అద్దకాలు సౌందర్యాన్ని ఇనుమడింపజేసే ప్రాచీన రంగులు
అద్దకాలు సౌందర్యాన్ని ఇనుమడింపజేసే ప్రాచీన రంగులు
కనానీయ సైనికాధికారి సీసెరా తల్లి అతను యుద్ధం నుండి తిరిగి వచ్చే సమయం కోసం ఆత్రంగా ఎదురు చూసింది. అతను తాను జయించిన వారినుండి దోచుకున్న విలువైన వస్తువులను ఆమె ఊహించుకుంది. వాటిలో “రంగువేయబడిన వస్త్రమొకటి దోపుడు సొమ్ముగా దొరకును రంగువేయబడిన విచిత్ర వస్త్రమొకటి దోపుడుగా దొరకును రెండువైపుల రంగువేయబడిన విచిత్రమైన వస్త్రము దోచుకొనినవారి మెడలకు తగిన వస్త్రమొకటి దొరకును” అని ఆమె ఆశించింది. (న్యాయాధిపతులు 5:30) మానవుడు ఎల్లప్పుడూ సౌందర్యాన్ని అమూల్యంగా పరిగణించాడు, అయితే సౌందర్యాన్ని ఇనుమడింపజేసేవాటిలో ప్రధానమైనది రంగు. కాబట్టి ప్రాచీన కాలాల నుండి వస్త్రాలకు, ఇంటి వస్తువులకు రంగు వేయాలనే కోరిక ఉండేదనే విషయం ఆశ్చర్యం కలిగించదు. దానితో అద్దకపు కళ ఆవిర్భవించింది.
రంగు పదార్థాలను ఉపయోగించి దారాలకు లేదా అల్లికలకు, ఇతర వస్త్రాలకు ప్రత్యేకమైన రంగులను వేయడమే అద్దకపు కళ. అబ్రాహాము కాలానికి ముందరి కాలంలోనే ఆ కళ ప్రజలకు తెలుసు, వారు దానిని ఉపయోగించేవారు, అది బహుశా నేత కళంత ప్రాచీనమైనది. ఇశ్రాయేలీయులు ఆలయ గుడారం కోసం, యాజకుల వస్త్రాల కోసం నీలి దారం, ధూమ్ర వర్ణపు నూలు, ఎరుపురంగు వేసిన ఉన్ని వంటివి ఉపయోగించారు. (నిర్గమకాండము 25-28, 35, 38, 39 అధ్యాయాలు చూడండి) తొలికాలాల్లో ఇళ్లల్లో చేయబడిన అద్దకపు పని, చివరకు అనేక ప్రాంతాల్లో ఒక పెద్ద వాణిజ్య ప్రక్రియగా మారింది. తొలికాలపు ఐగుప్తీయులు ప్రత్యేకంగా ప్రకాశవంతమైన అద్దకపు సరుకులకు పేరుగాంచారు. యెహెజ్కేలు 27వ అధ్యాయం 7వ వచనంలో మనమిలా చదువుతాం: “నీకు జెండాగా ఉండుటకై నీ తెరచాపలు ఐగుప్తునుండి వచ్చిన విచిత్రపు పనిగల అవిసె నారబట్టతో చేయబడును; ఎలీషాద్వీపములనుండి వచ్చిన నీలధూమ్రవర్ణములుగల బట్ట నీవు చాందినిగా కప్పుకొందువు.” ఐగుప్తు పతనమైన తర్వాత, తూరు, ఇతర ఫోనీషియా నగరాలు ముఖ్య అద్దకపు కేంద్రాలుగా తయారయ్యాయి. అయితే ఈ అద్దకాలు ఎలా తయారు చేయబడేవి?
తొలికాలపు ప్రక్రియలు
అద్దకపు ప్రక్రియలు ప్రాంతాన్నిబట్టి వివిధ రకాలుగా ఉండేవి. కొన్నిసార్లు దారానికి రంగువేయబడితే, ఇతర సందర్భాల్లో నేత పూర్తయిన బట్టకు రంగు వేయబడేది. దారానికి వేయబడే విలువైన రంగు నిలిచి ఉండడానికి దారాన్ని రెండుసార్లు రంగులో తడిపి తొట్టిలోనుండి రెండవసారి బయటకు తీసినప్పుడు దానిని పిండేవారన్నట్లు అనిపిస్తోంది. ఆ తర్వాత దానిని ఆరబెట్టేవారు.
ప్రతీ వస్త్రాన్ని విభిన్న పద్ధతిలో ముందుగా సిద్ధంచేసుకోవాలి. అయితే అరుదుగానే అయినా కొన్నిసార్లు అద్దకపు వస్త్రానికి రంగుకు సహజ సంబంధముండేది. అయితే అలా కాని సందర్భాల్లో రంగు పట్టుకోవడానికి అటు వస్త్రానికి, ఇటు అద్దకానికి అనువైన రసాయనంతో వస్త్రాన్ని సిద్ధంచేసుకోవాలి. ఒక పదార్థం అనువైన రసాయనంగా పనిచేయాలంటే అది కనీసం రంగును ఆకర్షించేదిగా ఉండాలి, అలా అయితేనే అది రంగు పట్టుకొనేలా చేయగలదు. ఐగుప్తీయులు అద్దకపు పనుల్లో రసాయనాలు ఉపయోగించేవారని పరిశోధనలు చూపిస్తున్నాయి. ఉదాహరణకు వారు ఎరుపు, పసుపు, నీలి రంగులను ఉపయోగించేవారు, ఆర్సెనిక్, ఇనుము, తగరంవంటి ఆక్సైడులను రసాయనాలుగా ఉపయోగించకుండా అలాంటి రంగులు వేయడం సాధ్యం కాదు అని చెబుతారు.
జంతువుల తోళ్లను నానబెట్టి పదును పెట్టిన తర్వాతే వాటికి రంగువేయబడేదని స్పష్టమవుతోంది. ఈ మధ్యనే సిరియాలో కూడా మేక తోళ్లు సుమాక్ ద్రావకంలో నానబెట్టబడి ఆ తర్వాతే వాటికి రంగువేయబడింది. రంగు ఆరిన తర్వాత, నూనెతో ఆ తోళ్లు రుద్ది, ఆ పిమ్మట పాలిష్ చేయబడ్డాయి. అలా ఎడారివాసులు వాడే తోలు బూట్లకు, ఇతర వస్తువులకు ఎరుపురంగు వేయబడేది, అది ఆలయ గుడారంలో ఉపయోగించిన ‘ఎరుపురంగు వేసిన పొట్టేళ్లతోళ్లను’ మనకు గుర్తుచేయవచ్చు.—నిర్గమకాండము 25:5.
అద్దకపు వస్తువులకు సంబంధించిన ఆసక్తికరమైన ఒక వృత్తాంతం అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు III భవంతిలో చెక్కిన రాతల్లో కనబడుతుంది. పాలస్తీనా, సిరియాలపై తన సైనిక చర్యల గురించి చెప్పిన తర్వాత తూరు రాజైన హీరాము నుండి ఇతర పరిపాలకుల నుండి తాను పొందిన కప్పం గురించి ఆయన మాట్లాడాడు. ఆయన పేర్కొన్న వస్తువుల్లో “వివిధ రంగుల అల్లికలుగల వస్త్రాలు, . . . నీలి రంగు వేయబడిన ఉన్ని, ధూమ్రవర్ణపు ఉన్ని, . . . పదునుచేసి ధూమ్రవర్ణం వేయబడిన గొర్రె చర్మాలు, నీలి రంగు వేయబడిన అడవి పక్షుల రెక్కలు” ఉన్నాయి.—జె. రిచర్డ్ సంపాదకత్వం వహించిన ఎన్షెంట్ నియర్ ఈస్ట్రన్ టెక్స్‌ట్స్, 1974, 282, 283 పేజీలు.
రంగుల మూలపదార్థాలు
అద్దకపు రంగులు వివిధ మూలపదార్ధాల నుండి సేకరించబడేవి. పాలస్తీనాలో పసుపు రంగును బాదం చెట్టు ఆకుల నుండి, పొడిచేయబడిన దానిమ్మ తొక్కు నుండి తయారుచేసేవారు, అయితే ఫోనీషియన్లు పసుపు కొమ్ములను, కుసుమ పువ్వులను కూడా ఉపయోగించేవారు. హెబ్రీయులు దానిమ్మ చెట్టుబెరడు నుండి నల్లరంగును, మంజిష్ఠ మొక్కల (రూబియా టింక్టోరమ్) వేర్లనుండి ఎరుపు రంగును తయారు చేయగలిగేవారు. బహుశా ఐగుప్తు లేదా సిరియా నుండి పాలస్తీనాకు తీసుకురాబడిన ఇండిగో మొక్కలు (ఇండిగోఫెరా టింక్టోరియా) నీలి రంగును తయారుచేయడానికి ఉపయోగించబడేవి. ఉన్నికి ధూమ్రవర్ణం వేసే ప్రక్రియలో ఆ ఉన్నిని ఒక రాత్రంతా ద్రాక్షారసంలో నానబెట్టి దానిపై మంజిష్ఠ పొడిని చల్లడం ఒక భాగంగా ఉండేది.
ఒక మోస్తరు ఎరుపు, సింధూరపు రంగులకు కోక్సిడే (కోకస్ ఇలిసిస్) కుటుంబానికి చెందిన పురుగులే మూలాధారం. ఇదే అతిప్రాచీన అద్దకపు ముడిసరుకు. బ్రతికివున్న ఆడ పురుగు చెర్రీ గుల్ల పరిమాణంలో ఉండి బెర్రీ పండు మాదిరిగా ఉండడం చేత గ్రీసువాసులు దానికి “బెర్రీ” అనే అర్థమున్న కోకస్ అనే పేరు అన్వయించారు. అరబ్బులు ఆ పురుగును కిర్‌మిజ్ లేదా కెర్‌మెజ్ అని పిలుస్తారు, దాని నుండే ముదురు ఎరుపు రంగు అనే అర్థంగల “క్రిమ్‌సన్” అనే ఆంగ్ల పదం వచ్చింది. ఈ పురుగు మధ్య ప్రాచ్యమంతటా కనిపిస్తుంది. కెర్‌మెసిక్ ఆమ్లం సమృద్ధిగావుండే ఎరుపు రంగు కేవలం దాని గుడ్లలోనే ఉంటుంది. ఏప్రిల్ నెలాఖరుకల్లా పొట్టనిండా గుడ్లుకలిగిన రెక్కల్లేని ఆడ పురుగులు వాటి ముట్టెలతో కెర్మెస్ ఓక్‌చెట్ల (క్యుర్‌కస్ కోక్సిఫెరా) రెమ్మలను కొన్నిసార్లు ఆకులను పట్టుకొని ఉంటాయి. ఆ పురుగుల గుడ్లను లేదా కెర్‌మెజ్‌లను సమకూర్చి ఎండబెడతారు, అలా ఎండబెట్టిన గుడ్లను నీటిలో మరిగించడం ద్వారా విలువైన ఎర్ర రంగు తయారుచేయబడుతుంది. ఆలయ గుడారపు వస్తుసామగ్రికి, ఇశ్రాయేలీయుల ప్రధాన యాజకుడు ధరించే వస్త్రాలకు విస్తృతంగా ఈ ఎరుపు రంగే వాడబడేది.
నీలి రంగుకు మూలాధారంగా ఒక రకమైన సముద్రపు గుల్లచేప (సెరూలిన్ మస్సెల్) సూచించబడింది. ధూమ్రవర్ణం మూరెక్స్ ట్రంకులస్, మూరెక్స్ బ్రాండరిస్ వంటి గుల్లచేపలు లేదా మొలస్క్‌ల నుండి సేకరించబడేది. ఈ ప్రాణుల మెడ భాగంలో ఫ్లవర్ అని పిలువబడే, ఒకే ఒక చుక్క ద్రవంతో ఒక చిన్న రసగ్రంధి ఉంటుంది. మొదట్లో అది మీగడలా చిక్కగా కనిపిస్తుంది, అయితే దానిని గాలి, వెలుతురుకు గురిచేసినప్పుడు నెమ్మదిగా దాని రంగు మారి ముదురు ఊదారంగులోకి లేదా ధూమ్రవర్ణంలోకి మారుతుంది. ఈ గుల్లచేపలు మధ్యధరా సముద్రపు తీరాల్లో దొరుకుతాయి, ఆయా ప్రాంతాలనుబట్టి ఈ రంగుకు ఇతర ఛాయలు ఉంటాయి. పెద్దగావుండే చేపలను కోసి వాటి నుండి జాగ్రత్తగా ఆ ద్రవం సేకరిస్తారు, అదే చిన్నచేపలైతే మార్టార్‌లలో చితక్కొడతారు.
ఈ గుల్లచేపల నుండి సేకరించబడే ద్రవం కొద్ది పరిమాణంలోనే ఉంటుంది, కాబట్టి నిర్దిష్టమైన మోతాదులో రంగు సంపాదించడం అధిక ఖర్చుతో కూడుకొన్న పని. అందువల్ల ఈ రంగు ఖరీదైనది, ఈ రంగు అద్దిన వస్త్రాలు ధనవంతులకు లేదా ఉన్నత పదవుల్లో ఉన్నవారికి చిహ్నంగా తయారయ్యాయి. అహష్వేరోషు తనను ఉన్నత పదవిలో ఉంచినప్పుడు మొర్దెకై “ఊదావర్ణమును తెలుపువర్ణమునుగల రాజవస్త్రమును బంగారపు పెద్దకిరీటమును అవిసెనారతో చేయబడిన ధూమ్రవర్ణముగల వస్త్రములను ధరించుకొనినవాడై రాజుసముఖమునుండి బయలుదేరెను.” (ఎస్తేరు 8:15) లూకా 16వ అధ్యాయం 19 నుండి 31 వచనాల్లో కనబడే యేసు ఉపమానంలోని ‘ధనవంతుడు’ కూడా ‘ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు.’
తూరుదేశపు ఊదారంగు
ప్రాచీనకాల తూరు, తూరుదేశపు లేదా సామ్రాజ్యపు ధూమ్రవర్ణమని పిలువబడిన ఊదారంగుకు లేదా ముదురు సింధూరపు రంగుకు పేరుగాంచింది. తూరు దేశస్థులు రెట్టింపు అద్దకపు పద్ధతిని ఉపయోగించేవారని చెప్పబడినప్పటికీ, ఈ రంగును సేకరించే ఖచ్చితమైన సూత్రమేమిటో ఎవరికీ తెలియదు. అయితే ఆ రంగు మాత్రం మూరెక్స్, పర్‌పురా మొలస్క్‌ల నుండి సేకరించబడేదని చెప్పవచ్చు, ఎందుకంటే మూరెక్స్ ట్రంకులస్ ఖాళీ గుల్లలు కుప్పలుకుప్పలుగా తూరు తీరప్రాంతంలో, సీదోను పరిసరాల్లో కనబడ్డాయి. యెహోవా ఫోనీషియా నగరమైన తూరును ధూమ్రవర్ణపు ఉన్నికి, ఇతర రంగుల వస్తువులకు అలాగే అలాంటి వస్తువుల వ్యాపారానికి పేరుగాంచిన నగరంగా వర్ణించాడు.—యెహెజ్కేలు 27:2, 7, 24.
అవును, సీసెరా తల్లి మాత్రమే కాదు, అనేకమంది ఇతర స్త్రీలు వారి పురుషులు కూడా చక్కని, అందమైన రంగులు వేయబడిన వస్త్రాలు, గృహసామగ్రి కోరుకున్నారు. నేడు కూడా అది నిజమైనట్లే రంగులు అద్దడం సౌందర్యాన్ని ఇనుమడింపజేయడంతోపాటు కనులపండుగ చేస్తుంది.