కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవునిపట్ల మన ప్రేమనుచూపే విధానం

దేవునిపట్ల మన ప్రేమనుచూపే విధానం

దేవునిపట్ల మన ప్రేమనుచూపే విధానం

దేవునిపట్ల ప్రేమను పెంపొందించుకోవడం అంటే కేవలం ఆయన గురించి నేర్చుకోవడం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని సేవకులు దృఢనమ్మకంతో చెప్పగలిగినట్లు, ఒక వ్యక్తి దేవుని వ్యక్తిత్వాన్ని నిరంతరం తెలుసుకుంటూవుంటే ఆయనపట్ల నిజమైన ప్రేమ పెరుగుతుంది. అలాగే దేవుడు ప్రేమించేవి, ద్వేషించేవి, ఆయన కోరేవి, ఆయన కట్టడలు పరిచయమైనకొద్దీ ఆ ప్రేమ మరింత బలంగా తయారవుతుంది.

మనపట్ల ప్రేమతో యెహోవా మనకు తన వాక్యమైన బైబిలును అనుగ్రహించి, దానిలో తనను తాను బయలుపరచుకున్నాడు. దానినుండి మనం విభిన్న పరిస్థితుల్లో యెహోవా ఎలా వ్యవహరించాడో నేర్చుకుంటాం. ప్రియమైన వారినుండి అందిన ఉత్తరం మనకెలా సంతోషం కలిగిస్తుందో, అదే ప్రకారం యెహోవా వ్యక్తిత్వపు కొత్త అంశాలు వెల్లడికావడం మనం గమనిస్తున్నప్పుడు బైబిలు మనకు ఆనందం కలిగిస్తుంది.

అయితే, మన బహిరంగ పరిచర్యలో మనం కొన్నిసార్లు గమనించినట్లు, ఒక వ్యక్తి దేవుని గురించి నేర్చుకోవడం అన్ని సందర్భాల్లో అతడు ఆయనను ప్రేమించేటట్లు చేయదు. యేసు తన కాలంలోని ప్రశంసచూపని కొంతమంది యూదుల గురించి ఇలాచెప్పాడు: “లేఖనములయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, . . . నేను మిమ్మును ఎరుగుదును; దేవుని ప్రేమ మీలో లేదు.” (యోహాను 5:​39, 42) కొందరు యెహోవా ప్రేమపూర్వక కార్యాల గురించి నేర్చుకోవడానికి అనేక సంవత్సరాలు గడుపుతారు, అయినప్పటికీ ఆయనపట్ల వారి ప్రేమ అంతంత మాత్రమే. కారణమేమిటి? తాము నేర్చుకున్న వాటికి అనుబంధంగా ఉన్న సత్యాలను వారు గ్రహించకపోవడమే దానికి కారణం. దానికి భిన్నంగా, మనం బైబిలు అధ్యయనంచేసే యథార్థవంతులైన లక్షలాదిమంది దేవునిపట్ల తమ ప్రేమను వృద్ధి చేసుకుంటున్నారు. ఎందుకు? ఎందుకంటే, మనం చేసినట్లుగానే వారు కూడా ఆసాపు మాదిరిని అనుకరిస్తున్నారు. ఏ విధంగా?

ప్రశంసాపూర్వకంగా ధ్యానించండి

ఆసాపు తన హృదయంలో యెహోవాపట్ల ప్రేమను పెంపొందించుకోవడానికి తీర్మానించుకున్నాడు. ఆయనిలా వ్రాశాడు: “హృదయమున ధ్యానించుకొందును. . . . యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్యకార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును.” (కీర్తన 77:​6, 11, 12) కీర్తనకర్త మాదిరిగా యెహోవా మార్గాలను ధ్యానించేవారి హృదయంలో దేవునిపట్ల ప్రేమ వృద్ధవుతుంది.

దానికితోడు, యెహోవాను సేవిస్తుండగా మనం చవిచూసిన అనుభవాలను గుర్తు తెచ్చుకోవడం ఆయనతో మన సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. మనం దేవుని ‘జతపనివారమని’ అపొస్తలుడైన పౌలు చెప్పాడు, కాగా జతపనివారి మధ్య వృద్ధయ్యే స్నేహం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. (1 కొరింథీయులు 3:⁠9) యెహోవాపట్ల మనకున్న ప్రేమను మనం వ్యక్తం చేసినప్పుడు, ఆయన దానిని విలువైనదిగా ఎంచుతాడు, అది ఆయన హృదయాన్ని సంతోషపరుస్తుంది. (సామెతలు 27:​11) మనం యెహోవా సహాయాన్ని అడగడంతో, ఆయన మన కష్టంతీరే మార్గనిర్దేశం ఇచ్చినప్పుడు ఆయన మనతో కూడా ఉన్నాడని మనకు తెలుస్తుంది, దానితో ఆయనపట్ల మన ప్రేమ మరింత ప్రగాఢమవుతుంది.

పరస్పర భావాలు వ్యక్తపరచుకోవడం ద్వారా ఇద్దరి మధ్య స్నేహబంధం పెరుగుతుంది. అదే ప్రకారం, మనం యెహోవాకు ఎందుకు అర్పించుకున్నామో ఆయనకు చెప్పినప్పుడు, ఆయనపట్ల మనకున్న ప్రేమలో మనం బలపరచబడతాం. అలా మనం యేసు పలికిన ఈ మాటలను ధ్యానిస్తున్నట్లుగా ఉంటాం: “నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను.” (మార్కు 12:​30) మనం ఎల్లప్పుడూ యెహోవాను మన పూర్ణహృదయముతో, మన పూర్ణాత్మతో, మన పూర్ణవివేకముతో, మన పూర్ణబలముతో ప్రేమిస్తున్నామని రూఢిపరుచుకోవడానికి మనమేమి చేయవచ్చు?

మన పూర్ణహృదయంతో యెహోవాను ప్రేమించడం

మన అంతరంగ వ్యక్తిని అంటే మన కోరికలు, దృక్పథాలు, భావాలు ఉన్న అలంకారార్థ హృదయాన్ని లేఖనాలు సూచిస్తున్నాయి. అందువల్ల, మనం పూర్ణహృదయంతో యెహోవాను ప్రేమించడం అంటే దేవుణ్ణి సంతోషపరచడం కంటే వేరే దేన్నీ మనం ఎక్కువగా కోరుకోమని దానర్థం. (కీర్తన 86:​11) మన వ్యక్తిత్వం ఆయనకు ఆమోదయోగ్యంగా ఉండేలా చేసుకోవడం ద్వారా మనమలాంటి ప్రేమను చూపిస్తాం. “చెడ్డదాని నసహ్యించుకొని మంచిదానిని హత్తుకొని” ఉండడం ద్వారా మనం దేవుణ్ణి అనుకరించడానికి కృషిచేస్తాం.​—⁠రోమీయులు 12:9.

దేవునిపట్ల మనకున్న ప్రేమ ప్రతీ విషయంలో మన భావాలను ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు, మన ఉద్యోగం మనకు ఉత్తేజకరంగా లేదా మన శ్రద్ధచూరగొనేదిగా ఉండవచ్చు, అంతమాత్రాన మన హృదయం దానిమీదే ఉంటుందా? ఉండదు. మనం యెహోవాను పూర్ణహృదయంతో ప్రేమిస్తున్నాం కాబట్టి, అన్నింటికంటే ముందు మనం దేవుని పరిచారకులం. అదే ప్రకారం మన తల్లిదండ్రులను, మన వివాహజతను, మన యజమానిని మనం సంతోషపరచాలనుకుంటాం, అయితే అన్నింటికంటే ముఖ్యంగా మనం యెహోవాను సంతోషపరచడానికి ప్రయత్నించడం ద్వారా ఆయనపట్ల మన పూర్ణహృదయ ప్రేమను నిరూపిస్తాం. నిజం చెప్పాలంటే మన హృదయంలో మొదటి స్థానానికి ఆయన అర్హుడు.​—⁠మత్తయి 6:24; 10:37.

మన పూర్ణాత్మతో యెహోవాను ప్రేమించడం

లేఖనాల్లో “ఆత్మ” అనే మాట ప్రాథమికంగా ఒక వ్యక్తిగా మనలోని సమస్తాన్ని, మన ప్రాణాన్ని సూచిస్తుంది. కాబట్టి యెహోవాను పూర్ణాత్మతో ప్రేమించడం అంటే ఆయనను స్తుతించడానికీ, ఆయనపట్ల మన ప్రేమను నిరూపించుకోవడానికీ మన జీవితాన్ని ఉపయోగించడమని అర్థం.

నిజమే, ఒక వృత్తి నేర్చుకోవడం, వ్యాపారం చేయడం లేదా కుటుంబాన్ని పోషించడం వంటి ఇతర ఆసక్తులు మనకు జీవితంలో ఉండవచ్చు. అయితే అదే సమయంలో యెహోవా పద్ధతిచొప్పున పనులు చేయడం ద్వారా, ‘ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుతూ’ ఇతర విషయాలను మన జీవితంలో వాటివాటి స్థానాల్లో పెట్టడం ద్వారా ఆయనపట్ల మన పూర్ణాత్మ ప్రేమను నిరూపిస్తాం. (మత్తయి 6:​33) పూర్ణాత్మ ఆరాధన అంటే ఆసక్తి కలిగి ఉండడమని కూడా అర్థం. ఆసక్తితో రాజ్య సందేశం ప్రకటించడం ద్వారా, కూటాల్లో క్షేమాభివృద్ధికరమైన వ్యాఖ్యానాలు చేయడం ద్వారా లేదా మన క్రైస్తవ సహోదర సహోదరీలకు సహాయం చేయడం ద్వారా మనం యెహోవాను ప్రేమిస్తున్నామని చూపిస్తాం. ప్రతీ విషయంలో మనం ‘దేవుని చిత్తమును మనఃపూర్వకముగా [“పూర్ణాత్మతో,” NW] జరిగిస్తాం.’​—⁠ఎఫెసీయులు 6:6.

యేసు తననుతాను ఉపేక్షించుకోవడం ద్వారా దేవునిపట్ల తన పూర్ణాత్మ ప్రేమను ప్రదర్శించాడు. ఆయన దేవుని చిత్తాన్ని మొదటి స్థానంలో, తన వ్యక్తిగత అవసరాలను రెండవ స్థానంలో పెట్టాడు. తన మాదిరిని అనుకరించమని యేసు మనలను ఆహ్వానించాడు. ఆయనిలా అన్నాడు: “ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తికొని నన్ను వెంబడింపవలెను.” (మత్తయి 16:​24, 25) మనలను మనం ఉపేక్షించుకోవడం అంటే సమర్పించుకోవడమని దాని భావం. అంటే మన సమస్తాన్ని దేవునికి అప్పగించేంతగా ఆయనను ప్రేమించడమని దానర్థం, బైబిలు కాలాల్లో ఒక ఇశ్రాయేలీయుడు తన యజమానిని ఎంతగా ప్రేమించేవాడంటే ఆ యజమాని దగ్గరే అతడు తనకుతానుగా శాశ్వత దాసునిగా ఉండిపోయేవాడు. (ద్వితీయోపదేశకాండము 15:​16, 17) యెహోవాకు మన జీవితాలను సమర్పించుకోవడం ఆయనపట్ల మన ప్రేమకు తిరుగులేని రుజువుగా ఉంటుంది.

మన పూర్ణవివేకముతో యెహోవాను ప్రేమించడం

పూర్ణవివేకంతో యెహోవాను ప్రేమించడమంటే యెహోవా వ్యక్తిత్వాన్ని, సంకల్పాలను, నియమాలను అర్థంచేసుకోవడానికి మనం అవసరమైన ప్రతీ ప్రయత్నం చేస్తామని దానర్థం. (యోహాను 17:3; అపొస్తలుల కార్యములు 17:​11) ఇతరులు కూడా యెహోవాను ప్రేమించేలా వారికి సహాయం చేయడంలో మన మానసిక సామర్థ్యాలన్నీ ఉపయోగించడం ద్వారా, మన బోధనా కళను అభివృద్ధి చేసుకోవడం ద్వారా యెహోవాపట్ల మన ప్రేమను వ్యక్తం చేస్తాం. ‘మీ మనస్సు అను నడుముకట్టుకొనుడని’ అపొస్తలుడైన పేతురు ఉద్బోధించాడు. (1 పేతురు 1:​13) అంతేకాకుండా ఇతరులపట్ల, ప్రత్యేకంగా తోటి దేవుని సేవకులపట్ల శ్రద్ధ చూపడానికి కృషి చేస్తాం. వారి పరిస్థితులు ఎరిగిన వారమై వారిని మెచ్చుకోవడం ఎప్పుడు సముచితమో లేదా వారికి ఓదార్పు ఎప్పుడు అవసరమో గమనిస్తూ ఉంటాము.

మానసికంగా యెహోవాకు లోబడడం ద్వారా పూర్ణవివేకముతో మనమాయనను ప్రేమిస్తున్నామని చూపిస్తాం. విషయాలను ఆయన దృక్కోణం నుండి చూడడానికి మనం ప్రయత్నిస్తూ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆయన అధికారానికి ఒప్పుకుంటాం, ఆయన మార్గం శ్రేష్ఠమైనదని నమ్ముతాం. (సామెతలు 3:5, 6; యెషయా 55:9; ఫిలిప్పీయులు 2:​3-7) దేవునిపట్ల నిరంతరం మన ప్రేమను ప్రదర్శిస్తుండగా, మన బలాన్ని మనమెలా ఉపయోగించవచ్చు?

మన పూర్ణబలంతో యెహోవాను ప్రేమించడం

క్రైస్తవ సంఘంలోని అనేకమంది యౌవనులు యెహోవాను స్తుతించడంలో తమ బలాన్ని ఉపయోగిస్తున్నారు. (సామెతలు 20:29; ప్రసంగి 12:⁠1, 2) అనేకమంది క్రైస్తవ యౌవనులు తమ పూర్ణబలంతో యెహోవాను ప్రేమిస్తున్నామని చూపించే ఒక మార్గమేమిటంటే వారు పయినీరు సేవలో, పూర్తికాల పరిచర్యలో పాలుపంచుకోవడమే. తమ పిల్లలు పాఠశాలకు వెళ్లినప్పుడు తల్లులు అనేకమంది ఈ విధమైన పరిచర్యలో భాగం వహిస్తున్నారు. తమ సొంత కుటుంబాల సంక్షేమంపట్ల శ్రద్ధచూపడంతోపాటు కాపరి సందర్శనాలుచేసే నమ్మకమైన పెద్దలు కూడా తమ పూర్ణబలంతో యెహోవాను ప్రేమిస్తున్నామని చూపిస్తున్నారు. (2 కొరింథీయులు 12:​15) తమకున్న బలాన్ని ఉపయోగిస్తూ తనను స్తుతించడం ద్వారా తమ ప్రేమను ప్రదర్శించగలిగేలా తనయందు నిరీక్షించువారికి యెహోవా బలమిస్తాడు.​—⁠యెషయా 40:29; హెబ్రీయులు 6:11, 12.

సరిగా పెంపొందించుకుంటే ప్రేమ పెరుగుతుంది. అందువల్ల మనం ధ్యానించడానికి నిరంతరం సమయం తీసుకుంటాం. మన కోసం యెహోవా చేసిన కార్యాలను అలాగే మన భక్తికి ఆయనెందుకు అర్హుడో మనం గుర్తుంచుకుంటాం. ఆదాము అపరిపూర్ణ సంతానముగా మనమెన్నటికీ ‘దేవుడు తన్ను ప్రేమించువారికొరకు సిద్ధపరచిన వాటికి’ అర్హులం కాలేము, అయితే మనకున్న సమస్తంతో మనం యెహోవాను ప్రేమిస్తున్నామని చూపించగలం. మనమలా నిర్విరామంగా చూపించుదాం.​—⁠1 కొరింథీయులు 2:9.

[20వ పేజీలోని చిత్రం]

క్రియల ద్వారా మనం దేవునిపట్ల మన ప్రేమను వ్యక్తపరుస్తాం