‘హస్తకృతములైన ఆలయాల్లో దేవుడు నివసించడు’
‘హస్తకృతములైన ఆలయాల్లో దేవుడు నివసించడు’
అపొస్తలుడైన పౌలుకు ఏథెనా దేవాలయాల గురించి ఖచ్చితంగా తెలిసేవుంటుంది, ఎందుకంటే ఆయన మిషనరీ యాత్రలు చేసినప్పుడు సందర్శించిన అనేక పట్టణాల్లో ఆ దేవాలయాలు ఉండేవి. ది ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ప్రకారం, ఏథెనా దేవత యుద్ధానికి, జ్ఞానానికే కాక “వృత్తికళలకు, శాంతిసమయాల్లో చేసే ప్రవీణతగల సాధారణ వృత్తులకు” కూడా దేవతగా పేరుగాంచింది.
ఏథెనా దేవాలయాల్లో పార్తెనాన్ అత్యంత ప్రసిద్ధిగాంచిన దేవాలయం, అది ఆ దేవత పేరు పెట్టబడిన ఏథెన్సు నగరంలో నిర్మించబడింది. ప్రాచీన లోకానికి చెందిన మహాగొప్ప దేవాలయాల్లో ఒకటిగా పరిగణించబడే పార్తెనాన్ దేవాలయంలో, బంగారంతోను ఏనుగు దంతంతోను చేయబడిన 12 మీటర్ల ఎత్తుగల ఏథెనా విగ్రహం ఉంది. పౌలు ఏథెన్సును సందర్శించినప్పుడు, ఆ పాలరాతి దేవాలయం అప్పటికే ఆ నగరంలో దాదాపు 500 సంవత్సరాలుగా విరాజిల్లుతోంది.
పార్తెనాన్ సమీపంలోనే పౌలు, ఏథెన్సువాసుల ఓ గుంపుకు హస్తకృతాలయాల్లో నివసించని దేవుని గురించి ప్రకటించాడు. (అపొస్తలుల కార్యములు 17:23, 24) బహుశా ఏథెనా దేవాలయాల వైభవం లేదా ఆ దేవతా ప్రతిమల శోభ పౌలు శ్రోతల్లోని కొందరిని, తమకు తెలియని అదృశ్య దేవునికంటే ఎక్కువగా ముగ్ధుల్ని చేసివుంటుంది. అయితే పౌలు సూచించినట్లుగా, మానవుల్ని చేసిన సృష్టికర్త “మనుష్యుల కల్పనలవలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను” పోలియున్నాడని తలంచకూడదు.—అపొస్తలుల కార్యములు 17:29.
దేవాలయాలపై, ప్రతిమల మహిమపై ఆధారపడిన ఏథెనావంటి దేవతలూ దేవుళ్లూ వచ్చారు పోయారు. పార్తెనాన్‌లో ఏథెనా ప్రతిమ సా.శ. 5వ శతాబ్దంలో కనబడకుండాపోయింది, ఆ దేవతకు సంబంధించిన ఆలయాల్లో కొన్నింటి శిథిలాలు మాత్రమే ఉనికిలో ఉన్నాయి. నేడు జ్ఞానం కోసం, మార్గదర్శకత్వం కోసం ఎవరైనా ఏథెనావైపు చూస్తున్నారా?
ఏ మానవుడు ఎన్నడూ చూడని ‘నిత్యదేవుడైన’ యెహోవా విషయంలో పరిస్థితి ఎంతో భిన్నంగా ఉంది. (రోమీయులు 16:25; 1 యోహాను 4:12) కోరహు కుమారులు ఇలా వ్రాశారు: “ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై యున్నాడు మరణము వరకు ఆయన మనలను నడిపించును.” (కీర్తన 48:14) యెహోవా దేవుని నడిపింపును అనుభవించే ఒక మార్గమేమంటే ఆయన వాక్యమైన బైబిలును అధ్యయనంచేసి దాని ఉపదేశాన్ని మన జీవితంలో అన్వయించుకోవడమే.