కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“యెహోవా వృక్షములు తృప్తిపొందుచున్నవి”

“యెహోవా వృక్షములు తృప్తిపొందుచున్నవి”

యెహోవా సృష్టి వైభవాలు

“యెహోవా వృక్షములు తృప్తిపొందుచున్నవి”

అడవిలో నిలబడి ఎత్తైన వృక్షాల మధ్యగా జాలువారే సూర్యకిరణాలను మీరెప్పుడైనా చూశారా? ఆకుల్లోంచి గాలి రివ్వున వీచినప్పుడు వచ్చే శబ్దాన్ని మీరెప్పుడైనా విన్నారా?​—⁠యెషయా 7:2.

సంవత్సరంలో ఒకానొక రుతువులో భూమ్మీది కొన్ని ప్రాంతాల్లోని వివిధ వృక్షాల ఆకులు ఎరుపు, నారింజ, పసుపు రంగులతోపాటు ఇతర రంగుల్లో మెరుస్తుంటాయి. నిజానికి, అడవికి నిప్పంటుకుందా అన్నట్లు అవి కనబడతాయి! వాటికి ఈ వర్ణన చక్కగా సరిపోతుంది: “పర్వతములారా, అరణ్యమా, అందులోని ప్రతివృక్షమా, సంగీతనాదము చేయుడి.”​—⁠యెషయా 44:23. *

భూగ్రహంపై దాదాపు ఒకింట మూడవవంతు భాగం అడవులే వ్యాపించివున్నాయి. అడవులూ వాటిలోని విస్తారమైన జీవకోటి వాటి రూపకర్త, సృష్టికర్త అయిన యెహోవా దేవుణ్ణి ఘనంగా మహిమపరుస్తున్నాయి. ‘ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, యెహోవాను స్తుతించుడి’ అని ప్రేరేపిత కీర్తనకర్త పాడాడు.​—⁠కీర్తన 148:7-9.

“వృక్షాలు మానవుని ఉనికికి ఇటు వస్తుపరంగా అటు నేత్రానంద సౌందర్యానికి అతి ప్రాముఖ్యము” అని ద ట్రీస్‌ ఎరౌండ్‌ అస్‌ అనే పుస్తకం చెబుతోంది. అడవులు మానవాళి యొక్క స్వచ్ఛమైన నీటి సరఫరాను కాపాడుతూ, ఆసరా ఇస్తూ, వృద్ధి చేస్తుంటాయి. వృక్షాలు గాలిని కూడా స్వచ్ఛపరుస్తాయి. కిరణజన్య సంయోగ క్రియ అనే ఆశ్చర్యకరమైన ప్రక్రియ ద్వారా పత్రకణాలు బొగ్గుపులుసు వాయువును, నీటిని, ఖనిజాలను, సూర్యరశ్మిని పోషక పదార్థాలుగా, ప్రాణవాయువుగా మారుస్తాయి.

అడవి సౌందర్యానికీ, పరికల్పనకూ మచ్చుతునక. అడవుల్లో సాధారణంగా మహావృక్షాలు అత్యంత ఉత్తేజం కలిగించేవిగా ఉంటాయి. ఆ మహావృక్షాల మధ్య పుష్ప బీజరహిత మొక్కలు, నాచు, తీగమొక్కలు, పొదలు, ఓషధులు విస్తారంగా పెరుగుతాయి. అలాంటి మొక్కలన్నీ వృక్షాలు కలిగించే పర్యావరణంపై ఆధారపడి వాటి నీడలో అడవి ఇచ్చే తేమ పీల్చుకుంటూ పెరుగుతాయి.

కొన్ని అడవుల్లో ఆకులురాలే సంవత్సరాంత కాలంలో అడవినేలపై ఒక ఎకరం స్థలంలో దాదాపు ఒక కోటి ఆకులు రాలతాయి. ఆ ఆకులకు ఏంజరుగుతుంది? కీటకాలు, బూజు, క్రిములు ఇతర సూక్ష్మజీవులు ఈ సేంద్రియ పదార్థాన్నంతా సారవంతమైన నేలకు అతి ప్రాముఖ్య భాగమైన ఆకుపెంటగా మారుస్తాయి. అవును, ఈ మూగ కార్మికులు నవ్యాభివృద్ధికి నేలమట్టిని సిద్ధం చేస్తుండగా ఏదీ వృధాకాదు.

ఎండిపోయిన ఆకుల కిందున్న నేలలో విస్తారంగా క్రిమికీటకాలు జీవిస్తుంటాయి. ద ఫారెస్ట్‌ అనే పుస్తకం ప్రకారం, “గుప్పెడు మట్టిలోవుండే వందలకోట్ల సూక్ష్మజీవులు కాకుండా, కేవలం 2.5 సెంటీమీటర్ల లోతున్న 30 సెంటీమీటర్ల చదరపు స్థలంలో . . . దాదాపు 1,350 క్రిమికీటకాలను కనుక్కోవచ్చు.” అంతేకాకుండా, సమృద్ధిగా సరీసృపాలు, పక్షులు, కీటకాలు, సస్తన జంతువులు అడవుల్లో జీవిస్తుంటాయి. ఈ సౌందర్యానికీ, వైవిధ్యానికీ ఘనత ఎవరికి చెందాలి? సముచితంగానే వాటి సృష్టికర్త ఇలా ప్రకటిస్తున్నాడు: “అడవిమృగములన్నియు వేయికొండలమీది పశువులన్నియు నావేగదా.”​—⁠కీర్తన 50:10.

కొన్ని జంతువులు అసాధారణ నిశ్చలనిద్రా సామర్థ్యంతో సృష్టించబడ్డాయి కాబట్టి అవి ఎముకలుకొరికే శీతాకాలంలో, చాలాకాలం ఆహారం లభించని పరిస్థితుల్లో సైతం బ్రతకగలుగుతాయి. అయితే అన్ని జంతువులు నిశ్చలనిద్రలో గడపలేవు. శీతాకాలం మధ్యలో కూడా దుప్పులు పొలాలకు అడ్డంగా గెంతుతూ పరుగెత్తడాన్ని మీరు చూడవచ్చు. దుప్పులు నిశ్చలనిద్రపోవు లేదా ఆహారం దాచిపెట్టుకోవు, బదులుగా జర్మనీ నుండి వచ్చిన ఈ బొమ్మలో కనిపిస్తున్నట్టుగా అవి లేత చిగుళ్లు, మొగ్గలు మేస్తూ బ్రతుకుతాయి.

లేఖనాల్లో మొక్కలు ప్రత్యేకంగా పేర్కోబడ్డాయి. ఒక లెక్క ప్రకారం బైబిలు 30 రకాల వృక్షాలతోపాటు దాదాపు 130 రకాల మొక్కలను ప్రస్తావిస్తోంది. బైబిల్లో అలా మొక్కలు ప్రస్తావించబడడం యొక్క ప్రాధాన్యతపై వ్యాఖ్యానిస్తూ, వృక్షశాస్త్రవేత్త మిఖాయేల్‌ జోహారే ఇలా వ్రాస్తున్నాడు: “జీవితంలోని వివిధ దశలకు సంబంధించిన మొక్కల ప్రస్తావన బైబిల్లో ఉన్నంత విస్తారంగా సాధారణ వృత్తేతర లౌకిక సాహిత్యాల్లో మనకు కనబడదు.”

వృక్షాలు అడవుల్లో ప్రేమగల సృష్టికర్త దయచేసిన సునిశిత వరాలు. అడవుల్లో సమయం గడిపితే మనం కీర్తనకర్త పలికిన ఈ మాటలతో తప్పకుండా ఏకీభవిస్తాం: “యెహోవా వృక్షములు తృప్తిపొందుచున్నవి. ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తిపొందుచున్నవి. అచ్చట పక్షులు తమ గూళ్లు కట్టుకొనును.”​—⁠కీర్తన 104:16, 17.

[అధస్సూచి]

^ పేరా 4 2004 యెహోవాసాక్షుల క్యాలెండర్‌ (ఆంగ్లం)లో జనవరి/ఫిబ్రవరి చూడండి.

[9వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

మధ్యప్రాచ్య వృక్షాల్లో అతిగా ముచ్చటగొలిపే చెట్టు బాదంచెట్టు. సంవత్సర తొలిభాగంలో, ఇతర వృక్షాలన్నింటికంటే చాలాముందుగా ఇది నిద్ర మేల్కొంటుంది. తొందరగా పూతకు వస్తుందని చెప్పడానికి ప్రాచీనకాల హెబ్రీయులు బాదంచెట్టును మేల్కొలిపే చెట్టు అని పిలిచేవారు. మృదువైన గులాబీరంగు లేదా తెల్లని పూమొగ్గలతో పేరుకు తగ్గట్టే ఆ చెట్టు మేల్కొన్నట్టుగా ఉంటుంది.​—⁠ప్రసంగి 12:5.

దాదాపు 9,000 రకాల తెలిసిన పక్షిజాతుల్లో రమారమి 5,000 పక్షులు సునాదపక్షులుగా వర్గీకరించబడ్డాయి. వాటి పాటలు అరణ్య నిశబ్దాన్ని ఛేదిస్తాయి. (కీర్తన 104:​12) ఉదాహరణకు, పిచ్చుక పాడే పాట కూర్చినగీతంలా మృదుమధురంగా ఉంటుంది. ఇక్కడ బొమ్మలో చూపబడిన పాడే వార్‌బ్లర్‌ పిట్టలు ప్రకాశవంతమైన గోధుమ, పసుపు, ఆలివ్‌పచ్చ రంగుల్లో బుల్లి గాయకుల్లా అలంకరించబడ్డాయి.​—⁠కీర్తన 148:1, 10.

[9వ పేజీలోని చిత్రం]

ఫ్రాన్స్‌లో నార్మండీ అడవి