కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

చిన్న త్యాగాలు మాకు గొప్ప ఆశీర్వాదాలను తెచ్చాయి

చిన్న త్యాగాలు మాకు గొప్ప ఆశీర్వాదాలను తెచ్చాయి

జీవిత కథ

చిన్న త్యాగాలు మాకు గొప్ప ఆశీర్వాదాలను తెచ్చాయి

జార్జ్‌ మరియు ఆన్‌ ఆల్జెన్‌ చెప్పినది

“బోధకురాలు” అనే పదానికి “ఎలుక” అనే పదానికి తేడా తెలియక మేము తికమకపడతామని నేను నా భార్య ఎన్నడూ కలలో కూడా అనుకోలేదు. ప్రాచ్య దేశాల్లోని ప్రజలతో సంభాషించడానికి కృషి చేస్తూ మేము మా అరవయ్యో పడిలో వింతగా కనిపించే అక్షరాలను మననం చేసుకుంటామని అసలే అనుకోలేదు. అయితే 1980ల చివరికాలంలో నేనూ ఆన్‌ సరిగ్గా అదే చేశాము. గడిచిన సంవత్సరాల్లో మేము చేసిన చిన్న త్యాగాలు అనేక ఆశీర్వాదాలకు ఎలా దారి తీశాయో మమ్మల్ని చెప్పనివ్వండి.

నే ను అర్మేనియా వంశానికి చెందిన కుటుంబంలో జన్మించాను, అర్మేనియన్‌ చర్చికి వెళ్ళేవాడిని. ఆన్‌ రోమన్‌ క్యాథలిక్‌. మేము 1950లో వివాహం చేసుకున్నప్పుడు మా ఇద్దరి మత నమ్మకాల విషయంలో రాజీపడ్డాము. నాకు అప్పుడు 27 సంవత్సరాలు, ఆన్‌కు 24 సంవత్సరాలు. అమెరికాలోని న్యూ జెర్సీకి చెందిన జెర్సీ నగరంలో నాకు డ్రై క్లీనింగ్‌ షాపు ఉండేది, దానిపైన ఒక అపార్ట్‌మెంటు తీసుకొని మేము మా వైవాహిక జీవితాన్ని ప్రారంభించాము. అప్పటికి నేను ఆ వ్యాపారం ప్రారంభించి నాలుగు సంవత్సరాలయ్యింది.

1955వ సంవత్సరంలో మేము న్యూ జెర్సీలోని మిడిల్‌ టౌన్‌లో మూడు బెడ్‌రూమ్‌ల అందమైన ఫ్లాట్‌ కొన్నాము. ఆ ఇల్లు నా వ్యాపార స్థలం నుండి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉండేది, వారంలో ఆరు రోజులు నేను వ్యాపారం చూసుకునేవాడిని. ప్రతీరోజు నేను చాలా ఆలస్యంగా ఇంటికి వెళ్లేవాడిని. యెహోవాసాక్షులు అప్పుడప్పుడు నా షాపుకు వచ్చి బైబిలు సాహిత్యాలు ఇచ్చి వెళ్ళేవారు, అప్పుడు తప్ప నేను వారిని కలుసుకునేవాడిని కాదు. నేను ఆ సాహిత్యాలను ఎంతో ఆసక్తితో చదివేవాడిని. నా సమయాన్ని అవధానాన్ని చాలామట్టుకు నా వ్యాపారం కోసమే కేటాయించవలసి వచ్చినా నేను బైబిలుపట్ల ప్రగాఢమైన గౌరవభావాన్ని పెంపొందించుకున్నాను.

నేను నా షాప్‌కు వెళ్ళేటప్పుడు అక్కడనుండి తిరిగి వచ్చేటప్పుడు డ్రైవ్‌ చేసే సమయంలోనే వాచ్‌టవర్‌ రేడియో స్టేషన్‌ అయిన డబ్ల్యూ.బి.బి.ఆర్‌ బైబిలు ప్రసంగాలను ప్రసారం చేస్తోందని నాకు తెలిసింది. నేను డ్రైవ్‌ చేస్తూ ఆ ప్రసంగాలను జాగ్రత్తగా వినేవాడిని, నా ఆసక్తి ఎంతగా పెరిగిందంటే నేను సాక్షులను నన్ను సందర్శించమని కోరాను. 1957 నవంబరులో జార్జ్‌ బ్లాంటన్‌ మా ఇంటికి వచ్చి నాతో బైబిలు అధ్యయనం ప్రారంభించాడు.

మా కుటుంబం స్వచ్ఛారాధనలో ఐక్యమవడం

దీనంతటి గురించి ఆన్‌ ఎలా భావించింది? తననే చెప్పనివ్వండి.

“మొదట్లో నేను ఎంతో తీవ్రంగా వ్యతిరేకించాను. ఆయన బైబిలు అధ్యయనం చేస్తున్నప్పుడు నేను ఎన్ని అవాంతరాలు కలిగించేదాన్నంటే, చివరకు ఆయన వేరే చోట అధ్యయనం చేయాలని నిర్ణయించుకొని అలా ఎనిమిది నెలలపాటు కొనసాగించాడు. ఆ సమయంలో జార్జ్‌ ఆదివారాలు రాజ్యమందిరంలోని కూటాలకు హాజరవడం ప్రారంభించాడు. ఆయనకు పనినుండి తీరిక లభించేది ఆ ఒక్క రోజే, దానిని కూడా ఆయన కూటాలకు హాజరవడానికి ఉపయోగిస్తున్నాడంటే తాను చేసే బైబిలు అధ్యయనాన్ని ఆయన గంభీరంగా తీసుకుంటున్నాడని నాకు అర్థమయ్యింది. అయితే ఆయన మంచి భర్తగా, మంచి తండ్రిగానే కొనసాగాడు, నిజానికి ఆయన మునుపటి కంటే మంచిగా మారడంతో నా దృక్పథం కూడా మారడం ప్రారంభించింది. జార్జ్‌ ఎల్లప్పుడూ మా ఇంట్లోని కాఫీ టేబుల్‌పై తేజరిల్లు! పత్రికలు ఉంచేవాడు, కొన్నిసార్లు నేను ఆ టేబుల్‌ను తుడిచేటప్పుడు ఎవరూ చూడడంలేదని నిర్ధారించుకొని ఆ పత్రికలను చదివేదానిని. ఇతర సమయాల్లో, సిద్ధాంతాల గురించి కాకుండా సృష్టికర్త గురించి మాట్లాడే తేజరిల్లు! ఆర్టికల్‌లను జార్జ్‌ నాకు చదివి వినిపించేవాడు.

“ఒకరోజు సాయంత్రం జార్జ్‌, సహోదరుడు బ్లాంటన్‌తో తన బైబిలు అధ్యయనం కోసం వెళ్ళినప్పుడు, మా రెండేళ్ళ కుమారుడు జార్జ్‌ నా పరుపు పక్కన టేబుల్‌పై పెట్టిన ప్రచురణను నేను చేతిలోకి తీసుకున్నాను. అది చనిపోయినవారికిగల నిరీక్షణ గురించి మాట్లాడుతోంది. నేను అప్పటికి చాలా అలసిపోయివున్నా, మా అమ్మమ్మ ఆ మధ్యనే చనిపోవడంవల్ల నేను ఎంతో నిరాశతోవున్నాను కాబట్టి ఆ ప్రచురణను చదవడం ప్రారంభించాను. చనిపోయినవారు ఎక్కడో బాధలు అనుభవించడం లేదు గానీ భవిష్యత్తులో జరగబోయే పునరుత్థానమప్పుడు వాళ్ళు తిరిగి జీవానికి వస్తారనే బైబిలు సత్యాన్ని నేను వెంటనే అర్థం చేసుకున్నాను. నేను వెంటనే లేచి కూర్చొని ఆ ప్రచురణను జాగ్రత్తగా చదువుతూ, జార్జ్‌ తన బైబిలు అధ్యయనం నుండి ఇంటికి వచ్చిన వెంటనే ఆయనకు చూపించాలి అనుకొన్న అంశాలను మార్క్‌ చేయడం ప్రారంభించాను.

“నేను ఇంతగా మారానని నా భర్త నమ్మలేకపోయాడు. ఆయన ఇంటినుండి బయటకు వెళ్ళేటప్పుడు నేను సత్యాన్ని వ్యతిరేకించే వ్యక్తిని, కానీ ఆయన ఇంటికి తిరిగి వచ్చేసరికి నేను నేర్చుకొన్న బైబిలు సత్యాల గురించి అత్యుత్సాహంతో ఉన్నాను! మేము బాగా పొద్దుపోయే వరకూ బైబిలు గురించి మాట్లాడుతూ కూర్చున్నాము. భూమిపట్ల దేవుని సంకల్పం గురించి జార్జ్‌ నాకు వివరించాడు. నేను కూడా అధ్యయనంలో కూర్చోవడానికి వీలుగా ఇంట్లోనే అధ్యయనం చేయమని నేను ఆ రాత్రే జార్జ్‌ను కోరాను.

“పిల్లలు కూడా అధ్యయనానికి కూర్చుంటే బాగుంటుందని సహోదరుడు బ్లాంటన్‌ సలహా ఇచ్చారు. వాళ్ళ వయసు రెండేళ్ళు మరియు నాలుగేళ్ళే కాబట్టి వాళ్ళు ఇంకా చిన్నవాళ్ళని మేము భావించాము. అయితే సహోదరుడు బ్లాంటన్‌ ‘పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి . . . వాటిని విని నేర్చుకొనుటకై అందరిని పోగుచేయవలెను’ అని చెబుతోన్న ద్వితీయోపదేశకాండము 31:12వ వచనాన్ని మాకు చూపించాడు. మేము ఆ సలహా విలువను గ్రహించి, పిల్లలు కూడా బైబిలు అధ్యయనంలో వ్యాఖ్యానించేందుకు ఏర్పాటు చేశాము. మేము మా వ్యాఖ్యానాలను కలిసే సిద్ధపడేవాళ్ళము, కానీ వాళ్ళు ఏమి చెప్పాలో మేము వారికి చెప్పేవాళ్ళం కాదు. మేము అలా చేయడం ద్వారా పిల్లలు సత్యాన్ని తమ స్వంతం చేసుకొనేందుకు సహాయం చేశామని మాకు అనిపిస్తోంది. మా కుటుంబం ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహోదరుడు బ్లాంటన్‌ అందించిన నడిపింపు విషయమై మేము ఎల్లప్పుడూ కృతజ్ఞులమైవుంటాము.”

త్యాగం అవసరమైన సవాళ్ళు

మేము బైబిలును అధ్యయనం చేయడంలో ఐక్యమైన తర్వాత మాకు కొత్త సవాళ్ళు ఎదురయ్యాయి. నా షాపు ఇంటికి ఎంతో దూరాన ఉండేది కాబట్టి నేను సాధారణంగా రాత్రి తొమ్మిది గంటల తర్వాతే ఇంటికి చేరుకునేవాడిని. దానివల్ల నేను ఆదివారపు కూటాలకు హాజరవగలిగినా వారం మధ్యలో జరిగే కూటాలకు హాజరవలేకపోయేవాడిని. ఆ సమయానికల్లా ఆన్‌ అన్ని కూటాలకు హాజరవుతూ త్వరిత గతిన అభివృద్ధి సాధిస్తోంది. నేను కూడా అన్ని కూటాలకు హాజరవ్వాలని, అర్థవంతమైన కుటుంబ అధ్యయనం నిర్వహించాలని కోరుకున్నాను. దానికి నేను కొన్ని త్యాగాలు చేయాలని నాకు తెలుసు. కాబట్టి నేను వ్యాపారం చేసే సమయం తగ్గించాలని, అలా చేయడం ద్వారా నేను నా కస్టమర్లలో కొందరిని పోగొట్టుకోవలసి వచ్చినా తగ్గించాలనే నిర్ణయించుకున్నాను.

ఆ ఏర్పాటు చక్కగా పనిచేసింది. మేము మా కుటుంబ అధ్యయనాన్ని, రాజ్యమందిరంలో జరిగే ఐదు కూటాల్లాగే చాలా గంభీరంగా దృష్టించేవాళ్లం. దానిని మేము మా ఆరవ కూటం అని పిలిచేవాళ్ళం. కాబట్టి మేము ఒక నిర్దిష్టమైన రోజు మరియు ఖచ్చితమైన సమయం ఏర్పాటు చేసుకున్నాము​—⁠ప్రతీ బుధవారం రాత్రి 8.00 గంటలకు. కొన్నిసార్లు సాయంత్రం భోజనం చేసిన తర్వాత వంటగదిలో అంట్లు తోమడం అయిపోవస్తుంటే, “‘కూటం’ ప్రారంభించే సమయం అయ్యింది” అని మాలో ఒకరం అనేవాళ్ళం. నేను ఇంటికి రావడం ఆలస్యమైతే ఆన్‌ అధ్యయనాన్ని ప్రారంభించేది, నేను వచ్చిన వెంటనే నేను నిర్వహించేవాడిని.

మా కుటుంబం బలంగా ఐక్యంగా ఉండేందుకు సహాయం చేసిన మరో విషయం, ఉదయం అందరం కలిసి దినవచనాన్ని పరిశీలించడం. అయితే అలా చేయడంలో ఒక సమస్య ఎదురైంది. ప్రతి ఒక్కరూ వేర్వేరు సమయాల్లో నిద్ర లేచేవారు. మేము దీని గురించి చర్చించి అందరం ఒకే సమయానికి నిద్ర లేవాలని, 6:30కు బ్రేక్‌ఫాస్ట్‌ చేసిన తర్వాత అందరం కలిసి దినవచనాన్ని పరిశీలించాలని నిర్ణయించుకున్నాము. ఈ ఏర్పాటు మాకు ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చింది. మా కుమారులు పెద్దవారైనప్పుడు వాళ్ళు బెతెల్‌ సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. మేము ప్రతిరోజు దినవచనాన్ని పరిశీలించడం వారి ఆధ్యాత్మికతను పెంపొందింపజేసిందని మేము భావించాము.

బాప్తిస్మం తర్వాత వచ్చే ఆధిక్యతల కోసం మరిన్ని త్యాగాలు అవసరం

నేను 1962లో బాప్తిస్మం తీసుకున్నాను, 21 సంవత్సరాలపాటు వ్యాపారం చేసిన తర్వాత నేను నా కుటుంబానికి దగ్గరగా ఉండేందుకు, అందరం కలిసి యెహోవా సేవ చేసేందుకు వీలుగా నా వ్యాపారాన్ని అమ్మేసి స్థానికంగా ఒక ఉద్యోగం చేయడం ప్రారంభించాను. అది అనేక ఆశీర్వాదాలకు దారి తీసింది. మేమందరం పూర్తికాల పరిచర్య చేపట్టాలని లక్ష్యం పెట్టుకున్నాము. 1970ల తొలికాలంలో మా పెద్ద కుమారుడు ఎడ్వర్డ్‌ హై స్కూలు విద్య పూర్తి చేసిన వెంటనే పూర్తికాల ప్రచారకునిగా లేదా క్రమ పయినీరుగా మారడంతో మా లక్ష్యం నెరవేరడం ప్రారంభమయ్యింది. ఆ తర్వాత కొంతకాలానికి మా రెండవ కుమారుడైన జార్జ్‌ పయినీరు సేవ ప్రారంభించాడు, తర్వాత ఆన్‌ కూడా ప్రారంభించింది. వాళ్ళు ముగ్గురు క్షేత్ర సేవలో తమకు ఎదురైన అనుభవాలను నాతో చెప్పినప్పుడు నేను ఎంతో ప్రోత్సహించబడేవాడిని. మేమందరం పూర్తికాల సేవ చేయడానికి వీలుగా మా జీవితాలను ఎలా సరళం చేసుకోవచ్చో ఒక కుటుంబంగా చర్చించాము. మేము మా ఇంటిని అమ్మేయాలని నిర్ణయించుకున్నాము. మేము ఆ ఇంట్లో 18 సంవత్సరాలపాటు జీవించాము, మా పిల్లలను అక్కడే పెంచాము. ఆ ఇల్లంటే మాకెంతో ఇష్టం, అయినా దానిని అమ్మేయాలనే మా నిర్ణయాన్ని యెహోవా ఆశీర్వదించాడు.

ఎడ్వర్డ్‌ 1972లో, జార్జ్‌ 1974లో బెతెల్‌కు ఆహ్వానించబడ్డారు. నాకు ఆన్‌కు వాళ్ళు లేని లోటు బాగా తెలిసేది, అయితే వాళ్ళు మా దగ్గరే ఉండి పెళ్ళి చేసుకొని పిల్లలను కనుంటే ఎంత బాగుండేది అనే విషయం గురించి మేము ఆలోచించడం మానేశాము. దానికి బదులు, మా కుమారులు బెతెల్‌లో యెహోవా సేవ చేస్తున్నందుకు మేము సంతోషించాము. * “నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన యెడల నా హృదయముకూడ సంతోషించును” అని చెబుతోన్న సామెతలు 23:15వ వచనంతో మేము ఏకీభవిస్తున్నాము.

మేము ప్రత్యేక పయినీరు సేవ ప్రారంభించడం

మా కుమారులిద్దరూ బెతెల్‌లో ఉండడంతో మేము పయినీరు సేవను కొనసాగించాము. 1975లో ఒకరోజు, ఇల్లినియస్‌లోని క్లింటన్‌ కౌంటీలోవున్న అనియమిత క్షేత్రంలో ప్రత్యేక పయినీరు సేవ చేయడానికి మమ్మల్ని ఆహ్వానిస్తున్న ఉత్తరాన్ని మేము అందుకున్నాము. మేము దానిని ఊహించలేదు! మా స్నేహితులు బంధువులు న్యూ జెర్సీలోనే ఉన్నారు, అంతేకాక న్యూయార్క్‌లోవున్న మా కుమారులకు కూడా మేము దగ్గరగా ఉండేవాళ్ళము, కానీ ఇప్పుడు మేము ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళాలి. అయితే మేము దానిని యెహోవా నుండి వచ్చిన నియామకంగా పరిగణించి దానికి అవసరమైన త్యాగాలు చేశాము, అవి క్రొత్త ఆశీర్వాదాలకు దారి తీశాయి.

ఆ అనియమిత క్షేత్రంలో చాలా నెలలపాటు సేవ చేసిన తర్వాత, ఇల్లినియస్‌లోని కార్లైల్‌లోవున్న కమ్యూనిటీ హాల్‌లో మేము కూటాలు నిర్వహించడం ప్రారంభించాము. అయితే కూటాల కోసం శాశ్వతమైన స్థలం ఉంటే బాగుంటుందని మేము తలంచాము. ఒక స్థానిక సహోదరుడు మరియు ఆయన భార్య, మేము అద్దెకు తీసుకోవడానికి వీలుగా ఉన్న ఒక చిన్న కాటేజీవున్న స్థలాన్ని కనుగొన్నారు. మేము ఆ కాటేజీనంతటిని, బయటవున్న టాయిలెట్‌లతో సహా శుభ్రం చేసి దానిని కూటాలు జరుపుకోవడానికి అనువుగా మార్చాము. మేమెవరమో తెలుసుకోవాలనే ఉత్సుకతగల గుర్రం మాకు ఇప్పటికీ గుర్తుంది. అది తరచూ కూటంలో ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి అన్నట్లు కిటికీలోంచి తల లోపలకు పెట్టి చూసేది!

కొంతకాలానికి కార్లైల్‌ సంఘం రూపొందించబడింది, అది అలా రూపొందడంలో మేము ఒక పాత్ర పోషించినందుకు మాకు సంతోషంగా ఉంది. ఆ అనియమిత క్షేత్రంలో పనిచేయడానికి వచ్చిన యువ జంట అయిన స్టీవ్‌ మరియు కారెల్‌ థామ్సన్‌ మాకు సహాయం చేసేవారు. థామ్సన్‌ జంట ఆ ప్రాంతంలో అనేక సంవత్సరాలపాటు సేవ చేసిన తర్వాత వాచ్‌టవర్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌కు హాజరయ్యారు, ఆ తర్వాత వాళ్ళు తూర్పు ఆఫ్రికాలో మిషనరీ నియామకం చేపట్టడానికి వెళ్ళిపోయారు, వారు అక్కడ ప్రయాణ పని చేస్తున్నారు.

కొంతకాలానికి, మేము కూటాల కోసం కూడుకునే స్థలం సరిపోకపోవటంతో మాకు పెద్ద హాలు అవసరమయ్యింది. మళ్ళీ అదే స్థానిక సహోదరుడు మరియు ఆయన భార్య రాజ్యమందిరానికి మరింత అనువుగా ఉండే స్థలాన్ని కొని సమస్యను పరిష్కరించారు. కొన్ని సంవత్సరాల తర్వాత కార్లైల్‌లో కొత్తగా నిర్మించబడిన రాజ్యమందిర ప్రతిష్ఠాపనకు ఆహ్వానించబడినప్పుడు మేమెంతో సంతోషించాము! ప్రతిష్ఠాపన ప్రసంగం ఇచ్చే ఆధిక్యత నాకు లభించింది. అక్కడ మా నియామకం మాకొక అద్భుతమైన అనుభవం, అది యెహోవా నుండి మాకు లభించిన ఆశీర్వాదం.

మేము సేవ చేయడానికి ఒక కొత్త క్షేత్రం లభించింది

1979లో మాకు ఒక కొత్త నియామకం లభించింది, మేము న్యూ జెర్సీలోని హార్రిసన్‌కు నియమించబడ్డాము. మేము అక్కడ దాదాపు 12 సంవత్సరాలు సేవ చేశాము. ఆ సమయంలో ఒక చైనీస్‌ స్త్రీతో బైబిలు అధ్యయనం ప్రారంభించాము, అది చైనీస్‌ ప్రజలతో మరిన్ని అధ్యయనాలకు దారి తీసింది. అదే సమయంలో మా క్షేత్రంలో వేలాదిమంది చైనీస్‌ విద్యార్థులు, కుటుంబాలు ఉన్నాయని మాకు తెలిసింది. ఆ కారణంగా మేము చైనీస్‌ భాష నేర్చుకోవడానికి ప్రోత్సహించబడ్డాము. మేము ఆ భాషను అధ్యయనం చేయడానికి రోజూ సమయం వెచ్చించవలసి వచ్చేది, అయితే అది మా క్షేత్రంలోని చైనీస్‌ ప్రజలతో అనేక ఆనందకరమైన బైబిలు అధ్యయనాలకు దారి తీసింది.

ఆ సంవత్సరాల్లో ప్రత్యేకించి మేము చైనీస్‌ భాష మాట్లాడేందుకు చేసిన ప్రయత్నాలవల్ల ఎన్నో నవ్వు పుట్టించే అనుభవాలు ఎదురయ్యాయి. ఒకరోజు ఆన్‌ తనను తాను బైబిలు “బోధకురాలు” అని కాకుండా బైబిలు “ఎలుక” అని పరిచయం చేసుకుంది. ఆ పదాలు దాదాపు ఒకేలా ఉంటాయి. గృహస్థురాలు చిరునవ్వు చిందించి ఇలా అంది: “దయచేసి లోపలకు రండి. నేను మునుపెన్నడూ బైబిలు ఎలుకతో మాట్లాడలేదు.” మాకు ఇప్పటికీ ఆ భాష మాట్లాడడం కష్టంగానే ఉంటుంది.

ఆ తర్వాత మేము న్యూ జెర్సీలోని మరో ప్రాంతానికి నియమించబడ్డాము, అక్కడ మేము చైనీస్‌ క్షేత్రంలో సేవ చేయడం కొనసాగించగలిగాము. ఆ తర్వాత మేము మస్సాచుస్సెట్స్‌లోని బాస్టన్‌కు ఆహ్వానించబడ్డాము, అక్కడ దాదాపు మూడు సంవత్సరాల నుండి చైనీస్‌ గుంపు ఒకటి వృద్ధి చెందుతోంది. ఆ గుంపుకు గత ఏడు సంవత్సరాలుగా మద్దతునిచ్చే ఆధిక్యత మాకు లభించింది, 2003, జనవరి 1న అది ఒక సంఘంగా మారినప్పుడు చూసే ఆనందం మాకు దక్కింది.

స్వయంత్యాగపూరిత జీవితంవల్ల కలిగిన ఆశీర్వాదాలు

మలాకీ 3:10లో, తమ బలులను తీసుకొనిరమ్మని, వారు అలా చేస్తే తాను పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరిస్తానని యెహోవా తన ప్రజలకు ఇచ్చిన ఆహ్వానాన్ని మనం చదువుతాము. నాకు ఎంతో ఆసక్తివున్న వ్యాపారాన్ని మేము వదిలివేశాము. మాకు ఎంతో ఇష్టమైన మా ఇంటిని అమ్మేశాము. మేము ఇంకా ఎన్నో వదులుకున్నాము. అయితే మాకు లభించిన ఆశీర్వాదాలతో పోలిస్తే, మేము చేసిన త్యాగాలు చాలా చిన్నవి.

యెహోవా నిజంగానే మాపై విస్తారమైన దీవెనలు కుమ్మరించాడు! మా పిల్లలు సత్యానికి ప్రతిస్పందించగా చూసిన సంతృప్తి, ప్రాణాలను రక్షించే పనిని పూర్తికాలం చేసే ఆనందం మాకు లభించాయి, యెహోవా మా అవసరాలు తీరుస్తున్నాడని మాకు తెలుసు. నిజంగా, మా చిన్న త్యాగాలు మాకు గొప్ప ఆశీర్వాదాలను తెచ్చాయి!

[అధస్సూచి]

^ పేరా 20 వాళ్ళు ఇప్పటికీ విశ్వసనీయంగా బెతెల్‌ సేవ చేస్తున్నారు​—⁠ఎడ్వర్డ్‌ తన భార్య కానీతో ప్యాటర్సన్‌లో సేవ చేస్తున్నాడు, జార్జ్‌ తన భార్య గ్రేస్‌తో బ్రూక్లిన్‌లో సేవ చేస్తున్నాడు.

[25వ పేజీలోని చిత్రం]

ఆన్‌తో లూయిస్‌ మరియు జార్జ్‌ బ్లాంటన్‌, 1991

[26వ పేజీలోని చిత్రం]

1983, జూన్‌ 4న ప్రతిష్ఠాపించబడిన కార్లైల్‌లోని రాజ్యమందిరం

[27వ పేజీలోని చిత్రం]

క్రొత్తగా రూపొందించబడిన బాస్టన్‌ చైనీస్‌ సంఘంతో

[28వ పేజీలోని చిత్రం]

ఎడ్వర్డ్‌, కానీ, జార్జ్‌, గ్రేస్‌లతో