కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా ప్రేమపూర్వక దయను, శ్రద్ధను చవిచూడడం

యెహోవా ప్రేమపూర్వక దయను, శ్రద్ధను చవిచూడడం

జీవిత కథ

యెహోవా ప్రేమపూర్వక దయను, శ్రద్ధను చవిచూడడం

ఫే కింగ్‌ చెప్పినది

నా తలిదండ్రులు దయగలవారే, కానీ చాలామందిలాగే వారికి మతమంటే అస్సలు గిట్టేదికాదు. “దేవుడు తప్పక ఉండాలి, లేకపోతే ఈ పువ్వులనెవరు చేశారు, ఈ చెట్లనెవరు చేశారు” అని అమ్మ అంటూ ఉండేది. కానీ ఆమె మతం గురించి అంతకుమించి ఆలోచించలేదు.

నాకు 11 ఏళ్లు ఉన్నప్పుడు అంటే 1939లో నాన్నగారు చనిపోయారు, ఇంగ్లాండులోని మాంఛెస్టర్‌కు దక్షిణానవున్న స్టాక్‌పోర్ట్‌లో అమ్మ, నేను నివసించేవాళ్లం. నేను నా సృష్టికర్త గురించి ఎక్కువ తెలుసుకోవాలని ఎప్పుడూ కోరుకునేదాన్ని. బైబిలు గురించి నాకేమీ తెలియకపోయినా అదంటే నాకు గౌరవం ఉండేది. కాబట్టి నేను ఇంగ్లాండ్‌ చర్చికి వెళ్ళి అదేం బోధిస్తుందో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాను.

ఆ చర్చి సేవలు నాపై పెద్ద ప్రభావం చూపకపోయినా, అక్కడ సువార్తలు చదవబడినప్పుడు మాత్రం, యేసు మాటలు బైబిలు సత్యమై ఉండాలనే నమ్మకాన్ని నాకు కలిగించాయి. ఆ విషయం గురించి ఇప్పుడు ఆలోచిస్తే, నేనే స్వయంగా బైబిలు ఎందుకు చదవలేదా అని ఆశ్చర్యపోతుంటాను. ఆ తర్వాత, మా కుటుంబ స్నేహితురాలు ఆధునిక భాషలో “క్రొత్త నిబంధన” ఇచ్చినప్పుడు కూడా దానిని చదవడానికి నేనెన్నడూ సమయం తీసుకోలేదు.

1950లో పెల్లుబికిన కొరియా యుద్ధం నన్ను ఆలోచింపజేసింది. రెండవ ప్రపంచ యుద్ధం మాదిరిగా ఆ యుద్ధం తీవ్రమవుతుందా? అట్లయితే, శత్రువులను ప్రేమించాలనే యేసు ఆజ్ఞకు నేనెలా లోబడగలను? అదే సమయంలో, నా దేశంపై దాడి జరుగుతుంటే అడ్డగించకుండా నేను చూస్తూ ఊరుకోగలనా? ఒకవేళ నేనలాచేస్తే నేను ఖచ్చితంగా నా బాధ్యతను విస్మరించిన దాన్నవుతాను. నా ఆలోచనలు గలిబిలిగావున్నా, నా ప్రశ్నలన్నిటికి జవాబులు బైబిలులో ఉంటాయని నేను బలంగా నమ్మాను కాని వాటిని ఎలా, ఎక్కడ కనుక్కోవాలో నాకు తెలియలేదు.

ఆస్ట్రేలియాలో సత్యాన్వేషణ

1954లో నేను అమ్మ, మా అక్క జీన్‌ నివసిస్తున్న ఆస్ట్రేలియాకు వలసవెళ్లిపోదామని నిర్ణయించుకున్నాము. అలా అక్కడికెళ్లిన కొన్ని సంవత్సరాల తర్వాత, బైబిలు మీద నాకు ఆసక్తివుందనీ, నేను చర్చికి వెళతాననీ జీన్‌కు తెలుసు, కాబట్టి నన్ను కలవమని తాను యెహోవాసాక్షులకు చెప్పినట్లు నాకు చెప్పింది. వారి విషయంలో నా అభిప్రాయమేమిటో తెలుసుకోవాలని ఆమె కోరింది. “వారి వివరణలు సరైనవో కాదో నాకు తెలియదు గానీ, కనీసం వారి దగ్గర వివరణలు ఉన్నాయి కానీ చర్చిల దగ్గర అవి కూడా లేవు” అని ఆమె నాకు చెప్పింది.

చూడముచ్చటైన బిల్‌, లిండా షినెయిడర్‌ దంపతులు నా దగ్గరకొచ్చారు. 60 సంవత్సరాలు పైబడ్డ వారిరువురూ చాలా సంవత్సరాలుగా సాక్షులు. ఆడిలైడ్‌లోని సాక్షుల ద్వారా నిర్వహించబడే రేడియో స్టేషన్‌లో వారు పనిచేసేవారు, రెండవ ప్రపంచయుద్ధ కాలంలో ఆస్ట్రేలియాలో ప్రకటనా పని నిషేధించబడినప్పుడు, వారు పూర్తికాల సువార్తికులుగా సేవ ఆరంభించారు. అయితే బిల్‌, లిండా నాకు సహాయం చేస్తున్నప్పటికీ, ఇతర మతాలను పరిశోధించడం నేను మానుకోలేదు.

తోటి ఉద్యోగి ఒకాయన నన్ను ఇవాంజిలిస్ట్‌ బిల్లీ గ్రాహమ్‌ మీటింగ్‌కు తీసుకెళ్ళాడు, ఆ తర్వాత మేము చాలామందిమి ఓ మతనాయకుణ్ణి కలిశాము, ఏమైనా ప్రశ్నలుంటే అడగండని ఆయన మమ్మల్ని ఆహ్వానించాడు. నన్నింకా కలవరపరుస్తున్న ఈ ప్రశ్న నేనడిగాను: “ఒక వ్యక్తి యుద్ధానికి వెళ్లి తన శత్రువులను చంపినప్పుడు అతడు క్రైస్తవుడిగా ఉండి తన శత్రువులనెలా ప్రేమించగలడు?” వెంటనే అక్కడ చేరినవారంతా బిగ్గరగా ఆ మాటే అడిగారు, ఆ ప్రశ్న వారందరిని కలవరపరుస్తోందని స్పష్టమయ్యింది! చివరకు, ఆ మతనాయకుడు, “దానికి నాకు జవాబు తెలియదు. దాని గురించి నేనింకా ఆలోచిస్తున్నాను” అని చెప్పాడు.

ఇదే సమయంలో బిల్‌, లిండాలతో నా బైబిలు అధ్యయనం నిరాటంకంగా కొనసాగి సెప్టెంబరు 1958లో నేను బాప్తిస్మం తీసుకున్నాను. నాకు బైబిలు గురించి నేర్పినవారి మాదిరినే అనుకరించాలని నేను తీర్మానించుకొని, ఆ మరుసటి సంవత్సరం ఆగస్టునాటికి క్రమ పయినీరు సేవ ప్రారంభించి పూర్తికాల సువార్తికురాలినయ్యాను. ఎనిమిది నెలల తర్వాత ప్రత్యేక పయినీర్ల జాబితాలో చేరడానికి ఆహ్వానం అందుకున్నాను. మా అక్క జీన్‌ కూడా తన అధ్యయనంలో పురోగతి సాధించి బాప్తిస్మం తీసుకోవడం నాకెంతో సంతోషం కలిగించింది.

అవకాశపు ద్వారం తెరుచుకోవడం

నేను సిడ్నిలోని ఓ సంఘంలో సేవచేస్తూ చాలా బైబిలు అధ్యయనాలు నిర్వహించాను. ఒకరోజు ఇంగ్లాండ్‌ చర్చి నుండి పదవీ విరమణచేసిన మతనాయకుడు తారసపడ్డాడు, లోకాంతం గురించి చర్చి చెప్పేదేమిటని నేను ఆయనను అడిగాను. తను దాదాపు 50 సంవత్సరాలు చర్చి సిద్ధాంతం బోధించానని ఆయన నాకు చెప్పినప్పటికీ, “యెహోవాసాక్షులకు తెలిసినంతగా నాకు బైబిలు గురించి తెలియదు కాబట్టి ఆ విషయం పరిశోధించడానికి నేను సమయం తీసుకోవాలి” అని ఆయనిచ్చిన జవాబు నన్ను ఆశ్చర్యపరచింది.

ఇది జరిగిన కొద్దికాలానికే, పాకిస్తాన్‌లో సేవచేయడానికి స్వచ్ఛంద సేవకులు అవసరమనే పిలుపు ఇవ్వబడింది. అవివాహిత పురుషులు లేదా వివాహిత దంపతులు తప్ప అవివాహిత స్త్రీలు అక్కడికి పంపబడరని తెలియక నేను దరఖాస్తు చేశాను. నా దరఖాస్తు బ్రూక్లిన్‌ ప్రధాన కార్యాలయానికి పంపించబడివుంటుంది, ఎందుకంటే నేనొకవేళ అంగీకరిస్తే, ఇండియాలో (ఇప్పుడు ముంబాయి అని పిలువబడుతున్న) బొంబాయిలో అవసరం ఉందని తెలియజేస్తున్న ఉత్తరం నాకు అందింది. అది 1962. అలా నేను బొంబాయిలో 18 నెలలు ఉండి ఆ తర్వాత అలహాబాదుకు వెళ్లాను.

త్వరలోనే నేను హిందీ నేర్చుకోవడంపై మనస్సుపెట్టాను. సామాన్యంగా ఈ భారతీయ భాషలోని పదాల అక్షరక్రమం మరియు ఉచ్ఛారణ ఒకే విధంగా ఉంటాయి కాబట్టి దానిని నేర్చుకోవడం అంత కష్టంకాదు. కానీ, గృహస్థులు తమ సొంత భాషలో ఇబ్బంది పడడానికి బదులు ఇంగ్లీషులో మాట్లాడమని నన్నడిగినప్పుడు నాకు తరచూ ఆశాభంగం కలిగేది! ఏదేమైనా, ఈ కొత్త దేశం ఆసక్తికరమైన, ఉత్తేజకరమైన సవాళ్లు తీసుకొచ్చింది, అయితే ఆస్ట్రేలియా నుండి వచ్చిన తోటి సాక్షుల సాంగత్యంలో నేనానందించాను.

నా తొలిప్రాయంలో నేను వివాహం గురించి ఆలోచించాను, అయితే నేను బాప్తిస్మం తీసుకొనే సమయానికి దాని గురించి ఆలోచించే తీరికలేనంతగా యెహోవా సేవలో మునిగిపోయాను. కానీ ఇప్పుడు జీవిత సహచర్యం నాకవసరమని భావించడం ఆరంభించాను. అయితే నేను నా విదేశీ నియామకాన్ని విడిచివెళ్లడానికి ఇష్టపడలేదు, అందువల్ల ఆ విషయం గురించి యెహోవాకు ప్రార్థించి దాని గురించి ఇక ఆలోచించడం మానుకున్నాను.

అనుకోని ఆశీర్వాదం

ఆ సమయంలో ఇండియా బ్రాంచి సేవను ఎడ్విన్‌ స్కిన్నర్‌ పర్యవేక్షిస్తున్నాడు. ఆయన చైనాకు నియమించబడ్డ హెరాల్డ్‌ కింగ్‌, స్టాన్లీ జోన్స్‌తోసహా నమ్మకస్థులైన ఇతర సహోదరులతోపాటు 1946లో వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ 8వ తరగతికి హాజరయ్యాడు. * షాంఘైలో ప్రకటనా పనిచేస్తునందుకు 1958లో హెరాల్డ్‌ను, స్టాన్లీని ఏకాంత కారాగారంలో పడేశారు. 1963లో హెరాల్డ్‌ విడుదలైనప్పుడు, ఎడ్విన్‌ ఆయనకు ఉత్తరం వ్రాశాడు. అమెరికా, బ్రిటన్‌లకు వెళ్లి హాంకాంగ్‌కు తిరిగివచ్చిన తర్వాత హెరాల్డ్‌ ఆయనకు జవాబు వ్రాస్తూ, తను వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పాడు. జైల్లో ఉండగా ఈ విషయాన్ని తాను ప్రార్థనాంశంగా చేసుకున్నానని ఆయన ఎడ్విన్‌కు చెబుతూ, తనకు తగిన భార్యకాగల సాక్షులెవరైనా తెలుసా అని ఎడ్విన్‌ను అడిగాడు.

ఇండియాలో వివాహాలు అధికంగా ఏర్పాటు చేయబడతాయి, అలాంటి ఏర్పాట్లు చేయమని ఎడ్విన్‌ను ఎక్కువగా అడిగేవారు, అయితే ఆయన అన్ని సందర్భాల్లో ససేమిరా అనేవాడు. అందువల్ల ఆయన హెరాల్డ్‌ ఉత్తరాన్ని రూత్‌ మెకేకు ఇచ్చాడు, ఆమె భర్త హోమర్‌ ప్రయాణ పైవిచారణకర్తగా ఉండేవాడు. చివరకు, చాలా సంవత్సరాల నుండి సత్యంలోవున్న మిషనరీ ఒకరు పెళ్లిచేసుకోవాలని ఇష్టపడుతున్నాడనీ, ఆయనకు ఉత్తరం వ్రాయడం నా కిష్టమో లేదో చూడమని రూత్‌ నాకు ఉత్తరం వ్రాసింది. ఆ సహోదరుడు ఎవరో ఆమె నాకు చెప్పలేదు ఆయన గురించి అంతకంటే ఎక్కువ వ్రాయనూలేదు.

నాకు సహచర్యం అవసరమని ప్రార్థన చేసిన సంగతి యెహోవాకు తప్ప వేరెవ్వరికీ తెలియదు కాబట్టి ఇప్పుడు పెళ్ళి ప్రస్తావన వచ్చేసరికి నేను దానిని త్రోసిపుచ్చేశాను. అయితే, నేను దాని గురించి ఎంత ఎక్కువగా ఆలోచిస్తే, మనం అనుకున్న విధంగా యెహోవా మన ప్రార్థనలకు జవాబివ్వడం చాలా అరుదు అని అంత ఎక్కువగా అనిపించింది. అందువల్ల రూత్‌కు జవాబు వ్రాసేటప్పుడు ఆ సహోదరునికి అభ్యంతరం లేకపోతే తననే నాకు ఉత్తరం వ్రాయమని చెప్పాల్సిందిగా కోరాను. హెరాల్డ్‌ తన రెండవ ఉత్తరాన్ని నాకే వ్రాశాడు.

చైనా చెరసాల నుండి విడుదలైన తర్వాత హెరాల్డ్‌ ఫోటోలు, ఆయన కథ చాలా వార్తాపత్రికల్లో, పత్రికల్లో వచ్చాయి. ఈ సమయానికి ప్రపంచవ్యాప్తంగా ఆయనెవరో బాగా తెలిసిపోయింది, అయితే ఆయన నమ్మకమైన దైవపరిపాలనా సేవ నాకు నచ్చింది. దానితో ఐదునెలలపాటు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగిన తర్వాత నేను హాంకాంగ్‌ వెళ్లాను. 1965 అక్టోబరు 5న మేము వివాహం చేసుకున్నాము.

మేమిద్దరం వివాహం చేసుకొని పూర్తికాల సేవలో ఉండాలనే కోరుకున్నాం, మేము వృద్ధులమయ్యేకొద్దీ మరిదేనికంటే ఎక్కువగా మాకు సహచర్యపు అవసరముందని భావించాము. నేను హెరాల్డ్‌ను గాఢంగా ప్రేమించాను, అలాగే ఆయన ప్రజలతో దయగా ఉండడం, మా సేవకు సంబంధించి వచ్చిన సమస్యలతో జాగ్రత్తగా వ్యవహరించడం నాలో ఆయనపట్ల ప్రగాఢ గౌరవభావం పెంచాయి. 27 సంవత్సరాలపాటు మేము సంతోషంగా వివాహ జీవితం గడిపి యెహోవా ఆశీర్వాదాలెన్నో చవిచూశాము.

చైనీయులు కష్టజీవులు, వాళ్లంటే నాకు చాలా ఇష్టం. హాంకాంగ్‌లో మాట్లాడే భాష కాంటొనీస్‌, దీనికి చైనీస్‌ అక్షరమాలే ఉంటుంది, కానీ ఆ భాషలో మాండరీన్‌ భాషకంటే ఎక్కువ స్వర శబ్దాలు లేదా స్వరభేదాలు ఉంటాయి కాబట్టి దానిని నేర్చుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయంలోవున్న మిషనరీ గృహంలో హెరాల్డ్‌, నేను దంపతులుగా మా జీవితాన్ని ఆరంభించి, ఆ తర్వాత, హాంకాంగ్‌లో అనేక సేవా ప్రాంతాల్లో సేవచేశాము. అయితే మేము చాలా సంతోషంగావున్న తరుణంలో అంటే 1976లో నాకు ప్రమాదకరమైన ఆరోగ్య సమస్య ఎదురైంది.

ఆరోగ్య సమస్యల్ని తాళుకోవడం

కొన్ని నెలలపాటు రక్తస్రావం కావడంతో నాలో తీవ్ర రక్తహీనత ఏర్పడింది. నాకు ఆపరేషన్‌ అవసరమైంది, కానీ రక్తంలేకుండా ఆపరేషన్‌ చేయడం కుదరదని అలా చేస్తే షాక్‌వల్ల నేను మరణించే అవకాశం ఉందని ఆసుపత్రిలోని డాక్టర్లు చెప్పారు. ఒకరోజు డాక్టర్లు నా కేసు గురించి చర్చిస్తుండగా, అనవసరంగా ప్రాణం తీసుకోవడం మంచిది కాదని చెబుతూ నర్సులు నా మనస్సు మార్చడానికి ప్రయత్నించారు. ఆ రోజు 12 ఆపరేషన్లు జరగాల్సివుండగా అందులో 10 గర్భస్రావ కేసులే, అయితే ఆ గర్భిణీ స్త్రీలలో ఏ ఒక్కరికీ వారు తమ పిల్లల ప్రాణాలు తీస్తున్నారని ఎవ్వరూ చెప్పడం లేదని నేను గమనించాను.

చివరకు, నేను మరణించినా అందుకు ఆసుపత్రికి ఎలాంటి బాధ్యత లేదని చెబుతూ హెరాల్డ్‌ పత్రం వ్రాసిచ్చాడు, నాకు అవసరమైన ఆపరేషను చేయడానికి డాక్టర్లు అంగీకరించారు. నన్ను ఆపరేషను థియేటరుకు తీసుకెళ్లి అనస్థీషియా ఇవ్వడానికి సిద్ధంచేశారు. అయితే చివరి క్షణంలో అనస్థీషియా ఇచ్చే డాక్టరు నిరాకరించడంతో, తప్పని పరిస్థితుల్లో ఆసుపత్రివారు నన్ను డిశ్చార్జి చేశారు.

అప్పుడు మేము ప్రవేటు గైనకాలజిస్టును సంప్రదించాము. ప్రమాదకరంగావున్న నా పరిస్థితిచూసి తక్కువ డబ్బుకే ఆపరేషను చేయడానికి ఆయన ఒప్పుకున్నాడు, అయితే ఆయన మా దగ్గర ఎంత డబ్బు తీసుకున్నాడో మేమెవరికీ చెప్పకూడదని ఆయన కోరాడు. ఆయన రక్తం ఏమాత్రం ఉపయోగించకుండానే విజయవంతంగా ఆపరేషను చేశాడు. ప్రత్యేకంగా ఈ సమయంలో నేను, హెరాల్డ్‌ యెహోవా ప్రేమపూర్వక దయను, శ్రద్ధను స్పష్టంగా చవిచూశాము.

1992లో హెరాల్డ్‌ బాగా జబ్బుపడ్డాడు. దానితో మేము బ్రాంచి కార్యాలయానికి వెళ్లాము, అక్కడ మా ఇద్దరినీ ఎంతో ప్రేమగా చూసుకున్నారు. నా ప్రియమైన భర్త 1993లో తన 81వ ఏట భూ జీవితం చాలించారు.

ఇంగ్లాండుకు తిరిగిరావడం

హాంకాంగ్‌ బెతెల్‌ కుటుంబ సభ్యురాలిగా ఉండడం నాకెంతో సంతోషంగా ఉండేది, అయితే వేడి, ఉక్కపోత తట్టుకోవడం నాకు కష్టమవుతున్నట్లు నేను గమనించాను. అప్పుడే బ్రూక్లిన్‌ ప్రధాన కార్యాలయం నుండి నా ఆరోగ్యం దృష్ట్యా మరిన్ని సౌకర్యాలున్న బ్రాంచికి వెళ్లడం నాకిష్టమేనా అని అడుగుతున్న ఓ ఉత్తరం ఆశ్చర్యకరంగా నాకు అందింది. దానితో, 2000 సంవత్సరంలో నేను తిరిగి ఇంగ్లాండుకు వెళ్లి, లండన్‌ బెతెల్‌లో చేరాను. ఇదెంత ప్రేమపూర్వక ఏర్పాటో గదా! నేను ఆప్యాయంగా ఆహ్వానించబడ్డాను, 2,000 పుస్తకాలున్న బెతెల్‌ కుటుంబ గ్రంథాలయం చూసుకోవడంలో సహాయం చేయడంతోపాటు విభిన్న నియామకాల్లో నేనెంతో ఆనందిస్తున్నాను.

లండన్‌లో కలుసుకొనే చైనీస్‌ సంఘంతో నేను సహవసిస్తున్నాను, కానీ ఇక్కడ పరిస్థితులు మారిపోయాయి. ఈ రోజుల్లో, హాంకాంగ్‌ నుండి కాదుగానీ ఎక్కువమంది చైనా దేశం నుండే వస్తున్నారు. వారు మాండరీన్‌ భాష మాట్లాడతారు, ఇది ప్రకటనా పనిలో ఓ కొత్త సవాలుగా ఉంటోంది. చైనాదేశపు పోస్టు గ్రాడ్యుయేట్‌ విద్యార్థులతో ఆసక్తికరమైన అనేక బైబిలు అధ్యయనాలు నిర్వహించబడుతున్నాయని దేశం నలుమూలల నుండి నివేదికలు అందుతున్నాయి. వారు కష్టపడి పనిచేస్తారు, నేర్చుకుంటున్న బైబిలు సత్యాన్నిబట్టి వారు సంతోషిస్తున్నారు. వారికి సహాయం చేయడం ఆనందదాయకం.

నా కొత్త గృహపు ప్రశాంత వాతావరణంలో, నేను తరచూ సంతోషంగా గడిపిన నా జీవితం గురించి ధ్యానిస్తూ, యెహోవా ప్రేమపూర్వక దయను ఆలోచిస్తూ ఆశ్చర్యపడుతూ ఉంటాను. ఆయన సంకల్పాలకు సంబంధించిన విషయాలన్నింటిలోను, తన సేవకులపట్ల ఆయన వ్యక్తిగతంగా చూపే శ్రద్ధలోను అది ఆయన ప్రేమపూర్వక దయ ఉండడం ఎంతో స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. నా విషయంలో ఆయన చూపిన ప్రేమపూర్వక శ్రద్ధపట్ల కృతజ్ఞతతో ఉండడానికి నాకు ఎన్నో కారణాలు ఉన్నాయి.​—⁠1 పేతురు 5:6, 7.

[అధస్సూచి]

^ పేరా 19 ఈ ఇద్దరు సాక్షుల జీవిత కథలు కావలికోట (ఆంగ్లం) 1963 జూలై 15, 437-42 పేజీలు, 1965 డిసెంబరు 15, 756-67 పేజీల్లో ఉన్నాయి.

[24వ పేజీలోని చిత్రం]

ఇండియాలో సేవచేయడం

[25వ పేజీలోని చిత్రాలు]

హెరాల్డ్‌ కింగ్‌ 1963లో, అలాగే 1950వ దశాబ్దంలో చైనాలో సేవచేస్తున్నప్పుడు

[26వ పేజీలోని చిత్రాలు]

1965 అక్టోబరు 5న హాంకాంగ్‌లో మా పెళ్లిరోజు

[26వ పేజీలోని చిత్రం]

హాంకాంగ్‌ బెతెల్‌ సభ్యులతో, మధ్యలో లియాంగా దంపతులు, కుడివైపున గనావేస్‌ దంపతులు