కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

చర్చీలను కాపాడడం సాధ్యమా?

చర్చీలను కాపాడడం సాధ్యమా?

చర్చీలను కాపాడడం సాధ్యమా?

“బ్రిటన్‌ ప్రజలు ఇప్పటికీ దేవుణ్ణి నమ్ముతున్నారు, అయితే క్రీస్తుకు తమను బద్ధులను చేసుకోవడానికి ససేమిరా ఇష్టపడడం లేదు” అని ఉగాండా మతనాయకుడు స్టీఫెన్‌ టైరోమ్వి అంటున్నాడు. దాదాపు 20 సంవత్సరాల క్రితం ఆయన ఉగాండాలో తన చర్చిపై జరిగిన హింసాయుత ప్రక్షాళన నుండి తప్పించుకున్నాడు. నేడు, ఆయన ఇంగ్లాండులోవున్న లీడ్స్‌లో పురుషుల క్లబ్బుల్లో తన ప్రేక్షకులు బింగో ఆడడానికి వెళ్లేముందు వారి ఎదుట 10 నిమిషాలు ప్రసంగించే పని చేస్తున్నాడు.

అట్లాంటిక్‌ అవతల, ఇటీవల వ్యవస్థీకరించబడిన అమెరికాలోని ఆంగ్లికన్‌ మిషన్‌ ఇలాంటి ఆధ్యాత్మిక గడ్డుపరిస్థితులనే ఎదుర్కొంటోంది. “చర్చి సభ్యత్వంలేని, ఆధ్యాత్మిక సంబంధాలు లేని విస్తారమైన ఆంగ్లభాషా జనాభాకు అమెరికా ఇప్పుడు ఆవాసంగా ఉంటోంది. అది మిషనరీలు అవసరమైన సేవాక్షేత్రంగా తయారవుతోంది” అని ఆ మిషన్‌ సాధికారిక వెబ్‌సైట్‌ చెబుతోంది. తమ చర్చిలో మార్పులు తీసుకురావడానికి చేసిన విఫల ప్రయత్నాలతో విసిగిపోయిన ఆ వ్యవస్థీకృత మిషన్‌ సాంప్రదాయాన్ని గాలికి వదిలేసి “అమెరికాలో మిషనరీ సేవల విస్తరణ కోసం” ఆసియా, ఆఫ్రికాదేశాల మతనాయకులతో చేతులు కలిపింది.

అయితే క్రైస్తవ దేశాలని చెప్పుకునే ఐరోపా, ఉత్తర అమెరికా దేశాల ప్రజలకు ఆఫ్రికా, ఆసియా, లాటిన్‌ అమెరికా దేశాల మిషనరీలు ఎందుకు ‘ప్రకటిస్తున్నారు’?

ఎవరు ఎవరిని రక్షిస్తున్నారు?

నాలుగు శతాబ్దాలకంటే ఎక్కువ కాలంపాటు అంకిత భావంగల ఐరోపా మిషనరీలు స్థిరంగా ఆఫ్రికా, ఆసియా, పసిఫిక్‌, దక్షిణ అమెరికాల్లో వలసరాజ్య విస్తరణతోపాటు వారుకూడా ఆ ప్రాంతాలకు వెళ్లారు. ఆ దేశాల్లోని అన్యులకు తమ మతాన్ని తెలియజేయడమే వారి ఉద్దేశం. కాల ప్రవాహంలో, క్రైస్తవ సూత్రాలపై స్థాపించబడ్డాయని చెప్పబడుతున్న అమెరికా వలసప్రాంతాలూ ఆ మిషనరీలతో కలిసిపోయి, ప్రపంచమంతటా తమ సొంత సువార్త మతప్రచారక సంస్థలు స్థిరపరచుకోవడంలో ఐరోపాలోని తమ ప్రతిరూపక సంస్థలకు మించిపోయాయి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి తారుమారయింది.

“[నామకార్థ క్రైస్తవత్వ] కేంద్రం మారిపోయింది” అని సెంటర్‌ ఫర్‌ ద స్టడీ ఆఫ్‌ క్రిస్టియానిటీ ఇన్‌ ద నాన్‌-వెస్ట్రన్‌ వరల్డ్‌ వ్యవస్థాపక సంచాలకుడైన ఆండ్రూ వాల్స్‌ చెబుతున్నారు. 19వ శతాబ్దంలో, క్రైస్తవులమని చెప్పుకున్న వారిలో 80 శాతం యూరోపియన్లు లేదా ఉత్తర అమెరికాకు చెందినవారే. కానీ నేడు నామకార్థ క్రైస్తవుల్లో 60 శాతం మంది ఆఫ్రికా, ఆసియా, లాటిన్‌ అమెరికా దేశాల్లో జీవిస్తున్నారు. ఇటీవలి ఒక పత్రికా నివేదిక ఇలా చెబుతోంది: “యూరప్‌లోని క్యాథలిక్‌ చర్చీలు ఫిలిప్పీన్స్‌, ఇండియాల నుండి వచ్చే ప్రీస్టులపై ఆధారపడుతున్నాయి. ఇప్పుడు అమెరికన్‌ క్యాథలిక్‌ చర్చీల్లో సేవచేస్తున్న ప్రతీ ఆరుగురు ప్రీస్టుల్లో ఒకరు విదేశాలనుండి వచ్చినవారే.” నెదర్లాండ్స్‌లోని ఆఫ్రికన్‌ సువార్తికులు, వీరిలో చాలామంది ఘానాకు చెందినవారే, తమనుతాము “లౌకికవాద ఖండంలో మిషనరీ చర్చిగా” పరిగణించుకుంటున్నారు. బ్రెజిల్‌ సువార్తికులు ఇప్పుడు బ్రిటన్‌లోని వివిధ ప్రాంతాల్లో పవిత్ర యుద్ధాలు నిర్వహిస్తున్నారు. “క్రైస్తవ మిషనరీ సేవ ఇప్పుడు తిరోగమనంలో ఉంది” అని ఓ రచయిత అభిప్రాయపడుతున్నాడు.

తుఫాను ముంచుకొస్తోంది

మరింతగా లౌకికవాద ఖండాలుగా మారుతున్న ఐరోపా, ఉత్తర అమెరికాల్లో మిషనరీలు బహుశా అవసరం కావచ్చు. “స్కాట్లాండులో 10 శాతం కంటే తక్కువమంది క్రైస్తవులు క్రమంగా చర్చికి వెళుతున్నారు” అని ఒక పత్రిక పేర్కొంటోంది. ఫ్రాన్సు, జర్మనీల్లో అయితే ఆ శాతం ఇంకా తక్కువగా ఉంది. సర్వే చేసినప్పుడు “40 శాతం అమెరికన్లు, 20 శాతం కెనెడియన్లు తాము క్రమంగా చర్చికి వెళుతున్నట్లు చెప్పారు” అని మరో పత్రికా నివేదిక చెబుతోంది. దీనికి భిన్నంగా ఫిలిప్పీన్స్‌లో హాజరవుతున్న వారు దాదాపు 70 శాతం ఉండగా, ఇతర వర్ధమాన దేశాల్లోనూ హాజరు శాతం అదేప్రకారం ఉంది.

మరింత విశేషమేమిటంటే, దక్షిణార్ధ గోళంలో చర్చీలకు వెళ్లేవారు ఉత్తరార్ధ గోళంలోని వారికంటే ఎక్కువ సంప్రదాయ బద్ధంగా ఉన్నట్లున్నారు. ఉదాహరణకు, అమెరికా, యూరపుల్లోని క్యాథలిక్కుల అభిప్రాయం అడిగినప్పుడు వారు ఏకరీతిగా మతనాయకుల అధికారంపట్ల పెరుగుతున్న అపనమ్మకాన్ని వ్యక్తంచేసి సామాన్యుల భాగస్వామ్యం గురించి స్త్రీల సమానత్వం గురించి వాదించారు. మరోవైపున దక్షిణార్ధ గోళంలోవున్న క్యాథలిక్కులు ఈ అంశాల్లో చర్చి సాంప్రదాయాలకు గట్టిగా కట్టుబడి ఉంటున్నారు. చర్చికి మద్దతిచ్చే స్వభావం దక్షిణార్ధంలో అంతకంతకు ఎక్కువవుతుండగా, భవిష్యత్‌ సంఘర్షణకు పునాది ఇప్పటికే వేయబడుతోంది. చరిత్ర మరియు మత సంబంధిత విద్వాంసుడైన ఫిలిప్‌ జెన్‌కెన్స్‌ భవిష్యత్తు గురించి ఇలా చెబుతున్నాడు: “ఒకటి రెండు దశాబ్దాల్లోనే ఉత్తర దక్షిణార్ధ గోళాల్లోని క్రైస్తవ శాఖల సభ్యులు ఒకరినొకరు పూర్తిగా లేదా వాస్తవికంగా క్రైస్తవులని గుర్తించరు.”

ఈ స్వభావాల దృష్ట్యా “ఆఫ్రికా, ఆసియా, లాటిన్‌ అమెరికా, ఉత్తర అమెరికా, ఐరోపాల్లోని క్రైస్తవులు ఒకే చర్చిగా, అధికారికంగా ఒకే విశ్వాసాన్ని వ్యక్తంచేస్తూ కలిసి ఎలా జీవించగలరు” అనేదే అత్యవసర అంశమని వాల్స్‌ చెబుతున్నాడు. మీరేమనుకుంటున్నారు? విభాగిత ప్రపంచంలో చర్చీలు కాపాడబడగలవా? నిజ క్రైస్తవ ఐక్యతకు ఆధారమేమిటి? ఇప్పటికే ఐక్య క్రైస్తవ సమాజం ప్రపంచవ్యాప్తంగా పరిఢవిల్లుతోందనడానికి స్పష్టమైన రుజువుతో తర్వాతి ఆర్టికల్‌ దీనికి లేఖనాధార జవాబులనిస్తుంది.

[4వ పేజీలోని చిత్రం]

ఒకప్పటి ఈ చర్చి ఇప్పుడు ఒక మ్యూజిక్‌ కెఫే

[చిత్రసౌజన్యం]

AP Photo/Nancy Palmieri