పాఠకుల ప్రశ్నలు
పాఠకుల ప్రశ్నలు
జలప్రళయం తర్వాత, నోవహు ఒక పావురాన్ని ఓడలో నుండి బయటకు వదిలిపెట్టగా అది ‘ఓలీవ ఆకుతో’ తిరిగివచ్చింది. ఆ పావురానికి ఆ ఆకు ఎక్కడ లభించింది?
“ఆ ప్రచండ జలములు భూమిమీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నియు మునిగిపోయెను” అని బైబిలు మనకు చెబుతోంది. (ఆదికాండము 7:19) జలప్రళయపు నీళ్లు తగ్గుముఖం పట్టినప్పుడు, నోవహు వారం రోజుల తేడాతో మూడుసార్లు పావురాన్ని బయటకు వదిలాడు. రెండవసారి ఆ పావురం తిరిగివచ్చినప్పుడు “త్రుంచబడిన ఓలీవచెట్టు ఆకు దాని నోటనుండెను గనుక నీళ్లు భూమిమీదనుండి తగ్గిపోయెనని నోవహునకు తెలిసెను.”—ఆదికాండము 8:8-11.
భూమ్మీద ఫలానా ప్రాంతం ఇంతకాలంపాటు నీటిలో మునిగివుంది అని చెప్పడం ఇప్పుడు అసాధ్యం, ఎందుకంటే జలప్రళయం కారణంగా భూ ఉపరితలం మారిందనడంలో సందేహం లేదు. ఏదేమైనప్పటికీ, చాలాచెట్లు చనిపోయేలా అత్యధిక ప్రాంతాలు చాలాకాలంపాటు నీటిలో మునిగివుంటాయి. అయితే కొన్ని చెట్లు తమ జీవశక్తిని కోల్పోలేదని స్పష్టమవుతోంది, నీళ్ళు తగ్గిపోయినప్పుడు అవి మళ్లీ చిగిర్చాయి.
ద న్యూ బైబిల్ డిక్షనరీ ఓలీవ చెట్టు గురించి ఇలా చెబుతోంది: “నరికివేసినా, దాని వేళ్ళనుండి కొత్త చిగుర్లు పుట్టుకొస్తాయి, అలా దాదాపు ఐదు కొత్త కాండాలు మొలకెత్తే అవకాశం ఉంది. చచ్చే స్థితికి చేరిన ఓలీవ చెట్లు సహితం సాధారణంగా ఇదే రీతిలో తిరిగి మొలకెత్తుతాయి.” “దాని చేవకు చావులేదన్నట్టుగా ఉంటుంది” అని ద న్యూ షాఫ్ హెర్ట్సోక్ ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ రెలిజియస్ నాలెడ్జ్ చెబుతోంది. జలప్రళయపు నీటిలోని లవణం, దాని ఉష్ణోగ్రత వంటి వివరాలు నేటి మానవులకెవ్వరికీ తెలియదు. అందువల్ల, ఆ జలప్రళయపు నీటి ప్రభావం ఓలీవచెట్లపై, ఇతర మొక్కలపై ఎంతబలంగా ఉండివుండవచ్చో ఖచ్చితంగా మనం చెప్పలేము.
అయితే, అడవి ఓలీవచెట్టు మాత్రం ఎత్తైన పర్వత శిఖరాలపై ఉండే శీతోష్ణ పరిస్థితులు తట్టుకొని బ్రతకలేదు. అది సాధారణంగా 1,000 మీటర్లకంటే తక్కువ ఎత్తున్న ప్రాంతాల్లో పెరుగుతుంది, అలాంటి ప్రాంతాల్లో సగటు ఉష్ణోగ్రత పది డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉంటుంది. “కాబట్టి తాజాగా తెంచుకొచ్చిన ఆకునుబట్టి నోవహు, పల్లపుప్రాంత లోయల్లోని నీరు ఇంకిపోతోందని అర్థంచేసుకోగలిగాడు” అని ద ఫ్లడ్ రీ కన్సిడర్డ్ అనే పుస్తకం చెబుతోంది. ఓ వారం తర్వాత నోవహు ఆ పావురాన్ని బయటకు విడిచిపెట్టినప్పుడు అది మళ్లీ తిరిగి రాలేదు, అంటే మొక్కలు విస్తారంగా ఉండి ఆ పావురం వ్రాలడానికి తగినన్ని స్థలాలు ఉన్నాయని అది సూచిస్తోంది.—ఆదికాండము 8:12.