కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మోసం విషయంలో జాగ్రత్తగా ఉండండి

మోసం విషయంలో జాగ్రత్తగా ఉండండి

మోసం విషయంలో జాగ్రత్తగా ఉండండి

“మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి.”​—⁠కొలొస్సయులు 2:⁠8.

“మీలో ఎంతమందికి అబద్ధం చెప్పని క్లయింట్లు ఉన్నారు” అని ప్రశ్నిస్తూ కొన్ని సంవత్సరాల క్రితం ఓ న్యాయశాస్త్ర ఆచార్యుడు ఒక సర్వే నిర్వహించాడు. దాని ప్రతిస్పందన ఎలావుంది? ఆయనిలా వివరిస్తున్నాడు: “వేలాదిమంది న్యాయవాదుల్లో, కేవలం ఒక్కరికే అబద్ధం చెప్పని ఓ క్లయింటు ఉన్నాడు.” కారణమేమిటి? “ఆ న్యాయవాది ఓ పెద్ద వ్యాపార సంస్థతో అప్పుడే ప్రాక్టీసు మొదలుపెట్టాడు, అయితే ఇంతవరకు ఆయనింకా ఏ క్లయింటుతోనూ మాట్లాడలేదు.” ఈ అనుభవం, నేటి ప్రపంచంలో అబద్ధం, మోసం ఎంతో సాధారణమైపోయాయి అనే విషాదకరమైన సత్యాన్ని ఉదహరిస్తోంది.

2 మోసం ఎన్నోరూపాలు ధరిస్తూ, ఆధునిక జీవితంలో దాదాపు అన్నిరంగాల్లోకి విస్తరించింది. వార్తా మాధ్యమాల్లో కుప్పలుతెప్పలుగా వచ్చే వార్తల్లో తమ చర్యల గురించి రాజకీయ నాయకులు చెప్పే అబద్ధాలు, అక్కౌంటెంట్లు, లాయర్లు తమ వ్యాపార లాభనష్టాలను ఎక్కువచేసి చెప్పడం, వినిమయదారులను తప్పుదోవపట్టించే వ్యాపార ప్రకటనకర్తలు, భీమా సంస్థలను మోసగిస్తున్న వ్యాజ్యకారులు మచ్చుకు కొన్ని మాత్రమే. మతసంబంధమైన మోసం ఉండనేవుంది. అమర్త్యమైన ఆత్మ, నరకాగ్ని, త్రిత్వము వంటి అబద్ధ బోధలద్వారా మతనాయకులు అధికసంఖ్యలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.​—⁠2 తిమోతి 4:3, 4.

3 ఈ మోసాన్నంతటినిబట్టి మనం ఆశ్చర్యపోవాలా? అక్కర్లేదు. “అంత్యదినముల” గురించి బైబిలు ఇలా హెచ్చరించింది: “దుర్జనులును వంచకులును ఇతరులను మోసపరచుచు తామును మోసపోవుచు అంతకంతకు చెడిపోవుదురు.” (2 తిమోతి 3:​1, 13) క్రైస్తవులుగా మనం సత్యం నుండి మనలను పక్కకు మళ్లించే మోసకరమైన తలంపుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సహజంగానే ఈ రెండు ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి: నేడు మోసం ఎందుకు ఇంత విస్తారంగా ఉంది, మోసగించబడకుండా మనమెలా జాగ్రత్తగా ఉండగలము?

నేడు ఎందుకింత మోసముంది?

4 ఈ లోకంలో మోసం విస్తరించి ఉండడానికిగల కారణాన్ని బైబిలు స్పష్టంగా వివరిస్తోంది. “లోకమంతయు దుష్టుని యందున్నదని” అపొస్తలుడైన యోహాను వ్రాశాడు. (1 యోహాను 5:​19) ఆ ‘దుష్టుడు’ అపవాదియగు సాతాను. అతని గురించి యేసు ఇలా చెప్పాడు: “సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు.” కాబట్టి, ఈ లోకం దాని పాలకుని స్వభావాన్ని, విలువలను, మోసకరమైన గుణాలను ప్రతిబింబించడంలో ఆశ్చర్యమేమైనా ఉందా?​—⁠యోహాను 8:44; 14:30; ఎఫెసీయులు 2:1-3.

5 ఈ అంత్యకాలంలో సాతాను తన ప్రయత్నాలను ముమ్మరం చేశాడు. అతడు భూమ్మీదికి పడద్రోయబడ్డాడు. తనకు సమయము కొంచెమే అని అతనికి తెలుసు, అందుకే అతడు ‘బహుక్రోధముతో’ ఉన్నాడు. సాధ్యమైనంత ఎక్కువమంది మానవులను నాశనం చేయడానికి పూనుకొని అతడు ‘సర్వలోకమును మోసపుచ్చుచున్నాడు.’ (ప్రకటన 12:​9, 12) సాతాను ఎప్పుడో ఒకసారి మోసం చేసేవాడు కాడు. బదులుగా, అతడు మానవాళిని మోసగించే తన ప్రయత్నాలను నిర్దాక్షిణ్యంగా కొనసాగిస్తూనే ఉన్నాడు. * అవిశ్వాసుల మనోనేత్రాలకు గుడ్డితనం కలిగిస్తూ వారిని దేవుని నుండి దూరంగా ఉంచడానికి కుయుక్తులు, కుతంత్రాలతోపాటు అతడు తన అంబులపొదిలో ఉన్న మోసకరమైన బాణాలన్నీ ఉపయోగిస్తున్నాడు. (2 కొరింథీయులు 4:⁠4) ఈ గజ మోసగాడు ప్రత్యేకంగా దేవుణ్ణి “ఆత్మతోను సత్యముతోను” ఆరాధిస్తున్న వారిని మ్రింగివేయడానికి కంకణం కట్టుకున్నాడు. (యోహాను 4:24; 1 పేతురు 5:⁠8) నిజానికి, సాతాను ‘నేను ఎవరినైనా దేవుని నుండి మళ్లించివేయగలను’ అని చెప్పుకున్నాడనేది ఎప్పటికీ మరచిపోవద్దు. (యోబు 1:​9-12) సాతాను ప్రయోగించే కొన్నిరకాల “మోసకరమైన తంత్రములను” అలాగే వాటి విషయంలో మనమెలా జాగ్రత్తగా ఉండాలో మనం పరిశీలిద్దాం.​—⁠ఎఫెసీయులు 6:​11, జ్యూయిష్‌ న్యూ టెస్ట్‌మెంట్‌.

మతభ్రష్టుల మోసం విషయంలో జాగ్రత్తగా ఉండండి

6 దేవుని సేవకులను మోసగించే తన ప్రయత్నాల్లో సాతాను దీర్ఘకాలంగా మతభ్రష్టులను ఉపయోగించాడు. (మత్తయి 13:​36-39) మతభ్రష్టులు తాము యెహోవాను ఆరాధిస్తున్నామనీ, బైబిలును నమ్ముతున్నామనీ చెప్పుకోవచ్చు, అయితే వారాయన సంస్థయొక్క దృశ్య భాగాన్ని నిరాకరిస్తారు. మరికొందరు దేవుణ్ణి అవమానపరిచే ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన “మహాబబులోను” సిద్ధాంతాల వైపుకు మళ్లుతున్నారు. (ప్రకటన 17:5; 2 పేతురు 2:​19-22) దైవప్రేరణ క్రింద బైబిలు రచయితలు మతభ్రష్టుల ఉద్దేశాలను, పద్ధతులను బహిర్గతం చేయడానికి తీవ్రమైన పదాలు ఉపయోగించారు.

7 మతభ్రష్టులు కోరేదేమిటి? వారిలో చాలామంది బహుశా ఒకప్పుడు తాము సత్యమని దృష్టించిన విశ్వాసాన్ని విడిచివెళ్లడంతోనే సంతృప్తిపడరు. తరచూ వారు తమతోపాటు ఇతరులనూ తీసుకెళ్లాలని కోరుకుంటారు. బయటకు వెళ్లి తమ సొంత శిష్యులను చేసుకోవడానికి బదులు, చాలామంది మతభ్రష్టులు “శిష్యులను [అంటే క్రీస్తు శిష్యులను] తమవెంట ఈడ్చుకొని పోవలెనని” ప్రయత్నిస్తారు. (అపొస్తలుల కార్యములు 20:​29, 30) అబద్ధ బోధకుల గురించి అపొస్తలుడైన పౌలు ఈ అత్యవసర హెచ్చరిక చేశాడు: “మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి.” (కొలొస్సయులు 2:⁠8) చాలామంది మతభ్రష్టుల ప్రయత్నాలను అది వర్ణించడం లేదా? సులభంగా మోసగించబడే వ్యక్తిని అతని కుటుంబం నుండి వేరుచేసి తీసుకెళ్లే ఓ కిడ్నాపర్‌ మాదిరిగా, మతభ్రష్టులు నమ్మకస్థులైన సంఘ సభ్యులను మందనుండి వేరుచేయడానికి ప్రయత్నిస్తారు.

8 తమ లక్ష్యసాధనకు మతభ్రష్టులు ఎలాంటి పద్ధతులు ఉపయోగిస్తారు? వారు తరచూ అపార్థాలు పుట్టించడానికి, అర్ధ సత్యాలు, పచ్చి అబద్ధాలు చెప్పడానికి పూనుకోవచ్చు. “అబద్ధముగా చెడ్డమాటలెల్ల” పలికే వారికి తన అనుచరులు గురవుతారని యేసుకు తెలుసు. (మత్తయి 5:​11) ద్రోహబుద్ధిగల అలాంటి వ్యతిరేకులు ఇతరులను మోసగించాలనే ఉద్దేశంతో అసత్యాలు మాట్లాడతారు. తమ సొంత ఉద్దేశ సాధనకు ‘కల్పించిన మాటలు’ పలికే, ‘మోసకరమైన బోధలు’ వ్యాప్తిచేసే, ‘లేఖనాలను వక్రీకరించే’ మతభ్రష్టుల గురించి అపొస్తలుడైన పేతురు హెచ్చరించాడు. (2 పేతురు 2:3, 13; 3:​16, NW) ‘కొందరి విశ్వాసమును చెరపడంలో’ మతభ్రష్టులు విజయం సాధించడం శోచనీయం.​—⁠2 తిమోతి 2:17.

9 మతభ్రష్టుల మోసానికి గురికాకుండా మనమెలా జాగ్రత్తగా ఉండగలము? “సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టియుండుడి” అనే దేవుని వాక్య సలహాను లక్ష్యపెట్టుట ద్వారానే. (రోమీయులు 16:​17) వారి తర్కాలు వ్యక్తిగతంగా, ముద్రిత పేజీల ద్వారా లేదా ఇంటర్నెట్‌ ద్వారా ఏ రూపంలో వచ్చినా వాటిని విసర్జించడం ద్వారా మనం వారిని “కనిపెట్టి” ఉంటాము. మనమెందుకు అలా స్థిరంగా ఉంటాము? మొదటిది, మనమలా చేయాలని దేవుని వాక్యం మనలను నిర్దేశిస్తోంది, పైగా అన్నిసమయాల్లో యెహోవా మన శ్రేయస్సే కోరుకుంటాడనే నమ్మకం మనకుంది.​—⁠యెషయా 48:17, 18.

10 రెండవది, మహా బబులోను నుండి మనలను తేలికగా వేరుచేసే ప్రశస్తమైన సత్యాలు బోధించిన సంస్థను మనం ప్రేమిస్తాం. అదే సమయంలో, దేవుని సంకల్పాలకు సంబంధించిన మన పరిజ్ఞానం పరిపూర్ణం కాదని మనం గుర్తిస్తాం; అనేక సంవత్సరాలుగా మన అవగాహన క్రమేపీ ప్రకాశమానమవుతూ వచ్చింది. అలాంటి శుద్ధీకరణలన్నింటి విషయంలో విశ్వసనీయ క్రైస్తవులు యెహోవాపై ఆధారపడతారు. (సామెతలు 4:​18) అదే సమయంలో, దేవుడు ఇష్టపూర్వకంగా ఉపయోగిస్తున్న సంస్థను మనం విడిచివెళ్లం, ఎందుకంటే దానిపై ఆయన ఆశీర్వాదపు రుజువును మనం స్పష్టంగా చూస్తున్నాం.​—⁠అపొస్తలుల కార్యములు 6:7; 1 కొరింథీయులు 3:6.

ఆత్మవంచన విషయంలో జాగ్రత్తగా ఉండండి

11 సాతాను తక్షణమే పట్టు సాధించే గుణం అంటే ఆత్మవంచన చేసుకునే గుణం అసంపూర్ణ మానవులకు ఉంది. “హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది” అని యిర్మీయా 17:9 చెబుతోంది. యాకోబు ఇలా వ్రాశాడు: “ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడినవాడై శోధింపబడును.” (యాకోబు 1:​14) మన హృదయం శోధనకు లోనైనప్పుడు, అది పాపాన్ని ఆకర్షణీయమైనదన్నట్లు, హానికరం కాదన్నట్లు మరులు కొల్పుతుంది. అలాంటి దృక్కోణం మోసకరమైనది, ఎందుకంటే పాపానికి లొంగిపోవడమనేది చివరకు ఒక వ్యక్తిని నాశనానికి నడిపిస్తుంది.​—⁠రోమీయులు 8:6.

12 ఆత్మవంచన చేసుకునే గుణం మనలను సులభంగా ఉరిలో పడవేయగలదు. మోసకరమైన హృదయం ప్రమాదకరమైన వ్యక్తిత్వ దోషాన్ని లేదా గంభీరమైన పాపాన్ని తగ్గించి చెప్పవచ్చు. (1 సమూయేలు 15:​13-15, 20, 21) ఘోరమైన వ్యాధిగల మన హృదయం ప్రశ్నార్థక నడవడిని సమర్థించేందుకు మార్గాలను కూడా అన్వేషించవచ్చు. ఉదాహరణకు, వినోదం విషయమే తీసుకోండి. కొన్నిరకాల వినోదం ఆరోగ్యదాయకం, ఆనందదాయకం. అయితే సినిమాలు, టీవీ కార్యక్రమాలు, ఇంటర్నెట్‌ సైట్ల ద్వారా ఈ లోకం అందించే వినోదంలో అధికశాతం అశ్లీలత, దుర్నీతితో నిండివుంది. మనం అలాంటి హీనమైన వినోదాన్ని ఎలాంటి హాని జరక్కుండానే చూసి ఆనందించవచ్చని మనలను మనం ఒప్పించుకోవడం సులభం. “నా మనస్సాక్షిని అది బాధించడం లేదు, కాబట్టి దానిలో సమస్యేముంది?” అని సైతం కొందరు తర్కించవచ్చు. కానీ అలాంటి వ్యక్తులు ‘తప్పుడు తర్కంతో ఆత్మవంచన చేసుకుంటున్నారు’​—⁠యాకోబు 1:​22, NW.

13 ఆత్మవంచన విషయంలో మనమెలా జాగ్రత్తగా ఉండగలము? అన్నింటికంటే ముందు, మానవ మనస్సాక్షి అన్ని సందర్భాల్లోను నమ్మదగినది కాదని మనం గుర్తుపెట్టుకోవాలి. అపొస్తలుడైన పౌలు విషయమే పరిశీలించండి. క్రైస్తవుడు కాకమునుపు ఆయన క్రీస్తు అనుచరులను హింసించాడు. (అపొస్తలుల కార్యములు 9:​1, 2) ఆ సమయంలో ఆయన మనస్సాక్షి ఆయనను బాధించి ఉండదు. కాబట్టి అది ఖచ్చితంగా తప్పదోవపట్టింది. “తెలియక అవిశ్వాసమువలన చేసితిని” అని పౌలు చెప్పాడు. (1 తిమోతి 1:​12) అందువల్ల, కేవలం ఫలాని వినోదం విషయంలో మన మనస్సాక్షి మనలను బాధించడం లేదనడం దానంతటదే మన విధానం మంచిదనే హామీ ఇవ్వదు. దేవుని వాక్యం ద్వారా సరైన శిక్షణపొందిన ఆరోగ్యదాయకమైన మనస్సాక్షి మాత్రమే సురక్షితమైన మార్గదర్శినిగా ఉండగలదు.

14 ఆత్మవంచనను తప్పించుకోవాలంటే, మనం గుర్తు పెట్టుకోవలసిన సహాయకరమైన సూచనలు కొన్నివున్నాయి. ప్రార్థనాపూర్వకంగా మిమ్ములను మీరు విశ్లేషించుకోండి. (కీర్తన 26:2; 2 కొరింథీయులు 13:⁠5) యథార్థ స్వీయ విశ్లేషణ మీ దృక్కోణాల్లో లేదా విధానాల్లో కొన్ని మార్పులు చేసుకోవలసిన అవసరాన్ని మీకు తెలియజేయవచ్చు. ఇతరులు చెప్పేది వినండి. (యాకోబు 1:​19) స్వీయ పరీక్ష మన సొంత అభిప్రాయంతో ప్రభావితమయ్యే అవకాశం ఉంది కాబట్టి, పరిణతిచెందిన క్రైస్తవులుచెప్పే యథార్థమైన మాటలు వినడం జ్ఞానయుక్తం. మీరు సమతూకంగల, అనుభవజ్ఞులైన తోటి విశ్వాసుల దృష్టిలో ప్రశ్నార్థకంగా కనిపించే నిర్ణయాలు తీసుకుంటూ లేదా ప్రవర్తిస్తూ ఉంటే, ‘నా మనస్సాక్షికి సరైన శిక్షణ లభించలేదా లేక నా హృదయం నన్ను మోసగిస్తోందా?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవచ్చు. బైబిలు, బైబిలు ఆధారిత సాహిత్యాల ద్వారా క్రమంగా పోషించబడుతూ ఉండండి. (కీర్తన 1:⁠2) అలాచేయడం మీ తలంపులను, దృక్పథాలను, భావాలను దైవిక సూత్రాలకు అనుగుణంగా ఉంచుకోవడానికి మీకు సహాయం చేస్తుంది.

సాతాను చెప్పే అబద్ధాల విషయంలో జాగ్రత్తగా ఉండండి

15 మనలను మోసగించే తన ప్రయత్నాల్లో సాతాను వివిధ రకాల అబద్ధాలను ఉపయోగిస్తాడు. వస్తుసంపద సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తుందని మనలను నమ్మించడానికి అతడు ప్రయత్నిస్తాడు, అయితే తద్విరుద్ధమైనదే సత్యమని తరచూ నిరూపించబడింది. (ప్రసంగి 5:​10-12) మనం “అంత్యదినములలో” జీవిస్తున్నామనే స్పష్టమైన రుజువు ఉన్నప్పటికీ, ఈ దుష్టలోకం నిరంతరం నిలుస్తుందని మనం నమ్మాలని అతను కోరుతున్నాడు. (2 తిమోతి 3:​1-5) సుఖభోగాసక్తులు తరచూ దుఃఖకర పర్యవసానాలకు లోనవుతున్నా, దుర్నీతికర జీవన విధానం వెంబడించడంలో హానిలేదనే తలంపును సాతాను పురికొల్పుతున్నాడు. (గలతీయులు 6:⁠7) అలాంటి అబద్ధాలతో మోసగించబడకుండా మనమెలా తప్పించుకోగలము?

16బైబిలు ఉదాహరణల నుండి ప్రయోజనం పొందండి. సాతాను అబద్ధాలచే మోసగించబడ్డ ఆయావ్యక్తుల హెచ్చరికా ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. వారు వస్తు సంపదలను ప్రేమించారు, తాము నివసిస్తున్న కాలాల ప్రాముఖ్యతపై అవధానం నిలుపలేకపోయారు, లేదా లైంగిక దుర్నీతిలో కూరుకుపోయారు. అవన్నీ విపత్కర ఫలితాలను తీసుకొచ్చాయి. (మత్తయి 19:16-22; 24:36-42; లూకా 16:14; 1 కొరింథీయులు 10:​8-11) ఆధునిక దిన ఉదాహరణల నుండి నేర్చుకోండి. ఆయాసందర్భాల్లో కొందరు క్రైస్తవులు తమ అత్యవసర భావం కోల్పోయి, దేవుణ్ణి సేవించడంవల్ల తామేదో పోగొట్టుకుంటున్నామని నమ్మడం శోచనీయం. వారు సుఖమయం అని పిలువబడే జీవితం వెంబడించడానికి సత్యం విడిచిపెట్టి వెళ్లిపోవచ్చు. అయితే అలాంటి వ్యక్తులు ‘కాలుజారే చోట’ ఉన్నారు, ఎప్పుడో ఒకప్పుడు వారు తమ భక్తిహీన ప్రవర్తనకు బలికాక తప్పదు. (కీర్తన 73:​18, 19) మనం ఇతరుల తప్పులనుండి నేర్చుకోవడం జ్ఞానయుక్తం.​—⁠సామెతలు 22:3.

17 యెహోవా మనలను ప్రేమించడు లేదా విలువైన వారిగా ఎంచడు అనే మరో అబద్ధాన్ని సాతాను సమర్థవంతంగా ఉపయోగించాడు. అసంపూర్ణ మానవులను సాతాను వేలాది సంవత్సరాలుగా అధ్యయనం చేశాడు. నిరుత్సాహం మనలను బలహీనపరచగలదని అతనికి బాగా తెలుసు. (సామెతలు 24:​10) అందువల్ల, మనం దేవుని దృష్టిలో విలువలేని వారమనే అబద్ధాన్ని అతను పురికొల్పుతున్నాడు. మనం “పడద్రోయబడి” యెహోవా మనపట్ల శ్రద్ధచూపడని నమ్మే పరిస్థితికివస్తే, ఆశ వదులుకోవడానికి మనం శోధించబడవచ్చు. (2 కొరింథీయులు 4:⁠9) గజ మోసగానికి కావలసింది అదే! కాబట్టి, సాతానుయొక్క ఈ అబద్ధంచే మోసగించబడకుండా మనమెలా జాగ్రత్తగా ఉండగలము?

18మనపట్ల దేవునికున్న ప్రేమ గురించి బైబిలు చెబుతున్న విషయాన్ని వ్యక్తిగతంగా ధ్యానించండి. యెహోవా మనలను గమనిస్తాడనీ, ఆయావ్యక్తులుగా ఆయన మనలను ప్రేమిస్తాడనీ హామీ ఇవ్వడానికి దేవుని వాక్యం మనస్సును ఆకట్టుకునే పదాలను ఉపయోగిస్తోంది. యెహోవా, మీ కన్నీళ్లను “బుడ్డిలో” దాచిపెడతాడు, అంటే మీ విశ్వాస సంబంధ పోరాటంలో మీరు జారవిడిచే కన్నీళ్లను ఆయన గమనిస్తున్నాడనీ, వాటిని గుర్తుపెట్టుకుంటాడనీ దానర్థం. (కీర్తన 56:⁠8) మీ ‘విరిగిన హృదయాన్ని’ గమనించి, అలాంటి సమయాల్లో ఆయన మీకు చేరువగా ఉంటాడు. (కీర్తన 34:​18) “మీ తలవెండ్రుకల” సంఖ్యతోపాటు మీ వివరాలన్నీ ఆయనకు తెలుసు. (మత్తయి 10:​29-31) అన్నింటికంటే మిన్నగా, మీ పక్షంగా దేవుడు “తన అద్వితీయకుమారుని” అనుగ్రహించాడు. (యోహాను 3:16; గలతీయులు 2:​20) కొన్నిసార్లు, అలాంటి లేఖనాలు మీకు వ్యక్తిగతంగా అన్వయిస్తాయని నమ్మడం మీకు కష్టంగా ఉండవచ్చు. అయితే మనం యెహోవా వాక్యాన్ని నమ్మాలి. ఓ గుంపుగానే కాదు ఆయావ్యక్తులుగా అయన మనలను ప్రేమిస్తున్నాడని మనం నమ్మాలని ఆయన కోరుతున్నాడు.

19అబద్ధాన్ని గుర్తించి దానిని విసర్జించండి. ఫలాని వ్యక్తి అబద్ధం చెబుతున్నాడని మీకు తెలిస్తే, మోసగించబడకుండా మిమ్ములను మీరు కాపాడుకోవచ్చు. అదే ప్రకారం, యెహోవా మిమ్ములను ప్రేమించడం లేదనే అబద్ధం మీరు నమ్మాలని సాతాను కోరుతున్నాడని తెలుసుకోవడమే మీకు బలమైన సహాయంగా ఉండగలదు. సాతాను తంత్రాల గురించి హెచ్చరించిన కావలికోట ఆర్టికల్‌కు ప్రతిస్పందిస్తూ ఒక క్రైస్తవురాలు ఇలా చెప్పింది: “నన్ను నిరుత్సాహపరిచేందుకు సాతాను నా భావాలనే ఉపయోగిస్తాడన్న విషయాన్ని నేను గ్రహించలేదు. ఇది తెలుసుకోవడం నాకు ఈ భావాలతో పోరాడేందుకు పురికొల్పునిస్తుంది.”

20 దక్షిణ అమెరికాలోని ఓ దేశంలోని ప్రయాణ పైవిచారణకర్త అనుభవం పరిశీలించండి. కృంగిన మనస్సుగల తోటి విశ్వాసుల దగ్గరకు కాపరి సందర్శనాల కోసం వెళ్లినప్పుడు, ‘మీరు త్రిత్వాన్ని నమ్ముతారా?’ అని ఆయన తరచూ వారిని అడుగుతాడు. అది సాతాను అబద్ధాల్లో ఒకటని గ్రహించిన ఆ నిరుత్సాహపడ్డ వ్యక్తి దానికి మామూలుగానే ‘లేదు’ అని సమాధానమిస్తాడు. ఆ పిమ్మట ఆ ప్రయాణ పెద్ద ‘మీరు నరకాగ్నిని నమ్ముతారా?’ అని ప్రశ్నిస్తాడు. దానికి మళ్లీ ‘లేదు’ అనే సమాధానం వస్తుంది. అప్పుడు ఆ ప్రయాణ పెద్ద వారికి సాతాను చెప్పే మరో అబద్ధం ఉందనీ సాధారణంగా అది అబద్ధమని గుర్తించబడదనీ వారికి చెబుతాడు. ఆయన వారి అవధానాన్ని యెహోవాకు సన్నిహితమవండి * పుస్తకంలోని 249వ పేజీ, 21వ పేరావైపు మళ్లిస్తాడు, అందులో ఆయా వ్యక్తులను యెహోవా ప్రేమించడనే అబద్ధం బహిర్గతం చేయబడింది. నిరుత్సాహపడినవారు సాతాను చెప్పే ఈ అబద్ధాన్ని గుర్తించి, దానిని విసర్జించడానికి ఆ విధంగా సహాయం చేయడం ద్వారా సత్ఫలితాలు సాధించబడుతున్నాయని ఆ ప్రయాణ పైవిచారణకర్త నివేదిస్తున్నాడు.

మోసానికి వ్యతిరేకంగా జాగ్రత్తగా ఉండండి

21 ఈ అంత్యదినాల చరమాంకంలో, సాతాను నిర్విరామంగా అబద్ధాల, మోసాల వెల్లువతో ముంచెత్తుతాడని ఎదురుచూడవచ్చు. సంతోషకరమైన విషయమేమిటంటే, సాతాను తంత్రాల విషయమై యెహోవా మనలను అంధకారంలో విడిచిపెట్టలేదు. బైబిలు, ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’ బైబిలు ఆధారిత సాహిత్యాలు అపవాది దుష్ట పన్నాగాలను స్పష్టంగా బహిర్గతం చేస్తున్నాయి. (మత్తయి 24:​45) ముందుగానే హెచ్చరించబడ్డ మనం వాటిని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నాం.​—⁠2 కొరింథీయులు 2:​11.

22 కాబట్టి మతభ్రష్టుల తర్కాలకు విరుద్ధంగా మనం జాగ్రత్తగా ఉందాం. ఆత్మవంచన అనే రహస్య ఉరికి దూరంగా ఉండాలని తీర్మానించుకుందాం. అలాగే సాతాను అబద్ధాలన్నింటిని గుర్తించి వాటిని విసర్జించుదాం. అలా చేయడం ద్వారా మోసాన్ని అసహ్యించుకునే ‘సత్యదేవునితో’ మన సంబంధాన్ని మనం కాపాడుకుంటాం.​—⁠కీర్తన 31:5; సామెతలు 3:32.

[అధస్సూచీలు]

^ పేరా 8 ప్రకటన 12:9లో ‘మోసపుచ్చుచున్నాడు’ అని అనుదించబడ్డ క్రియాపదం గురించి చెబుతూ ఒక రెఫరెన్సు గ్రంథం, “అది ఓ అలవాటుగా మారిన నిర్విరామ ప్రక్రియను సూచిస్తోంది” అని వివరిస్తోంది.

^ పేరా 26 యెహోవాసాక్షులు ప్రచురించినది.

మీరు గుర్తుతెచ్చుకుంటారా?

నేడు లోకంలో ఎందుకింత మోసముంది?

మతభ్రష్టులచే మోసగించబడకుండా మనమెలా జాగ్రత్తగా ఉండగలం?

ఆత్మవంచనకు సంబంధించి ఎలాంటి స్వభావం విషయంలోనైనా మనమెలా జాగ్రత్తగా ఉండగలం?

సాతాను అబద్ధాలచే మోసగించబడకుండా మనమెలా తప్పించుకోగలం?

[అధ్యయన ప్రశ్నలు]

1-3. (ఎ) మోసం ఆధునిక జీవితంలో దాదాపు అన్నిరంగాల్లోకి విస్తరించిందని ఏ ఉదాహరణలు చూపిస్తున్నాయి? (బి) లోకంలోని మోసాన్నిబట్టి మనమెందుకు ఆశ్చర్యపడకూడదు?

4. లోకంలో మోసమెందుకు విస్తారంగా ఉందో బైబిలు ఎలా వివరిస్తోంది?

5. ఈ అంత్యకాలంలో సాతాను తన మోసకరమైన ప్రయత్నాలను ఎలా ముమ్మరం చేశాడు, ప్రత్యేకంగా అతను ఎవరిని లక్ష్యంగా పెట్టుకున్నాడు?

6, 7. (ఎ) మతభ్రష్టులు ఏమని చెప్పుకోవచ్చు? (బి) మతభ్రష్టులు కోరేదానిని లేఖనాలు ఎలా స్పష్టంగా చూపిస్తున్నాయి?

8. తమ లక్ష్యసాధనకు మతభ్రష్టులు ఎలాంటి పద్ధతులు ఉపయోగిస్తారు?

9, 10. (ఎ) మతభ్రష్టుల మోసానికి గురికాకుండా మనమెలా జాగ్రత్తగా ఉండగలము? (బి) దేవుని సంకల్పాలకు సంబంధించి మన అవగాహన శుద్ధీకరించబడవలసి వచ్చినా మనమెందుకు కలతచెందము?

11. ఆత్మవంచన స్వభావం అసంపూర్ణ మానవులకు ఎందుకుంది?

12. ఏయే విధాలుగా మనం ఆత్మవంచన చేసుకునే ఉరిలో పడిపోవచ్చు?

13, 14. (ఎ) మన మనస్సాక్షి అన్ని సందర్భాల్లో సురక్షితమైన మార్గదర్శిని కాదని ఏ లేఖన ఉదాహరణ చూపిస్తోంది? (బి) ఆత్మవంచన విషయంలో మనమెలా జాగ్రత్తగా ఉండగలము?

15, 16. (ఎ) మనలను మోసగించే తన ప్రయత్నాల్లో సాతాను ఎలాంటి అబద్ధాలు ఉపయోగిస్తాడు? (బి) అలాంటి అబద్ధాలచే మోసగించబడకుండా మనమెలా తప్పించుకోవచ్చు?

17. యెహోవా మనలను ప్రేమించడు లేదా విలువైన వారిగా ఎంచడనే అబద్ధాన్ని సాతాను ఎందుకు పురికొల్పుతున్నాడు?

18. యెహోవా ప్రేమకు బైబిలు ఎలా హామీయిస్తోంది?

19, 20. (ఎ) యెహోవా మిమ్ములను ప్రేమించడనే సాతాను అబద్ధాన్ని గుర్తించి, దానిని విసర్జించడం ఎందుకు ప్రాముఖ్యం? (బి) హృదయం కృంగినవారికి ఓ ప్రయాణ పైవిచారణకర్త ఎలా సహాయం చేశాడు?

21, 22. మోసకరమైన సాతాను తంత్రాల విషయంలో మనమెందుకు అంధకారంలో లేము, మన తీర్మానమేమై ఉండాలి?

[17వ పేజీలోని చిత్రం]

వినోదం విషయంలో మిమ్ములను మీరు మోసగించుకోకండి

[18వ పేజీలోని చిత్రాలు]

ఆత్మవంచనకు విరుద్ధంగా జాగ్రత్తగా ఉండడానికి, ప్రార్థనాపూర్వకంగా మిమ్ములను మీరు విశ్లేషించుకోండి, ఇతరులు చెప్పేది వినండి, దేవుని వాక్యం ద్వారా క్రమంగా పోషించబడుతూ ఉండండి