కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన ‘దాసుడు’

నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన ‘దాసుడు’

నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన ‘దాసుడు’

‘యజమానుడు తన యింటివారిపై ఉంచిన నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు?’​—⁠మత్తయి 24:45.

యేసు శిష్యులు సా.శ. 33 నీసాను 11 మంగళవారం మధ్యాహ్నం, నేడు మనకొరకు లోతైన భావాన్నిచ్చే ఒక ప్రశ్న లేవదీశారు? ఆయనను వారిలా అడిగారు: “నీ రాకడకును [‘ప్రత్యక్షతకును’ NW] ఈ యుగసమాప్తికిని సూచనలేవి?” దానికి జవాబిస్తూ యేసు విశిష్టమైన ఒక ప్రవచనం చెప్పాడు. భీకరమైన యుద్ధాలు, కరవులు, భూకంపాలు, వ్యాధులు ప్రబలే కాలం గురించి ఆయన మాట్లాడాడు. అవి కేవలం “వేదనలకు ప్రారంభము” మాత్రమే. పరిస్థితులు మరింత దిగజారిపోతాయి. అదెంత భయానకమైన దృశ్యమో గదా!​—⁠మత్తయి 24:3, 7, 8, 15-22; లూకా 21:10, 11.

2 యేసు ప్రవచనంలోని అనేక అంశాలు 1914 నుండి నెరవేరుతున్నాయి. మానవాళిపై “వేదనలు” పూర్తిస్థాయిలో ప్రభావం చూపుతున్నాయి. అయినప్పటికీ, నిజ క్రైస్తవులు భయపడనక్కరలేదు. వారికి పుష్టికరమైన ఆధ్యాత్మిక ఆహారమిచ్చి బలపరుస్తానని యేసు వాగ్దానం చేశాడు. యేసు ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు కాబట్టి, ఇక్కడ భూమ్మీదున్న మనకు ఆధ్యాత్మిక ఆహారం లభించే ఏర్పాటు ఆయనెలా చేశాడు?

3 ఆ ప్రశ్నకు యేసే స్వయంగా జవాబిచ్చాడు. ఆయన తన గొప్ప ప్రవచనంలో ఇలా అడిగాడు: “యజమానుడు తన యింటివారికి తగినవేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు?” ఆ పిమ్మట ఆయనిలా చెప్పాడు: “యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తిమీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.” (మత్తయి 24:​45-47) అవును, ఆధ్యాత్మిక ఆహారం అందించడానికి నియమించబడిన ఒక ‘దాసుడు’ ఉంటాడు, అతడు నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన ‘దాసునిగా’ ఉంటాడు. ఆ దాసుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తా, అనుక్రమంగా వచ్చే వ్యక్తులా లేక మరో రకంగా ఉంటాడా? ఆ నమ్మకమైన దాసుడు అత్యావశ్యకమైన ఆధ్యాత్మిక ఆహారం అందజేస్తాడు కాబట్టి, దానికి జవాబేమిటో మనం ఆసక్తిగా తెలుసుకోవాలి.

ఒక వ్యక్తా లేక ఒక తరగతా?

4 “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” ఒకే వ్యక్తి కానేరడు. ఎందుకు? ఎందుకంటే ఆ దాసుడు పూర్వం మొదటి శతాబ్దంలోనే ఆధ్యాత్మిక ఆహారం అందించడం మొదలుపెట్టాడు, యేసు చెప్పిన ప్రకారం యజమానుడు 1914లో వచ్చినప్పుడు కూడా ఆ దాసుడు ఇంకా ఆ పని చేస్తూనే ఉంటాడు. అంటే అది ఒకే వ్యక్తి 1,900 సంవత్సరాల నుండి నమ్మకమైన సేవ చేస్తున్నాడనే భావమిస్తుంది. మెతూషెల సైతం అంతకాలం జీవించలేదు.​—⁠ఆదికాండము 5:27.

5 అలాగని “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” అనే మాట సాధారణ భావంలో ప్రతీ క్రైస్తవునికి వర్తిస్తుందా? నిజమే క్రైస్తవులందరూ నమ్మకంగా, బుద్ధిమంతులుగా ఉండాలి; అయితే “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని” గురించి మాట్లాడినప్పుడు యేసు మదిలో ఇంకా ఎక్కువ భావంగల విషయమేదో ఉందని స్పష్టమవుతోంది. ఆ విషయం మనకెలా తెలుసు? ఎలాగంటే “యజమానుడు వచ్చినప్పుడు” ఆయన ఆ దాసుణ్ణి ‘తన యావదాస్తి మీద’ నియమిస్తాడని యేసు చెప్పాడు. అన్నింటిమీద అంటే యజమాని “యావదాస్తిమీద” ఒకొక్క క్రైస్తవుడు ఎలా నియమించబడగలడు? అది అసాధ్యం!

6 కాబట్టి “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు[నిగా]” యేసు క్రైస్తవుల గుంపును సూచిస్తున్నాడనేదే సమంజసం. ఒక సంయుక్త దాసుడు ఉండడం సాధ్యమేనా? సాధ్యమే. క్రీస్తుకు ఏడు వందల సంవత్సరాల పూర్వం యావత్‌ ఇశ్రాయేలు జనాంగాన్ని యెహోవా “నాకు సాక్షులు” అనీ, ‘నేను ఏర్పరచుకొనిన నా సేవకుడు’ అనీ పేర్కొన్నాడు. (యెషయా 43:​10) మోషే ధర్మశాస్త్రం ఇవ్వబడిన సా.శ.పూ. 1513 మొదలుకొని సా.శ. 33 పెంతెకొస్తు వరకు ఇశ్రాయేలు జనాంగంలోని ప్రతీ సభ్యుడు ఈ సేవకుని తరగతిలో భాగమే. ఇశ్రాయేలీయుల్లో అత్యధికులకు జనాంగ వ్యవహారాల నిర్వహణలో లేదా దాని ఆధ్యాత్మిక పోషణ కార్యక్రమాన్ని సమన్వయపరచడంలో నేరుగా సంబంధం లేదు. ఆ పనులు నిర్వహించడానికి యెహోవా రాజులను, న్యాయాధిపతులను, ప్రవక్తలను, యాజకులను, లేవీయులను ఉపయోగించాడు. అయినప్పటికీ, ఇశ్రాయేలు ఒక జనాంగంగా యెహోవా సర్వాధిపత్యానికి ప్రాతినిధ్యం వహిస్తూ జనాంగాల మధ్య ఆయన కీర్తి ప్రతిష్ఠలు ప్రకటించాలి. ప్రతీ ఇశ్రాయేలీయుడు యెహోవాకు సాక్షిగా ఉండాలి.​—⁠ద్వితీయోపదేశకాండము 26:19; యెషయా 43:21; మలాకీ 2:7; రోమీయులు 3:1, 2.

కొట్టివేయబడిన “సేవకుడు”

7 శతాబ్దాల పూర్వం ఇశ్రాయేలు దేవుని “సేవకుడు” కాబట్టి, యేసు మాట్లాడిన దాసుడు కూడా ఇశ్రాయేలేనా? కాదు, ఎందుకంటే విచారకరంగా, ప్రాచీన ఇశ్రాయేలు అటు నమ్మకమైనదిగా ఉండలేదు ఇటు బుద్ధిగలదానిగా నిరూపించుకోలేదు. ఆ జనాంగాన్ని ఉద్దేశించి యెహోవా మాట్లాడిన మాటలను ఉల్లేఖించినప్పుడు పౌలు పరిస్థితిని స్థూలంగా ఇలా వివరిస్తున్నాడు: ‘మిమ్మునుబట్టియే దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది.’ (రోమీయులు 2:​24) అవును, యేసును నిరాకరించడం ద్వారా ఇశ్రాయేలు సుదీర్ఘమైన తిరుగుబాటు చరిత్రను ముగింపుకు తీసుకువచ్చింది, ఆ సమయంలోనే యెహోవా వారిని తృణీకరించాడు.​—⁠మత్తయి 21:42, 43.

8 ‘సేవకుడైన’ ఇశ్రాయేలు చూపిన ఈ అవిశ్వాస్యత కారణంగా నమ్మకస్థులైన ఆరాధకులకు ఆధ్యాత్మిక ఆహార సరఫరా ఇక ఎన్నడూ ఉండదని అర్థం కాదు. యేసు పునరుత్థానం చేయబడిన యాభై రోజుల తర్వాత అంటే సా.శ. 33 పెంతెకొస్తునాడు యెరూషలేములోని మేడ గదిలో సమకూడిన దాదాపు 120 మంది శిష్యులపై పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. ఆ సమయంలో, ఒక కొత్త జనాంగం ప్రభవించింది. ఆ జనాంగ సభ్యులు యెరూషలేము నివాసులకు “దేవుని గొప్పకార్యములను” ధైర్యంగా ప్రకటించడం ఆరంభించినప్పుడు సముచితంగానే, దాని ప్రభావం ప్రచారం చేయబడింది. (అపొస్తలుల కార్యములు 2:​11) ఆ విధంగా, ఆ కొత్త ఆధ్యాత్మిక జనాంగం, జనాంగాలకు యెహోవా మహిమను ప్రకటించే, తగినవేళ ఆహారం సరఫరాచేసే ‘సేవకునిగా’ తయారైంది. (1 పేతురు 2:⁠9) అందుకే అది సముచితంగానే “దేవుని ఇశ్రాయేలు” అని పిలువబడింది.​—⁠గలతీయులు 6:16.

9 “దేవుని ఇశ్రాయేలు”లోని ప్రతీ సభ్యుడు సమర్పించుకొని బాప్తిస్మం తీసుకున్న క్రైస్తవునిగా పరిశుద్ధాత్మతో అభిషేకించబడి పరలోక నిరీక్షణతో ఉంటాడు. కాబట్టి “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” అనేమాట, సా.శ. 33 నుండి ఇప్పటివరకు ఆ అభిషిక్త ఆధ్యాత్మిక జనాంగపు సభ్యులు ఏ కాలంలో జీవించినా, వారందరినీ కలిపి ఒక గుంపుగా సూచిస్తుంది, అదే విధంగా, సా.శ.పూ. 1513 నుండి సా.శ. 33 పెంతెకొస్తు వరకు ఏ కాలంలో జీవించినప్పటికీ ప్రతీ ఇశ్రాయేలీయుడు క్రైస్తవపూర్వ దాసుని తరగతిలో భాగమై ఉండేవాడు. అయితే దాసుని ద్వారా ఆధ్యాత్మికంగా పోషించబడే ‘ఇంటివారు’ ఎవరు? సా.శ. మొదటి శతాబ్దంలో ప్రతీ క్రైస్తవునికి పరలోక నిరీక్షణ ఉండేది. అందువల్ల, ఇంటివారు కూడా అభిషిక్త క్రైస్తవులే, అయితే వారు ఒక గుంపుగా కాదుగానీ ఆయావ్యక్తులుగా అలా దృష్టించబడ్డారు. సంఘంలో బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారితోసహా అందరికీ ఆ దాసుని ద్వారా ఆధ్యాత్మిక ఆహారం అవసరమైంది.​—⁠1 కొరింథీయులు 12:12, 19-27; హెబ్రీయులు 5:11-13; 2 పేతురు 3:15, 16.

“ప్రతివానికి వాని వాని పని”

10 “దేవుని ఇశ్రాయేలు” నియమిత పని ఉన్న నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడే అయినప్పటికీ, అందులోని ప్రతీ సభ్యునికి కూడా వ్యక్తిగత బాధ్యతలు ఉంటాయి. మార్కు 13:34లో నమోదు చేయబడిన యేసు మాటలు దీనిని స్పష్టం చేస్తున్నాయి. ఆయనిలా అన్నాడు: ‘ఒక మనుష్యుడు తన దాసులకు అధికారమిచ్చి, ప్రతివానికి వాని వాని పని నియమించి—మెలకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి, యిల్లు విడిచి దేశాంతరము పోయినట్టే (ఆ కాలము ఉండును.)’ కాబట్టి దాసుని తరగతిలోని ప్రతీ సభ్యునికి క్రీస్తు భూసంబంధ ఆస్తిని వృద్ధిచేసే నియామకం ఇవ్వబడింది. ఆ ప్రతీ సభ్యుడు తన సొంత సామర్థ్యాన్ని బట్టి, తనకున్న అవకాశాలనుబట్టి తనకివ్వబడిన పని నెరవేరుస్తాడు.​—⁠మత్తయి 25:14, 15.

11 అంతేకాకుండా, అపొస్తలుడైన పేతురు తనకాలంలోని అభిషిక్త క్రైస్తవులకు ఇలాచెప్పాడు: ‘దేవుని నానావిధమైన కృపవిషయమై మంచి గృహ నిర్వాహకులైయుండి, యొక్కొకడు కృపావరము పొందిన కొలది యొకనికొకడు ఉపచారము చేయుడి.’ (1 పేతురు 4:​10) అందువల్ల, ఆ అభిషిక్తులకు దేవుడు తమకిచ్చిన కృపావరాలు ఉపయోగిస్తూ పరస్పరం ఉపచారం చేసుకోవలసిన బాధ్యతవుంది. అంతేకాకుండా, క్రైస్తవులందరికీ ఒకే విధమైన సామర్థ్యాలు, బాధ్యతలు లేదా ఆధిక్యతలు ఉండవని పేతురు మాటలు సూచిస్తున్నాయి. అయితే, దాసుని తరగతిలోని ప్రతీ సభ్యుడు ఆ ఆధ్యాత్మిక జనాంగపు పురోభివృద్ధికి ఏదోకరీతిలో దోహదపడే అవకాశముంది. ఎలా?

12 మొదట, ప్రతీ సభ్యునికి రాజ్యసువార్త ప్రకటిస్తూ యెహోవాకు సాక్షిగా ఉండే బాధ్యత ఉంది. (యెషయా 43:10-12; మత్తయి 24:​14) యేసు పరలోకానికి ఆరోహణం కావడానికి ముందు, స్త్రీపురుషులైన తన నమ్మకమైన శిష్యులందరూ బోధకులై ఉండాలని వారిని ఆజ్ఞాపించాడు. ఆయనిలా చెప్పాడు: ‘కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నాను.’​—⁠మత్తయి 28:19, 20.

13 కొత్త శిష్యులను కనుగొన్నప్పుడు, వారికి క్రీస్తు తన శిష్యులకు ఆజ్ఞాపించిన అన్ని విషయాలు గైకొనేలా జాగ్రత్తగా బోధించాలి. ప్రతిస్పందించిన వారు చివరకు ఇతరులకు బోధించేందుకు అర్హులయ్యారు. అనేక దేశాల్లో దాసుని తరగతిలోని భావి సభ్యులకు పుష్టికరమైన ఆధ్యాత్మిక ఆహారం లభ్యమయ్యేలా చేయబడింది. అభిషిక్త క్రైస్తవులందరూ అంటే స్త్రీలు పురుషులు, శిష్యులను చేయమని ఇవ్వబడిన ఆజ్ఞను నెరవేర్చడంలో భాగం వహించారు. (అపొస్తలుల కార్యములు 2:​17, 18) ఆ దాసుడు పని చేయడం మొదలుపెట్టిన దగ్గరనుండి ఈ విధానాంతం వరకు ఆ పని కొనసాగాలి.

14 కొత్తగా బాప్తిస్మం తీసుకున్న అభిషిక్తులు దాసుని తరగతిలో భాగమయ్యారు, వారికి మొదట్లో ఎవరు బోధించినప్పటికీ, పెద్దలుగా సేవచేసేందుకు లేఖన అర్హతలు సంపాదించుకున్న సంఘ సభ్యుల ఉపదేశాన్ని కూడా వారు ఎడతెగక పొందారు. (1 తిమోతి 3:1-7; తీతు 1:​6-9) అలా ఈ నియమిత పురుషులకు ఒక ప్రత్యేక విధానంలో ఆ జనాంగపు పురోభివృద్ధికి దోహదపడే ఆధిక్యత లభించింది. సంఘాలకు బోధించే పని కేవలం క్రైస్తవ పురుషులకే అప్పగించబడినందుకు నమ్మకమైన అభిషిక్త క్రైస్తవ స్త్రీలు చిన్నబుచ్చుకోలేదు. (1 కొరింథీయులు 14:​34, 35) బదులుగా, వారు సంఘంలోని పురుష సభ్యులు కష్టపడి చేస్తున్న పని నుండి ప్రయోజనం పొందడంలో సంతోషిస్తూ, ఇతరులకు సువార్త ప్రకటించే పనితోపాటు స్త్రీలకు అందుబాటులోవున్న ఆధిక్యతలపట్ల వారు కృతజ్ఞతతో ఉన్నారు. నియమిత పెద్దలు అభిషిక్తులైనా, కాకపోయినా ఆసక్తిగల నేటి అభిషిక్త సహోదరీలు అదేవిధమైన వినయ స్వభావాన్ని కనబరుస్తారు.

15 మొదటి శతాబ్దంలో ప్రధానమైన ఆధ్యాత్మిక ఆహారం అపొస్తలుల, నాయకత్వం వహిస్తున్న ఇతర శిష్యుల లేఖల నుండి నేరుగా అందించబడేది. వారు వ్రాసిన లేఖలు ప్రత్యేకంగా క్రైస్తవ గ్రీకు లేఖనాలుగా పరిగణించబడుతున్న ప్రేరేపిత 27 పుస్తకాలు సంఘాలకు పంపించబడుతూ స్థానిక పెద్దల బోధకు ఆధారంగా ఉండేవనడంలో సందేహం లేదు. ఈ విధంగా, దాసుని ప్రతినిధులు బలమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని యథార్థ క్రైస్తవులకు నమ్మకంగా సరఫరా చేస్తుండేవారు. అలా మొదటి శతాబ్దపు దాసుని తరగతి తనకివ్వబడిన ఆజ్ఞ విషయంలో నమ్మదగినదిగా నిరూపించుకుంది.

19 శతాబ్దాల తర్వాతి ‘దాసుడు’

16 నేటి విషయమేమిటి? 1914లో యేసు ప్రత్యక్షత ఆరంభమైనప్పుడు నమ్మకంగా తగినవేళ ఆహారం అందిస్తున్న అభిషిక్త క్రైస్తవుల గుంపును ఆయన కనుగొన్నాడా? అవును ఆయన కనుగొన్నాడు. ఈ గుంపు తాను ఫలిస్తున్న చక్కని ఫలాల కారణంగా స్పష్టంగా గుర్తించబడింది. (మత్తయి 7:​20) చరిత్ర అప్పటినుండి ఈ గుర్తింపు సరియైనదేనని రుజువుచేసింది.

17 యేసు వచ్చినప్పుడు దాదాపు 5,000 మంది ఇంటివారు ముమ్మరంగా బైబిలు సత్యాలను వ్యాప్తిచేస్తూ ఉన్నారు. పనివారు కొద్దిమందే ఉన్నారు, అయినా ఆ దాసుడు సువార్త ప్రకటించడానికి అనేక వినూత్న పద్ధతులను ఉపయోగించాడు. (మత్తయి 9:​38) ఉదాహరణకు, బైబిలు అంశాల ప్రసంగాలను దాదాపు 2,000 వార్తాపత్రికల్లో ప్రచురించడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి. ఈ విధంగా దేవుని వాక్యపు సత్యం ఒకేసారి వేలాదిమందికి చేరింది. దానికితోడు, కలర్‌ స్లైడులు, కదిలే బొమ్మలతో ప్రదర్శించబడే ఎనిమిది గంటల కార్యక్రమం రూపొందించబడింది. ఈ వినూత్న ప్రయోగం ఫలితంగా, సృష్టి ఆరంభం నుండి క్రీస్తు వెయ్యేళ్ల పరిపాలన అంతంవరకున్న బైబిలు సందేశం మూడు ఖండాల్లోని 90 లక్షలకు పైగా ప్రజలకు అందజేయబడింది. ఉపయోగించబడిన మరో మాధ్యమం ముద్రిత సమాచారం. ఉదాహరణకు, 1914లో ఈ పత్రిక యొక్క ప్రతులు దాదాపు 50,000 ప్రచురించబడ్డాయి.

18 అవును, యజమాని వచ్చినప్పుడు తన నమ్మకమైన దాసుడు మనస్సాక్షిపూర్వకంగా ఇంటివారికి ఆహారం అందిస్తూ సువార్త ప్రకటిస్తున్నట్టుగా కనుగొన్నాడు. అందువల్ల, ఆ దాసుని కోసం ఇప్పుడు గొప్ప బాధ్యతలు వేచివున్నాయి. యేసు ఇలాచెప్పాడు: “అతడు తన యావదాస్తిమీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.” (మత్తయి 24:​47) యేసు 1919లో, ఆ దాసుడు పరీక్షా కాలంలో కృతార్థుడైన తర్వాత ఈ విధంగా చేశాడు. అయితే ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునికి’ ఎందుకు గొప్ప బాధ్యత ఇవ్వబడింది? ఎందుకంటే ఆ యజమాని ఆస్తి విస్తరించింది. యేసుకు 1914లో రాజ్యాధికారం అప్పగించబడింది.

19 కొత్తగా అధికారంలోకి వచ్చిన యజమాని తన నమ్మకమైన దాసుణ్ణి నియమించిన ఆ ఆస్తి ఏమిటి? ఆయనకు చెందిన, ఈ భూమ్మీదున్న ఆధ్యాత్మిక యావదాస్తి. ఉదాహరణకు, 1914లో క్రీస్తు సింహాసనం అధిష్ఠించిన రెండు దశాబ్దాల తర్వాత, “వేరే గొఱ్ఱెల” “గొప్పసమూహము” గుర్తించబడింది. (యోహాను 10:​16; ప్రకటన 7:9) వీరు “దేవుని ఇశ్రాయేలు” సంబంధిత అభిషిక్త సభ్యులు కాదుగానీ యెహోవాను ప్రేమిస్తూ అభిషిక్తుల మాదిరిగానే ఆయనను సేవించడానికి ఇష్టపడే భూనిరీక్షణగల యథార్థపరులైన స్త్రీపురుషులై ఉన్నారు. నిజానికి వారు ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునితో’ ఇలా అన్నారు: “దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతోకూడ వత్తుము.” (జెకర్యా 8:​23) కొత్తగా బాప్తిస్మం తీసుకున్న ఈ క్రైస్తవులు కూడా అభిషిక్త కుటుంబానికి ఇవ్వబడే అదే ఆధ్యాత్మిక పోషకాహారంలో పాలుపంచుకున్నారు, మరియు అప్పటినుండి ఈ రెండు తరగతులవారు ఒకే విధమైన ఆధ్యాత్మిక ఆహారం తీసుకుంటున్నారు. ‘గొప్పసమూహపు’ సభ్యులకు ఇదెంత ఆశీర్వాదకరమో గదా!

20 సువార్త ప్రచారకులుగా ‘గొప్పసమూహపు’ సభ్యులు అభిషిక్త దాసుని తరగతితో సంతోషంగా తమ చేతులు కలిపారు. వారు ప్రకటిస్తుండగా భూమ్మీది యజమాని ఆస్తులు విస్తరించడంతో ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’ బాధ్యతలు అధికమయ్యాయి. సత్యాన్వేషకుల సంఖ్య పెరగడంతో, బైబిలు సాహిత్యాల డిమాండుకు తగ్గట్టు ముద్రణా వసతులను విస్తరించడం అవసరమయింది. యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయాలు ఒకదాని తర్వాత మరొకటిగా వివిధ దేశాల్లో నెలకొల్పబడ్డాయి. “భూదిగంతములవరకు” మిషనరీలు పంపించబడ్డారు. (అపొస్తలుల కార్యములు 1:⁠8) ఉదాహరణకు, 1914లో దాదాపు ఐదువేల అభిషిక్తులతో ఆరంభమైన దేవుని స్తుతికర్తలు నేడు 60 లక్షలకు పైగా విస్తరించారు, వారిలో అత్యధికులు ‘గొప్పసమూహపు’ వారే. అవును, రాజు 1914లో పట్టాభిషిక్తుడు అయినప్పటి నుండి ఆయన ఆస్తులు అనేకరెట్లు విస్తరించాయి.

21 ఇదంతా ఆ దాసుడు “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన” వాడని చూపిస్తోంది. యేసు “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన” దాసుని గురించి మాట్లాడిన వెంటనే ఆ రెండు లక్షణాలను నొక్కిచెప్పిన రెండు ఉపమానాలు చెప్పాడు. ఒకటి బుద్ధిగల, బుద్ధిలేని కన్యకల ఉపమానం, రెండవది తలాంతుల గురించిన ఉపమానం. (మత్తయి 25:​1-30) ఇప్పుడు మన ఆసక్తి రెట్టింపయ్యింది! నేడు మనకు ఈ రెండు ఉపమానాలు ఎలాంటి భావాన్నిస్తున్నాయి? తర్వాతి ఆర్టికల్‌లో మనమీ ప్రశ్నను పరిశీలిద్దాం.

మీరు ఏమనుకుంటున్నారు?

‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునిగా’ ఎవరు తయారవుతారు?

‘ఇంటివారు’ ఎవరు?

ప్రభువు యావదాస్తిమీద నమ్మకమైన దాసుడు ఎప్పుడు నియమించబడ్డాడు, ఆ సమయంలోనే ఎందుకు?

ఇటీవలి దశాబ్దాల్లో ప్రభువు ఆస్తి విస్తరింపజేయడానికి ఎవరు సహాయపడ్డారు, ఎలా?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. నేడు మనం క్రమంగా ఆధ్యాత్మిక ఆహారం పొందడం ఎందుకు ఆవశ్యకం?

3. మనం “తగినవేళ అన్నము” పొందడానికి యేసు ఎలాంటి ఏర్పాట్లు చేశాడు?

4. “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” ఒకే వ్యక్తి కానేరడని మనకెలా తెలుసు?

5. “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” అనే మాట ప్రతీ క్రైస్తవునికి వ్యక్తిగతంగా ఎందుకు వర్తించదో వివరించండి.

6. ఇశ్రాయేలు జనాంగం దేవుని ‘సేవకునిగా’ లేదా ‘దాసునిగా’ పనిచేయడానికి ఎలా ఉద్దేశించబడింది?

7. ప్రాచీన ఇశ్రాయేలు జనాంగం దేవుని ‘సేవకునిగా’ ఉండే అర్హతను ఎందుకు కోల్పోయింది?

8. ఇశ్రాయేలు స్థానంలో ఎప్పుడు ఒక “సేవకుడు” నియమించబడ్డాడు, ఎలాంటి పరిస్థితుల్లో నియమించబడ్డాడు?

9. (ఎ) ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ ఎవరు? (బి) ‘ఇంటివారు’ ఎవరు?

10, 11. దాసుని తరగతిలోని సభ్యులందరికీ ఒకే విధమైన నియామక పని ఉండదని మనకెలా తెలుసు?

12. స్త్రీయైనా, పురుషుడైనా ఆ దాసుని తరగతిలోని ప్రతీ సభ్యుడు దాసుని తరగతి పురోభివృద్ధికి ఎలా దోహదపడ్డారు?

13. అభిషిక్తులందరూ ఎలాంటి ఆధిక్యతను ఆనందించారు?

14. సంఘంలో బోధించే ఆధిక్యతలు ఎవరికి మాత్రమే పరిమితం చేయబడ్డాయి, ఈ విషయంలో నమ్మకమైన అభిషిక్త స్త్రీలు ఎలా భావించారు?

15. మొదటి శతాబ్దంలో ఆధ్యాత్మిక ఆహారానికి ఏది ఒక ముఖ్యమైన మూలాధారంగా ఉంది, దానిని అందజేయడంలో ఎవరు నాయకత్వం వహించారు?

16, 17. దాసుని తరగతి 1914 వరకున్న సంవత్సరాల్లో తన నియామకాన్ని నమ్మకంగా నెరవేరుస్తూ వచ్చినట్లు ఎలా నిరూపించుకుంది?

18. యేసు తన దాసుణ్ణి తన యావదాస్తిమీద ఎప్పుడు నియమించాడు, ఎందుకు నియమించాడు?

19. ‘గొప్పసమూహపు’ ఆధ్యాత్మిక అవసరతలు ఎలా తీర్చబడుతున్నాయో వివరించండి.

20. ప్రభువు ఆస్తి విస్తరింపజేయడంలో “గొప్పసమూహము” ఏ పాత్ర పోషించింది?

21. మనం తర్వాతి ఆర్టికల్‌లో ఏ రెండు ఉపమానాలను పరిశీలిస్తాం?

[10వ పేజీలోని చిత్రాలు]

మొదటి శతాబ్దపు దాసుని తరగతి తనకివ్వబడిన ఆజ్ఞకు నమ్మకంగా లోబడింది