కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము”

“నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము”

“నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము”

“నీ సేవను సమగ్రముగా చేయుము.”​—⁠2 తిమోతి 4:​5, బైంగ్టన్‌.

మీరు రాజ్య ప్రచారకులా? అయితే ఈ అద్భుత ఆధిక్యత కోసం యెహోవా దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. సంఘంలో మీరు పెద్దగా సేవ చేస్తున్నారా? అది యెహోవా నుండి లభించిన అదనపు ఆధిక్యత. అయితే, లౌకిక విద్య లేదా ధారళంగా ప్రసంగించగల సామర్థ్యం మనలో ఎవరినీ పరిచర్యకు లేదా సంఘ పైవిచారణా పనికి అర్హులను చేయలేవని మనం ఎన్నడూ మరిచిపోకూడదు. యెహోవా మనలను పరిచర్యకు తగిన రీతిలో అర్హులుగా చేస్తాడు, అలాగే మనలో కొందరు పురుషులు నిర్దిష్ట లేఖన ప్రమాణాలు చేరుకున్నారు కాబట్టే పైవిచారణకర్తలుగా సేవచేసే ఆధిక్యత వారికివ్వబడింది.​—⁠2 కొరింథీయులు 3:5, 6; 1 తిమోతి 3:1-7.

2 సమర్పిత క్రైస్తవులందరూ సువార్తికుల పనిచేస్తారు, అయితే ప్రత్యేకంగా పైవిచారణకర్తలు లేదా పెద్దలు పరిచర్యలో మంచి మాదిరి ఉంచాలి. “వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు” పెద్దలను దేవుడు, క్రీస్తు, అలాగే తోటి యెహోవాసాక్షులు గమనిస్తారు. (1 తిమోతి 5:17; ఎఫెసీయులు 5:23; హెబ్రీయులు 6:​10-12) ఒక పెద్ద బోధించేది అన్ని పరిస్థితుల్లోనూ ఆధ్యాత్మిక ఆరోగ్యం కలిగించేదిగా ఉండాలి, ఎందుకంటే అపొస్తలుడైన పౌలు పైవిచారణకర్తగా ఉన్న తిమోతికి ఇలాచెప్పాడు: “జనులు హితబోధను సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని, సత్యమునకు చెవి నియ్యక కల్పనాకథలవైపునకు తిరుగుకాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము.”​—⁠2 తిమోతి 4:3-5.

3 అబద్ధ బోధలు సంఘ ఆధ్యాత్మిక వాతావరణానికి ప్రమాదం వాటిల్లజేయకుండా నిశ్చయపరచుకోవడానికి, సంఘ పైవిచారణకర్త తప్పక పౌలు ఇచ్చిన ఈ ఉపదేశానికి కట్టుబడాలి: “ప్రతీ విషయంలో గంభీరంగా ఉండుము, . . . నీ సేవను సమగ్రముగా చేయుము.” (2 తిమోతి 4:​5, బైంగ్టన్‌) అవును, ఒక పెద్ద ‘తన పరిచర్యను సంపూర్ణంగా జరిగించాలి.’ ఆయన సంపూర్తిగా, సమగ్రంగా లేదా సంపూర్ణ స్థాయిలో దానిని జరిగించాలి. తన పరిచర్యను సంపూర్ణంగా జరిగించే పెద్ద, దేనినీ నిర్లక్ష్యం చేయకుండా లేదా సగమే చేయకుండా తన బాధ్యతలన్నింటిపై సరైన అవధానం ఉంచుతాడు. ఆయన అల్ప విషయాల్లో సైతం నమ్మకంగా ఉంటాడు.​—⁠లూకా 12:48; 16:10.

4 మన పరిచర్యను సంపూర్ణంగా నెరవేర్చడానికి అన్నిసందర్భాల్లో ఎక్కువ సమయాన్ని కాదుగానీ సమయాన్ని ఫలవంతంగా ఉపయోగించడం అవసరం. క్రమబద్ధమైన గమనం పరిచర్య జరిగించడానికి క్రైస్తవులందరికీ సహాయం చేయగలదు. ఒక పెద్ద తాను ప్రాంతీయ సేవలో ఎక్కువ సమయం గడిపేలా తన సమయ పట్టికను సమతుల్యం చేసుకోవడానికి, ఏ పని అప్పగించాలి ఎలా అప్పగించాలి అనేవి తెలిసికొని ఉండడానికి ఆయనకు చక్కని వ్యక్తిగత వ్యవస్థీకరణ అవసరం. (హెబ్రీయులు 13:​17) గౌరవనీయుడైన ఒక పెద్ద, యెరూషలేము ప్రాకారాలు తిరిగి నిర్మించడంలో వ్యక్తిగతంగా భాగం వహించిన నెహెమ్యాలానే, తాను కూడా సహజంగానే తన వంతు కర్తవ్యం నెరవేరుస్తాడు. (నెహెమ్యా 5:​16) అలాగే యెహోవా సేవకులందరూ రాజ్య ప్రకటనా పనిలో క్రమంగా భాగం వహించాలి.​—⁠1 కొరింథీయులు 9:​16-18.

5 స్థాపిత పరలోక రాజ్య ప్రకటనకర్తలుగా మనకెంత గొప్ప ఆనందకరమైన ఆదేశముందో గదా! అంతం రాకముందే లోకమందంతటా సువార్త ప్రకటించడంలో భాగంవహించే మన ఆధిక్యతను నిశ్చయంగా మనం విలువైనదిగా పరిగణిస్తాం. (మత్తయి 24:​14) మనం అపరిపూర్ణులమైనప్పటికీ, పౌలు చెప్పిన ఈ మాటలనుబట్టి మనం ప్రోత్సాహం పొందవచ్చు: “ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై యుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము [పరిచర్య] మాకు కలదు.” (2 కొరింథీయులు 4:⁠7) అవును, మనం ఆమోదయోగ్యమైన సేవ చేయగలం, అయితే కేవలం దేవుడిచ్చిన బలం, జ్ఞానం మూలంగానే అలా చేయగలం.​—⁠1 కొరింథీయులు 1:26-31.

దేవుని మహిమను ప్రతిబింబించడం

6 అభిషిక్త క్రైస్తవులనుద్దేశించి మాట్లాడుతూ పౌలు, ‘దేవుడు క్రొత్త నిబంధనకు పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించియున్నాడని’ చెబుతున్నాడు. యేసుక్రీస్తు ద్వారా ఆధ్యాత్మిక ఇశ్రాయేలుతో చేయబడిన కొత్త నిబంధనకు, మోషే ద్వారా సహజ ఇశ్రాయేలుతో చేయబడిన పాత ధర్మశాస్త్ర నిబంధనకు మధ్యగల తారతమ్యాన్ని అపొస్తలుడైన పౌలు చూపిస్తున్నాడు. పది ఆజ్ఞలుగల రాతిపలకలతో మోషే సీనాయి పర్వతం దిగివచ్చినప్పుడు, ఇశ్రాయేలీయులు తేరి చూడలేనంతగా ఆయన ముఖం ప్రకాశించింది. అయితే కొంతకాలం తర్వాత మరింత ప్రమాదకరమైన విషయమొకటి జరిగింది, అదేమిటంటే ‘వారి మనస్సులు కఠినంగా’ మారి వారి హృదయాలపై ముసుగు కప్పబడింది. అయితే పూర్ణహృదయ భక్తికలిగి యెహోవావైపు తిరిగినప్పుడు ఆ ముసుగు తొలగించబడింది. ఆ తర్వాత, కొత్త నిబంధనలో ఉన్నవారికి అప్పగించబడిన పరిచర్యను సూచిస్తూ పౌలు ఇలా చెబుతున్నాడు: ‘మనమందరమును ముసుకు లేని ముఖముతో ప్రభువుయొక్క [యెహోవాయొక్క] మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచున్నాము.’ (2 కొరింథీయులు 3:6-8, 14-18; నిర్గమకాండము 34:​29-35) నేటి యేసు ‘వేరే గొఱ్ఱెలకు’ కూడా యెహోవా మహిమను ప్రతిఫలింపజేసే ఆధిక్యత ఉంది.​—⁠యోహాను 10:16.

7 ఏ మానవుడు దేవుని మహిమ చూసి బ్రదుకలేనప్పుడు, పాపులైన మానవులు ఆయన మహిమనెట్లు ప్రతిఫలించగలరు? (నిర్గమకాండము 33:​20) యెహోవా వ్యక్తిగత మహిమకు తోడుగా తన రాజ్యం ద్వారా తన సర్వాధిపత్య సత్యత్వాన్ని నిరూపించే ఆయన మహిమాన్విత సంకల్పం కూడా ఉందని మనం గ్రహించాలి. సా.శ. 33 పెంతెకొస్తునాడు పరిశుద్ధాత్మ పొందినవారు ప్రకటించడం ఆరంభించిన ‘దేవుని గొప్పకార్యాల్లో’ రాజ్య సంబంధ సత్యాలు కూడా ఒక భాగమే. (అపొస్తలుల కార్యములు 2:​11) ఆత్మ నిర్దేశంతో వారు తమకు అప్పగించబడిన పరిచర్యను సంపూర్ణంగా జరిగించగలిగారు.​—⁠అపొస్తలుల కార్యములు 1:8.

8 తన పరిచర్యను సంపూర్ణంగా జరిగించడానికి ఏదీ అడ్డు వచ్చేందుకు అనుమతించకూడదని పౌలు తీర్మానించుకున్నాడు. ఆయనిలా వ్రాశాడు: “ఈ పరిచర్య పొందినందున కరుణింపబడినవారమై అధైర్యపడము. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుటవలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి యెదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు, అవమానకరమైన రహస్యకార్యములను విసర్జించియున్నాము.” (2 కొరింథీయులు 4:​1, 2) పౌలు “ఈ పరిచర్య” అని పిలిచిన దాని ద్వారా సత్యం వెల్లడిచేయబడి ఆధ్యాత్మిక వెలుగు సుదూర ప్రాంతాలకు వ్యాపించింది.

9 భౌతిక, ఆధ్యాత్మిక వెలుగును గూర్చి పౌలు ఇలా వ్రాస్తున్నాడు: “అంధకారములోనుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను.” (2 కొరింథీయులు 4:⁠5; ఆదికాండము 1:​2-5) దేవుని పరిచారకులుగా ఉండే ఉత్కృష్టమైన ఆధిక్యత మనకు ఇవ్వబడింది కాబట్టి, యెహోవా మహిమను అద్దమువలె ప్రతిఫలించేలా మనల్ని మనం పరిశుభ్రంగా ఉంచుకుందాం.

10 ఆధ్యాత్మికంగా అంధకారంలో ఉన్నవారు యెహోవా మహిమను లేదా దాని ప్రతిబింబాన్ని గొప్ప మోషే అయిన యేసుక్రీస్తులో చూడలేరు. అయితే యెహోవా సేవకులుగా మనం లేఖనాల నుండి ఆ మహిమాన్విత వెలుగును సంగ్రహించి దానిని ఇతరులకు ప్రతిబింబిస్తాం. ఇప్పుడు ఆధ్యాత్మిక అంధకారంలో ఉన్నవారు నాశనాన్ని తప్పించుకోవాలంటే వారికి దేవుని వెలుగు అవసరం, కాబట్టి యెహోవా మహిమార్థమై, అంధకారంలో వెలుగు ప్రకాశింపనియ్యుడనే దేవుని ఆజ్ఞకు మనం మరింత ఆనందంగా, ఆసక్తిగా లోబడతాం.

గృహ బైబిలు అధ్యయనాల్లో మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి

11 యేసు తన అనుచరులకిలా చెప్పాడు: “మీరు లోకమునకు వెలుగైయున్నారు; కొండమీదనుండు పట్టణము మరుగైయుండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అది యింటనుండువారికందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభముమీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి.” (మత్తయి 5:​14-16) మన చక్కని ప్రవర్తన ఇతరులు దేవుణ్ణి మహిమపరిచేలా చేయగలదు. (1 పేతురు 2:​12) అలాగే మన సువార్త పనికి సంబంధించిన వివిధ అంశాలు మన వెలుగు ప్రకాశింపజేయడానికి మనకెన్నో అవకాశాలనిస్తాయి. ఫలవంతమైన గృహ బైబిలు అధ్యయనాలు నిర్వహించడం ద్వారా దేవుని వాక్యం నుండి ఆధ్యాత్మిక వెలుగు ప్రకాశింపజేయాలనేది మన ముఖ్యోద్దేశాల్లో ఒకటి. మన పరిచర్యను సంపూర్ణంగా జరిగించడానికి ఇది చాలా ప్రాముఖ్యమైన విధానం. సత్యాన్వేషకుల హృదయాలను స్పృశించేలా బైబిలు అధ్యయనాలు నిర్వహించడానికి మనకు ఏ సూచనలు సహాయం చేయవచ్చు?

12 దీని విషయమై యెహోవాకు ప్రార్థన చేయడం బైబిలు అధ్యయనాలు నిర్వహించాలనే మన ప్రగాఢ కోరికను ప్రదర్శిస్తుంది. దేవుని గురించిన పరిజ్ఞానం పొందడానికి ఇతరులకు సహాయపడడం యొక్క ప్రాముఖ్యతను మనం గ్రహించామని కూడా అది చూపిస్తుంది. (యెహెజ్కేలు 33:​7-9) యెహోవా మన ప్రార్థనలకు తప్పక జవాబిచ్చి పరిచర్యలో మన మనఃపూర్వక ప్రయత్నాలను ఆశీర్వదిస్తాడు. (1 యోహాను 5:​14, 15) అయితే బైబిలు అధ్యయనం నిర్వహించేలా ఒక వ్యక్తిని కనుగొనాలని మాత్రమే మనం ప్రార్థనచేయం. అధ్యయనం స్థిరపడిన తర్వాత, బైబిలు విద్యార్థి ప్రత్యేక అవసరాల గురించి ప్రార్థించడం, ధ్యానించడం ప్రతీ అధ్యయన భాగాన్ని ఫలవంతంగా నిర్వహించడానికి మనకు సహాయం చేస్తుంది.​—⁠రోమీయులు 12:12.

13 ఫలవంతమైన గృహ బైబిలు అధ్యయనాలు నిర్వహించడానికి మనం ప్రతీ అధ్యయన భాగానికి బాగా సిద్ధపడాలి. మనకు కష్టంగా ఉన్నట్లు అనిపిస్తే ప్రతీవారపు పాఠాన్ని సంఘ పుస్తక అధ్యయన పైవిచారణకర్త ఎలా నిర్వహిస్తున్నాడో గమనించడం సహాయకరంగా ఉండవచ్చు. అప్పుడప్పుడు మనం, గృహ బైబిలు అధ్యయనాలు నిర్వహించడంలో సత్ఫలితాలు సాధిస్తున్న రాజ్య ప్రచారకులతో వెళ్లడానికి ఏర్పాటు చేసుకోవచ్చు. యేసుక్రీస్తు దృక్పథాన్ని, బోధనా పద్ధతులను మనం ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకోవాలి.

14 యేసు తన పరలోక తండ్రి చిత్తం చేయడంలో, దేవుని గురించి ఇతరులతో మాట్లాడడంలో ఆనందించాడు. (కీర్తన 40:⁠8) సాత్వికునిగా ఆయన తన ప్రేక్షకుల హృదయాలు చేరడంలో విజయం సాధించాడు. (మత్తయి 11:​28-30) కాబట్టి మన బైబిలు విద్యార్థుల హృదయాలు చేరడానికి మనం కృషిచేద్దాం. మనమలా చేయాలంటే విద్యార్థి ప్రత్యేక పరిస్థితుల్ని మనస్సులో ఉంచుకొని ప్రతీ అధ్యయనానికి మనం సిద్ధపడాలి. ఉదాహరణకు, అతడు ఒకవేళ బైబిలేతర నేపథ్యంగల సంస్కృతికి చెందినవాడైతే, బైబిలు సత్యమని మనం ఆ వ్యక్తిని ఒప్పించవలసి ఉంటుంది. అలాంటప్పుడు, వారికి అనేక లేఖనాలు చదివి వాటిని మనం వివరించవలసి ఉంటుంది.

ఉపమానాలు అర్థంచేసుకోవడానికి విద్యార్థులకు సహాయం చేయండి

15 లేఖనాల్లో ఉపయోగించబడిన ఒక ప్రత్యేక ఉపమానం బైబిలు విద్యార్థికి తెలియకపోవచ్చు. ఉదాహరణకు, దీపము దీపస్తంభంమీద పెట్టడం గురించి యేసు మాట్లాడినప్పుడు దాని అర్థమేమిటో అతడు అర్థంచేసుకోలేక పోవచ్చు. (మార్కు 4:​21, 22) యేసు మండే వత్తిగల పాతకాలపు నూనె దీపాన్ని సూచిస్తున్నాడు. అలాంటి దీపాన్ని ప్రత్యేక స్తంభంమీద పెట్టినప్పుడు, ఇల్లంతా వెలుగు నిండుతుంది. యేసు ఉపమానాన్ని స్పష్టంగా వివరించేందుకు, లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం) అనే సాహిత్యంలో “ల్యాంప్‌,” “ల్యాంప్‌స్టాండ్‌” అనే విషయాలను పరిశోధించడం అవసరం కావచ్చు. * అయితే విద్యార్థి అర్థంచేసుకుని, ఆనందించే వివరణతో సిద్ధపడి ఆ బైబిలు అధ్యయనానికి వెళ్లడం ఎంత ప్రతిఫలదాయకంగా ఉంటుందో కదా!

16 బైబిలు అధ్యయన సహాయక పుస్తకం విద్యార్థి అర్థం చేసుకోవడానికి కష్టంగావుండే ఒక ఉపమానాన్ని ఉపయోగించవచ్చు. దానిని వివరించడానికి సమయం తీసుకోండి లేదా అదే అంశాన్ని ప్రస్తావించే మరో ఉపమానం చెప్పండి. బహుశా ఒక పుస్తకం వివాహంలో తగిన భాగస్వామి, సమన్వయ ప్రయత్నం ప్రాముఖ్యమని నొక్కిచెబుతుండవచ్చు. దానిని ఉదహరించడానికి, సర్కస్‌లో గాల్లో ఉయ్యాల ఊగేవ్యక్తి తన ఉయ్యాల వదిలేసి గాల్లో పల్టీ కొట్టినప్పుడు అతను పడిపోకుండా చేతులందించి పట్టుకోవడం మరో వ్యక్తిపై ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. తగిన భాగస్వామి, సమన్వయ ప్రయత్నం అవసరమని చెప్పడానికి ప్రత్యామ్నాయంగా బహుశా ఒక పడవలోంచి సరుకు దించేటప్పుడు పనివాళ్లు పెట్టెలను ఒకరికొకరు అందిస్తూ సహకరించడాన్ని ఉదహరించవచ్చు.

17 ప్రత్యామ్నాయ ఉపమానం ఉపయోగించడానికి ముందుగానే సిద్ధపడడం అవసరం కావచ్చు. అయితే అది మన బైబిలు విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధచూపగల ఒక విధానం. కష్టమైన విషయాలను స్పష్టం చేసేందుకు యేసు సులభమైన ఉపమానాలు ఉపయోగించాడు. ఆయన కొండమీది ప్రసంగం దీనికి ఉదాహరణ, అలాగే ఆయన బోధ తన ప్రేక్షకులపై చక్కని ప్రభావం చూపిందని బైబిలు చూపిస్తోంది. (మత్తయి 5:1-7:​29) యేసుకు ఇతరులపై ప్రగాఢమైన శ్రద్ధవుంది కాబట్టే ఆయన ఓపికగా విషయాలను వివరించాడు.​—⁠మత్తయి 16:5-12.

18 ఇతరులపై మనకున్న శ్రద్ధ వారితో ‘లేఖనముల నుండి తర్కించేలా’ మనలను పురికొల్పుతుంది. (అపొస్తలుల కార్యములు 17:​2, 3) దీనికోసం ‘నమ్మకమైన గృహనిర్వాహకుడు’ అందజేసిన సాహిత్యాలను ప్రార్థనాపూర్వకంగా అధ్యయనం చేయడం, జ్ఞానయుక్తంగా ఉపయోగించడం అవసరం. (లూకా 12:42-44) ఉదాహరణకు, నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకం అనేక లేఖనాలను ఉదహరిస్తోంది. * ఎక్కువ స్థలంలేని కారణంవల్ల, కొన్ని లేఖనాలు కేవలం పేర్కోబడ్డాయి. బైబిలు అధ్యయనమప్పుడు, పేర్కోబడిన ఈ లేఖనాల్లో కనీసం కొన్నింటినైనా చదివి వివరించడం ప్రాముఖ్యం. నిజానికి మన బోధ గొప్పశక్తిగల దేవుని వాక్యంపై ఆధారపడివుంది. (హెబ్రీయులు 4:​12) పేరాల్లోవున్న లేఖనాలను తరచూ ఉపయోగిస్తూ ప్రతీ అధ్యయనంలో బైబిలును చూపించండి. ఫలాని అంశం గురించి లేదా చర్య గురించి బైబిలు ఏమిచెబుతుందో చూసేందుకు విద్యార్థికి సహాయం చెయ్యండి. దేవునికి లోబడడం ద్వారా అతడెలా ప్రయోజనం పొందుతాడో చూపించడానికి కృషిచెయ్యండి.​—⁠యెషయా 48:17, 18.

ఆలోచన రేకెత్తించే ప్రశ్నలు వేయండి

19 యేసు నేర్పుగా ఉపయోగించిన ప్రశ్నలు ఆలోచించేలా ప్రజలకు సహాయం చేశాయి. (మత్తయి 17:​24-27) బైబిలు విద్యార్థిని కలవరపెట్టని అభిప్రాయ సేకరణా ప్రశ్నలను మీరడిగినప్పుడు, అతనిచ్చే జవాబులు ఫలాని అంశం గురించి అతనేమి ఆలోచిస్తున్నాడో వెల్లడిచేయవచ్చు. అతనిలో ఇంకా లేఖనవిరుద్ధ తలంపులే ఉన్నట్లు మనం కనుగొనవచ్చు. ఉదాహరణకు, అతడు త్రిత్వాన్ని నమ్ముతుండవచ్చు. అయితే జ్ఞానము పుస్తకపు మూడవ అధ్యాయం బైబిల్లో “త్రిత్వము” అనే మాటే లేదని చెబుతోంది. యేసు నుండి యెహోవా వేరుగా ఉన్నాడనీ, పరిశుద్ధాత్మ వ్యక్తికాదు దేవుని చురుకైన శక్తి అని చూపిస్తూ ఆ పుస్తకం లేఖనాలను ఉదహరిస్తోంది. ఈ బైబిలు వచనాలను చదివి చర్చించడం విషయ నిరూపణకు సరిపోవచ్చు. కానీ ఇంకా ఎక్కువ అవసరమైతే అప్పుడేమిటి? బహుశా ఆ మరుసటి అధ్యయన సమయం తర్వాత ఈ అంశంపై ప్రయోజనాత్మక చర్చకు కొంత సమయం కేటాయించవచ్చు. దానికోసం త్రిత్వమును మీరు నమ్మవలయునా? వంటి యెహోవాసాక్షుల ప్రచురణల్లో ఇవ్వబడిన సమాచారం పరిశీలించవచ్చు. ఆ తర్వాత, జ్ఞానము పుస్తకంలో అధ్యయనం కొనసాగించవచ్చు.

20 అభిప్రాయ సేకరణా ప్రశ్నకు విద్యార్థి నుండి బహుశా ఆశ్చర్యకరమైన లేదా నిరుత్సాహపరచే జవాబు రావచ్చు. అది పొగత్రాగడమో లేక మరొక సున్నితమైన అంశానికి సంబంధించినదైతే, మనం అధ్యయనం కొనసాగిద్దామనీ ఆ విషయాన్ని తర్వాత చర్చిద్దామనీ సూచించవచ్చు. ఆ విద్యార్థి ఇంకా పొగత్రాగుతున్నాడని తెలవడం, ఆధ్యాత్మిక పురోభివృద్ధి సాధించేలా అతనికి సహాయపడే ప్రచురిత సమాచారం వెదకడానికి మనకు తోడ్పడుతుంది. విద్యార్థి హృదయాన్ని చేరడానికి మనం కృషిచేస్తుండగా, అతను ఆధ్యాత్మికంగా ఎదిగేలా యెహోవా సహాయంకోసం మనం ప్రార్థించవచ్చు.

21 మంచి సిద్ధపాటుతో, యెహోవా సహాయంతో మనం నిస్సందేహంగా బైబిలు విద్యార్థుల ప్రత్యేక అవసరాలకు తగ్గట్టు మన బోధనా పద్ధతులను మలుచుకోగలుగుతాం. సమయం గడిచేకొద్దీ, అతను దేవునిపట్ల ప్రగాఢ ప్రేమను వృద్ధిచేసుకోవడానికి మనం సహాయం చేయవచ్చు. యెహోవా సంస్థపట్ల గౌరవాన్ని, కృతజ్ఞతను పెంచడంలో కూడా మనం కృతార్థులం కావచ్చు. ‘దేవుడు నిజముగా మీలో ఉన్నాడని’ బైబిలు విద్యార్థులు గుర్తించడం ఎంత సంతోషాన్నిస్తుందో కదా! (1 కొరింథీయులు 14:​24, 25) కాబట్టి మనం ఫలవంతమైన బైబిలు అధ్యయనాలు నిర్వహించి, ఇతరులు యేసు శిష్యులయ్యేలా సహాయం చేయడానికి మన శాయశక్తులా కృషిచేద్దాం.

కాపాడుకోవాల్సిన ఐశ్వర్యం

22 మన పరిచర్యను సంపూర్ణంగా జరిగించడానికి, మనం తప్పకుండా దేవుడు అనుగ్రహించే బలంపై ఆధారపడాలి. పరిచర్యను ప్రస్తావిస్తూ పౌలు తోటి అభిషిక్త క్రైస్తవులకు ఇలా వ్రాశాడు: “ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై యుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు.”​—⁠2 కొరింథీయులు 4:⁠7.

23 అభిషిక్తులమైనా లేదా ‘వేరే గొఱ్ఱెలమైనా’ మనం సులభంగా పగిలిపోయే మట్టి పాత్రల్లాగే ఉన్నాం. (యోహాను 10:​16) అయినప్పటికీ, మనపై తీసుకురాబడే వత్తిళ్ల మధ్యనూ మన నియామకాల్ని నెరవేర్చడానికి కావలసిన బలం యెహోవా మనకివ్వగలడు. (యోహాను 16:13; ఫిలిప్పీయులు 4:​13) అందువల్ల యెహోవాపై ప్రగాఢ నమ్మకంతో మన సేవా ఐశ్వర్యాన్ని కాపాడుకుంటూ మన పరిచర్యను సంపూర్ణంగా జరిగిద్దాం.

[అధస్సూచీలు]

^ పేరా 20 యెహోవాసాక్షులు ప్రచురించినది.

^ పేరా 23 యెహోవాసాక్షులు ప్రచురించినది.

మీరెలా జవాబిస్తారు?

పెద్దలు తమ పరిచర్యను సంపూర్ణంగా జరిగించడానికి ఏమిచేయవచ్చు?

మన గృహ బైబిలు అధ్యయనాల సార్థకతను మనమెలా మెరుగుపరచుకోవచ్చు?

ఒక బైబిలు విద్యార్థి ఒక ఉపమానాన్ని అర్థం చేసుకోలేనప్పుడు లేదా ఫలాని అంశంపై అదనపు సమాచారం అవసరమైనప్పుడు మీరేమి చేస్తారు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. క్రైస్తవులందరూ సువార్తికులైనా, లేఖనానుసారంగా పెద్దలనుండి ఏమి కోరబడుతోంది?

3. అబద్ధ బోధలు సంఘ ఆధ్యాత్మిక వాతావరణానికి ప్రమాదం వాటిల్లజేయకుండా నిశ్చయపరచుకోవడానికి ఏమిచేయడం అవసరం?

4. పరిచర్యను సంపూర్ణంగా జరిగించడానికి మనకేది సహాయం చేయగలదు?

5. పరిచర్య గురించి మనమెలా భావించాలి?

6. సహజ ఇశ్రాయేలుకు, ఆధ్యాత్మిక ఇశ్రాయేలుకు మధ్య ఎలాంటి తారతమ్యముంది?

7. మానవులు దేవుని మహిమను ఎలా ప్రతిబింబించగలరు?

8. పరిచర్యకు సంబంధించి, పౌలు ఏమి చేయడానికి తీర్మానించుకున్నాడు?

9, 10. యెహోవా మహిమను ప్రతిఫలించడం ఎలా సాధ్యం?

11. మన వెలుగు ప్రకాశింపజేయడం గురించి యేసు ఏమిచెప్పాడు, మన పరిచర్యలో ఇలా చేయడానికి మనకున్న ఒక విధానమేమిటి?

12. గృహ బైబిలు అధ్యయనాల నిర్వహణకూ, ప్రార్థనకూ ఎలాంటి సంబంధముంది?

13. ఫలవంతమైన గృహ బైబిలు అధ్యయనాలు నిర్వహించడానికి మనకేది సహాయం చేయవచ్చు?

14. ఒక బైబిలు విద్యార్థి హృదయాన్ని మనమెలా చేరుకోవచ్చు?

15, 16. (ఎ) బైబిల్లో ఉపయోగించబడిన ఒక ఉపమానాన్ని అర్థంచేసుకోలేని విద్యార్థికి మనమెలా సహాయం చేయవచ్చు? (బి) ఒకానొక బైబిలు విద్యార్థి అర్థం చేసుకోవడానికి కష్టంగావున్న ఉపమానాన్ని మన సాహిత్యం ఒకటి ఉపయోగిస్తే మనమేమి చేయవచ్చు?

17. ఉపమానాల విషయంలో యేసునుండి మనమేమి నేర్చుకోవచ్చు?

18. మన సాహిత్యాల్లో పేర్కోబడిన లేఖనాల గురించి ఏమి సిఫారసు చేయబడింది?

19, 20. (ఎ) గృహ బైబిలు అధ్యయనం నిర్వహించేటప్పుడు అభిప్రాయ సేకరణా ప్రశ్నలను మనమెందుకు ఉపయోగించాలి? (బి) ఒక ప్రత్యేక అంశంపై అదనపు సమాచారం అవసరమైతే ఏమిచేయవచ్చు?

21. ఒక బైబిలు విద్యార్థి ప్రత్యేక అవసరాలకు తగ్గట్టు మన బోధనా పద్ధతులను మలుచుకున్నప్పుడు ఏమి సంభవించవచ్చు?

22, 23. మన పరిచర్యను సంపూర్ణంగా జరిగించడానికి మనకేది అవసరం?

[16వ పేజీలోని చిత్రం]

క్రైస్తవ పెద్దలు సంఘంలో బోధిస్తారు, పరిచర్యలో తోటి విశ్వాసులకు శిక్షణ ఇవ్వడానికి సహాయం చేస్తారు

[18వ పేజీలోని చిత్రం]

సమర్థమైన గృహ బైబిలు అధ్యయనాలు నిర్వహించడం మన వెలుగు ప్రకాశింపజేసే ఒక విధానం