కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“పర్వతముల సౌందర్యముకంటె నీవు అధిక తేజస్సుగలవాడవు”

“పర్వతముల సౌందర్యముకంటె నీవు అధిక తేజస్సుగలవాడవు”

యెహోవా సృష్టి వైభవాలు

“పర్వతముల సౌందర్యముకంటె నీవు అధిక తేజస్సుగలవాడవు”

ఫ్యూజీ పర్వతం మీద నిలబడి సూర్యోదయాన్ని వీక్షించడం మరచిపోలేని అనుభవం. క్షితిజంపై అరుణవర్ణంలో పైకి ఎగబ్రాకే సూర్య కిరణాల వెలుగులో తెల్లటి మంచు బిందువులు, బూడిద రంగులో లావా శిలలు మిలమిలా మెరుస్తాయి. మరొక దినం ఆరంభమవుతుండగా ఆ పర్వతపు నీడ గుట్టలమీదుగా లోయలమీదుగా అనేక కిలోమీటర్ల వరకు పరచుకొంటుంది.

ఒకప్పుడు “సాటిలేని” అనే భావంగల శిలాక్షరాలతో వ్రాయబడ్డ ఫ్యూజీ పర్వతంలాగే, మహా పర్వతాలు మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. వాస్తవానికి, వాటి మహా పరిమాణాన్ని చూసి మనం వాటిముందు ఎంతగా వెలవెలపోతామో కదా! పర్వతాల ఘనత ఎంతటిదంటే తరచూ పొగమంచుతో, మేఘాలతో కమ్ముకుపోయిన ఎత్తయిన పర్వత శిఖరాగ్రాలు దేవుళ్ళ నివాసస్థానాలని చాలామంది విశ్వసిస్తారు.

ఎత్తయిన పర్వతాలచేత స్తుతించబడే ఒకే ఒక్క దేవుడు, గొప్ప ప్రావీణ్యతగల వాటి సృష్టికర్త యెహోవాయే. ఆయనే ‘పర్వతములను రూపొందించినవాడు.’ (ఆమోసు 4:​13) భూమ్మీద దాదాపు నాలుగవ భాగం పర్వతమయమే, దేవుడు మన గ్రహాన్ని సృష్టించినప్పుడు, క్రమేణా వైభవోపేతమైన పర్వత శ్రేణులు పుట్టుకొచ్చేలా ఆయన శక్తిని ఉపయోగించాడు. (కీర్తన 95:⁠4) ఉదాహరణకు ఎత్తయిన హిమాలయ పర్వతశ్రేణులు, ఆండీస్‌ పర్వత శ్రేణులు భూమి అంతర్భాగపొరలు పెద్దయెత్తున పైకి పొడుచుకు రావడంవల్ల, భూమ్యాగాధ పొరల ఆయాభాగాలు చలనంవల్ల రూపొందాయని నమ్ముతారు.

పర్వతాలు ఉనికిలోకి ఎలా వచ్చాయో ఎందువల్ల వచ్చాయో మానవులమైన మనకు పూర్తిగా అర్థంకాదు. నిజానికి నీతిమంతుడైన యోబును అడిగిన ఈ ప్రశ్నలకు మనం జవాబులు ఇవ్వలేము: “నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? . . . దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము?”​—⁠యోబు 38:​4-6.

అయితే మన జీవితాలు పర్వతాలపై ఆధారపడి ఉన్నాయని మాత్రం మనకు తెలుసు. అవి ప్రకృతి జలధారలు అని పిలువబడుతున్నాయి, ఎందుకంటే పెద్ద పెద్ద నదులన్నీ పర్వతాల మూలంగానే పోషించబడుతున్నాయి, పైగా భూమ్మీది ప్రజల్లో సగం మంది నీటి కోసం పర్వతాలపైనే ఆధారపడుతున్నారు. (కీర్తన 104:​13) న్యూ సైంటిస్ట్‌ పత్రిక ప్రకారం, “ప్రపంచంలో అధిక ఆహారమిచ్చే 20 రకాల మొక్కల్లో ఆరు రకాల మొక్కలుపర్వతాల్లోనే పుట్టి పెరుగుతాయి.” సమతుల్య పరిస్థితుల పర్యావరణముండే దేవుని వాగ్దాన నూతనలోకంలో, “దేశములోను పర్వత శిఖరములమీదను సస్య సమృద్ధి కలుగును.”​—⁠కీర్తన 72:​16; 2 పేతురు 3:​13.

పర్వతాలనేసరికి చాలామందికి యురోపియన్‌ ఆల్ప్స్‌ పర్వతశ్రేణులు గుర్తుకువస్తాయి. ఇక్కడ చూపించబడిన చీవెట్ట పర్వతంతోసహా ఆ పర్వతాలు తమ సృష్టికర్త గురించి మనోహరమైన సాక్ష్యమిస్తున్నాయి. (కీర్తన 98:⁠8) “తన శక్తిచేత పర్వతములను స్థిరపర[చిన]” యెహోవాను అవి స్తుతిస్తున్నాయి.​—⁠కీర్తన 65:⁠6. *

నిజానికి మంచుతో కప్పబడిన పర్వతశిఖరాలు, గట్లతో, మంచుపొరలు కప్పుకున్న పల్లాలు, లోయలు, నదులు, పచ్చిక మైదానాలతో ఆల్ప్స్‌ పర్వతశ్రేణుల విశిష్టత సంభ్రమాశ్చర్యాలు గొలిపేలా ఉంటుంది. యెహోవా “పర్వతములమీద గడ్డి మొలిపించువాడు” అని దావీదు రాజు గుర్తించాడు.​—⁠కీర్తన 147:⁠8.

చైనాలోని కూయిలిన్‌లో ఉండే ఇలాంటి గుట్టల శ్రేణులు, ఆల్ప్స్‌ పర్వతశ్రేణులంత వైభవంగా కనిపించకపోవచ్చు, కానీ అవి ఎంతో అందంగా ఉంటాయి. లీ నది పొడవునా ఉన్న ఈ గుట్టలు సున్నపురంగులో పైకి పొడుచుకొని వచ్చిన శిఖరాలు అనేక వరుసల్లో కనబడుతూ అవి తమ అందంతో సందర్శకులను ముగ్ధులను చేస్తాయి. పొగమంచుతో నిండిన ఈ గుట్టల గుండా పారే స్వచ్ఛమైన నీళ్ళను గమనించేవారికి కీర్తనకర్త పలికిన ఈ మాటలు గుర్తుకురావచ్చు: “ఆయన కొండలోయలలో నీటిబుగ్గలను పుట్టించును అవి మన్యములలో పారును.”​—⁠కీర్తన 104:​10.

మనం యుక్తంగానే పర్వతాల వలన ముగ్ధులమయ్యాం, ఎందుకంటే మానవాళి సంక్షేమం కోసం, ఆనందం కోసం సృష్టికర్త చేసిన ప్రేమపూర్వక ఏర్పాటులో సుందరమైన భాగంగా మనం వాటిని గుర్తించాం. పర్వతాలు సంభ్రమాశ్చర్యాలు గొలిపేవే అయినప్పటికీ, అవి యెహోవా వైభవానికి సాటిరావు. ఆయన నిజంగా ‘పర్వతముల సౌందర్యముకంటె అధిక తేజస్సుగలవాడు.’​—⁠కీర్తన 76:⁠4.

[అధస్సూచి]

^ పేరా 8 యెహోవాసాక్షుల క్యాలెండర్‌ 2004 మార్చి/ఏప్రిల్‌ చూడండి.

[9వ పేజీలోని బాక్సు/చిత్రం]

ప్రపంచంలో పది శాతం జనాభా పర్వత ప్రాంతాల్లోనే నివసిస్తోంది. అయితే అది దేవుని రాజ్య సువార్తను ప్రకటించేవారికి అధిరోహించలేని ఆటంకమేమీ కాదు. ఈ క్రైస్తవ పరిచారకులు ఎత్తయిన అనేక ప్రాంతాల్లో ముమ్మరంగా పనిచేస్తున్నారు. ‘సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు, పర్వతములమీద ఎంత సుందరములై యున్నవో కదా!’​—⁠యెషయా 52:⁠7.

“గొప్ప కొండలు కొండమేకలకు ఉనికిపట్లు” అని కీర్తనకర్త పాడాడు. (కీర్తన 104:​18) పర్వతాల్లో నివసించే వాటన్నింటిలో, పెద్ద కొమ్ములతో ఉండే న్యూబియన్‌ ఐబెక్స్‌ అనబడే కొండమేకలు అత్యంత బలమైన పాదాలుగలవి. నడిచివెళ్ళడం అసాధ్యమన్నట్లు అనిపించే సన్నని అంచులవెంట అవి నిర్భయంగా నడిచివెళ్తాయి. దుర్గమమైన స్థలాల్లో నివసించే చక్కని సామర్థ్యం ఐబెక్స్‌కు ఉంది. అందుకు దాని డెక్కల నిర్మాణం కొంతమట్టుకు కారణం. దాని డెక్కల్లోని చీలికలు దాని బరువును బట్టి విస్తరించి, అది నిలబడ్డప్పుడు, సన్నని రాతిగట్ల మీద నుండి నడిచివెళ్తున్నప్పుడు అవి గట్టి పట్టునిస్తాయి. నిజానికి ఐబెక్స్‌ అద్భుతమైన రూపకల్పన!

[9వ పేజీలోని చిత్రం]

ఫ్యూజీ పర్వతం, హోన్షూ, జపాన్‌