కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“ప్రపంచ నడిబొడ్డున” సమావేశం కావడం

“ప్రపంచ నడిబొడ్డున” సమావేశం కావడం

“ప్రపంచ నడిబొడ్డున” సమావేశం కావడం

“టి పిటో ఓ టి హెనువ” అనే మాటలు మీరెప్పుడైనా విన్నారా? ఈస్టర్‌ అనే ద్వీపంలో మాట్లాడే ఆదిమ భాష రెపానుయేలో దానర్థం “ప్రపంచ నడిబొడ్డు.” ఇక్కడి సమావేశాన్ని అంత ప్రత్యేకం చేసిందేమిటి?

సుదూరమైనది, అద్భుతమైనది, విలక్షణమైనది. ఈస్టర్‌ ద్వీపాన్ని లేదా దానిలోని ప్రజలు పిలిచినట్లు రెపానుయే ద్వీపాన్ని వర్ణించే పదాల్లో ఇవి కొన్ని. దక్షిణ పసిఫిక్‌ మహాసముద్రంలో చిలీ, సాంటియాగోకు 3,790 కిలోమీటర్ల దూరంలోవున్న ఆ ద్వీపం నిజంగానే సుదూర ప్రాంతంలో ఉంది. ఇది 1888 సెప్టెంబరు 9న చిలీ పాలిత ప్రాంతమయింది.

166 చదరపు కిలోమీటర్ల వైశాల్యంగల ఈ ముక్కోణపు ద్వీపం ప్రాథమికంగా చల్లారిపోయిన మూడు అగ్నిపర్వతాలతో రూపొందింది. నిజానికి అనేక పసిఫిక్‌ దీవుల్లాగే, ఇది కూడా సముద్రంలో మునిగివున్న మహా పర్వతాల ఉపరితలంపై ఏర్పడ్డ ద్వీపం. ఈ ద్వీపం మొత్తాన్ని సహజ స్మారక చిహ్నమని ప్రకటించబడింది. మోయ్‌ అనే అద్భుత శిలా విగ్రహాలకు అది పేరుగాంచింది. *

ఆకర్షణీయమైన ప్రకృతి దృశ్యాలు, చారిత్రక ప్రదేశాలతోపాటు, ఈస్టర్‌ ద్వీపం వివిధ రుచుల వంటకాలకు ప్రసిద్ధి చెందింది. ఆ ద్వీపంలో అనాస పళ్ళు, ఆవొకాడో పళ్ళు, బొప్పాయి పళ్ళు, తొమ్మిదిరకాల అరటిపళ్లు పండుతాయి. అక్కడ సముద్రంలో అనేకరకాలైన చేపలు, ఇతరత్రా సముద్ర ఆహారం లభిస్తుంది.

ఈస్టర్‌ ద్వీపంలోని సమశీతోష్ణ వాతావరణం, క్రమంతప్పని వర్షాలు, వర్షధనస్సులు వచ్చే సందర్శకులను స్వచ్ఛమైన గాలితో, అద్భుతమైన దృశ్యాలతో అలరిస్తాయి. అక్కడ ప్రస్తుతం 3,800 మంది నివాసులున్నారు. మొదట్లో ఆ ద్వీపంలో స్థిరపడిన యురోపియన్ల, చిలీదేశస్థుల, ఇతర మిశ్రిత వంశాల నుండి వచ్చినవారే అక్కడి ఆధునిక జనాభా. యూరప్‌, ఆసియాల నుండి వందల సంఖ్యలో యాత్రికులు ఇక్కడికి వస్తుంటారు, అందువల్ల ఆర్థిక వ్యవస్థలో పర్యాటక రంగం ఓ ప్రముఖ పాత్ర పోషిస్తోంది.

రాజ్య విత్తనాలు మొదట విత్తబడడం

యెహోవాసాక్షుల వార్షిక పుస్తకం​—⁠1982 ఇలా నివేదిస్తోంది: “కొంతకాలం వరకు ఈస్టర్‌ ద్వీపంలో ఒకే ఒక ప్రచారకురాలు ఉండేది. [చిలీ] బ్రాంచిలో ఉన్న మిషనరీ సహోదరి ఉత్తరప్రత్యుత్తరాల ద్వారా ఆమెకు ఆధ్యాత్మికంగా సహాయం చేసేది. చివరకు ఆమె చిలీకి తిరిగి వచ్చేసినా, ఆ ద్వీపంలో కావలికోట చందాదారులు ఉన్నట్లు మా దగ్గర రికార్డు ఉంది. 1980 ఏప్రిల్‌లో మమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ, అక్కడ నివసించే ఓ ఆసక్తిగల వ్యక్తి అంతదూరం నుండి ఫోన్‌ చేసి జ్ఞాపకార్థ ఆచరణ ఎప్పుడు జరుపుకోవాలి అని అడిగాడు. ఆ తర్వాత అదే సంవత్సరం వాల్‌పారయిసో నగరం నుండి ఓ వివాహిత జంట అక్కడికి వెళ్లి, ఆసక్తిగల వ్యక్తులతో బైబిలు అధ్యయనాలు చేయడం ఆరంభించారు. 1981 ఏప్రిల్‌లో ఆ ద్వీపంలో మొదటిసారిగా జ్ఞాపకార్థ ఆచరణకు సంబంధించిన కూటం నిర్వహించబడింది, దానికి 13 మంది హాజరయ్యారు. ఈ సుదూర ప్రాంతానికి ‘సువార్త’ చేరుతున్నందుకు మేమెంతో సంతోషిస్తున్నాము!”

ఆ పిమ్మట 1991 జనవరి 30న బ్రాంచి కార్యాలయం డారియో, విన్నీ ఫెర్నాండేజ్‌ అనే ప్రత్యేక పయినీరు దంపతులను ఆ ద్వీపానికి పంపించారు. సహోదరుడు ఫెర్నాండేజ్‌ ఇలా గుర్తుచేసుకుంటున్నాడు: “ఐదు గంటల విమాన ప్రయాణం తర్వాత మేము మని గ్రహంలోని ఓ సుదూరమైన ప్రాంతానికి, అద్భుతమైన సంస్కృతిగల ప్రాంతానికి చేరుకున్నాము.” ఓ స్థానిక సహోదరుడు మరియు ఇద్దరు పిల్లలతో ఆ మధ్యే అక్కడికి చేరుకున్న ఓ సహోదరి మద్దతుతో వెంటనే కూటాలు, ప్రకటించే పని వ్యవస్థీకరించబడ్డాయి. కుటుంబ ఒత్తిళ్లు, మతావేశం, పోలినేషియా సంస్కృతుల్లో సర్వసాధారణమైన కొన్ని ప్రత్యేక జీవన విధానాల మధ్యా వారి ప్రయత్నాలపై వారు యెహోవా ఆశీర్వాదం చూశారు. ఫెర్నాండేజ్‌ దంపతులు ఇప్పడు ప్రత్యేక పయినీర్లుగా లేరు, అయినప్పటికీ వారు అక్కడ తమకు పుట్టిన కుమారుడితో ఆ ద్వీపంలోనే ఉండిపోయారు. నేడక్కడ, సంతోషంగా సేవచేస్తున్న 32 మంది ప్రచారకులున్నారు. వారిలో రెపానుయే ద్వీప నివాసులు అలాగే ఆ ద్వీపంలో స్థిరపడ్డవారు లేదా రాజ్యప్రచారకుల అవసరం ఎక్కువున్నందుకు అక్కడికి తరలివచ్చినవారు ఉన్నారు.

ప్రాంతీయ సమావేశానికి ఏర్పాట్లు

ఖండానికి ఆ ద్వీపానికి మధ్యవున్న దూరం దృష్ట్యా, సంవత్సరంలో మూడుసార్లు ఆ సంఘానికి ప్రత్యేకదిన, ప్రాంతీయ, జిల్లా సమావేశాల కార్యక్రమాల వీడియో టేపులు పంపించబడేవి. అయితే ఆ ద్వీపంలో తొలిసారిగా వారికోసం అక్కడ ఓ సమావేశం ఏర్పాటు చేయాలనే ఆలోచనను 2000 సంవత్సరాంతంలో చిలీలోని బ్రాంచి కార్యాలయం పరిశీలించింది. చివరకు 2001 నవంబరులో అక్కడ ప్రాంతీయ సమావేశం జరగాలని నిర్ణయించబడింది, ఈ ప్రత్యేక సందర్భానికి హాజరు కావల్సిందిగా పరిమిత సంఖ్యలో చిలీలోని వివిధ ప్రాంతాల సహోదర సహోదరీలకు ఆహ్వానాలు పంపించబడ్డాయి. విమానాల షెడ్యూలు కారణంగా సమావేశం ఆదివారం, సోమవారం జరిగేలా ఏర్పాటు చేయబడింది.

ఆ సుదూర ప్రాంతంలో నిర్వహించబడే మొట్ట మొదటి ప్రాంతీయ సమావేశంలో పాల్గొనేందుకు వెళుతున్నామనే తలంపు ఆహ్వానించబడ్డ 33 మంది ప్రతినిధులను ఎంతగానో ఉత్తేజపరచింది. పసిఫిక్‌ మహాసముద్రం మీదుగా సుదీర్ఘ విమాన ప్రయాణం తర్వాత, వారికోసం విమానాశ్రయంలో వేచివున్న స్థానిక సహోదరులు ఇచ్చిన ఆహ్వానంతో ఆ ప్రతినిధులు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఆ ద్వీప విలక్షణ బహుమానమైన చూడచక్కని లీస్‌తో (పూరేకులతో చేసిన హారాలతో) ఆ ప్రతినిధులు స్వాగతించబడ్డారు. అక్కడనుండి వారు తమ బసకువెళ్లి, కొంచెంసేపు ఆ ద్వీపమంతా తిరిగిచూసి ఆ తర్వాత సమావేశ కార్యక్రమంలో పాల్గొనే వారందరు రాజ్యమందిరంలో కలుసుకున్నారు.

ఊహించని మూలం నుండి ప్రచారం

ప్రతినిధులు కొందరు సమావేశానికి వెళుతూ ఉండగా, స్థానిక ఫాదిరీ తమ సందర్శనం గురించి వ్యాఖ్యానించడం రేడియోలో విని వారు ఆశ్చర్యపోయారు. దక్షిణ అమెరికా నుండి వచ్చిన యాత్రికులు రాబోయే లోకాంతం గురించి మాట్లాడడానికి ఇళ్లకు వస్తారని ఆయన చెప్పాడు. ఆ సందర్శకుల మాట వినవద్దని అతను చర్చి సభ్యులను ప్రాధేయపడినా, అతను చేసిన ఆ ప్రకటన ద్వీపంలో యెహోవాసాక్షుల ఓ పెద్ద గుంపు ఉందనే ప్రచారానికే దోహదపడింది. ఇది ద్వీపవాసుల్లో ఆసక్తిని పురికొల్పింది. ఆ తర్వాతి రోజుల్లో, ప్రతినిధులు యుక్తిగా ప్రోత్సాహకరమైన సువార్తను వారితో పంచుకున్నారు.

సమావేశ ఆరంభం

ఆదివారం ఉదయం, మొదటిరోజు సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులు వస్తుండగా వారిని ఆహ్వానించేందుకు స్థానిక సహోదరులు రాజ్యమందిరం ముఖ ద్వారంవద్ద వేచివున్నారు. “ఐరోనా కో! ఐరోనా కో!” “స్వాగతం!” కొంతమంది సహోదరీలు సంప్రదాయ దుస్తులు ధరించుకొని నిజమైన పోలినేషియా పద్ధతిలో తమ జుట్టును అందమైన పూలతో అలంకరించుకున్నారు.

శ్రావ్యమైన ఆరంభ సంగీతం తర్వాత, వందమంది “బి స్టెడ్‌ఫాస్ట్‌, అన్‌మూవబుల్‌” అనే పాటను ముక్తకంఠంతో ఆలపించారు, అలా ఆలపించడం ఆ ద్వీపంలో అదే మొదటిసారి. సమావేశ అధ్యక్షుడు స్థానిక భాష రెపానుయేలో సాదర ఆహ్వానం పలికినప్పుడు ఆనందంతో స్థానిక సహోదరుల కళ్లు చెమర్చాయి. మధ్యాహ్నకాల విరామ సమయంలో, ముగ్గురు కొత్తసాక్షులు దేవునికి తమ సమర్పణకు సూచనగా నీటి బాప్తిస్మం తీసుకున్నారు. మొదటి రోజు కార్యక్రమం ముగిసినప్పుడు, ప్రతీ ఒక్కరిలో తాము యెహోవాకు, సహోదర సమూహమంతటికీ చేరువైన భావన కలిగింది.​—⁠1 పేతురు 5:9.

ఉదయం సాక్ష్యం

ఆ ద్వీపంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా, ప్రాంతీయ సమావేశపు రెండవరోజు కార్యక్రమం మధ్యాహ్నం ఆరంభమైంది. దానితో ప్రతినిధులు ఆ పరిస్థితిని సద్వినియోగం చేసుకుంటూ ఉదయకాలాన్ని ప్రాంతీయ పరిచర్యలో భాగం వహించడానికి ఉపయోగించారు. వారి కోసం ఎలాంటి అనుభవాలు వేచివున్నాయి?

ఎనిమిది మంది కొడుకులూ, కూతుర్లున్న ఓ వృద్ధ స్త్రీ తను క్యాథలిక్‌ కాబట్టి వారితో మాట్లాడడం కుదరదని ఆ సాక్షులకు చెప్పింది. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, కుటుంబ సమస్యలవంటి అందరూ ఎదుర్కొనే సమస్యల గురించి మేము మాట్లాడాలనుకుంటున్నామని వారు ఆమెతో చెప్పినప్పుడు ఆమె వినడానికి అంగీకరించింది.

ఓ వృద్ధ స్థానికురాలు సాక్షి దంపతులపై మండిపడుతూ మాట్లాడింది. ఇతరులపట్ల క్రూరంగా ప్రవర్తించే దక్షిణ అమెరికా ప్రజల దగ్గరకెళ్లి చెప్పండని వారితో అంది. అందుకు ఆ దంపతులు తాము ప్రకటించే “రాజ్య సువార్త” అందరికోసమనీ, ప్రతీ ఒక్కరూ దేవునిపై తమ ప్రేమను వృద్ధిచేసుకోవడానికి సహాయంచేసే సమావేశానికి హాజరయ్యేందుకే ఈ ద్వీపానికి వచ్చామని వివరించారు. (మత్తయి 24:​14) ఆ ద్వీపంలో ఉన్నటువంటి పరదైసు పరిస్థితుల్లో రోగం మరణం లేకుండా దీర్ఘకాలం జీవించడం తనకెలా ఉంటుందని వారామెను అడిగారు. ఆ ద్వీపంలో అగ్నిపర్వత శిఖరబిలాలు ఎంతకాలంగా ఉన్నాయని తర్కిస్తూ ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె అల్పకాల జీవితం గురించి ఆలోచించి, చివరకు “మనమెందుకు ఇలా కొద్దికాలమే జీవిస్తున్నాము?” అని అడిగింది. కీర్తన 90:⁠10 చదివినప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది.

అదే సమయంలో, సాక్షులు పక్కింటి నుండి అకస్మాత్తుగా అరుపులు రావడం విన్నారు. ఆ అరుపులేమిటో వారికి అర్థంకాలేదు, కానీ ఆ స్త్రీ వారికి పక్కింటివారు శాపనార్థాలు పెడుతున్నారనీ, సాక్షులు తమ దగ్గరకు రావద్దని చెబుతున్నారనీ వివరించింది. అయితే, ఆ స్త్రీయే ఆ కుటుంబానికి నువా, అంటే పెద్ద కూతురు. ఆమె తండ్రి చనిపోయాడు కాబట్టి ఆ కుటుంబ మంచిచెడ్డలు నిర్ణయించడం ఆమె కర్తవ్యం. తన బంధువుల ముందు వారి స్థానిక భాషలో ఆమె సహోదరుల పక్షాన మాట్లాడి ఆమెకు అందించబడ్డ సాహిత్యాలు తీసుకోవడానికి అంగీకరించింది. ఆ వారంలో ఓ రోజు సాక్షులను దాటివెళుతుండగా ఆమె తన తమ్ముణ్ణి కారు ఆపమని చెప్పింది. అతనికి ఇష్టంలేకపోయినా ఆమె సహోదరులకు వీడ్కోలు చెబుతూ వారి పరిచర్య జయప్రదం కావాలని శుభాకాంక్షలు తెలిపింది.

దక్షిణ అమెరికా నుండి వచ్చిన సాక్షులు ప్రకటించిన సందేశాన్ని కొందరు ద్వీపవాసులు తొలుత తిరస్కరించినట్లు కనిపించినా, రెపానుయే ప్రజలు సహజంగా దయగల, స్నేహపూర్వక ప్రజలని సందర్శకులకు స్పష్టమయింది. వారిలో అత్యధికులు సంతోషంగా సువార్త విన్నారు. నిజానికి, ఆ ద్వీపంలో బాప్తిస్మం తీసుకున్న 20 మంది సాక్షుల్లో ఆరుగురు స్థానికులే. వారిలో ఒకరు పక్కగదిలో తన భార్యకు నిర్వహించబడుతున్న బైబిలు అధ్యయనం వినడం ద్వారా బైబిలు సత్యం నేర్చుకున్నాడు. ఆయన, ఆయన భార్య ప్రస్తుతం బాప్తిస్మం తీసుకున్న సాక్షులు, కాగా ఆయన సంఘంలో పరిచర్య సేవకునిగా సేవచేస్తున్నాడు.

ఆధ్యాత్మిక కార్యక్రమం కొనసాగడం

మధ్యాహ్నం, రెండవరోజు కార్యక్రమం ఆరంభమైంది. మళ్లీ ఆ 33 మంది ప్రతినిధులు, 32 మంది స్థానిక సహోదర సహోదరీలతోపాటు ఆసక్తిగల అనేకమంది సమావేశమయ్యారు. దాదాపు 100మంది, “ప్రేమా విశ్వాసాలు లోకాన్ని ఎలా జయిస్తాయి” అనే బహిరంగ ప్రసంగంతోపాటు ఆ కార్యక్రమాన్ని విని ఆనందించారు. వాస్తవానికి, హాజరైన వారు ఆ విభిన్న సంస్కృతులకు చెందిన యెహోవా ప్రజల మధ్య కూడా నెలకొనివున్న ప్రేమకు సజీవ నిదర్శనం చూశారు.​—⁠యోహాను 13:35.

ప్రాంతీయ సమావేశ సమయంలో ప్రాంతీయ, జిల్లా పైవిచారణకర్తలు పయినీరు పరిచారకులతో ఓ ప్రత్యేక కూటం జరిపారు. ఆ ద్వీపంలోని ముగ్గురు క్రమ పయినీర్లతోపాటు, క్రమ పయినీర్లుగా లేదా ప్రత్యేక పయినీర్లుగా ఉన్న ప్రతినిధులు కూడా దానికి హాజరయ్యారు. వారందరూ బహుగా ప్రోత్సహించబడ్డారు.

ఆ మరుసటి రోజు, టూరు గైడ్లుగా పనిచేస్తున్న స్థానిక సహోదరులు కొందరు ప్రతినిధులకు ఆ ద్వీపమంతా తిప్పిచూపించారు. మోయ్‌ బొమ్మలు మలిచే క్వారీని అలాగే పూర్వం పోటీలు జరిగే అగ్నిపర్వత ప్రాంతాలను, వలసవచ్చిన మొదటి తరాలవారు కాలుమోపిన చూడ ముచ్చటైన బంగారు ఇసుకతిన్నెల అనకానా బీచ్‌ను వారు సందర్శించారు. *

చివరిగా వారికి సంఘ పుస్తక అధ్యయనంలో స్థానిక సహోదరులతో సహవాసం చేసే అవకాశం లభించింది. ఆ కూటం ముగిసిన తర్వాత, స్థానిక సాక్షులు అతిథులకు విలక్షణమైన భోజనం ఏర్పాటుచేసి వారిని ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత, సంప్రదాయ దుస్తులు ధరించి వారు జానపద నృత్యంచేసి వారిని అలరించారు. ఆ ప్రతినిధులు, రెపానుయే సహోదర సహోదరీలు సమావేశం ఏర్పాటుకై చేసిన ప్రయత్నం సఫలమైనట్లు భావించారు.

వారంపాటు సుదూరంగా ఉన్న తమ సహోదర సహోదరీలతో ఉల్లాసంగా గడపడానికి విచ్చేసిన ప్రతినిధులందరూ గాఢానుభూతికి లోనయ్యారు. ఆ ద్వీపం వదిలిరావడం చాలా కష్టమయింది. తమకు లభించిన కొత్త స్నేహితుల పరిచయం, పొందిన ఆధ్యాత్మిక ప్రోత్సాహం సదా వారి జ్ఞాపకాల్లో ఉండిపోతుంది. విమానాశ్రయంలో స్థానిక సహోదరులు సముద్రపు గుల్లలతో చేసిన హారాలు ఆ ప్రతినిధులకు అలంకరింపజేసారు.

ఆ ప్రతినిధులు వెళుతూ వెళుతూ, “ఐయోరానా! లా హి హోకీ మాయ్‌ ఎ రెపానుయే,” అంటే “వెళ్లొస్తాము! మళ్లీ మేము రెపానుయేకు తిరిగివస్తాము” అని వాగ్దానం చేశారు. అవును వారు సుదూరమైన, అద్భుతమైన, విలక్షణమైన ఈస్టర్‌ ద్వీపంలో తమకు లభించిన కొత్త స్నేహితులను, తమ ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులను తిరిగి సందర్శించాలని కోరుకుంటున్నారు.

[అధస్సూచీలు]

^ పేరా 4 యెహోవాసాక్షులు ప్రచురించిన తేజరిల్లు! (ఆంగ్లం) జూన్‌ 22 2000 సంచిక చూడండి.

^ పేరా 27 రానో రరాకు అగ్నిపర్వత బిలంపై అనేక శిలాక్షరాలు ఉన్నాయి. ద్వీపాన్ని పరిపాలించాలని కోరుకునే వారిమధ్య పోటీల ఆరంభ స్థానం రానోకావ్‌ మీద ఉంది. ఆ పోటీలో పర్వత శిఖరం నుండి క్రిందికి పరుగెత్తి సమీపంలోని మరో చిన్న ద్వీపానికి ఈదుకొని వెళ్లి, అక్కడి పక్షి గుడ్డు నొకదానిని సేకరించి, గుడ్డు పగలకుండా తిరిగి ముఖ్య ద్వీపానికి ఈదుకుంటూ వచ్చి పర్వత శిఖరం చేరుకోవాలి.

[24వ పేజీలోని బాక్సు]

ఈస్టర్‌ ద్వీపంలో సాక్ష్యమివ్వడం

ఈ చిరస్మరణీయ సమావేశానికి రెండు సంవత్సరాల ముందు, ఓ ప్రాంతీయ పైవిచారణకర్త ఆయన భార్య ఈ ద్వీపం సందర్శించి ఎన్నో చక్కని అనుభవాలు చవిచూశారు. ఉదాహరణకు, వారిని బసకు తీసుకెళ్లిన సహోదరి, దాదాపు 16 సంవత్సరాల క్రితం తాను దక్షిణ చిలీలో యౌవనస్థురాలిగా ఉన్నప్పుడు మీరు నాతో బైబిలు అధ్యయనం చేశారు అని ఆమె వారికి గుర్తుచేసినప్పుడు వారెంత ఆశ్చర్యపడి ఉంటారో ఊహించండి. ఆ విత్తనమే ఆ తర్వాత రెపానుయేలో ఫలించింది.

వారికి ఎదురైన ఈ అనుభవం కూడా ఉల్లాసపరిచింది: సొవనీర్లు అమ్మే ఓ షాపు యజమాని, యెహోవాసాక్షులు ప్రచురించిన పరిశుద్ధ లేఖనముల నూతనలోక అనువాదము (తెలుగులో లేదు) మరియు బైబిలు అధ్యయన సహాయక పుస్తకమగు నిత్యజీవానికి నడిపించే జ్ఞానము తీసుకోవడానికి అంగీకరించాడు. ఆయనను సందర్శించడానికి వారు తిరిగి వచ్చినప్పుడు, తను ఆ బైబిలు చదవలేకపోయానని ఆయన వారికి చెప్పాడు. ఎందుకంటే ముందుసారి వారాయనకు స్పానిష్‌కు బదులు ఫ్రెంచ్‌ బైబిల్‌ ఇచ్చారు! ఆ సమస్య త్వరగానే పరిష్కరించబడింది, తన స్వభాషలోని బైబిలునుండే స్థానిక సాక్షుల సహాయంతో బైబిలును అర్థంచేసుకోవడం అంత కష్టం కాదని ఆయన తెలుసుకున్నాడు.

[22వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

ఈస్టర్‌ ద్వీపం

చిలీ

[23వ పేజీలోని చిత్రాలు]

ప్రాంతీయ సమావేశంలో బాప్తిస్మం తీసుకున్న వారిలో ఇద్దరు

[25వ పేజీలోని చిత్రాలు]

రానో రరాకు అగ్నిపర్వత పల్లపు ప్రాంతం; చిన్న చిత్రం: ఆ ద్వీపంలో కాసే గ్వాయాబా అని పిలువబడే అడవి ఫలం