కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ ఆధ్యాత్మిక అవసరాలు తీర్చుకునే విధానం

మీ ఆధ్యాత్మిక అవసరాలు తీర్చుకునే విధానం

మీ ఆధ్యాత్మిక అవసరాలు తీర్చుకునే విధానం

“గత దశాబ్దంలో పనిస్థలంలో ఆధ్యాత్మికత అనే విషయంపై వ్రాయబడిన జీసస్‌ సిఈఓ అనే పుస్తకం మొదలుపెట్టి ద టావో ఆఫ్‌ లీడర్‌షిప్‌ అనే పుస్తకం వరకూ 300 కంటే ఎక్కువ పుస్తకాలతో పుస్తకాల దుకాణాలు నిండిపోయాయి” అని యు.ఎస్‌. న్యూస్‌ అండ్‌ వరల్డ్‌ రిపోర్ట్‌ చెబుతోంది. అనేక సంపన్న దేశాల్లో, జీవితంలో ఆధ్యాత్మిక మార్గనిర్దేశం కావాలని అంతకంతకూ ఎక్కువమంది కోరుకుంటున్నారనే వాస్తవానికి ఈ ప్రవృత్తి ఓ ప్రతిబింబం మాత్రమే. దీనిపై వ్యాఖ్యానిస్తూ, ట్రెయినింగ్‌ అండ్‌ డెవలెప్‌మెంట్‌ అనే వాణిజ్య పత్రిక, “జీవితపు ప్రతీ అంశాన్ని సాంకేతికత ప్రభావితం చేసే ఈ కాలంలో, మనం లోతైన జీవితార్థంకోసం, సంకల్పంకోసం, మరింత వ్యక్తిగత సంతృప్తికోసం అన్వేషిస్తున్నాము” అని అభిప్రాయపడింది.

అయితే, సంతృప్తికరమైన ఆధ్యాత్మిక మార్గనిర్దేశం మీకెక్కడ లభించగలదు? గతంలో ప్రజలు ‘లోతైన జీవితార్థాన్ని’ మరియు ‘సంకల్పాన్ని’ కనుగొనడానికి సహాయం కోసం వ్యవస్థాపిత మతంవైపు చూశారు. నేడు, చాలామంది వ్యవస్థాపిత మతాన్ని తిరస్కరించారు. 90 మంది ఉన్నతాధికారులు, కార్యనిర్వాహకులపై జరిపిన సర్వేలో “ప్రజలు మతాన్ని, ఆధ్యాత్మికతను రెండు వేర్వేరు విషయాలుగా పరిగణిస్తారు” అని తేలిందని ట్రెయినింగ్‌ అండ్‌ డెవలెప్‌మెంట్‌ చెబుతోంది. సర్వేకు జవాబిచ్చినవారు మతాన్ని “సహనం కొరవడినదిగా, అనైక్యత కలిగించేదిగా” ఉన్నట్లు, కానీ ఆధ్యాత్మికత “సార్వత్రికంగా, విశాలపరిధిలో అందరినీ ఆకట్టుకునేదిగా” ఉన్నట్లు దృష్టించారు.

ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌, యునైటెడ్‌ కింగ్‌డం, యూరప్‌వంటి మతాతీత లౌకిక సమాజాల్లో అనేకమంది యౌవనులు కూడా అదే రీతిలో మతానికీ, ఆధ్యాత్మికతకూ మధ్య తారతమ్యం చూస్తున్నారు. యూత్‌ స్టడీస్‌ ఆస్ట్రేలియా అనే పత్రికలో వ్రాస్తూ ప్రొఫెసర్‌ రూత్‌ వెబ్బర్‌ ఇలా నొక్కిచెబుతోంది: “యౌవనులు చాలామంది దేవుణ్ణి లేదా ఏదో మానవాతీత శక్తిని నమ్ముతున్నారు. అయితే చర్చి అంత ప్రాముఖ్యమని లేదా అది తమ ఆధ్యాత్మికతను వ్యక్తపరచడానికి తోడ్పడుతుందని వారు పరిగణించడంలేదు.”

సత్యమతం ఆధ్యాత్మికతను ప్రోత్సహిస్తుంది

మతానికి సంబంధించిన ఈ సంశయాత్మక దృక్కోణం అర్థంచేసుకోదగినదే. అనేక మత సంస్థలు రాజకీయ కుతంత్రాల్లో, నైతిక వేషధారణలో పీకలవరకు కూరుకుపోయి లెక్కలేనన్ని మత యుద్ధాల్లో చంపబడిన అమాయకుల రక్తంతో తడిసి ముద్దయ్యాయి. అయితే వేషధారణ, మోసంతో మలినపడ్డ మత సంస్థలను తిరస్కరిస్తూ కొందరు అలాంటి పనుల్ని బైబిలు మన్నిస్తుందని తలస్తూ దానిని కూడా నిరాకరించి తప్పుచేశారు.

నిజానికి బైబిలు, వేషధారణను అక్రమాన్ని ఖండిస్తోంది. తన కాలపు మతనాయకులతో యేసు ఇలా అన్నాడు: “అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నముకొట్టిన సమాధులను పోలియున్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చినవారి యెముకలతోను సమస్త కల్మషముతోను నిండియున్నవి. ఆలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని, లోపల వేషధారణతోను అక్రమముతోను నిండియున్నారు.”​—⁠మత్తయి 23:27, 28.

అంతేకాకుండా, రాజకీయ వ్యవహారాలన్నిటిలో తటస్థంగా ఉండాలని బైబిలు క్రైస్తవులను ప్రోత్సహిస్తోంది. విశ్వాసులు ఒకరినొకరు చంపుకోవడానికి పురికొల్పే బదులు అది ఒకరికోసం మరొకరు మరణించడానికి ఇష్టపడాలని నిర్దేశిస్తోంది. (యోహాను 15:12, 13; 18:36; 1 యోహాను 3:​10-12) “సహనం కొరవడినదిగా, అనైక్యత కలిగించేదిగా” ఉండడానికి బదులు, బైబిలుపై ఆధారపడిన సత్యమతం “విశాలపరిధిలో అందరినీ ఆకట్టుకునేదిగా” ఉంటుంది. “దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును” అని అపొస్తలుడైన పేతురు చెప్పాడు.​—⁠అపొస్తలుల కార్యములు 10:34, 35.

బైబిలు​—⁠ఆధ్యాత్మిక ఆరోగ్యానికి నమ్మదగిన బోధిని

మానవులు దేవుని స్వరూపంలో చేయబడ్డారని బైబిలు మనకు చెబుతోంది. (ఆదికాండము 1:​26, 27) సహజ శరీరాకృతిలో మానవులు దేవుని పోలియున్నారని దాని అర్థం కాకపోయినా, ఆధ్యాత్మిక విషయాల లేదా ఆధ్యాత్మికతా శక్తితోపాటు దేవుని వ్యక్తిత్వ లక్షణాలను ప్రతిబింబించగల సామర్థ్యం మానవులకు మాత్రమే ఉందని దానర్థం.

అందువల్ల, మన ఆధ్యాత్మిక అవసరాలు తీర్చుకునే మాధ్యమాన్ని, అలాగే మనకు ఆధ్యాత్మికంగా ప్రయోజనకరమైనదేదో, హానికరమైనదేదో వివేచించగల సరైన మార్గనిర్దేశాన్ని కూడా దేవుడు మనకు అందజేస్తాడని నమ్మడమూ న్యాయసమ్మతమే. మనకు వ్యాధులు రాకుండా పోరాడి మనలను ఆరోగ్యంగావుంచే ఉత్కృష్టమైన రోగనిరోధక వ్యవస్థతో మన శరీరాలను సృష్టించినట్టే, మనం సరైన నిర్ణయాలు తీసుకుంటూ, శారీరకంగా, ఆధ్యాత్మికంగా హానికలిగించే అలవాట్లను విసర్జించడానికి మనకు సహాయంచేసే మనస్సాక్షిని లేదా అంతరంగ స్వరాన్ని కూడా దేవుడు మనకిచ్చాడు. (రోమీయులు 2:​14, 15) మన రోగనిరోధక శక్తి పనిచేయాలంటే, దానికి సరైన పోషణ అవసరమని మనకు తెలుసు. అదేవిధంగా, మన మనస్సాక్షి పనిచేయాలంటే, దానిని ఆరోగ్యకరమైన ఆధ్యాత్మిక ఆహారంతో పోషించుకోవాలి.

మనలను ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగావుంచే ఆహారాన్ని గుర్తిస్తూ, యేసు ఇలా చెప్పాడు: “మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని [యెహోవా] నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును.” (మత్తయి 4:⁠4) యెహోవా వాక్కులు ఆయన వాక్యమైన బైబిల్లో వ్రాయబడ్డాయి, అవి ‘ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పు దిద్దడానికి ప్రయోజనకరంగా ఉన్నాయి.’ (2 తిమోతి 3:​16) అందువల్ల, ఆ ఆధ్యాత్మిక పోషణను స్వీకరించడానికి మనం కృషి చేస్తామా లేదా అనేది మనపై ఆధారపడివుంది. మనమెంత మేరకు బైబిలును తెలుసుకొని దాని సూత్రాలను మన జీవితంలో అన్వయించుకోవడానికి ప్రయత్నిస్తామో అంత మేరకు మనం ఆధ్యాత్మికంగా, శారీరకంగా ప్రయోజనం పొందుతాము.​—⁠యెషయా 48:17, 18.

మనం చేసే కృషి ప్రతిఫలదాయకమైనదేనా?

నిజమే, బైబిలు అధ్యయనంతో మన ఆధ్యాత్మిక ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి సమయం పడుతుంది; పైగా అంతకంతకు సమయం దొరకడమే కష్టమన్నట్టుగా ఉంది. అయితే దానివల్ల లభించే ప్రతిఫలాలు కృషికి తగినట్టుగానే ఉన్నాయి! పనిలో మునిగివుండే ఆయావృత్తుల్లోని ప్రజలు తమ ఆధ్యాత్మిక ఆరోగ్యం కోసం సమయం తీసుకోవడం ఎందుకు ప్రాముఖ్యమని చెబుతున్నారో గమనించండి.

మారీనా, ఓ డాక్టరు ఇలా చెబుతోంది: “నేను ఆసుపత్రిలో పనిచేయడం మొదలుపెట్టి, ఇతరుల బాధను ఎక్కువగా గ్రహించేంతవరకు నా ఆధ్యాత్మికత గురించి నేను నిజంగా ఆలోచించలేదు. నేను తృప్తిగా, ప్రశాంతంగా ఉండాలంటే నేను నా ఆధ్యాత్మిక అవసరతను గుర్తించి, దానిని సంతృప్తిపరచుకోవాలని తెలుసుకున్నాను, ఎందుకంటే నాలాంటి వృత్తిలో ఉన్నవారికి హడావిడి జీవితం, ప్రజలపట్ల శ్రద్ధ చూపడంతోనే సమయమంతా గడిచిపోతుంది.

“నేనిప్పుడు యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేస్తున్నాను. ఈ అధ్యయనం నా పనులను, ఉద్దేశాలను నిర్మాణాత్మకంగా పరిశీలించుకొని నా ఆలోచనా సరళిని మరింత అనుకూలంగా మలచుకొని నా జీవిత సమతుల్యం కాపాడుకోవడానికి సహాయం చేస్తోంది. నా ఉద్యోగం నాకెంతో సంతృప్తినిస్తుంది. అయితే బైబిలు అధ్యయనం, ప్రతికూల భావాలను అదుపులో ఉంచుకోవడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి, ప్రజలతో మరింత ఓపికగా, కనికరంగల వ్యక్తిగా ఉండడానికి సహాయం చేస్తూ నా భావావేశ ఆరోగ్యాన్ని మెరుగుపరచింది. బైబిలు సూత్రాలను అన్వయించుకోవడం నా వివాహ జీవితంలో కూడా ప్రయోజనాన్ని చేకూర్చింది. అన్నింటికంటే ప్రాముఖ్యంగా, నేను యెహోవాను తెలుసుకొన్నాను, అలాగే ఆయన ఆత్మ నా జీవితంలో నిరాటంకంగా ప్రవహించడాన్ని నేను చవిచూశాను, అది నా జీవితాన్ని మరింత అర్థవంతంగా చేసింది.”

నికొలాస్‌, భవననిర్మాణ డిజైనర్‌, ఇలా చెబుతున్నాడు: యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేయకముందు, నాకెలాంటి ఆధ్యాత్మిక ఆసక్తి ఉండేది కాదు. నేనెంచుకున్న వృత్తిలో విజయం సాధించడమే నా ఏకైక లక్ష్యంగా ఉండేది. జీవితానికి ఇంకా చాలా ఉందనీ, యెహోవా చిత్తం చేయడం నిజమైన, శాశ్వతమైన సంతోషం తీసుకొస్తుందనీ నా బైబిలు అధ్యయనం నాకు నేర్పింది.

“నా ఉద్యోగం నాకు సంతృప్తికర భావాన్నిస్తుంది, కానీ ఆధ్యాత్మిక విషయాలపై దృష్టినిలపడం ద్వారా జీవితాన్ని నిరాడంబరంగా ఉంచుకునే ప్రాముఖ్యతను బైబిలే నాకు నేర్పింది. అలాచేయడం ద్వారా, ద్రవ్య ప్రాధాన్యతగల జీవన విధానం తెచ్చే ఒత్తిడిని నేను నా భార్య తప్పించుకున్నాము. జీవితంపై ఇలాంటి ఆధ్యాత్మిక దృక్పథమే ఉన్నవారి సాంగత్యంలో మాకు చాలామంది నిజమైన స్నేహితులు కూడా లభించారు.”

విన్సెంట్‌, ఓ లాయరు, ఇలా చెబుతున్నాడు: “ఓ మంచి ఉద్యోగం సంతృప్తినివ్వగలదు. అయితే సంతోషానికి, సంతృప్తికి అది మాత్రమే సరిపోదని నేను కనుగొన్నాను. ఈ విషయంలో బైబిలు ఏమి బోధిస్తుందో తెలియక ముందు, జీవితం చాలా అర్థరహితమైనదని నేను గ్రహించాను, అంటే పుట్టడం, పెరగడం, పెళ్లిచేసుకోవడం, పిల్లల్ని పెంచి పోషించడానికి అవసరమైన డబ్బు సంపాదించేందుకు పనిచేయడం, పిల్లలు పెరిగి మళ్ళీ అదే జీవన చక్రాన్ని పాటించేందుకు వారికి శిక్షణ ఇవ్వడం చివరకు ముసలివారై చనిపోవడమనేది చాలా అర్థరహితమైన జీవితమని నాకు అనిపించింది.

“యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేసిన తర్వాతే జీవిత సంకల్పం గురించిన నా ప్రశ్నలకు సంతృప్తికరమైన జవాబులు లభించాయి. యెహోవాను ఒక వ్యక్తిగా తెలుసుకోవడానికీ, ఆయనపట్ల ప్రగాఢమైన ప్రేమను వృద్ధిచేసుకోవడానికి నా బైబిలు అధ్యయనం నాకు సహాయం చేసింది. ఆయన చిత్తమని నాకు తెలిసిన దానికి అనుగుణంగా నా జీవితాన్ని జీవించడానికి ప్రయత్నిస్తుండగా ఆరోగ్యకరమైన ఆధ్యాత్మిక దృక్కోణం కాపాడుకోవడానికి ఇది నాకు ఆధారమిస్తోంది. మేమిప్పుడు సాధ్యమైన రీతిలో అత్యంత అర్థవంతంగా మా జీవితాలు గడుపుతున్నామనే సంతృప్తి నాకు నా భార్యకు ఉంది.”

బైబిలు అధ్యయనం చేయడం ద్వారా మీరు కూడా జీవిత సంకల్పాన్ని, అర్థాన్ని తెలుసుకోవచ్చు. మీకు సహాయం చేయడానికి యెహోవాసాక్షులు సంతోషిస్తారు. మారీనా, నికొలాస్‌, విన్సెంట్‌ల్లాగే యెహోవా గురించి, సాధారణ మానవాళిపట్ల, వ్యక్తిగతంగా మీపట్ల ఆయన సంకల్పాల గురించి నేర్చుకోవడం ద్వారా కలిగే సంతృప్తిని మీరూ పొందవచ్చు. ఇప్పుడు మీ ఆధ్యాత్మిక అవసరాలు తీర్చుకుంటున్న ఆనందం పొందడమే కాక, ‘తమ ఆధ్యాత్మిక అవసరత గుర్తించినవారికి’ మాత్రమే ఉండే ఉత్తరాపేక్ష అంటే నిత్యజీవంలో పరిపూర్ణ శారీరక ఆరోగ్యం అనుభవించే ఉత్తరాపేక్ష కూడా మీకు ఉంటుంది.​—⁠మత్తయి 5:⁠3, NW.

మన ఆధ్యాత్మికతను పెంచుకునే ఒక మార్గం ప్రార్థన. యేసు తన శిష్యులకు ఎలా ప్రార్థించాలో నేర్పించడానికి సమయం తీసుకున్నాడు. సాధారణంగా ప్రభువు ప్రార్థన అని పిలువబడే ప్రార్థనను ఆయన వారికి నేర్పించాడు. నేడు ఆ ప్రార్థన మీకెలాంటి భావమిస్తుంది? దానినుండి మీరెలా ప్రయోజనం పొందవచ్చు? తర్వాతి రెండు ఆర్టికల్‌లలో మీరు వాటికి జవాబులు చూస్తారు.

[6వ పేజీలోని చిత్రాలు]

మారీనా

[7వ పేజీలోని చిత్రాలు]

నికొలాస్‌

[7వ పేజీలోని చిత్రాలు]

విన్సెంట్‌