కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అనిశ్చయతను మీరు తాళుకోవచ్చు

అనిశ్చయతను మీరు తాళుకోవచ్చు

అనిశ్చయతను మీరు తాళుకోవచ్చు

“నిశ్చయంగా!” “ఖచ్చితంగా!” “గ్యారంటీగా!” మీరు ఇలాంటి మాటలను చాలాసార్లు వినేవుంటారు. అయితే మన దైనందిన జీవితంలో, ప్రతీది ఖచ్చితంగా ఇలానే జరుగుతుందని మనం చెప్పలేము. జీవితమెంత అనూహ్యంగా ఉంటుందంటే, ఖచ్చితంగా ఇది జరుగుతుందని చెప్పగలదేదైనా ఉందా అని మనం తరచూ ఆశ్చర్యపోతూ ఉంటాము. సందేహం, అనిశ్చయత జీవితంలో ఓ భాగమన్నట్లు అనిపిస్తుంది.

అత్యధికులు తమకూ తమ కుటుంబానికీ భద్రత, సంతోషం కావాలని కోరుకోవడం అర్థంచేసుకోదగిన విషయమే. తమకు భద్రత, సంతోషం ఇస్తాయని నమ్మేవాటిని అంటే సాధారణంగా డబ్బును, వస్తు సంపదను కూడబెట్టడానికి వారు చాలా కష్టపడి పనిచేస్తుంటారు. అయితే భూకంపమో, తుఫానో, ప్రమాదమో లేదా దౌర్జన్యపూరిత నేరమో అలాంటి సంపదను క్షణంలో మటుమాయం చేయవచ్చు. ప్రాణాంతకమైన వ్యాధి, విడాకులు లేదా నిరుద్యోగం జీవితాలను రాత్రికి రాత్రే మార్చేయగలవు. అలాంటివి బహుశా మీకు జరగకపోవచ్చు. అయితే ఏ సమయంలోనైనా ఏదైనా ఘోరం జరగొచ్చనే ఆలోచనే కలతపరచేదిగా, కృంగదీసేదిగా ఉంటుంది. కానీ సమస్య అదొక్కటే కాదు.

అనిశ్చయత సందేహానికి పర్యాయపదం, సందేహాన్ని ఓ నిఘంటువు నిర్ణయాలు తీసుకోవడానికి తరచూ అడ్డుతగిలే అనిశ్చిత నమ్మకం లేదా అభిప్రాయం అని నిర్వచిస్తోంది. అంతేకాకుండా, మేనేజింగ్‌ యువర్‌ మైండ్‌ అనే పుస్తకం ప్రకారం “ప్రాముఖ్యమని తలంచే వాటి విషయంలో నెలకొనే అనిశ్చిత స్థితే చింతకు, వ్యాకులతకు పెద్ద కారణం.” తీరని సందేహం వ్యాకులతకు, ఆశాభంగానికి, కోపతాపాలకు దారితీయవచ్చు. అవును, ఏమి జరగవచ్చు, ఏమి జరగకపోవచ్చు అనేవాటి గురించి చింతించడం మన మానసిక, శారీరక ఆరోగ్యానికి హాని చేయగలదు.

దాని ఫలితంగా, కొందరు విపరీత ధోరణి అలవరచుకుంటారు. వారు “ఏం జరుగుతుందో ఎందుకు పట్టించుకోవాలి? నేడు నేడే, రేపు రేపే” అని చెప్పిన బ్రెజిలియన్‌ కుర్రాడిలా ఉంటారు. “తిందము త్రాగుదము” అనే విధివాదిత్వ దృక్పథం నిరాశకు, క్షోభకు, అకాల మరణానికి మాత్రమే దారితీయగలదు. (1 కొరింథీయులు 15:​32) సృష్టికర్తయైన యెహోవా దేవునివైపు మళ్లడమే మనకు మేలు, ఆయన గురించి బైబిలు ఇలాచెబుతోంది: “ఆయనయందు ఏ చంచలత్వమైనను గమనాగమనములవలన కలుగు ఏ ఛాయయైనను లేదు.” (యాకోబు 1:​17) దేవుని వాక్యమైన బైబిలును మనం పరిశీలిస్తే జీవిత అనిశ్చయతలతో తాళుకోవడానికి సంబంధించి సరైన ఉపదేశాన్ని మార్గనిర్దేశాన్ని మనం కనుగొంటాము. ఇంత ఎక్కువ అనిశ్చయత ఎందుకు ఉందో అర్థంచేసుకోవడానికి కూడా అది మనకు సహాయం చేయగలదు.

అనిశ్చయతకు కారణం

లేఖనాలు జీవితానికి సంబంధించిన వాస్తవిక దృక్కోణాన్నిచ్చి, అనిశ్చయతపట్ల మార్పులపట్ల సరైన దృక్పథాన్ని అలవరచుకోవడానికి మనకు సహాయం చేస్తాయి. కుటుంబ సంబంధాలు, సామాజిక హోదా, తెలివి, మంచి ఆరోగ్యం వగైరాలు కొంతమేరకు భద్రతను ఇచ్చినా, అవి మారకుండా శాశ్వతంగా అలానే ఉంటాయని గానీ మనం నిశ్చింతగా జీవిస్తామని గానీ అనుకోకూడదని బైబిలు చూపిస్తోంది. జ్ఞానియైన సొలొమోను రాజు ఇలా చెప్పాడు: “వడిగలవారు పరుగులో గెలువరు; బలముగలవారు యుద్ధములో విజయ మొందరు; జ్ఞానముగలవారికి అన్నము దొరకదు; బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలుగదు; తెలివిగలవారికి అనుగ్రహము దొరకదు.” ఎందుకు? ఎందుకంటే ‘కాలము, అనూహ్య సంఘటనల ప్రభావానికి వారందరు గురవుతున్నారు.’ అందుకే సొలొమోను ఇలా హెచ్చరించాడు: ‘తమకాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగురు; చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడునట్లు, పిట్టలు వలలో పట్టుబడునట్లు, విపత్కర కాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుపడుదురు.’​—⁠ప్రసంగి 9:​11, 12, NW.

ఓ తరం ప్రజలందరిపైకి రాబోయే అత్యంత చింతాకరమైన, అనిశ్చయతా కాలం గురించి యేసుక్రీస్తు కూడా మాట్లాడాడు. స్పష్టమైన మాటలతో ఆయనిలా చెప్పాడు: “సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలును, భూమిమీద సముద్రతరంగముల ఘోషవలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోవుచున్న వాటివిషయమై భయము కలిగి, మనుష్యులు ఎదురుచూచుచు ధైర్యముచెడి కూలుదురు.” అయితే నేటి యథార్థ ప్రజలకు ప్రోత్సాహకరంగా ఉండే విషయాన్ని సూచిస్తూ యేసు ఇలా అన్నాడు: “మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయెనని తెలిసికొనుడి.” (లూకా 21:​25, 26, 31) కాబట్టి, అనిశ్చయ భవిష్యత్తు గురించి భయపడడానికి బదులుగా మనం దేవునిపై విశ్వాసముంచుతాము, ఈ లోక అనిశ్చయతను కాదుగానీ రానున్న అద్భుతమైన, సురక్షితమైన భవిష్యత్తును చూడడానికి అది సహాయం చేస్తుంది.

‘పరిపూర్ణ నిరీక్షణతో ఉండడం’

మనం వినే, చదివే లేదా చూసే ప్రతిదాని గురించి మనం నిశ్చయతతో ఉండలేకపోయినా సృష్టికర్తను విశ్వసించడానికి మనకు మంచి కారణముంది. ఆయన సర్వోన్నతుడు మాత్రమే కాదు, తన భూసంబంధ పిల్లలను శ్రద్ధగా చూసుకొనే ప్రేమగల తండ్రి కూడా. తన సొంత వాక్కును గురించి దేవుడు ఇలా చెప్పాడు: “నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలముచేయును.”​—⁠యెషయా 55:11.

యేసుక్రీస్తు దేవుని సత్యాన్ని బోధించాడు కాగా ఆయన బోధ విన్న అనేకులు దానిని ఒప్పుదలతో, నిశ్చయతతో అంగీకరించారు. ఉదాహరణకు, యథార్థ హృదయులైన ఓ సమరయుల గుంపు యేసు బోధను మొదటిసారి విన్న స్త్రీతో ఇలా అన్నారు: “ఇకమీదట నీవు చెప్పిన మాటనుబట్టి కాక మామట్టుకు మేము విని, యీయన నిజముగా లోకరక్షకుడని తెలిసికొని నమ్ముచున్నాము.” (యోహాను 4:​42) అలాగే నేడు కూడా, మనం అభద్రతా కాలాల్లో జీవిస్తున్నా ఏది నమ్మాలనే విషయంలో అనిశ్చయతతో ఉండనక్కర్లేదు.

మత విశ్వాసానికి వచ్చినప్పుడు, దానిని అర్థంచేసుకోవడానికి బదులు కేవలం నమ్మితే సరిపోతుందని చాలామంది అభిప్రాయపడతారు. కానీ బైబిలు రచయిత లూకా ఆ అభిప్రాయంతో ఏకీభవించడం లేదు. తాను వ్రాసిన సంగతులు “నిశ్చయముగా జరిగినవని” ఇతరులు తెలుసుకోనేలా ఆయన పరిశోధించి, ఖచ్చితమైన సమాచారం అందించాడు. (లూకా 1:⁠1) మన విశ్వాసంతో ఏకీభవించని కుటుంబ సభ్యులు, స్నేహితులు మనం చివరకు భ్రమలో, నిరాశలో పడిపోతామని భయపడతారు కాబట్టి, మనం మన విశ్వాసాన్ని కాపాడుకోగలవారిగా ఉండడం ప్రాముఖ్యం. (1 పేతురు 3:​15) మన విశ్వాసానికున్న కారణమేమిటో మనకు ఖచ్చితంగా తెలిసినప్పుడే దేవునిపై విశ్వాసముంచడానికి ఇతరులకు మనం సహాయం చేయగలం. యెహోవాను బైబిలు ఈ మాటలతో వర్ణిస్తోంది: “ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు; ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నియు న్యాయములు ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు.”​—⁠ద్వితీయోపదేశకాండము 32:⁠4.

ఆ చివరి మాటలు తీసుకోండి: “ఆయన నీతిపరుడు యథార్థవంతుడు.” ఈ విషయంలో మనం నిశ్చయతతో ఉండడానికి మనకే రుజువుంది? ఆ వాస్తవాన్ని అపొస్తలుడైన పేతురు సంపూర్ణంగా నమ్మాడు. ఆయన రోమా అధికారికీ, ఆయన కుటుంబానికీ ఇలా చెప్పాడు: “దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.” (అపొస్తలుల కార్యములు 10:​34, 35) మునుపు అపవిత్రులు, అనంగీకృతులని పరిగణించబడ్డ అన్యుల కుటుంబం తనకు అంగీకృతమయ్యేలా దేవుని హస్తమెలా నడిపించిందో పేతురు అంతకు క్రితమే చూశాడు కాబట్టి ఆయన ఆ మాటలు చెప్పాడు. భూవ్యాప్తంగా 230 దేశాల నుండి వచ్చిన, తమ పూర్వ జీవిత విధానాన్ని విసర్జించి నీతిమార్గాల్లో నడుస్తున్న అరవై లక్షల ప్రజలతో రూపొందిన ‘గొప్పసమూహాన్ని’ చూసినప్పుడు మనం కూడా పేతురువలెనే దేవుని నిష్పక్షపాతాన్ని, నీతిని నమ్మవచ్చు.​—⁠ప్రకటన 7:9; యెషయా 2:​2-4.

నిజ క్రైస్తవులుగా మనం ఛాందసులుగా లేదా పిడివాదం చేసేవారిగా కాదుగానీ వినయస్థులుగా, సముచిత స్వభావం గలవారిగా ఉండాలని కోరుకుంటాం. అయినా మనం మన నమ్మకాల గురించి, భవిష్యత్తుకు సంబంధించి మనం ఎదురుచూసే విషయాల గురించి అనిశ్చయంగా ఉండము. మొదటి శతాబ్దపు క్రైస్తవులకు అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనుపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించుచున్నాము.” (హెబ్రీయులు 6:​11) అదే ప్రకారం, బైబిల్లోని సువార్త మనకు ‘పరిపూర్ణ నిరీక్షణ’ ఇచ్చింది. దేవుని వాక్యంపై బలంగా ఆధారపడ్డ ఆ నిరీక్షణ పౌలు కూడా వివరించినట్లు మనలను ‘నిరాశకు గురిచేయదు.’​—⁠రోమీయులు 5:​5, NW.

అంతేకాకుండా, ఇతరులకు బైబిలు నుండి సువార్త బోధించడం వారికి ఆధ్యాత్మిక భద్రతను, నిశ్చయతను, అలాగే భావోద్రేక, శారీరక భద్రతలను తీసుకురాగలదనే సంపూర్ణ నమ్మకం మనకుంది. “మా సువార్త, మాటతో మాత్రముగాక శక్తితోను, పరిశుద్ధాత్మతోను, సంపూర్ణ నిశ్చయతతోను మీయొద్దకు వచ్చియున్న సంగతి మాకు తెలియును” అని పలికిన పౌలుతో మనం ఏకీభవించగలం.​—⁠1 థెస్సలొనీకయులు 1:⁠4.

ఆధ్యాత్మిక భద్రతలో ప్రస్తుత ఆశీర్వాదాలు

నేటి జీవితంలో సంపూర్ణ భద్రతను మనం ఆశించలేకపోయినా, కొంతమేరకు స్థిరమైన, భద్రతగల జీవితం జీవించేలా సహాయపడేందుకు మనం చేయగలవి కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు, కూటాలకు హాజరవుతూ క్రైస్తవ సంఘంతో క్రమంగా సహవసించడం స్థిరత్వానికి దోహదపడుతుంది, కారణమేమంటే మనకు అక్కడ సరైన, స్పష్టమైన సూత్రాలు, విలువలు బోధించబడతాయి. పౌలు ఇలా వ్రాశాడు: “ఇహమందు ధనవంతులైనవారు గర్విష్టులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయ చేయు దేవునియందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము.” (1 తిమోతి 6:​17) క్షణమాత్రముండి కనుమరుగయ్యే వస్తుసంపదపై లేదా సుఖాలపై విశ్వాసముంచే బదులు యెహోవాపై విశ్వాసముంచడాన్ని అలవరచుకోవడం ద్వారా చాలామంది మునుపు తమకున్న చింతలు, ఆశాభంగాల నుండి విముక్తులు కాగలిగారు.​—⁠మత్తయి 6:19-21.

మనం సంఘంలో స్నేహపూర్వక సహోదరత్వాన్ని కూడా అనుభవిస్తాము, అది మనకు అనేక విధాలుగా సహాయంచేసి, మద్దతునిస్తుంది. తన పరిచర్యలో ఒకానొక సందర్భంలో అపొస్తలుడైన పౌలు ఆయన ప్రయాణ సహవాసులు ‘అత్యధిక భారమువలన క్రుంగిపోయారు,’ వారికి ‘తాము బ్రదుకుతాము అనే నమ్మకము లేకుండా’ పోయింది. పౌలుకు మద్దతు, సహాయం ఎక్కడ లభించాయి? అవును, దేవునిపై ఆయనకున్న విశ్వాసం ఎన్నటికీ సడలిపోలేదు. అయితే, సహాయం చేయడానికి వచ్చిన తోటి క్రైస్తవులు ఆయనను ప్రోత్సహించి, ఓదార్చారు. (2 కొరింథీయులు 1:8, 9; 7:​5-7) నేడు ప్రకృతి వైపరీత్యాలు లేదా ఇతర విపత్తులు సంభవించినప్పుడు, తోటి క్రైస్తవులకూ సహాయం అవసరమున్న ఇతరులకూ కావలసిన భౌతిక, ఆధ్యాత్మిక సహాయం అందించేందుకు పదే పదే మన క్రైస్తవ సహోదరులే ముందుంటారు.

జీవిత అనిశ్చయతను తాళుకోవడానికి సహాయం చేయగల మరో అంశం ప్రార్థన. అనుకోని ఒత్తిడి క్రింద మనమున్నప్పుడు మనం అన్ని సందర్భాల్లో మన ప్రేమగల తండ్రివైపు తిరగవచ్చు. “నలిగినవారికి తాను [యెహోవా] మహా దుర్గమగును ఆపత్కాలములలో వారికి మహా దుర్గమగును.” (కీర్తన 9:⁠9) తమ పిల్లలను కాపాడ్డంలో మానవ తలిదండ్రులు విఫలం కావచ్చు. అయితే, మన అనిశ్చయతా భయాలను, భావాలను తాళుకోవడానికి మనకు సహాయం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రార్థనలో మన చింతలు యెహోవాపై వేసినప్పుడు, “మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తి” ఆయనకు ఉందనే నమ్మకంతో మనం ఉండగలము.​—⁠ఎఫెసీయులు 3:20.

మీరు క్రమంగా దేవునికి ప్రార్థన చేస్తారా? దేవుడు మీ ప్రార్థనలు వింటాడనే నమ్మకం మీకుందా? సావో పౌలోలో ఓ యౌవనురాలు, “దేవునికి ప్రార్థించమని మా అమ్మ నాకు చెప్పింది. కానీ నన్ను నేనిలా ప్రశ్నించుకున్నాను: ‘నాకేమాత్రం తెలియని వ్యక్తితో ఎందుకు మాట్లాడాలి?’ అయితే మనకు దేవుని సహాయం అవసరమనీ, ప్రార్థనలో మనం ఆయనతో మాట్లాడాలనీ అర్థంచేసుకోవడానికి సామెతలు 18:⁠10 నాకు సహాయం చేసింది” అని చెప్పింది. ఆ లేఖనమిలా చెబుతోంది: “యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగానుండును.” యెహోవాతో మాట్లాడే అలవాటే మనకు లేకపోతే నిజానికి మనమాయనపై విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఎలా వృద్ధిచేసుకోగలం? ఆధ్యాత్మిక భద్రతవల్ల కలిగే ఆశీర్వాదాలు అనుభవించాలంటే, ప్రతీదినం హృదయపూర్వకంగా ప్రార్థించడాన్ని మనం అలవాటు చేసుకోవాలి. యేసు ఇలా చెప్పాడు: “కాబట్టి మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించుకొని, మనుష్యకుమారుని యెదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడును ప్రార్థనచేయుచు మెలకువగా ఉండుడి.”​—⁠లూకా 21:36.

మనం నిశ్చయత కలిగి ఉండగల మరో సంగతేమంటే దేవుని రాజ్యమందలి మన నిరీక్షణ. దానియేలు 2:44లోని ఈ మాటలు గమనించండి: “పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.” ఆ నిరీక్షణ దృఢమైనదీ, నిశ్చయమని నమ్మదగినదీ. మానవ వాగ్దానాలు తరచూ విఫలమౌతాయి, అయితే మనం అన్ని సందర్భాల్లో యెహోవా వాక్కును విశ్వసించవచ్చు. నిరాధారంగా ఉండడానికి బదులు, దేవుడు అన్ని సందర్భాల్లో మనం విశ్వసించగల గొప్ప శైలముగా ఉన్నాడు. “యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు. నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడెము నా రక్షణశృంగము నా ఉన్నతదుర్గము నా ఆశ్రయస్థానము ఆయనే నాకు రక్షకుడు బలాత్కారులనుండి నన్ను రక్షించువాడవు నీవే” అని చెప్పిన దావీదువలే మనం భావించవచ్చు.​—⁠2 సమూయేలు 22:​2, 3.

ముందు ప్రస్తావించబడిన మేనేజింగ్‌ యువర్‌ మైండ్‌ అనే పుస్తకం ఇంకా ఇలా చెబుతోంది: “ఒక వ్యక్తి జరిగే అవకాశమున్న భయానక విషయాల గురించి ఎంత ఎక్కువ ఆలోచిస్తే అంతెక్కువగా అవి నిజమనిపిస్తాయి, వాటినెలా తాళుకోవాలనేది ఆలోచించడం అంతకంటే ఎక్కువ కష్టంగా కనిపిస్తుంది.” కాబట్టి, లోకసంబంధ చింతలు, అపనమ్మకాలు మనకు భారంగా తయారయ్యేందుకు మనం ఎందుకు అనుమతించాలి? దానికి బదులు ఈ లోకపు అనిశ్చయతలపై కాకుండా దేవుని నిశ్చయ వాగ్దానాలపై మీ నమ్మకముంచండి. విఫలంకాని యెహోవా వాగ్దానాలపై మన విశ్వాసం నిలుపుకోవడం ద్వారా మనమీ హామీ కలిగి ఉండగలము: “ఆయనయందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడు.”​—⁠రోమీయులు 10:11.

[29వ పేజీలోని బ్లర్బ్‌]

మానవాళి భవిష్యత్తులో ఆశీర్వాదాలు అనుభవిస్తుందని దేవుని వాక్యం హామీ ఇస్తోంది

[30వ పేజీలోని బ్లర్బ్‌]

“ఆయనయందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడు”

[31వ పేజీలోని చిత్రం]

రాజ్య సువార్త ప్రజలకు భద్రత తీసుకొస్తుంది