్మదగినవిగా ఉండవని దేవుని ప్రవక్తయైన మీకాకు తెలుసు. ఆయన కాలంలో, అన్ని సందర్భాల్లోను తమ మాట నిలబెట్టుకుంటారని సన్నిహిత సహచరులను సహితం నమ్మడం కష్టంగా ఉండేది. అందుకే మీకా ఇలా హెచ్చరించాడు: “స్నేహితునియందు నమ్మికయుంచవద్దు, ముఖ్యస్నేహితుని నమ్ముకొనవద్దు, నీ కౌగిటిలో పండుకొనియున్న దానియెదుట నీ పెదవుల ద్వారమునకు కాపుపెట్టుము.”​—⁠మీకా 7:5.

ఈ శోచనీయ పరిస్థితి కారణంగా మీకా అన్ని వాగ్దానాలను సంశయించే వ్యక్తిగా తయారయ్యాడా? లేదు! తన దేవుడైన యెహోవా వాగ్దానాల్లో ఆయన పూర్తి నమ్మకం వ్యక్తపరిచాడు. ఆయనిలా వ్రాశాడు: “యెహోవాకొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవునికొరకు నేను కనిపెట్టియుందును, నా దేవుడు నా ప్రార్థన నాలకించును.”​—⁠మీకా 7:7.

మీకాకు అంతటి నమ్మకం ఎందుకుంది? ఎందుకంటే యెహోవా అన్ని సందర్భాల్లోను తన మాట నిలబెట్టుకుంటాడని ఆయనకు తెలుసు. మీకా పితరులకు దేవుడు వాగ్దానం చేసిన సమస్తం నిష్ఫలం కాకుండా నెరవేరింది. (మీకా 7:​20) గతంలో యెహోవా నమ్మకత్వం, భవిష్యత్తులోనూ ఆయన తన మాట నిలబెట్టుకుంటాడని నమ్మడానికి మీకాకు నిజమైన ఆధారమిచ్చింది.

“ఒక్కటియైనను తప్పియుండలేదు”

ఉదాహరణకు, యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాసత్వం నుండి విడుదల చేశాడని మీకాకు తెలుసు. (మీకా 7:​15) ఆ విడుదలను అనుభవపూర్వకంగా చూసిన యెహోషువ, దేవుని వాగ్దానాలన్నిటిలో నమ్మకముంచమని తోటి ఇశ్రాయేలీయులను ప్రోత్సహించాడు. దేని ఆధారంగా? “మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటియైనను తప్పియుండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు; అవి అన్నియు మీకు కలిగెను, వాటిలో ఒక్కటియైనను తప్పియుండలేదు” అని యెహోషువ వారికి గుర్తుచేశాడు.​—⁠యెహోషువ 23:14.

యెహోవా తమకోసం అద్భుతకార్యాలు జరిగించాడని ఇశ్రాయేలీయులకు బాగా తెలుసు. దైవ భయంగల తమ పితరుడైన అబ్రాహాముకు, ఆయన సంతానం ఆకాశ నక్షత్రాల మాదిరిగా అసంఖ్యాకమవుతుందనీ కనాను దేశాన్ని వారు స్వతంత్రించుకుంటారనీ చేసిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. అలాగే అబ్రాహాము వంశస్థులు 400 సంవత్సరాలు శ్రమ అనుభవిస్తారనీ, అయితే “నాలుగవ తరమువారు” కనానుకు తిరిగివస్తారని కూడా యెహోవా చెప్పాడు. ఇదంతా జరిగింది.​—⁠ఆదికాండము 15:⁠5-16; నిర్గమకాండము 3:⁠6-8.

యాకోబు కుమారుడైన యోసేపు కాలంలో ఐగుప్తులో ఇశ్రాయేలీయులు ఆదరించబడ్డారు. ఆ తర్వాత ఐగుప్తీయులు క్రూరంగా వారితో బానిసపని చేయించారు. అయితే దేవుని వాగ్దానం ప్రకారం వారు ఐగుప్తులో ప్రవేశించిన కాలం మొదలుకొని నాలుగు తరాల కాలంలోపే అబ్రాహాము వంశస్థులు ఐగుప్తు దాసత్వం నుండి విడుదల చేయబడ్డారు. *

ఆ తర్వాతి 40 సంవత్సరాల్లో యెహోవా తన వాగ్దానాలు నెరవేరుస్తాడని చెప్పడానికి ఇశ్రాయేలీయులకు అదనపు రుజువులు లభించాయి. అమాలేకీయులు అన్యాయంగా ఇశ్రాయేలీయులను ముట్టడించినప్పుడు, దేవుడు తన ప్రజల పక్షాన పోరాడి వారిని కాపాడాడు. అరణ్యంలో వారు ప్రయాణించిన 40 సంవత్సరాల్లో ఆయన వారి భౌతిక అవసరాలన్నీ తీర్చాడు, చివరకు వారు వాగ్దానదేశంలో స్థిరపడేలా చేశాడు. అబ్రాహాము వంశస్థులతో యెహోవా వ్యవహారాలన్నిటిని పునఃసమీక్షిస్తుండగా యెహోషువ గట్టి నమ్మకంతో ఇలా చెప్పగలిగాడు: “యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పియుండలేదు, అంతయు నెరవేరెను.”​—⁠యెహోషువ 21:44.

దేవుని వాగ్దానాల్లో నమ్మకాన్ని వృద్ధిచేసుకోండి

మీకా, యెహోషువ మాదిరిగా యెహోవా వాగ్దానాల్లో మనమెలా నమ్మకం వృద్ధిచేసుకోవచ్చు? ఇతరులమీద ఆ నమ్మకాన్ని మీరు ఎలా వృద్ధిచేసుకుంటారు? వారి గురించి ఎంత ఎక్కువ సాధ్యమైతే అంతెక్కువ తెలుసుకుంటారు. ఉదాహరణకు, తమ వాగ్దానాలన్నీ నమ్మకంగా నెరవేర్చడానికి వారు ప్రయత్నిస్తున్నారని గమనించడం ద్వారా వారెంత ఆధారపడదగినవారో మీరు తెలుసుకుంటారు. అలాంటి ప్రజలపట్ల మీ పరిజ్ఞానం పెరిగేకొలది, మీరు క్రమేణా వారిపై నమ్మకం వృద్ధిచేసుకుంటారు. దేవుని వాగ్దానాల్లో నమ్మకం వృద్ధిచేసుకొనే విషయంలో కూడా మీరలాగే చేయవచ్చు.

మీరిలా చేయడానికి ఒక మార్గంగా సృష్టి గురించి, దానిని నడిపిస్తున్న కట్టడల గురించి మీరు ధ్యానించవచ్చు. మీ శరీరంగా రూపొందేలా వేలకోట్ల జీవకణాలుగా అభివృద్ధయ్యే ఒకే ఒక మానవ జీవకణ విభజనకు తోడ్పడే నియమాలవంటి కట్టడలను శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. నిజానికి విశ్వమంతటిలోని ద్రవ్యరాశి నడవడిని, శక్తిని నడిపిస్తున్న కట్టడలు పూర్తిగా ఆధారపడదగిన శాసనకర్తచే స్థిరపరచబడి ఉంటాయి. ఆయన సృష్టిని నడిపించే కట్టడలను మీరు నమ్మినట్లే ఆయన వాగ్దానాలనూ మీరు ఖచ్చితంగా నమ్మవచ్చు.​—⁠కీర్తన 139:​14-16; యెషయా 40:​26; హెబ్రీయులు 3:⁠4.

మీకా సమకాలీనుడైన యెషయా ప్రవక్త ద్వారా తన వాక్య నమ్మకత్వాన్ని ఉదహరించడానికి యెహోవా క్రమంతప్పని రుతువులను, ఆశ్చర్యపరిచే నీటి చక్రాన్ని ఉపయోగించాడు. ప్రతీ సంవత్సరం వర్షాలు వస్తాయి. ప్రజలు విత్తనాలు విత్తి పంట పండించుకోవడానికి వీలుగా అవి భూమినంతా తడుపుతాయి. ఈ విషయాన్నే యెహోవా ఇలా చెప్పాడు: “వర్షమును హిమమును ఆకాశమునుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో ఆలాగే నా నోటనుండి వచ్చు వచనమును ఉండును నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలముచేయును.”​—⁠యెషయా 55:​10, 11.

పరదైసు వాగ్దానాలు నమ్మదగినవి

సృష్టిని పరీక్షించడం సృష్టికర్తపై నమ్మకాన్ని వృద్ధిచేస్తుంది, అయితే ‘[ఆయన] నోటనుండి వచ్చు వచనంలో’ భాగమైన వాగ్దానాల గురించి మనం నేర్చుకోవాలంటే ఇంకా ఎక్కువే అవసరం. ఆ వాగ్దానాలను మీరు నమ్మగలిగేలా వాటి గురించి నేర్చుకోవడానికి, భూమిపట్ల దేవుని సంకల్పం, మానవాళితో ఆయన వ్యవహారాలను తెలిపే దైవావేశ లేఖన చరిత్రను మీరు పరిశీలించాలి.​—⁠2 తిమోతి 3:14-17.

యెహోవా వాగ్దానాలపట్ల మీకా ప్రవక్తకు నమ్మకముంది. అయితే మీకాకంటే ఎక్కువగా దైవ ప్రేరిత లేఖన చరిత్ర మీకు అందుబాటులో ఉంది. మీరు బైబిలు చదువుతూ, ధ్యానిస్తుండగా, దేవుని వాగ్దానాలు నెరవేరతాయని మీరూ నమ్మకం వృద్ధిచేసుకోవచ్చు. ఈ వాగ్దానాలు కేవలం అబ్రాహాము వంశస్థులకే కాదుగానీ యావత్‌ మానవాళికి వర్తిస్తాయి. దైవభయంగల ఈ పితామహునికి యెహోవా ఇలా వాగ్దానం చేశాడు: “నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును.” (ఆదికాండము 22:​18) అబ్రాహాము ‘సంతానపు’ ప్రథమ భాగమే మెస్సీయ అయిన యేసుక్రీస్తు.​—⁠గలతీయులు 3:16.

యేసుక్రీస్తు ద్వారా విధేయతగల మానవాళికి ఆశీర్వాదాలు కలిగేలా యెహోవా చేస్తాడు. మన కాలంలో తానేమి చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు? ఈ ప్రవచనార్థక మాటల్లో మీకా 4:1, 2 దీనికి జవాబిస్తోంది: “అంత్యదినములలో యెహోవా మందిరపర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండలకంటె ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. కాబట్టి ఆ కాలమున అన్యజనులనేకులు వచ్చి . . . యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుకొందము అని చెప్పుకొందురు.”

యెహోవా మార్గాల గురించి నేర్చుకొనేవారు ‘తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగకొడతారు.’ ఎలాంటి యుద్ధ స్వభావాలైనా కనబడకుండా పోతాయి. త్వరలోనే భూమంతా యథార్థపరులతో నిండిపోతుంది, ఎవరి భయం లేకుండా వారు నిర్భయంగా జీవిస్తారు. (మీకా 4:​3, 4) అవును, యేసుక్రీస్తు అధికారంలోని రాజ్యపరిపాలనలో యెహోవా నిరంకుశులందరిని భూమ్మీద లేకుండా చేస్తాడని దేవుని వాక్యం వాగ్దానం చేస్తోంది.​—⁠యెషయా 11:⁠6-9; దానియేలు 2:​44; ప్రకటన 11:​18.

దేవునికి వ్యతిరేకంగా మానవుడు చేసిన తిరుగుబాటు కారణంగా బాధపడి చనిపోయినవారు సైతం భూమ్మీద నిత్యం జీవించే ఉత్తరాపేక్షతో పునరుత్థానం చేయబడతారు. (యోహాను 5:​28, 29) దుష్టత్వాన్ని పురికొల్పే సాతాను అతని దయ్యాలు తెరమరుగౌతారు, యేసు విమోచన క్రయధన బలిద్వారా ఆదాము సంక్రమిత పాపాపు ప్రభావాలు తొలగించబడతాయి. (మత్తయి 20:​28; రోమీయులు 3:​23, 24; 5:​12; 6:​23; ప్రకటన 20:​1-3) అప్పుడు విధేయతగల మానవుల పరిస్థితి ఎలా ఉంటుంది? నిస్సందేహంగా, వారు పరదైసు భూమిపై పరిపూర్ణ ఆరోగ్యంగల నిత్యజీవంతో ఆశీర్వదించబడతారు!​—⁠కీర్తన 37:​10, 11; లూకా 23:​43; ప్రకటన 21:⁠3-5.

అవెంత అద్భుతకరమైన ఆశీర్వాదాలో కదా! కానీ మీరు వాటిని నమ్మగలరా? తప్పకుండా నమ్మవచ్చు. ఇవి మంచి ఉద్దేశాలున్నా వాటిని సాధించగల శక్తిలేని మానవులు చేసిన వాగ్దానాలు కావు. అవి అబద్ధమాడనేరని, ‘తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయని’ సర్వశక్తిగల దేవుడు చేసిన వాగ్దానాలు. (2 పేతురు 3:9; హెబ్రీయులు 6:​13-18) బైబిల్లోవున్న వాగ్దానాలన్నింటికి మూలకర్త ‘సత్యదేవుడైన యెహోవాయే’ కాబట్టి వాటిని మీరు పూర్తిగా నమ్మవచ్చు.​—⁠కీర్తన 31:⁠5.

[అధస్సూచి]

^ పేరా 8 యెహోవాసాక్షులు ప్రచురించిన, లేఖనములపై అంతర్దృష్టి (ఆంగ్లం) 1వ సంపుటి, 911-12 పేజీలు చూడండి.

[6వ పేజీలోని బ్లర్బ్‌]

“మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటియైనను తప్పియుండలేదు.”​—⁠యెహోషువ 23:​14.

[4, 5వ పేజీలోని చిత్రాలు]

ఎర్రసముద్రం దగ్గర, అరణ్యంలో ఇశ్రాయేలీయులకు తాను చేసిన వాగ్దానాలను యెహోవా నెరవేర్చాడు

[7వ పేజీలోని చిత్రాలు]

అబ్రాహాముకు తాను చేసిన వాగ్దానాన్ని యెహోవా నెరవేర్చాడు. ఆయన సంతానమైన యేసుక్రీస్తు మానవాళికి ఆశీర్వాదాలు తెస్తాడు