కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిర్గమకాండములోని ముఖ్యాంశాలు

నిర్గమకాండములోని ముఖ్యాంశాలు

యెహోవా వాక్యము సజీవమైనది

నిర్గమకాండములోని ముఖ్యాంశాలు

“కఠినముగా సేవ చేయించు”కోబడినవారి విడుదలకు సంబంధించిన యథార్థ గాథ ఇది. (నిర్గమకాండము 1:​13) ఇది ఒక జనాంగం పుట్టుక గురించిన ఉత్తేజకరమైన వృత్తాంతం కూడా. అత్యంతాశ్చర్యకరమైన అద్భుతాలు, ఉత్కృష్టమైన శాసన రూపకల్పన, దేవాలయ గుడారపు నిర్మాణం వీటిలోని ఉత్కంఠభరితమైన విషయాలు. ఇదే బైబిలు పుస్తకమైన నిర్గమకాండములోని సారాంశం.

ఇది హీబ్రూ ప్రవక్త అయిన మోషే చేత వ్రాయబడింది, యోసేపు మరణించిన సా.శ.పూ. 1657 నుండి దేవాలయ గుడారం పూర్తయిన సా.శ.పూ. 1512 వరకు అంటే 145 సంవత్సరాలకంటే ఎక్కువ కాలంలోని ఇశ్రాయేలీయుల అనుభవాల గురించి నిర్గమకాండము చెబుతుంది. అయినా ఇది కేవలం చరిత్రకు సంబంధించిన వృత్తాంతం మాత్రమే కాదు. ఇది మానవాళి కోసం ఇవ్వబడిన దేవుని వాక్యంలో లేదా సందేశంలో ఒక భాగం. ఆ విధంగా ఇది “సజీవమై బలముగలదై” ఉన్నది. (హెబ్రీయులు 4:​12) కాబట్టి నిర్గమకాండము మనకు నిజంగా ప్రయోజనకరమైనది.

‘దేవుడు వారి మూలుగును విన్నాడు’

(నిర్గమకాండము 1:1​—⁠4:31)

ఐగుప్తులో నివసిస్తున్న యాకోబు సంతానం చాలా వేగంగా అభివృద్ధి పొంది విస్తరిస్తుంది, ఆ కారణంగా వెలువడిన రాజాజ్ఞ వారిని బానిసలుగా శ్రమలకు గురిచేస్తుంది. ఇశ్రాయేలీయుల మగ శిశువులనందరినీ చంపెయ్యమని కూడా ఫరో ఆదేశిస్తాడు. అలాంటి విపత్తు నుండి తప్పించుకున్న మూడు నెలల పసికందు అయిన మోషేను ఫరో కూతురు దత్తత తీసుకొంటుంది. మోషే రాజ కుటుంబంలో పెంచబడినప్పటికీ తన 40వ యేట ఆయన తన సొంత ప్రజల పక్షం వహించి ఒక ఐగుప్తీయుని చంపేస్తాడు. (అపొస్తలుల కార్యములు 7:​23, 24) పారిపోక తప్పని పరిస్థితిలో, ఆయన మిద్యానుకు వెళ్తాడు. అక్కడ ఆయన పెళ్ళి చేసుకొని ఒక గొర్రెలకాపరిగా జీవిస్తాడు. ఒకరోజు ఆశ్చర్యం కలిగించే విధంగా మండుతున్న ఒక పొద దగ్గర, ఐగుప్తుకు తిరిగి వెళ్ళి ఇశ్రాయేలీయులను దాసత్వం నుండి విడిపించడంలో సారధ్యం వహించమని యెహోవా మోషేకు ఆదేశిస్తాడు. మోషేకు బదులుగా మాట్లాడేలా ఆయన అన్న అహరోను నియమించబడతాడు.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

3:1​—⁠యిత్రో ఎటువంటి యాజకుడు? పూర్వీకుల కాలాల్లో కుటుంబ పెద్దే తన కుటుంబ యాజకునిగా సేవచేసేవాడు. యిత్రో మిద్యానీయుల గోత్రానికి మూలపురుషుడైన పెద్ద అన్నది సుస్పష్టం. మిద్యానీయులు అబ్రాహాముకు కెతూరా ద్వారా కలిగిన సంతానం కాబట్టి, వారికి యెహోవా ఆరాధన గురించి తెలిసే ఉంటుంది.​—⁠ఆదికాండము 25:⁠1, 2.

4:​11​—⁠యెహోవా ఏ భావంలో ‘మూగవానిని చెవిటివానిని గ్రుడ్డివానిని పుట్టించాడు?’ యెహోవా కొన్ని సందర్భాల్లో గుడ్డితనం, మూగతనం కలుగజేసినా, అలాంటి వైకల్యంగల ప్రతీ వ్యక్తి విషయంలో ఆయన బాధ్యుడు కాదు. (ఆదికాండము 19:​11; లూకా 1:​20-22, 62-64) అవి వారసత్వంగా పొందిన పాపానికి సంబంధించిన పర్యవసానాలు. (యోబు 14:⁠4; రోమీయులు 5:​12) అయితే ఈ పరిస్థితిని దేవుడే అనుమతించాడు కాబట్టి, మూగవారిని, చెవిటివారిని, గుడ్డివారిని నేనే ‘పుట్టించాను’ అని ఆయన అనగలడు.

4:​16​—⁠మోషే అహరోనుకు ‘దేవుడిగా’ ఎలా ఉన్నాడు? మోషే దేవునికి ప్రతినిధిగా ఉన్నాడు. కాబట్టి మోషేకు బదులుగా మాట్లాడే అహరోనుకు మోషే ‘దేవుడిగా’ ఉన్నాడు.

మనకు పాఠాలు:

1:​7, 14. తన ప్రజలు ఐగుప్తులో నిరంకుశపాలనకు గురైనప్పుడు యెహోవా వారికి మద్దతునిచ్చాడు. అదేవిధంగా ఆయన తన ఆధునిక దిన సాక్షులకు శక్తినిస్తాడు, తీవ్ర హింసను ఎదుర్కొంటున్న సమయంలో కూడా శక్తినిస్తాడు.

1:​17​—⁠21. యెహోవా మనల్ని “మేలుకై” జ్ఞాపకముంచుకుంటాడు.​—⁠నెహెమ్యా 13:​31.

3:​7​—⁠10. యెహోవా తన ప్రజల మొరకు స్పందిస్తాడు.

3:​14. యెహోవా తన సంకల్పాలను నిశ్చయంగా నెరవేరుస్తాడు. కాబట్టి ఆయన మన బైబిలు ఆధారిత నిరీక్షణలను వాస్తవం చేస్తాడని మనం నమ్మకంతో ఉండవచ్చు.

4:​10, 13. మోషే తన మాట్లాడే సామర్థ్యంపట్ల దేవుని మద్దతు ఉన్నప్పటికీ చాలా అపనమ్మకాన్ని చూపించాడు, ఆయన ఫరోతో మాట్లాడడానికి వేరే ఎవరినైనా పంపించమని దేవుణ్ణి వేడుకున్నాడు. అయినప్పటికీ యెహోవా మోషేను ఉపయోగించుకున్నాడు, మోషేకు తన నియామకాన్ని నెరవేర్చేందుకు కావలసిన జ్ఞానాన్ని, శక్తిని ఇచ్చాడు. మనం మన అసమర్థతలపై దృష్టి కేంద్రీకరించడానికి బదులు, ప్రకటించడానికి బోధించడానికి మనకివ్వబడిన నియామకాన్ని నెరవేర్చేందుకు యెహోవా మీద ఆధారపడదాం.​—⁠మత్తయి 24:​14; 28:​19, 20.

దిగ్భ్రాంతికరమైన అద్భుతాలు విడుదలను తెచ్చాయి

(నిర్గమకాండము 5:1​—⁠15:21)

మోషే, అహరోనులు ఫరో ఎదుట హాజరై, యెహోవాకు అరణ్యములో ఉత్సవము చేసుకోవడానికి వెళ్ళేందుకు ఇశ్రాయేలీయులను అనుమతించమని అడుగుతారు. అందుకు ఐగుప్తు పాలకుడు ధిక్కరిస్తాడు. యెహోవా ఒకదాని వెంట ఒకటిగా శక్తిమంతమైన తెగుళ్లు తీసుకువచ్చేందుకు మోషేను ఉపయోగించుకుంటాడు. పదవ తెగులు తర్వాతనే ఫరో ఇశ్రాయేలీయులను పోనిస్తాడు. అయితే ఆ వెంటనే అతడు అతని సైనికులు కోపావేశంతో వెంటపడతారు. అయితే యెహోవా ఎర్ర సముద్రం గుండా తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని తెరచి తన ప్రజలను విడుదల చేస్తాడు. వెంటపడిన ఐగుప్తీయులపైన సముద్రం కప్పుకుపోవడంతో వారు మునిగిపోతారు.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

6:3​—⁠అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఏ విధంగా దేవుని పేరు తెలియజేయబడలేదు? ఈ మూలపురుషులు దేవుని పేరు ఉపయోగించారు, యెహోవా నుండి వాగ్దానాలు పొందారు. అయినప్పటికీ యెహోవాయే ఆ వాగ్దానాలు నెరవేరేలా చేస్తాడని వారికి తెలియదు లేదా అనుభవపూర్వకంగా గ్రహించలేదు.​—⁠ఆదికాండము 12:​1, 2; 15:​7, 13-16; 26:​24; 28:​10-15.

7:1​—⁠మోషే “ఫరోకు దేవునిగా” ఎలా చేయబడ్డాడు? ఫరోకు మించిన దైవిక శక్తి, అధికారం మోషేకు ఇవ్వబడ్డాయి. అందువల్ల ఆయన ఆ రాజుకు భయపడాల్సిన అవసరం లేదు.

7:​22​—⁠ఐగుప్తు యాజకులకు రక్తంగా మార్చబడని నీళ్ళు ఎక్కడ దొరికాయి? వారు ఆ తెగులు రాకముందు నైలు నది నుండి తేబడిన కొన్ని నీళ్ళను ఉపయోగించి ఉండవచ్చు. నైలు నది చుట్టు పక్కల తేమగా ఉండే నేలలో తవ్విన బావులనుండి కూడా త్రాగే నీళ్ళు తెచ్చుకునేవారని విదితమవుతోంది.​—⁠నిర్గమకాండము 7:​24.

8:​26, 27​—⁠ఇశ్రాయేలీయుల బలులు “ఐగుప్తీయులకు హేయమైన[వి]” అని మోషే ఎందుకన్నాడు? ఐగుప్తులో అనేక జంతువులు పూజించబడేవి. అందువల్ల బలులను ప్రస్తావించడం, యెహోవాకు బలి అర్పించడానికి వెళ్ళేందుకు ఇశ్రాయేలును అనుమతించమని చేసిన మోషే ప్రతిపాదనకు అదనపు బలాన్ని, ఒప్పించేశక్తిని ఇచ్చింది.

12:29​—⁠తొలిపిల్లలుగా ఎవరు పరిగణించబడ్డారు? తొలిపిల్లల్లో మగపిల్లలు మాత్రమే ఉన్నారు. (సంఖ్యాకాండము 3:​40-51) ఫరో స్వయంగా జ్యేష్ఠుడు, కానీ చంపబడలేదు. అతనికి తన సొంత కుటుంబముంది. పదవ తెగులు ఫలితంగా కుటుంబ పెద్ద చనిపోలేదు కానీ కుటుంబంలోని మొదటి కుమారుడు చనిపోయాడు.

12:40​—⁠ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఎంతకాలం ఉన్నారు? ఇక్కడ పేర్కొన్న 430 సంవత్సరాల్లో, ఇశ్రాయేలీయులు మొదట కనానులో ఆ తర్వాత ఐగుప్తులో గడిపిన కాలం ఇమిడివుంది. డెబ్బై అయిదేళ్ళ అబ్రాహాము కనానుకు వెళ్తూ యూఫ్రటీసు నదిని సా.శ.పూ. 1943లో దాటాడు. (ఆదికాండము 12:⁠4) అప్పటి నుండి 130 ఏండ్ల యాకోబు ఐగుప్తులో ప్రవేశించిన సమయం వరకు 215 సంవత్సరాలు. (ఆదికాండము 21:⁠5; 25:​26; 47:⁠9) ఆ తర్వాత ఇశ్రాయేలీయులు అంతే కాలాన్ని అంటే 215 సంవత్సరాలు ఐగుప్తులో గడిపారని దానర్థం.

15:8​—⁠ఎర్ర సముద్రంలో ‘గడ్డకట్టిన’ నీళ్ళు నిజంగానే ఘనీభవించిన నీళ్ళా? “గడ్డకట్టెను” అని అనువదించబడిన హీబ్రూ క్రియకు అర్థం సంకోచించుకుపోవడం లేదా చిక్కబడడం. యోబు 10:10లో పాలను పేరబెట్టడానికి సంబంధించి ఇదే పదం ఉపయోగించబడింది. కాబట్టి అలా గడ్డకట్టిన నీళ్ళు ఘనీభవించిన నీళ్ళను, మంచుగడ్డను సూచించాల్సిన అవసరం లేదు. నిర్గమకాండము 14:​21లో చెప్పబడ్డ “బలమైన తూర్పుగాలి” ఆ నీళ్లను ఘనీభవింపజేసేంత చల్లగావుంటే, నిస్సందేహంగా తీవ్రమైన చలిని గురించి ఏదోక ప్రస్తావన తప్పకుండా ఉండేది. నీళ్ళను ఆపుజేసినట్లుగా ఏదీ కనిపించ లేదు కాబట్టి, అవి గడ్డకట్టినట్లు, చిక్కగా లేక గట్టిపడినట్టుగా కనబడ్డాయి.

మనకు పాఠాలు:

7:⁠14​—⁠12:​30. ఆ పది తెగుళ్ళు కాకతాళీయంగా సంభవించినవి కావు. వాటి గురించి ముందే చెప్పబడింది, అవి సూచించిన ప్రకారం ఖచ్చితంగా వచ్చాయి. వాటిని తీసుకురావడాన్ని బట్టి నీళ్ళను, సూర్యుని వెలుతురును, కీటకాలను, జంతువులను, మానవులను నియంత్రించే శక్తి సృష్టికర్తకు ఉందన్న విషయం సుస్పష్టమవుతోంది! తన ఆరాధకుల రక్షణకు అంతరాయం కలుగకుండానే దేవుడు తన శత్రువులపైకి విపత్తు తీసుకురాగలడని కూడా ఈ తెగుళ్ళు చూపిస్తున్నాయి.

11:⁠2; 12:​36. యెహోవా తన ప్రజలను ఆశీర్వదిస్తాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో పడ్డ కష్టానికి పరిహారం లభించేలా ఆయన చూశాడు. వారు ఆ దేశంలోకి స్వతంత్రులుగా ప్రవేశించారు, అంతేకాని బానిసలుగా చేయబడ్డ యుద్ధఖైదీలుగా కాదు.

14:​30. రానున్న “మహా శ్రమ” నుండి యెహోవా తన ఆరాధకులను రక్షిస్తాడని మనం దృఢ నమ్మకంతో ఉండవచ్చు.​—⁠మత్తయి 24:​20-22; ప్రకటన 7:​9, 14.

యెహోవా ఒక దైవపరిపాలనా జనాంగాన్ని వ్యవస్థీకరిస్తాడు

(నిర్గమకాండము 15:22​—⁠40:38)

ఐగుప్తు నుండి విడుదలైన తర్వాత మూడవ నెలలో, ఇశ్రాయేలీయులు సీనాయి పర్వతం దగ్గర విడిదిచేస్తారు. అక్కడే వారు పది ఆజ్ఞలతోపాటు ఇతర నియమాలను పొంది, యెహోవాతో ఒక నిబంధనలోకి వచ్చి, దైవపరిపాలనా జనాంగంగా తయారయ్యారు. మోషే సత్యారాధనకు సంబంధించిన సూచనలు, మోసుకెళ్లడానికి అనుకూలమైన యెహోవా దేవాలయపు గుడార నిర్మాణానికి సంబంధించిన సూచనలు పొందుతూ పర్వతం పైనే 40 రోజులు గడుపుతాడు. ఈ లోపల ఇశ్రాయేలీయులు ఒక బంగారు దూడను చేసుకొని ఆరాధిస్తుంటారు. పర్వతం నుండి దిగివస్తున్న మోషే అది చూసి కోపంతో మండిపడి దేవుడు తనకిచ్చిన రెండు రాతి పలకలను పగులగొడతాడు. తప్పిదస్థులకు తగిన శిక్ష విధించిన తర్వాత ఆయన మళ్ళీ పర్వతం మీదకు వెళ్ళి మరో రెండు రాతిపలకలను పొందుతాడు. మోషే తిరిగి వచ్చాక దేవాలయ గుడార నిర్మాణం మొదలవుతుంది. ఇశ్రాయేలీయులు విడుదలైన మొదటి సంవత్సరాంతానికల్లా, అద్భుతమైన ఆ దేవాలయ గుడారం దానికి సంబంధించిన అన్ని పరికరాలు పూర్తయి, నిలబెట్టబడుతుంది. అప్పుడు యెహోవా ఆ దేవాలయపు గుడారాన్ని తన మహిమతో నింపుతాడు.

లేఖనాధారిత ప్రశ్నలకు జవాబులు:

20:5​—⁠“తండ్రుల దోషమును” వారి భావి తరాలపై యెహోవా తీసుకురావడం అంటే దానర్థమేమిటి? ప్రతి వ్యక్తి బాధ్యతగల ఒక వయసుకు వచ్చాక అతను తన ప్రవర్తన, దృక్పథం ఆధారంగానే తీర్పు తీర్చబడతాడు. అయితే ఇశ్రాయేలు జనాంగం విగ్రహారాధన వైపు తిరిగినప్పుడు, దాని పర్యవసానాలను ఆ జనాంగం ఆ తర్వాత అనేక తరాలవరకు అనుభవించింది. విశ్వసనీయులైన ఇశ్రాయేలీయులు కూడా, యథార్థంగా జీవించడాన్ని కష్టభరితం చేసిన ఆ జనాంగపు మతపరమైన అపరాధ ప్రభావాలను అనుభవించారు.

23:​19; 34:26​—⁠పిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదనే ఆజ్ఞకు భావమేమిటి? ఒక పిల్లను (మేకపిల్లను లేక వేరే ఏదైనా జంతువు పిల్లను) దానితల్లిపాలతో ఉడకబెట్టడం అనేది వర్షం వస్తుందనే ఆలోచనతో అన్యులు చేసే ఆచరణ అని చెప్పబడుతోంది. అంతేకాదు తల్లిపాలు తన పిల్లను పోషించడానికి కాబట్టి, ఆ పాలలో దాని పిల్లను ఉడకబెట్టడం అనేది క్రూరమైన చర్యే అవుతుంది. దేవుని ప్రజలు కనికరంగలవారిగా ఉండాలని చూపేందుకు ఈ నియమం దోహదపడింది.

23:​20-23​—⁠ఇక్కడ ప్రస్తావించబడిన దూత ఎవరు, “ఆయనకు” యెహోవా నామము ఏ విధంగా ఉంది? ఈ దూత బహుశా మానవపూర్వ ఉనికిలోవున్న యేసు కావచ్చు. ఇశ్రాయేలీయులను వాగ్దాన దేశానికి నడిపించేందుకు ఆయన ఉపయోగించబడ్డాడు. (1 కొరింథీయులు10:​1-4) తన తండ్రి పేరును సమర్థించినవారిలో ఘనపరచినవారిలో యేసు ప్రధానమైనవాడు కాబట్టి యెహోవా నామము “ఆయనకు” ఉంది.

32:​1-8, 25-35​—⁠బంగారు దూడను చేసినందుకు అహరోను ఎందుకు శిక్షించబడలేదు? అహరోను విగ్రహారాధనకు మనస్ఫూర్తిగా ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఆయన మోషేను వ్యతిరేకించేవారికి భిన్నంగా ఉండి, తన తోటి లేవీయులతో కలిసి దేవుని వైపు నిలబడ్డాడు. దోషులు చంపబడిన తర్వాత, వారు గొప్ప పాపం చేశారని మోషే గుర్తుచేశాడు, ఇది ఇతరులతోపాటు అహరోను కూడా యెహోవా దయపొందాడని సూచించింది.

33:​11, 20​—⁠యెహోవా మోషేతో “ముఖాముఖిగా” ఎలా మాట్లాడాడు? ఈ పదం ఇరువైపుల నుండి జరిగే సన్నిహిత సంభాషణను సూచిస్తోంది. మోషే దేవుని ప్రతినిధితో మాట్లాడాడు, యెహోవా ఇచ్చిన సూచనలు అతని ద్వారానే మౌఖికంగా పొందాడు. అయితే ‘ఏ నరుడు దేవుణ్ణి చూసి బ్రతుకలేడు’ కాబట్టి మోషే యెహోవాను చూడలేదు. వాస్తవానికి యెహోవా మోషేతో వ్యక్తిగతంగా మాట్లాడలేదు. ధర్మశాస్త్రం “మధ్యవర్తిచేత దేవదూతల ద్వారా నియమింపబడెను” అని గలతీయులు 3:⁠19 చెబుతోంది.

మనకు పాఠాలు:

15:​25; 16:​12. యెహోవా తన ప్రజలకు కావలసింది సమకూరుస్తాడు.

18:​21. క్రైస్తవ సంఘంలో బాధ్యతాయుత స్థానాల కోసం ఎంపిక చేసుకోబడినవారు కూడా సమర్థులు, దైవభక్తిగలవారు, నమ్మకస్థులు, నిస్వార్థపరులుగా ఉండాలి.

20:1​—⁠23:​33. యెహోవా సర్వోన్నతమైన శాసనకర్త. ఆ నియమాలకు ఇశ్రాయేలీయులు విధేయత చూపించినప్పుడు, వారు ఆయనను సక్రమంగా ఆనందంగా ఆరాధించడానికి అవి దోహదపడ్డాయి. యెహోవాకు నేడు ఒక దైవపరిపాలనా సంస్థ ఉంది. దానితో సహకరించడం మన సంతోషానికి, సంరక్షణకు దారితీస్తుంది.

మనకు నిజమైన భావం

నిర్గమకాండము పుస్తకం యెహోవా గురించి ఏమి తెలియజేస్తోంది? అది ఆయనను ప్రేమపూర్వక శ్రద్ధగలవాడిగా, సాటిలేని విమోచకుడిగా, తన సంకల్పాలను నెరవేర్చేవాడిగా చూపిస్తోంది. ఆయన దైవపరిపాలనా సంస్థకు దేవుడు.

మీరు దైవపరిపాలనా పరిచర్య పాఠశాలకు సిద్ధపడేటప్పుడు వారపు బైబిలు పఠనం చేస్తున్నప్పుడు, మీరు నిర్గమకాండము నుండి నేర్చుకున్న దాన్నిబట్టి గాఢంగా పురికొల్పబడతారనడంలో సందేహం లేదు. “లేఖనాధారిత ప్రశ్నలకు జవాబులు” భాగంలో పేర్కొన్నవాటిని పరిశీలించినప్పుడు మీరు ఆ లేఖన భాగాలపై ఎంతో అంతర్దృష్టిని పొందుతారు. “మనకు పాఠాలు” కింద ఉన్న వ్యాఖ్యానాలు వారపు బైబిలు పఠనం నుండి మీరెలా ప్రయోజనం పొందవచ్చో చూపిస్తాయి.

[24, 25వ పేజీలోని చిత్రం]

యెహోవా ఇశ్రాయేలీయులను దాసత్వం నుండి విడిపించమని సాత్వికుడైన మోషేను ఆదేశించాడు

[25వ పేజీలోని చిత్రం]

సృష్టికర్తకు నీళ్ళను, సూర్యుని వెలుతురును, కీటకాలను, జంతువులను, మానవులను నియంత్రించే శక్తి ఉందని ఆ పది తెగుళ్ళు చూపించాయి

[26, 27వ పేజీలోని చిత్రం]

యెహోవా మోషే ద్వారా ఇశ్రాయేలీయులను ఒక దైవపరిపాలనా జనాంగంగా వ్యవస్థీకరించాడు