ఏహూదు నిరంకుశుని కాడి విరగగొట్టడం
ఏహూదు నిరంకుశుని కాడి విరగగొట్టడం
ధైర్యానికి, వ్యూహరచనకు సంబంధించి నిజంగా జరిగిన కథ. దాదాపు 3,000 సంవత్సరాల క్రితం ఇది జరిగింది. లేఖన వృత్తాంతం ఈ మాటలతో ప్రారంభమవుతుంది: “ఇశ్రాయేలీయులు మరల యెహోవా దృష్టికి దోషులైరి గనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలీయులతో యుద్ధముచేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరచెను. అతడు అమ్మోనీయులను అమాలేకీయులను సమకూర్చుకొని పోయి ఇశ్రాయేలీయులను ఓడగొట్టి ఖర్జూరచెట్ల పట్టణమును స్వాధీనపరచుకొనెను. ఇశ్రాయేలీయులు పదునెనిమిది సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైరి.”—న్యాయాధిపతులు 3:12-14.
మోయాబీయుల అధీనప్రాంతం యొర్దాను నదికి, మృత సముద్రానికి తూర్పుదిక్కున ఉంది. కానీ వారు నదిని దాటి ‘ఖర్జూరచెట్లుగల పట్టణమైన’ యెరికో చుట్టుపక్కల ప్రాంతాన్ని ఆక్రమించుకొని, ఇశ్రాయేలీయులపై పెత్తనం చేయడం ఆరంభించారు. (ద్వితీయోపదేశకాండము 34:3, NW) మోయాబు రాజైన ఎగ్లోను “బహు స్థూలకాయుడు,” అతను రెండు దశాబ్దాలపాటు ఇశ్రాయేలీయుల నుండి భారమైన, వారిని అవమానపరిచే విధంగా కప్పం వసూలు చేశాడు. (న్యాయాధిపతులు 3:17) అయితే కప్పం కట్టమని అతను బలవంతం చేయడమే ఆ నియంతను నేలకూల్చే అవకాశం కల్పించింది.
ఆ వృత్తాంతం ఇలా చెబుతోంది: “ఇశ్రాయేలీయులు యెహోవాకు మొఱ్ఱపెట్టగా బెన్యామీనీయుడైన గెరా కుమారుడగు ఏహూదను రక్షకుని వారికొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమచేతి పనివాడు. అతనిచేతను ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పం[పారు].” (న్యాయాధిపతులు 3:15) కప్పం పంపించేందుకు ఏహూదు ఎంపికచేయబడేలా యెహోవా నిశ్చయించి ఉంటాడు. ఏహూదు అంతకు ముందు ఆ విధి నిర్వహించాడో లేదో చెప్పబడలేదు. అయితే ఆయన రాజును కలవడానికి జాగ్రత్తగా సిద్ధపడడాన్ని ఆయన ఉపయోగించిన వ్యూహాన్నిబట్టి ఆయనకు ఎగ్లోను రాజభవనంతో పరిచయముందనీ అక్కడ ఏమి ఎదురవగలదో ఆయనకు తెలుసనీ అర్థమవుతోంది. ఇదంతా ఒక ఎత్తు అతను ఎడమచేతి వాటం కలవాడు కావడం మరోఎత్తు.
వికలాంగుడా లేక వీరుడా?
“ఎడమచేతి పనివాడు” అంటే కుడిచెయ్యి ‘పనిచెయ్యనిదని, కుంటిదని, లేక కట్టబడినదని’ అక్షరార్థ భావం. అంటే ఏహూదు వికలాంగుడనీ బహుశా ఆయనకు వైకల్యంగల కుడిచేయి ఉందని దీనర్థమా? బెన్యామీను వంశంలోని “ఏడువందలమంది” ఎడమచేతి వాటముగలవారి గురించి బైబిలు ఏమి చెబుతోందో గమనించండి. “వీరిలో ప్రతివాడును గురిగా నుంచబడిన తలవెండ్రుక మీదికి వడిసెలరాయి తప్పక విసరగలవాడు” అని న్యాయాధిపతులు 20:16 చెబుతోంది. యుద్ధంలో వారికున్న వీరత్వాన్ని బట్టే బహుశా వారు ఎంపికచేయబడ్డారు. కొంతమంది బైబిలు విద్వాంసుల ప్రకారం, “ఎడమచేతి పనివాడు” అంటే ఎడమచేతిని కుడిచేతిని ఒకేవిధంగా ఉపయోగించే ప్రజ్ఞగలవాడిని సూచిస్తుంది.—న్యాయాధిపతులు 3:15.
వాస్తవానికి బెన్యామీను గోత్రం తమ ఎడమచేతి వాటానికి ప్రఖ్యాతిగాంచింది. మొదటి దినవృత్తాంతములు 12:1, 2 వచనాలు, బెన్యామీనీయులు ‘పరాక్రమశాలులు యుద్ధ సహాయము చేయువారు. వీరు విలుకాండ్రయి కుడి యెడమ చేతులతో వడిసెలచేత రాళ్లు రువ్వుటకును వింటిచేత అంబులు విడుచుటకును సమర్థులైన వారు’ అని చెబుతున్నాయి. “బాల్యదశ నుండి కుడిచేతిని కట్టుకొని, ఆ విధంగా ‘కుడిచేతి ప్రమేయం లేకుండా దానికి కట్టేసుకొని’ ఎడమచేతితో ప్రావీణ్యతను పెంపొందించుకోవడం ద్వారా” ఈ సామర్థ్యాన్ని సంపాదించుకోవచ్చని ఒక రెఫరెన్సు గ్రంథం చెబుతోంది. ఇశ్రాయేలీయుల శత్రువులు సాధారణంగా కుడిచేతి వాటంగల యోధులను ఎదుర్కోవడంలోనే శిక్షణపొందేవారు. కాబట్టి, అనుకోకుండా ఎడమచేతి వాటంగల సైనికుడు ఎదురైనప్పుడు శత్రువుల శిక్షణ పనికిరాకుండా పోయే అవకాశముంది.
రాజుకు ఒక “రహస్యమైన మాట”
ఏహూదు మొట్టమొదట రెండంచులుండి తన దుస్తుల క్రింద దాచుకోగలిగేంత పొట్టి కత్తి ఒకటి ‘చేయించుకున్నాడు.’ అక్కడ తనిఖీ జరుగుతుందని ఆయన ముందే ఊహించివుంటాడు. సాధారణంగా కుడిచేతి వాటంగలవారు వేగంగా ఖడ్గం దూసేందుకు అనువుగా వాటిని కుడివైపున ధరిస్తారు. ఏహూదు ఎడమచేతి వాటంగలవాడు గనుక ఆయన తన ఆయుధాన్ని, రాజు యొక్క రక్షకభటులు తనిఖీచేసే అవకాశం చాలా తక్కువగా ఉన్న చోట అంటే “తన వస్త్రములో తన కుడి తొడమీద” కట్టుకున్నాడు. దానివల్ల ఆయన ‘మోయాబురాజైన ఎగ్లోనుకు కప్పము’ కట్టేందుకు ఎలాంటి అవరోధం లేకుండా వెళ్ళగలిగాడు.—న్యాయాధిపతులు 3:16, 17.
ఎగ్లోను రాజస్థానంలో మొదట జరిగిన సంఘటనల వివరాలు ఇవ్వబడలేదు. బైబిలు కేవలం ఇలా చెబుతోంది: “ఏహూదు ఆ కప్పము తెచ్చియిచ్చిన తరువాత కప్పము మోసిన జనులను వెళ్లనం[పాడు].” (న్యాయాధిపతులు 3:18) ఏహూదు కప్పం కట్టాడు, కప్పం మోసుకొచ్చినవారిని ఎగ్లోను నివాసం నుండి సురక్షితమైన దూరం వరకు వారితోకూడా వెళ్లి, అక్కడనుండి వారిని పంపించిన తర్వాత మళ్ళీ తిరిగివచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆయనతో వచ్చినవాళ్ళు ఆయన రక్షణ కోసం వచ్చారా లేక కేవలం విధి నిర్వహణ కోసం వచ్చారా లేక బహుశా కప్పం మోసుకొచ్చేవారిగానే వచ్చారా? ఆయన తన పథకాన్ని అమలుపరచడానికి ముందు వారిని సురక్షిత స్థలానికి పంపించాలన్నది ఆయన ఉద్దేశమా? ఆయన ఆలోచన ఏదైనప్పటికీ ఏహూదు ఒంటరిగానే ధైర్యంగా వెనక్కి వచ్చాడు.
“[ఏహూదు] గిల్గాలు దగ్గరనున్న పెసీలీమునొద్దనుండి తిరిగి వచ్చి—రాజా, రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పవలెను” అని అన్నాడు. ఆయన ఎగ్లోను రాజస్థానంలోకి మళ్ళీ ఎలా వెళ్ళాడో లేఖనాల్లో వివరించబడలేదు. రక్షకభటులు ఆయనను అనుమానించలేదా? వాళ్ళు ఒక ఒంటరి ఇశ్రాయేలీయుని వలన తమ ప్రభువుకు ఏమి భయంలే అనుకున్నారా? ఏహూదు ఒంటరిగా రావడం ఆయన తన దేశప్రజలను మోసం చేస్తున్నాడనే ఆలోచనకు తావిస్తుందా? ఏదేమైనా ఏహూదు రాజును ఒంటరిగా కలుసుకోవడానికి ప్రయత్నించి, అతణ్ణి కలుసుకున్నాడు.—న్యాయాధిపతులు 3:19.
ప్రేరేపిత వృత్తాంతం ఇంకా ఇలా కొనసాగుతోంది: “ఏహూదు [ఎగ్లోను] దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడ గదిలో కూర్చుండి యుండెను. ఏహూదు—నీతో నేను చెప్పవలసిన దేవునిమాట ఒకటి యున్నది” అని చెప్పాడు. ఏహూదు దేవుని నుండి వచ్చిన మౌఖిక సందేశాన్ని సూచించడం లేదు, కానీ తన కత్తిని ఉపయోగించాలనేదే ఆయన మనసులో ఉంది. రాజు తన దేవత కెమోషు నుండి ఏదైనా సందేశమేమోనని ఆశించి, “తన పీఠముమీదనుండి లేచెను.” అప్పుడు ఏహూదు మెరుపు వేగంతో తన ఆయుధం బయటకు లాగి ఎగ్లోను పొట్టలో పొడిచాడు. బహుశా ఆ కత్తి పిడికి అడ్డపట్టి లేనట్లుంది. అందుకే “పిడియును కత్తివెంబడి దూరగా క్రొవ్వు కత్తి పైని కప్పుకొని . . . వెనుకనుండి బయటికి వచ్చి యుండెను.”—న్యాయాధిపతులు 3:20-22.
సులభంగా తప్పించుకోవడం
తన కత్తిని వెనక్కు తీసుకోవడానికి సమయం తీసుకోకుండా, “ఏహూదు పంచపాళిలోనికి బయలువెళ్లి తన వెనుకను ఆ మేడగది తలుపు వేసి గడియ పెట్టెను. అతడు బయలువెళ్లిన తరువాత ఆ రాజు దాసులు లోపలికివచ్చి చూడగా ఆ మేడగది తలుపులు గడియలు వేసియుండెను గనుక వారు—అతడు చల్లని గదిలో శంకానివర్తికి పోయి యున్నాడనుకొ[న్నారు].”—న్యాయాధిపతులు 3:23, 24.
ఏహూదు బయలువెళ్ళిన “పంచపాళి” ఏమిటి? “దాని [హీబ్రూ మూలపదానికి] ఖచ్చితమైన భావమేమిటో తెలియదు,” కానీ “‘వసారా,’ ‘మండువా,’ను సూచిస్తోంది” అని ఒక రెఫరెన్సు గ్రంథం చెబుతోంది. ఏహూదు తలుపులు లోపలి నుండే తాళం వేసి వేరే మార్గం గుండా వెళ్ళిపోయాడా? లేక ఆయన చనిపోయిన
రాజు నుండి తాళం చేతులు తీసుకొని బయట నుండే తాళం వేశాడా? ఆ తర్వాత ఆయన ఏమీ జరగనట్లే రక్షక భటుల ముందునుండి మామూలుగా నడిచి వెళ్ళిపోయాడా? లేఖనాలు ఏమీ చెప్పడం లేదు. ఏహూదు ఎలాంటి పథకం ఉపయోగించినా, తాళం వేసివున్న తలుపులను చూసి ఎగ్లోను సేవకులు వెంటనే ఏమీ సందేహించలేదు. వాళ్ళు రాజు “శంకానివర్తికి” పోయాడని అనుకున్నారు.రాజు సేవకులు అటూ ఇటూ తచ్చాడుతుండగా ఏహూదు తప్పించుకుపోయాడు. ఆ తర్వాత ఆయన తన స్వదేశీయులను సమకూర్చి ఇలా అన్నాడు: “నా వెంబడి త్వరగా రండి; మీ శత్రువులైన మోయాబీయులను యెహోవా మీ చేతి కప్పగించుచున్నాడు.” ఏహూదు మనుష్యులు యొర్దాను రేవులను ఆక్రమించుకొని, నాయకుడులేని మోయాబీయులు తమ స్వదేశానికి తప్పించుకొని పారిపోకుండా మార్గాన్ని మూసివేశారు. ఆ విధంగా “ఆ కాలమున వారు [ఇశ్రాయేలీయులు] మోయాబీయులలో బలముగల శూరులైన పరాక్రమశాలులను పదివేలమందిని చంపిరి; ఒకడును తప్పించుకొనలేదు. ఆ దినమున మోయాబీయులు ఇశ్రాయేలీయుల చేతిక్రింద అణపబడగా దేశము ఎనుబది సంవత్సరములు నిమ్మళముగా ఉండెను.”—న్యాయాధిపతులు 3:25-30.
మనం నేర్చుకోగల పాఠాలు
ఏహూదు రోజుల్లో జరిగింది మనకు ఏమి బోధిస్తోందంటే, మనం యెహోవా దృష్టిలో చెడ్డదాన్ని చేసినప్పుడు విపత్కరమైన పరిణామాలుంటాయి. మరోవైపున, పశ్చాత్తాపంతో ఆయనవైపు తిరిగేవాళ్ళకు యెహోవా సహాయం చేస్తాడు.
ఏహూదు పథకాలు విజయవంతం అవడం ఆయన సొంత నైపుణ్యతలవల్లా కాదు, శత్రువులు బలహీనులైనందువల్లా కాదు. దేవుని సంకల్పాల నెరవేర్పు మానవ ప్రయత్నాల మీద ఆధారపడదు. ఏహూదు విజయానికి ప్రధాన కారణమేమిటంటే, ఆయన దేవుని ప్రజలను స్వతంత్రులను చేయాలనే తిరుగులేని దేవుని చిత్తానికి అనుగుణంగా ప్రవర్తించడం, దానికి దేవుని మద్దతు ఉండడమే. ఏహూదును దేవుడే పుట్టించాడు, ‘యెహోవా తన ప్రజల కొరకు న్యాయాధిపతులను పుట్టించినప్పుడు, ఆయనే ఆయా న్యాయాధిపతులకు తోడైయుండెను.’—న్యాయాధిపతులు 2:18; 3:15.