కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మారుతున్న లోక స్వభావాన్ని ఎదిరించండి

మారుతున్న లోక స్వభావాన్ని ఎదిరించండి

మారుతున్న లోక స్వభావాన్ని ఎదిరించండి

“మనము లౌకికాత్మను కాక దేవుని యొద్దనుండి వచ్చు ఆత్మను పొందియున్నాము.”​1 కొరింథీయులు 2:12.

‘సర్పము నన్ను మోసపుచ్చింది.’ (ఆదికాండము 3:​13) ఆ కొద్దిమాటలతో, మొదటి స్త్రీయైన హవ్వ యెహోవా దేవునికి విరుద్ధంగా తానెందుకు తిరుగుబాటు మార్గానికి తిరిగిందో వివరించడానికి ప్రయత్నించింది. ఆమె చెప్పింది నిజమే, అయితే అది ఆమె చేసిన తప్పును సమర్థించదు. అపొస్తలుడైన పౌలు ఆ తర్వాత ఈ విధంగా వ్రాయడానికి ప్రేరేపించబడ్డాడు: ‘స్త్రీ [హవ్వ] పూర్తిగా మోసగించబడింది.’ (1 తిమోతి 2:​14, NW) అవిధేయతా క్రియ అంటే నిషిద్ధ ఫలం తినడం తనకు ప్రయోజనం చేకూరుస్తుందని, అది తనను దేవతవలే చేస్తుందని నమ్మేలా ఆమె మోసగించబడింది. తనను తప్పుదోవ పట్టించినవాని గుర్తింపు విషయంలో కూడా ఆమె మోసగించబడింది. ఆ సర్పం అపవాదియగు సాతాను వాణి మాత్రమే అని ఆమెకు తెలియదు.​—⁠ఆదికాండము 3:1-6.

2 ఆదాము హవ్వల కాలం నుండి సాతాను ప్రజలను మోసగిస్తూనే ఉన్నాడు. నిజానికి అతడు, ‘సర్వలోకమును మోస పుచ్చుచున్నాడు.’ (ప్రకటన 12:⁠9) అతని కుయుక్తులు మారలేదు. అక్షరార్థ సర్పాన్ని ఉపయోగించడం అతడు మానేసినా, తన గుర్తింపును మరుగుచేయడం మాత్రం మానలేదు. సాతాను వినోద పరిశ్రమలోని ఆయా విభాగాలు, ప్రసార మాధ్యమాలు, ఇతర మాధ్యమాల ద్వారా, దేవుని ప్రేమపూర్వక నిర్దేశం తమకు అవసరంలేదని, దానివల్ల ప్రయోజనం లేదని నమ్మేలా ప్రజలను మోసగిస్తున్నాడు. అపవాది చేస్తున్న ఈ మోసపూరిత ప్రచారోద్యమం ప్రతీచోట బైబిలు నియమాలపట్ల, సూత్రాలపట్ల ప్రజల్లో తిరుగుబాటు స్వభావాన్ని ఉత్పన్నం చేసింది. దీనిని బైబిలు “లౌకికాత్మ” అని పిలుస్తోంది. (1 కొరింథీయులు 2:​12) ఈ స్వభావం దేవుని ఎరుగనివారి నమ్మకాలపై, దృక్పథాలపై, ప్రవర్తనపై బలమైన ప్రభావం చూపుతుంది. ఈ స్వభావం ఎలా కనబరచబడుతుంది, దాని కలుషిత ప్రభావాన్ని మనమెలా ఎదిరించవచ్చు? ఇప్పుడు మనం పరిశీలిద్దాం.

నైతిక ప్రమాణాలు దిగజారుతున్నాయి

3 ఆధునిక కాలాల్లో, “లౌకికాత్మ” అంతకంతకు ఎక్కువగా కనబడుతోంది. (2 తిమోతి 3:​1-5) నైతిక ప్రమాణాలు దిగజారిపోవడం మీరు బహుశా గమనించే ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతోందో లేఖనాలు వివరిస్తున్నాయి. 1914లో దేవుని రాజ్యం స్థాపించబడిన తర్వాత, పరలోకంలో యుద్ధం జరిగింది. సాతాను అతని దయ్యాలు ఓడించబడి భూపరిధిలోకి పడద్రోయబడ్డారు. కోపోద్రిక్తుడైన సాతాను భూవ్యాప్తంగా తన మోసపూరిత ప్రయత్నాలను తీవ్రతరం చేశాడు. (ప్రకటన 12:​1-9, 12, 17) అతనికి వీలయినన్ని రీతుల్లో “సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై” ప్రయత్నిస్తున్నాడు. (మత్తయి 24:​24) దేవుని ప్రజలుగా మనమే అతని ముఖ్య లక్ష్యం. మనం యెహోవా అనుగ్రహాన్ని, నిత్యజీవ ఉత్తరాపేక్షను పోగొట్టుకొనేలా మన ఆధ్యాత్మికతను నాశనం చేయడానికి అతడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.

4 మన ప్రేమగల సృష్టికర్త గురించి మనకు బోధించే అమూల్య పుస్తకమైన బైబిలును అప్రతిష్ఠపాలు చేయడానికి సాతాను ప్రయత్నిస్తున్నాడు. యెహోవా సేవకులు బైబిలును ప్రేమిస్తారు, దానిని విలువైనదిగా పరిగణిస్తారు. అది మనుష్యుల వాక్యం కాదుగానీ దేవుని ప్రేరేపిత వాక్యమని మనకు తెలుసు. (1 థెస్సలొనీకయులు 2:13; 2 తిమోతి 3:​16) అయితే సాతాను లోకం మనం మరోలా ఆలోచించేలా చేస్తుంది. ఉదాహరణకు, బైబిలుపై దాడిచేస్తున్న ఒక పుస్తక పీఠిక ఇలా చెబుతోంది: “బైబిలుకు సంబంధించి ‘పరిశుద్ధత’ అంటూ ఏమీలేదు, ‘అది దేవుని వాక్యం’ కాదు. అది దేవునిచే ప్రేరేపించబడిన పరిశుద్ధులచే వ్రాయబడలేదు, బదులుగా అధికార దాహంగల యాజకులచే వ్రాయబడింది.” అలాంటి వాదనలు నమ్మేలా నడిపించబడేవారు, తమకు నచ్చిన రీతిలో దేవుణ్ణి ఆరాధించవచ్చనే, అసలు ఆయనను ఆరాధించాల్సిన అవసరమే లేదనే మోసపూరిత అభిప్రాయపు ఉచ్చులో సులభంగా పడిపోవచ్చు.​—⁠సామెతలు 14:12.

5 బైబిలుపై ప్రత్యక్ష, పరోక్ష దాడులు, దానికితోడు దానిని బలపరుస్తున్నామని చెప్పుకునేవారి వేషధారణ కారణంగా బైబిలు సంబంధిత మతంతోపాటు, మతాన్నే అధిక్షేపించే స్వభావం పెరుగుతోంది. వార్తా మాధ్యమాల్లో, విద్యాధికుల్లో మతం ముట్టడి క్రింద ఉంది. ఒక గ్రంథకర్త ఇలా అంటున్నాడు: “యూదామతానికి, క్రైస్తవ మతానికి సంబంధించి జనసామాన్య సంస్కృతిలో వ్యాపిస్తున్న దృక్కోణం ప్రతికూలంగా ఉంది. ఎంత అనుకూల దృష్టితో చూసినా అవి పాతకాలపు ఆకర్షణగానే ఉన్నాయి; అయితే వాటిని ఇక ప్రతికూల దృష్టితో చూసినప్పుడు అవి మేధా సంబంధ పరిణతిని ఆటంకపరిచే, విజ్ఞానశాస్త్ర పురోగతిని అడ్డుకునే పురాతన దృష్టికోణాలుగా ఉన్నాయి. ఇటీవలి సంవత్సరాల్లో ఈ తృణీకార స్వభావం అపహసించే, బహిరంగంగా వ్యతిరేకించే స్వభావంగా తయారయింది.” ఈ వ్యతిరేకత తరచూ దేవుని ఉనికిని ఒప్పుకోని, “తమ వాదములయందు వ్యర్థులై[న]” వారినుండి ప్రభవిస్తుంది.​—⁠రోమీయులు 1:20-22.

6 అందువల్ల ప్రజలు దేవుని ప్రవర్తనా నియమావళికి అంతకంతకూ దూరమవుతున్నారంటే అందులో ఆశ్చర్యం లేదు. ఉదాహరణకు, సలింగ సంయోగం ‘అవాచ్యమని’ బైబిలు వర్ణిస్తోంది. (రోమీయులు 1:​26, 27) అలాగే జారత్వం, వ్యభిచారం చేసేవారు దేవుని రాజ్యానికి వారసులు కానేరరని కూడా అది చెబుతోంది. (1 కొరింథీయులు 6:⁠9) అయినప్పటికీ, అనేక దేశాల్లో అలాంటి లైంగిక సంబంధాలు ఆమోదయోగ్యమని పరిగణించబడడమే కాకుండా అవి పుస్తకాల్లో, పత్రికల్లో, పాటల్లో, సినిమాల్లో, టీవీ కార్యక్రమాల్లో అత్యంత ఆకర్షణీయంగా చూపబడుతున్నాయి. వాటికి వ్యతిరేకంగా మాట్లాడేవారు సంకుచిత భావాలు గలవారిగా, కఠినులుగా, ఆధునిక ఆలోచన లేనివారిగా దృష్టించబడుతున్నారు. దేవుని ప్రమాణాలను ప్రేమపూర్వక శ్రద్ధతో కూడిన వ్యక్తీకరణలుగా చూడడానికి బదులు, లోకం వాటిని వ్యక్తిగత స్వేచ్ఛకు, ఆత్మ సంతృప్తికి అవరోధాలుగా దృష్టిస్తోంది.​—⁠సామెతలు 17:15; యూదా 4.

7 దేవుణ్ణి వ్యతిరేకించే ధోరణిలో అంతకంతకూ కూరుకుపోతున్న లోకంలో, మన సొంత దృక్పథాన్ని, విలువల్ని ఒకసారి పరిశీలించుకోవడం మంచిది. మనం యెహోవా ఆలోచన నుండి, ప్రమాణాల నుండి నెమ్మదిగా కొట్టుకుపోవడం లేదని నిశ్చయించుకోవడానికి అప్పుడప్పుడు ప్రార్థనాపూర్వకంగా, యథార్థంగా మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఉదాహరణకు, మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘కొన్ని సంవత్సరాల క్రితమే విసర్జించాల్సిన అంశాలను నేనింకా విడిచిపెట్టలేదా? దేవుడు ఖండించే అభ్యాసాలను తేలికగా తీసుకొనే వ్యక్తిగా తయారయ్యానా? ఆధ్యాత్మిక విషయాలకు గతంలోకంటే ఇప్పుడు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నానా? నా జీవన విధానం నేను రాజ్యాసక్తులకు నా జీవితంలో ప్రథమ స్థానమిస్తున్నట్లు చూపిస్తోందా?’ (మత్తయి 6:​33) అలాంటి పునరాలోచనలు లౌకికాత్మను ఎదిరించడానికి మనకు సహాయం చేస్తాయి.

‘విడిచిపెట్టి కొట్టుకొనిపోకండి’

8 తోటి క్రైస్తవులకు అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొనిపోకుండునట్లు వాటియందు మరి విశేష జాగ్రత్త కలిగియుండవలెను.” (హెబ్రీయులు 2:⁠1) కొట్టుకుపోయే నౌక ఎప్పటికీ గమ్యం చేరదు. ఓడ సరంగు గాలివాటాన్ని, అలల తాకిడిని నిర్లక్ష్యంచేస్తే, అతని ఓడ తేలికగా సురక్షిత ఓడరేవుకు దూరంగా కొట్టుకుపోయి బండరాళ్లున్న తీర ప్రాంతంలో చిక్కుకుంటుంది. అదే ప్రకారం, దేవుని వాక్య ప్రశస్త సత్యాలను మనం అలక్ష్యంచేస్తే, మనం సులభంగా యెహోవా నుండి దూరంగా కొట్టుకుపోయి ఆధ్యాత్మిక ఓడ బ్రద్ధలు కావడం సంభవించవచ్చు. అలాంటి నష్టం అనుభవించడానికి నేరుగా సత్యాన్నే పూర్తిగా విసర్జించనవసరం లేదు. నిజానికి చాలామంది యెహోవాను ఆకస్మికంగా, ఉద్దేశపూర్వకంగా తిరస్కరించరు. తరచూ, దేవుని వాక్యానికి శ్రద్ధనివ్వకుండా వారిని దూరంచేసే దేనిలోనో వారు క్రమేపి ఇరుక్కుంటారు. వారికి తెలియకుండానే వారు పాపంలోకి కొట్టుకుపోతారు. నిద్రపోయిన ఓడ సరంగువలే, అలాంటివారు మరీ ఆలస్యం అయ్యేవరకు మేల్కోరు.

9 సొలొమోను జీవన విధానం గురించి ఆలోచించండి. యెహోవా ఆయనకు ఇశ్రాయేలుమీద రాజరికాన్ని అప్పగించాడు. దేవాలయం నిర్మించడానికి దేవుడు సొలొమోనును అనుమతించాడు, బైబిల్లోని భాగాలు వ్రాయడానికి ఆయనను నిర్దేశించాడు. రెండు సందర్భాల్లో యెహోవా ఆయనతో మాట్లాడాడు, ఆయనకు ఐశ్వర్యం, కీర్తిప్రతిష్ఠలు, శాంతియుతమైన పరిపాలన అనుగ్రహించాడు. అన్నింటికంటే మిన్నగా, యెహోవా మహా జ్ఞానమిచ్చి సొలొమోనును దీవించాడు. బైబిలు ఇలా చెబుతోంది: “దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచనగల మనస్సును సొలొమోనునకు దయచేసెను. గనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పుదేశస్థుల జ్ఞానము కంటెను ఐగుప్తీయుల జ్ఞానమంతటికంటెను అధికమై యుండెను.” (1 రాజులు 4:21, 29, 30; 11:⁠9) నిశ్చయంగా, దేవునిపట్ల ఎవరైనా నమ్మకంగా ఉంటారంటే అది సొలొమోనే అని ఒకరు అనుకోవచ్చు. అయినప్పటికీ, సొలొమోను చివరకు మతభ్రష్టత్వంలోకి జారిపోయాడు. అదెలా సంభవించింది?

10 సొలొమోనుకు ధర్మశాస్త్రం పూర్తిగా తెలుసు, ఆయన దానిని బాగా అర్థంచేసుకున్నాడు. ఇశ్రాయేలులో రాజులయ్యేవారి కోసం ఇవ్వబడిన ఉపదేశాల్లో ఆయన నిస్సందేహంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఉంటాడు. అలాంటి ఉపదేశాల్లో ఒకటి ఇలా చెబుతోంది: “తన హృదయము తొలగి పోకుండునట్లు అతడు [ఆ రాజు] అనేక స్త్రీలను వివాహము చేసికొనకూడదు.” (ద్వితీయోపదేశకాండము 17:​14, 17) అలా స్పష్టంగా నిర్దేశం ఇవ్వబడినప్పటికీ, సొలొమోను 700 మంది భార్యలను, 300 మంది ఉపపత్నులను చేసుకున్నాడు. ఈ స్త్రీలలో అనేమంది అన్యదేవుళ్లను ఆరాధించేవారు. సొలొమోను అంతమంది భార్యలను ఎందుకు చేసుకున్నాడో, అలా చేయడాన్ని ఆయన ఎలా సమర్థించుకున్నాడో మనకు తెలియదు. మనకు తెలిసిందల్లా ఆయన దేవుని స్పష్టమైన నిర్దేశానికి లోబడడంలో విఫలమయ్యాడనేదే. దాని ఫలితం ఎలా ఉంటుందని యెహోవా హెచ్చరించాడో ఖచ్చితంగా అలాగే జరిగింది. మనమిలా చదువుతాం: ‘అతని [సొలొమోను] భార్యలు అతని హృదయమును [‘క్రమేణా,’ NW] ఇతర దేవతలతట్టు త్రిప్పివేశారు.’ (1 రాజులు 11:​3, 4) ‘క్రమేణా’​—⁠అయితే ఖచ్చితంగా అతని దైవిక జ్ఞానం మరుగున పడిపోయింది. ఆయన కొట్టుకుపోయాడు. ఆ విధంగా కాలగమనంలో, దేవునికి లోబడి ఆయనను సంతోషపరచాలనే సొలొమోను కోరిక స్థానాన్ని, తన అన్యమత భార్యలను సంతోషపరచాలనే కోరిక ఆక్రమించుకుంది. అదెంత విషాదకరమో గదా, ఎందుకంటే అంతకుముందు సొలొమోనే స్వయంగా ఇలా వ్రాశాడు: “నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము అప్పుడు నన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును.”​—⁠సామెతలు 27:11.

లౌకికాత్మ శక్తిమంతమైనది

11 మనకు సత్యం తెలుసు కాబట్టి మన ఆలోచనపై లోకప్రభావం ఉండదని తర్కించడం ప్రమాదకరమని సొలొమోను ఉదాహరణ మనకు నేర్పిస్తోంది. భౌతిక ఆహారం మన శరీరంపై ప్రభావం చూపినట్లే, మానసిక ఆహారం మన మనస్సులపై ప్రభావం చూపుతుంది. మనం మన మనస్సుల్లో నింపుకునేది మన ఆలోచనపై, దృక్పథంపై ప్రభావం చూపుతుంది. దీనిని గుర్తించిన వ్యాపార సంస్థలు తమ వస్తువుల వాణిజ్య ప్రకటనలకోసం ప్రతీ సంవత్సరం కోట్ల డాలర్లు ఖర్చు చేస్తున్నారు. వినిమయదారుడు కోరుకొని, మోజుపడేలా ఆకట్టుకొనే మాటలను, చిత్రాలను విజయవంతమైన వాణిజ్య ప్రకటనలు తెలివిగా ఉపయోగిస్తాయి. ఒక వాణిజ్య ప్రకటనను ప్రజలు ఒకటి రెండుసార్లు చూసినవెంటనే వారు పరుగెత్తికెళ్లి వస్తువులు కొనేలా అది వారిని ఒప్పించదని వాణిజ్య ప్రకటనకర్తలకు తెలుసు. అయితే, కాలం గడిచేకొద్దీ అనేకమార్లు ఆ వాణిజ్య ప్రకటనను చూడడం ఆ ఉత్పత్తిపై వినిమయదారునికి సదభిప్రాయం ఏర్పడేలా చేస్తుంది. వాణిజ్య ప్రకటన పనిచేస్తుంది, లేకపోతే ఎవరూ దానిపై అంత పెట్టుబడి పెట్టరు. అది ప్రజల ఆలోచనపై, దృక్పథాలపై శక్తిమంతమైన ప్రభావం చూపుతుంది.

12 వాణిజ్య ప్రకటనకర్తలాగే సాతాను, కాలం గడిచేకొద్దీ ప్రజలను జయప్రదంగా తన ఆలోచనా విధానంలోకి లాగవచ్చని తెలిసినవాడై ఆకర్షణీయంగా తన తలంపులను ప్రవేశపెడుతున్నాడు. వినోద రంగం, మరితర మాధ్యమాల ద్వారా కీడు మేలనీ, మేలు కీడనీ నమ్మేలా సాతాను ప్రజలను మోసగిస్తున్నాడు. (యెషయా 5:​20) సాతాను తప్పుడు ప్రచారానికి నిజ క్రైస్తవులు సైతం బలయ్యారు. బైబిలు ఇలా హెచ్చరిస్తోంది: “కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు, వాతవేయబడిన మనస్సాక్షిగలవారై” ఉంటారు.​—⁠1 తిమోతి 4:​1; యిర్మీయా 6:15.

13 మనలో ఎవరమూ లౌకికాత్మకు అతీతులం కాదు. సాతాను విధానపు గాలివాటం, అలల తాకిడి శక్తిమంతమైనవి. జ్ఞానయుక్తంగా బైబిలు మనకిలా ఉద్బోధిస్తోంది: “మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును.” (1 కొరింథీయులు 15:​33) ఈ చెడు సాంగత్యాల్లో లౌకికాత్మను ప్రతిబింబించే, చివరికి సంఘంలోనే ఉన్న, ఎవరైనా లేదా ఏ విషయమైనా చేరివుండవచ్చు. చెడు సాంగత్యం మనకు హానిచేయలేదని మనం తలస్తే, మంచి సాంగత్యం కూడా మనకు సహాయపడలేదనే మనం తీర్మానించాలి. అలా తలంచడం ఎంత తప్పో గదా! ఆ విషయాన్ని బైబిలు స్పష్టంగా ఇలా వివరిస్తోంది: “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.”​—⁠సామెతలు 13:20.

14 లౌకికాత్మను ఎదిరించడానికి మనం జ్ఞానులతో అంటే యెహోవాను సేవించేవారితో సహవాసం చేయాలి. మన విశ్వాసాన్ని బలపరిచే సంగతులతో మన మనస్సులను నింపుకోవాలి. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటిమీద ధ్యానముంచుకొనుడి.” (ఫిలిప్పీయులు 4:⁠8) నైతిక స్వేచ్ఛగల సృష్టిప్రాణులుగా మనం మనకు నచ్చిన విషయాలను ఎంపిక చేసుకోవచ్చు. అయితే మనమన్ని సమయాల్లో మనలను యెహోవాకు సన్నిహితంచేసే విషయాలనే ధ్యానించడానికి ఎంచుకుందుము గాక.

దేవుని ఆత్మ మరింత శక్తిమంతమైనది

15 లౌకికాత్మచే మోసగించబడుతున్న వారికి భిన్నంగా నిజ క్రైస్తవులు దేవుని పరిశుద్ధాత్మచే నడిపించబడతారు. కొరింథు సంఘానికి పౌలు ఇలా వ్రాశాడు: “దేవునివలన మనకు దయచేయబడినవాటిని తెలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్దనుండి వచ్చు ఆత్మను పొందియున్నాము.” (1 కొరింథీయులు 2:​12) ప్రాచీన కొరింథు పూర్తిగా లౌకికాత్మ నిండిన నగరం. దానిలోని పౌరులు ఎంత అదుపుతప్పిన వారంటే, “కొరింథియనైజ్‌” అనే ఆంగ్ల పదానికి “లైంగిక దుర్నీతిని అభ్యసించడం” అనే అర్థం ఇవ్వబడుతోంది. ఆ ప్రజల మనస్సులకు సాతాను అంధత్వం కలుగజేశాడు. ఫలితంగా వారు సత్యదేవుణ్ణి చాలా కొద్దిగా అర్థం చేసుకున్నారు లేదా బొత్తిగా అర్థమే చేసుకోలేదు. (2 కొరింథీయులు 4:⁠4) అయినప్పటికీ, యెహోవా తన పరిశుద్ధాత్మ ద్వారా ఆ కొరింథీయుల్లో కొందరి కన్నులు తెరిచి, వారు సత్యపు పరిజ్ఞానం సంపాదించుకునేలా సహాయం చేశాడు. ఆయన ఆమోదం, ఆశీర్వాదం పొందగలిగేలా తమ జీవితాల్లో భారీ మార్పులు చేసుకోవడానికి ఆయన ఆత్మ వారిని పురికొల్పి నిర్దేశించింది. (1 కొరింథీయులు 6:​9-11) లౌకికాత్మ శక్తిమంతమైనదే అయినా, యెహోవా ఆత్మ దానికంటే శక్తిమంతమైనది.

16 పరిస్థితి నేడు కూడా అలాగే ఉంది. యెహోవా పరిశుద్ధాత్మ విశ్వంలో అత్యధిక బలమున్న శక్తి, విశ్వాసంతో అడిగేవారందరికీ ఆయన దానిని ఉచితంగా, ధారాళంగా ఇస్తాడు. (లూకా 11:​13) అయితే దేవుని పరిశుద్ధాత్మను పొందడానికి మనం కేవలం లౌకికాత్మను ఎదిరించడం మాత్రమే సరిపోదు. దానితోపాటు, మన ఆత్మ అంటే మన మానసిక వైఖరి ఆయన ఆలోచనా విధానానికి అనుసంధానంగా ఉండేలా మనం క్రమంగా దేవుని వాక్యాన్ని పఠించి, దానిని మన జీవితంలో అనువర్తించుకోవాలి కూడా. మనమలా చేసినప్పుడు, మన ఆధ్యాత్మికతను నాశనం చేయడానికి సాతాను ఉపయోగించే ఎలాంటి తంత్రాన్నైనా తట్టుకొని నిలబడేలా యెహోవా మనలను బలపరుస్తాడు.

17 క్రైస్తవులు లోకసంబంధులు కాకపోయినా, వారు ఈ లోకంలోనే ఉన్నారు. (యోహాను 17:​11, 16) మనలో ఎవరమూ లౌకికాత్మను పూర్తిగా తప్పించుకోలేము, ఎందుకంటే మనం దేవునిపట్ల లేక ఆయన విధానాలపట్ల ప్రేమలేని వారితో కలిసి పనిచేస్తూ ఉండవచ్చు లేదా జీవిస్తూ ఉండవచ్చు. అయితే లోతు తాను ఎవరి మధ్యనైతే నివసించాడో ఆ సొదొమ ప్రజల నీతిబాహ్య క్రియలుచూసి “బహు బాధప[డ్డాడు]” తీవ్రంగా నొచ్చుకున్నాడు కూడా, మరి మనమూ అలా భావిస్తామా? (2 పేతురు 2:​7, 8) అలాగైతే, మనం ఓదార్పు పొందవచ్చు. యెహోవా లోతును కాపాడాడు, విడిపించాడు, ఆయన మన విషయంలోనూ అలా చేయగలడు. మన ప్రేమగల తండ్రి మన పరిస్థితులు చూస్తాడు, అవి ఆయనకు తెలుసు, మన ఆధ్యాత్మికతను కాపాడుకోవడానికి మనకు అవసరమైన సహాయాన్ని, బలాన్ని ఆయన మనకు అనుగ్రహించగలడు. (కీర్తన 33:​18, 19) మనమాయనపై ఆధారపడి, ఆయనపై నమ్మకముంచి, ఆయనకు ప్రార్థిస్తే మనమెలాంటి కష్ట పరిస్థితిలో ఉన్నాసరే, లౌకికాత్మను ఎదిరించడానికి ఆయన మనకు తప్పక సహాయం చేస్తాడు.​—⁠యెషయా 41:10.

18 దేవుని నుండి దూరమై, సాతానుచే మోసగించబడిన లోకంలో, యెహోవా ప్రజలుగా మనం సత్యపు పరిజ్ఞానంతో దీవించబడ్డాం. అందువల్ల మనం లోకంలోలేని సంతోషాన్ని, సమాధానాన్ని అనుభవిస్తున్నాం. (యెషయా 57:20, 21; గలతీయులు 5:​22) పరదైసులో నిత్యజీవం పొందడమనే అద్భుతమైన నిరీక్షణను మనం ఎంతో అమూల్యమైనదిగా ఎంచుతాము, అందులో, నశిస్తున్న ఈ లోకపు స్వభావం మచ్చుకైనా కనిపించదు. అందువల్ల దేవునితో మనకున్న ప్రశస్త సంబంధాన్ని విలువైన సంపదగా కాపాడుకుంటూ, ఆధ్యాత్మికంగా కొట్టుకుపోవాలనే ఎలాంటి దృక్పథాన్నైనా సరిదిద్దుకోవడానికి మనం అప్రమత్తంగా ఉందాం. మనం యెహోవాకు సన్నిహితమవుదాం, అప్పుడాయన లౌకికాత్మను ఎదిరించడానికి మనకు తప్పక సహాయం చేస్తాడు.​—⁠యాకోబు 4:7, 8.

మీరు వివరించగలరా?

ఏయే విధాలుగా సాతాను ప్రజలను మోసగించి, తప్పుదోవ పట్టించాడు?

యెహోవా నుండి కొట్టుకొనిపోకుండా మనమెలా తప్పించుకోవచ్చు?

లౌకికాత్మ శక్తిమంతమైనదని ఏది చూపిస్తోంది?

మనం దేవుని ఆత్మను ఎలా పొందవచ్చు, దానిని ఎలా కాపాడుకోవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1. హవ్వ ఏయే విధాలుగా మోసగించబడింది?

2. (ఎ) సాతాను నేడు ప్రజలనెలా మోసగిస్తున్నాడు? (బి) “లౌకికాత్మ” అంటే ఏమిటి, మనమిప్పుడు ఏ ప్రశ్నలను పరిశీలిస్తాం?

3. ఆధునిక కాలాల్లో “లౌకికాత్మ” ఎందుకు అంతకంతకు ఎక్కువగా కనబడుతోంది?

4. యెహోవా సేవకులు బైబిలును ఎలా దృష్టిస్తారు, దానిని లోకమెలా దృష్టిస్తోంది?

5. (ఎ) బైబిలు సంబంధిత మతాల గురించి ఒక గ్రంథకర్త ఏమని వాదించాడు? (బి) బైబిలు చెబుతున్నవాటితో పోల్చినప్పుడు సాధారణ లోకసంబంధ తలంపులు కొన్ని ఎలా ఉన్నాయి? (పక్క పేజీలోవున్న బాక్సులోని విషయాలు చేర్చండి.)

6. దేవుడు ఖండించిన లైంగిక కృత్యాలకు సంబంధించి లోకపు దృక్కోణమెలా ఉంది?

7. మనల్ని మనం ఏమని ప్రశ్నించుకోవాలి?

8. ఒక వ్యక్తి యెహోవా నుండి దూరంగా ఎలా కొట్టుకుపోగలడు?

9. యెహోవా సొలొమోనును ఏయే విధాలుగా ఆశీర్వదించాడు?

10. సొలొమోను ఏ నిర్దేశానికి లోబడలేకపోయాడు, దాని ఫలితమేమిటి?

11. మనం మన మనస్సులోకి తీసుకునేది మన ఆలోచనపై ఎలా ప్రభావం చూపుతుంది?

12. (ఎ) ప్రజల ఆలోచనను సాతాను ఎలా ప్రభావితం చేస్తాడు? (బి) క్రైస్తవులు కూడా ప్రభావితులయ్యే అవకాశముందని ఏది చూపిస్తోంది?

13. చెడుసాంగత్యాలంటే ఏమిటి, మన సహవాసాలు మనపై ఎలాంటి ప్రభావం చూపుతాయి?

14. మనం ఏయే విధాలుగా లౌకికాత్మను ఎదిరించవచ్చు?

15. ప్రాచీన కొరింథులోని క్రైస్తవులు ఆ నగర ఇతర నివాసులకు ఎలా భిన్నంగా ఉన్నారు?

16. మనం దేవుని ఆత్మను ఎలా పొందవచ్చు, దానిని ఎలా కాపాడుకోవచ్చు?

17. లోతు అనుభవం మనకు ఏయే విధాలుగా ఓదార్పుకరం కావచ్చు?

18. యెహోవాతో మనకున్న సంబంధాన్ని మనమెందుకు కాపాడుకోవాలి?

[11వ పేజీలోని చార్టు]

లౌకికాత్మకు ప్రతికూలంగా దైవిక జ్ఞానం

ప్రజలు తమ సొంత సత్యాన్ని ఏర్పరచుకుంటారు, అలాంటి సత్యం సంపూర్ణం కాదు.

“[దేవుని] వాక్యమే సత్యము.”​—⁠యోహాను 17:17.

తప్పొప్పులను తీర్మానించుకోవడానికి, మీ భావాలనే నమ్ముకోండి.

“హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది.”​—⁠యిర్మీయా 17:⁠9.

మీకేది ఇష్టమైతే అది చేసుకోండి.

“మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదు.”​—⁠యిర్మీయా 10:23.

సంపదే సంతోషానికి కీలకం.

“ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము.”​—⁠1 తిమోతి 6:10.

[10వ పేజీలోని చిత్రం]

సొలొమోను సత్యారాధన నుండి దూరంగా కొట్టుకొనిపోయి అబద్ధ దేవతలవైపు తిరిగాడు

[12వ పేజీలోని చిత్రం]

వాణిజ్య ప్రకటనకర్తలాగే, సాతాను లౌకికాత్మను ప్రోత్సహిస్తున్నాడు. మీరు దానిని ఎదిరిస్తారా?