కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిజ క్రైస్తవత్వం వర్ధిల్లుతోంది

నిజ క్రైస్తవత్వం వర్ధిల్లుతోంది

నిజ క్రైస్తవత్వం వర్ధిల్లుతోంది

మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు పరిచర్య ప్రపంచ రంగస్థలం మీదికి దూసుకువచ్చింది. ఆయన సందేశం ప్రజలకు ఆశ్చర్యం కలిగించేంత ఉత్తేజవంతంగా, జ్ఞానాన్నిచ్చేదిగా, పురికొల్పేదిగా ఉండేది. ఆయన ప్రబోధం విన్న అనేకులు ఆయన మాటలకు చలించిపోయారు.​—⁠మత్తయి 7:28, 29.

యేసు అప్పుడున్న కఠినమైన మత, రాజకీయ విధానాల్లో పాలుపంచుకోవడాన్ని నిర్భయంగా నిరాకరించాడు గానీ సామాన్యులకు తననుతాను అందుబాటులో ఉంచుకున్నాడు. (మత్తయి 11:​25-30) ఈ భూమ్మీద విస్తరించిన దుష్టాత్మల ప్రభావాన్ని ఆయన బహిరంగంగా అంగీకరించి, వారిపై తనకున్న దైవానుగ్రహ బలాన్ని ప్రదర్శించాడు. (మత్తయి 4:2-11, 24; యోహాను 14:​30) యేసు నేర్పుగా బాధకు, పాపానికి మధ్యవున్న సంబంధాన్ని విశదపరచి, శాశ్వతమైన విడుదలకు దేవుని రాజ్యమే పరిష్కారమని ప్రేమపూర్వకంగా సూచించాడు. (మార్కు 2:1-12; లూకా 11:​2, 17-23) ఆయన తన తండ్రి నిజ వ్యక్తిత్వాన్ని అప్పటివరకు మరుగుచేసిన అంధకారపు ముసుగును శాశ్వతంగా తొలగించి, దేవునితో వ్యక్తిగత సంబంధంపట్ల ఆసక్తి చూపించిన వారందరికీ దేవుని నామం వెల్లడిచేశాడు.​—⁠యోహాను 17:6, 26.

కాబట్టి, మత, రాజకీయ హింస ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ యేసు శిష్యులు శక్తిమంతమైన ఆయన సందేశాన్ని చాలా వేగంగా వ్యాప్తిచేశారంటే అందులో ఆశ్చర్యం లేదు. దాదాపు 30 సంవత్సరాల్లో ఆఫ్రికా, ఆసియా, ఐరోపాల్లో చురుకైన క్రైస్తవ సంఘాలు నెలకొల్పబడ్డాయి. (కొలొస్సయులు 1:​23) యేసు బోధించిన సరళమైన సత్యాలు రోమా సామ్రాజ్యమంతటా వినయస్థుల, సరైన మనోవైఖరిగల ప్రజల హృదయాలకు జ్ఞానోదయం కలిగించాయి.​—⁠ఎఫెసీయులు 1:17, 18.

అయితే విభిన్న ఆర్థిక, సాంస్కృతిక, భాషాపరమైన, మతపరమైన నేపథ్యాలనుండి వచ్చిన ఈ కొత్త శిష్యులందరూ, అపొస్తలుడైన పౌలు పిలిచినట్లుగా, ‘ఒకే విశ్వాసంలో’ నిజమైన ఐక్యత ఎలా సాధిస్తారు? (ఎఫెసీయులు 4:⁠5) విడిపోకుండా అందరూ ‘ఏకభావముతో మాటలాడడానికి’ వారికేది సహాయం చేస్తుంది? (1 కొరింథీయులు 1:​10) నేటి నామకార్థ క్రైస్తవుల మధ్యవున్న గంభీరమైన అనైక్యత దృష్ట్యా, యేసు స్వయంగా ఏమి బోధించాడో మనం పరిశీలించడం మంచిది.

క్రైస్తవ ఐక్యతకు ఆధారం

యేసు పొంతి పిలాతు ఎదుట న్యాయపరీక్షను ఎదుర్కొన్నప్పుడు క్రైస్తవ ఐక్యతకుగల ఆధారాన్ని గుర్తిస్తూ ఇలా అన్నాడు: “సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని; సత్యసంబంధియైన ప్రతివాడును నా మాట వినును.” (యోహాను 18:​37) అందువల్ల, యేసు బోధలతోపాటు, దేవుని ప్రేరేపిత వాక్యమైన బైబిలులోని మిగతా భాగాన్నంతటినీ అంగీకరించడం క్రీస్తు నిజ శిష్యులపై ఐక్యపరిచే బలమైన ప్రభావం చూపిస్తుంది.​—⁠1 కొరింథీయులు 4:6; 2 తిమోతి 3:16, 17.

నిజమే, యేసు శిష్యులకు కొన్నిసార్లు యథార్థమైన ప్రశ్నలు లేదా వారిలోవారికి అభిప్రాయ భేదాలు ఉంటుండవచ్చు. అప్పుడేమిటి? యేసు ఇలా వివరించాడు: “ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును.” (యోహాను 16:​12, 13) కాబట్టి దేవుని పరిశుద్ధాత్మ క్రమేపీ దేవునిచేత వెల్లడిచేయబడే సత్యాలను యేసు నిజ శిష్యులు అర్థంచేసుకోవడానికి సహాయం చేస్తుంది. అంతేకాకుండా, ఆ ఆత్మ ప్రేమ, సంతోషం, సమాధానం వంటి ఫలాల్ని ఫలింపజేస్తుంది, అవి వారిలోని ఐక్యతకు దోహదపడతాయి.​—⁠అపొస్తలుల కార్యములు 15:28; గలతీయులు 5:22.

యేసు తన శిష్యుల మధ్య విరోధాలకు లేదా ముఠాలకు తావివ్వలేదు; లేదా తాము కలిసేవారి సాంస్కృతిక లేదా మత సంప్రదాయాలకు తగ్గట్టు దైవిక సత్యాలకు భాష్యం చెప్పడానికి ఆయన వారికి అధికారం ఇవ్వలేదు. బదులుగా, ఆయన వారితో గడిపిన చివరిరాత్రి తీవ్రంగా ఇలా ప్రార్థించాడు: “నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున, వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచు వారందరును ఏకమైయుండవలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను.” (యోహాను 17:​20, 21) కాబట్టి ఆత్మలోనూ, సత్యములోనూ నిజమైన ఐక్యత, ఆరంభం నుండి మనకాలం వరకు క్రీస్తు శిష్యులకు గుర్తింపు చిహ్నంగా ఉంది. (యోహాను 4:​23, 24) అయితే నేటి చర్చీలు ఐక్యంగా లేవు, అవి విడిపోయాయి. ఎందుకు అలా జరిగింది?

చర్చీలు ఎందుకు విడిపోయాయి?

నిర్మొహమాటంగా చెప్పాలంటే, నేటి నామకార్థ క్రైస్తవుల మధ్య విస్తృతంగావున్న భిన్నమైన నమ్మకాలకు, అభ్యాసాలకు కారణం అవి యేసు బోధలకు హత్తుకొని ఉండకపోవడమే. ఒక రచయిత “గతంలోవలెనే నేటి కొత్త క్రైస్తవులు కూడా తమ అవసరాలకు సరిపడేవాటిని మాత్రమే బైబిలు నుండి ఆమోదించడానికీ, తమ స్థానిక మత సంప్రదాయాలకు పొందికలేని వాటిని పెడచెవినబెట్టడానికీ మొగ్గుచూపుతున్నారు” అని తన అభిప్రాయం చెప్పాడు. ఖచ్చితంగా ఇలాగే జరుగుతుందని యేసు, ఆయన అపొస్తలులు ముందేచెప్పారు.

ఉదాహరణకు, అపొస్తలుడైన పౌలు తన తోటి పైవిచారణకర్తయైన తిమోతికి దైవ ప్రేరణతో ఇలా వ్రాశాడు: “జనులు హితబోధను సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని, సత్యమునకు చెవి నియ్యక కల్పనాకథలవైపునకు తిరుగుకాలము వచ్చును.” క్రైస్తవులు అందరూ మోసగించబడతారా? లేదు. పౌలు ఇంకా ఇలా చెప్పాడు: “అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము.” (2 తిమోతి 4:3-5; లూకా 21:8; అపొస్తలుల కార్యములు 20:29, 30; 2 పేతురు 2:​1-3) తిమోతి, ఇతర నమ్మకమైన క్రైస్తవులు ఆ ప్రేరేపిత ఉపదేశానికి అనుగుణంగా జీవించారు.

నిజ క్రైస్తవులు ఇప్పటికీ ఐక్యంగానే ఉన్నారు

తిమోతిలాగే నేటి నిజ క్రైస్తవులు మానవ తర్కాలను నిరాకరిస్తూ, తమ సైద్ధాంతిక నమ్మకాలకు కేవలం లేఖన అధికారాన్ని మాత్రమే అంగీకరిస్తూ తమ జ్ఞానేంద్రియాలను కాపాడుకుంటున్నారు. (కొలొస్సయులు 2:8; 1 యోహాను 4:⁠1) మొదటి శతాబ్దపు క్రైస్తవులను అనుకరిస్తూ యెహోవాసాక్షులు 230కి పైగా దేశాల్లో తమ పరిచర్య కొనసాగిస్తూ, ప్రతీ ప్రాంతమందున్న ప్రజలకు యేసు ముఖ్య సందేశమైన రాజ్య సువార్తను ప్రకటిస్తున్నారు. వారెక్కడ జీవిస్తున్నా ఐక్యంగా యేసును అనుకరించడంలో, నిజ క్రైస్తవత్వాన్ని అభ్యసించడంలో పాటించే నాలుగు ముఖ్య విధానాలను పరిశీలించండి.

వారి నమ్మకాలు దేవుని వాక్యంపై ఆధారపడి ఉన్నాయి. (యోహాను 17:​17) బెల్జియంలోని ఒక పారిష్‌ ప్రీస్టు వారి గురించి ఇలా వ్రాశాడు: “వారి నుండి [యెహోవాసాక్షుల నుండి] మనం నేర్చుకోగల ఒక సంగతేమిటంటే దేవుని వాక్యాన్ని వినాలని వారికున్న ఇష్టత, దాని గురించి సాక్ష్యమివ్వడానికి వారికున్న ధైర్యం.”

భౌగోళిక సమస్యల పరిష్కారం కోసం వారు దేవుని రాజ్యంవైపు చూస్తారు. (లూకా 8:⁠1) కొలంబియాలోని బారన్‌క్విలాలో ఒక రాజకీయ ఉద్యమానికి బలంగా మద్దతునిచ్చే ఆంటొనియోతో ఒక సాక్షి మాట్లాడాడు. ఆ సాక్షి అతని పక్షం వహించలేదు లేదా మరో రాజకీయ ఆలోచనా విధానం పక్షాన మాట్లాడలేదు. బదులుగా ఆయన ఆంటొనియోతో అతని సోదరీలతో ఉచితంగా బైబిలు అధ్యయనం చేస్తానని ప్రతిపాదించాడు. త్వరలోనే ఆంటొనియో కొలంబియాలోని, మిగతా ప్రపంచంలోని బీదలకు దేవుని రాజ్యం మాత్రమే నిజమైన నిరీక్షణ అని గ్రహించాడు.

వారు దేవుని నామాన్ని ఘనపరుస్తారు. (మత్తయి 6:⁠9) యథార్థ క్యాథలిక్‌గా ఆస్ట్రేలియాలో నివసిస్తున్న మారీయాను యెహోవాసాక్షులు మొదటిసారి కలిసినప్పుడు, సాక్షులు తనకు దేవుని నామాన్ని బైబిలు నుండి చూపించడానికి ఆమె అనుమతించింది. ఆమె ఎలా ప్రతిస్పందించింది? “మొదటిసారి నేను బైబిల్లో దేవుని నామం చూసినప్పుడు, నా కళ్లలో నీళ్లు తిరిగాయి. నేను నిజంగా దేవుని వ్యక్తిగత నామం తెలుసుకొని దాన్ని ఉపయోగించవచ్చనే పరిజ్ఞానాన్నిబట్టి ఎంతో చలించిపోయాను.” మారీయా బైబిలు అధ్యయనం కొనసాగించి, తన జీవితంలో మొదటిసారిగా ఆమె యెహోవాను ఒక వ్యక్తిగా తెలుసుకొని ఆయనతో శాశ్వత సంబంధాన్ని నెలకొల్పుకోగలిగింది.

వారు ప్రేమచే ఐక్యపరచబడ్డారు. (యోహాను 13:​34, 35) కెనడాకు చెందిన, ద లేడీ స్మిత్‌-షెమెనెస్‌ క్రానికల్‌లోని సంపాదకీయం ఇలా వ్యాఖ్యానించింది: “మీకు మత నమ్మకం ఉన్నా లేకున్నా, కాస్సిడిలో 2,300 చదరపు మీటర్ల అసెంబ్లీ హాలు నిర్మాణంలో గత పదిన్నర రోజులుగా 24 గంటలూ పనిచేసిన యెహోవాసాక్షులను మీరు మెచ్చుకోవలసిందే . . . వాదనలు, విరోధాలు లేకుండా, వ్యక్తిగత ఘనతను కోరుకోకుండా దీనిని సంతోషంగా చేయడం నిజ క్రైస్తవత్వానికి గుర్తు.”

కాబట్టి రుజువును పరిశీలించండి. క్రైస్తవమత సామ్రాజ్య వేదాంతులు, మిషనరీలు, చర్చీలకు వెళ్లేవారు తమ చర్చీల్లో ముంచుకొస్తున్న వివాదాల తుఫానులో కొట్టుమిట్టాడుతుండగా, నిజ క్రైస్తవత్వం ప్రపంచవ్యాప్తంగా పరిఢవిల్లుతోంది. వాస్తవానికి, నిజ క్రైస్తవులు దేవుని వాక్యం ప్రకటించమని, బోధించమని తమకివ్వబడిన పరిచర్యను నెరవేరుస్తున్నారు. (మత్తయి 24:14; 28:​19, 20) మీరు ఇప్పుడు జరుగుతున్న హేయకృత్యముల విషయమై ‘మూల్గులిడుచు ప్రలాపిస్తూ,’ క్రైస్తవమత సామ్రాజ్యపు మతాల్లోని అనైక్యతవల్ల కలతచెందుతున్న వారిలో ఉన్నట్లయితే, అద్వితీయ సత్యదేవుడైన యెహోవా ఐక్య క్రైస్తవ ఆరాధనలో యెహోవాసాక్షులతో కలవమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.​—⁠యెహెజ్కేలు 9:4; యెషయా 2:2-4.