కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా మన ప్రతిదిన అవసరాలు తీరుస్తాడు

యెహోవా మన ప్రతిదిన అవసరాలు తీరుస్తాడు

యెహోవా మన ప్రతిదిన అవసరాలు తీరుస్తాడు

“అనుమానము కలిగియుండకుడి. . . . ఇవి మీకు కావలసియున్నవని మీ తండ్రికి తెలియును.”​—⁠లూకా 12:29, 30.

పిచ్చుక లేదా మరోపక్షి మట్టిలా కనిపిస్తున్న దానిలో ఏదో పొడుచుకు తినడం మీరెప్పుడైనా గమనించారా? మట్టిలో పొడుచుకు తినడానికి దానికేమి దొరుకుతుందా అని మీరు బహుశా ఆశ్చర్యపడి ఉంటారు. పక్షులకు యెహోవా ఆహారం దయచేసే విధానం నుండి మనమొక పాఠం నేర్చుకోవచ్చని తన కొండమీది ప్రసంగంలో యేసు చూపించాడు. ఆయనిలా అన్నాడు: “ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించు చున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్టులు కారా?” (మత్తయి 6:​26) అద్భుత రీతుల్లో యెహోవా తన సృష్టి ప్రాణులన్నింటికి ఆహారం దయచేస్తున్నాడు.​—⁠కీర్తన 104:14, 21; 147:9.

2 అలాంటప్పుడు, యేసు తన మాదిరి ప్రార్థనలో “మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము” అనే విన్నపం ఎందుకు చేర్చాడు? (మత్తయి 6:​11) ఈ సామాన్య విన్నపం నుండి లోతైన ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకోవచ్చు. మొదట అది యెహోవా మహాగొప్ప దాత అని మనకు గుర్తుచేస్తుంది. (కీర్తన 145:​15, 16) మానవులు నాటి సాగుచేయవచ్చు, కానీ దేవుడు మాత్రమే ఆధ్యాత్మికంగా, భౌతికంగా ఎదిగేలా చేయగలడు. (1 కొరింథీయులు 3:⁠7) మనం తినేదీ, త్రాగేదీ దేవుడు అనుగ్రహించినవే. (అపొస్తలుల కార్యములు 14:​17) మన దైనందిన అవసరాలు తీర్చమని ఆయనను అడిగినప్పుడు, అలాంటి ఏర్పాట్లను మనం తేలికగా తీసుకోవడం లేదని మనం చూపిస్తాం. ఆ విన్నపం చేసినంత మాత్రాన మనం పనిచేయగలిగే స్థితిలో ఉన్నప్పటికీ మనకు పనిచేసే బాధ్యత లేదని కాదు.​—⁠ఎఫెసీయులు 4:28; 2 థెస్సలొనీకయులు 3:​10.

3 రెండవది, “అనుదినాహారము” కోసం అడగడం మనం భవిష్యత్తు గురించి అతిగా చింతించకూడదని సూచిస్తుంది. యేసు ఇంకా ఇలా అన్నాడు: “ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించుకొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును. రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును.” (మత్తయి 6:​31-34) “అనుదినాహారము” కోసం చేసే ప్రార్థన, ‘సంతుష్టి సహితమైన దైవభక్తిగల’ నిరాడంబరమైన జీవితం గడిపేందుకు ప్రమాణం ఏర్పరుస్తుంది.​—⁠1 తిమోతి 6:6-8.

ప్రతిదిన ఆధ్యాత్మిక ఆహారం

4 అనుదినాహారం కోసం మనం చేసే ప్రార్థన, ప్రతిదిన ఆధ్యాత్మిక ఆహార అవసరతను కూడా మనకు గుర్తుచేయాలి. చాలారోజులు ఉపవాసముండి ఎంతో ఆకలిగావున్న సమయంలో కూడా యేసు రాళ్లను రొట్టెలు చేసుకొమ్మనే సాతాను శోధనను నిరాకరిస్తూ ఇలా అన్నాడు: “మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును అని వ్రాయబడియున్నది.” (మత్తయి 4:⁠4) ఇక్కడ యేసు, “ఆహారమువలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతిమాటవలన నరులు బ్రదుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన [యెహోవా] నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి, నీవేగాని నీ పితరులేగాని యెన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను” అని పలికిన మోషే ప్రవక్త మాటల్ని ఉదహరించాడు. (ద్వితీయోపదేశకాండము 8:⁠3) ఇశ్రాయేలీయులకు యెహోవా మన్నా దయచేసిన విధానం వారికి భౌతికాహారం దయచేయడమే కాక ఆధ్యాత్మిక పాఠాలను కూడా నేర్పింది. ఒక పాఠమేమంటే, వారు “ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను.” వారు ఆనాటికి సరిపడ దానికంటే ఎక్కువ కూర్చుకుంటే, మిగిలింది పురుగుపట్టి కంపుకొట్టేది. (నిర్గమకాండము 16:​4, 20) కానీ, వారు ఆరవ దినమున విశ్రాంతి దినం కోసం ఉపయోగపడేందుకు రెండింతలు కూర్చుకున్నప్పుడు అలా జరిగేది కాదు. (నిర్గమకాండము 16:​5, 23, 24) కాబట్టి వారు విధేయులుగా ఉండాలనీ, వారి జీవితాలు కేవలం ఆహారంపై కాదుగానీ “యెహోవా సెలవిచ్చిన ప్రతిమాట”పై ఆధారపడి ఉన్నాయని మన్నా వారికి బలంగా గుర్తుచేస్తుండేది.

5 అదే ప్రకారం మనం ప్రతీరోజు యెహోవా తన కుమారుని ద్వారా అనుగ్రహించే ఆధ్యాత్మిక ఆహారాన్ని తీసుకోవాలి. దీనికోసం విశ్వాస గృహపు వారికి “తగినవేళ అన్నము పెట్టుటకు” యేసు ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుణ్ణి’ నియమించాడు. (మత్తయి 24:​45) నమ్మకమైన ఆ దాసుని తరగతి బైబిలు అధ్యయన ఉపకరణాల రూపంలో సమృద్ధియైన ఆధ్యాత్మిక ఆహారం సరఫరా చేయడమే కాక మనం ప్రతీరోజు బైబిలు చదవాలని ప్రోత్సహిస్తోంది. (యెహోషువ 1:8; కీర్తన 1:​1-3) యేసువలెనే మనం కూడా యెహోవా చిత్తం గురించి నేర్చుకోవడానికి, ఆయన చిత్తం చేయడానికి ప్రతీరోజు కృషి చేయడం ద్వారా ఆధ్యాత్మికంగా పోషించబడవచ్చు.​—⁠యోహాను 4:34.

పాప క్షమాపణ

6 మాదిరి ప్రార్థనలో తర్వాతి విన్నపం: “మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము.” (మత్తయి 6:​12) యేసు ఇక్కడ డబ్బు ఋణపడి ఉండడం గురించి మాట్లాడడం లేదు. ఆయన మదిలో మన పాపాలను క్షమించడం ఉంది. లూకా నమోదు చేసిన మాదిరి ప్రార్థనలో ఆ విన్నపం ఇలావుంది: “మేము మాకచ్చియున్న ప్రతివానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము.” (లూకా 11:⁠4) కాబట్టి మనం పాపం చేసినప్పుడు మనం యెహోవాకు ఋణపడినట్టవుతాము. కానీ మనం యథార్థంగా పశ్చాత్తాపపడి ‘మారుమనస్సునొంది తిరిగి’ క్రీస్తు విమోచన క్రయధన బలియందు మనకున్న విశ్వాసాన్నిబట్టి క్షమించమని అడిగితే మన ప్రేమగల దేవుడు ఆ ఋణాన్ని ‘తుడిచివేయడానికి’ లేదా రద్దుచేయడానికి సిద్ధంగా ఉన్నాడు.​—⁠అపొస్తలుల కార్యములు 3:20; 10:43; 1 తిమోతి 2:5, 6.

7 మరో కోణంనుండి చూస్తే, మనం యెహోవా నీతి ప్రమాణాలను అతిక్రమించడం ద్వారా పాపం చేస్తాము. వారసత్వంగా పొందిన పాపం కారణంగా మనందరం మాటలో, క్రియలో, తలంపులో దేవుని ప్రమాణాలను ఉల్లంఘిస్తాము లేదా మనం చేయవలసింది చేయలేకపోతాము. (ప్రసంగి 7:20; రోమీయులు 3:23; యాకోబు 3:2; 4:​17) కాబట్టి, మనం ఫలాని రోజు పాపం చేశామో లేదో గ్రహించినా గ్రహించకపోయినా సరే, మన ప్రతీదిన ప్రార్థనలో క్షమాపణా విన్నపాన్ని చేర్చాలి.​—⁠కీర్తన 19:12; 40:​12.

8 క్షమాపణా ప్రార్థన తర్వాత యథార్థంగా స్వయం పరీక్ష చేసుకోవాలి, పశ్చాత్తాపపడాలి, క్రీస్తు చిందించిన రక్తానికున్న విమోచనా శక్తిపై విశ్వాసం ఆధారంగా పాపాలను ఒప్పుకోవాలి. (1 యోహాను 1:​7-9) మన ప్రార్థనల యథార్థతను నిరూపించేందుకు, మనం క్షమాపణ కోరుతూ చేసిన విన్నపానికి అనుగుణంగా “మారుమనస్సునకు తగిన క్రియలు” చేయాలి. (అపొస్తలుల కార్యములు 26:​20) అప్పుడు మనం మన పాపాలను క్షమించేందుకు యెహోవాకున్న సంసిద్ధతను విశ్వసించవచ్చు. (కీర్తన 86:5; 103:​8-14) తత్ఫలితంగా “సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము” అంటే సాటిలేని మానసిక ప్రశాంతత మనకు లభిస్తుంది, అది ‘యేసుక్రీస్తు వలన మన హృదయాలకు మన తలంపులకు కావలి ఉంటుంది.’ (ఫిలిప్పీయులు 4:⁠7) అయితే యేసు మాదిరి ప్రార్థన, మన పాపాలకు క్షమాపణ పొందడం కోసం మనమేమి చేయాలి అనే విషయాలకంటే ఇంకా ఎక్కువే నేర్పిస్తుంది.

క్షమించబడాలంటే, మనం క్షమించాలి

9 ఆసక్తికరమైన విషయమేమంటే యేసు మాదిరి ప్రార్థనను నేర్పించిన తర్వాత “మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము” అనే విన్నపం గురించి కేవలం కొంత వివరణ మాత్రమే ఇచ్చాడు. ప్రార్థన ముగించిన తర్వాత, ఆయన ఇంకా ఇలా అన్నాడు: “మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయినయెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు.” (మత్తయి 6:​14, 15) ఆ విధంగా, యెహోవా ద్వారా క్షమించబడడమనేది మనం ఇతరులను క్షమించడానికి చూపించే సుముఖతపైనే ఆధారపడి ఉంటుందని యేసు స్పష్టం చేశాడు.​—⁠మార్కు 11:25.

10 మరో సందర్భంలో, యెహోవా మనల్ని క్షమించాలని మనం ఆశించినప్పుడు మనం కూడా క్షమించేవారిగా ఉండాలని చూపించేందుకు యేసు ఒక ఉపమానం చెప్పాడు. ఓ దాసుడు తనకు ఋణపడ్డ పెద్దమొత్తాన్ని ఎంతో ఉదారంగా రద్దుచేసిన రాజు గురించి ఆయన చెప్పాడు. అయితే ఆ దాసుడు తోటి దాసుడు తనకు ఋణపడిన అతిస్వల్ప మొత్తాన్ని రద్దుచేయడానికి నిరాకరించినప్పుడు రాజు అతనిని కఠినంగా శిక్షించాడు. “మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపనియెడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీయెడల చేయును” అని చెబుతూ యేసు తన ఉపమానం ముగించాడు. (మత్తయి 18:​23-35) ఆయన ఉపమానంలోని పాఠం స్పష్టంగా తెలుస్తోంది: మనపట్ల ఇతరులు చేసిన ఎలాంటి తప్పుకంటే కూడా యెహోవా మనలో ప్రతీ ఒక్కరి విషయంలో క్షమించిన పాప ఋణం మరెంతో గొప్పది. అంతేకాకుండా యెహోవా మనల్ని ప్రతీరోజు క్షమిస్తున్నాడు. అందువల్ల, ఇతరులు మనపట్ల అప్పుడప్పుడు చేసే తప్పులను మనం తప్పకుండా క్షమించవచ్చు.

11 అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.” (ఎఫెసీయులు 4:​32) పరస్పర క్షమాపణ క్రైస్తవుల మధ్య సమాధానం పురికొల్పుతుంది. పౌలు ఇంకా ఇలా ఉద్బోధించాడు: “దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనినయెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు [యెహోవా] మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి.” (కొలొస్సయులు 3:​12-14) “మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము” అని యేసు నేర్పిన ప్రార్థనలో ఇవన్నీ ఉన్నాయి.

శోధనలో కాపుదల

12 యేసు ప్రార్థనలోని తర్వాతి అంశం: ‘మమ్మును శోధనలోకి తేవద్దు.’ (మత్తయి 6:​13) మనల్ని శోధించవద్దని యెహోవాను మనం అడగాలని యేసు భావమా? అలా కావడానికి అవకాశమే లేదు, ఎందుకంటే “దేవుడు కీడువిషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు—నేను దేవునిచేత శోధింపబడుచున్నానని అనకూడదు” అని వ్రాసేలా శిష్యుడైన యాకోబు ప్రేరేపించబడ్డాడు. (యాకోబు 1:​13) అంతేకాకుండా కీర్తనకర్త ఇలా వ్రాశాడు: “యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినయెడల ప్రభువా, ఎవడు నిలువగలడు?” (కీర్తన 130:⁠3) మనం చేసే ప్రతీ తప్పుకోసం యెహోవా కనిపెట్టిచూడడు, మనం తప్పుచేయడానికి మనల్ని ఖచ్చితంగా శోధించడు. అలాంటప్పుడు, మాదిరి ప్రార్థనలోని ఈ భాగానికి అర్థమేమిటి?

13 మనల్ని శోధించడానికి, తంత్రాల ద్వారా మనం పడిపోయేలా చేయడానికి, చివరకు మనల్ని మ్రింగివేయడానికి ప్రయత్నించేది అపవాదియైన సాతానే. (ఎఫెసీయులు 6:​11) అతడే పెద్ద శోధకుడు. (1 థెస్సలొనీకయులు 3:⁠5) శోధనలోకి తేవద్దని ప్రార్థించడం ద్వారా, మనం శోధించబడినప్పుడు పడిపోకుండా కాపాడాలని మనం యెహోవాను అర్థిస్తున్నాము. “సాతాను మనలను మోసపరచకుండునట్లు,” శోధనలకు బలికాకుండునట్లు మనకు సహాయం చేయుమని మనమాయనను అడుగుతున్నాం. (2 కొరింథీయులు 2:​11) తమ సమస్త క్రియల్లోను యెహోవా సర్వాధిపత్యాన్ని గుర్తించేవారికి అందించబడే ఆధ్యాత్మిక కాపుదలను పొందుతూ “మహోన్నతుని చాటున” నిలిచివుండాలనేదే మన ప్రార్థన.​—⁠కీర్తన 91:1-3.

14 మన ప్రార్థనల్లో, క్రియల్లో వ్యక్తపరచబడే మన యథార్థ కోరిక అదే అయితే యెహోవా మనలను ఎన్నడూ ఎడబాయడనే నమ్మకంతో మనం ఉండవచ్చు. అపొస్తలుడైన పౌలు మనకిలా అభయమిస్తున్నాడు: “సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును.”​—⁠1 కొరింథీయులు 10:13.

“దుష్టునినుండి మమ్మును తప్పించుము”

15 క్రైస్తవ గ్రీకు లేఖనాల అత్యంత ఆధారపడదగిన చేవ్రాత ప్రతుల ప్రకారం యేసు మాదిరి ప్రార్థన ఈ మాటలతో ముగుస్తుంది: “దుష్టునినుండి మమ్మును తప్పించుము.” * (మత్తయి 6:​13) అంతం సమీపిస్తున్న ఈ కాలంలో మనకు అపవాది నుండి రక్షణ మరెక్కువగా అవసరం. సాతాను అతని దయ్యాలు “దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసునుగూర్చి సాక్ష్యమిచ్చుచు[న్న]” అభిషిక్త శేషంతో, వారి సహవాసులైన ‘గొప్పసమూహంతో’ యుద్ధం చేస్తున్నారు. (ప్రకటన 7:9; 12:​9, 17) అపొస్తలుడైన పేతురు క్రైస్తవులకు ఇలా హితవు చెప్పాడు: “నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని యెరిగి, విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి.” (1 పేతురు 5:​8, 9) సాతాను మన సాక్ష్యపు పనిని ఆపుజేయాలని కోరుకుంటున్నాడు కాబట్టి, తన భూసంబంధ ప్రతినిధుల ద్వారా అంటే మత, వాణిజ్య లేదా రాజకీయ ప్రతినిధుల ద్వారా అతడు మనల్ని బెదిరించడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ మనం స్థిరంగా నిలబడితే యెహోవా మనల్ని విడిపిస్తాడు. శిష్యుడైన యాకోబు ఇలా వ్రాశాడు: “కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును.”​—⁠యాకోబు 4:7.

16 యెహోవా తన కుమారుడు శోధించబడడానికి అనుమతించాడు. కానీ యేసు దేవుని వాక్యాన్ని రక్షణకవచంగా ఉపయోగిస్తూ అపవాదిని ఎదిరించిన తర్వాత, ఆయనను బలపరిచేందుకు యెహోవా దేవదూతలను పంపించాడు. (మత్తయి 4:​1-11) అదేప్రకారంగా, మనం విశ్వాసంతో ప్రార్థిస్తూ, యెహోవాను మన ఆశ్రయదుర్గంగా చేసుకుంటే మనకు సహాయం చేయడానికి ఆయన తన దేవదూతలను ఉపయోగిస్తాడు. (కీర్తన 34:7; 91:​9-11) అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాశాడు: “భక్తులను శోధనలోనుండి తప్పించుటకును, దుర్ణీతిపరులను . . . తీర్పుదినమువరకు కావలిలో ఉంచుటకును, ప్రభువు [యెహోవా] సమర్థుడు.”​—⁠2 పేతురు 2:9.

సంపూర్ణ విడుదల సమీపంలో ఉంది

17 మాదిరి ప్రార్థనలో యేసు ఆయా విషయాలను సరిగ్గా వాటివాటి స్థానాల్లో ఉంచి చూపించాడు. యెహోవా మహాగొప్ప పరిశుద్ధ నామం పవిత్రపరచబడడమే మన ప్రధాన చింతగా ఉండాలి. దీనిని నెరవేర్చే సాధనం మెస్సీయ రాజ్యం కాబట్టి అసంపూర్ణ మానవ రాజ్యాలన్నింటిని లేదా ప్రభుత్వాలన్నింటిని నాశనం చేయడానికి, దేవుని చిత్తం పరలోకంలో మాదిరిగా భూమిపై నెరవేరేలా చూడడానికి ఆ రాజ్యం రావాలని మనం ప్రార్థిస్తాం. పరదైసు భూమిపై మనం నిత్యజీవితం అనుభవించే నిరీక్షణ యెహోవా నామం పరిశుద్ధపరచబడడం మీద అలాగే సమస్త విశ్వంలో ఆయన నీతియుక్తమైన సర్వాధిపత్యం గుర్తించబడడం మీద ఆధారపడివుంది. మనం అతి ప్రాముఖ్యమైన ఈ సంగతుల కోసం ప్రార్థించిన తర్వాత మన దైనందిన అవసరాల కోసం, మన పాప క్షమాపణ కోసం, శోధనల నుండి దుష్టుడైన అపవాదియగు సాతాను తంత్రముల నుండి విడుదల కోసం ప్రార్థించవచ్చు.

18 ఆ దుష్టుని నుండి అతని అవినీతికర విధానం నుండి మన సంపూర్ణ విడుదల సమీపిస్తోంది. ఈ భూమిపై, ప్రత్యేకంగా యెహోవా నమ్మకమైన సేవకులపై తన “బహు క్రోధము” వెళ్లగ్రక్కడానికి “తనకు సమయము కొంచెమే” మిగిలివుందని సాతానుకు బాగా తెలుసు. (ప్రకటన 12:​12, 17) “యుగసమాప్తికి” సంబంధించిన సంయుక్త సూచనలో భాగంగా యేసు అనేక ఉత్తేజకరమైన సంఘటనలు ప్రవచించాడు, వాటిలో కొన్ని ఇంకా భవిష్యత్తులో సంభవిస్తాయి. (మత్తయి 24:​3, 29-31) ఇవి జరగడం మనం చూస్తుండగా విడుదల కోసమైన మన నిరీక్షణ మరింత తేజోవంతమవుతుంది. యేసు ఇలా అన్నాడు: “ఇవి జరుగ నారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తికొనుడి, మీ విడుదల సమీపించుచున్నది.”​—⁠లూకా 21:25-28.

19 యేసు తన శిష్యులకిచ్చిన సంక్షిప్త మాదిరి ప్రార్థన, అంతం సమీపిస్తుండగా మనం వేటి గురించి ప్రార్థించాలి అనే విషయానికి సంబంధించి ఆధారపడదగిన మార్గనిర్దేశాన్నిస్తోంది. అంతంవరకు యెహోవా మన అనుదిన భౌతిక, ఆధ్యాత్మిక అవసరాలు తీరుస్తాడనే నమ్మకంతో మనముందాము. మన ప్రార్థనాపూర్వక అప్రమత్తత “మొదటనుండి మనకున్న దృఢ విశ్వాసము అంతముమట్టుకు గట్టిగా చేపట్టి” ఉండడానికి మనకు సహాయం చేస్తుంది.​—⁠హెబ్రీయులు 3:13; 1 పేతురు 4:7.

[అధస్సూచి]

^ పేరా 22 కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌వంటి పాత బైబిళ్లు కొన్ని దైవస్తోత్రం (దేవుణ్ణి స్తుతించే పదాలు) అని పిలువబడే ఈ మాటలతో ప్రభువు ప్రార్థనను ముగిస్తాయి: “నీకే యుగయుగములు రాజ్యము, శక్తి, మహిమ చెందును గాక. ఆమేన్‌.” ద జెరోమ్‌ బిబ్లికల్‌ కమెంట్రీ ఇలా చెబుతోంది: “ఆ దైవస్తోత్రం . . . అత్యంత ఆధారపడదగిన అనేక [చేవ్రాత ప్రతుల్లో] కనిపించదు.”

పునఃసమీక్ష

“అనుదినాహారము” కోసం మనం చేసే విన్నపం యొక్క భావమేమిటి?

“మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము” అనే విన్నపం గురించి వివరించండి.

మనలను శోధనలోకి తేవద్దు అని మనం యెహోవాను అడిగినప్పుడు దానర్థమేమిటి?

“దుష్టునినుండి మమ్మును తప్పించుము” అని మనమెందుకు ప్రార్థన చేయాలి?

[అధ్యయన ప్రశ్నలు]

1. జంతుజాలాలను యెహోవా ఎలా పోషిస్తున్నాడు?

2, 3. మన ప్రతిదినాహారం కోసం ప్రార్థించుమని యేసు నేర్పడం నుండి మనమెలాంటి ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకోవచ్చు?

4. యేసు మరియు ఇశ్రాయేలీయుల జీవితంలోని ఏ సంఘటనలు ఆధ్యాత్మిక ఆహారం తీసుకోవాల్సిన ప్రాముఖ్యతను నొక్కిచెబుతున్నాయి?

5. యెహోవా మనకు ప్రతీరోజు ఆధ్యాత్మిక ఆహారం ఎలా అందిస్తున్నాడు?

6. ఎలాంటి ఋణాలకు మనం క్షమాపణ అడగాలి, ఏ షరతును బట్టి వాటిని రద్దుచేయడానికి యెహోవా ఇష్టపడతాడు?

7. ప్రతీరోజు క్షమాపణకై మనమెందుకు ప్రార్థించాలి?

8. క్షమాపణ కొరకైన మన ప్రార్థన మనమేమి చేయడానికి కారణం కావాలి, అది ఎలాంటి ప్రయోజనకర ఫలితాలు తెస్తుంది?

9, 10. (ఎ) మాదిరి ప్రార్థనకు యేసు ఇంకా ఏ మాటలు జోడించాడు, ఇది ఏ విషయాన్ని నొక్కిచెబుతోంది? (బి) మనం క్షమించేవారిగా ఉండాలనే విషయాన్ని యేసు ఉపమానరీతిగా ఎలా వివరించాడు?

11. యెహోవా మన పాపాలు క్షమించాలని మనం ఆశిస్తే అపొస్తలుడైన పౌలు ఇచ్చిన ఏ ఉపదేశాన్ని మనం అనుసరిస్తాం, దానివల్ల ఎలాంటి చక్కని ఫలితాలొస్తాయి?

12, 13. (ఎ) యేసు మాదిరి ప్రార్థనలోని తర్వాతి అంశపు భావమేది కావడానికి అవకాశం లేదు? (బి) పెద్ద శోధకుడు ఎవరు, మనలను శోధనలోకి తేవద్దనే మన ప్రార్థనకు భావమేమిటి?

14. మనం శోధించబడినప్పుడు మనం యెహోవావైపు చూస్తే ఆయన మనలను ఎన్నడు ఎడబాయడని అపొస్తలుడైన పౌలు మనకెలా అభయమిస్తున్నాడు?

15. దుష్టునినుండి తప్పించుమని క్రితంకంటే ఇప్పుడు మరెక్కువగా ప్రార్థించడం ఎందుకు ప్రాముఖ్యం?

16. పరీక్షల్లోవున్న తన సేవకుల సహాయార్థమై యెహోవాకు ఎవరు సంసిద్ధంగా అందుబాటులో ఉన్నారు?

17. మనకు మాదిరి ప్రార్థన ఇవ్వడం ద్వారా, యేసు ఆయా విషయాలను వాటివాటి స్థానాల్లో ఎలా ఉంచాడు?

18, 19. మనం అప్రమత్తంగా ఉండడానికీ, మన నిరీక్షణను “అంతముమట్టుకు గట్టిగా చేపట్టి” ఉండడానికి యేసు మాదిరి ప్రార్థన మనకెలా సహాయం చేస్తుంది?

[15వ పేజీలోని చిత్రాలు]

మనం క్షమించబడాలంటే, మనం ఇతరులను క్షమించాలి

[13వ పేజీలోని చిత్రసౌజన్యం]

Lydekker