కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“సువార్తికుని పనిచేయుము”

“సువార్తికుని పనిచేయుము”

“సువార్తికుని పనిచేయుము”

“అన్ని విషయములలో మితముగా ఉండుము, . . . సువార్తికుని పనిచేయుము.”​—⁠2 తిమోతి 4:⁠5.

యెహోవా నామం, ఆయన సంకల్పాలు భూవ్యాప్తంగా ప్రకటించబడుతున్నాయి. ఎందుకంటే, “మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి” అని యేసుక్రీస్తు తన అనుచరులకిచ్చిన ఆజ్ఞను దేవునికి సమర్పించుకున్న ప్రజలు గంభీరంగా తీసుకున్నారు.​—⁠మత్తయి 28:19, 20.

2 యేసు మొదటి శతాబ్దపు శిష్యులు ఆ ఆజ్ఞను గంభీరంగా తీసుకున్నారు. ఉదాహరణకు, అపొస్తలుడైన పౌలు తన తోటి క్రైస్తవ పైవిచారణకర్తయైన తిమోతికి ఇలా ఉద్బోధించాడు: “సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము.” (2 తిమోతి 4:⁠5) నేడు ఒక పైవిచారణకర్త, క్షేత్ర పరిచర్యలో క్రమంగా భాగం వహిస్తూ ఆసక్తితో రాజ్యం గురించి ప్రకటించడం ద్వారా తన పరిచర్యను నెరవేర్చగలుగుతాడు. ఉదాహరణకు, ప్రకటనా పనిలో సారధ్యం వహిస్తూ, ఇతరులకు శిక్షణ ఇచ్చే ప్రతిఫలదాయకమైన ఆధిక్యత సంఘ పుస్తక అధ్యయన పైవిచారణకర్తకు ఉంది. సువార్త ప్రకటించమని తనకివ్వబడిన వ్యక్తిగత బాధ్యతను పౌలు నెరవేర్చి, పరిచర్య కోసం ఇతరులకు శిక్షణ ఇవ్వడంలో ఆయన సహాయంచేశాడు.​—⁠అపొస్తలుల కార్యములు 20:20; 1 కొరింథీయులు 9:16, 17.

గతకాలంలోని ఆసక్తిగల సువార్తికులు

3 తొలి క్రైస్తవులు ఆసక్తిగల సువార్తికులుగా పేరుపొందారు. సువార్తికుడైన ఫిలిప్పునే తీసుకోండి. అతను యెరూషలేములో హీబ్రూ మాట్లాడే, గ్రీకు మాట్లాడే క్రైస్తవ విధవరాండ్రకు ప్రతిదినం నిష్పక్షపాతంగా ఆహార సరఫరాచేసే పనికి ఎంపికచేయబడి, ‘ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచిపేరు పొందిన యేడుగురు మనుష్యులలో’ ఒకడు. (అపొస్తలుల కార్యములు 6:​1-6) ఆ ప్రత్యేక సేవ ముగిసిన తర్వాత వచ్చిన హింస, అపొస్తలులనుతప్ప మిగతా వారందరిని వివిధ ప్రాంతాలకు చెదరగొట్టింది, దానితో ఫిలిప్పు సమరయకు వెళ్లాడు. ఆయనక్కడ సువార్త ప్రకటిస్తూ, పరిశుద్ధాత్మ ద్వారా బలంపొంది దయ్యాలను వెళ్లగొట్టాడు, కుంటివారిని పక్షవాయువు గలవారిని బాగుచేశాడు. చాలామంది సమరయులు రాజ్య సందేశాన్ని అంగీకరించి బాప్తిస్మం తీసుకున్నారు. యెరూషలేములోని అపొస్తలులు ఇది విని కొత్తగా బాప్తిస్మం తీసుకున్న విశ్వాసులు పరిశుద్ధాత్మ పొందులాగున అపొస్తలులైన పేతురు యోహానులను అక్కడకు పంపించారు.​—⁠అపొస్తలుల కార్యములు 8:4-17.

4 ఆ తర్వాత గాజాకు వెళ్లే మార్గంలో ఐతియొపీయుడైన నపుంసకుణ్ణి కలుసుకొనేలా దేవుని పరిశుద్ధాత్మ ఫిలిప్పును ప్రేరేపించింది. యెషయా ప్రవచనాన్ని ఫిలిప్పు స్పష్టంగా వివరించిన తర్వాత ‘ఐతియొపీయుల రాణియైన కందాకే క్రింద మంత్రియైన’ ఆ వ్యక్తి యేసుక్రీస్తునందు విశ్వాసముంచి బాప్తిస్మం తీసుకున్నాడు. (అపొస్తలుల కార్యములు 8:​26-38) ఆ పిమ్మట ఫిలిప్పు అజోతుకు, అక్కడనుండి కైసరయకు వెళుతూ దారిపొడవునా “పట్టణములన్నిటిలో . . . సువార్త ప్రకటించుచు వచ్చెను.” (అపొస్తలుల కార్యములు 8:​39, 40) సువార్తికునిగా సేవచేయడంలో ఆయన నిస్సందేహంగా చక్కని మాదిరి ఉంచాడు.

5 దాదాపు 20 సంవత్సరాల తర్వాత కూడా ఫిలిప్పు కైసరయలో చురుకుగా పరిచర్య కొనసాగిస్తూనే ఉన్నాడు. పౌలు, లూకా ఆయన ఇంటిలో ఉన్నప్పుడు, “కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతనికుండిరి, వారు ప్రవచించువారు.” (అపొస్తలుల కార్యములు 21:​8-10) వారు నిశ్చయంగా ఆధ్యాత్మికంగా చక్కని శిక్షణపొందారు, వారు పరిచర్యలో ఆసక్తిగలవారై, ప్రవచనాత్మకంగా మాట్లాడే ఆధిక్యత కూడా పొందారు. నేడు పరిచర్య విషయంలో తల్లిదండ్రులు చూపే ఆసక్తి వారి కుమారులు, కుమార్తెలు కూడా ఆసక్తిగా ప్రకటించడాన్ని తమ జీవిత లక్ష్యంగా చేసుకునేలా వారిని పురికొల్పుతూ వారిపై చక్కని ప్రభావం చూపగలదు.

ఆసక్తిపరులైన నేటి సువార్తికులు

6 మనకాలాన్ని, యుగాంతాన్ని సూచిస్తూ తాను చెప్పిన గొప్ప ప్రవచనంలో యేసుక్రీస్తు ఇలా ప్రకటించాడు: “సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను.” (మార్కు 13:​10) సువార్త “సకల జనములకు” ప్రకటించబడిన తర్వాత అంతం వస్తుంది. (మత్తయి 24:​14) పౌలు, మొదటి శతాబ్దపు సువార్తికులు సువార్త ప్రకటిస్తుండగా అనేకులు విశ్వాసులయ్యారు, రోమా సామ్రాజ్యమంతటా చాలా ప్రాంతాల్లో సంఘాలు స్థాపించబడ్డాయి. ఈ సంఘాల్లో నియమించబడిన పెద్దలు సువార్తపనిలో, సుదూర ప్రాంతాలకు ప్రకటనా పనిని విస్తరింపజేయడంలో తమ సహోదర సహోదరీలతో కలిసి పనిచేశారు. నేడు లక్షలాదిమంది యెహోవాసాక్షులు సువార్త పనిచేస్తున్నందుకు జరుగుతున్నట్లుగానే, ఆ కాలంలోనూ యెహోవా వాక్యం ప్రభావంతో ప్రబలమై వ్యాపించింది. (అపొస్తలుల కార్యములు 19:​20) యెహోవాను సంతోషంగా స్తుతిస్తున్న వారిలో మీరూ ఉన్నారా?

7 ఆధునిక దిన రాజ్య ప్రచారకులు చాలామంది సువార్త పనిలో తమ వంతును విస్తరింపజేసుకోవడానికి లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. వేలాదిమంది మిషనరీ క్షేత్రంలో ప్రవేశించగా, లక్షలాదిమంది క్రమ మరియు సహాయ పయినీర్లుగా సువార్త పనిలో పూర్తికాలం భాగం వహిస్తున్నారు. ఆసక్తిగల రాజ్య ప్రచారకులుగా సేవచేస్తున్న స్త్రీపురుషులు, పిల్లలు ఎంత చక్కని పని చేస్తున్నారో గదా! క్రైస్తవ సువార్తికులుగా యెహోవా ప్రజలు తమ భుజాలు కలిపి లేదా ఏకమనస్కులై ఆయనను సేవిస్తూ ఆయన ఆశీర్వాదాలు సమృద్ధిగా అనుభవిస్తున్నారు.​—⁠జెఫన్యా 3:9.

8 దేవుడు భూవ్యాప్తంగా సువార్త ప్రకటించే బాధ్యతను యేసు అభిషిక్త అనుచరులకు అప్పగించాడు. ఈ సువార్త పనిలో అంతకంతకు అధికమవుతున్న క్రీస్తు “వేరే గొఱ్ఱెలు” వారికి మద్దతిస్తున్నారు. (యోహాను 10:16) ప్రవచనార్థకంగా, ప్రాణాలను రక్షించే ఈ పని ఇప్పుడు జరుగుతున్న సంఘటనల విషయమై మూల్గులిడుస్తూ, ప్రలాపిస్తున్న వారి లలాటములపై గురుతు వేయడంతో పోల్చబడింది. త్వరలోనే దుష్టులు నాశనం చేయబడతారు. ఈలోగా భూనివాసులకు ప్రాణరక్షక సత్యాలను అందజేయడం ఎంతటి ఆధిక్యతో కదా!​—⁠యెహెజ్కేలు 9:4-6, 11.

9 మనం కొంత కాలం నుండి సువార్త పనిలో భాగం వహిస్తుంటే, సంఘంలోని కొత్తవారికి సహాయం చేయడానికి మనం తప్పక ఏదోకటి చేయవచ్చు. అప్పుడప్పుడు మనతోపాటు వారిని పరిచర్యకు తీసుకెళ్లవచ్చు. పెద్దలుగా సేవచేస్తున్న వారు తోటి విశ్వాసులను ఆధ్యాత్మికంగా బలపరిచేందుకు శాయశక్తులా కృషిచేయడానికి ఇష్టపడతారు. ఆసక్తిగల, ఫలవంతమైన సువార్తికులుగా ఉండేలా ఇతరులకు సహాయపడేందుకు వినయంగల పైవిచారణకర్తలు చేసే చక్కని ప్రయత్నాలు ఎంతగానో తోడ్పడగలవు.​—⁠2 పేతురు 1:​5-8.

ఇంటింటా సాక్ష్యమివ్వడం

10 సువార్తికునిగా యేసుక్రీస్తు తన అనుచరులకు అత్యుత్తమ మాదిరి ఉంచాడు. క్రీస్తు, ఆయన అపొస్తలుల పరిచర్య గురించి దేవుని వాక్యమిలా చెబుతోంది: “ఆయన దేవుని రాజ్యసువార్తను తెలుపుచు, ప్రకటించుచు, ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా పండ్రెండుమంది శిష్యులును . . . ఆయనతో కూడా ఉండిరి.” (లూకా 8:​1-3) అపొస్తలుల విషయమేమిటి? సా.శ. 33 పెంతెకొస్తునాడు పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన తర్వాత వారు “ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి.”​—⁠అపొస్తలుల కార్యములు 5:42.

11 అపొస్తలుడైన పౌలు తాను ఆసక్తితో చేసిన సువార్త పని కారణంగా, ఎఫెసులోని క్రైస్తవ పెద్దలకిలా చెప్పగలిగాడు: “ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను, ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు” వచ్చాను. పౌలు ‘ఇంటింటా బోధించినప్పుడు’ ఆయన విశ్వాసులకు కాపరి సందర్శనాలు చేస్తూ తోటి యెహోవా ఆరాధకుల ఇళ్లు దర్శిస్తూ ఉన్నాడా? లేదు, ఎందుకంటే ఆయనింకా ఇలా వివరిస్తున్నాడు: ‘దేవుని యెదుట మారుమనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలెనని, యూదులకును గ్రీసుదేశస్థులకును సాక్ష్యమిచ్చాను.’ (అపొస్తలుల కార్యములు 20:​20, 21) సాధారణంగా, యెహోవాకు అప్పటికే సమర్పించుకున్న వారికి ‘దేవుని యెదుట మారుమనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచడం’ గురించి ఉపదేశించాల్సిన అవసరం ఉండదు. మారుమనస్సు, విశ్వాసాల గురించి అవిశ్వాసులకు బోధిస్తూనే పౌలు ఎఫెసులోని క్రైస్తవ పెద్దలకు ఇంటింటి పరిచర్య విషయంలో శిక్షణ ఇచ్చాడు. ఇలా చేయడంలో పౌలు యేసు నెలకొల్పిన పద్ధతినే అనుకరిస్తున్నాడు.

12 ఇంటింటి పరిచర్య సవాలుగా ఉండగలదు. ఉదాహరణకు, మనం బైబిలు సందేశంతో వారింటికి వెళ్లినప్పుడు కొందరు అభ్యంతరపడతారు. ప్రజలను అభ్యంతర పరచాలనేది మన ఉద్దేశం కాదు. అయినప్పటికీ, ఇంటింటి పరిచర్య లేఖనానుసారమైనది, దేవునిపట్ల, పొరుగువారిపట్ల మనకున్న ప్రేమ ఈ విధంగా సాక్ష్యమివ్వడానికి మనలను పురికొల్పుతుంది. (మార్కు 12:​28-31) ఇంటింటా ప్రకటించే మన హక్కు ‘పక్షమున వాదించి దానిని చట్టబద్ధంగా స్థిరపరచడానికి’ వివిధ న్యాయస్థానాలతోపాటు అమెరికా సర్వోన్నత న్యాయస్థానంలో కూడా మనం కేసులు వేశాము. (ఫిలిప్పీయులు 1:⁠7) ఆ న్యాయస్థానం దాదాపు అన్నిసమయాల్లో మన పక్షంగానే తీర్పు తీర్చింది. ఆ తీర్పు ఈ క్రింది విధంగా ఉంది:

13 “మత సంబంధ కరపత్రాలు పంచడమనే మిషనరీ సువార్త సేవ ముద్రణాశాలల చరిత్రంత పురాతనమైనది. అనేకవేల సంవత్సరాలుగా వివిధ మత ఉద్యమాల్లో అది బలమైన శక్తిగా పనిచేసింది. నేడు ఈ విధమైన సువార్త సేవను వివిధ మతశాఖలు విస్తృత స్థాయిలో చేపడుతుండగా, ఆ మతశాఖల పూర్తికాల సభ్యులు వేలాది ఇళ్లకు సువార్త మోసుకెళ్లి సంబంధిత వ్యక్తులను తమ విశ్వాసంవైపు ఆకర్షించేందుకు వ్యక్తిగత సందర్శనాల ద్వారా ప్రయత్నిస్తుంటారు. . . . [అమెరికా రాజ్యాంగ] మొదటి సవరణలో చర్చీల్లోని ఆరాధనకు, పులిపీఠపు ప్రచారానికి ఇవ్వబడిన హోదాయే ఈ విధమైన మతసంబంధ కార్యకలాపానికీ ఇవ్వబడింది.”​—⁠మర్డక్‌ వెర్సెస్‌ పెన్సిల్వేనియా, 1943.

ఎల్లప్పుడూ ఎందుకు ప్రకటించాలి?

14 ఇంటింటా సాక్ష్యమివ్వడానికి అనేక కారణాలున్నాయి. ఇంటి యజమానిని మనం సందర్శించిన ప్రతీసారి, మనం లేఖన సత్యమనే విత్తనాన్ని నాటేందుకు ప్రయత్నిస్తాం. పునర్దర్శనాలు చేయడం ద్వారా, మనం నీరు పోస్తాం. అది చక్కని ప్రవర్ధమానపు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది, ఎందుకంటే పౌలు ఇలా వ్రాశాడు: “నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసినవాడు దేవుడే.” (1 కొరింథీయులు 3:⁠6) కాబట్టి యెహోవా ‘వృద్ధి కలుగజేస్తాడు’ అనే నమ్మకంతో మనం నిరంతరం ‘నాటుతూ, నీళ్లు పోద్దాం.’

15 జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి కాబట్టి మనం సువార్త పనిచేస్తున్నాం. ప్రకటించడం ద్వారా మనలను మనమూ, మన బోధ వినేవారినీ రక్షించుకుంటాం. (1 తిమోతి 4:​16) ఒక వ్యక్తి జీవితం ప్రమాదంలో ఉందని మనకు తెలిసినప్పుడు, సహాయం చేయడానికి మనం నామమాత్రంగా ప్రయత్నిస్తామా? ఎంతమాత్రం కాదు. రక్షణ ఇమిడివుంది కాబట్టి, మనం ప్రజల ఇండ్లను పదేపదే సందర్శిస్తాము. పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఒక సందర్భంలో మాట్లాడడానికే తీరికలేని వ్యక్తి మరో సమయంలో బైబిలు సందేశం వినడానికి సుముఖంగా ఉండవచ్చు. ఆ కుటుంబంలోని మరో సభ్యుడు ఆ ఇంటిదగ్గర మనకు తారసపడవచ్చు, అది లేఖన చర్చకు దారితీయవచ్చు.

16 ఇంటివారి పరిస్థితులే కాదు వారి దృక్పథమూ మారవచ్చు. ఉదాహరణకు, ప్రియమైన వారిని మరణంద్వారా పోగొట్టుకోవడం రాజ్య సందేశం వినేలా ఆ వ్యక్తిని పురికొల్పవచ్చు. మనం ఆ వ్యక్తిని ఓదార్చాలనీ, ఆయన తన ఆధ్యాత్మిక అవసరతను గుర్తించేలా చేయాలనీ, దానినెలా సంతృప్తిపరచుకోవచ్చో అతనికి చూపించాలనీ ఆశిస్తాం.​—⁠మత్తయి 5:3, 4.

17 ఇంటింటా సాక్ష్యమివ్వడానికి లేదా క్రైస్తవ పరిచర్యలో ఇతర విధాలుగా భాగంవహించడానికి మనకున్న కారణాల్లో, యెహోవా నామాన్ని తెలియజేయడంలో పాలుపంచుకోవాలన్న కోరికే ప్రధానమైనది. (నిర్గమకాండము 9:16; కీర్తన 83:​18) సత్యాన్ని, నీతిని ప్రేమించే వారు యెహోవా స్తుతికర్తలయ్యేందుకు మన సువార్త పని సహాయం చేయడం ఎంత ప్రతిఫలదాయకమైనదో కదా! “యౌవనులు కన్యలు వృద్ధులు బాలురు అందరును యెహోవా నామమును స్తుతించుదురు గాక ఆయన నామము మహోన్నతమైన నామము. ఆయన ప్రభావము భూమ్యాకాశములకు పైగా నున్నది” అని కీర్తనకర్త ఆలపించాడు.​—⁠కీర్తన 148:12, 13.

సువార్త పనిచేయడం వ్యక్తిగతంగా మనకు ప్రయోజనాన్నిస్తుంది

18 సువార్తికునిగా పనిచేయడం మనకు వివిధ రీతుల్లో వ్యక్తిగత ప్రయోజనాన్నిస్తుంది. సువార్తతో ఇంటింటికి వెళ్లడం, మనలను ప్రత్యేకంగా సాదరంగా ఆహ్వానించనప్పుడు మనం వినయాన్ని అలవరచుకోవడానికి సహాయం చేస్తుంది. ఫలవంతమైన సువార్తికులుగా ఉండడానికి మనం ‘కొందరినైనా రక్షించాలని అందరికీ అన్నివిధముల వ్యక్తిగా తయారైన’ పౌలువలే ఉండాలి. (1 కొరింథీయులు 9:​19-23) పరిచర్యానుభవం యుక్తిని ప్రదర్శించడానికి మనకు సహాయం చేస్తుంది. యెహోవాపై ఆధారపడుతూ, సరైన మాటలు ఎంపికచేసుకోవడం ద్వారా పౌలు ఇచ్చిన ఈ ఉపదేశాన్ని మనం అన్వయించుకోవచ్చు: “ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పువేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి.”​—⁠కొలొస్సయులు 4:⁠6.

19 సువార్త పని మనం దేవుని పరిశుద్ధాత్మపై ఆధారపడేలా కూడా మనలను పురికొల్పుతుంది. (జెకర్యా 4:⁠6) ఫలితంగా, మన పరిచర్యలో పరిశుద్ధాత్మ ఫలాలైన “ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము” ప్రస్ఫుటమవుతాయి. (గలతీయులు 5:​22) ప్రజలతో మన వ్యవహారాలను అది ప్రభావితం చేస్తుంది, ఎందుకంటే ఆత్మ నడిపింపుకు లోబడడం ప్రేమ చూపించడానికి, సంతోషంగా, సమాధానంగా ఉండడానికి, దీర్ఘశాంతం దయ చూపించడానికి, మంచితనం విశ్వాసం ప్రదర్శించడానికి, సువార్త ప్రకటించేటప్పుడు సాత్వికాన్ని ఆశానిగ్రహాన్ని కనబరచడానికి మనకు సహాయం చేస్తుంది.

20 సువార్తికులుగా మనకు లభించే మరో ప్రయోజనం ఏమిటంటే, మనం మరింత సహానుభూతి చూపేవారిగా తయారవుతాం. ప్రజలు తమ సమస్యలను అంటే వ్యాధి గురించి, నిరుద్యోగం గురించి, ఇంట్లోని ఇబ్బందుల గురించి ప్రస్తావించినప్పుడు మనం వారి సలహాదారులుగా మారం, బదులుగా వారితో ప్రోత్సాహకరమైన, ఓదార్పుకరమైన లేఖనాలను పంచుకుంటాం. ఆధ్యాత్మికంగా అంధులైనా నీతిని ప్రేమిస్తున్న వారిగావున్న ప్రజలపట్ల మనకు శ్రద్ధవుంది. (2 కొరింథీయులు 4:⁠4) “నిత్యజీవం పట్ల సరైన మానసిక వైఖరిగల” వారికి ఆధ్యాత్మిక సహాయం అందించడం ఎంత గొప్ప ఆశీర్వాదమో గదా!​—⁠అపొస్తలుల కార్యములు 13:​48, NW.

21 సువార్త పనిలో క్రమంగా పాల్గొనడం ఆధ్యాత్మిక విషయాలపై మనస్సు కేంద్రీకరించడానికి మనకు సహాయం చేస్తుంది. (లూకా 11:​34) అది నిశ్చయంగా ప్రయోజనకరం, ఎందుకంటే అదే లేకపోతే మనమీ లోకంలో ఎంతో సర్వసాధారణమైపోయిన ఐశ్వర్యాసక్తి శోధనలకు లొంగిపోవచ్చు. అపొస్తలుడైన యోహాను క్రైస్తవులకిలా ఉద్బోధించాడు: “ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.” (1 యోహాను 2:​15-17) ప్రభువు కార్యాభివృద్ధియందు సమృద్ధిగా పనికలిగి సువార్తికులుగా ముమ్మరంగా పనిచేయడం లోకాన్ని ప్రేమించకుండా ఉండేందుకు మనకు సహాయపడుతుంది.​—⁠1 కొరింథీయులు 15:​58.

పరలోక ధనం సమకూర్చుకోండి

22 ఆసక్తితోచేసే రాజ్య ప్రకటనా పని శాశ్వతమైన ప్రయోజనాలు తెస్తుంది. ఈ ప్రయోజనాలేమిటో చెబుతూ యేసు ఇలా అన్నాడు: “భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు. పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు. నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును.”​—⁠మత్తయి 6:19-21.

23 సర్వాధిపతియైన యెహోవాకు సాక్షులుగా మనం ఆయనకు ప్రాతినిధ్యం వహించే ఆధిక్యతకు మించినది లేదని ఎరిగినవారమై పరలోకంలో ధనం సమకూర్చుకొందము గాక. (యెషయా 43:​10-12) దేవుని పరిచారకులుగా మనకివ్వబడిన ఆజ్ఞను మనం నెరవేరుస్తుండగా, 90 యేళ్ల వయస్సుగల ఒక క్రైస్తవ స్త్రీ భావించినట్లే మనమూ భావించవచ్చు. తాను దేవుని సేవలో గడిపిన సుదీర్ఘకాలాన్ని గురించి మాట్లాడుతూ ఇలా అంటోంది: “ఈ సంవత్సరాలన్నింటిలో నన్ను భరించినందుకు నేను యెహోవాకు ఎనలేని కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను, ఆయనే యుగయుగాలు నా ప్రేమగల తండ్రిగా ఉండాలని నేను తీవ్రంగా ప్రార్థిస్తున్నాను.” మనం కూడా అదే ప్రకారం దేవునితో మన సంబంధాన్ని విలువైనదిగా ఎంచినప్పుడు, మనం నిశ్చయంగా సంపూర్ణ భావంలో సువార్తికుని పనిచేయాలని కోరుకుంటాం. మన పరిచర్యను మనమెలా సంపూర్ణంగా నెరవేర్చవచ్చో చూసేందుకు తర్వాతి ఆర్టికల్‌ మనకు సహాయం చేస్తుంది.

మీరెలా సమాధానమిస్తారు?

మనమెందుకు సువార్తికుని పనిచెయ్యాలి?

గతకాల, ప్రస్తుతకాల సువార్తికుల సేవ గురించి మీరేమి చెప్పగలరు?

మనం ఇంటింటికి వెళ్ళి ఎందుకు సాక్ష్యమిస్తాం?

సువార్తికుని పనిచేయడం ద్వారా వ్యక్తిగతంగా మీరెలా ప్రయోజనం పొందుతారు?

[అధ్యయన ప్రశ్నలు]

1. యేసు తన అనుచరులకు ఏమని ఆజ్ఞాపించాడు?

2. పైవిచారణకర్తయైన తిమోతి ఎలాంటి ఉపదేశం అందుకున్నాడు, క్రైస్తవ పైవిచారణకర్తలు తమ పరిచర్యను నెరవేర్చే ఒక విధానమేమిటి?

3, 4. సువార్తికునిగా ఫిలిప్పుకు ఎలాంటి అనుభవాలు కలిగాయి?

5. ఫిలిప్పు నలుగురు కుమార్తెలు ప్రత్యేకంగా దేనికి పేరుపొందారు?

6. మొదటి శతాబ్దపు సువార్తికులకు ఎలాంటి విజయం లభించింది?

7. రాజ్య ప్రచారకులు నేడు ఏమి చేస్తున్నారు?

8. ఇప్పుడు ఎలాంటి గురుతు వేయబడే పని జరుగుతోంది, ఆ పని ఎవరు చేస్తున్నారు?

9. పరిచర్యలో కొత్తవారు ఎలా సహాయం పొందగలరు?

10. క్రీస్తు, ఆయన తొలి అనుచరులు పరిచర్యలో ఎలాంటి మాదిరి ఉంచారు?

11. అపొస్తలుల కార్యములు 20:20, 21 ప్రకారం అపొస్తలుడైన పౌలు తన పరిచర్యలో ఏమిచేశాడు?

12, 13. ఫిలిప్పీయులు 1:7కు అనుగుణంగా ప్రకటించే తమ హక్కు విషయంలో యెహోవా ప్రజలు ఏమిచేశారు?

14. మన పరిచర్య ప్రవర్ధమానపు ప్రభావం ఏ విధంగా ఉండగలదు?

15, 16. మనమెందుకు ప్రజల ఇండ్లను పదేపదే సందర్శిస్తాము?

17. మన ప్రకటనా పనికి ప్రధాన కారణమేమిటి?

18. సువార్త పనిచేయడం ద్వారా మనమెలా ప్రయోజనం పొందుతాం?

19. పరిశుద్ధాత్మ సువార్తికులకు ఎలా సహాయం చేస్తుంది?

20, 21. సువార్తికులుగా ముమ్మరంగా పనిచేయడంవల్ల లభించే కొన్ని ఆశీర్వాదాలు, ప్రయోజనాలేమిటి?

22, 23. (ఎ) క్రైస్తవ సువార్తికులు ఎలాంటి ధనాన్ని సమకూరుస్తున్నారు? (బి) తర్వాతి ఆర్టికల్‌ మనకు ఎలా సహాయం చేస్తుంది?

[10వ పేజీలోని చిత్రాలు]

ఫిలిప్పు, ఆయన కుమార్తెలవంటి సంతోషభరితులైన సువార్తికులు నేడూ ఉన్నారు

[14వ పేజీలోని చిత్రం]

ఇతరులతో సువార్త పంచుకుంటున్నప్పుడు వ్యక్తిగతంగా మీరెలా ప్రయోజనం పొందుతారు?