కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా మహాత్మ్యం గ్రహింప శక్యము కానిది

యెహోవా మహాత్మ్యం గ్రహింప శక్యము కానిది

యెహోవా మహాత్మ్యం గ్రహింప శక్యము కానిది

“యెహోవా మహాత్మ్యముగలవాడు ఆయన అధికస్తోత్రము నొందదగినవాడు ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది.”​—⁠కీర్తన 145:3.

కీర్తన 145ను వ్రాసిన వ్యక్తి చరిత్రలో పేరుగాంచాడు. బాలునిగా ఉన్నప్పుడు ఆయన సాయుధ మహాకాయుణ్ణి ఎదిరించి అతణ్ణి హతమార్చాడు. ఆ కీర్తనకర్త యోధుడైన రాజుగా చాలామంది శత్రువులను మట్టికరిపించాడు. ఆయన పేరు దావీదు, ఆయన ప్రాచీన ఇశ్రాయేలుకు రెండవ రాజు. దావీదు మరణం తర్వాత కూడా ఆయన పేరు చిరస్మరణీయంగా నిలిచింది, నేటికీ లక్షలాదిమందికి ఆయన గురించి ఎంతోకొంత తెలుసు.

2 దావీదు ఎన్ని ఘనకార్యాలు చేసినా, ఆయన వినయం ప్రదర్శించాడు. యెహోవానుద్దేశించి ఆయనిలా పాడాడు: “నీ చేతిపనియైన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్రనక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు?” (కీర్తన 8:​3, 4) దావీదు తానే గొప్పవాడని తలంచడానికి బదులు, శత్రువులందరి నుండి తనకు లభించిన విడుదలను యెహోవాకే ఆపాదిస్తూ ఆ దేవుని గురించి ఇలా చెప్పాడు: “నీవు నీ రక్షణ కేడెమును నాకు అందించుదువు నీ సాత్వికము నన్ను గొప్పచేయును.” (2 సమూయేలు 22:​1, 2, 36) యెహోవా పాపులను కరుణించే విషయంలో సాత్వికం ప్రదర్శిస్తాడు, దేవుని ఉచిత కృపపట్ల దావీదు కృతజ్ఞతా భావం ప్రదర్శించాడు.

‘రాజైన నా దేవుణ్ణి ఘనపరచెదను’

3 దావీదు దేవుని నియమిత రాజైనప్పటికీ, యెహోవాయే ఇశ్రాయేలుకు నిజమైన రాజు అని ఆయన దృష్టించాడు. దావీదు ఇలా అన్నాడు: “యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని యున్నావు.” (1 దినవృత్తాంతములు 29:​11) దేవుని పరిపాలనను దావీదు ఎంతో అమూల్యంగా పరిగణించాడు! “రాజవైన నా దేవా, నిన్ను ఘనపరచెదను. నీ నామమును నిత్యము సన్నుతించెదను అనుదినము నేను నిన్ను స్తుతించెదను నిత్యము నీ నామమును స్తుతించెదను” అని ఆయన పాడాడు. (కీర్తన 145:​1, 2) దినమెల్లా యెహోవా దేవుణ్ణే స్తుతించాలని దావీదు కోరుకున్నాడు.

4 దేవుడు తన ప్రాణులకు స్వేచ్ఛ దక్కకుండా చేసే స్వార్థ పరిపాలకుడు అని సాతాను చేసిన ఆరోపణకు 145వ కీర్తన ఓ తిరుగులేని జవాబు. (ఆదికాండము 3:​1-5) దేవునికి విధేయులయ్యేవారు దేవునిపట్ల ప్రేమతో కాదుగానీ కేవలం స్వార్థంతోనే విధేయులవుతారని సాతాను చెప్పిన అబద్ధాన్ని సైతం ఈ కీర్తన బహిర్గతం చేస్తోంది. (యోబు 1:9-11; 2:​4, 5) దావీదువలే నేడు నిజ క్రైస్తవులు అపవాది అబద్ధ ఆరోపణలకు తగిన జవాబిస్తున్నారు. యెహోవాను అనునిత్యం స్తుతించాలని వారు కోరుకుంటున్నారు కాబట్టి రాజ్యపాలన క్రింద నిత్యజీవ నిరీక్షణను వారు కాపాడుకుంటున్నారు. యేసు విమోచన క్రయధన బలియందు విశ్వాసం ఉంచడం ద్వారా, అలాగే యెహోవాకు సమర్పించుకొని, బాప్తిస్మం తీసుకున్న ఆరాధకులుగా ఆయనను విధేయతాపూర్వకంగా సేవించడం ద్వారా ఇప్పటికే లక్షలాదిమంది అలాచేస్తున్నారు.​—⁠రోమీయులు 5:8; 1 యోహాను 5:3.

5 యెహోవా సేవకులుగా ఆయనను సన్నుతించి, స్తుతించే అనేక అవకాశాల గురించి ఆలోచించండి. ఆయన వాక్యమైన బైబిల్లో, మనలను ప్రగాఢంగా ప్రభావితం చేసిన విషయమేదైనా చదివినప్పుడు ప్రార్థనలో మనమాయనను స్తుతించవచ్చు. దేవుడు తన ప్రజలతో వ్యవహరించిన విధానం మన హృదయాలను స్పృశించినప్పుడు లేదా ఆయన సృష్టిలో అద్భుతమైనదేదో చూసి పులకించిపోయినప్పుడు అలాంటి కృతజ్ఞతాభరిత లేదా కృతజ్ఞతాసూచక స్తుతిని వ్యక్తంచేయవచ్చు. క్రైస్తవకూటాల్లో లేదా వ్యక్తిగతంగా తోటి క్రైస్తవులతో దేవుని సంకల్పాల గురించి చర్చించినప్పుడు కూడా మనం యెహోవా దేవుణ్ణి సన్నుతిస్తాము. వాస్తవానికి, దేవుని రాజ్యానికి సంబంధించి చేయబడే ‘సత్క్రియలన్నీ’ యెహోవాకు స్తుతిని తెస్తాయి.​—⁠మత్తయి 5:16.

6 ఇటీవల చేయబడిన అలాంటి సత్క్రియల ఉదాహరణల్లో, పేదరికం ప్రబలిన దేశాల్లో యెహోవా ప్రజలు అనేక ఆరాధనా స్థలాలు నిర్మించడం కూడా ఉంది. ఇది ఎక్కువగా ఇతర దేశాల్లోని తోటి విశ్వాసుల ఆర్థిక సహాయం ద్వారానే సాధించబడింది. కొంతమంది క్రైస్తవులు రాజ్యమందిరాల నిర్మాణంలో భాగం వహించేందుకు అలాంటి ప్రాంతాలకు స్వచ్ఛందంగా వెళ్లి సహాయం అందించారు. యెహోవా రాజ్య సువార్తను ప్రకటించడం ద్వారా ఆయనకు స్తుతి తీసుకురావడం అన్ని సత్క్రియల్లోకెల్లా అత్యంత ప్రాముఖ్యమైన సత్క్రియ. (మత్తయి 24:​14) 145వ కీర్తనలోని తర్వాతి వచనాలు చూపిస్తున్నట్లుగా దావీదు దేవుని పరిపాలనపట్ల కృతజ్ఞతా భావం ప్రదర్శించి, ఆయన రాజరిక మహాత్మ్యాన్ని గుర్తించాడు. (కీర్తన 145:​11, 12) దేవుని ప్రేమపూర్వక పరిపాలనపట్ల మీకూ అలాంటి కృతజ్ఞతా భావమే ఉందా? ఆయన రాజ్యం గురించి మీరు క్రమంగా ఇతరులతో మాట్లాడుతున్నారా?

దేవుని మహాత్మ్యపు ఉదాహరణలు

7కీర్తన 145:3 యెహోవాను స్తుతించడానికి ఓ ప్రధానమైన కారణాన్నిస్తోంది. దావీదు ఇలా పాడుతున్నాడు: “యెహోవా మహాత్మ్యముగలవాడు ఆయన అధికస్తోత్రము నొందదగినవాడు ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది.” యెహోవా మహాత్మ్యానికి ఎల్లలులేవు. దాన్ని పూర్తిగా అన్వేషించడం, గ్రహించడం లేదా కొలవడం మానవులవల్ల కాదు. అయితే యెహోవా యొక్క గ్రహింప శక్యంకాని మహాత్మ్యపు ఉదాహరణలను మనం పరిశీలించడం ద్వారా నిశ్చయంగా ప్రయోజనం పొందుతాము.

8 మీరు దేదీప్యమాన నగర దీపకాంతులకు దూరంగావెళ్లి రాత్రిపూట నిర్మలాకాశాన్ని తిలకించిన ఓ సందర్భాన్ని గుర్తుతెచ్చుకోవడానికి ప్రయత్నించండి. నల్లటి ఆకాశంలో కనబడిన లక్షల నక్షత్రాలను చూసి మీరు ఆశ్చర్యపడలేదా? ఈ ఆకాశ గ్రహాలన్నింటిని సృష్టించడంలో కనబడే యెహోవా మహాత్మ్యాన్నిబట్టి ఆయనను స్తుతించడానికి మీరు పురికొల్పబడలేదా? అయితే భూమి ఒక భాగంగావున్న నక్షత్రవీధిలోని నక్షత్రాల సంఖ్యలో మీరు చూసింది కేవలం అల్పశాతం మాత్రమే. అంతేకాదు, అలాంటి నక్షత్రవీధులు పదివేల కోట్లకంటే ఎక్కువగా ఉన్నాయి, వాటిలో టెలిస్కోపు లేకుండా కేవలం మూడు నక్షత్ర వీధుల్ని మాత్రమే మనం చూడగలం. అవును, సువిశాల విశ్వంలోవున్న అసంఖ్యాక నక్షత్రాలు, నక్షత్రవీధులు యెహోవా సృష్టించే శక్తికి, గ్రహింప శక్యంకాని మహాత్మ్యానికి రుజువుగా ఉన్నాయి.​—⁠యెషయా 40:​26.

9 యెహోవా మహాత్మ్యానికి సంబంధించిన ఇతర విషయాలను అంటే యేసుక్రీస్తు ఇమిడివున్న అంశాలను పరిశీలించండి. తన కుమారుణ్ణి సృష్టించి ఆయనను యుగాలుగా “ప్రధాన శిల్పిగా” ఉపయోగించడంలో దేవుని మహాత్మ్యం ప్రదర్శించబడింది. (సామెతలు 8:​22-31) మానవాళి కోసం తన అద్వితీయ కుమారుణ్ణి విమోచన క్రయధన బలిగా అర్పించినప్పుడు యెహోవా ప్రేమ మహాత్మ్యం వెల్లడిచేయబడింది. (మత్తయి 20:28; యోహాను 3:16; 1 యోహాను 2:​1, 2) యేసు పునరుత్థానం చేయబడినప్పుడు యెహోవా ఆయన కోసం రూపొందించిన మహిమాన్విత అమర్త్య ఆత్మశరీరం మానవ అవగాహనకు అంతుబట్టే విషయం కాదు.​—⁠1 పేతురు 3:18.

10 గ్రహింప శక్యంకాని యెహోవా మహాత్మ్యానికి సంబంధించిన ఉత్తేజకరమైన అంశాలు అనేకం యేసు పునరుత్థానంలో ఇమిడివున్నాయి. దృశ్య మరియు అదృశ్య సృష్టి కార్యాలకు సంబంధించిన యేసు జ్ఞాపకశక్తిని దేవుడు నిస్సందేహంగా తిరిగి నెలకొల్పాడు. (కొలొస్సయులు 1:​15, 16) ఇతర ఆత్మసంబంధ ప్రాణులు, ఫలవర్ధక భూమి, మన గ్రహంమీది అన్ని రకాల జీవకోటి దీనిలో చేరివున్నాయి. ఆ కుమారుడు తన మానవపూర్వ ఉనికిలో చూసిన పరలోక, భూలోక జీవపు పూర్తి పరిజ్ఞానాన్ని తిరిగి పునరుద్ధరించడానికి తోడుగా యేసు పరిపూర్ణ మానవునిగా అనుభవించిన సంగతుల జ్ఞాపకాలను కూడా యెహోవా తిరిగి అనుగ్రహించాడు. అవును, యేసు పునరుత్థానం చేయబడడంలో, గ్రహింప శక్యంకాని యెహోవా మహాత్మ్యం స్పష్టమవుతోంది. అంతేకాకుండా, ఆ మహత్కార్యం ఇతరులు పునరుత్థానం చేయబడడం కూడా సాధ్యమేనని హామీయిస్తోంది. కాబట్టి దేవుడు తన జ్ఞాపకంలో ఉంచుకున్న కోటానుకోట్ల మృతులను తిరిగి జీవానికి తీసుకురాగలడని మనకున్న విశ్వాసాన్ని అది బలపరచాలి.​—⁠యోహాను 5:28, 29; అపొస్తలుల కార్యములు 17:31.

అద్భుత క్రియలు, మహత్కార్యాలు

11 యేసు పునరుత్థానం తర్వాత కూడా యెహోవా అనేక ఇతర అద్భుతకార్యాలు, మహత్కార్యాలు జరిగించాడు. (కీర్తన 40:⁠5) సా.శ. 33 పెంతెకొస్తునాడు పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన క్రీస్తు శిష్యులతో రూపొందించబడిన “దేవుని ఇశ్రాయేలు” అనే ఓ కొత్త జనాంగాన్ని యెహోవా ఉనికిలోకి తెచ్చాడు. (గలతీయులు 6:​16) ఓ విశేష రీతిలో ఈ కొత్త ఆధ్యాత్మిక జనాంగం అప్పుడు తెలిసిన ప్రపంచమంతటా విస్తరించింది. యేసు అపొస్తలుల మరణం తర్వాత క్రైస్తవమత సామ్రాజ్యం వృద్ధిచెందడానికి దారితీసిన మతభ్రష్టత్వం ఉన్నప్పటికీ యెహోవా తన సంకల్పాల నెరవేర్పును స్థిరపరచేందుకు మహత్కార్యాలు చేస్తూ వచ్చాడు.

12 ఉదాహరణకు, బైబిలు ప్రామాణిక పుస్తక సంచయం కాపాడబడి చివరకు నేడు భూమ్మీదవున్న ముఖ్య భాషలన్నింటిలోకి అనువదించబడింది. బైబిలు అనువాదం తరచూ కష్టపరిస్థితుల్లో, సాతాను ప్రతినిధుల ద్వారా కలిగిన ప్రాణ భయాల మధ్యనూ కొనసాగించబడింది. గ్రహింప శక్యంకాని మహాత్మ్యంగల యెహోవా దేవుని చిత్తమే కానట్లయితే, బైబిలును 2,000 కంటే ఎక్కువ భాషల్లోకి అనువదించడం నిశ్చయంగా సాధ్యమై ఉండేది కాదు!

13 యెహోవా రాజ్య సంకల్పాలకు సంబంధించి కూడా ఆయన మహాత్మ్యం కనపర్చబడింది. ఉదాహరణకు, 1914వ సంవత్సరంలో ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తును పరలోక రాజుగా సంస్థాపించాడు. ఆ వెంటనే యేసు సాతానుపై, అతని దయ్యాలపై చర్యతీసుకున్నాడు. వారు పరలోకంనుండి కిందకు పడద్రోయబడి ఈ భూపరిధికే పరిమితం చేయబడ్డారు, వారినిక అగాధంలో పడవేయడమే తరువాయి. (ప్రకటన 12:9-12; 20:​1-3) అప్పటినుండి, యేసు అభిషిక్త అనుచరులు అంతకంతకు ఎక్కువ హింస అనుభవించారు. అయితే, క్రీస్తుయొక్క ఈ అదృశ్య ప్రత్యక్షతా కాలంలో యెహోవా వారిని కాపాడుతూ వచ్చాడు.​—⁠మత్తయి 24:3; ప్రకటన 12:17.

14 యెహోవా తన మహాత్మ్యాన్ని ప్రదర్శించడానికి 1919వ సంవత్సరంలో మరో అద్భుతకార్యం జరిగించాడు. ఆధ్యాత్మిక క్రియాశూన్యతా స్థితికి తీసుకురాబడిన యేసు అభిషిక్త అనుచరులు ఉజ్జీవం పొందారు. (ప్రకటన 11:​3-11) ఆ తర్వాతి సంవత్సరాల నుండి అభిషిక్తులు ఆసక్తిగా స్థాపిత పరలోక రాజ్య సువార్తను ప్రకటించారు. 1,44,000 సంఖ్యను పూరించడానికి ఇతర అభిషిక్తులు సమకూర్చబడ్డారు. (ప్రకటన 14:​1-3) క్రీస్తు అభిషిక్త అనుచరుల ద్వారా యెహోవా నీతియుక్త మానవ సమాజమైన ‘క్రొత్త భూమికి’ పునాది వేశాడు. (ప్రకటన 21:⁠1) కానీ నమ్మకమైన అభిషిక్తులందరూ పరలోకానికి వెళ్లిపోయిన తర్వాత ‘క్రొత్త భూమికి’ ఏమి జరుగుతుంది?

15 ప్రకటన 7వ అధ్యాయంలో ప్రస్తావించబడిన ‘గొప్పసమూహానికి’ సంబంధించిన కీలకమైన ఆర్టికల్‌లు ఈ పత్రిక ఆగస్టు 1, ఆగస్టు 15, 1935 సంచికల్లో ప్రచురించబడ్డాయి. అభిషిక్త క్రైస్తవులు ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయాభాషలు మాట్లాడువారిలో నుండి ఈ తోటి ఆరాధకులను ఆసక్తిగా వెదకి తమ సాంగత్యంలోకి తీసుకురావడం ఆరంభించారు. “క్రొత్త భూమి”కి చెందిన శాశ్వత సభ్యులుగా పరదైసులో నిత్యం జీవించే ఉత్తరాపేక్షగల ఈ “గొప్ప సమూహము” సమీపిస్తున్న “మహాశ్రమలనుండి” తప్పించుకుంటారు. (ప్రకటన 7:​9-14) రాజ్య ప్రకటనను, శిష్యులనుచేసే పనిని అభిషిక్త క్రైస్తవులు ముందుకు తీసుకెళ్లారు కాబట్టే ఇప్పుడు 60 లక్షలకంటే ఎక్కువ మంది పరదైసు భూమిపై నిరంతరం జీవించే నిరీక్షణను కలిగివున్నారు. సాతాను నుండి అతని అవినీతికరమైన లోకం నుండి వ్యతిరేకత ఎదురైనప్పటికీ అలాంటి అభివృద్ధి సాధించబడినందుకు ఘనత ఎవరికి చెందాలి? (1 యోహాను 5:​19) కేవలం యెహోవా మాత్రమే తన పరిశుద్ధాత్మను ఉపయోగిస్తూ ఇదంతా చేయగలిగాడు.​—⁠యెషయా 60:22; జెకర్యా 4:6.

యెహోవా మహిమాన్విత వైభవం, ఘనత

16 యెహోవా “ఆశ్చర్య కార్యములు,” “పరాక్రమక్రియలు” ఎలాగున్నప్పటికీ అవి ఎన్నటికీ మరువలేనివి. దావీదు ఇలా వ్రాశాడు: “ఒక తరమువారు మరియొక తరమువారియెదుట నీ క్రియలను కొనియాడుదురు నీ పరాక్రమక్రియలను తెలియజేయుదురు మహోన్నతమైన నీ ప్రభావమహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను నీ భీకరకార్యముల విక్రమమును మనుష్యులు వివరించెదరు నేను నీ మహాత్మ్యమును వర్ణించెదను.” (కీర్తన 145:​4-6) అయితే, “దేవుడు ఆత్మ గనుక” మానవ నేత్రాలకు అదృశ్యుడు గనుక యెహోవా మహిమాన్విత వైభవాన్ని దావీదు ఎంతమేరకు తెలుసుకోగలిగాడు?​—⁠యోహాను 1:18; 4:24.

17 దావీదు దేవుణ్ణి కన్నులారా చూడలేకపోయినా, యెహోవా ఘనతపట్ల తన గౌరవాన్ని వృద్ధిచేసుకోవడానికి ఆయనకు మార్గాలున్నాయి. ఉదాహరణకు, భూవ్యాప్త జలప్రళయం ద్వారా దుష్టలోకాన్ని నాశనం చేయడంవంటి దేవుని పరాక్రమక్రియలు లేఖనాల్లో ఆయన చదవగలడు. దేవుడు ఐగుప్తు దాసత్వం నుండి ఇశ్రాయేలీయులను విడుదల చేసినప్పుడు ఐగుప్తు దేవతలు ఎలా అవమానపరచబడ్డారో దావీదు తెలుసుకొనివుంటాడు. అలాంటి సంఘటనలు యెహోవా ఘనతను, మహాత్మ్యాన్ని రుజువు చేస్తున్నాయి.

18 కేవలం లేఖనాలు చదవడమే కాదుగానీ వాటిని ధ్యానించడం ద్వారా దావీదు నిస్సందేహంగా దేవుని ఘనతపట్ల తన ప్రశంసా భావాన్ని వృద్ధిచేసుకున్నాడు. ఉదాహరణకు, యెహోవా ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఏమి జరిగిందో ఆయన ధ్యానించివుంటాడు. అప్పుడు ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘం, బూరయొక్క మహాధ్వని కలిగాయి. సీనాయి పర్వతం కంపించి ధూమంతో నిండిపోయింది. ఆ పర్వతం దిగువన సమావేశమైన ఇశ్రాయేలీయులు దేవదూత అయన ప్రతినిధి ద్వారా అగ్నిమధ్య నుండి మేఘం మధ్య నుండి యెహోవా “పది ఆజ్ఞలు” పలకడం సైతం విన్నారు. (ద్వితీయోపదేశకాండము 4:32-36; 5:22-24; 10:4; నిర్గమకాండము 19:16-20; అపొస్తలుల కార్యములు 7:​38, 53) యెహోవా మహాదివ్య వైభవాన్ని అవెంత భీకరంగా కనబరిచాయో కదా! ఈ వృత్తాంతాలను ధ్యానించే దేవుని వాక్య ప్రేమికులు ‘యెహోవా ఘనతయొక్క మహిమాన్విత వైభవం’ ద్వారా తప్పకుండా పురికొల్పబడతారు. యెహోవా మహాత్మ్యపు ప్రభావంతో మనపై ముద్రవేసే వివిధ మహిమాన్విత దర్శనాలు పొందుపరచబడిన మొత్తం బైబిలు నేడు మన దగ్గరుంది.​—⁠యెహెజ్కేలు 1:26-28; దానియేలు 7:​9, 10; ప్రకటన 4వ అధ్యాయం.

19 దేవుని ఘనతపట్ల దావీదు ముగ్ధుడు కావడానికి మరో కారణం ఆయన దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్ర నియమాలను అధ్యయనం చేయడం. (ద్వితీయోపదేశకాండము 17:18-20; కీర్తన 19:​7-11) యెహోవా ధర్మశాస్త్ర నియమాలకు విధేయత చూపించడం, ఇశ్రాయేలు జనాంగాన్ని ఘనపరచి ఇతర ప్రజల నుండి వారిని ప్రత్యేకపరచింది. (ద్వితీయోపదేశకాండము 4:​6-8) దావీదు విషయంలో నిజమైనట్లుగానే లేఖనాలను క్రమంగా చదవడం, వాటిని లోతుగా ధ్యానించడం, వాటిని పట్టుదలగా అధ్యయనం చేయడం యెహోవా ఘనతపట్ల మన ప్రశంసా భావాన్ని వృద్ధిచేస్తుంది.

దేవుని నైతిక లక్షణాలు ఎంత గొప్పవి!

20 మనం గమనించినట్లుగా, 145వ కీర్తనలోని మొదటి ఆరు వచనాలు గ్రహింప శక్యంకాని యెహోవా మహాత్మ్యానికి సంబంధించిన వాటినిబట్టి యెహోవాను స్తుతించడానికి మనకు విలువైన కారణాలను ఇచ్చాయి. 7 నుండి 9 వచనాలు యెహోవా నైతిక లక్షణాలను సూచిస్తూ ఆయన మహాత్మ్యాన్ని శ్లాఘిస్తున్నాయి. దావీదు ఇలా పాడుతున్నాడు: “నీ మహా దయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు నీ నీతినిగూర్చి వారు గానము చేసెదరు యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయముగలవాడు. యెహోవా అందరికి ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యములమీదనున్నవి.”

21 ఇక్కడ దావీదు అపవాదియైన సాతాను సవాలు చేసిన యెహోవా లక్షణాలైన దయాళుత్వం లేదా మంచితనాన్ని, నీతిని నొక్కిచెబుతున్నాడు. దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన పరిపాలనకు లోబడే వారందరిపై ఈ లక్షణాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? యెహోవా మంచితనం, నీతిగల ఆయన పరిపాలనా విధానం ఆయన ఆరాధకులకు ఎంతటి ఆనందాన్ని కలిగిస్తాయంటే వారు ఆయనను స్తుతించకుండా ఉండలేరు. అంతేకాకుండా, యెహోవా మంచితనం “అందరికి” విస్తరిస్తోంది. అనేకులు మారుమనస్సుపొంది, ఆలస్యం కాకముందే సత్యదేవుని ఆరాధకులు కావడానికి ఇది సహాయం చేస్తుందని ఆశిద్దాం.​—⁠అపొస్తలుల కార్యములు 14:15-17.

22 “యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా” అని ప్రకటిస్తూ ‘[మోషే] యెదుట దాటి వెళ్లినప్పుడు’ స్వయంగా దేవుడే నొక్కిచెప్పిన లక్షణాలను కూడా దావీదు విలువైనవిగా పరిగణించాడు. (నిర్గమకాండము 34:⁠6) అందుకే దావీదు ఇలా ప్రకటించగలిగాడు: “యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయముగలవాడు.” యెహోవా గ్రహింప శక్యం కానంత మహాత్మ్యంగలవాడైనా తన మానవ సేవకులపట్ల దయాదాక్షిణ్యాలు చూపిస్తూ వారిని ఘనపరుస్తాడు. యేసు విమోచన క్రయధన బలి ఆధారంగా పశ్చాత్తప్త పాపులను క్షమించడానికి ఇష్టపడే ఆయన కృపతో నిండినవాడు. యెహోవా దీర్ఘశాంతుడు కూడా ఎందుకంటే తన నీతియుక్త నూతనలోకంలోకి ప్రవేశించకుండా అడ్డుపడగల బలహీనతలను అధిగమించే అవకాశం కూడా ఆయన తన సేవకులకు ఇస్తున్నాడు.​—⁠2 పేతురు 3:9, 13, 14.

23 దేవుని ప్రేమపూర్వక దయ లేదా విశ్వసనీయ ప్రేమను దావీదు కొనియాడుతున్నాడు. నిజానికి, 145వ కీర్తనలోని మిగతా భాగం, యెహోవా ఈ లక్షణాన్ని ఎలా ప్రదర్శిస్తున్నాడు, ఆయన విశ్వసనీయ సేవకులు ఆయన ప్రేమపూర్వక దయకు ఎలా ప్రతిస్పందిస్తారో చూపిస్తోంది. ఈ అంశాలు తర్వాతి అర్టికల్‌లో పరిశీలించబడతాయి.

మీరెలా జవాబిస్తారు?

• ‘అనుదినం’ యెహోవాను స్తుతించేందుకు ఎలాంటి అవకాశాలున్నాయి?

• యెహోవా మహాత్మ్యం గ్రహింప శక్యం కాదని ఏ ఉదాహరణలు చూపిస్తున్నాయి?

• యెహోవా మహిమాన్విత ఘనతపట్ల ప్రశంసా భావాన్ని మనమెలా వృద్ధిచేసుకోగలం?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. దావీదు ఎలాంటివాడు, దేవునితో పోలిస్తే తనెలా ఉన్నట్లు ఆయన గమనించాడు?

3. (ఎ) ఇశ్రాయేలు రాజరికం విషయంలో దావీదుకు ఎలాంటి దృక్కోణం ఉంది? (బి) దావీదు ఎంతమేరకు యెహోవాను స్తుతించాలని కోరుకున్నాడు?

4. కీర్తన 145 ఎలాంటి అబద్ధాలను బహిర్గతం చేస్తోంది?

5, 6. యెహోవాను సన్నుతించి, స్తుతించడానికి ఎలాంటి అవకాశాలున్నాయి?

7. యెహోవాను స్తుతించడానికి ఓ ప్రధానమైన కారణాన్ని తెలపండి.

8. యెహోవా మహాత్మ్యం గురించి, శక్తి గురించి విశ్వం ఏమి వెల్లడిస్తోంది?

9, 10. (ఎ) యేసుక్రీస్తుకు సంబంధించి ఏయే విషయాల్లో యెహోవా మహాత్మ్యం ప్రదర్శించబడింది? (బి) యేసు పునరుత్థానం మన విశ్వాసంపై ఎలాంటి ప్రభావం చూపాలి?

11. సా.శ. 33 పెంతెకొస్తునాటి నుండి యెహోవా చేస్తున్న ఏ మహత్కార్యం ఆరంభమైంది?

12. భూమ్మీదవున్న ముఖ్య భాషలన్నింటిలో బైబిలు లభ్యమవుతోందనే వాస్తవం దేనికి రుజువు?

13. తన రాజ్య సంకల్పాలకు సంబంధించి 1914 నుండి యెహోవా మహాత్మ్యం ఎలా కనబరచబడింది?

14. యెహోవా 1919లో ఏ అద్భుతకార్యం చేశాడు, అది దేనిని నెరవేర్చింది?

15. అభిషిక్త క్రైస్తవులు ఏ పనిని ముందుకు తీసుకెళుతున్నారు, ఫలితాలెలా ఉన్నాయి?

16. ‘యెహోవా ఘనతకు సంబంధించిన మహిమాన్విత వైభవాన్ని’ మానవులెందుకు అక్షరార్థంగా చూడలేరు?

17, 18. ‘యెహోవా ఘనతయొక్క మహిమాన్విత వైభవం’పట్ల తనకున్న ప్రశంసా భావాన్ని దావీదు ఎలా వృద్ధిచేసుకోగలిగాడు?

19. యెహోవా ఘనతపట్ల మన ప్రశంసా భావాన్ని ఏది వృద్ధిచేస్తుంది?

20, 21. (ఎ) ఏ ఇతర లక్షణాల సంబంధించి కీర్తన 145:7-9 యెహోవా మహాత్మ్యాన్ని మహిమపరుస్తోంది? (బి) ఇక్కడ ప్రస్తావించబడిన దేవుని లక్షణాలు ఆయనను ప్రేమించే వారందరిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి?

22. యెహోవా తన సేవకులను ఎలా దృష్టిస్తాడు?

23. తర్వాతి అర్టికల్‌లో ఏ ప్రశస్త లక్షణం పరిశీలించబడుతుంది?

[10వ పేజీలోని చిత్రం]

విశ్వంలోని నక్షత్రవీధులు యెహోవా మహాత్మ్యాన్ని రుజువుచేస్తున్నాయి

[చిత్రసౌజన్యం]

Courtesy of Anglo-Australian Observatory, photograph by David Malin

[12వ పేజీలోని చిత్రం]

యేసుక్రీస్తుకు సంబంధించి యెహోవా మహాత్మ్యం ఎలా కనపరచబడింది?

[13వ పేజీలోని చిత్రం]

సీనాయి పర్వతం దగ్గర ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రాన్ని పొందినప్పుడు, వారికి యెహోవా మహిమాన్విత ఘనతకు రుజువు లభించింది