మీపై ప్రభావంచూపే ఆచరణ
మీపై ప్రభావంచూపే ఆచరణ
భూమిపై ఉన్నప్పుడు, యేసుక్రీస్తు దేవుణ్ణి మహిమపరిచే ఒక ఆచరణను నెలకొల్పాడు. దీనిని ఆచరించండి అని ఆయన తన అనుచరులను సూటిగా ఆజ్ఞాపించిన మతాచరణ అదొక్కటే. అదే ప్రభువు రాత్రి భోజనం, దానినే చివరి భోజనమని కూడా పిలుస్తారు.
ఆ సందర్భానికి నడిపే సంఘటనల్ని మీరు అదృశ్యంగా అక్కడేవుండి ప్రత్యక్షంగా చూస్తున్నట్లుగా ఊహించుకోండి. యూదుల పస్కాను ఆచరించడానికి యేసు, ఆయన అపొస్తలులు కలిసి యెరూషలేములోని ఒక మేడగదికి చేరుకున్నారు. కాల్చిన గొఱ్ఱె, చేదుకూరలు, పులియని రొట్టె, ఎర్రని ద్రాక్షారసం ఉండే ఆచారబద్ధమైన పస్కా భోజనాన్ని వారు ముగించారు. విశ్వాసఘాతకుడైన అపొస్తలుడు యూదా ఇస్కరియోతు అక్కడినుండి పంపివేయబడ్డాడు, కాసేపట్లో అతడు తన యజమానిని అప్పగిస్తాడు. (మత్తయి 26:17-25; యోహాను 13:21, 26-30) యేసు తన 11 మంది నమ్మకస్థులైన అపొస్తలులతో ఉన్నాడు. వారిలో మత్తయి ఒకడు.
మత్తయి ప్రత్యక్ష సాక్ష్యం ప్రకారం, యేసు ఈ విధంగా ప్రభువు రాత్రి భోజనాన్ని నెలకొల్పాడు: “యేసు ఒక [పులియని] రొట్టె పట్టుకొని, దాని నాశీర్వదించి, విరిచి తన శిష్యులకిచ్చి—మీరు తీసికొని తినుడి; ఇది నా శరీరమని చెప్పెను. మరియు ఆయన [ద్రాక్షారసపు] గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి—దీనిలోనిది మీరందరు త్రాగుడి. ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము.”—మత్తయి 26:26-28.
ప్రభువు రాత్రి భోజనాన్ని యేసు ఎందుకు నెలకొల్పాడు? అలాచేసేటప్పుడు ఆయన పులియని రొట్టెను, ఎర్రని ద్రాక్షారసాన్ని ఎందుకు ఉపయోగించాడు? ఈ చిహ్నాలలో క్రీస్తు అనుచరులందరూ పాలుపంచుకోవాలా? ఎంత తరచుగా ఈ భోజనాన్ని ఆచరించాలి? నిజానికి అది మీకెంత ప్రాముఖ్యం?