కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము”

“విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము”

విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము”

యుద్ధం జరుగుతున్న సమయంలో “నువ్వు ఇంటికెళ్లి నీ భార్యాపిల్లలతో సమయం గడుపు” అని ఆదేశించబడినందుకు బాధపడే సైనికుడిని మీరు ఊహించుకోగలరా?

ఇశ్రాయేలు రాజైన దావీదు కాలంలో ఓ సైనికుడికి అలాంటి ఆదేశమే ఇవ్వబడింది. హిత్తీయుడైన ఊరియాను రాజే స్వయంగా పిలిపించి ఇంటికి వెళ్లమని ప్రోత్సహించాడు. అయినాసరే, ఊరియా తన ఇంటికి తిరిగివెళ్లడానికి నిరాకరించాడు. తనెందుకు అలా చేయలేదని అడిగినప్పుడు, దానికి ఊరియా దేవుని సన్నిధికి ప్రతీకగా ఉన్న నిబంధనా మందసంతోపాటు ఇశ్రాయేలు సైన్యం కదనరంగంలో ఉండగా, “భోజనపానములు చేయుటకును నా భార్యయొద్ద పరుండుటకును నేను ఇంటికిపోదునా?” అని అడిగాడు. అటువంటి క్లిష్ట సమయంలో అలాచేయడం ఊరియాకు తలంచకూడని విషయంగా తోచింది.​—⁠2 సమూయేలు 11:8-11.

ఊరియా ప్రవర్తన ప్రాముఖ్యమైన ప్రశ్నలను ఉత్పన్నం చేస్తుంది, ఎందుకంటే మనం కూడా యుద్ధసమయంలో జీవిస్తున్నాం. ప్రపంచ దేశాలు చేసిన యుద్ధాలకు పూర్తి భిన్నంగా ప్రస్తుతం ఓ యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంతో పోలిస్తే జరిగిన రెండు ప్రపంచ యుద్ధాలు సహితం ఎందుకూ కొరగావన్నట్లు అనిపిస్తోంది, కాగా ఈ యుద్ధంలో మీరూ ఉన్నారు. ప్రమాదం అపరిమితమైనది, శత్రువు దుర్భేద్యమైనవాడు. ఈ యుద్ధంలో తుపాకుల చప్పుళ్లు లేవు, బాంబుల వర్షాలు లేవు, అంత మాత్రాన యుద్ధవ్యూహం తక్కువైనది కాదు.

అయితే ఆయుధం చేపట్టకముందు, ఆ యుద్ధం నైతికంగా సరైనదేనా లేదా ఆ యుద్ధం దేనికోసం చేస్తున్నారో మీరు తెలుసుకోవాలి. ఆ యుద్ధం చేయదగినదేనా? ఈ ఉత్కృష్ట యుద్ధ సంకల్పం అపొస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన ఉత్తరంలో స్పష్టం చేయబడింది. ఆయనిలా వ్రాశాడు: “విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము.” అవును, ఈ యుద్ధంలో మీరు ఓ దుర్గాన్ని కాదుగానీ బైబిల్లో వెల్లడిచేయబడిన యావత్‌ క్రైస్తవ సత్యాన్ని కాపాడేందుకు అంటే ‘విశ్వాసం’ పక్షంగా పోరాడాలి. కాబట్టి ఆ ‘విశ్వాసం’ పక్షంగా పోరాడాలంటే మీరు దాని సత్యత్వాన్ని ప్రగాఢంగా నమ్మాలి.​—⁠1 తిమోతి 6:​12.

సూక్ష్మబుద్ధిగల యోధుడు శత్రువును అర్థంచేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ యుద్ధంలో, శత్రువుకు యుద్ధ తంత్రంలో అనేక సంవత్సరాల అనుభవంతోపాటు విస్తారమైన వనరులు, యుద్ధసామగ్రి అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు వాడు మానవాతీతుడు. అతను దుష్టుడు, హింసా ప్రవృత్తిగలవాడు, రీతి రివాజు లేనివాడు; అతడే సాతాను. (1 పేతురు 5:⁠8) భౌతిక ఆయుధాలు, మానవుల ఎత్తులు, జిత్తులు ఈ శత్రువుముందు పనిచేయవు. (2 కొరింథీయులు 10:⁠4) మీరు దేనిని ఉపయోగించి ఈ యుద్ధం చేయగలరు?

మనకున్న ముఖ్యాయుధం “దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గము.” (ఎఫెసీయులు 6:​17) ఇదెంత ప్రభావవంతమైనదో చెబుతూ అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు: “దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.” (హెబ్రీయులు 4:​12) ఆ ఆయుధం ఎంత పదునైనదీ, ఎంత వాడియైనదీ అంటే అది ఒకని అంతరంగ తలంపుల, ఉద్దేశాలలోకి దూసుకుపోగలదు, కాబట్టి దీనిని ఖచ్చితంగా జాగ్రత్తగా, నైపుణ్యంగా ఉపయోగించాలి.

ఒక సైన్యానికి అత్యాధునిక ఆయుధాలున్నా, సైనికులకు వాటిని ఉపయోగించే సామర్థ్యం లేకపోతే ఆ ఆయుధాలు వ్యర్థమని బహుశా మీకు తెలిసే ఉంటుంది. అదే ప్రకారం మీ ఖడ్గాన్ని ఉపయోగించడానికి మీకు ఉపదేశం అవసరం. సంతోషకరమైన విషయమేమిటంటే, అత్యంత అనుభవశాలురైన యోధులు ఇచ్చే శిక్షణ మీకు అందుబాటులో ఉంది. యోధులైన ఈ అధ్యాపకులను యేసు “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” అని పిలిచాడు, తన అనుచరులకు తగినవేళ ఆధ్యాత్మిక ఆహారం లేదా ఉపదేశమిచ్చే బాధ్యత వారికి అప్పగించబడింది. (మత్తయి 24:​45) వారు పట్టుదలగా చేస్తున్న బోధను, శత్రు దాడుల గురించి సమయానుకూలంగా వారు ఇచ్చే హెచ్చరికల్ని గమనించడం ద్వారా మీరు ఆ సంయుక్త దాసుణ్ణి గుర్తించవచ్చు. ఈ దాసుడు యెహోవాసాక్షుల క్రైస్తవ సంఘానికి చెందిన ఆత్మాభిషిక్త సభ్యులని రుజువులు చూపిస్తున్నాయి.​—⁠ప్రకటన 14:1.

ఈ సంయుక్త దాసుడు కేవలం ఉపదేశించడం కంటే ఎక్కువే చేశాడు. అతడు “స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించునట్లుగా, మేము మీ మధ్యను సాధువులమై యుంటిమి. మీరు మాకు బహు ప్రియులైయుంటిరి గనుక మీయందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములనుకూడ మీకిచ్చుటకు సిద్ధపడియుంటిమి” అని థెస్సలొనీక సంఘానికి వ్రాసిన అపొస్తలుడైన పౌలు స్వభావాన్నే ప్రదర్శించాడు. (1 థెస్సలొనీకయులు 2:​7, 8) కాబట్టి ఇవ్వబడిన ప్రేమపూర్వక శిక్షణను ఎలా సద్వినియోగం చేసుకోవాలో ప్రతీ క్రైస్తవ సైనికుడు స్వయంగా నిర్ణయించుకోవాలి.

సర్వాంగ కవచం

మీ రక్షణ కోసం అలంకారార్థ సర్వాంగ కవచం ఇవ్వబడింది. ఈ సర్వాంగ కవచంలో ఏమేమి ఉన్నాయో మీరు ఎఫెసీయులు 6:13-18లో చూడవచ్చు. అప్రమత్తంగా ఉండే సైనికుడు ఈ ఆధ్యాత్మిక కవచంలో ఏ ఒక్కటి తప్పినా లేదా మరమ్మత్తు అవసరమైనా యుద్ధానికి వెళ్లడు.

ఒక క్రైస్తవునికి రక్షణదాయకమైన ఆ సర్వాంగ కవచమంతా అవసరం, ప్రత్యేకంగా విశ్వాసమనే పెద్ద డాలు చాలా ముఖ్యం. అందుకే పౌలు ఇలా వ్రాశాడు: “ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు.”​—⁠ఎఫెసీయులు 6:16.

శరీరం మొత్తాన్ని కప్పగల ఆ పెద్ద డాలు విశ్వాస నాణ్యతకు ప్రతీకగా ఉంటుంది. యెహోవా వాగ్దానాలన్నీ తప్పక నెరవేరుతాయని నిస్సందేహంగా అంగీకరిస్తూ, ఆయన నడిపింపులో మీకు బలమైన విశ్వాసం ఉండాలి. ఆ వాగ్దానాలు ఇప్పటికే నెరవేరాయన్నట్లు మీరు భావించాలి. సాతాను విధానం మొత్తం త్వరలోనే నాశనమవుతుందనే, భూమి పరదైసుగా మార్చబడుతుందనే, దేవుని యథార్థప్రజలు పరిపూర్ణతకు పునరుద్ధరించబడతారనే విషయాలను ఎంతమాత్రం అనుమానించకండి.​—⁠యెషయా 33:24; 35:1, 2; ప్రకటన 19:17-21.

అయితే ప్రస్తుతం జరుగుతున్న ఈ అసాధారణ యుద్ధంలో మీకు మరెక్కువ సహాయం కావాలి, మీకొక స్నేహితుడు ఉండాలి. యుద్ధకాలంలో తోటి యోధులు ప్రోత్సాహాన్నిచ్చినప్పుడు, పరస్పరం రక్షణను అందజేసినప్పుడు, కొన్ని సందర్భాల్లో మరణం నుండి ఒకరినొకరు కాపాడుకొన్నప్పుడు వారిమధ్య సన్నిహిత స్నేహబంధాలు నెలకొంటాయి. స్నేహితులు విలువైనవారే, కానీ ఈ పోరాటంలో గెలవడానికి మీకు యెహోవాతో మరెక్కువ స్నేహం అవసరం. అందుకే పౌలు సర్వాంగ కవచాన్ని పరిపూర్ణం చేసేదేమిటో పేర్కొంటూ తన పట్టికను ఇలా ముగిస్తున్నాడు: ‘ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేస్తూ ఉండండి.’​—⁠ఎఫెసీయులు 6:18.

సన్నిహిత స్నేహితుని సహవాసాన్ని మనమెంతో ప్రేమిస్తాం. మనమాయన సాంగత్యం కోరుకుంటాం. ప్రార్థనలో క్రమంగా యెహోవాతో మాట్లాడుతూవుంటే, ఆయన మనకు నిజమైన వ్యక్తిగా, నమ్మదగిన స్నేహితునిగా ఉంటాడు. శిష్యుడైన యాకోబు మనలను ఇలా ప్రోత్సహిస్తున్నాడు: “దేవునికి సన్నిహితమవండి, అప్పుడాయన మీకు సన్నిహితుడవుతాడు.”​—⁠యాకోబు 4:​8, NW.

శత్రువు ఎత్తుగడలు

ఈ లోకంతో పోరాడడం కొన్నిసార్లు మందుపాతర్లు పెట్టిన ప్రాంతంలో నడిచివెళుతున్నట్టుగా ఉంటుంది. ఏ వైపునుండైనా దాడి జరుగవచ్చు, ఎందుకంటే శత్రువు మీరు ఊహించని సమయంలో మీపై దాడికి ప్రయత్నిస్తాడు. అయితే మీకు కావలసిన రక్షణ సామగ్రినంతా యెహోవా దయచేశాడనే నమ్మకంతో ఉండండి.​—⁠1 కొరింథీయులు 10:13.

మీ విశ్వాసానికి మూలాధారంగా ఉన్న బైబిలు సత్యాలపై శత్రువు తన విమర్శనాస్త్రాలు ప్రయోగించవచ్చు. మిమ్మల్ని ఓడించడానికి మతభ్రష్టులు బహుశా మెత్తని మాటలు, పొగడ్తలు వక్ర తర్కాలు ప్రయోగించవచ్చు. అయితే మతభ్రష్టులు మీ మేలు కోరేవారు కాదు. సామెతలు 11:9 ఇలా చెబుతోంది: “భక్తిహీనుడు [“మతభ్రష్టుడు,” NW] తన నోటి మాటచేత తన పొరుగువారికి నాశనము తెప్పించును తెలివిచేత నీతిమంతులు తప్పించుకొందురు.”

మతభ్రష్టుల వాదన తిప్పికొట్టేందుకు మీరు వారు చెప్పేది వినడం లేదా వారి రాతలు చదవడం అవసరమని ఆలోచించడం తప్పు. వక్రమైన, విషపూరితమైన వారి తర్కం ఆధ్యాత్మిక హాని కలిగించి, కొరుకుడు పుండులా మీ విశ్వాసాన్ని త్వరలోనే పాడుచేయగలదు. (2 తిమోతి 2:​16, 17) బదులుగా మతభ్రష్టుల విషయంలో దేవుని ప్రతిస్పందనను అనుకరించండి. యెహోవా గురించి యోబు ఇలా అన్నాడు: “భక్తిహీనుడు [“మతభ్రష్టుడు,” NW] ఆయన సన్నిధికి రాతెగింపడు.”​—⁠యోబు 13:16.

శత్రువు కొంతమేరకు విజయం సాధించిన మరో పన్నాగం పన్నడానికి ప్రయత్నించవచ్చు. సైనిక విన్యాసాలతో ముందుకు సాగుతున్న సైనికుల అవధానాన్ని మళ్ళించి వారిని లైంగిక దుర్నీతివైపు ఆకర్షిస్తే అది క్రమరాహిత్యానికి దారితీస్తుంది.

అశ్లీల సినిమాలు, టీవీ కార్యక్రమాలు, అదుపులేని సంగీతం వంటి లోక సంబంధ వినోదం బలమైన ఎరగా ఉంటాయి. తమపై ఎలాంటి ప్రభావం పడకుండా తాము అశ్లీల దృశ్యాలు చూడగలమనీ లేదా అశ్లీల సాహిత్యాలు చదవగలమని కొందరు వాదిస్తారు. అయితే అశ్లీల సినిమాలు ఎక్కువగా చూసిన ఓ వ్యక్తి ఎలాంటి దాపరికం లేకుండా ఇలా ఒప్పుకుంటున్నాడు: “మీరెప్పటికీ ఆ దృశ్యాలు మరచిపోలేరు, మీరు వాటిగురించి తలంచినకొద్దీ మీరు చూసినవి చేయాలనే కోరిక బలపడుతుంది. . . . ఆ సినిమా నిజంగా మీరేదో కోల్పోయారనే భావన కలిగిస్తుంది.” ఈ రహస్య దాడి మూలంగా గాయపడే ప్రమాదం మంచిదేనంటారా?

శత్రువు అంబులపొదిలో ఉన్న మరో బాణం ఐశ్వర్యాసక్తి. మనందరికీ వస్తు అవసరతలు ఉన్నందున ఈ ప్రమాదాన్ని పసిగట్టడం కష్టంగా ఉండవచ్చు. మనకు ఇల్లు, ఆహారం, బట్టలు అవసరం, మంచి వస్తువులు కావాలనుకోవడం తప్పుకాదు. అయితే వస్తు విషయాలపై ఒకవ్యక్తి దృక్పథంలో ప్రమాదం దాగివుంటుంది. ఆధ్యాత్మిక విషయాలకంటే డబ్బుకు ఎక్కువ ప్రాధాన్యత ఏర్పడవచ్చు. మనం ధనాపేక్ష గలవారం కావచ్చు. ఐశ్వర్యానికున్న పరిమితుల గురించి మనకు మనం గుర్తుచేసుకోవాలి. డబ్బు అశాశ్వతం అయితే ఆధ్యాత్మిక ధనం నిత్యం నిలుస్తుంది.​—⁠మత్తయి 6:19, 20.

సైనికుల నైతిక బలం సన్నగిల్లితే, విజయావకాశాలు కుంటుపడతాయి. “శ్రమదినమున నీవు క్రుంగినయెడల నీవు చేతకాని వాడవగుదువు.” (సామెతలు 24:​10) నిరాశను సాతాను ఫలవంతమైన ఆయుధంగా ఉపయోగించాడు. “రక్షణనిరీక్షణయను శిరస్త్రాణమును” ధరించడం నిరాశను ఎదిరించడానికి మీకు సహాయం చేస్తుంది. (1 థెస్సలొనీకయులు 5:⁠8) అబ్రాహాము విశ్వాసమంత బలంగా మీ విశ్వాసాన్ని ఉంచుకోవడానికి ప్రయత్నించండి. తన ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును బలి ఇమ్మని అడిగినప్పుడు అబ్రాహాము వెనుదీయలేదు. తన సంతానం ద్వారా సమస్త జనాంగాలను ఆశీర్వదిస్తాననే దేవుని వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడనీ, ఆ వాగ్దాన నెరవేర్పుకు అవసరమైతే దేవుడు ఇస్సాకును పునరుత్థానం చేయగలడనీ ఆయన విశ్వసించాడు.​—⁠హెబ్రీయులు 11:17-19.

పోరాట పటిమను కోల్పోకండి

చాలాకాలం ధైర్యంగా పోరాడిన కొందరు అలసిపోతూ ఉండవచ్చు, అందుకే వారు అంతే అప్రమత్తంగా పోరాడడం లేదు. ఈ ఆర్టికల్‌ ఆరంభంలో ప్రస్తావించబడ్డ ఊరియా మాదిరి, యుద్ధంలో ఉన్నవారందరూ సరైన దృక్పథం కాపాడుకోవడానికి సహాయం చేయవచ్చు. మన తోటి క్రైస్తవ యోధులు అనేకమంది కష్టాలు సహించాల్సి రావచ్చు, ప్రమాదాలకు గురికావచ్చు లేదా చలిని, ఆకలిని భరించాల్సి రావచ్చు. అయితే ఊరియావలెనే మనమిప్పుడు అనుభవించగల సుఖాల గురించి ఆలోచించకుండా లేదా సుఖప్రదమైన జీవితం గడపాలనే కోరికకు లొంగిపోకుండా ఉంటే మంచిది. యెహోవా ప్రపంచవ్యాప్త విశ్వసనీయ సైనికులతో ఉండాలనీ, భవిష్యత్తులో మనకోసం దాచిపెట్టబడ్డ అద్భుతమైన ఆశీర్వాదాలు అనుభవించే వరకు పోరాడుతూనే ఉండాలనీ మనం కోరుకుంటాం.​—⁠హెబ్రీయులు 10:⁠32-34.

చివరి ముట్టడి భవిష్యత్తులో ఎప్పుడో జరుగుతుందని ఆలోచిస్తూ ఏమరుపాటుగా ఉండడం ప్రమాదకరం. దావీదు రాజు ఉదాహరణ ఆ ప్రమాదాన్ని నొక్కిచెబుతోంది. ఏదో కారణంచేత ఆయన యుద్ధంలో తన సైనికులతో లేడు. దాని ఫలితంగా దావీదు తన శేష జీవితంలో కష్టాలు, యాతన అనుభవించడానికి దారితీసిన ఘోరమైన పాపం చేశాడు.​—⁠2 సమూయేలు 12:​10-14.

ఈ యుద్ధంలో పాల్గోవడం, పోరాట ఆపదను ఎదుర్కోవడం, అపహాస్యాన్ని భరించడం, ప్రశ్నార్థకమైన లోకసంబంధ సుఖాలను త్యజించడం యోగ్యమేనా? జయప్రదంగా పోరాటం సాగిస్తున్నవారు లోకం అందించేది పైకి మెరిసే రేకులా ఆకర్షణీయంగా కనిపించవచ్చు కానీ నిశితంగా పరిశీలిస్తే దానికి విలువ లేదని ఒప్పుకుంటారు. (ఫిలిప్పీయులు 3:⁠8) అంతేకాకుండా, తరచూ అట్టి సుఖాలు చివరకు బాధకు, నిరాశకు నడిపిస్తాయి.

ఈ ఆధ్యాత్మిక పోరాటంలోని క్రైస్తవుడు నిజ స్నేహితుల సహచర్యాన్ని, నిర్మలమైన మనస్సాక్షిని, అద్భుతమైన నిరీక్షణను ఆస్వాదిస్తాడు. ఆత్మాభిషిక్త క్రైస్తవులు క్రీస్తు యేసుతోపాటు అమర్త్యమైన పరలోకపు జీవితం కోసం ఎదురుచూస్తారు. (1 కొరింథీయులు 15:​54) క్రైస్తవ యోధుల్లో అత్యధికులకు భూపరదైసులో పరిపూర్ణ మానవ జీవిత నిరీక్షణ ఉంది. నిశ్చయంగా అలాంటి బహుమానాలు ఎలాంటి మూల్యం చెల్లించడానికైనా తగినవే. లోకసంబంధ యుద్ధాల్లో మనం విజయం సాధిస్తామో లేదో చివరి వరకూ తెలియదు, అయితే మనం విశ్వాసంగా ఉన్నంత వరకు మనం ఈ యుద్ధంలో ఖచ్చితంగా విజయం సాధిస్తామన్న నిశ్చయతతో ఉండవచ్చు. (హెబ్రీయులు 11:⁠1) అయితే సాతాను ఆధీనంలోని ఈ విధానానికి సర్వ నాశనమనే అపజయం తప్పదు.​—⁠2 పేతురు 3:10.

మీరు ఈ యుద్ధం కొనసాగిస్తుండగా, యేసు పలికిన ఈ మాటలు జ్ఞాపకముంచుకోండి: “ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాను.” (యోహాను 16:​33) అప్రమత్తంగా ఉండి, పరీక్షలో యథార్థతను కాపాడుకోవడం ద్వారా ఆయన ఈ విజయం సాధించాడు. మనమూ అలాగే విజయం సాధించవచ్చు.

[27వ పేజీలోని బ్లర్బ్‌]

తుపాకుల చప్పుళ్లు లేవు, బాంబుల వర్షాలు లేవు, అంత మాత్రాన యుద్ధవ్యూహం తక్కువైనది కాదు

[30వ పేజీలోని బ్లర్బ్‌]

మనం విశ్వాసంగా ఉన్నంతవరకు ఈ యుద్ధంలో మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాం

[26వ పేజీలోని చిత్రం]

రక్షణనిరీక్షణయనే శిరస్త్రాణం నిరాశను ఎదిరించడానికి మనకు సహాయం చేస్తుంది

సాతాను ‘అగ్నిబాణాలను’ తిప్పికొట్టడానికి విశ్వాసమనే పెద్ద డాలు పట్టుకోండి

[29వ పేజీలోని చిత్రం]

“దేవునికి సన్నిహితమవండి, అప్పుడాయన మీకు సన్నిహితమవుతాడు”

[29వ పేజీలోని చిత్రం]

దేవుని వాగ్దానాల నెరవేర్పుపై మనం నమ్మకముంచాలి