కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రభువు రాత్రి భోజనం ఎలా ఆచరించబడింది?

ప్రభువు రాత్రి భోజనం ఎలా ఆచరించబడింది?

ప్రభువు రాత్రి భోజనం ఎలా ఆచరించబడింది?

ప్రభువు రాత్రి భోజన ఆచరణను మరింత విశదీకరిస్తూ క్రైస్తవ అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాస్తున్నాడు: “నేను మీకు అప్పగించిన దానిని ప్రభువువలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక రొట్టెను ఎత్తికొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి—యిది మీకొరకైన నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొని—యీ పాత్ర నా రక్తమువలననైన క్రొత్తనిబంధన; మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని, యీ పాత్ర లోనిది త్రాగునప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు.”​—⁠1 కొరింథీయులు 11:​23-26.

పౌలు చెబుతున్న ప్రకారం, క్రీస్తును కొరత వేయమని రోమీయులను ఒత్తిడిచేసిన యూదా మతనాయకులకు ఇస్కరియోతు యూదా ద్వారా “తాను అప్పగింపబడిన రాత్రి” యేసు ప్రభువు రాత్రి భోజనాన్ని నెలకొల్పాడు. సా.శ. 33 మార్చి 31, గురువారం సూర్యాస్తమయం తర్వాత వారు ఆ భోజనం చేశారు. ఏప్రిల్‌ 1, శుక్రవారం మధ్యాహ్నం యేసు హింసాకొయ్యపై మరణించాడు. యూదుల క్యాలెండరు ప్రకారం రోజులు, సూర్యాస్తమయం నుండి మరుసటి సూర్యాస్తమయం వరకు ఒక రోజుచొప్పున లెక్కించబడేవి కాబట్టి ప్రభువు రాత్రి భోజనం అలాగే యేసుక్రీస్తు మరణం ఒకే రోజున అంటే సా.శ. 33, నీసాను 14న సంభవించాయి.

రొట్టె ద్రాక్షారసాల్లో పాలుపంచుకునేవారు యేసును జ్ఞాపకం చేసుకోవడానికి ‘దీనిని చేయాలి.’ మరో అనువాదం ప్రకారం యేసు ఇలాచెప్పాడు: “నా జ్ఞాపకార్థం దీనిని చేయుడి.” (1 కొరింథీయులు 11:​24, ద జెరూసలెమ్‌ బైబిల్‌) ప్రభువు రాత్రి భోజనం క్రీస్తు మరణ జ్ఞాపకార్థమని కూడా పిలువబడింది.

యేసు మరణాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి?

దాని జవాబు యేసు మరణ విశేషతను అర్థంచేసుకోవడంతో ముడిపడి ఉంది. యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించిన అగ్రగణ్యునిగా యేసు మరణించాడు. తద్వారా ఆయన, మానవులు కేవలం స్వార్థ ఉద్దేశాలతోనే దేవుణ్ణి సేవిస్తారనే ఆరోపణ విషయంలో సాతాను అబద్ధికుడని నిరూపించాడు. (యోబు 2:1-5; సామెతలు 27:​11) పరిపూర్ణ మానవునిగా మరణించడం ద్వారా యేసు, ‘అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం’ కూడా ఇచ్చాడు. (మత్తయి 20:​28) ఆదాము దేవునికి విరుద్ధంగా పాపం చేసినప్పుడు, అతను పరిపూర్ణ మానవ జీవితాన్ని, దాని ఉత్తరాపేక్షలను పోగొట్టుకున్నాడు. కానీ “దేవుడు లోకమును [మానవాళిని] ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” (యోహాను 3:​16) అవును, “పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము.”​—⁠రోమీయులు 6:23.

ఆ విధంగా యేసుక్రీస్తు మరణానికీ, ప్రేమకు సంబంధించిన రెండు గొప్ప వ్యక్తీకరణలకూ సంబంధం ఉంది, ఆ రెండు వ్యక్తీకరణలు ఏవంటే తన కుమారుణ్ణి అనుగ్రహించడంలో మానవులపట్ల యెహోవా చూపిన గొప్ప ప్రేమ, అలాగే మానవుల కోసం ఇష్టపూర్వకంగా తన మానవ ప్రాణాన్ని ఇవ్వడంలో యేసుచూపిన స్వయం త్యాగపూరితమైన ప్రేమ. యేసు మరణ జ్ఞాపకార్థం ప్రేమకు సంబంధించిన ఈ రెండు వ్యక్తీకరణలను శ్లాఘిస్తుంది. మనమీ ప్రేమను పొందుతున్నాం కాబట్టి, దాని విషయమై మనం కృతజ్ఞత చూపవద్దా? అలాచేయడానికి ఒక మార్గం ప్రభువు రాత్రి భోజన ఆచరణకు హాజరు కావడమే.

రొట్టె ద్రాక్షారసాల ప్రాధాన్యత

ప్రభువు రాత్రి భోజనాన్ని నెలకొల్పేటప్పుడు, యేసు ఒక రొట్టెను, ఒక గిన్నెడు ఎర్రని ద్రాక్షారసాన్ని చిహ్నాలుగా లేదా గురుతులుగా ఉపయోగించాడు. యేసు ఒక రొట్టె పట్టుకొని “కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి—యిది [ఈ రొట్టె] మీకొరకైన నా శరీరము” అని చెప్పాడు. (1 కొరింథీయులు 11:​23, 24) పంచి ఇవ్వడానికి, తినడానికి అనువుగా ఆ రొట్టెను విరవాలి ఎందుకంటే అది పులిసిన పిండి లేదా ఈస్ట్‌ లేకుండా కేవలం పిండి, నీళ్లు కలిపి చేసినందున కొంత పెళుసుగా ఉంటుంది. లేఖనాల్లో, పులిసిన పిండి పాపాన్ని సూచిస్తోంది. (మత్తయి 16:11, 12; 1 కొరింథీయులు 5:​6, 7) యేసులో పాపంలేదు. కాబట్టి ఆయన పరిపూర్ణ మానవ శరీరం మానవాళికోసం సరైన విమోచన క్రయధన బలిగా పనిచేసింది. (1 యోహాను 2:​1, 2) క్రీస్తు పాపరహిత భౌతిక శరీరాన్ని సూచించడానికి ఆ రొట్టె పులిసినది కాకుండా ఉండడం ఎంత సముచితమో కదా!

ఆ గిన్నెలోని స్వచ్ఛమైన ఎర్రని ద్రాక్షారసం విషయంలో కూడా యేసు కృతజ్ఞతలు తెలియజేసి ఇలా అన్నాడు: “యీ పాత్ర నా రక్తమువలననైన క్రొత్తనిబంధన.” (1 కొరింథీయులు 11:​25) ఆ గిన్నెలోని ఎర్రని ద్రాక్షారసం యేసు రక్తాన్ని సూచిస్తోంది. సా.శ.పూ. 1513లో, బలి అర్పించబడిన దూడల, మేకల రక్తం దేవునికి ఇశ్రాయేలు జనాంగానికి మధ్య ధర్మశాస్త్ర నిబంధనను స్థిరపరచినట్లే, మరణంలో యేసు చిందించిన రక్తం కూడా క్రొత్త నిబంధనను స్థిరపరచింది.

ఎవరు పాలుపంచుకోవాలి?

జ్ఞాపకార్థ చిహ్నాలలో యుక్తంగా ఎవరు పాలుపంచుకోవాలో ఖచ్చితంగా గుర్తించడానికి మనం ఆ క్రొత్త నిబంధన దేనిగురించి, దానిలో ఎవరు భాగస్థులు అనేవి అర్థంచేసుకోవాలి. బైబిలు ఇలా చెబుతోంది: “ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; . . . వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు. . . . నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను.”​—⁠యిర్మీయా 31:31-34.

క్రొత్త నిబంధన యెహోవా దేవునితో ఒక ప్రత్యేక తరహా సంబంధాన్ని సాధ్యంచేస్తుంది. ఈ నిబంధన మూలంగా, ఒక ప్రత్యేక గుంపులోని వ్యక్తులు ఆయన ప్రజలవుతారు, ఆయన వారి దేవుడు అవుతాడు. యెహోవా ధర్మశాస్త్రం వారి మనస్సుల్లో, వారి హృదయాల్లో వ్రాయబడుతుంది. శరీర సంబంధంగా సున్నతిపొందిన యూదులుకాని అన్యులు కూడా దేవునితో క్రొత్త నిబంధనా సంబంధంలోకి రాగలుగుతారు. (రోమీయులు 2:​29) ‘అన్యజనుల్లో నుండి దేవుడు తన నామం కోసం ఒక జనమును ఏర్పరచుకొనే’ ఆయన సంకల్పం గురించి బైబిలు రచయిత లూకా వ్రాస్తున్నాడు. (అపొస్తలుల కార్యములు 15:​14) 1 పేతురు 2:⁠10 ప్రకారం వారు “ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజ[లుగా]” తయారయ్యారు. లేఖనాలు వారిని ‘దేవుని ఇశ్రాయేలు’ అని అంటే ఆధ్యాత్మిక ఇశ్రాయేలని పేర్కొంటున్నాయి. (గలతీయులు 6:16; 2 కొరింథీయులు 1:​21) కాబట్టి ఆ క్రొత్త నిబంధన యెహోవా దేవునికి ఆధ్యాత్మిక ఇశ్రాయేలుకు మధ్యగల నిబంధన.

యేసు తన శిష్యులతో గడిపిన చివరిరాత్రి తానుగా వారితో వేరొక నిబంధన చేశాడు. “నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా . . . నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను” అని ఆయన వారికి చెప్పాడు. (లూకా 22:​29) ఇది రాజ్య నిబంధన. ఆ రాజ్య నిబంధనలోకి తీసుకోబడే అపరిపూర్ణ మానవుల సంఖ్య 1,44,000. పరలోకానికి పునరుత్థానం చేయబడిన తర్వాత, వారు క్రీస్తుతోపాటు రాజులుగా యాజకులుగా పరిపాలిస్తారు. (ప్రకటన 5:9, 10; 14:​1-4) కాబట్టి యెహోవా దేవునితో క్రొత్త నిబంధనలో ఉన్నవారు యేసుక్రీస్తు చేసిన రాజ్య నిబంధనలో కూడా ఉన్నారు. వారు మాత్రమే ప్రభువు రాత్రి భోజనపు చిహ్నాలలో న్యాయబద్ధంగా పాలుపంచుకుంటారు.

ఆ జ్ఞాపకార్థ చిహ్నాలలో పాలుపంచుకోవడానికి అర్హులైన వారికి తాము దేవునితో ఒక ఉత్కృష్ట సంబంధంలో ఉన్నామనీ, క్రీస్తుతోడి వారసులమనీ ఎలా తెలుస్తుంది? పౌలు ఇలా వివరిస్తున్నాడు: “మనము దేవుని పిల్లలమని ఆత్మ [పరిశుద్ధాత్మ] తానే మన ఆత్మతో [మన మానసిక స్వభావంతో] కూడ సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడినయెడల, క్రీస్తుతోడి వారసులము.”​—⁠రోమీయులు 8:16, 17.

దేవుడు తన పరిశుద్ధాత్మతో లేదా చురుకైన శక్తితో క్రీస్తుతోడి వారసులను అభిషేకిస్తాడు. వారు రాజ్య వారసులని అది రూఢిపరుస్తుంది. అది అభిషిక్త క్రైస్తవుల్లో పరలోక నిరీక్షణను కలుగజేస్తుంది. పరలోక జీవితం గురించి బైబిలు చెప్పేదంతా తమనుద్దేశించి చెప్పబడినట్లుగానే వారు భావిస్తారు. అంతేకాకుండా వారు, భూమ్మీది జీవితం, అన్ని మానవ సంబంధాలతోపాటు సమస్తమైన భూజీవిత బంధాలను త్యాగం చేయడానికి ఇష్టపడతారు. భూసంబంధ పరదైసు జీవితం అద్భుతంగా ఉంటుందని ఆత్మాభిషిక్త క్రైస్తవులు గ్రహించినప్పటికీ వారి నిరీక్షణ అది కాదు. (లూకా 23:​43) అబద్ధమత అభిప్రాయాలనుబట్టి కాదుగాని దేవుని ఆత్మచర్య కారణంగా వారికి మార్పులేని పరలోక నిరీక్షణ కలుగుతుంది. అందువల్ల వారు న్యాయబద్ధంగా జ్ఞాపకార్థ చిహ్నాలలో పాలుపంచుకుంటారు.

ఒక వ్యక్తికి తాను క్రొత్త నిబంధనలో, రాజ్య నిబంధనలో ఉన్నాననే ఖచ్చితమైన నమ్మకం లేదు. అలాగే అతనికి క్రీస్తుతోడి వారసుడననే దేవుని ఆత్మసాక్ష్యం కూడా లేనట్లయితే అప్పుడేమిటి? అలాంటప్పుడు ఆ వ్యక్తి జ్ఞాపకార్థ చిహ్నాలలో పాలుపంచుకోవడం తప్పవుతుంది. నిజానికి ఒక వ్యక్తికి అలాంటి పిలుపే లేనప్పుడు, అతను ఉద్దేశపూర్వకంగా తాను పరలోక రాజుగా, యాజకునిగా పిలువబడిన వానిగా చూపించుకుంటే దానికి దేవుడు సంతోషించడు.​—⁠రోమీయులు 9:16; ప్రకటన 22:5.

ఎంత తరచుగా ఆచరించాలి?

యేసు మరణ జ్ఞాపకార్థాన్ని ప్రతీ వారం లేదా బహుశా ప్రతీ రోజు ఆచరించాలా? పస్కా రోజునే క్రీస్తు, ప్రభువు రాత్రి భోజనాన్ని నెలకొల్పి, ఆ రోజునే అన్యాయంగా హత్య చేయబడ్డాడు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే నీసాను 14న ఆచరించబడే పస్కా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాసత్వం నుండి విడుదల పొందడాన్ని జ్ఞాపకం చేసేది. (నిర్గమకాండము 12:6, 14; లేవీయకాండము 23:⁠5) అందువల్ల ‘పస్కా అనే మన క్రీస్తు’ మరణాన్ని ప్రతీ వారం లేదా ప్రతీ రోజు కాదుగాని సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలి. (1 కొరింథీయులు 5:⁠7) ప్రభువు రాత్రి భోజనాన్ని ఆచరించడంలో క్రైస్తవులు, యేసు దానిని నెలకొల్పినప్పుడు అనుసరించిన పద్ధతినే అనుసరిస్తారు.

“మీరు ఈ రొట్టెను తిని, యీ పాత్ర లోనిది త్రాగునప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు” అని చెప్పిన పౌలు మాటలకు అర్థమేమిటి? (1 కొరింథీయులు 11:​26) ఈ సందర్భంలో పౌలు “ప్రతి సమయం,” లేదా “ప్రతిసారి” అనే భావమిచ్చే పదం ఉపయోగించాడు. కాబట్టి అభిషిక్త క్రైస్తవులు ఆ చిహ్నాలలో పాలుపంచుకున్న ప్రతీసారి, వారు యేసు విమోచన క్రయధన బలియందలి తమ విశ్వాసాన్ని ప్రకటిస్తారు.

అభిషిక్త క్రైస్తవులు ‘ఆయన వచ్చువరకు’ క్రీస్తు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. యేసు తన ‘ప్రత్యక్షతా’ కాలంలో తన అభిషిక్త అనుచరులను ఆత్మసంబంధ జీవానికి పునరుత్థానంచేసి పరలోకానికి తీసుకెళ్లే పర్యంతం ఈ ఆచరణ కొనసాగుతుంది. (1 థెస్సలొనీకయులు 4:​14-17, NW) ఇది, “నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును” అని యేసు తన 11 మంది యథార్థ అపొస్తలులతో పలికిన మాటలకు అనుగుణంగా ఉంటుంది.​—⁠యోహాను 14:⁠3.

అది మీకెంత ప్రాముఖ్యం?

యేసు బలి నుండి ప్రయోజనం పొందడానికి, భూమిపై నిత్యజీవం సంపాదించుకోవడానికి జ్ఞాపకార్థ చిహ్నాలలో పాలుపంచుకోవడం అవసరమా? అవసరం లేదు. దైవ భయంగల నోవహు, అబ్రాహాము, శారా, ఇస్సాకు, రిబ్కా, యోసేపు, మోషే, దావీదువంటి వారు భూమ్మీదకు పునరుత్థానమై వచ్చిన తర్వాత ఈ చిహ్నాలలో పాలుపంచుకుంటారని సూచించేదేదీ బైబిల్లో లేదు. అయినప్పటికీ వారు, వారితోపాటు భూమ్మీద నిత్యజీవం కోరుకునే వారందరూ దేవునియందు, క్రీస్తునందు అలాగే యేసు విమోచన క్రయధన బలికి సంబంధించిన యెహోవా ఏర్పాటునందు తమ విశ్వాసం ప్రదర్శించాలి. (యోహాను 3:36; 14:⁠1) నిత్యజీవం పొందడానికి మీరు కూడా అలాంటి విశ్వాసమే ప్రదర్శించాలి. సంవత్సరానికి ఒకసారి జరిగే క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు మీరు హాజరుకావడం ఆ గొప్ప బలిని మీకు గుర్తుచేస్తుంది, దానిపట్ల మీకున్న కృతజ్ఞతా భావాన్ని అది ప్రగాఢం చేయాలి.

“మీరు [తోటి అభిషిక్తులు] పాపము చేయకుండుటకై యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు; మన పాపములకు మాత్రమేకాదు, సర్వలోకమునకును శాంతికరమైయున్నాడు” అని పలికినప్పుడు అపొస్తలుడైన యోహాను యేసు బలి ప్రాముఖ్యతను నొక్కిచెప్పాడు. (1 యోహాను 2:​1, 2) యేసు బలి తమ పాపాలకు శాంతికరమై ఉందని అభిషిక్తులు చెప్పగలరు. అయితే ఆ బలి అదే ప్రకారం విధేయులైన మానవులందరికీ నిత్యజీవాన్ని సాధ్యపరుస్తూ సర్వలోక పాపాలకూ శాంతికరమై ఉంది.

2004 ఏప్రిల్‌ 4వ తేదీన యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీరు హాజరవుతారా? ప్రపంచవ్యాప్తంగా ఈ ఆచరణ యెహోవాసాక్షుల కూటాలు జరిగే స్థలాల్లో ఆచరించబడుతుంది. మీరు హాజరు కాగలిగితే, అత్యంత ప్రాముఖ్యమైన ఒక బైబిలు ప్రసంగాన్ని విని ప్రయోజనం పొందుతారు. యెహోవా దేవుడు, యేసుక్రీస్తు మనకోసం ఎంతచేశారో మీకు గుర్తుచేయబడుతుంది. దేవునిపట్ల, క్రీస్తుపట్ల, యేసు విమోచన క్రయధన బలిపట్ల ప్రగాఢ గౌరవంగలవారితో కలిసి సమావేశం కావడం కూడా ఆధ్యాత్మికంగా ప్రతిఫలదాయకంగా ఉంటుంది. నిత్యజీవానికి నడిపించేలా దేవుని కృప పొందాలనే మీ కోరికను ఈ సందర్భం మరింత బలోపేతం చేయవచ్చు. దేనినీ మీకు అడ్డు రానీయకండి. మన పరలోక తండ్రియైన యెహోవా దేవుణ్ణి ఘనపరిచి, సంతోషపరిచే ఈ ఉత్తేజకరమైన ఆచరణకు తప్పక హాజరవండి.

[5వ పేజీలోని చిత్రం]

ప్రేమకు సంబంధించిన రెండు మహాగొప్ప వ్యక్తీకరణలకు యేసు మరణం ముడిపెట్టబడింది

[6వ పేజీలోని చిత్రం]

పులియని రొట్టె, ద్రాక్షారసం యేసు పాపరహిత శరీరానికీ, ఆయన చిందించిన రక్తానికీ సరైన చిహ్నాలు