కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘ప్రభువా, మాకు ప్రార్థన చేయడం నేర్పించు’

‘ప్రభువా, మాకు ప్రార్థన చేయడం నేర్పించు’

‘ప్రభువా, మాకు ప్రార్థన చేయడం నేర్పించు’

‘శిష్యులలో ఒకడు—ప్రభువా, మాకు ప్రార్థనచేయ నేర్పుమని ఆయన నడిగెను.’​—⁠లూకా 11:⁠1.

సా.శ. 33లో ఒక సందర్భంలో యేసు శిష్యుల్లో ఒకరు ఆయన ప్రార్థించడాన్ని గమనించాడు. యేసు తన తండ్రితో ఏమి మాట్లాడుతున్నాడో ఆ శిష్యుడు వినలేకపోయాడు, బహుశ యేసు మౌనంగా ప్రార్థించి ఉండవచ్చు. ఏదేమైనా, యేసు ప్రార్థన చేయడం ముగించిన తర్వాత ఆ శిష్యుడు, ‘ప్రభువా, మాకు ప్రార్థనచేయ నేర్పుము’ అని అడిగాడు. (లూకా 11:⁠1) అలా అడిగేందుకు పురికొల్పినదేమిటి? యూదా జీవన విధానంలో, ఆరాధనలో ప్రార్థన ఓ క్రమమైన భాగంగా ఉండేది. హీబ్రూ లేఖనాల్లోని కీర్తనల పుస్తకంలో, ఇతర పుస్తకాల్లో అనేక ప్రార్థనలున్నాయి. కాబట్టి ఆ శిష్యుడు తనకు తెలియని లేదా తానెన్నడూ చేయని దానిని తనకు నేర్పించమని అడగడం లేదు. యూదా మతనాయకులు చేసే ఆచారబద్ధ ప్రార్థనల గురించి ఆయనకు తెలిసేవుంటుంది. కానీ ఆయన యేసు ప్రార్థించడాన్ని గమనించినప్పుడు, రబ్బీలు ఆర్భాటంగా చేసే ప్రార్థనలకు, యేసు ప్రార్థించిన విధానానికి మధ్య తేడా ఉందని గ్రహించివుండవచ్చు.​—⁠మత్తయి 6:5-8.

2 రమారమి 18 నెలల క్రితం, తన కొండమీది ప్రసంగంలో యేసు తన శిష్యుల ప్రార్థనలకు ఆధారంగావుండే మాదిరి ప్రార్థన వారికిచ్చాడు. (మత్తయి 6:​9-13) ఈ శిష్యుడు ఆ సమయంలో ప్రత్యేకంగా అక్కడ ఉండకపోవచ్చు, అందుకే యేసు దయతో ఆ మాదిరి ప్రార్థనలోని ముఖ్యాంశాలను మళ్లీ ఒకసారి చెప్పాడు. ఆయన ప్రతీ పదాన్ని తిరిగి వల్లించలేదనే వాస్తవం గమనార్హమైనది, ఆ ప్రార్థనను కంఠస్థం చేసి అవే పదాలతో దానిని వల్లించకూడదని అది సూచిస్తోంది. (లూకా 11:​1-4) పేరు ప్రస్తావించబడని ఆ శిష్యునివలే, మనం కూడా మన ప్రార్థనలు మనలను యెహోవాకు సన్నిహితుల్ని చేసేందుకు ఎలా ప్రార్థించాలో నేర్చుకోవాలని కోరుకుంటాము. కాబట్టి మనం అపొస్తలుడైన మత్తయి నమోదుచేసిన మాదిరి ప్రార్థనను మరింత విశదంగా పరిశీలిద్దాం. దానిలో ఏడు విన్నపాలు ఉన్నాయి, అందులో మూడు దేవుని సంకల్పాలకు, మిగతా నాలుగు మన వస్తుదాయక, ఆధ్యాత్మిక అవసరాలకు సంబంధించినవి. ఈ ఆర్టికల్‌లో మనం మొదటి మూడు విన్నపాలను పరిశీలిద్దాం.

ప్రేమగల తండ్రి

3 మన ప్రార్థనలు యెహోవాతో సన్నిహిత సంబంధాన్ని, గౌరవప్రదమైన సంబంధాన్ని ప్రతిబింబించాలని యేసు ఆరంభంనుండే చూపించాడు. కొండపై తన సమీపాన కూర్చున్న తన శిష్యుల ప్రయోజనార్థమే ముఖ్యంగా మాట్లాడుతూ, యెహోవాను “పరలోకమందున్న మా తండ్రీ” అని సంబోధించాలని యేసు వారికి చెప్పాడు. (మత్తయి 6:⁠9) ఒక విద్వాంసుని ప్రకారం యేసు జనసామాన్య హీబ్రూలో మాట్లాడినా లేదా అరమిక్‌లో మాట్లాడినా, “తండ్రీ” అని సంబోధించడానికి ఆయన ఉపయోగించిన పదం ఓ శిశువు ఆప్యాయంగా తన తండ్రిని పిలిచేందుకు ఉపయోగించే పదంలాంటిది, అది ‘పిల్లవాడు ఉపయోగించే పదం.’ యెహోవాను “మా తండ్రీ” అని సంబోధించడం ఆప్యాయత, నమ్మకం ఉట్టిపడే సంబంధాన్ని సూచిస్తుంది.

4‘మా తండ్రీ’ అని పలకడం ద్వారా, యెహోవాను జీవదాతగా గుర్తించే స్త్రీపురుషులుగల ఓ పెద్ద కుటుంబంలో మనం ఓ భాగమని కూడా మనం అంగీకరిస్తాం. (యెషయా 64:8; అపొస్తలుల కార్యములు 17:​24, 28) ఆత్మజనిత క్రైస్తవులు “దేవుని కుమారు[లుగా]” స్వీకరించబడతారు, వారు ఆయనకు ‘అబ్బా తండ్రీ అని మొఱ్ఱపెట్టుకోవచ్చు.’ (రోమీయులు 8:​14, 15) లక్షలాదిమంది వారి విశ్వసనీయ సహవాసులుగా తయారయ్యారు. వీరు యెహోవాకు తమ జీవితాలు సమర్పించుకొని తమ సమర్పణను నీటి బాప్తిస్మం ద్వారా సూచించారు. ఈ “వేరే గొఱ్ఱెలు” కూడా యేసు నామమందు యెహోవాను సమీపించి ఆయనను “మా తండ్రీ” అని సంబోధించవచ్చు. (యోహాను 10:16; 14:⁠6) మన పరలోక తండ్రిని స్తుతించడానికి, మనపట్ల ఆయన చూపిన మంచితనానికి కృతజ్ఞత చెప్పడానికి, మనపట్ల శ్రద్ధ చూపిస్తాడనే నమ్మకంతో మన చింతలు చెప్పుకోవడానికి మనం క్రమంగా ఆయనకు ప్రార్థించవచ్చు.​—⁠ఫిలిప్పీయులు 4:⁠6, 7; 1 పేతురు 5:⁠6, 7.

యెహోవా నామముపట్ల ప్రేమ

5 ప్రారంభ విన్నపం ప్రధాన సంగతులను మొట్టమొదట ప్రస్తావిస్తోంది. అదిలా చెబుతోంది: “నీ నామము పరిశుద్ధపరచబడును గాక.” (మత్తయి 6:⁠9) అవును, మనం యెహోవాను ప్రేమిస్తున్నాము, అనేక విధాలుగా ఆయన నామంపై వేయబడిన నిందను మనం ఇష్టపడము కాబట్టి ఆయన నామము పరిశుద్ధపరచబడడం మనకు ప్రధాన విషయంగా ఉండాలి. సాతాను తిరుగుబాటు చేయడం అలాగే యెహోవా దేవునికి అవిధేయులయ్యేలా మొదటి మానవ దంపతులను ప్రేరేపించడం, దేవుడు తన విశ్వసర్వాధిపత్యాన్ని ఉపయోగించే విధానం విషయంలో సందేహాలు తలెత్తేలా చేస్తూ ఆయన నామంపై అపవాదు తీసుకువచ్చింది. (ఆదికాండము 3:​1-6) అంతేకాకుండా, యెహోవాకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకునేవారి అవమానకరమైన క్రియలు, బోధలవల్ల శతాబ్దాలుగా ఆయన నామం నిందించబడుతోంది.

6 యెహోవా నామం పరిశుద్ధపరచబడాలని మనం చేసే ప్రార్థన, విశ్వసర్వాధిపత్యానికి సంబంధించిన వివాదాంశంలో మన స్థానాన్ని అంటే విశ్వాన్ని పరిపాలించేందుకు యెహోవాకున్న హక్కుకు మనం పూర్ణ మద్దతునిస్తున్నామని చూపిస్తుంది. తనను, తన నామానికి ప్రతీకగావున్న సమస్తాన్ని ప్రేమిస్తున్న కారణంగా తన నీతియుక్త సర్వాధిపత్యానికి ఇష్టపూర్వకంగా, ఆనందంగా లోబడే బుద్ధిసూక్ష్మతగల ప్రాణులతో ఈ విశ్వం నిండివుండాలని యెహోవా కోరుకుంటున్నాడు. (1 దినవృత్తాంతములు 29:10-13; కీర్తన 8:1; 148:​13) యెహోవా నామంపట్ల మనకున్న ప్రేమ, ఆ పరిశుద్ధ నామంపైకి నింద తీసుకొచ్చే ఎలాంటి పనీ చేయకుండా ఉండడానికి మనకు సహాయం చేస్తుంది. (యెహెజ్కేలు 36:20, 21; రోమీయులు 2:​21-24) యెహోవా నామం పరిశుద్ధపరచడంపై, ఆయన సర్వాధిపత్యానికి ప్రేమపూర్వకంగా లోబడడంపై విశ్వ శాంతి, అలాగే దానిలోని నివాసుల శాంతి ఆధారపడివుంది కాబట్టి “నీ నామము పరిశుద్ధపరచబడు గాక” అని మనం చేసే ప్రార్థన యెహోవాకు స్తుతి కలిగే విధంగా ఆయన సంకల్పం నెరవేరుతుందనే మన నమ్మకాన్ని వ్యక్తం చేస్తుంది.​—⁠యెహెజ్కేలు 38:23.

మనం ప్రార్థన చేసే రాజ్యం

7 మాదిరి ప్రార్థనలోని రెండవ విన్నపం: “నీ రాజ్యము వచ్చుగాక.” (మత్తయి 6:⁠10) ఈ విన్నపానికి ముందరి విజ్ఞాపనకు దగ్గరి సంబంధముంది. యెహోవా తన పరిశుద్ధ నామాన్ని పరిశుద్ధపరచడానికి తన పరలోక ప్రభుత్వమైన మెస్సీయ రాజ్యాన్ని సాధనంగా ఉపయోగిస్తాడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు దానికి రాజుగా నియమించబడ్డాడు. (కీర్తన 2:​1-9) దానియేలు ప్రవచనం మెస్సీయ రాజ్యాన్ని “పర్వతము” నుండి తీయబడిన “రాయి” అని వర్ణిస్తోంది. (దానియేలు 2:34, 35, 44, 45) ఆ పర్వతం యెహోవా విశ్వసర్వాధిపత్యానికి ప్రతీకగా ఉంది, అందువల్ల రాయి ద్వారా సూచించబడుతోన్న రాజ్యం యెహోవా విశ్వసర్వాధిపత్యానికి ఓ నూతన వ్యక్తీకరణ. ప్రవచనంలోని ఆ రాయి ‘సర్వ భూతలమంత మహా పర్వతంగా తయారుకావడం,’ ఈ భూమిని పరిపాలించడంలో మెస్సీయ రాజ్యం దేవుని సర్వాధిపత్యానికి ప్రాతినిధ్యం వహిస్తుందని సూచిస్తోంది.

8 ఈ రాజ్య ప్రభుత్వంలో క్రీస్తుతోపాటు “మనుష్యులలో నుండి కొనబడిన” 1,44,000 మంది రాజులుగా, యాజకులుగా ఉంటారు. (ప్రకటన 5:9, 10; 14:1-4; 20:⁠6) దానియేలు వారిని “మహోన్నతుని పరిశుద్ధులని” సూచిస్తున్నాడు, వారు తమ శిరస్సైన క్రీస్తుతోపాటు “ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహాత్మ్యమును” అందుకుంటారు. వారి “రాజ్యము నిత్యము నిలుచును, అధికారులందరును దానికి దాసులై విధేయులగుదురు.” (దానియేలు 7:13, 14, 18, 27) క్రీస్తు తన అనుచరులకు ఏ పరలోక ప్రభుత్వం గురించి ప్రార్థించడం నేర్పించాడో ఆ పరలోక ప్రభుత్వమే అది.

రాజ్యం రావాలని ఇంకా ఎందుకు ప్రార్థించాలి?

9 క్రీస్తు తన మాదిరి ప్రార్థనలో, దేవుని రాజ్యం వచ్చేందుకు ప్రార్థించుమని మనకు నేర్పించాడు. ఆ మెస్సీయ రాజ్యం 1914లో పరలోకంలో స్థాపించబడిందని బైబిలు ప్రవచనాల నెరవేర్పు సూచిస్తోంది. * కాబట్టి ఆ రాజ్యం “వచ్చుగాక” అని మనం ప్రార్థించడం ఇంకా సముచితమేనా? ఖచ్చితంగా. ఎందుకంటే దానియేలు ప్రవచనంలో, రాయిగా సూచించబడిన ఆ మెస్సీయ రాజ్యం పెద్ద ప్రతిమగా సూచించబడిన మానవ రాజకీయ ప్రభుత్వాలను ఢీకొనే దిశలోవుంది. ఆ రాయివచ్చి ప్రతిమను తుత్తినియలుచేసే సమయం ఇంకా రావలసివుంది. దానియేలు ప్రవచనమిలా చెబుతోంది: “ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.”​—⁠దానియేలు 2:44.

10 దేవుని రాజ్యం సాతాను దుష్టవిధానానికి వ్యతిరేకంగా చర్య తీసుకోవడం చూడాలని మనం కోరుకుంటున్నాము, ఎందుకంటే అది యెహోవా పరిశుద్ధ నామాన్ని పవిత్రపరచి, దేవుని సర్వాధిపత్య వ్యతిరేకులందరిని తొలగిస్తుంది. “నీ రాజ్యమువచ్చు గాక” అని మనం తీవ్రంగా ప్రార్థిస్తాం, అలాగే అపొస్తలుడైన యోహానుతోపాటు “ఆమేన్‌; ప్రభువైన యేసూ రమ్ము” అని చెబుతాం. (ప్రకటన 22:​20) అవును, “యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక” అని పలికిన కీర్తనకర్త మాటలు నిజమయ్యేలా, యెహోవా నామాన్ని పరిశుద్ధపరచి ఆయన సర్వాధిపత్యమే సత్యమని నిరూపించడానికి యేసు వచ్చునుగాక.​—⁠కీర్తన 83:18.

‘నీ చిత్తము నెరవేరును గాక’

11 ఆ తర్వాత, “నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక” అని ప్రార్థించుమని యేసు తన శిష్యులకు నేర్పించాడు. (మత్తయి 6:⁠10) యెహోవా చిత్తాన్నిబట్టే విశ్వం ఉనికిలోకి వచ్చింది. బలమైన పరలోక ప్రాణులు, “ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను” అని బిగ్గరగా ప్రకటిస్తున్నారు. (ప్రకటన 4:​10-11) ‘పరలోకంలో, భూమ్మీద ఉన్నవాటి’ కోసం యెహోవాకు ఒక సంకల్పం ఉంది. (ఎఫెసీయులు 1:​8-10) దేవుని చిత్తం జరగాలని ప్రార్థించడం ద్వారా నిజానికి మనం యెహోవా తన సంకల్పం నెరవేర్చాలని అడుగుతున్నాము. అంతేకాకుండా, మనం విశ్వమంతటిలోను దేవుని చిత్తం నెరవేరడం చూడాలనే మన కోరికను ప్రదర్శిస్తాము.

12 ఈ ప్రార్థన ద్వారా మనం యెహోవా చిత్తానికి అనుగుణంగా మన జీవితాలు మార్చుకోవడానికి ఇష్టపడుతున్నామని కూడా చూపిస్తాము. యేసు ఇలా చెప్పాడు: “నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై యున్నది.” (యోహాను 4:​34) యేసువలెనే సమర్పిత క్రైస్తవులుగా దేవుని చిత్తం చేయడంలో మనం ఆనందిస్తాం. యెహోవాపట్ల, ఆయన కుమారునిపట్ల మనకున్న ప్రేమ “మనుజాశలను అనుసరించి నడుచుకొనక, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనునట్లు” మనల్ని ప్రేరేపిస్తుంది. (1 పేతురు 4:1, 2; 2 కొరింథీయులు 5:​14, 15) యెహోవా చిత్తానికి విరుద్ధంగా ఉన్నాయని మనకు తెలిసిన పనులు చేయకుండా ఉండేందుకు మనం కృషిచేస్తాము. (1 థెస్సలొనీకయులు 4:​3-5) మనకున్న సమయాన్ని బైబిలు చదవడానికీ, అధ్యయనం చేయడానికీ సద్వినియోగం చేసుకోవడం ద్వారా మనం ‘యెహోవా చిత్తమేమిటో గ్రహిస్తాము.’ తద్వారా మనం “ఈ రాజ్యసువార్త” ప్రకటించడంలో చురుకుగా భాగం వహిస్తాము.​—⁠ఎఫెసీయులు 5:15-17; మత్తయి 24:14.

పరలోకమందు యెహోవా చిత్తం

13 యెహోవా ఆత్మ సంబంధ కుమారుల్లో ఒకడు తిరుగుబాటుచేసి సాతానుగా తయారవక ముందు పరలోకంలో యెహోవా చిత్తం నెరవేరుతూ ఉండేది. సామెతల పుస్తకంలో, దేవుని ప్రథమ కుమారుడు మూర్తీభవించిన జ్ఞానంగా వర్ణించబడ్డాడు. దేవుని అద్వితీయ కుమారుడు యుగయుగాలు సంతోషంగా తన తండ్రి చిత్తం నెరవేరుస్తూ ‘నిత్యము ఆయన సన్నిధిని ఆనందించాడని’ అది చూపిస్తోంది. చివరకు ఆయన “ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని” సమస్త సృష్టిని సృష్టించడంలో యెహోవాయొక్క “ప్రధానశిల్పి” అయ్యాడు. (సామెతలు 8:22-31; కొలొస్సయులు 1:​15-17) యెహోవా యేసును తన వాక్యముగా లేదా తన వాగ్దూతగా ఉపయోగించుకున్నాడు.​—⁠యోహాను 1:1-3.

14 యెహోవా సర్వాధిపత్యం సర్వోన్నతమనీ, దేవదూతల సమూహాలు ఆయన ఆదేశాలకు, ఆజ్ఞలకు లోబడ్డారనీ కీర్తనకర్త చూపిస్తున్నాడు. మనమిలా చదువుతాము: “యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచియున్నాడు. ఆయన అన్నిటిమీద రాజ్యపరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకులోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరు ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుచుండు [లేదా “సర్వాధిపత్యపు”] స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వకార్యములారా, ఆయనను స్తుతించుడి.”​—⁠కీర్తన 103:19-22.

15 యోబు పుస్తకం చూపిస్తున్నట్లుగా సాతాను తిరుగుబాటు చేసిన తర్వాత కూడా పరలోకానికి వెళ్లగలిగేవాడు. (యోబు 1:6-12; 2:​1-7) అయితే సాతాను అతని దయ్యాలు పరలోకం నుండి పడద్రోయబడే సమయ మొకటి వస్తుందని ప్రకటన గ్రంథం ప్రవచించింది. ఆ సమయం యేసుక్రీస్తు పరలోకంలో 1914లో రాజ్యాధికారం చేపట్టిన తర్వాత కొద్దికాలానికే వచ్చిందని స్పష్టమయింది. అప్పటినుండి, ఆ తిరుగుబాటుదారులకు పరలోకంలో చోటులేకుండా పోయింది. వారు భూపరిధికే నిర్బంధించబడ్డారు. (ప్రకటన 12:​7-12) పరలోకంలో వివాద స్వరమేదీ వినబడదు, బదులుగా “గొఱ్ఱెపిల్ల”యైన క్రీస్తు యేసును అభినందించే, విధేయతతో యెహోవాను స్తుతించే ఐక్య స్వరాలు మాత్రమే వినబడతాయి. (ప్రకటన 4:​9-11) యెహోవా చిత్తం నిజంగానే పరలోకంలో నెరవేరుతోంది.

భూమిపట్ల యెహోవా చిత్తం

16 మంచి వారందరూ పరలోకానికి వెళ్తారని వాదిస్తూ క్రైస్తవమత సామ్రాజ్య చర్చీలు దేవుని సంకల్పం నుండి భూమిని మినహాయిస్తున్నాయి. కానీ మనమిలా ప్రార్థించాలని యేసు నేర్పించాడు: “నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక.” (మత్తయి 6:​10) హింస, అన్యాయం, వ్యాధి, మరణంతో పీడించబడుతున్న నేటి భూమిపై యెహోవా చిత్తం నెరవేర్చబడుతోందని చెప్పడానికి ఏ మాత్రమైనా అవకాశం ఉందా? ఎంతమాత్రం లేదు! కాబట్టి మనం అపొస్తలుడైన పేతురు నమోదు చేసిన వాగ్దానానికి అనుగుణంగా దేవుని చిత్తం భూమిపై నెరవేరాలని చిత్తశుద్ధితో ప్రార్థించాలి. ఆయనిలా వ్రాశాడు: “మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును [క్రీస్తు అధికారంలోని మెస్సీయ రాజ్య ప్రభుత్వం కొరకు] క్రొత్త భూమికొరకును [నీతియుక్త మానవ సమాజం కొరకు] కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును.”​—⁠2 పేతురు 3:13.

17 భూమిని సృష్టించడంలో యెహోవాకు ఒక సంకల్పముంది. ఆయన యెషయా ప్రవక్తను ఇలా వ్రాయడానికి ప్రేరేపించాడు: “ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు; ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిరపరచెను నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింపలేదు నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను ఆయన సెలవిచ్చునదేమనగా​—⁠యెహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు.” (యెషయా 45:​18) దేవుడు మొదటి మానవ దంపతులను పరదైసు తోటలోవుంచి వారికిలా ఆదేశించాడు: “మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి.” (ఆదికాండము 1:27, 28; 2:​15) కాబట్టి, సంతోషంగా యెహోవా సర్వాధిపత్యానికి లోబడి క్రీస్తు వాగ్దానం చేసిన పరదైసులో నిత్యం జీవించే పరిపూర్ణ నీతియుక్త మానవులతో భూమిని నింపడమే సృష్టికర్త సంకల్పమని స్పష్టమవుతోంది.​—⁠కీర్తన 37:11, 29; లూకా 23:43.

18 యెహోవా సర్వాధిపత్యాన్ని ప్రతిఘటించే స్త్రీపురుషులతో భూమి నిండియుండగా భూమికి సంబంధించిన ఆయన చిత్తమెన్నడూ సంపూర్ణంగా నెరవేరదు. క్రీస్తు నాయకత్వం క్రింద బలమైన ఆత్మసంబంధ సైన్యాల్ని ఉపయోగిస్తూ దేవుడు ‘భూమిని నశింపజేయువారిని నాశనంచేస్తాడు.’ అబద్ధమతం, కుళ్లిన రాజకీయాలు, దురాశ అవినీతిగల వాణిజ్యం, వినాశకర సైన్యంతో నిండిన సాతాను దుష్టవిధానం మొత్తం శాశ్వతంగా తుడిచివేయబడుతుంది. (ప్రకటన 11:18; 18:21; 19:​1, 2, 11-18) యెహోవా సర్వాధిపత్యం సత్యమని నిరూపించబడి, ఆయన నామం పరిశుద్ధపరచబడుతుంది. “పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక; నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక” అని అన్నప్పుడు మనం దీనంతటి కోసం ప్రార్థిస్తున్నవారిగా ఉంటాము.​—⁠మత్తయి 6:9, 10.

19 అయితే యేసు తన మాదిరి ప్రార్థనలో, మనం వ్యక్తిగత విషయాలకోసం కూడా ప్రార్థించవచ్చని చూపించాడు. ప్రార్థనకు సంబంధించి ఆయనిచ్చిన ఉపదేశంలోని ఈ అంశాలు తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలించబడతాయి.

[అధస్సూచి]

^ పేరా 15 యెహోవాసాక్షులు ప్రచురించిన దానియేలు ప్రవచనానికి అవధానమివ్వండి! (ఆంగ్లం) అనే పుస్తకంలో 6వ అధ్యాయం చూడండి.

పునఃసమీక్ష

మనం యెహోవాను “మా తండ్రీ” అని సంబోధించడం ఎందుకు సముచితం?

యెహోవా నామం పరిశుద్ధపరచబడాలని ప్రార్థించడం మనకెందుకు ప్రధాన ప్రాముఖ్యతగా ఉండాలి?

దేవుని రాజ్యం రావాలని మనమెందుకు ప్రార్థిస్తాం?

పరలోకమందు నెరవేరినట్లు భూమియందును దేవుని చిత్తం నెరవేరాలని మనం ప్రార్థించినప్పుడు దాని భావమేమిటి?

[అధ్యయన ప్రశ్నలు]

1. యేసు శిష్యుల్లో ఒకాయన తమకు ప్రార్థించడం నేర్పమని యేసును ఎందుకు అడిగాడు?

2. (ఎ) మాదిరి ప్రార్థనలోని ప్రతీ పదాన్ని మనం వల్లించాలని యేసు భావం కాదని ఏది సూచిస్తోంది? (బి) ఎలా ప్రార్థించాలో తెలుసుకోవడానికి మనమెందుకు ఆసక్తిగా ఉన్నాము?

3, 4. యెహోవాను “మా తండ్రీ” అని మనం సంబోధించడంలో ఉన్న భావమేమిటి?

5. మాదిరి ప్రార్థనలో మొదటి విన్నపమేమిటి, ఇదెందుకు సముచితం?

6. యెహోవా నామం పరిశుద్ధపరచబడాలని మనం ప్రార్థిస్తే మనమేమి చేయము?

7, 8. (ఎ) యేసు మనకు ఏ రాజ్యం గురించి ప్రార్థించడం నేర్పించాడో ఆ రాజ్యమేమిటి? (బి) దానియేలు, ప్రకటన గ్రంథాల్లో ఈ రాజ్యం గురించి మనమేమి నేర్చుకుంటాము?

9. మనం దేవుని రాజ్యం రావాలని ప్రార్థించడం ఎందుకు సముచితం?

10. దేవుని రాజ్యం రావాలని మనమెందుకు కోరుకుంటాము?

11, 12. (ఎ) దేవుని “చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక” అని ప్రార్థించినప్పుడు మనమేమి అడుగుతున్నాము? (బి) యెహోవా చిత్తం నెరవేరాలనే మన ప్రార్థనకు ఇంకా ఏ అర్థముంది?

13. సాతాను తిరుగుబాటుకు ముందు ఎంతోకాలంగా యెహోవా చిత్తం ఎలా నెరవేరుతూ ఉంది?

14. పరలోకమందు దేవదూతలు యెహోవా చిత్తం నెరవేర్చడం గురించి చెబుతున్న కీర్తన 103 నుండి మనమేమి నేర్చుకోగలము?

15. యేసు రాజ్యాధికారం చేపట్టడం, పరలోకంలో దేవుని చిత్తం నెరవేరడాన్ని ఎలా ప్రభావితం చేసింది?

16. మానవాళి నిరీక్షణకు సంబంధించి క్రైస్తవమత సామ్రాజ్య బోధను మాదిరి ప్రార్థన ఎలా త్రోసిపుచ్చుతోంది?

17. భూమిపట్ల యెహోవా సంకల్పమేమిటి?

18, 19. (ఎ) భూమిపై దేవుని చిత్తం సంపూర్ణంగా నెరవేరడానికి ముందు ఏమిచేయబడాలి? (బి) యేసు మాదిరి ప్రార్థనలోని ఏ ఇతర అంశాలు తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలించబడతాయి?

[9వ పేజీలోని చిత్రం]

పరిసయ్యుల స్వనీతి ప్రార్థనలకు యేసు చేసిన ప్రార్థనలకు చాలా తేడా ఉంది

[10వ పేజీలోని చిత్రం]

దేవుని రాజ్యం రావాలనీ, ఆయన నామం పరిశుద్ధపరచబడాలనీ, ఆయన చిత్తం నెరవేరాలనీ క్రైస్తవులు ప్రార్థిస్తారు