కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దైవిక సంతృప్తి నన్ను బలపరచింది

దైవిక సంతృప్తి నన్ను బలపరచింది

జీవిత కథ

దైవిక సంతృప్తి నన్ను బలపరచింది

బెంజమిన్‌ ఈకీచూకూ ఓస్వకే చెప్పినది

నేను క్రైస్తవ పరిచర్యలో పూర్తిగా భాగం వహించడం ఆరంభించిన వెంటనే, మా అమ్మానాన్నల దగ్గరకని ఇంటికి వెళ్లాను. నన్నుచూసిన వెంటనే మా నాన్న నా చొక్కా పుచ్చుకొని “దొంగ! దొంగ!” అని బిగ్గరగా అరవడం మొదలుపెట్టాడు. ఆయన కొడవలి తీసుకొని దాన్ని తిరగేసి నన్ను కొట్టాడు. ఆయన అరుపులు విన్న గ్రామస్థులు మా ఇంటి దగ్గర గుమికూడారు. నేనేమి దొంగతనం చేశాను? నన్ను వివరించనియ్యండి.

నేను నైజీరియాకు ఆగ్నేయంగా ఉన్న ఊమేరీయమ్‌ అనే గ్రామంలో 1930లో జన్మించాను. ఏడుగురు పిల్లల్లో నేనే మొదటివాణ్ణి. మా చెల్లెళ్లలో అందరికన్నా పెద్దది తన 13వ ఏట మరణించింది. మా తల్లిదండ్రులు ఆంగ్లికన్‌ చర్చి సభ్యులు. నాన్న వ్యవసాయదారుడు, అమ్మ చిన్నచిన్న సరుకులు అమ్ముకొచ్చేది. ఓ డబ్బాడు పామాయిల్‌ కొనడానికి ఆమె మా గ్రామానికి 30 కిలోమీటర్ల దూరంలోవున్న స్థానిక మార్కెట్టుకు నడిచివెళ్లి అదే రోజు సాయంత్రానికల్లా తిరిగి వచ్చేది. ఆ మరుసటి దినం ఉదయాన్నే ఆమె దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న రైల్వే స్టేషనుగల పట్టణానికి నడిచి వెళ్లి ఆ నూనె అమ్ముకొచ్చేది. సాధారణంగా 15 (అమెరికా) సెంట్లకు అటు ఇటుగా వచ్చే లాభంతో ఆమె కుటుంబం కోసం ఆహార పదార్ధాలు కొని అదే రోజు ఇంటికి తిరిగి వచ్చేది. ఆమె 1950లో చనిపోయేంతవరకు దాదాపు 15 సంవత్సరాలపాటు అదే ఆమె దినచర్య.

ఆంగ్లికన్‌ చర్చి నడిపే గ్రామ పాఠశాలలో నా విద్యాభ్యాసం ఆరంభమైంది, అయితే ప్రాథమిక పాఠశాల పూర్తిచేయడానికి నేను దాదాపు 35 కిలోమీటర్ల దూరంలోవున్న బోర్డింగ్‌ హౌస్‌లో ఉండాల్సివచ్చింది. పై చదువు చెప్పించడానికి మా తల్లిదండ్రుల దగ్గర డబ్బు లేనందువల్ల, నేను ఉద్యోగ వేటలో పడ్డాను. మొదట నేను పశ్చిమ నైజీరియాలోని లాగోస్‌లో రైల్వే గార్డు దగ్గర, ఆ తర్వాత ఉత్తర నైజీరియాలో ఉన్న కాడునాలో ఒక సివిల్‌ సర్వెంట్‌ దగ్గర ఇంటిమనిషిగా పనిచేశాను. నైజీరియాకు మధ్యపశ్చిమంగావున్న బెనిన్‌ నగరంలో ఓ న్యాయవాది దగ్గర నాకు గుమస్తా ఉద్యోగం దొరికింది, ఆ తర్వాత నేను ఒక రంపం మిల్లులో కూలివాడిగా పనిచేశాను. అక్కడ నుండి నేను 1953లో కామెరూన్‌కు మా కజిన్‌ దగ్గరకు వెళ్లాను, రబ్బర్‌ ప్లాంటేషన్‌లో ఉద్యోగం దొరకడానికి ఆయనే నాకు సహాయం చేశాడు. నా నెలసరి జీతం దాదాపు 420 రూపాయలు. నాకు చిన్న పనులే దొరికేవి, అయితే తినడానికి సరిపోయేటంత ఉన్నంతవరకు నేను తృప్తిగానే ఉండేవాణ్ణి.

ఒక దరిద్రుడు ధనం ఇవ్వడం

తోటి పనివాడైన సిల్వానూస్‌ ఓకేమీరీ యెహోవాసాక్షి. మేము గడ్డికోసి రబ్బరు చెట్ల మొదళ్లచుట్టు ఎరువు వేసేటప్పుడు అవకాశం దొరికినప్పుడల్లా ఆయన నాతో బైబిలు పరిజ్ఞానాన్ని పంచుకునేవాడు. ఆయన చెప్పేది నేను విన్నా, అప్పట్లో అంతకంటే ఇంకేమీ చేయలేదు. అయితే నాకు యెహోవాసాక్షులతో పరిచయముందని తెలుసుకున్నప్పుడు నా కజిన్‌ నన్ను నిరుత్సాహపరచడానికి శాయశక్తులా ప్రయత్నించాడు. “బెంజీ, మిస్టర్‌ ఓకేమీరీ దగ్గరకు వెళ్లొద్దు. అతను యెహోవా మనిషి, పరమ దరిద్రుడు. అతనితో స్నేహంచేసేవారెవరైనా అతనిలాగే తయారౌతారు” అని నన్ను హెచ్చరించాడు.

ఆ కంపెనీలోని కఠోరమైన పని పరిస్థితులు ఇక తట్టుకోలేక 1954 ఆరంభంలో నేను ఇంటికి తిరిగొచ్చాను. ఆ రోజుల్లో ఆంగ్లికన్‌ చర్చి నైతిక విషయాల్లో కాస్తంత ఖచ్చితంగా ఉండేది. లైంగిక దుర్నీతిని అసహ్యించుకునే స్థితికి నేను ఎదిగాను. అయితే త్వరలోనే, చర్చికి వెళ్లేవారి వేషధారణ నాకు ఏవగింపు కలిగించింది. బైబిలు ప్రమాణాలు పాటిస్తామని గట్టిగా చెప్పుకున్నా, వారి జీవన శైలి వారి వాదనకు విరుద్ధంగా ఉండేది. (మత్తయి 15:⁠7) నేను మా నాన్నతో అనేకమార్లు వాదించాను, అవి మా సంబంధాన్ని తీవ్రంగా దెబ్బతీసాయి. ఒకరోజు రాత్రి నేను ఇల్లు విడిచి వెళ్లిపోయాను.

అక్కడనుండి నేను చిన్న రైల్వే స్టేషనుగల పట్టణమైన ఓమోబాకు వెళ్లాను. అక్కడ నాకు మళ్లీ యెహోవాసాక్షులు తారసపడ్డారు. మా గ్రామంలో నాకు తెలిసిన ప్రిసిల్లె ఈసీయోక నాకు “ఈ రాజ్య సువార్త,” అర్మగిద్దోను తర్వాత​—⁠దేవుని నూతనలోకం * (ఆంగ్లం) అనే రెండు చిన్న పుస్తకాలు ఇచ్చింది. నేను ఆత్రంగా వాటిని చదివి, నాకు సత్యం లభించిందని బలంగా నమ్మాను. మా చర్చిలో మేము బైబిలు అధ్యయనం చేయలేదు; మేము మానవ పారంపర్యాచారాల మీదే దృష్టి నిలిపాం. అయితే సాక్షుల సాహిత్యాల్లో బైబిలు వచనాలు ధారాళంగా ఉపయోగించబడ్డాయి.

నెల తిరక్కుండానే నేను ఈసీయోక దంపతులను వారు ఏ రోజు తమ చర్చికి వెళతారని అడిగాను. మొదటిసారి నేను యెహోవాసాక్షుల కూటానికి హాజరైనప్పుడు అక్కడ నాకేమీ అర్థంకాలేదు. కావలికోట (ఆంగ్లం) ఆర్టికల్‌ యెహెజ్కేలు ప్రవచన గ్రంథంలో పేర్కొనబడిన ‘మాగోగు వాడైన గోగు’ చేసే దాడి గురించి చర్చించింది. (యెహెజ్కేలు 38:​1, 2) అందులోని అనేక పదాలు నాకు కొత్తగా అనిపించాయి, అయితే అక్కడ నన్ను ఆప్యాయంగా స్వాగతించిన తీరు నన్ను ఎంతగా ఆకట్టుకుందంటే మరుసటి ఆదివారం తిరిగివెళ్లాలని తీర్మానించుకున్నాను. రెండవ కూటం జరిగినప్పుడు, నేను ప్రకటించడం గురించి విన్నాను. అందువల్ల వారు ఏ రోజు ప్రకటించడానికి వెళతారని నేను ప్రిసిల్లెను అడిగాను. మూడవ ఆదివారం చిన్న బైబిలు పుచ్చుకుని నేను కూడా వారివెంట ప్రకటించడానికి వెళ్లాను. నాకు ప్రీచింగ్‌ బ్యాగులేదు, బైబిలు సాహిత్యాలు లేవు. అయినప్పటికీ, నేను రాజ్య ప్రచారకుణ్ణయి, ఆ నెలాఖరున క్షేత్రసేవా రిపోర్టు ఇచ్చాను.

నాతో ఎవ్వరూ బైబిలు అధ్యయనం చేయలేదు, అయితే నేను ఈసీయోక దంపతుల దగ్గరకు వెళ్లినప్పుడల్లా లేఖనాలనుండి విశ్వాసానికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకొని ప్రోత్సాహం పొందేవాడిని, కొన్ని బైబిలు సాహిత్యాలు తెచ్చుకునేవాడిని. 1954 డిసెంబరు 11న, ఆబాలో జరిగిన జిల్లా సమావేశంలో యెహోవాకు నా సమర్పణకు సూచనగా బాప్తిస్మం తీసుకున్నాను. నేను కలిసి నివసించిన, కలిసి అప్రెంటీస్‌ చేసిన నా కజిన్‌ నాకు భోజనం పెట్టడం, శిక్షణ ఇవ్వడం మానేసి నేను చేసిన పనికి నాకు ఒక్క పైసాకూడా చెల్లించలేదు. అయినా నేను ఆయనపై కోపగించుకోలేదు; దేవునితో నాకు వ్యక్తిగత సంబంధం ఉన్నందుకు కృతజ్ఞతతో ఉండిపోయాను. ఇది నాకు ఓదార్పును, మనశ్శాంతిని ఇచ్చింది. స్థానిక సాక్షులు నన్ను ఆదుకున్నారు. ఈసీయోక దంపతులు నాకు ఆహారమివ్వగా చిన్న వ్యాపారం మొదలుపెట్టడానికి మరికొందరు నాకు డబ్బు అప్పుగా ఇచ్చారు. 1955 మధ్యకాలంలో నేను ఒక సెకండ్‌ హ్యాండ్‌ సైకిల్‌ కొనుక్కుని, 1956 మార్చిలో క్రమ పయినీరు సేవ చేపట్టాను. ఆ తర్వాత కొద్దికాలానికే నేను నా అప్పులు తీర్చేశాను. వ్యాపారంలో దొరికే లాభం కొద్దిపాటిదైనా, నన్ను నేను పోషించుకోగలిగాను. యెహోవా నాకు దయచేస్తూ వచ్చినవి నాకు సరిపోయాయి.

నా తోబుట్టువులను “దొంగిలించడం”

నేను నా కాళ్లపై నిలబడిన వెంటనే, నా మొదటి చింత నా తోబుట్టువులకు ఆధ్యాత్మికంగా సహాయం చేయడం. నాన్న తన దురభిమానం, తీవ్రమైన అపనమ్మకం కారణంగా నేను సాక్షికావడాన్ని వ్యతిరేకించాడు. అలాంటప్పుడు నా తోబుట్టువులు బైబిలు సత్యం నేర్చుకునేలా నేనెలా వారికి సహాయం చేయగలను? నా తమ్ముడైన ఎర్నెస్ట్‌ను నా దగ్గర ఉంచుకుంటానని చెప్పినప్పుడు నాన్న దానికి సమ్మతించాడు. ఎర్నెస్ట్‌ త్వరితగతిన సత్యం హత్తుకొని 1956లో బాప్తిస్మం తీసుకున్నాడు. వాడు మారడం మా నాన్న మరింత వ్యతిరేకించేలా చేసింది. అదలావుండగా, అప్పటికే వివాహం చేసుకున్న మా చెల్లి తన భర్తతోపాటు సత్యంలోకి వచ్చింది. మా రెండవ చెల్లి ఫెలిషీయా తన పాఠశాల సెలవులు నా దగ్గర గడిపేలా ఏర్పాటు చేసినప్పుడు, నాన్న అయిష్టంగానే ఒప్పుకున్నాడు. త్వరలోనే ఫెలిషీయా ఒక యెహోవాసాక్షిగా బాప్తిస్మం తీసుకొంది.

ఎర్నెస్ట్‌తో ఉండడానికి నేను మా మూడవ చెల్లి బెర్నిస్‌ను తీసుకొద్దామని 1959లో ఇంటికి వెళ్లాను. అప్పుడే మా నాన్నగారు తన పిల్లలను నేను దొంగిలిస్తున్నానని ఆరోపిస్తూ నామీద దాడిచేశారు. వారు యెహోవాను సేవించాలని వ్యక్తిగతంగా నిర్ణయించుకున్నారని ఆయన గ్రహించలేదు. బెర్నిస్‌ను నాతో పంపనుగాక పంపనని నాన్న మొండికేశాడు. అయితే యెహోవా హస్తం కురచకాదు, ఎందుకంటే బెర్నిస్‌ మరుసటి సంవత్సరమే ఎర్నెస్ట్‌తో తన పాఠశాల సెలవులు గడపడానికి వచ్చింది. తన అక్కల మాదిరిగానే, ఆమె కూడా సత్యాన్ని హత్తుకొని బాప్తిస్మం తీసుకొంది.

‘ఆ రహస్యమేమిటో నేర్చుకోవడం’

1957 సెప్టెంబరులో నేను ప్రతీనెలా 150 గంటలు ప్రకటనా పనిలో గడుపుతూ ప్రత్యేక పయినీరు సేవ ఆరంభించాను. నా భాగస్వామి సండే ఈరోబేలకీ నేనూ, ఏకేలోవున్న విస్తారమైన అక్పూనబూవ సేవా క్షేత్రంలో సేవచేశాము. మేము అక్కడ ఉంటుండగానే మొదటిసారి ప్రాంతీయ సమావేశంలో మా గుంపులో నుండి 13 మంది బాప్తిస్మం తీసుకున్నారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో 20 సంఘాలు ఉండడం చూస్తుంటే ఎంత సంతోషం కలుగుతుందో!

1958లో, ఆబా తూర్పు సంఘంలో క్రమ పయినీరు సేవచేస్తున్న క్రిస్టియానా ఆస్వికే నాకు పరిచయమైంది. ఆమె ఆసక్తి నన్ను ముగ్ధుణ్ణి చేసింది, అదే సంవత్సరం డిసెంబరులో మేము పెళ్లిచేసుకున్నాం. 1959 ఆరంభంలో నేను మన ఆధ్యాత్మిక సహోదరుల సంఘాలను సందర్శిస్తూ, బలపరిచేందుకు ప్రయాణ పైవిచారణకర్తగా నియమించబడ్డాను. అప్పటినుండి 1972 వరకు నేను, నా భార్య కలిసి దాదాపు తూర్పు, మధ్య పశ్చిమ నైజీరియాలో ఉన్న యెహోవా ప్రజల సంఘాలన్నింటినీ సందర్శించాం.

సంఘాలు దూర దూరంగా ఉండేవి, మా ప్రాథమిక రవాణా ఆధారం సైకిలే. పెద్ద పట్టణాల్లోని సంఘాల్లో మేము సేవచేసినప్పుడు, మమ్మల్ని తర్వాతి సంఘానికి తీసుకెళ్లడానికి సహోదరులు టాక్సీ బాడుగకు తీసుకొనేవారు. కొన్ని సందర్భాల్లో మేమున్న గదుల్లో మట్టినేల ఉండి వాటికి సీలింగ్‌ ఉండేది కాదు. మేము రాఫియా గుంజలతో చేసిన మంచాలపై పడుకొన్నాం. కొన్ని పడకలమీద చాపకప్పిన, గడ్డితోచేసిన పరుపు ఉంటే మరికొన్నింటికి పరుపులే ఉండేవి కావు. ఆహార పరిమాణం, నాణ్యత మాకు సమస్య కాలేదు. తక్కువలోనే తృప్తిగా ఉండడాన్ని గతంలో నేర్చుకున్న కారణంగా, మాకు ఎలాంటి ఆహారమిచ్చినా మేము ఆనందంగా స్వీకరించేవాళ్లం, మా అతిథేయులు మా స్వభావాన్ని మెచ్చుకున్నారు. ఆ రోజుల్లో కొన్ని నగరాల్లో విద్యుత్తు లేదు, అందువల్ల మేమన్ని సందర్భాల్లో మాతోపాటు కిరోసిన్‌ లాంతర్లు తీసుకెళ్లేవాళ్లం. అయితే, మాకు కష్టపరిస్థితులు ఎదురైనప్పటికీ సంఘాలతో మేము ఆనందంగా గడిపిన సమయాలు చాలావున్నాయి.

ఆ సంవత్సరాల్లో మేము “అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము” అని అపొస్తలుడైన పౌలు ఇచ్చిన ఉపదేశపు విలువను గ్రహించాము. (1 తిమోతి 6:⁠7) ప్రతికూల పరిస్థితుల నుండి, తృప్తి కలిగి ఉండడానికి సహాయం చేసిన ఒక రహస్యాన్ని పౌలు నేర్చుకున్నాడు. ఏమిటా రహస్యం? ఆయనిలా వివరించాడు: “దీనస్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును; ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండియుండుటకును ఆకలిగొనియుండుటకును, సమృద్ధి కలిగియుండుటకును లేమిలో ఉండుటకును [“ఆ రహస్యమేమిటో,” NW] నేర్చుకొనియున్నాను.” మేము కూడా ఆ రహస్యం నేర్చుకున్నాము. పౌలు ఇంకా ఇలా అన్నాడు: “నన్ను బలపరచువానియందే [దేవునియందే] నేను సమస్తమును చేయగలను.” (ఫిలిప్పీయులు 4:​12, 13) మా విషయంలో అదెంత నిజమని నిరూపించబడిందో గదా! మేము సంతృప్తితో, పూర్తిస్థాయి ప్రోత్సాహకరమైన క్రైస్తవ కార్యకలాపాలతో, మనశ్శాంతితో ఆశీర్వదించబడ్డాం.

ఒక కుటుంబంగా సంఘాల్లో సేవచేయడం

1959 చివర్లో మా పెద్ద కుమారుడు జోయెల్‌, ఆ తర్వాత 1962లో మా రెండవ కుమారుడు సామ్యుల్‌ జన్మించారు. క్రిస్టియానా, నేను పిల్లలతోపాటు సంఘాలు సందర్శిస్తూ ప్రయాణ సేవలో కొనసాగాము. 1967లో నైజీరియా అంతర్యుద్ధం ఆరంభమైంది. ఎడతెగని విమాన దాడుల కారణంగా పాఠశాలలు మూసివేశారు. ప్రయాణ సేవలో నాతోపాటు రావడానికి ముందు నా భార్య పాఠశాల ఉపాధ్యాయినిగా పనిచేసింది, అందువల్ల యుద్ధకాలంలో ఆమె పిల్లలకు ఇంటి దగ్గరే పాఠాలు నేర్పించింది. ఆరు సంవత్సరాల వయస్సు వచ్చేటప్పటికి సామ్యుల్‌ చదవడం, వ్రాయడం నేర్చుకున్నాడు. యుద్ధం ముగిసిన తర్వాత వాడు పాఠశాలకు వెళ్లినప్పుడు తోటి విద్యార్థులకంటే రెండు తరగతులు ముందుకు వెళ్లాడు.

ప్రయాణ సేవలో ఉంటూనే పిల్లల్ని పెంచడంలోని కష్టాలను మేము ఆ కాలంలో పూర్తిగా గ్రహించలేదు. అయితే, 1972లో ప్రత్యేక పయినీర్లుగా నియమించబడడం మాకు ప్రయోజనమిచ్చింది. దీని కారణంగా మేము ఒకే స్థలంలో ఉండి మా కుటుంబ ఆధ్యాత్మికతపట్ల తగిన శ్రద్ధనివ్వడానికి వీలయ్యింది. మొదట్నుంచి మేము దైవిక సంతృప్తిలోని విలువను మా కుమారులకు నేర్పించాము. 1973లో సామ్యుల్‌ బాప్తిస్మం తీసుకోగా, అదే సంవత్సరం జోయెల్‌ క్రమ పయినీరు సేవ చేపట్టాడు. మా ఇద్దరు కుమారులు చక్కని క్రైస్తవ స్త్రీలను పెండ్లి చేసుకొని సత్యంలో వారి కుటుంబాలను పైకి తీసుకొస్తున్నారు.

అంతర్యుద్ధ విషాదకర పరిస్థితి

అంతర్యుద్ధం మొదలైనప్పుడు, ఓనీచాలో ప్రయాణ పైవిచారణకర్తగా నేను కుటుంబ సమేతంగా ఒక సంఘంలో సేవచేస్తున్నాను. వస్తుసంపదను సమకూర్చుకోవడంలోని, వాటిని నమ్ముకోవడంలోని వ్యర్థతను ఆ యుద్ధం మరింతగా మా మనస్సులపై ముద్రవేసింది. ప్రజలు తమ విలువైన వస్తువులను వీధుల్లో విడిచిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగెత్తడం నేను కళ్లారా చూశాను.

యుద్ధం ముమ్మరం అవుతుండగా, పుష్ఠిగావున్న పురుషులందరు సైన్యంలోకి చేర్చుకోబడ్డారు. సైన్యంలో చేరడానికి నిరాకరించిన చాలామంది సహోదరులు చిత్రహింసల పాలయ్యారు. మేము స్వేచ్ఛగా ఎటూ కదలలేకపోయాము. దేశంలో తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. అరకిలో కస్సావా ఖరీదు 3 రూపాయల నుండి 660 రూపాయలకు, కప్పు ఉప్పు 380 రూపాయల నుండి 2000 రూపాయలకు పెరిగిపోయింది. పాలు, వెన్న, పంచదార కనుమరుగయ్యాయి. ప్రాణాలు నిలబెట్టుకోవడానికి మేము పచ్చి బొప్పాయిని ముద్దగా నూరి దానిలో కొద్దిగా కస్సావా పిండి కలుపుకొని తినేవాళ్లం. మిడతలు, కస్సావా తొక్కలు, మందార ఆకులు, ఎలిఫెంట్‌ గడ్డి ఇలా మాకు ఏ ఆకులు దొరికితే ఆ ఆకులు తిన్నాము. మాంసం ధర చుక్కల్లో ఉండేది అందుకని పిల్లలు తినడానికి నేను ఉడుముల్ని పట్టితెచ్చేవాడిని. అలా పరిస్థితులు ఎంత దిగజారినా, అన్ని సందర్భాల్లో యెహోవా మమ్మల్ని ఆదుకున్నాడు.

అయితే యుద్ధంవలన ఏర్పడిన ఆధ్యాత్మిక ఆహారపు కొరత మరింత ప్రమాదకరంగా ఉంది. యుద్ధ ప్రాంతం నుండి అనేకమంది సహోదరులు అడవుల్లోకి లేదా ఇతర గ్రామాల్లోకి పారిపోయారు, ఆ పరిస్థితుల్లో వారు తమ బైబిలు సాహిత్యాలను అంతాకాకపోయినా చాలామట్టుకు పోగొట్టుకున్నారు. దానికితోడు, ప్రభుత్వ దళాలు రాకపోకలను నిషేధించడంతో బయఫ్రా ప్రాంతానికి కొత్త బైబిలు సాహిత్యాల సరఫరా ఆగిపోయింది. చాలా సంఘాలు కూటాలు జరుపుకోవడానికి ప్రయత్నించినా సహోదరుల ఆధ్యాత్మికత దెబ్బతిన్నది, ఎందుకంటే బ్రాంచి కార్యాలయమిచ్చే మార్గనిర్దేశం వారివరకు చేరలేకపోయింది.

ఆధ్యాత్మిక ఆకలిని జయించడం

సంఘాలను సందర్శించే ఏర్పాటును కొనసాగించడానికి ప్రయాణ పైవిచారణకర్తలు తమ శాయశక్తులా ప్రయత్నించారు. చాలామంది సహోదరులు పట్టణాలు విడిచి పారిపోయిన కారణంగా వారు ఎక్కడెక్కడ ఉండే అవకాశముందో ఆ చోటల్లా నేను వారికోసం వెదికాను. ఓ సందర్భంలో నేను, నా భార్యా పిల్లలను ఒక సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టి, సహోదరులకోసం వెదకుతూ ఆరు వారాలపాటు వివిధ గ్రామాలు, అడవి ప్రాంతాలు సందర్శించాను.

ఓబూంకా సంఘంలో సేవచేస్తున్న సమయంలో, ఓకీగ్వే జిల్లాలో ఈసూయోచీ ప్రాంతంలో సాక్షుల ఒక పెద్ద గుంపు ఉందని నాకు తెలిసింది. అందువల్ల ఆ ప్రాంతంలోని సహోదరులు ఊమ్వాకూ గ్రామం దగ్గర జీడిమామిడి తోటలో సమావేశం కావలసిందిగా వారికి కబురు పంపాను. నేను మరో వృద్ధ సహోదరుడు సైకిలుపై దాదాపు 15 కిలోమీటర్ల దూరంలోవున్న ఆ తోటకు వెళ్లాము. అక్కడ స్త్రీలు, పిల్లలతోసహా దాదాపు 200 మంది సాక్షులు సమకూడారు. ఒక పయినీరు సహోదరి సహాయంతో, లోమారా అడవి ప్రదేశంలో ఆశ్రయం పొందుతున్న దాదాపు 100 మంది సాక్షుల మరో గుంపును కనుక్కోగలిగాను.

యుద్ధంతో ఛిన్నాభిన్నమైన ఓవెరీ పట్టణంలో నివసిస్తున్న ధైర్యస్థులైన సహోదరుల గుంపులో లారెన్స్‌ ఊగ్వేబూ ఒకరు. ఓహాజీ ప్రాంతంలో చాలామంది సాక్షులున్నారని ఆయన నాకు తెలియజేశాడు. ఆ ప్రాంతాన్ని సైనికులు ఆక్రమించుకున్న కారణంగా వారు స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు. రాత్రిపూట మేమిద్దరం సైకిళ్లపై అక్కడికివెళ్లి ఒక సహోదరుని ఇంటి ఆవరణలో దాదాపు 120 మంది సాక్షులను కలుసుకున్నాం. అజ్ఞాత ప్రాంతాల్లో దాక్కున్న ఇతర సాక్షులను సందర్శించేలా మేము ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం.

అక్కడక్కడ చెదిరివున్న సహోదరులను కనుక్కోవడానికి నాకు సహాయం చేయడంలో సహోదరుడు ఐసక్‌ న్వాగూ తన ప్రాణాలమీదకే తెచ్చుకున్నాడు. ఇగ్బూ-ఏట్చేలో సమకూడిన 150కి పైగా సాక్షులను కలుసుకోవడానికి ఆయన నన్ను పడవలో ఓటమీరీ నది దాటించాడు. అక్కడ ఒక సహోదరుడు సంతోషం పట్టలేక “ఇది నా జీవితంలో చాలాగొప్ప రోజు! ప్రయాణ పైవిచారణకర్తను మళ్లీ చూడ్డానికి నేను బ్రతికుంటానని అసలు తలంచలేదు. ఈ యుద్ధం ఎక్కువై నేనొకవేళ చనిపోయినా, నాకేం ఫరవాలేదు” అని బిగ్గరగా అన్నాడు.

సైన్యంలో నిర్బంధ భర్తీ ప్రమాదంలో నేను ఉన్నప్పటికీ, యెహోవా కాపుదలను నేను పదే పదే చవిచూశాను. ఓ రోజు మధ్యాహ్నం, దాదాపు 250 మంది సహోదరులను కలిసి ఇంటికి తిరిగివస్తుండగా, మిలిటరీ కమెండోల గుంపొకటి ఒక రోడ్డు అవరోధం దగ్గర నన్ను ఆపుజేశారు. “నువ్వెందుకు సైన్యంలో చేరలేదు?” అని వారడిగారు. నేను దేవుని రాజ్యాన్ని ప్రకటించే మిషనరీనని వివరించాను. నన్ను అరెస్టు చేయడానికే వారు తీర్మానించుకున్నారని నేను గ్రహించాను. వెంటనే మనస్సులో మౌనంగా ప్రార్థించుకొని “దయచేసి నన్ను విడిచిపెట్టండి” అని వారి కెప్టెనుకు చెప్పాను. ఆశ్చర్యకరంగా ఆయన “నిన్ను వెళ్లి పోనివ్వమంటున్నావా?” అని అడిగాడు. అందుకు నేను “అవును, నన్ను విడిచిపెట్టండి” అన్నాను. అందుకాయన “నువ్వు వెళ్లవచ్చు” అని చెప్పాడు. ఆ సైనికుల్లో ఇక ఎవ్వరూ మారు మాట్లాడలేదు.​—⁠కీర్తన 65:1, 2.

తృప్తి మరిన్ని ఆశీర్వాదాలు తీసుకురావడం

1970లో యుద్ధం ముగిసిన తర్వాత, నేను ప్రాంతీయ సేవచేయడంలో కొనసాగాను. సంఘాల పునర్వ్యవస్థీకరణలో సహాయం చేయడం నాకు లభించిన గొప్ప ఆధిక్యత. ఆ తర్వాత నేను, క్రిస్టియానా 1976 వరకు ప్రత్యేక పయినీర్లుగా సేవచేసిన తర్వాత నేను మళ్లీ ఒకసారి ప్రయాణ పైవిచారణకర్తగా నియమించబడ్డాను. ఆ సంవత్సరం మధ్యకల్లా నేను జిల్లాసేవకు నియమించబడ్డాను. ఏడు సంవత్సరాల తర్వాత నేను, నా భార్య యెహోవాసాక్షుల నైజీరియా బ్రాంచి కార్యాలయంలో సేవ చేయడానికి ఆహ్వానించబడ్డాం, ప్రస్తుతం అదే మా గృహం. అంతర్యుద్ధకాలంలో, ఇతర సమయాల్లో మేము కలిసిన సహోదరులు ఇంకా యెహోవాను నమ్మకంగా సేవచేయడాన్ని ఇక్కడ బ్రాంచి కార్యాలయంలో చూడడం మాకు అన్ని సందర్భాల్లో ఆనందం కలిగించే విషయం.

గడచిన సంవత్సరాలన్నింటిలో, క్రిస్టియానా నాకు చక్కని తోడ్పాటుగా, యథార్థమైన సహవాసిగా ఉంది. 1978 నుండి ఆమె సహిస్తూవస్తున్న వదలని ఆరోగ్య సమస్యల మధ్యనూ తన అనుకూలమైన, దృఢసంకల్పంగల స్వభావం నేను నా బాధ్యతలు నెరవేర్చడానికి నాకెంతో సహాయం చేసింది. “రోగశయ్యమీద యెహోవా వానిని ఆదరించును” అని పలికిన కీర్తనకర్త మాటల సత్యసంధతను మేము చవిచూశాము.​—⁠కీర్తన 41:⁠3.

దైవపరిపాలనా కార్యకలాపాల ఈ సంవత్సరాలను ఒకసారి వెనుకకు తిరిగిచూసినప్పుడు, యెహోవా అద్భుతకరమైన ఆశీర్వాదాలనుబట్టి ఆయనకు కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేను. ఆయన దయచేసే వాటితో తృప్తి కలిగి ఉండడం ద్వారా నేను గొప్ప సంతోషం అనుభవించానని నిజంగా చెప్పగలను. నా తోబుట్టువులు, పిల్లలు, వారి కుటుంబాల సభ్యులు, అందరూ నాతో నా భార్యతో కలిసి యెహోవాను సేవించడం నిరుపమాన ఆశీర్వాదం. సుసంపన్నమైన, అర్థవంతమైన జీవితంతో యెహోవా నన్ను తృప్తిపరిచాడు. నా కోరికల్లో ఏదీ నెరవేరకుండా ఉండలేదు.

[అధస్సూచి]

^ పేరా 10 యెహోవాసాక్షులు ప్రచురించినవి. ఇవిప్పుడు ముద్రణలో లేవు.

[27వ పేజీలోని బాక్సు]

సహోదరత్వాన్ని బలపరిచేందుకు ఒక సమయోచిత ఏర్పాటు సహాయం చేసింది

1960వ దశాబ్ద మధ్యకాలంలో, నైజీరియా ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో జాతి వర్గాల మధ్య చెలరేగిన శత్రుత్వం కల్లోలానికి, తిరుగుబాటుకు, అరాచకానికి, జాతి హింసకు దారితీసింది. ఈ పరిణామాలు ఆ పోరాటంలో ఖచ్చితమైన తటస్థత పాటించడానికి తీర్మానించుకున్న యెహోవాసాక్షులపై తీవ్రమైన శ్రమలు తీసుకొచ్చాయి. దాదాపు 20 మంది హత్యచేయబడ్డారు. అత్యధికులు తమ ఆస్తులన్నీ పోగొట్టుకున్నారు.

1967 మే 30న నైజీరియా తూర్పు రాష్ట్రాలు సమైక్య రాజ్యకూటమి నుండి విడిపోయి రిపబ్లిక్‌ ఆఫ్‌ బయఫ్రాగా అవతరించాయి. సమైక్య రాజ్యకూటపు సైన్యం రంగంలోకి దిగి బయఫ్రా నుండి రాకపోకలను పూర్తిగా నిషేధించాయి. దాంతో హింసారక్తపాతాల అంతర్యుద్ధం చెలరేగింది.

బయఫ్రా ప్రాంతంలోని యెహోవాసాక్షుల తటస్థ వైఖరి వారిని దాడికి లక్ష్యాలుగా చేసింది. వారికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని రెచ్చగొడుతూ వార్తాపత్రికలు వారిపై తీవ్రమైన ఆక్షేపణలు చేశాయి. అయితే, యెహోవా తన సేవకులు తప్పిపోకుండా ఆధ్యాత్మిక ఆహారం అందుకునేలా చూశాడు. ఏ విధంగా?

1968లో అటు ఐరోపాలో ఒక అధికారి ఇటు బయఫ్రా విమానాలు దిగేచోట ఒక అధికారి నియమించబడ్డారు. వారిద్దరూ యెహోవాసాక్షులే. వారి ఉద్యోగాలు, బయఫ్రాకు బయటి ప్రపంచానికి ఉన్న ఒకే ఒక మార్గానికి ఇరువైపులా వారిద్దరు ఉండేలా చేశాయి. ఈ ఇద్దరు సాక్షులు బయఫ్రాకు ఆధ్యాత్మిక ఆహారం సరఫరాచేసే ప్రమాదకరమైన పని చేపట్టడానికి ముందుకొచ్చారు. విపద్దశలో ఉన్న మన సహోదరులకు సహాయ సామగ్రి అందజేయడంలో కూడా వారు సహాయం చేశారు. యుద్ధం జరుగుతున్న కాలమంతటిలో ఈ ఇద్దరు సహోదరులు ఈ ఆవశ్యక ఏర్పాటు నిరాటంకంగా కొనసాగేలా చూడగలిగారు. ఆ యుద్ధం 1970లో ముగిసింది. ఆ తర్వాత వారిలో ఒకరు ఇలా అన్నారు: “ఇది మానవులు పథకంవేయలేని ఏర్పాటు.”

[23వ పేజీలోని చిత్రం]

1956లో

[25వ పేజీలోని చిత్రం]

1965లో మా కుమారులు జోయెల్‌, సామ్యుల్‌లతో

[26వ పేజీలోని చిత్రం]

ఒక కుటుంబంగా యెహోవాను సేవించడం ఎంతటి ఆశీర్వాదమో గదా!

[27వ పేజీలోని చిత్రం]

నేడు, క్రిస్టియానా నేను నైజీరియా బ్రాంచిలో సేవచేస్తున్నాం