కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా విశ్వసనీయ ప్రేమను విస్తారముగా చూపిస్తాడు

యెహోవా విశ్వసనీయ ప్రేమను విస్తారముగా చూపిస్తాడు

యెహోవా విశ్వసనీయ ప్రేమను విస్తారముగా చూపిస్తాడు

‘యెహోవా . . . విస్తారముగా ప్రేమపూర్వక దయ చూపువాడు.’​—⁠కీర్తన 145:​8, NW.

“దేవుడు ప్రేమాస్వరూపి.” (1 యోహాను 4:⁠8) హృదయాన్ని ఉత్తేజపరిచే ఆ పదబంధం యెహోవా పరిపాలనా విధానం ప్రేమపై ఆధారపడి ఉందని నిరూపిస్తోంది. ఆయనకు లోబడని మానవులు సైతం ఆయన ప్రేమపూర్వకంగా దయచేస్తున్న సూర్యరశ్మి నుండి వర్షం నుండి ప్రయోజనం పొందుతున్నారు! (మత్తయి 5:​44, 45) మానవులపట్ల దేవుని ప్రేమనుబట్టి ఆయన శత్రువులు సైతం పశ్చాత్తాపపడి, ఆయనవైపు తిరిగి నిత్యజీవం పొందవచ్చు. (యోహాను 3:​16) అయితే తనను ప్రేమించువారు నీతియుక్త నూతనలోకంలో నిత్యజీవాన్ని అనుభవించగలుగునట్లు త్వరలోనే యెహోవా మారని దుష్టులను నిర్మూలిస్తాడు.​—⁠కీర్తన 37:9-11, 29; 2 పేతురు 3:13.

2 యెహోవా తన నిజ ఆరాధకులపట్ల ప్రశస్తమైన, శాశ్వతమైన ప్రేమను ప్రదర్శిస్తాడు. “ప్రేమపూర్వక దయ,” లేదా “విశ్వసనీయ ప్రేమ” అని అనువదించబడిన హీబ్రూ పదంతో అలాంటి ప్రేమ సూచించబడింది. ప్రాచీన ఇశ్రాయేలు రాజైన దావీదు దేవుని ప్రేమపూర్వక దయను ఎంతో విలువైనదిగా పరిగణించాడు. దావీదు తన వ్యక్తిగత అనుభవాన్ని, అలాగే ఇతరులతో దేవుని వ్యవహారాలను ధ్యానించాడు కాబట్టి నమ్మకంగా ఇలా చెప్పగలిగాడు: ‘యెహోవా . . . విస్తారముగా ప్రేమపూర్వక దయ [లేదా, ‘విశ్వసనీయ ప్రేమ’] చూపువాడు.’​—⁠కీర్తన 145:​8, NW.

దేవుని విశ్వసనీయులను గుర్తించడం

3 యెహోవా దేవుని గురించి సమూయేలు ప్రవక్త తల్లి హన్నా ఇలా చెప్పింది: “తన భక్తుల [‘విశ్వసనీయుల,’ NW] పాదములు తొట్రిల్లకుండ ఆయన వారిని కాపాడును.” (1 సమూయేలు 2:⁠9) అలాంటి ‘విశ్వసనీయులు’ ఎవరు? దానికి దావీదు రాజు జవాబిస్తున్నాడు. యెహోవా ఆశ్చర్యకార్యాలను కొనియాడిన తర్వాత, ఆయనిలా అంటున్నాడు: “నీ భక్తులు [‘విశ్వసనీయుల,’ NW] నిన్ను సన్నుతించుదురు.” (కీర్తన 145:​10) దేవుణ్ణి కొనియాడడం ద్వారా మానవులు ఆయనను సన్నుతిస్తారు.

4 యెహోవాను కొనియాడేవారు ఆయన విశ్వసనీయులుగా గుర్తించబడగలరు. సాంఘిక కూడికల్లో, క్రైస్తవ కూటాల్లో వారి సాధారణ చర్చాంశమేమిటి? సందేహమే లేదు, యెహోవా రాజ్యమే వారి చర్చాంశం! “నీ రాజ్యప్రభావమునుగూర్చి చెప్పుకొందురు నీ శౌర్యమునుగూర్చి పలుకుదురు” అని పాడిన దావీదు మనోభావాలనే దేవుని విశ్వసనీయ సేవకులూ పంచుకుంటారు.​—⁠కీర్తన 145:12.

5 తన విశ్వసనీయులు తనను స్తుతించినప్పుడు యెహోవా గమనిస్తాడా? అవును, వారి స్తుతిని ఆయన శ్రద్ధగా ఆలకిస్తాడు. మన కాలంలోని సత్యారాధనకు సంబంధించిన ఒక ప్రవచనంలో మలాకీ ఇలా వ్రాశాడు: “అప్పుడు, యెహోవాయందు భయభక్తులుగలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను.” (మలాకీ 3:​16) యెహోవా విశ్వసనీయులు ఆయనను కొనియాడినప్పుడు ఆయన సంతోషిస్తాడు, వారిని జ్ఞాపకముంచుకుంటాడు.

6 సత్య దేవుని ఆరాధించని ప్రజలతో యెహోవా గురించి మాట్లాడడానికి చొరవ తీసుకొని వారితో ధైర్యంగా మాట్లాడడం ద్వారా కూడా దేవుని విశ్వసనీయ సేవకులు గుర్తించబడతారు. అవును, దేవుని విశ్వసనీయులు ‘ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేస్తారు.’ (కీర్తన 145:​11) కొత్తవారితో యెహోవా రాజరికం గురించి మాట్లాడే అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి మీరు ప్రయత్నిస్తున్నారా? త్వరలో గతించిపోయే మానవ ప్రభుత్వాలకు భిన్నంగా ఆయన రాజరికం యుగయుగాలుంటుంది. (1 తిమోతి 1:​17) యెహోవా నిత్య రాజరికం గురించి ప్రజలు నేర్చుకొని, దాని మద్దతుదారులుగా దాని పక్షాన నిలబడడం అత్యవసరం. “నీ రాజ్యము శాశ్వతరాజ్యము నీ రాజ్యపరిపాలన తరతరములు నిలుచును” అని దావీదు పాడాడు.​—⁠కీర్తన 145:13.

7 యెహోవా రాజరికం గురించి మాట్లాడేందుకు 1914 నుండి ఇంకా ఎక్కువ కారణముంది. ఆ సంవత్సరంలోనే దావీదు కుమారుడైన యేసుక్రీస్తు రాజుగా దేవుడు పరలోకంలో మెస్సీయ రాజ్యాన్ని స్థాపించాడు. ఆ విధంగా యెహోవా, దావీదు రాజరికాన్ని యుగయుగాలు స్థిరపరుస్తానని చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాడు.​—⁠2 సమూయేలు 7:12, 13; లూకా 1:32, 33.

8 యేసు ప్రత్యక్షతా సూచనకు సంబంధించిన ప్రవచనం ఇప్పుడు నెరవేరుతూ ఉండడం, తన కుమారుడైన యేసుక్రీస్తు రాజ్యం ద్వారా యెహోవా ఇప్పుడు పరిపాలిస్తున్నాడనే దానికి రుజువునిస్తోంది. దేవుని విశ్వసనీయులందరూ చేస్తారని యేసు ప్రవచించిన పని ఆ సూచనలో ప్రముఖ భాగంగా ఉంటుంది. ఆ పని గురించి ఆయనిలా చెప్పాడు: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.” (మత్తయి 24:​3-14) ఆ ప్రవచనాన్ని దేవుని విశ్వసనీయులు నెరవేరుస్తున్నారు కాబట్టే అరవై లక్షలకు పైగా పురుషులు, స్త్రీలు, పిల్లలు మరెన్నడూ పునరావృతం కాని ఈ మహాప్రధాన పనిలో ఇప్పుడు భాగం వహిస్తున్నారు. యెహోవా రాజ్య వ్యతిరేకులందరికీ త్వరలోనే అంతం వస్తుంది.​—⁠ప్రకటన 11:15, 18.

యెహోవా సర్వాధిపత్యం నుండి ప్రయోజనం పొందడం

9 మనం సమర్పిత క్రైస్తవులమైతే, సర్వాధిపతియైన యెహోవాతో మనకున్న సంబంధం మనకెన్నో ప్రయోజనాలు చేకూరుస్తుంది. (కీర్తన 71:5; 116:​12) ఉదాహరణకు మనం దేవునికి భయపడి, నీతిని అభ్యసిస్తాము కాబట్టి మనమాయన ఆమోదం పొంది ఆధ్యాత్మికంగా ఆయనకు సన్నిహితంగా ఉంటాం. (అపొస్తలుల కార్యములు 10:34, 35; యాకోబు 4:⁠8) దానికి భిన్నంగా, మానవ పరిపాలకులు తరచూ ప్రముఖులతో అంటే సైనికాధికారులతో, ధనవంతులైన వ్యాపారస్థులతో లేదా క్రీడా వినోద రంగాల్లో ప్రసిద్ధులైన వారితో ఉండడం కనిపిస్తుంది. సొవెటెన్‌ అనే ఆఫ్రికన్‌ వార్తాపత్రిక ప్రకారం, తన దేశంలో పేదరికపు బారినపడ్డ ప్రాంతాల గురించి ఓ ప్రభుత్వాధికారి ఇలా అన్నాడు: “అలాంటి ప్రాంతాలకు మనలో చాలామంది వెళ్లడానికి ఎందుకు ఇష్టపడరో నాకు తెలుసు. ఎందుకంటే అలాంటి పరిస్థితులు ఉనికిలోవున్నాయనే విషయం మనం మరచిపోవాలనుకుంటాం. అది మన మనస్సాక్షిని కలవరపెడుతుంది, మనం ఖరీదైన [కార్లలో] తిరుగుతున్నందుకు సిగ్గుపడతాం.”

10 నిజమే, కొంతమంది మానవ పరిపాలకులకు తమ పౌరుల సంక్షేమం విషయంలో యథార్థమైన చింత ఉంటుంది. అయితే వారిలో ఎంతో ఉన్నతులైన పరిపాలకులకు కూడా తమ పౌరుల గురించి సన్నిహితంగా తెలియదు. అవును మనమిలా ప్రశ్నించవచ్చు: కష్టసమయాల్లో ప్రతీ ఒక్కరి సహాయార్థం తక్షణమే వచ్చేంతగా తన పౌరులందరిపట్ల శ్రద్ధచూపే పరిపాలకుడు ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు. దావీదు ఇలా వ్రాశాడు: “యెహోవా పడిపోవువారినందరిని ఉద్ధరించువాడు క్రుంగిపోయిన వారినందరిని లేవనెత్తువాడు.”​—⁠కీర్తన 145:14.

11 అసంపూర్ణత కారణంగా అలాగే ‘దుష్టుడైన’ సాతాను అధికారంలోవున్న లోకంలో జీవిస్తున్న కారణంగా యెహోవా విశ్వసనీయులకు అనేక పరీక్షలు, విపత్తులు కలుగుతాయి. (1 యోహాను 5:19; కీర్తన 34:​19) క్రైస్తవులు హింస అనుభవిస్తున్నారు. కొందరు దీర్ఘకాల రోగం లేదా వియోగంతో బాధపడుతున్నారు. కొన్నిసార్లు యెహోవాపట్ల విశ్వసనీయులుగా ఉన్నవారు తాము చేసిన పొరపాట్ల కారణంగా నిరుత్సాహంతో ‘క్రుంగిపోవచ్చు.’ అయితే వారికి ఎలాంటి పరీక్షలు వచ్చినా వారిలో ప్రతీ ఒక్కరిని ఓదార్చి ఆధ్యాత్మిక బలం చేకూర్చేందుకు యెహోవా అన్నిసమయాల్లో సంసిద్ధంగా ఉన్నాడు. రాజైన యేసుక్రీస్తుకు కూడా తన విశ్వసనీయ ప్రజలపట్ల అదేవిధమైన ప్రేమపూర్వక శ్రద్ధవుంది.​—⁠కీర్తన 72:​12-14.

తగినకాలంలో సంతృప్తికరమైన ఆహారం

12 యెహోవా తన గొప్ప ప్రేమపూర్వక దయనుబట్టి తన సేవకుల అవసరాలన్నీ తీరుస్తున్నాడు. దీనిలో సంతృప్తికరమైన పోషకాహారమిచ్చి వారిని సంతృప్తిపరచడం కూడా ఉంది. దావీదు రాజు ఇలా వ్రాశాడు: “[యెహోవా] సర్వజీవుల కన్నులు నీవైపు చూచుచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారమిచ్చుదువు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరచుచున్నావు.” (కీర్తన 145:​15, 16) విపత్తు కలిగిన సమయాల్లో సైతం తన విశ్వాసులు “అనుదినాహారము” పొందేలా యెహోవా అనుకూల పరిస్థితులను కల్పించగలడు.​—⁠లూకా 11:3; 12:29, 30.

13 “ప్రతిజీవి” తృప్తిపడడం గురించి దావీదు ప్రస్తావించాడు. అందులో జంతువులు కూడా ఉన్నాయి. భూమిపై విస్తారమైన వృక్షసంపద, సముద్రాల్లో మొక్కలు లేకపోతే జలచరాలు, పక్షులు, భూమ్మీది జంతువులు పీల్చుకోవడానికి ప్రాణవాయువు ఉండదు, మేయడానికి ఆహారం లభించదు. (కీర్తన 104:​14) కానీ వాటి అవసరాలన్నీ తీరేటట్లు యెహోవా చూస్తున్నాడు.

14 జంతువులకు భిన్నంగా మానవులకు ఆధ్యాత్మిక అవసరాలున్నాయి. (మత్తయి 5:⁠3) తన విశ్వసనీయుల ఆధ్యాత్మిక అవసరాలను యెహోవా ఎంత అద్భుతంగా తీరుస్తున్నాడో కదా! యేసు అనుచరులకు “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” “తగినవేళ” ఆధ్యాత్మిక ఆహారం అందిస్తాడని తన మరణానికి ముందు యేసు వాగ్దానం చేశాడు. (మత్తయి 24:​45) నేడు 1,44,000లోని అభిషిక్తుల శేషము ఆ దాసుని తరగతిగా ఉంది. వారి ద్వారా యెహోవా నిజంగానే ఆధ్యాత్మిక ఆహారాన్ని సమృద్ధిగా దయచేస్తున్నాడు.

15 ఉదాహరణకు, నేడు యెహోవా ప్రజలు చాలామంది తమ సొంత భాషలో కొత్తదీ, ప్రామాణికమైనదీ అయిన బైబిలు అనువాదం నుండి ప్రయోజనం పొందుతున్నారు. పరిశుద్ధ లేఖనముల నూతనలోక అనువాదము (ఆంగ్లం) ఎంత అద్భుతమైన ఆశీర్వాదమో గదా! అంతేకాక, 300 కంటే ఎక్కువ భాషల్లో కోట్లకొలది బైబిలు అధ్యయన సహాయక పుస్తకాలు నిరంతరం ప్రచురించబడుతున్నాయి. ఈ ఆధ్యాత్మిక ఆహారమంతా భూవ్యాప్తంగావున్న సత్యారాధకులకు ఓ ఆశీర్వాదమే. దీనంతటి ఘనత ఎవరికి చెందాలి? యెహోవా దేవునికే. తన ప్రేమపూర్వక దయ ద్వారా దాసుని తరగతి ‘తగిన కాలమున ఆహారం’ ఇవ్వడాన్ని ఆయన సాధ్యం చేశాడు. ఇలాంటి ఏర్పాట్ల ద్వారా నేటి ఆధ్యాత్మిక పరదైసులో ఉన్న ‘ప్రతిజీవి కోరిక తృప్తిపరచబడుతోంది.’ త్వరలోనే ఈ భూమి భౌతిక పరదైసుగా మారడంచూసే నిరీక్షణలో యెహోవా సేవకులు ఎంతగా ఆనందిస్తున్నారో కదా!​—⁠లూకా 23:​42, 43.

16 తగిన కాలమున ఆధ్యాత్మిక ఆహారం పొందిన ఓ అసాధారణ ఉదాహరణను పరిశీలించండి. 1939లో ఐరోపాలో రెండవ ప్రపంచ యుద్ధం ఆరంభమైంది. అదే సంవత్సరం, కావలికోట (ఆంగ్లం) నవంబరు 1వ సంచికలో “తటస్థత” అనే ఆర్టికల్‌ వచ్చింది. అందులో ఇవ్వబడిన స్పష్టమైన సమాచారం ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా యెహోవాసాక్షులు, యుద్ధంచేస్తున్న దేశాల వ్యవహారాల్లో ఖచ్చితమైన తటస్థత పాటించే అవసరాన్ని గ్రహించారు. దీనితో ఆ ఆరు సంవత్సరాల కాలంలో ఇరువైపుల ప్రభుత్వాల ఆగ్రహం వారిపై పెల్లుబికింది. అయితే నిషేధించబడి, హింసించబడ్డప్పటికీ దేవుని విశ్వసనీయులు రాజ్య సువార్తను నిర్విరామంగా ప్రకటిస్తూవచ్చారు. 1939 నుండి 1946 మధ్యకాలంలో ఆశ్చర్యంగొలిపే రీతిలో వారు 157 శాతం అభివృద్ధితో ఆశీర్వదించబడ్డారు. అంతేకాకుండా ఆ యుద్ధకాలంలో వారు చూపించిన అసాధారణ యథార్థత, సత్యమతాన్ని గుర్తించేందుకు ప్రజలకు ఇంకా సహాయపడుతూనే ఉంది.​—⁠యెషయా 2:2-4.

17 యెహోవా అందజేస్తున్న ఆధ్యాత్మిక ఆహారం కేవలం తగినవేళ లభించేదే కాదుగాని సంతృప్తిదాయకమైంది కూడా. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఆయాదేశాలు యుద్ధంలో పూర్తిగా మునిగివుండగా యెహోవా ప్రజలకు తమ సొంత రక్షణకంటే మరెంతో ప్రాముఖ్యమైన మరో అంశంపై దృష్టి నిలిపేందుకు వారికి సహాయం చేయబడింది. విశ్వమంతా ఇమిడివున్న ప్రాథమిక వివాదాంశం యెహోవా సర్వాధిపత్యపు హక్కుకు సంబంధించిందని అర్థంచేసుకోవడానికి యెహోవా వారికి సహాయం చేశాడు. ప్రతీ యెహోవాసాక్షి విశ్వసనీయంగా ఉండడం ద్వారా యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించడంలో, అపవాది అబద్ధికుడని నిరూపించడంలో చిన్న పాత్రను పోషిస్తున్నాడని తెలుసుకోవడం ఎంత సంతృప్తిదాయకమో కదా! (సామెతలు 27:​11) యెహోవాపై, ఆయన పరిపాలనా విధానంపై అబద్ధాలుచెప్పే సాతానులా కాకుండా యెహోవాకు విశ్వసనీయంగా ఉన్నవారు బహిరంగంగా, “యెహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు” అని అవిశ్రాంతంగా ప్రకటిస్తున్నారు.​—⁠కీర్తన 145:17.

18 తగినకాలంలో, సంతృప్తికరమైన ఆహారం అందించబడుతోందనడానికి, ప్రపంచవ్యాప్తంగా 2002/03లో జరిగిన వందలాది “ఆసక్తిగల రాజ్య ప్రచారకులు” జిల్లా సమావేశాల్లో విడుదల చేయబడిన యెహోవాకు సన్నిహితమవండి పుస్తకం మరో ఉదాహరణ. “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” తయారుచేసిన, యెహోవాసాక్షులచే ప్రచురించబడిన ఈ పుస్తకం 145వ కీర్తనలో పేర్కోబడ్డవాటితోపాటు యెహోవా దేవుని అద్భుత లక్షణాలపై దృష్టి కేంద్రీకరిస్తుంది. దేవునికి మరింత సన్నిహితమవడానికి ఆయన విశ్వసనీయులకు సహాయం చేయడంలో ఈ చక్కని పుస్తకం తప్పక ఓ ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

యెహోవాకు సన్నిహితం కావలసిన సమయం

19 యెహోవా సర్వాధిపత్యపు వివాదం పరిష్కరించబడే నిర్ణయాత్మక రంగం సమీపిస్తోంది. యెహెజ్కేలు 38వ అధ్యాయంలో ముందే చెప్పబడినట్లుగా సాతాను త్వరలోనే ‘మాగోగు దేశపువాడగు గోగుగా’ తన పాత్ర ముగిస్తాడు. దీనిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా యెహోవా ప్రజలపై దాడి చేయబడుతుంది. అది దేవుని విశ్వసనీయుల యథార్థతను విచ్ఛిన్నం చేయడానికి సాతాను చేసే తీవ్రమైన దాడిగా ఉంటుంది. ముందెన్నడూలేని విధంగా యెహోవా ఆరాధకులు సహాయం కోసం ఆయనకు హృదయపూర్వకంగా ప్రార్థించాల్సిన అవసరం ఉంటుంది. దేవునిపట్ల వారికున్న పూజ్యభయం, ప్రేమ నిరర్థకమవుతుందా? ఎంతమాత్రం కాదు. ఎందుకంటే 145వ కీర్తన ఇలా చెబుతోంది: “తనకు మొఱ్ఱపెట్టువారి కందరికి తనకు నిజముగా మొఱ్ఱపెట్టువారి కందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు. తనయందు భయభక్తులుగలవారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొఱ్ఱ ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించువారినందరిని కాపాడును అయితే భక్తిహీనులనందరిని ఆయన నాశనము చేయును.”​—⁠కీర్తన 145:18-20.

20 దుష్టులందరినీ యెహోవా నిర్మూలించినప్పుడు ఆయన సన్నిహితత్వాన్ని, రక్షించే శక్తిని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం ఎంత ఉత్కంఠభరితంగా ఉంటుందో కదా! ఇప్పుడు ఆ నిర్ణయాత్మక సమయం ఎంతో సమీపంగా ఉంది, యెహోవా కేవలం “నిజముగా మొఱ్ఱపెట్టువారి” ప్రార్థనలే వింటాడు. వేషధారుల ప్రార్థనలు ఆయన ఖచ్చితంగా వినడు. దుష్టులు చివరి క్షణంలో ఆయన నామం ఉపయోగించడం అన్ని సందర్భాల్లో వ్యర్థమని నిరూపించబడినట్లు దేవుని వాక్యం స్పష్టంగా చూపిస్తోంది.​—⁠సామెతలు 1:28, 29; మీకా 3:4; లూకా 13:​24, 25, 26.

21 యెహోవాకు భయపడువారు ముందెన్నటికంటే ఎక్కువగా ఆయనకు “నిజముగా మొఱ్ఱపెట్ట”వలసిన సమయం ఇదే. ఆయన విశ్వసనీయులు తమ ప్రార్థనల్లో, కూటాల్లో తాముచేసే వ్యాఖ్యానాల్లో ఆయన పేరు ఉపయోగించడానికి ఆనందిస్తారు. వ్యక్తిగత సంభాషణల్లోనూ వారు ఆ దైవనామం ఉపయోగిస్తారు. మరియు వారు తమ బహిరంగ పరిచర్యలో యెహోవా నామాన్ని ధైర్యంగా ప్రకటిస్తారు.​—⁠రోమీయులు 10:10, 13-15.

22 మన దేవుడైన యెహోవాతో సన్నిహిత సంబంధం నుండి ఎల్లప్పుడూ ప్రయోజనం పొందడానికి, ఐశ్వర్యాసక్తి, హానికరమైన వినోదం, క్షమించలేని గుణం లేదా అవసరతలో ఉన్నవారిపట్ల ఉదాసీనంగా ఉండడం వంటి ఆధ్యాత్మిక హానికర విషయాలను అవిశ్రాంతంగా ఎదిరించడం కూడా ఆవశ్యకం. (1 యోహాను 2:15-17; 3:​15-17) సరిదిద్దుకోనట్లయితే అలాంటి ప్రవృత్తులు, లక్షణాలు అలవాటుగా గంభీరమైన పాపాలు చేయడానికీ అలాగే చివరకు యెహోవా ఆమోదం కోల్పోవడానికీ కారణం కాగలవు. (1 యోహాను 2:​1, 2; 3:⁠6) మనమాయనకు నమ్మకంగా నిలిచివుంటేనే మనపట్ల యెహోవా తన ప్రేమపూర్వక దయను లేదా విశ్వసనీయ ప్రేమను ఎల్లప్పుడూ చూపిస్తాడని మదిలో ఉంచుకోవడం జ్ఞానయుక్తం.​—⁠2 సమూయేలు 22:26.

23 కాబట్టి యెహోవా విశ్వసనీయులందరి కోసం వేచివున్న గొప్ప భవిష్యత్తుపై మన ఆలోచనలను కేంద్రీకరిద్దాం. అలా చేయడం ద్వారా, “అనుదినము” అలా “నిత్యము” యెహోవాను కొనియాడే, సన్నుతించే, స్తుతించే వారు కలిగివున్న ఉత్తరాపేక్ష మనకూ ఉంటుంది. (కీర్తన 145:​1, 2) అందువల్ల మనం ‘నిత్యజీవార్థమై దేవుని ప్రేమలో నిలిచి’ ఉందము గాక. (యూదా 20, 21) తనను ప్రేమించు వారిపట్ల మన పరలోక తండ్రి చూపించే గొప్ప ప్రేమపూర్వక దయతోపాటు ఆయన అద్భుత లక్షణాల నుండి మనం ప్రయోజనం పొందుచుండగా, అన్ని సందర్భాల్లో మనం “నా నోరు యెహోవాను స్తోత్రము చేయును శరీరులందరు ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురు గాక” అని 145వ కీర్తన ముగింపు మాటల్లో దావీదు వ్యక్తంచేసిన భావావేశాలనే మనమూ వ్యక్తపరుద్దాం.

మీరెలా జవాబిస్తారు?

• దేవునిపట్ల విశ్వసనీయంగా ఉన్నవారిని గుర్తించేందుకు 145వ కీర్తన ఎలా సహాయం చేస్తుంది?

• యెహోవా ఎలా ‘ప్రతిజీవి కోరికను తృప్తిపరుస్తాడు’?

• యెహోవాకు మనమెందుకు సన్నిహితులం కావాలి?

[అధ్యయన ప్రశ్నలు]

1. దేవుని ప్రేమ ఎంత విస్తారమైనది?

2. తనతో సమర్పిత సంబంధమున్న వారిపట్ల యెహోవా ఏ ప్రత్యేక ప్రేమ చూపిస్తాడు?

3, 4. (ఎ) యెహోవా విశ్వసనీయులను గుర్తించడానికి 145వ కీర్తన మనకెలా సహాయం చేస్తోంది? (బి) దేవుని విశ్వసనీయులు ఆయననెలా ‘సన్నుతిస్తారు’?

5. విశ్వసనీయులు యెహోవాను కొనియాడినప్పుడు ఆయన గమనిస్తాడని మనకెలా తెలుసు?

6. దేవుని విశ్వసనీయులను మనం గుర్తించడానికి వారు నిర్వర్తించే ఏ పని సహాయం చేస్తుంది?

7, 8. 1914లో ఏమి జరిగింది, దేవుడు ప్రస్తుతం తన కుమారుని రాజ్యం ద్వారా పరిపాలిస్తున్నాడనేందుకు ఎలాంటి రుజువుంది?

9, 10. యెహోవాకు మానవ పరిపాలకులకు మధ్య ఎలాంటి తేడా ఉంది?

11. దేవుని విశ్వసనీయులకు ఎలాంటి పరీక్షలు ఎదురుకావచ్చు, వారికి ఎలాంటి సహాయం అందుబాటులో ఉంది?

12, 13. “ప్రతిజీవి” అవసరాలను యెహోవా ఎంత బాగా తీరుస్తున్నాడు?

14, 15. నేడు ఆధ్యాత్మిక ఆహారం ఎలా అందించబడుతోంది?

16, 17. (ఎ) ఆధ్యాత్మిక ఆహారం తగిన కాలంలో అందించబడిందని ఏ ఉదాహరణలు చెబుతున్నాయి? (బి) సాతాను లేవదీసిన ప్రాథమిక వివాదాంశానికి సంబంధించి దేవుని విశ్వసనీయుల భావాలను 145వ కీర్తన ఎలా వ్యక్తం చేస్తోంది?

18. ఇటు తగినకాలంలో అటు అత్యంత సంతృప్తికరమైన ఆధ్యాత్మిక ఆహారం అందించబడిందనడానికి ఇటీవల ఏ ఉదాహరణ ఉంది?

19. ఎలాంటి నిర్ణయాత్మక సమయం సమీపిస్తోంది, మనం ఆ పరిస్థితిని ఎలా తాళుకోవచ్చు?

20. కీర్తన 145:18-20లోని మాటలు నిజమని సమీప భవిష్యత్తులో ఎలా నిరూపించబడతాయి?

21. దైవిక నామాన్ని ఉపయోగించడంలో తాము ఆనందిస్తున్నామని యెహోవా విశ్వసనీయులు ఎలా చూపిస్తారు?

22. ప్రాపంచిక దృక్పథాలను, కోరికలను ఎదిరించడం ఎందుకు ఆవశ్యకం?

23. దేవునిపట్ల విశ్వసనీయంగా ఉన్నవారందరికీ ఎలాంటి గొప్ప భవిష్యత్తు వేచివుంది?

[16వ పేజీలోని చిత్రం]

దేవుని విశ్వసనీయులు ఆయన పరాక్రమ క్రియల గురించి చర్చించడంలో ఆనందిస్తారు

[17వ పేజీలోని చిత్రం]

యెహోవా సేవకులు ఆయన రాజరికం గురించి నేర్చుకోవడానికి కొత్తవారికి ధైర్యంగా సహాయం చేస్తారు

[18వ పేజీలోని చిత్రాలు]

‘ప్రతిజీవికి’ యెహోవా ఆహారాన్ని అందిస్తున్నాడు

[చిత్రసౌజన్యం]

జంతువులు: Parque de la Naturaleza de Cabárceno

[19వ పేజీలోని చిత్రం]

ప్రార్థనలో తన సహాయం కోసం వెదికే తన విశ్వసనీయులకు యెహోవా బలాన్ని, నిర్దేశాన్ని ఇస్తున్నాడు