మానవాళి సమస్యలకు మతమే మూలకారణమా?
మానవాళి సమస్యలకు మతమే మూలకారణమా?
“కలహం రేపనప్పుడు మతం మానవుల మనస్సాక్షికి మత్తు కలిగిస్తూ, మానవ మేధస్సును పలాయన భ్రమలతో నింపే మత్తుమందులా పనిచేస్తుంది. . . . మానవులను [అది] సంకుచిత భావాలతో, మూఢనమ్మకాలతో, ద్వేషంతో భయంతో నింపుతుంది.” ఇది వ్రాసిన మాజీ మెథడిస్టు మిషనరీ ఇంకా ఇలా అన్నాడు: “ఈ ఆరోపణలు సత్యం. మతంలో మేలుకీడులు రెండూ ఉన్నాయి.”—స్టార్ట్ యువర్ ఓన్ రెలీజియన్.
‘అది నిశ్చయంగా అన్యాయపు విమర్శ’ అని కొందరనవచ్చు. అయినా చారిత్రక వాస్తవాలను ఎవరు కాదనగలరు? “దేవునికి లేదా మానవాతీత శక్తికిచేసే సేవ మరియు ఆరాధనగా” నిర్వచించబడే మతానికి అధికశాతం దిగ్భ్రాంతికరమైన చరిత్ర ఉంది. అది మనల్ని ప్రేరేపించాలి, జాగృతం చేయాలి. కానీ అది ఎక్కువగా కలహాన్ని, దురభిమానాన్ని, ద్వేషాన్ని రగిలిస్తోంది. ఎందుకలా చేస్తోంది?
మోసగిస్తున్న “వెలుగు దూత”
బైబిలు ప్రకారం దానికి సుళువైన జవాబు ఉంది. “వెలుగు దూత” వేషం ధరించుకొని అపవాదియగు సాతాను దేవుణ్ణి అనుసరించే బదులు తన బోధలు అనుసరించేలా లక్షలాదిమందిని మోసగించాడు. (2 కొరింథీయులు ) సాతాను ప్రభావం ఎంత విస్తారంగా ఉందంటే ‘లోకమంతయు దుష్టుని యందున్నదని’ అపొస్తలుడైన యోహాను వివరించాడు. ( 11:141 యోహాను 5:19) సాతాను ‘సర్వలోకమును మోస పుచ్చుచున్నాడని’ యోహానుకు తెలుసు.—ప్రకటన 12:9.
దాని పర్యవసానాలు ఎలా ఉన్నాయి? పైకి పరిశుద్ధంగా కనిపించే మత వ్యవస్థలను సాతాను ప్రవేశపెట్టాడు. వాటికి “‘మతమనే’ ముఖతలం” ఉన్నా, వాటి దుష్టఫలాలు వాటి అసలు రూపాన్ని బయటపెడుతున్నాయి. (2 తిమోతి 3:5, జె. బి. ఫిలిప్స్; మత్తయి 7:15-20) మానవ సమస్యల పరిష్కారానికి తోడ్పడే బదులు నిజానికి మతమే సమస్యల్లో ఓ భాగమవుతోంది.
ఆ తలంపే అవాస్తవం లేదా అసమంజసమని త్వరపడి కొట్టిపారవేయకండి. మోసగించబడే వ్యక్తికి ఆ విషయం తెలియకపోవడమే మోసానికున్న స్వభావమని గుర్తుంచుకోండి. దీనికి సంబంధించిన ఓ ఉదాహరణను అపొస్తలుడైన పౌలు ప్రస్తావించాడు. ఆయనిలా వ్రాశాడు: “అన్యజనులర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారు.” (1 కొరింథీయులు 10:20) తాము దయ్యాలను ఆరాధిస్తున్నామనే తలంపే ఆ ప్రజలను బహుశా దిగ్భ్రమపరిచి ఉంటుంది. తాము ఏదోక విధమైన మంచి దేవతను లేదా దేవుళ్లను ఆరాధిస్తున్నామని వారు తలంచారు. అయితే, నిజానికి వారు మానవాళిని మోసగించే సాతాను ప్రయత్నాలకు మద్దతిచ్చే “ఆకాశమండలమందున్న దురాత్మల సమూహముల” ద్వారా మోసగించబడ్డారు.—ఎఫెసీయులు 6:12.
ఉదాహరణకు, దుష్ట ప్రభావానికి విరుద్ధంగా అపొస్తలుడైన యోహాను ఇచ్చిన హెచ్చరికను అలక్ష్యం చేయడానికే ఎంచుకున్న అనేకమంది నామకార్థ క్రైస్తవులను సాతాను ఎలా మోసగించి తప్పుదోవపట్టించాడో మనం పరిశీలిద్దాం.—1 కొరింథీయులు 10:12.
యేసు బోధించినది దేవుని నుండి వచ్చింది
“నేను చేయు బోధ నాది కాదు; నన్ను పంపినవానిదే” అని యేసుక్రీస్తు చెప్పాడు. (యోహాను 7:16) అవును, ఆయన సర్వశక్తిగల దేవుని నుండి వచ్చిన బోధను బోధించాడు. కాబట్టి యేసు బోధలు, ఆయన చెప్పినది విన్నవారికి జ్ఞానోదయం కలిగించేలా వారిపై బలమైన ప్రభావం చూపించాయి. అవి ‘మానవ మనస్సాక్షికి మత్తుకలిగించడమో లేదా మానవ మేధస్సును పలాయన భ్రమలతో నింపడమో’ చేయలేదు. బదులుగా, యేసు బోధలు అపవాది చేస్తున్న మోసం కారణంగా “అంధకారమైన మనస్సుగల” లోకం పుట్టించిన మత అపరాధం మరియు మానవ తత్వాల నుండి ప్రజలను స్వతంత్రులను చేశాయి.—ఎఫెసీయులు 4:18; మత్తయి 15:14; యోహాను 8:31, 32.
నిజ క్రైస్తవులు కేవలం తమకు భక్తివుందని చెప్పుకోవడం ద్వారా కాదుగానీ దేవుని పరిశుద్ధాత్మ ఉత్పన్నంచేసే చూడముచ్చటైన లక్షణాలను ప్రతిబింబించే విశ్వాసం ద్వారా గుర్తించబడతారు. (గలతీయులు 5:22; యాకోబు 1:22; 2:26) ప్రేమ ఈ లక్షణాల్లో ప్రధాన లక్షణం అంటే నిజ క్రైస్తవుల గుర్తింపు చిహ్నమైన లక్షణం.—యోహాను 13:34, 35.
అయితే ఈ కీలకాంశం గుర్తుపెట్టుకోండి: ఇటు క్రీస్తు గానీ, అటు అపొస్తలులు గానీ మొదట స్థాపించబడిన రీతిలోనే క్రైస్తవ సంఘం కొనసాగుతుందని ఎదురుచూడలేదు. మతభ్రష్టత్వం ప్రబలుతుందనీ, కొంతకాలంపాటు నిజమైన మతం మరుగుచేయబడుతుందనీ వారికి తెలుసు.
కొంతకాలంపాటు నిజమైన మతం మరుగుచేయబడడం
గోధుమలు, గురుగుల గురించిన ఓ ఉపమానంలో యేసు కొంతకాలంపాటు నిజమైన మతం దాదాపు మరుగుచేయబడుతుందని ప్రవచించాడు. మత్తయి 13:24-30, 36-43 వచనాల్లోని వృత్తాంతాన్ని మీరే స్వయంగా చదవండి. పొలంలో యేసు ‘మంచి’ గోధుమలు విత్తాడు, ఇది తొలి క్రైస్తవ సంఘంగా రూపొందే ఆయన నమ్మకమైన శిష్యులను చిత్రీకరించింది. ఆ తర్వాత కొంతకాలానికి ‘శత్రువైన’ అపవాదియగు సాతాను గోధుమల పొలంలో “గురుగుల”ను చల్లుతాడని ఆయన హెచ్చరించాడు, గురుగులు యేసుక్రీస్తును అనుకరిస్తున్నామని చెప్పుకున్నా నిజానికి ఆయన బోధలను నిరాకరించే నామకార్థ ప్రజలను సూచిస్తున్నాయి.
యేసు అపొస్తలులు మరణించిన తర్వాత అనతికాలంలోనే, ‘యెహోవా వాక్యమునకు’ బదులు వక్రమైన మానవ తత్వాలనే ఎక్కువగా ఇష్టపడే ఆయావ్యక్తులు ‘గురుగులుగా’ నిరూపించబడ్డారు. (యిర్మీయా 8:8, 9; అపొస్తలుల కార్యములు 20:29, 30) దాని పర్యవసానంగా, ప్రపంచ రంగస్థలం మీద వక్రమైన నకిలీ క్రైస్తవ మతం ప్రత్యక్షమైంది. దానిలో “ధర్మవిరోధి” అని బైబిలు పిలిచే ‘దుర్నీతిగల సమస్త మోసం’ నిండిన భ్రష్ట మతనాయక తరగతి ప్రాబల్యమే ఎక్కువ. (2 థెస్సలొనీకయులు 2:6-10) ‘యుగసమాప్తిలో’ ఈ పరిస్థితి మారుతుందని యేసు ప్రవచించాడు. గోధుమలవంటి క్రైస్తవులు ఏకముగా సమకూర్చబడి, “గురుగులు” చివరకు నాశనం చేయబడతారు.
“అనేక శతాబ్దాలపాటు నెలకొన్న సంపూర్ణ అనాగరికతకు,” ఆ తర్వాతి శతాబ్దాల్లో క్రైస్తవమత సామ్రాజ్యాన్ని అలుముకున్న ఆధ్యాత్మిక అంధకారానికి ఈ నకిలీ క్రైస్తవ మతమే కారణం. దీనంతటినీ, అలాగే అప్పటినుండి మతం పేరిట చేయబడ్డ వికృత హింసాయుత చర్యలన్నింటినీ ముందుగానే చూస్తూ అపొస్తలుడైన పేతురు, “వీరినిబట్టి [నామకార్థ క్రైస్తవులనుబట్టి] సత్యమార్గము దూషింపబడును” అని సరిగానే ప్రవచించాడు.—2 పేతురు 2:1, 2.
“క్రోధం, ద్వేషంగల వేదాంతం”
ఒక్క క్రైస్తవమత సామ్రాజ్యం మాత్రమే మత ప్రతిష్ఠను దిగజార్చలేదు. ఉదాహరణకు, మునుపు నన్‌గావున్న కరేన్ ఆర్మ్‌స్ట్రాంగ్ చెబుతున్నట్లు “ప్రధాన మత వ్యవస్థలు ప్రతీదీ” పెంచిపోషిస్తున్న “సాయుధ ధర్మం” అనే ఛాందసవాద మతాల విషయమే ఆలోచించండి. ఆర్మ్‌స్ట్రాంగ్ అభిప్రాయం ప్రకారం ఏ మతమైనా సరే అది “కనికరం చర్యల్లో ప్రదర్శించబడేందుకు” నడిపిస్తుందా లేదా అనే కీలకమైన పరీక్షను ఎదుర్కోవాలి. ఈ విషయంలో ఛాందసవాద మతాల చరిత్ర ఎలావుంది? “ఎలాంటి ఛాందసవాద విశ్వాసమైనా సరే చివరకు అది యూదా మతమైనా, క్రైస్తవ మతమైనా లేదా ఇస్లామ్ మతమైనా క్రోధం, ద్వేషంగల వేదాంతంగా మారితే అది ఈ కీలక పరీక్షలో విఫలమైనట్లే.” (ద బ్యాటిల్ ఫర్ గాడ్—ఫండమెంటలిజమ్ ఇన్ జుడాయిజమ్, క్రిస్టియానిటీ అండ్ ఇస్లామ్) కానీ కేవలం “ఛాందసవాద” మతాలే ఈ పరీక్షలో విఫలమై “క్రోధం, ద్వేషంగల వేదాంతంగా” తయారయ్యాయా? చరిత్ర మరో విధంగా చూపిస్తోంది.
క్రోధం, ద్వేషం, అలాగే అంతులేని రక్తపాతంతో గుర్తించబడుతున్న ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యాన్ని నిజానికి సాతాను నెలకొల్పాడు. బైబిలు ఈ సామ్రాజ్యాన్ని ‘భూమిలోని ఏహ్యమైనవాటికి తల్లియైన మహా బబులోను’ అని పిలుస్తోంది, మరియు ఇది క్రూరమృగాన్ని పోలిన రాజకీయ వ్యవస్థపై స్వారీ చేస్తున్న వేశ్యగా చిత్రీకరించబడింది. ‘భూమిమీద వధింపబడిన వారందరి రక్తమునకు’ అదే జవాబుదారీ అని పరిగణించబడడం గమనించదగ్గ విషయం.—ప్రకటన 17:4-6; 18:24.
అందరూ మోసగించబడలేదు
అయితే అందరూ మోసగించబడలేదని చరిత్ర నిరూపిస్తోంది. మానవ చరిత్రలో అత్యంత అంధకారమయమైన కాలాల్లో సహితం, “తమచుట్టూవున్న వారు కీడు చేస్తున్నా చాలామంది మంచి పనులు చేశారు” అని మెల్విన్ బ్రాగ్ వ్యాఖ్యానిస్తున్నాడు. నిజ క్రైస్తవులు ‘[దేవుణ్ణి] ఆత్మతోను సత్యముతోను ఆరాధించడంలో’ కొనసాగారు. (యోహాను 4:21-24) “సైనిక శక్తిని బలపరిచేదిగా” వ్యభిచరించిన ప్రపంచవ్యాప్త మత విధానం నుండి వారు వేరుగా నిలబడ్డారు. “నజరేయుడైన యేసు కాదుగానీ సాతాను చేసుకున్న ఒప్పందమని” చరిత్ర వెల్లడిస్తున్న చర్చీల ప్రభుత్వాల సంయుక్త కార్యాచరణకు వారు దూరంగా నిలబడ్డారు.—టు థౌజండ్ ఇయర్స్—ద సెకండ్ మిల్లేనియం: ఫ్రమ్ మీడీవల్ క్రిజన్‌డం టు గ్లోబల్ క్రిస్టియానిటీ.
ఇటీవలి కాలాల్లో, యెహోవాసాక్షులు మేలుచేసే తమ క్రియలనుబట్టి గుర్తించబడ్డారు. అబద్ధ మతపు ఎలాంటి కళంకం తమకు అంటకుండా వారు తమ నమ్మకాలను, క్రియలను పూర్తిగా దేవుని ప్రేరేపిత వాక్యమైన బైబిలుపై ఆధారం చేసుకున్నారు. (2 తిమోతి 3:16, 17) మొదటి శతాబ్దపు క్రైస్తవులవలే, వారు కూడా “లోకసంబంధులు” కావద్దనే యేసు ఆజ్ఞను పాటించారు. (యోహాను 15:17-19; 17:14-16) ఉదాహరణకు, నాజీ జర్మనీలో క్రైస్తవ సూత్రాల విషయంలో రాజీపడని కారణంగా వారు నాజీ ఆలోచనా విధానానికి ఆమోదయోగ్యం కాలేదు. అందువల్ల హిట్లర్ వారిని ద్వేషించాడు. ఓ పాఠశాల పాఠ్యపుస్తకం ఇలా చెబుతోంది: “ఎట్టి పరిస్థితుల్లో ఆయుధాలు చేపట్టరాదనే బైబిలు బోధకు . . . యెహోవాసాక్షులు కట్టుబడ్డారు. అందువల్ల వారు సైన్యంలో చేరడానికి లేదా నాజీలతో ఎలాంటి సంబంధానికైనా నిరాకరించారు. ప్రతీకార చర్యగా SS గార్డులు యెహోవాసాక్షుల కుటుంబాలన్నింటినీ చెరసాలలో వేశారు.” (జర్మనీ—1918-45) నిజానికి, నాజీ హింస కారణంగా జర్మనీలో వందలాది మంది యెహోవాసాక్షులు మరణించారు.
వివిధ మతాలకు చెందిన ధైర్యస్థులు తమ నమ్మకాల నిమిత్తం కష్టాలు పడ్డారనేదీ వాస్తవమే. అయితే యెహోవాసాక్షులు ఐక్యమైన ఒకే మత సమాజంగా దీనిని అనుభవించారు. “మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను” అనే ప్రాథమిక లేఖన సత్యానికి వారిలో అత్యధికులు కట్టుబడ్డారు.—అపొస్తలుల కార్యములు 5:29; మార్కు 12:17.
సమస్యకు మూలకారణం
కాబట్టి మానవాళి సమస్యలకు మతం మూలకారణం అనడం కొంతవరకు మాత్రమే సత్యం. దానికి మూలకారణం అబద్ధ మతమే. అయితే సమస్త అబద్ధ మతాన్ని త్వరలోనే తొలగించాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. (ప్రకటన 17:16, 17; 18:21) నీతిన్యాయాలను ప్రేమించు వారికి దేవుడు ఇలా ఆజ్ఞాపిస్తున్నాడు: “నా ప్రజలారా, మీరు దాని [అంటే, ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన మహా బబులోను] పాపములలో పాలివారుకాకుండునట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచి రండి. దాని పాపములు ఆకాశమునంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసికొనియున్నాడు.” (ప్రకటన 18:4, 5) అవును, ‘కలహం రేపుతూ మానవుల మనస్సాక్షికి మత్తుకలిగిస్తూ, మానవ మేధస్సును పలాయన భ్రమలతో నింపుతూ, ప్రజలను సంకుచిత భావాలతో, మూఢనమ్మకాలతో, ద్వేషంతో భయంతో నింపుతున్న’ మతాన్నిబట్టి స్వయంగా దేవుడే చాలా విసిగిపోయాడు!
ఈలోగా దేవుడు సత్యాన్ని ప్రేమిస్తున్న వారిని స్వచ్ఛమైన మతంలోకి సమకూరుస్తున్నాడు. అది ప్రేమ, న్యాయం, కనికరంగల సృష్టికర్త సూత్రాలకు, బోధలకు హత్తుకున్న మతమై ఉంటుంది. (మీకా 4:1, 2; జెఫన్యా 3:8, 9; మత్తయి 13:30) మీరూ దానిలో భాగమై ఉండవచ్చు. స్వచ్ఛమైన మతాన్ని గుర్తించే మరింత సమాచారం కావాలని మీరు కోరుకుంటున్నట్లయితే ఈ పత్రిక ప్రకాశకులకు వ్రాయండి లేదా యెహోవాసాక్షుల్లో ఎవరినైనా సహాయం కోసం అడగండి.
[7వ పేజీలోని చిత్రం]
సకల నేపథ్యాల ప్రజలు స్వచ్ఛమైన మతంలో ఆనందాన్ని కనుగొన్నారు