పాఠకుల ప్రశ్నలు
పాఠకుల ప్రశ్నలు
వ్యభిచారం చేసినందుకు ఒక్క రోజులో 24,000 మంది ఇశ్రాయేలీయులు చంపబడ్డారని సంఖ్యాకాండము 25:9వ వచనం చెబుతుంటే, 1 కొరింథీయులు 10:8వ వచనం 23,000 మంది ఇశ్రాయేలీయులు చనిపోయారని ఎందుకు చెబుతోంది?
ఈ రెండు వచనాల్లోని సంఖ్యలు వేరుగా ఉండడానికి అనేక కారణాలు ఉండవచ్చు. అత్యంత సరళమైన కారణమేమిటంటే, అసలైన సంఖ్య 23,000కు 24,000కు మధ్యలో ఉండివుంటుంది, కాబట్టి సంపూర్ణ సంఖ్యగా మార్చడానికి అలా సవరించబడివుంటుంది.
మరో కారణాన్ని పరిశీలించండి. అపొస్తలుడైన పౌలు, లైంగిక విచ్చలవిడితనానికి పేరుగాంచిన ప్రాచీన కొరింథు నగరంలోని క్రైస్తవులను హెచ్చరించేందుకు షిత్తీమువద్ద ఇశ్రాయేలీయులకు ఎదురైన సంఘటన గురించి చెప్పాడు. ఆయన ఇలా వ్రాశాడు: “వారివలె మనము వ్యభిచరింపక యుందము; వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక్కదినముననే యిరువది మూడువేలమంది కూలిరి.” వ్యభిచారం చేసినందుకు యెహోవాచే చంపబడిన వారిని ప్రత్యేకంగా సూచిస్తూ పౌలు వారి సంఖ్య 23,000 అని చెప్పాడు.—1 కొరింథీయులు 10:8.
అయితే సంఖ్యాకాండము 25వ అధ్యాయము, “ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలిసికొనినందున వారిమీద యెహోవా కోపము రగులుకొనెను” అని చెబుతోంది. అప్పుడు “ప్రజల అధిపతుల నందరిని” ఉరితీయమని యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞను నెరవేర్చమని మోషే న్యాయాధిపతులకు చెప్పాడు. చివరకు, మిద్యాను స్త్రీని పాళెములోకి తీసుకువచ్చిన ఇశ్రాయేలీయుణ్ణి చంపడానికి ఫీనెహాసు వెంటనే చర్య తీసుకొన్న తరువాత ఆ “తెగులు నిలిచిపోయెను.” ఆ వృత్తాంతం ఈ వాక్యంతో ముగుస్తుంది: “ఇరువది నాలుగువేలమంది ఆ తెగులుచేత చనిపోయిరి.”—సంఖ్యాకాండము 25:1-9.
సంఖ్యాకాండములో ఇవ్వబడిన సంఖ్యలో న్యాయాధిపతులచే ఉరితీయబడిన “ప్రజల అధిపతులు” మరియు నేరుగా యెహోవాచే చంపబడినవారు కూడా ఉన్నారని స్పష్టమవుతోంది. న్యాయాధిపతుల చేతుల్లో చనిపోయిన అధిపతులు ఒక వెయ్యిమంది ఉండివుండవచ్చు అందుకే ఆ సంఖ్య 24,000 అయ్యింది. ఈ అధిపతులు లేదా నాయకులు వ్యభిచరించినా, వేడుకల్లో పాల్గొన్నా, అలా పాల్గొనడానికి ఇతరులకు అనుమతి ఇచ్చినా వారు “బయల్పెయోరుతో కలిసికొనిన” దోషులవుతారు.
ఒక బైబిలు రెఫరెన్స్ గ్రంథం, ‘కలుసుకోవడం’ అనే పదం గురించి మాట్లాడుతూ, అది “ఒక వ్యక్తి తనను తాను మరో వ్యక్తికి బద్దునిగా చేసుకోవడం” అనే భావం కలిగివుండగలదని వివరిస్తోంది. ఇశ్రాయేలీయులు యెహోవాకు సమర్పించుకున్న ప్రజలు, కానీ వాళ్ళు ‘బయల్పెయోరుతో కలిసికొనినప్పుడు’ వాళ్ళు దేవునితో తమకున్న సమర్పిత సంబంధాన్ని తెంచుకున్నారు. దాదాపు 700 సంవత్సరాల తర్వాత, హోషేయ ప్రవక్త ద్వారా యెహోవా ఇశ్రాయేలీయుల గురించి ఇలా చెప్పాడు: “వారు బయల్పెయోరు నొద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమ్మును తాము అప్పగించుకొనిరి; తాము మోహించినదానివలెనే వారు హేయులైరి.” (హోషేయ 9:10) అలా చేసినవారందరూ ప్రతికూలమైన దైవిక తీర్పుకు అర్హులే. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల కుమారులకు ఇలా గుర్తు చేశాడు: “బయల్పెయోరు విషయములో యెహోవా చేసినదానిని మీరు కన్నులార చూచితిరి గదా. బయల్పెయోరు వెంట వెళ్లిన ప్రతి మనుష్యుని నీ దేవుడైన యెహోవా నీ మధ్యను ఉండకుండ నాశనము చేసెను.”—ద్వితీయోపదేశకాండము 4:3.