కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వెస్ట్‌ఫాలియా శాంతి ఒప్పందం యూరప్‌లో ఓ మలుపు రాయి

వెస్ట్‌ఫాలియా శాంతి ఒప్పందం యూరప్‌లో ఓ మలుపు రాయి

వెస్ట్‌ఫాలియా శాంతి ఒప్పందం యూరప్‌లో ఓ మలుపు రాయి

“నేడిక్కడ సమావేశమైన రీతిలో ఇంతమంది యూరప్‌ దేశాల ప్రతినిధులు సమావేశం కావడం నిజంగా ఒక అరుదైన సంఘటన.” ఫెడరల్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ జర్మనీ మాజీ అధ్యక్షుడైన రోమన్‌ హెర్సోక్‌ 1998 అక్టోబరులో ఆ మాటలు పలికారు. ఆయన ఆ మాటలు పలికినప్పుడు ఆ సభలో నలుగురు రాజులు, నలుగురు రాణులు, ఇద్దరు యువరాజులు, ఒక గ్రాండ్‌ డ్యూక్‌, కొంతమంది ప్రెసిడెంట్లు ఉన్నారు. యూరప్‌ సమాలోచక సమితి ప్రాయోజితం చేసిన ఆ సంఘటన, ఆధునిక జర్మనీ 50 సంవత్సరాల చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైన సంఘటన. ఆ సందర్భమేమిటి?

1998 అక్టోబరు నెల వెస్ట్‌ఫాలియా శాంతి ఒప్పందపు 350వ వార్షికోత్సవ నెల. శాంతి ఒప్పందాలు జరిగినప్పుడు తరచూ చరిత్ర మలుపు తిరుగుతుంది, ఈ విషయంలో వెస్ట్‌ఫాలియా ఒప్పందానికి ఒక ప్రత్యేకత ఉంది. 1648లో సంతకాలు జరిగిన ఈ ఒప్పందం ముప్పై సంవత్సరాల యుద్ధానికి చరమగీతం పాడి ఆధునిక యూరప్‌ సార్వభౌమాధికారం గల దేశాల ఖండంగా ఉద్భవించడానికి బాటలువేసింది.

ఆ పాత విధానం పటాపంచలైంది

మధ్యయుగాల్లో యూరప్‌లో అత్యధిక బలంగల వ్యవస్థాపనలు రోమన్‌ క్యాథలిక్‌ చర్చీ, పవిత్ర రోమా సామ్రాజ్యం. ప్రస్తుతం ఆస్ట్రియా, ఛెక్‌ రిపబ్లిక్‌, తూర్పు ఫ్రాన్స్‌, జర్మనీ, స్విట్జర్లాండ్‌, బెల్జియం, లక్సెంబర్గ్‌, నెదర్లాండ్స్‌, ఇటలీలోని కొన్నిభాగాలు విస్తరించివున్న భూభాగంలో వివిధ పరిమాణాల్లో వందలాది సంస్థాపనాలతో ఆ సామ్రాజ్యం రూపొందింది. జర్మను సంస్థాపనాలే దానిలో అధికభాగంగా ఉండేవి కాబట్టి అది జర్మను దేశ పవిత్ర రోమా సామ్రాజ్యం అని పిలువబడింది. ప్రతీ సంస్థాపనాన్ని ఒక రాజు పరిపాలించేవాడు. చక్రవర్తే ఆస్ట్రియన్‌ హ్యాబ్స్‌బర్గ్‌ కుటుంబానికి చెందిన ఒక రోమన్‌ క్యాథలిక్‌. అందువల్ల, పోప్‌ అధికార వ్యవస్థకు ఆధిపత్య సామ్రాజ్యం తోడుకావడంతో యూరప్‌ రోమన్‌ క్యాథలిక్‌ చేతుల్లో సుస్థిరంగా ఉంది.

అయితే 16, 17 శతాబ్దాల్లో ఆ పాత విధానం పటాపంచలైంది. రోమన్‌ క్యాథలిక్‌ చర్చి అదుపులేని ప్రవర్తనపట్ల యూరప్‌ అంతటా అసంతృప్తి అలుముకుంది. మార్టిన్‌ లూథర్‌, జాన్‌ కెల్విన్‌వంటి మత సంస్కర్తలు బైబిలు ప్రమాణాలవైపు మళ్లడం గురించి మాట్లాడారు. లూథర్‌ కాల్విన్‌లకు విస్తృతమైన మద్దతు లభించగా, ఈ పరివర్తన నుండే సంస్కరణోద్యమం, ప్రొటస్టెంటు మతాలు పుట్టుకొచ్చాయి. ఆ సంస్కరణోద్యమం సామ్రాజ్యాన్ని మూడు రకాల విశ్వాసాలుగా అంటే క్యాథలిక్‌, లూథరన్‌, కాల్వినిస్ట్‌ విభాగాలుగా చీల్చింది.

క్యాథలిక్కులు ప్రొటస్టెంట్లను నమ్మకపోగా ప్రొటస్టెంట్లు క్యాథలిక్కులైన తమ విరోధులను తృణీకారంగా చూశారు. ఈ వాతావరణం చివరకు 17వ శతాబ్ద ఆరంభంలో ప్రొటస్టెంటు యూనియన్‌, క్యాథలిక్‌ లీగ్‌ ఏర్పడడానికి దారితీసింది. ఆ సామ్రాజ్య రాజులు కొందరు యూనియన్‌లో, ఇంకొందరు లీగ్‌లో చేరారు. యూరప్‌, ప్రత్యేకంగా ఆ సామ్రాజ్యం నమ్మకత్వం నశించి నిప్పురవ్వ తగిలితే భగ్గుమని బూడిదయ్యే భాస్వరపు కుప్పగా తయారైంది. చివరకు ఆ నిప్పురవ్వ తగిలినప్పుడు, అది ఆ తర్వాత 30 సంవత్సరాలు సాగిన యుద్ధాన్ని రగిలించింది.

ప్రాణాంతక నిప్పురవ్వ యూరప్‌ను మంటల్లోకి నెట్టడం

ఆరాధనకు మరింత స్వేచ్ఛనిచ్చేలా క్యాథలిక్‌ హ్యాబ్స్‌బర్గ్‌ కుటుంబీకులను ప్రభావితం చేసేందుకు ప్రొటస్టెంట్‌ పరిపాలకులు ప్రయత్నించారు. అయితే అయిష్టంగానే ఆమోదం ఇవ్వబడింది, కానీ 1617-18లో బొహెమియాలో (ఛెక్‌ రిపబ్లిక్‌) రెండు లూథరన్‌ చర్చీలు బలవంతంగా మూసివేయబడ్డాయి. ఇది ప్రొటస్టెంట్‌ ప్రభుత్వాధిపతులకు రోషం పుట్టించడంతో వారు ప్రేగ్‌లోని ఒక రాజభవనంలోకి దూసుకెళ్లి ముగ్గురు క్యాథలిక్‌ అధికారుల్ని పట్టుకుని మేడగది కిటికీలోంచి క్రిందికి తోశారు. ఈ చర్యే నిప్పురవ్వగా మారి యూరప్‌ను మంటల్లోకి నెట్టింది.

ఈ మత సభ్యులు సమాధానకర్తయైన యేసుక్రీస్తు అనుచరులుగా ఉండవలసినప్పటికీ, పరస్పరం వ్యతిరేకించుకుంటూ ఒకరి పీకలు ఒకరు పట్టుకున్నారు. (యెషయా 9:⁠6) వైట్‌ మౌంటేన్‌ యుద్ధంలో లీగ్‌ యూనియన్‌ను చావుదెబ్బ తీయడంతో యూనియన్‌ చెల్లాచెదురైంది. ప్రొటస్టెంట్‌ ప్రభుత్వాధిపతులు ప్రేగ్‌ మార్కెట్టులో సంహరించబడ్డారు. బొహెమియా అంతటా, తమ విశ్వాసాన్ని తృణీకరించని ప్రొటస్టెంట్ల ఆస్తులు జప్తుచేయబడి క్యాథలిక్కులకు పంచిపెట్టబడ్డాయి. 1648​—⁠క్రెగ్‌ అండ్‌ ఫ్రీడెన్‌ ఇన్‌ యురోపా (1648​—⁠యూరప్‌లో యుద్ధం మరియు శాంతి) అనే పుస్తకం ఈ జప్తును “మధ్య యూరప్‌లో జరిగిన అపూర్వమైన ఆస్తుల యజమానత్వ మార్పిడి” అని వర్ణిస్తోంది.

బొహెమియాలో మత సంఘర్షణగా ఆరంభమైనది అంతర్జాతీయ అధికార యుద్ధంగా మారింది. ఆ తర్వాతి 30 సంవత్సరాల్లో డెన్మార్క్‌, ఫ్రాన్స్‌, నెదర్లాండ్స్‌, స్పెయిన్‌, స్వీడన్‌లు బరిలోకి లాగబడ్డాయి. క్యాథలిక్‌, ప్రొటస్టెంట్‌ పాలకులు తరచూ దురాశతో, అధికార తృష్ణతో రాజకీయ ఆధిపత్యంకోసం, వాణిజ్య లబ్దికోసం కుతంత్రాలకు పాల్పడ్డారు. ఆ ముప్పై సంవత్సరాల యుద్ధాన్ని వివిధ దశలుగా విభాగించి, ప్రతీ దశకు చక్రవర్తి ముఖ్య విరోధుల పేర్లు పెట్టడం జరిగింది. అనేక రెఫరెన్సు గ్రంథాలు అలాంటి నాలుగు దశలను ఈ విధంగా పేర్కొంటున్నాయి: బొహెమియన్‌ అండ్‌ పాలటైన్‌ యుద్ధం, డానిష్‌-లోవర్‌ సాక్సొని యుద్ధం, స్వీడిష్‌ యుద్ధం, ఫ్రెంచ్‌-స్వీడిష్‌ యుద్ధం. యుద్ధం చాలావరకు సామ్రాజ్య సంబంధిత భూప్రాంతంలోనే జరిగింది.

ఆ కాలంలో పిస్తోళ్లు, చేతి తుపాకులు, మోర్టార్లు, ఫిరంగులు ఆయుధాలుగా ఉపయోగించబడగా, స్వీడన్‌ ఆ ఆయుధాలన్ని భారీయెత్తున సరఫరా చేసింది. క్యాథలిక్కులు, ప్రొటస్టెంట్లు యుద్ధంలో మునిగిపోయారు. సైనికులు “శాంటా మారియా” లేదా “దేవుడు మాతో ఉన్నాడు” అని కేకలువేస్తూ యుద్ధానికి వెళ్లారు. సైనిక దళాలు జర్మనీ సంస్థానాల గుండా వెళుతూ శత్రువులను, పౌరులను జంతువులకంటే హీనంగా చూస్తూ సమస్తం దోచుకున్నారు. యుద్ధం అమానుషంగా ప్రవర్తించే స్థితికి దిగజారింది. “జనముమీదికి జనము ఖడ్గము ఎత్తక యుండును, యుద్ధముచేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు” అనే బైబిలు ప్రవచనానికి అదెంత విరుద్ధమో కదా!​—⁠మీకా 4:⁠3.

జర్మనీలో ఒక తరంవారు యుద్ధంతప్ప మరో సంగతి తెలియని రీతిలో పెరిగారు, అలసిన జనం శాంతికోసం అర్రులుచాచారు. పాలకుల విరుద్ధ రాజకీయ స్వలాభమే లేకపోతే శాంతి తప్పక సాధ్యమైయుండేది. యుద్ధంలో మతఛాయలు అంతరించి, లౌకికవాదం పుంజుకోవడంతో రాజకీయాలు అంతకంతకు ముందుకు పొడుచుకొచ్చాయి. వింతేమిటంటే, ఈ మార్పును ప్రోత్సహించిన ఒక వ్యక్తి, క్యాథలిక్‌ చర్చి ఉన్నతాధికారి.

కార్డినల్‌ రీషల్యూ తన అధికారాన్ని ఉపయోగించడం

అర్మాండ్‌-జీన్‌ డు ప్లెసిస్‌ అధికార బిరుదే కార్డినల్‌ డి రీషల్యూ. ఆయనే ఫ్రాన్స్‌కు 1624 నుండి 1642 వరకు ప్రధానమంత్రిగా కూడా ఉన్నాడు. యూరప్‌లో ఫ్రాన్స్‌ను అగ్రరాజ్యంగా చేయాలన్నది రీషల్యూ ఆశయం. అది సాధించడానికి ఆయన తన తోటి క్యాథలిక్కుల అంటే హ్యాబ్స్‌బర్గ్‌ కుటుంబీకుల అధికారాన్ని కాలరాయడానికి ప్రయత్నించాడు. ఆయన దీనినెలా చేశాడు? హ్యబ్స్‌బర్గ్‌ కుటుంబీకులకు వ్యతిరేకంగా పోరాడుతున్న జర్మన్‌ సంస్థానాలకు, డెన్మార్క్‌కు, నెదర్లాండ్స్‌కు, స్వీడన్‌కు చెందిన ప్రొటస్టెంట్‌ సైన్యాలకు ఆయన ఆర్థిక మద్దతిచ్చాడు.

1635లో రీషల్యూ మొట్ట మొదటిసారిగా ఫ్రెంచి సైన్యాలను యుద్ధానికి పంపించాడు. “ఆ ముప్పై సంవత్సరాల యుద్ధం” దాని చరమాంకంలో “మత వర్గాల పోరాటంగా అంతరించి . . . యూరప్‌లో రాజకీయ ఆధిపత్య యుద్ధంగా పరిణమించింది” అని వివాట్‌ పాక్స్‌​—⁠ఎస్‌ లిబె డెర్‌ ఫ్రెయిడీ! (శాంతి చిరకాలముండాలి!) అనే పుస్తకం వివరిస్తోంది. క్యాథలిక్కులకు ప్రొటస్టెంట్లకు మధ్య మత పోరాటంగా ఆరంభమైనది చివరకు క్యాథలిక్కులు ప్రొటస్టెంట్లతో కలిసి వేరే క్యాథలిక్కులకు వ్యతిరేకంగా పోరాడడంతో ముగిసింది. 1630వ దశాబ్దపు తొలిభాగానికల్లా బలహీనమైన క్యాథలిక్‌ లీగ్‌ 1635లో విచ్ఛిన్నమైపోయింది.

వెస్ట్‌ఫాలియాలో శాంతి సదస్సు

దోపిడీలు, హత్యలు, అత్యాచారాలు, వ్యాధులతో యూరప్‌ అతలాకుతలమయ్యింది. ఇది ఎవరూ గెలవలేని యుద్ధమని తేలిపోవడంతో క్రమేపీ శాంతి కోసం ఆకాంక్షించడం తీవ్రతరమయింది. “1630వ దశాబ్దపు అంతానికల్లా పరిపాలన చేస్తున్న రాజులంతా తమ లక్ష్యసాధనకు సైనిక శక్తి తమకెంతమాత్రం సహాయపడదని గుర్తించారు” అని వివాట్‌ పాక్స్‌​—⁠ఎస్‌ లిబె డెర్‌ ఫ్రెయిడీ! అనే పుస్తకం చెబుతోంది. అయితే అందరూ శాంతిని కోరుకుంటున్నప్పుడు, మరి అదెలా సాధించబడుతుంది?

యుద్ధం చేస్తున్న పక్షాలన్నీ ఒకచోట సమావేశమై శాంతి ప్రతిపాదనలు చర్చించే సదస్సు ఏర్పాటుచేయడానికి పవిత్ర రోమా సామ్రాజ్య చక్రవర్తి ఫెర్డినాండ్‌ III, ఫ్రాన్స్‌ రాజు లూయిస్‌ XIII, స్వీడన్‌ క్రిస్టినా రాణి ఒప్పుకున్నారు. చర్చల కోసం రెండు స్థలాల్ని అంటే జర్మన్‌ పాలిత ప్రాంతమైన వెస్ట్‌ఫాలియాలోని ఓస్నాబ్రూక్‌ మరియు మున్స్‌టర్‌ నగరాలు ఎన్నిక చేయబడ్డాయి. ఆ రెండు నగరాలు స్వీడన్‌, ఫ్రాన్స్‌ రాజధానుల మధ్యలో ఉన్నందువలన వాటిని ఎంచుకోవడం జరిగింది. 1643లో చిన్నాపెద్ద సలహా జట్లతో దాదాపు 150 ప్రతినిధి వర్గాలు ఆ రెండు నగరాలకు చేరుకున్నారు, క్యాథలిక్‌ రాయబారులు ఇటు మున్స్‌టర్‌కు, ప్రొటస్టెంట్‌ ప్రతినిధులు అటు ఓస్నాబ్రూక్‌కు చేరుకున్నారు.

రాయబారుల బిరుదు, హోదా, సీట్ల క్రమం, విధానాలవంటివి స్థిరపరచడానికి మొదట ఒక ప్రవర్తనా నియమావళి రూపొందించబడింది. ఆ పిమ్మట మధ్యవర్తుల ద్వారా ఒకదాని నుండి మరొకదానికి ప్రతినిధి వర్గాలు తమ ప్రతిపాదనలు అందజేయడంతో, శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. దాదాపు 5 సంవత్సరాల తర్వాత, ఒక ప్రక్క యుద్ధం జరుగుతుండగానే, శాంతి షరతుల ఒప్పందం కుదిరింది. ఆ వెస్ట్‌ఫాలియా శాంతి ఒప్పందంలో ఒకటికంటే ఎక్కువ ఒప్పంద పత్రాలున్నాయి. ఒక ఒప్పందంపై చక్రవర్తియైన ఫెర్డినాండ్‌ III మరియు స్వీడన్‌, మరొకదానిపై ఆ చక్రవర్తి మరియు ఫ్రాన్స్‌దేశాలు సంతకం చేయడం జరిగింది.

ఆ శాంతి ఒప్పందపు వార్తలు వ్యాపించడంతో సంబరాలు జరుపుకోవడం ఆరంభమైంది. ప్రాణాంతకమైన నిప్పురవ్వతో మొదలైనది అక్షరార్థ బాణాసంచాతో ముగిసింది. అనేక నగరాల్లో ఆకాశం రంగురంగుల వెలుగులతో మిలమిలా మెరిసింది. చర్చి గంటలు మ్రోగాయి, అభినందన సూచకంగా ఫిరంగులు మ్రోగాయి, ప్రజలు వీధుల్లో పాటలు పాడారు. ఇప్పుడిక యూరప్‌ శాశ్వత శాంతిని అపేక్షించవచ్చా?

శాశ్వత శాంతి సాధ్యమవుతుందా?

వెస్ట్‌ఫాలియా శాంతి ఒప్పందం సార్వభౌమాధికార సూత్రాన్ని గుర్తించింది. అంటే ఆ శాంతి ఒప్పందంలో సంతకాలు చేసిన అన్ని పక్షాలు, అన్ని పక్షాల భూప్రాంత హక్కులను గౌరవించాలనీ వారి అంతరంగ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదనీ దానర్థం. ఆ విధంగా సార్వభౌమాధికారం గల రాష్ట్రాల ఆధునిక యూరప్‌ ఖండం ఆవిర్భవించింది. ఆ ఒప్పందం నుండి కొన్నిదేశాలు వేరేవాటికంటే ఎక్కువ ప్రయోజనం పొందాయి.

ఫ్రాన్స్‌ అగ్రరాజ్యంగా స్థిరపరచబడగా, నెదర్లాండ్స్‌ స్విట్జర్లాండ్‌లు స్వాతంత్ర్యం సంపాదించుకున్నాయి. యుద్ధం మూలంగా నాశనమైన అనేక జర్మన్‌ సంస్థాపనలకు ఆ ఒప్పందం తృప్తి కలిగించలేదు. జర్మనీ భవితవ్యాన్ని కొంతమేరకు ఇతర దేశాలే నిర్ణయించాయి. ద న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ఇలా నివేదిస్తోంది: “ప్రధాన అధికారాలైన ఫ్రాన్స్‌, స్వీడన్‌, ఆస్ట్రియాల అనుకూలత మేరకే జర్మన్‌ రాజుల లాభనష్టాలు తీర్మానించబడ్డాయి.” జర్మన్‌ సంస్థాపనలను ఏకంచేసి, వాటిని సమైక్యపరచడానికి బదులు అవి ముందున్నట్లే విభాగించబడ్డాయి. దానికితోడు, జర్మనీ ముఖ్య నదులైన రైన్‌, ఎల్బ్‌, ఓడర్‌ల నదీ ప్రాంతాలతోసహా జర్మనీ భూప్రాంతాలు కొన్ని విదేశీ పాలకుల ఆధీనంలోకి వెళ్ళిపోయాయి.

క్యాథలిక్‌, లూథరన్‌, కాల్వినిస్ట్‌ మతాలకు సమాన గుర్తింపు ఇవ్వబడింది. ఇది అందరికీ ఇష్టంకాలేదు. ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పోప్‌ ఇన్నోసెంట్‌ X, దానిని వట్టిదనీ, చెల్లనిదనీ ప్రకటించాడు. అయినాసరే, స్థిరపరచబడిన మత సరిహద్దులు మొత్తానికి తర్వాతి మూడు శతాబ్దాలపాటు చెక్కుచెదరకుండా నిలబడ్డాయి. వ్యక్తిగత మత స్వాతంత్ర్యం ఇంకా లభించనప్పటికీ, పరిస్థితి ఒక అడుగు ముందుకు వెళ్ళింది.

ఆ శాంతి ఒప్పందం ముప్పై సంవత్సరాల యుద్ధాన్ని ముగింపుకు తీసుకువచ్చింది, దానితో వైరుధ్యాలు చాలావరకు సమసిపోయాయి. యూరప్‌లో జరిగిన భారీ మతయుద్ధాల్లో ఇది చివరిది. యుద్ధాలు అంతంకాలేదు గానీ వాటికి అంతర్లీన కారణం మతంనుండి రాజకీయానికీ, వాణిజ్యానికీ మారింది. అంటే దానర్థం యూరప్‌ వైరుధ్యాల్లో మతం తన ప్రభావం పూర్తిగా కోల్పోయిందని కాదు. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల్లో జర్మన్‌ సైనికులు “దేవుడు మాతో ఉన్నాడు” అనే సుపరిచిత పదాలు వ్రాసివున్న బెల్టు బక్కెల్స్‌ ధరించారు. ఈ భయంకర యుద్ధాల్లో క్యాథలిక్కులు, ప్రొటస్టెంట్లు మరలా ఒకసారి విపక్షపు క్యాథలిక్కులు, ప్రొటస్టెంట్లకు విరుద్ధంగా యుద్ధం చేయడానికి బారులు తీరారు.

అవును, వెస్ట్‌ఫాలియా ఒప్పందం శాశ్వతమైన శాంతి తీసుకురాలేదు. అయితే, విధేయతగల మానవాళి అలాంటి శాంతిని త్వరలోనే అనుభవిస్తుంది. యెహోవా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు మెస్సీయా రాజ్యం ద్వారా మానవాళికి శాశ్వత శాంతి తీసుకొస్తాడు. ఆ ప్రభుత్వం క్రింద, ఏకైక నిజమైన మతం విచ్ఛిన్నానికి కాదుగాని ఐక్యతకు బలం చేకూర్చేదిగా ఉంటుంది. ఎవరూ మతం కారణంగానే గానీ మరో కారణంగానే గానీ యుద్ధానికి వెళ్లరు. ఈ భూమిపై ఆ రాజ్యం పరిపాలించినప్పుడు అదెంత సేదదీర్పుగా ఉంటుందో గదా! ఆ కాలంలో ‘శాంతికి అంతమే ఉండదు.’​—⁠యెషయా 9:​6, 7, NW.

[21వ పేజీలోని బ్లర్బ్‌]

క్యాథలిక్కులకు ప్రొటస్టెంట్లకు మధ్య మత పోరాటంగా ఆరంభమైనది చివరకు క్యాథలిక్కులు ప్రొటస్టెంట్లతో కలిసి వేరే క్యాథలిక్కులకు వ్యతిరేకంగా పోరాడడంతో ముగిసింది

[22వ పేజీలోని బ్లర్బ్‌]

సైనికులు “శాంటా మారియా” లేదా “దేవుడు మాతో ఉన్నాడు” అని కేకలువేస్తూ యుద్ధానికి వెళ్లారు

[21వ పేజీలోని చిత్రం]

కార్డినల్‌ రీషల్యూ

[23వ పేజీలోని చిత్రం]

లూథర్‌, కాల్విన్‌ మరియు పోప్‌ల మధ్య జరిగిన పెనుగులాటను వర్ణిస్తున్న 16వ శతాబ్దపు చిత్రం

[20వ పేజీలోని చిత్రసౌజన్యం]

From the book Spamers Illustrierte Weltgeschichte VI

[23వ పేజీలోని చిత్రసౌజన్యం]

పెనుగులాడుతున్న మతనాయకులు: From the book Wider die Pfaffenherrschaft; మ్యాప్‌: The Complete Encyclopedia of Illustration/J. G. Heck