యెహోవాసాక్షులు మిమ్మల్ని పదే పదే ఎందుకు సందర్శిస్తారు?
యెహోవాసాక్షులు మిమ్మల్ని పదే పదే ఎందుకు సందర్శిస్తారు?
యెహోవాసాక్షులు పట్టుదలగా చేసే ఇంటింటి పరిచర్య ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది. సాక్షులు ఇతరులను పదే పదే ఎందుకు సందర్శిస్తుంటారు, ప్రత్యేకంగా సాక్షుల సందేశంపట్ల ఇతరులు ఇంతకు ముందు ఆసక్తి చూపకపోయినా వాళ్ళు ఇతరులను తిరిగి ఎందుకు సందర్శిస్తారు అని కొందరు ఆశ్చర్యపోతుంటారు. దానికిగల కారణమేమిటో వివరించడానికి, రష్యానుండి వచ్చిన రెండు ఉత్తరాలు సహాయం చేస్తాయి.
“యథార్థంగా చెప్పాలంటే, నేను అంతకుముందు యెహోవాసాక్షులను దగ్గరకు రానిచ్చేదాన్ని కాదు” అని కాబర్‌వోస్క్‌కు చెందిన మాషా అనే 19 సంవత్సరాల అమ్మాయి ఒప్పుకుంటోంది. అయితే సాక్షులు ప్రచురించే పత్రికలు కొన్ని చదివిన తర్వాత ఆమె తన అభిప్రాయం మార్చుకుంది. “ఆ పత్రికల్లో నేను చదివిన సమాచారం ఎంతో ఆసక్తికరంగా, జ్ఞానోదయం కలిగించేదిగా ఉంది. అంతకంటే ప్రాముఖ్యంగా, అది ప్రపంచాన్ని విభిన్న దృష్టితో చూసేలా చేస్తుంది. ప్రజలకు జీవితమెందుకు ఇవ్వబడింది అనే విషయం నేను నెమ్మదిగా అర్థం చేసుకోవడం ఆరంభించాను” అని మాషా వ్రాసింది.
వ్లాడివోస్టోక్‌కు 80 కిలోమీటర్లు ఉత్తరంగావున్న ఉస్సీరిస్క్ అనే నగరం నుండి స్వెట్లానా ఇలా వ్రాసింది: “నేను ఈ మధ్యనే కావలికోట, తేజరిల్లు! త్రికలు చదవడం మొదలుపెట్టాను. మన ప్రస్తుతకాలానికి ఈ పత్రికలు చాలా అవసరం. నేను వాటిలోని ఆర్టికల్‌లన్నీ చదివి ఎంతో ఆనందిస్తున్నాను. అవి ఆసక్తికరంగా, సమాచారపూర్వకంగా, జ్ఞానోదయం కలిగించేవిగా ఉన్నాయి. మీకు ధన్యవాదాలు! మీరు ఈ లోకంలో ఉన్నందుకు, ఇలాంటి దయాపూర్వకమైన, అవసరమైన పనిచేస్తున్నందుకు కృతజ్ఞతలు.”
ప్రపంచవ్యాప్తంగావున్న యెహోవాసాక్షులు అపొస్తలుడైన పౌలు వేసిన ఆలోచింపజేసే ప్రశ్నను గంభీరంగా తీసుకుంటారు: “ప్రకటించువాడు లేకుండ వారెట్లు [ప్రజలెట్లు] విందురు?” (రోమీయులు 10:14) సాక్షులు ఈసారి మిమ్మల్ని సందర్శించినప్పుడు వారు చెప్పేది వినడానికి మీరు కొన్ని నిమిషాలు ఎందుకు వెచ్చించకూడదు? దేవుని వాక్యమైన బైబిల్లోవున్న ఓదార్పుకరమైన సందేశం విని మీరూ ఆనందించవచ్చు.