కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘నమ్మకమైన దాసుడు’ పరీక్షలో కృతార్థుడయ్యాడు!

‘నమ్మకమైన దాసుడు’ పరీక్షలో కృతార్థుడయ్యాడు!

‘నమ్మకమైన దాసుడు’ పరీక్షలో కృతార్థుడయ్యాడు!

“తీర్పు దేవుని ఇంటియొద్ద ఆరంభమగు కాలము వచ్చియున్నది”​1 పేతురు 4:17.

యేసు, సా.శ. 33 పెంతెకొస్తునాడు “ఇంటివారికి” తగినవేళ ఆహారం పెట్టడానికి ఒక ‘దాసుని’ నియమించాడు. 1914లో యేసు రాజుగా సింహాసనం అధిష్ఠించాడు, ఆ వెంటనే ఆ ‘దాసుని’ పరీక్షించే సమయం ఆసన్నమయింది. ఎక్కువలో ఎక్కువగా, ఆ ‘దాసుడు’ తనను తాను ‘నమ్మకమైనవానిగా బుద్ధిమంతునిగా’ నిరూపించుకున్నట్టే ఆయన కనుగొన్నాడు. కాబట్టే ఆయన తన “యావదాస్తిమీద” అతన్ని నియమించాడు. (మత్తయి 24:​45-47) అయితే, నమ్మకత్వంలేని లేదా బుద్ధిలేని దుష్టుడైన దాసుడు కూడా ఒకడు ఉన్నాడు.

‘దుష్టుడైన ఆ దాసుడు’

2 ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’ గురించి మాట్లాడిన వెంటనే యేసు దుష్టుడైన దాసుని గురించి మాట్లాడాడు. ఆయనిలా చెప్పాడు: “అయితే దుష్టుడైన యొక దాసుడు—నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి, త్రాగుబోతులతో తినుచు త్రాగుచునుంటె ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి, వానిని నరికించి [“అత్యంత కఠినంగా శిక్షించి,” NW] వేషధారులతోకూడ వానికి పాలు నియమించును. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండును.” (మత్తయి 24:​48-51) “దుష్టుడైన యొక దాసుడు” అనే మాట యేసు అంతకుముందు “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని” గురించి పలికిన మాటలపైకి మన అవధానాన్ని మళ్లిస్తుంది. అవును, ‘దుష్టుడైన ఆ దాసుడు’ నమ్మకమైన దాసుని తరగతి నుండే వచ్చాడు. * ఎలా?

3 1914కు ముందు నమ్మకమైన దాసుని తరగతి సభ్యులు చాలామంది అదే సంవత్సరంలో పరలోకంలో పెండ్లికుమారుణ్ణి కలుసుకుంటామని బలంగా నిరీక్షించారు, అయితే వారి నిరీక్షణ ఫలించలేదు. దాని ఫలితంగా, మరితర పరిణామాల ఫలితంగా వారిలో చాలామంది నిరుత్సాహపడగా కొందరు కఠినంగా తయారయ్యారు. వీరిలో కొందరు తమ పాత సహోదరులను మాటలతో ‘కొట్టడానికి’ పూనుకొని, “త్రాగుబోతులతో” అంటే క్రైస్తవమత సామ్రాజ్య మత గుంపులతో సహవసించడం ఆరంభించారు.​—⁠యెషయా 28:1-3; 32:6.

4 ఈ మాజీ క్రైస్తవులు చివరకు ‘దుష్టుడైన దాసునిగా’ గుర్తించబడడంతో, యేసు వారిని ‘అత్యంత కఠినంగా’ శిక్షించాడు. ఎలా? ఆయన వారిని తిరస్కరించగా వారు తమ పరలోక నిరీక్షణ పోగొట్టుకున్నారు. అయితే వారు వెనువెంటనే నాశనం చేయబడలేదు. వారు మొదట క్రైస్తవ సంఘం వెలుపల ఏడుస్తూ పండ్లు కొరుకుతూ కొంత కాలం గడపవలసివచ్చింది. (మత్తయి 8:​12) ఆ తొలి రోజులు మొదలుకొని, మరి కొంతమంది అభిషిక్తులు అలాంటి చెడు స్వభావమే కనబరచి, తమనుతాము ‘దుష్టుడైన దాసునిగా’ కనబరచుకున్నారు. ‘వేరే గొఱ్ఱెల్లోని’ కొందరు వారి అవిశ్వాస్యతను అనుకరించారు. (యోహాను 10:​16) అలాంటి క్రీస్తు శత్రువులందరూ ఒకే విధమైన ఆధ్యాత్మిక ‘వెలుపటి చీకటిని’ అనుభవిస్తారు.

5 అయితే ‘దుష్టుడైన దాసునికి’ కలిగిన అవే పరీక్షలను, నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు కూడా ఎదుర్కొన్నాడు. కానీ కఠినంగా తయారు కావడానికి బదులుగా వారు తమను తాము సరిదిద్దుకున్నారు. (2 కొరింథీయులు 13:​11) యెహోవాపట్ల, తమ సహోదరులపట్ల వారికున్న ప్రేమ బలపరచబడింది. దాని ఫలితంగా వారు ఈ కల్లోలభరిత “అంత్యదినములలో” ‘సత్యమునకు స్తంభముగా, ఆధారముగా’ నిలిచారు.​—⁠1 తిమోతి 3:15; 2 తిమోతి 3:1.

బుద్ధిగల, బుద్ధిలేని కన్యకలు

6 ‘దుష్టుడైన ఆ దాసుని’ గురించి మాట్లాడిన తర్వాత, ఇతరులు విఫలమైనా అభిషిక్త క్రైస్తవులు కొందరు నమ్మకమైన, బుద్ధిగలవారిగా ఎందుకు నిరూపించుకుంటారో చూపించేందుకు యేసు రెండు ఉపమానాలు చెప్పాడు. * బుద్ధిని ఉదహరించడానికి ఆయనిలా చెప్పాడు: “పరలోకరాజ్యము, తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పదిమంది కన్యకలను పోలియున్నది. వీరిలో అయిదుగురు బుద్ధిలేనివారు, అయిదుగురు బుద్ధిగలవారు. బుద్ధిలేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతోకూడ నూనె తీసికొనిపోలేదు. బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడ సిద్దెలలో నూనె తీసికొనిపోయిరి.” (మత్తయి 25:​1-4) ఆ పదిమంది కన్యకలు 1914కు ముందున్న అభిషిక్త క్రైస్తవులను మనకు గుర్తుచేస్తున్నారు. పెండ్లికుమారుడైన యేసుక్రీస్తు ఇక కొద్దికాలంలోనే రాబోతున్నాడని వారు లెక్కించారు. అందువల్ల వారు “అన్యజనముల కాలములు” 1914లో ముగుస్తాయని ధైర్యంగా ప్రకటిస్తూ, ఆయనను ‘ఎదుర్కోవడానికి బయలుదేరారు.’​—⁠లూకా 21:24.

7 వారి లెక్క సరైనదే. అన్యజనముల కాలాలు నిజంగానే 1914లో ముగిసి క్రీస్తు యేసు ఆధ్వర్యంలో దేవుని రాజ్యం పనిచేయడం ఆరంభించింది. అయితే అది అదృశ్య పరలోకంలో జరిగింది. భూమ్మీద, మానవాళికి ముందే చెప్పబడిన “శ్రమ” మొదలయింది. (ప్రకటన 12:​10, 12) దానితో పరీక్ష సమయం వచ్చింది. అభిషిక్త క్రైస్తవులు విషయాలను స్పష్టంగా అర్థంచేసుకోకుండా, పెండ్లికుమారుడు ‘ఆలస్యము చేస్తున్నాడని’ తలంచారు. ఒక ప్రక్క కలవరం మరోప్రక్క లోకంనుండి వ్యతిరేకత ఎదురుకావడంతో వారు చాలావరకు చచ్చుబడి వ్యవస్థీకృత బహిరంగ ప్రకటనా పనిని దాదాపు ఆపుజేశారు. యేసు అపొస్తలులు చనిపోయిన తర్వాత అవిశ్వాస నామకార్థ క్రైస్తవులు చేసినట్లుగానే, వారు ఉపమానంలోని కన్యకలవలే ఆధ్యాత్మిక భావంలో ‘కునికి నిద్రపోయారు.’​—⁠మత్తయి 25:5; ప్రకటన 11:7, 8; 12:17.

8 ఆ పిమ్మట 1919లో ఊహించని సంఘటన జరిగింది. మనమిలా చదువుతాము: “అర్ధరాత్రివేళ—ఇదిగో పెండ్లికుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరు లేచి తమ దివిటీలను చక్కపరచిరి.” (మత్తయి 25:​6, 7) పరిస్థితులు మరీ దుర్భరంగా అనిపించిన వేళలో లేవండి అనే పిలుపు ఇవ్వబడింది! యెహోవా ఆధ్యాత్మిక దేవాలయాన్ని తనిఖీ చేయడానికి, దేవుని సంఘాన్ని శుభ్రం చేయడానికి 1918లో “నిబంధన దూత” అయిన యేసు వచ్చాడు. (మలాకీ 3:⁠1) ఇప్పుడు, అభిషిక్త క్రైస్తవులు వెళ్లి ఆయనను దేవాలయ భూసంబంధ ఆవరణలో కలుసుకోవాలి. అది వారు తమ వెలుగును “తేజరిల్ల”జేయవలసిన సమయం.​—⁠యెషయా 60:1; ఫిలిప్పీయులు 2:​14, 15.

9 అయితే కాస్తాగండి! ఆ ఉపమానంలో, కొందరు యౌవన స్త్రీలకు ఓ సమస్య వచ్చిపడింది. యేసు ఇంకా ఇలాచెప్పాడు: “బుద్ధిలేని ఆ కన్యకలు—మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధిగలవారినడిగిరి.” (మత్తయి 25:⁠8) నూనె లేకపోతే దివిటీలు ఆరిపోతాయి. ఆ నూనె, వెలుగు ప్రకాశకులుగా ఉండడానికి నిజ ఆరాధకులను బలపరిచే దేవుని వాక్యపు సత్యాన్ని, ఆయన పరిశుద్ధాత్మను మనకు గుర్తుచేస్తోంది. (కీర్తన 119:130; దానియేలు 5:​14) బుద్ధిగల అభిషిక్త క్రైస్తవులు 1919కి ముందు తమ తాత్కాలిక బలహీన స్థితి మధ్యనూ తమ విషయమై దేవుని చిత్తమేమిటో గ్రహించేందుకు పట్టుదలతో వెదికారు. కాబట్టి, తేజరిల్లమని పిలుపు ఇవ్వబడినప్పుడు, వారు సిద్ధంగా ఉన్నారు.​—⁠2 తిమోతి 4:2; హెబ్రీయులు 10:24, 25.

10 అయితే అభిషిక్తులలో కొందరు తాము కూడా పెండ్లికుమారునితో ఉండడానికి మనఃపూర్వకంగా కోరుకున్నప్పటికీ త్యాగాలు చేయడానికి లేదా వ్యక్తిగత ప్రయత్నం చేయడానికి సిద్ధంగాలేరు. అందువల్ల సువార్త ప్రకటించడానికి ఆయత్తం కావలసిన సమయం ఆసన్నమయినప్పుడు వారు సిద్ధపడి లేరు. (మత్తయి 24:​14) నిజానికి వారు, ఆసక్తిగల తమ సహవాసుల దగ్గరున్న నూనెలో కొంచెం తమకు ఇవ్వమని వారిని అడగడం ద్వారా వారిని నీరసింపజేయడానికి కూడా ప్రయత్నించారు. యేసు ఉపమానంలోని బుద్ధిగల కన్యకలు ఎలా ప్రతిస్పందించారు? వారిలా అన్నారు: “మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారియొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి.” (మత్తయి 25:⁠9) అదే రీతిలో, 1919లో విశ్వసనీయ అభిషిక్తులు తమ వెలుగు ప్రకాశించే సామర్థ్యాన్ని బలహీనపరిచే దేనిని చేయడానికైనా నిరాకరించారు. ఆ విధంగా వారు పరీక్షలో కృతార్థులయ్యారు.

11 యేసు ఇలా ముగించాడు: “వారు [బుద్ధిలేని కన్యకలు] కొనబోవుచుండగా పెండ్లికుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడియున్నవారు అతనితోకూడ పెండ్లి విందుకు లోపలికి పోయిరి; అంతట తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి—అయ్యా, అయ్యా, మాకు తలుపు తీయుమని అడుగగా అతడు—మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.” (మత్తయి 25:​10-12) అవును, కొందరు పెండ్లికుమారుని రాకకు సిద్ధపడిలేరు. ఆ విధంగా, వారు పరీక్షలో తప్పిపోయి, పరలోక వివాహపు విందుకు హాజరయ్యే అవకాశం కోల్పోయారు. ఎంత విచారకరం!

తలాంతుల ఉపమానము

12 బుద్ధిని గురించి ఉదహరించిన తర్వాత, యేసు నమ్మకత్వాన్ని గురించి వివరించాడు. ఆయనిలా చెప్పాడు: “ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారి కప్పగించినట్లుండును. అతడు ఒకనికి అయిదు తలాంతులను ఒకనికి రెండు, ఒకనికి ఒకటియు ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి, వెంటనే దేశాంతరము పోయెను.” (మత్తయి 25:​14, 15) యేసే ఆ ఉపమానంలోని మనుష్యుడు, సా.శ. 33లో ఆయన పరలోకానికి ఆరోహణమైనప్పుడు ఆయన “దేశాంతరము” వెళ్లాడు. అయితే యేసు తన ఆరోహణానికి ముందు, తన “యావదాస్తిని” తన నమ్మకమైన శిష్యులకు అప్పగించాడు. ఏ విధంగా?

13 యేసు తన భూ పరిచర్యా కాలంలో రాజ్య సువార్త ప్రకటించడం ద్వారా ఇశ్రాయేలు దేశమంతటా ఒక విస్తారమైన కార్యక్షేత్రాన్ని సిద్ధం చేయడం ఆరంభించాడు. (మత్తయి 9:​35-38) ఆయన “దేశాంతరము” వెళ్లడానికి ముందు, “మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి” అని చెబుతూ తన నమ్మకమైన శిష్యులకు ఆ క్షేత్రం అప్పగించాడు. (మత్తయి 28:​18-20) ఈ మాటలతో యేసు, ‘ఎవరి సామర్థ్యము చొప్పున వారు’ తను తిరిగివచ్చేవరకు వ్యాపారం చేసే అధికారాన్ని తన ‘దాసులకు’ అప్పగించాడు.

14 మొదటి శతాబ్దపు క్రైస్తవులందరికీ ఒకే విధమైన పరిస్థితులు, అవకాశాలు లేవని ఆ మాట సూచిస్తోంది. పౌలు తిమోతీల మాదిరిగా కొందరు ప్రకటన, బోధనా పనిలో సాధ్యమైనంతగా పూర్తికాలం సేవచేయగలిగారు. కొందరి పరిస్థితులు వారి కార్యశీలతను ఎక్కువ మట్టుకు పరిమితం చేసివుండవచ్చు. ఉదాహరణకు, క్రైస్తవుల్లో కొందరు దాసులుగా, కొందరు వ్యాధిగ్రస్తులుగా, వృద్ధులుగా లేదా కుటుంబ బాధ్యతలు గలవారిగా ఉన్నారు. అలాగే కొన్ని ప్రత్యేకమైన సంఘ సేవాధిక్యతలు శిష్యులందరికీ అందుబాటులో లేవు. అభిషిక్త స్త్రీలు, కొందరు అభిషిక్త పురుషులు సంఘంలో బోధించలేదు. (1 కొరింథీయులు 14:34; 1 తిమోతి 3:1; యాకోబు 3:⁠1) అయినప్పటికీ, స్త్రీపురుషులనే భేదంలేకుండా క్రీస్తు అభిషిక్త శిష్యులందరూ వారి వ్యక్తిగత పరిస్థితులు ఎలాగున్నా క్రైస్తవ పరిచర్యలో తమ పరిస్థితులను, అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకుంటూ, వ్యాపారం చేయడానికి నియమించబడ్డారు. ఆధునిక దిన క్రీస్తు శిష్యులూ అలాగే చేస్తున్నారు.

పరీక్షా సమయం ఆరంభం కావడం!

15 ఆ ఉపమానం ఇంకా ఇలాచెబుతోంది: “బహు కాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారియొద్ద లెక్క చూచుకొనెను.” (మత్తయి 25:​19) 1914లో అంటే సా.శ. 33 తర్వాత నిజంగా చాలాకాలం తర్వాత, క్రీస్తు యేసు తన రాజ్యాధికార ప్రత్యక్షతను ఆరంభించాడు. మూడున్నర సంవత్సరాల తర్వాత, 1918లో ఆయన దేవుని ఆధ్యాత్మిక ఆలయానికివచ్చి పేతురు పలికిన ఈ మాటలు నెరవేర్చాడు: “తీర్పు దేవుని ఇంటియొద్ద ఆరంభమగు కాలము వచ్చియున్నది.” (1 పేతురు 4:17; మలాకీ 3:⁠1) అది లెక్కచూసుకోవలసిన కాలం.

16 యేసు అభిషిక్త సహోదరులైన ఆ దాసులు రాజు ఇచ్చిన ‘తలాంతులతో’ ఏమిచేశారు? సా.శ. 33 నుండి 1914 వరకున్న సంవత్సరాల్లో చాలామంది యేసు అప్పజెప్పిన “వ్యాపారము” విషయంలో చాలా కష్టపడి పనిచేశారు. (మత్తయి 25:​16) మొదటి ప్రపంచ యుద్ధకాలంలో సైతం వారు యజమానికి సేవ చేయాలనే బలమైన కోరికను ప్రదర్శించారు. కాబట్టి ఇప్పుడు, నమ్మకస్థులకు ‘వ్యాపారంచేసే’ కొత్త అవకాశాలు ఇవ్వడం సముచితం. ఈ విధానాంతానికి సమయం దగ్గరపడింది. ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటించబడాలి. “భూమిపైరు” కోయబడాలి. (ప్రకటన 14:​6, 7, 14-16 ) గోధుమల తరగతి కడవరి సభ్యులు ఎక్కడెక్కడ ఉన్నారో వెతకాలి, ‘గొప్పసమూహము’ సమకూర్చబడాలి.​—⁠ప్రకటన 7:9; మత్తయి 13:24-30.

17 కోతకాలం సంతోషించే కాలం. (కీర్తన 126:⁠6) అందుకని, 1919లో యేసు నమ్మకస్థులైన తన అభిషిక్త సహోదరులకు అధిక బాధ్యత అప్పగించినప్పుడు ఆయనిలా చెప్పడం సమంజసం: ‘మీరు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటిరి, మిమ్మును అనేకమైన వాటిమీద నియమించెదను, మీ యజమానుని సంతోషములో పాలుపొందుడి.’ (మత్తయి 25:​21, 23) అంతేకాకుండా, దేవుని రాజ్య సింహాసనాన్ని కొత్తగా అధిష్ఠించిన రాజుగా యజమాని సంతోషం మన ఊహకు అందనిది. (కీర్తన 45:1, 2, 6, 7) ఆ రాజుకు ప్రాతినిధ్యం వహిస్తూ, ఈ భూమ్మీది ఆయన ఆస్తిని అభివృద్ధిపరుస్తూ నమ్మకమైన దాసుని తరగతి ఆ సంతోషంలో పాలు పంచుకుంటుంది. (2 కొరింథీయులు 5:​20) వారి ఆనందాన్ని యెషయా 61:10లోని ప్రవచనార్థక మాటల్లో చూడవచ్చు. ఆ ప్రవచనమిలా చెబుతోంది: “ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసియున్నాడు . . . కాగా యెహోవానుబట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవునిబట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది.”

18 విచారకరంగా కొందరు ఆ పరీక్షలో కృతార్థులు కాలేదు. మనమిలా చదువుతాము: “ఒక తలాంతు తీసికొనినవాడును వచ్చి—అయ్యా, నీవు విత్తనిచోట కోయువాడవును, చల్లనిచోట పంట కూర్చుకొనువాడవునైన కఠినుడవని నేనెరుగుదును గనుక నేను భయపడి, వెళ్లి నీ తలాంతును భూమిలో దాచిపెట్టితిని; ఇదిగో నీది నీవు తీసికొనుమని చెప్పెను.” (మత్తయి 25:​24, 25) ఆ ప్రకారమే కొందరు అభిషిక్త క్రైస్తవులు ‘వ్యాపారము’ చేయలేదు. 1914కు ముందు వారు తమ నిరీక్షణను ఉత్సాహంగా ఇతరులతో పంచుకోలేదు, 1919లో కూడా వారు దానిని ప్రారంభించాలని కోరుకోలేదు. వారి అహంకార స్వభావానికి యేసు ఎలా ప్రతిస్పందించాడు? ఆయన వారి ఆధిక్యతలన్నీ తొలగించాడు. వారు ‘ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండు వెలుపటి చీకటిలోనికి త్రోసివేయబడ్డారు.’​—⁠మత్తయి 25:28, 30.

ఆ పరీక్ష కొనసాగడం

19 యేసు 1918లో పరీక్షించడం ఆరంభించినప్పుడు, యుగాంతమందు క్రీస్తు అభిషిక్త దాసులయ్యే వారిలో చాలామంది అప్పటికింకా యెహోవాను సేవించడం లేదు. వారు పరీక్షించబడే అవకాశం కోల్పోయారా? ఎంతమాత్రం లేదు. నమ్మకమైవాడును బుద్ధిమంతుడునైన దాసుడు ఒక తరగతిగా పరీక్షలో కృతార్థులైన 1918/19లోనే ఆ పరీక్షా ప్రక్రియ ఆరంభమైంది. ఆయా అభిషిక్త క్రైస్తవులు శాశ్వతంగా ముద్రించబడడం పూర్తయ్యేవరకు ఆయా వ్యక్తులుగా వారిని పరీక్షించడం కొనసాగింది. (ప్రకటన 7:⁠1-3) ఈ విషయం గ్రహించిన క్రీస్తు అభిషిక్త సహోదరులు నమ్మకంగా ‘వ్యాపారం’ కొనసాగించడానికి తీర్మానించుకున్నారు. తమ దివిటీల కాంతి ప్రకాశవంతంగా ఉండడానికి కావలసిన నూనెను సమృద్ధిగా తమదగ్గర ఉంచుకుంటూ వారు బుద్ధిగలవారిగా ఉండడానికి తీర్మానించుకున్నారు. తమ జీవనవిధానాన్ని తుది వరకు నమ్మకంగా కొనసాగించినప్పుడు యేసు తమను పరలోకానికి చేర్చుకుంటాడని వారిలో ప్రతీ ఒక్కరికీ తెలుసు.​—⁠మత్తయి 24:13; యోహాను 14:2-4; 1 కొరింథీయులు 15:50, 51.

20 వేరేగొఱ్ఱెల గొప్పసమూహం వారి అభిషిక్త సహోదరులను అనుకరించారు. దేవుని సంకల్పాలను గురించిన తమ పరిజ్ఞానం గొప్ప బాధ్యత తెస్తుందని వారికి తెలుసు. (యెహెజ్కేలు 3:​17-21) అందువల్ల, యెహోవా వాక్యం, పరిశుద్ధాత్మ సహాయంతో వారు కూడా అధ్యయనం, సహవాసం ద్వారా తమ నూనె సరఫరాను కాపాడుకుంటారు. ప్రకటించే బోధించే పనిలో భాగంవహిస్తూ వారు తమ వెలుగును ప్రకాశింపజేస్తూ తమ అభిషిక్త సహోదరులతోపాటు ‘వ్యాపారం చేస్తుంటారు.’ అయితే, తలాంతులు తమకు అప్పగించబడ్డాయని అభిషిక్త క్రైస్తవులకు బాగా తెలుసు. భూమ్మీది ప్రభువు ఆస్తుల నిర్వహణా విధానానికి వారు లెక్క అప్పగించాలి. వారు సంఖ్యకు కొద్దిమందిగానే ఉన్నప్పటికీ, వారు తమ బాధ్యతను గొప్పసమూహానికి అప్పగించలేరు. ఈ విషయం మనస్సులో ఉంచుకొని నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు రాజు వ్యాపారం గురించి శ్రద్ధ తీసుకోవడంలో నాయకత్వం వహిస్తూ, అంకితభావంతో గొప్పసమూహపు సభ్యులు ఇస్తున్న మద్దతు విషయంలో కృతజ్ఞతతో ఉన్నాడు. ఈ గొప్పసమూహపు సభ్యులు తమ అభిషిక్త సహోదరుల బాధ్యతను గుర్తించి వారి పర్యవేక్షణలో పనిచేయడాన్ని ఆధిక్యతగా భావిస్తున్నారు.

21 అలా ఈ రెండు ఉపమానాలు 1919లో లేదా ఆ సంవత్సరానికి కాస్త అటు ఇటుగా జరిగిన సంఘటనల గురించి మనకు తెలియజేస్తున్నప్పటికీ, సూత్రప్రాయంగా అవి అంత్యదినాలంతటా జీవిస్తున్న నిజ క్రైస్తవులందరికీ అన్వయిస్తాయి. ఈ విధంగా పది కన్యకల ఉపమానం చివర్లో యేసుచేసిన ప్రబోధం 1919కు ముందు జీవించిన అభిషిక్త క్రైస్తవులకు మొదట అన్వయించినా, సూత్రప్రాయంగా అది ప్రతీ క్రైస్తవునికి ఇప్పటికీ అన్వయిస్తుంది. కాబట్టి “ఆ దినమైనను గడియయైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి” అని ప్రబోధించిన యేసు మాటలను మనమందరం లక్ష్యపెట్టుదము గాక.​—⁠మత్తయి 25:13.

[అధస్సూచీలు]

^ పేరా 5 అపొస్తలుల మరణం తర్వాత అభిషిక్త క్రైస్తవ పెద్దల తరగతి నుండి “క్రూరమైన తోడేళ్లు” ప్రవేశించినట్లే ఇదీ జరిగింది.​—⁠అపొస్తలుల కార్యములు 20:29, 30.

^ పేరా 10 యేసు ఉపమానపు మరో చర్చకోసం యెహోవాసాక్షులు ప్రచురించిన “సమాధానకర్తయగు అధిపతి” ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్త భద్రత (ఆంగ్లం) అనే పుస్తకంలో 5, 6 అధ్యాయాలు చూడండి.

మీరు వివరించగలరా?

యేసు తన శిష్యులను ఎప్పుడు పరీక్షించాడు, ఆయన ఏమి కనుగొన్నాడు?

అభిషిక్త క్రైస్తవులు కొందరు ఎందుకు ‘దుష్టుడైన దాసుని’ స్వభావం వృద్ధిచేసుకున్నారు?

ఆధ్యాత్మికంగా బుద్ధిగలవారమని మనకైమనం ఎలా చూపించవచ్చు?

యేసు నమ్మకమైన అభిషిక్త సహోదరులను అనుకరిస్తూ మనమే విధంగా ‘వ్యాపారము’ చేస్తుండవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1. ‘దాసుని’ పరీక్షించినప్పుడు యేసు ఏమి కనుగొన్నాడు?

2, 3. ‘దుష్టుడైన దాసుడు’ ఎక్కడనుండి వచ్చాడు, ఎలా వచ్చాడు?

4. ‘దుష్టుడైన దాసునితో,’ అదే స్వభావం కనబరచిన వారందరితో యేసు ఎలా వ్యవహరించాడు?

5. ‘దుష్టుడైన దాసునికి’ భిన్నంగా నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు ఎలా ప్రతిస్పందించాడు?

6. (ఎ) యేసు తన నమ్మకమైన దాసుని తరగతి బుద్ధిని ఎలా ఉదహరించాడు? (బి) అభిషిక్త క్రైస్తవులు 1914కు ముందు ఎలాంటి సందేశం ప్రకటించారు?

7. అభిషిక్త క్రైస్తవులు అలంకారార్థ భావంలో ఎప్పుడు మరియు ఎందుకు ‘నిద్రపోయారు’?

8. “ఇదిగో పెండ్లికుమారుడు” అనే పిలుపుకు దారితీసేలా ఏ సంఘటన జరిగింది, అభిషిక్త క్రైస్తవులు ఏమి చేయడానికి అది సమయం?

9, 10. ఎందుకు 1919లో, కొందరు ‘బుద్ధిగలవారిగా’ కొందరు ‘బుద్ధిలేనివారిగా’ ఉన్నారు?

11. బుద్ధిలేని కన్యకలకు ఏమి సంభవించింది?

12. (ఎ) నమ్మకత్వాన్ని ఉదహరించడానికి యేసు ఏమి ఉపయోగించాడు? (బి) “దేశాంతరము” వెళ్లిన మనుష్యుడు ఎవరు?

13. యేసు ఎలా ఒక విస్తారమైన కార్యక్షేత్రాన్ని సిద్ధంచేసి, తన ‘దాసులకు’ వ్యాపారం చేసే అధికారాన్ని అప్పగించాడు?

14. అందరూ ఒకే మొత్తంలో వ్యాపారం చేయాలని ఎందుకు ఆశించబడడం లేదు?

15, 16. (ఎ) లెక్కచూసుకోవలసిన సమయమేది? (బి) ‘వ్యాపారము చేసే’ ఎలాంటి కొత్త అవకాశాలు నమ్మకస్థులకు ఇవ్వబడ్డాయి?

17. నమ్మకస్థులైన అభిషిక్త క్రైస్తవులు ఎలా ‘యజమాని సంతోషములో పాలుపంచుకున్నారు’?

18. కొందరెందుకు ఆ పరీక్షలో కృతార్థులు కాలేదు, దాని ఫలితమేమిటి?

19. పరీక్షా విధానం ఏ విధంగా కొనసాగింది, అభిషిక్త క్రైస్తవులందరూ ఏమి చేయడానికి తీర్మానించుకున్నారు?

20. (ఎ) వేరేగొఱ్ఱెలు నేడు ఏమిచేయడానికి తీర్మానించుకున్నారు? (బి) అభిషిక్త క్రైస్తవులకు ఏ విషయం తెలుసు?

21. క్రైస్తవులందరికీ అంటే 1919కు ముందు నుండి నేటి వరకు ఉన్నవారందరికీ ఏ ప్రబోధన అన్వయిస్తుంది?

[16వ పేజీలోని బాక్సు]

యేసు ఎప్పుడు వస్తాడు?

మత్తయి 24, 25 అధ్యాయాల్లో యేసు విభిన్న భావాల్లో ‘వస్తున్నట్లు’ చెప్పబడింది. ‘వచ్చేందుకు’ ఆయన స్థలమార్పిడి చేయనవసరం లేదు. బదులుగా, ఆయన తరచూ తీర్పు తీర్చడానికి, మానవాళివైపు లేదా తన అనుచరులవైపు తన శ్రద్ధ మళ్లిస్తాడనే భావంలో ఆయన ‘వస్తాడు.’ ఆ విధంగా ఆయన 1914లో సింహాసనాసీనుడైన రాజుగా తన ప్రత్యక్షతను ఆరంభించేందుకు ‘వచ్చాడు.’ (మత్తయి 16:28; 17:1; అపొస్తలుల కార్యములు 1:​11) 1918లో ఆయన నిబంధన దూతగా ‘వచ్చి’ యెహోవాను సేవిస్తున్నామని చెప్పుకునే వారికి తీర్పుతీర్చడం మొదలుపెట్టాడు. (మలాకీ 3:1-3; 1 పేతురు 4:​17) అర్మగిద్దోనులో యెహోవా శత్రువులకు తీర్పు తీర్చడానికి ఆయన ‘వస్తాడు.’​—⁠ప్రకటన 19:11-16.

మత్తయి 24:​29-44 మరియు 25:31-46 వచనాల్లో సూచించబడిన వచ్చుట (లేదా రావడం) “మహాశ్రమల” సమయంలో జరుగుతుంది. (ప్రకటన 7:​14) మరోవైపున, మత్తయి 24:⁠45 నుండి 25:⁠30 వచనాల్లో అనేకమార్లు ప్రస్తావించబడిన వచ్చుట, శిష్యులని చెప్పుకుంటున్న వారికి 1918 నుండి తీర్పు తీర్చడానికి సంబంధించినది. ఉదాహరణకు, నమ్మకమైన దాసునికి ప్రతిఫలమివ్వడం, బుద్ధిలేని కన్యకలకు తీర్పుతీర్చడం, యజమాని తలాంతును దాచిన సోమరియైన దాసునికి తీర్పుతీర్చడం మహాశ్రమలప్పుడు యేసు ‘వచ్చినప్పుడు’ జరుగుతాయని చెప్పడం సముచితంగా ఉండదు. అది ఆ సమయంలో అనేకమంది అభిషిక్తులు అపనమ్మకస్థులుగా కనుగొనబడతారనీ అందువల్ల వారి స్థానాలు భర్తీచేయాలనే భావమిస్తుంది. అయితే ఆ సమయానికల్లా క్రీస్తు అభిషిక్త దాసులందరూ శాశ్వతంగా ‘ముద్రించబడడం’ పూర్తవుతుందని ప్రకటన 7:3 సూచిస్తోంది.

[14వ పేజీలోని చిత్రం]

‘దుష్టుడైన దాసునికి’ 1919లో ఎలాంటి ఆశీర్వాదాలు లభించలేదు

[15వ పేజీలోని చిత్రం]

పెండ్లికుమారుడు వచ్చినప్పుడు బుద్ధిగల కన్యకలు సిద్ధంగా ఉన్నారు

[17వ పేజీలోని చిత్రం]

నమ్మకమైన దాసుడు ‘వ్యాపారము’ చేశాడు

సోమరియైన దాసుడు చేయలేదు

[18వ పేజీలోని చిత్రాలు]

అభిషిక్తులు, గొప్పసమూహం తమ వెలుగు ప్రకాశింపజేయడంలో కొనసాగుతున్నారు