కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు బహుమానంపై దృష్టి కేంద్రీకరిస్తున్నారా?

మీరు బహుమానంపై దృష్టి కేంద్రీకరిస్తున్నారా?

మీరు బహుమానంపై దృష్టి కేంద్రీకరిస్తున్నారా?

అంధత్వానికి ముఖ్యకారణమైన గ్లుకోమా క్రమంగా వృద్ధి చెందుతుంది. గ్లుకోమా ఉన్న వ్యక్తికి మొదట్లో దృశ్యం పూర్తిగా కనిపించకుండా మధ్యభాగం మాత్రమే కనిపిస్తుంది. చికిత్స చేయించుకోకపోతే క్రమేణా ఆ మధ్యభాగం కూడా కనిపించకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. చివరకు కంటిచూపు పూర్తిగా పోతుంది.

మనం మన అక్షరార్థమైన కంటిచూపును క్రమంగా, మెల్లగా కోల్పోయే అవకాశం ఉన్నట్లే ఇంకా విలువైన చూపును అంటే మన ఆధ్యాత్మిక చూపును కోల్పోయే అవకాశం కూడా ఉంది. అందుకే మనం ఆధ్యాత్మిక విషయాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వాటిపై మన దృష్టిని కేంద్రీకరించడం చాలా ప్రాముఖ్యం.

బహుమానంపై దృష్టి కేంద్రీకరించడం

మనం మన అక్షరార్థమైన కళ్ళతో చూడలేని “అదృశ్యమైన” వాటిలో, యెహోవా తన విశ్వసనీయులకు ఇచ్చే మహిమాన్వితమైన నిత్యజీవితపు బహుమానం కూడా ఉంది. (2 కొరింథీయులు 4:​18) క్రైస్తవులు దేవుణ్ణి సేవించడానికిగల ప్రధాన కారణం ఆయనపై వారికున్న ప్రేమే. (మత్తయి 22:​37) అయితే మనకు లభించబోయే బహుమానం కోసం మనం ఆతురతతో ఎదురుచూడాలని యెహోవా ఆశిస్తున్నాడు. మనం “తన్ను వెదకువారికి ఫలము దయచేయు” ఉదారమైన తండ్రిగా ఆయనను అంగీకరించాలని ఆయన కోరుకుంటున్నాడు. (హెబ్రీయులు 11:⁠6) కాబట్టి దేవుణ్ణి నిజంగా తెలుసుకున్నవారు, ఆయనను ప్రేమించేవారు ఆయన వాగ్దానం చేసిన ఆశీర్వాదాలను విలువైనవిగా ఎంచి వాటి నెరవేర్పు కోసం ఎదురుచూస్తారు.​—⁠రోమీయులు 8:19, 24, 25.

ఈ పత్రికను, దీనితోపాటు వచ్చే తేజరిల్లు! పత్రికను చదివేవారిలో చాలామంది రాబోయే పరదైసు భూమిని వర్ణించే చిత్రాలను చూసి ఆనందిస్తారు. పరదైసు నిజానికి ఎలా ఉంటుందో మనం ఖచ్చితంగా చెప్పలేము కానీ ఈ పత్రికల్లో ప్రచురించబడే చిత్రాలు యెషయా 11:​6-9 వంటి లేఖనాల ఆధారంగా గీయబడిన చిత్రాలు మాత్రమే. అయినప్పటికీ ఒక క్రైస్తవ స్త్రీ ఇలా చెప్పింది: “రాబోయే పరదైసుకు సంబంధించిన చిత్రాలను నేను కావలికోట మరియు తేజరిల్లు! పత్రికల్లో చూసినప్పుడు, ఒక వ్యక్తి విహారయాత్రలకు సంబంధించిన బ్రోషుర్‌ను పరిశీలించినట్లుగా నేను వాటిని నిశితంగా పరిశీలిస్తాను. నన్ను నేను అక్కడ చూసుకునేందుకు నేను ప్రయత్నిస్తాను, ఎందుకంటే దేవుని నిర్ణీత కాలంలో నిజానికి నేను అక్కడ ఉండాలనే నిరీక్షిస్తున్నాను.”

అపొస్తలుడైన పౌలు తన “ఉన్నతమైన పిలుపు” గురించి కూడా అలాగే భావించాడు. తాను అప్పటికే దానిని సాధించినట్లు ఆయన భావించలేదు ఎందుకంటే ఆయన అంతం వరకూ విశ్వసనీయుడిగా ఉన్నట్లు నిరూపించుకోవాలి. కానీ ఆయన “ముందున్న వాటికొరకై వేగిరపడు[తూనే]” ఉన్నాడు. (ఫిలిప్పీయులు 3:​13, 14) అదేవిధంగా యేసు “తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై” హింసాకొయ్యపై మరణాన్ని సహించాడు.​—⁠హెబ్రీయులు 12:⁠1.

నూతనలోకంలోకి నేను ప్రవేశిస్తానా లేదా అని మీరెప్పుడైనా సందేహించారా? మనం అతినమ్మకంతో ఉండకుండా ఉండడం మంచిదే ఎందుకంటే మనం అంతం వరకూ నమ్మకంగా ఉంటేనే ఆ బహుమానాన్ని పొందుతాము. (మత్తయి 24:​13) అయితే మనం దేవుడు మన నుండి కోరేవాటిని నెరవేర్చడానికి మన శాయశక్తులా ప్రయత్నిస్తుంటే, ఆ బహుమానాన్ని పొందుతామనే దృఢ నమ్మకంతో ఉండవచ్చు. యెహోవా “యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు”న్నాడని గుర్తుంచుకోండి. (2 పేతురు 3:⁠9) మనం యెహోవాపై నమ్మకముంచితే, మన లక్ష్యాన్ని సాధించడానికి ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆయనను సంతోషపెట్టడానికి యథార్థంగా ప్రయత్నించేవారిని అనర్హులుగా చేసే విషయాల కోసం వెతకడం ఆయన స్వభావానికి విరుద్ధం.​—⁠కీర్తన 103:8-11; 130:3, 4; యెహెజ్కేలు 18:32.

యెహోవా తన ప్రజల గురించి ఎలా భావిస్తాడనే విషయం తెలుసుకోవడం మనకు నిరీక్షణను ఇస్తుంది​—⁠నిరీక్షణ విశ్వాసమంత ప్రాముఖ్యమైనది. (1 కొరింథీయులు 13:​13) బైబిల్లో “నిరీక్షణ” అని అనువదించబడిన గ్రీకు పదం “మంచి జరుగుతుందని ఆశించడం” అనే తలంపు కలిగివుంది. అలాంటి నిరీక్షణ గురించే మాట్లాడుతూ అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “మీరు మందులు కాక, విశ్వాసము చేతను ఓర్పుచేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనునట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనుపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించుచున్నాము.” (హెబ్రీయులు 6:​11, 12) మనం యెహోవాను సేవించడంలో నమ్మకంగా కొనసాగితే, మన నిరీక్షణ పరిపూర్ణమవుతుందని నమ్మకం కలిగివుండవచ్చని గమనించండి. లోకసంబంధమైన ఆశల్లా ఈ నిరీక్షణ మనలను “సిగ్గుపరచదు.” (రోమీయులు 5:⁠5) కాబట్టి మనం మన నిరీక్షణను సజీవంగా ఉంచుకొని దానిపై మన దృష్టిని ఎలా కేంద్రీకరించవచ్చు?

మన ఆధ్యాత్మిక దృష్టిని ఎలా మెరుగుపరచుకోవచ్చు?

మన అక్షరార్థమైన కళ్ళు ఒకే సమయంలో రెండు విషయాలపై దృష్టి నిలుపలేవు. మన ఆధ్యాత్మిక దృష్టి విషయంలో కూడా అది వాస్తవం. ప్రస్తుత విధానంలోని విషయాలపై దృష్టి నిలపడం, దేవుడు వాగ్దానం చేసిన నూతనలోకం మన మనస్సుల్లో మరుగునపడేలా చేస్తుందనడంలో సందేహం లేదు. కొంతకాలానికి మసకగా కనిపించే ఆ చిత్రం మనలను ఆసక్తిపరచదు, అది దృష్టినుండి తొలగిపోతుంది. అలా జరగడం ఎంత వినాశనకరమో కదా! (లూకా 21:​34) కాబట్టి మనం మన ‘కన్నులను తేటగా’ ఉంచుకోవడం, అది దేవుని రాజ్యంపై మరియు నిత్యజీవమనే బహుమానంపై కేంద్రీకరించబడి ఉండేలా చూసుకోవడం ఎంత ప్రాముఖ్యమో కదా!​—⁠మత్తయి 6:22.

కన్నులను తేటగా ఉంచుకోవడం ఎల్లప్పుడూ అంత సులభం కాదు. అనుదిన సమస్యలకు మనం అవధానం ఇవ్వాల్సి ఉంటుంది, మనం పరధ్యానంలో పడిపోవచ్చు లేదా మనకు శోధనలు ఎదురు కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇతర అవసరమైన కార్యకలాపాలను నిర్లక్ష్యం చేయకుండానే రాజ్యంపై మరియు దేవుడు వాగ్దానం చేసిన నూతనలోకంపై మన దృష్టిని ఎలా కేంద్రీకరించవచ్చు? మనం మూడు మార్గాలను పరిశీలిద్దాము.

దేవుని వాక్యాన్ని ప్రతిరోజు అధ్యయనం చేయండి. క్రమంగా బైబిలును చదవడం, బైబిలు ఆధారిత ప్రచురణలను అధ్యయనం చేయడం మనం మన మనస్సులను ఆధ్యాత్మిక విషయాలపై నిలిపివుంచడానికి సహాయం చేస్తాయి. నిజమే మనం ఎన్నో సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తుండవచ్చు, కానీ మనం జీవించివుండడానికి భౌతిక ఆహారం ఎలా తీసుకుంటూనే ఉండాలో అలాగే బైబిలును అధ్యయనం చేయడంలో కొనసాగాలి. మనం గతంలో వేలసార్లు భోజనం చేశాము కాబట్టి ఇప్పుడు భోజనం చేయడం మానుకోము. కనుక మనకు బైబిలు గురించి ఎంత తెలిసినప్పటికీ, మనం మన నిరీక్షణను సజీవంగా ఉంచుకోవడానికి, మన విశ్వాసాన్ని ప్రేమను బలంగా ఉంచుకోవడానికి క్రమంగా నిరంతరం ఆధ్యాత్మిక పోషణను తీసుకుంటూనే ఉండాలి.​—⁠కీర్తన 1:1-3.

దేవుని వాక్యాన్ని కృతజ్ఞతతో ధ్యానించండి. ధ్యానించడం ఎందుకు ఆవశ్యకం? దానికి రెండు కారణాలున్నాయి. మొదటిగా, అది మనం చదివినదానిని అర్థం చేసుకోవడానికి మరియు దానిపట్ల ప్రగాఢమైన కృతజ్ఞతా భావాన్ని పెంపొందింపజేసుకోవడానికి సహాయం చేస్తుంది. రెండవదిగా, మనం యెహోవాను, ఆయన అద్భుత కార్యాలను, ఆయన మన ఎదుట ఉంచిన నిరీక్షణను మరచిపోకుండా ఉండేందుకు ధ్యానించడం సహాయం చేస్తుంది. దీనిని ఇలా ఉదహరించవచ్చు: మోషేతోపాటు ఐగుప్తును విడిచి వచ్చిన ఇశ్రాయేలీయులు, యెహోవా అమితమైన శక్తి ప్రదర్శనలను స్వయంగా తమ కళ్ళతో చూశారు. వారిని వారి స్వాస్థ్యమైన వాగ్దాన దేశానికి నడిపించేటప్పుడు ఆయన వారికి కల్పించిన ప్రేమపూర్వకమైన రక్షణను కూడా వారు అనుభవించారు. అయితే ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశానికి వెళ్ళే దారిలో అరణ్య ప్రాంతానికి చేరుకోగానే వాళ్ళు గొణగడం ప్రారంభించారు, వారికి విశ్వాసం కొరవడిందని అది చూపించింది. (కీర్తన 78:​11-17) వారి సమస్యేమిటి?

ఆ ప్రజలు తమ దృష్టిని యెహోవాపైనుండి, ఆయన వారి ఎదుట ఉంచిన అద్భుతమైన నిరీక్షణపైనుండి తమ సౌకర్యాలపైకి మరియు శారీరక చింతలపైకి మళ్ళించారు. ఇశ్రాయేలీయులు స్వయంగా అద్భుతకార్యాలను చూసినప్పటికీ వారిలో చాలామంది విశ్వాసంలేకుండా ఫిర్యాదు చేసేవారిగా తయారయ్యారు. ‘వారు ఆయన [యెహోవా] కార్యములను వెంటనే మరచిపోయిరి’ అని కీర్తన 106:⁠13 చెబుతోంది. వారి నిర్లక్ష్యం క్షమించరానిది, అది వారిని వాగ్దాన దేశంలోకి ప్రవేశించకుండా చేసింది.

కాబట్టి మీరు లేఖనాలను లేదా బైబిలు అధ్యయన సహాయకాలను చదివేటప్పుడు, మీరు చదువుతున్న విషయాల గురించి ధ్యానించడానికి సమయం తీసుకోండి. అలా ధ్యానించడం మీ ఆధ్యాత్మిక ఆరోగ్యానికి, ఎదుగుదలకు ఎంతో అవసరం. ఉదాహరణకు పైన కొంత ఉల్లేఖించబడిన 106వ కీర్తన చదివేటప్పుడు యెహోవా లక్షణాల గురించి ధ్యానించండి. ఆయన ఇశ్రాయేలీయుల విషయంలో ఎంత సహనం చూపించాడో ఎంత దయతో వ్యవహరించాడో గమనించండి. వాళ్ళు వాగ్దాన దేశానికి చేరుకోవడానికి సహాయపడేందుకు ఆయన చేయగలిగినదంతా ఎలా చేశాడో చూడండి. వాళ్ళు ఆయనకు వ్యతిరేకంగా ఎలా తిరుగుబాటు చేస్తూనే ఉన్నారో గమనించండి. ఎలాంటి కృతజ్ఞతా భావం లేకుండా మొద్దుబారిపోయిన ప్రజలు తన దయను సహనాన్ని పరీక్షిస్తుండగా యెహోవా అనుభవించిన తీవ్రమైన బాధను నొప్పిని ఊహించుకోండి. అంతేకాక, ఫీనెహాసు నీతికోసం దృఢంగా ధైర్యంగా నిలబడడాన్ని వర్ణిస్తున్న 30, 31 వచనాలపై ధ్యానించడం ద్వారా, యెహోవా తనపై విశ్వాసముంచేవారిని మరచిపోడని ఆయన వారిని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడని మనకు హామీ లభిస్తుంది.

బైబిలు సూత్రాలను మీ జీవితంలో అన్వయించుకోండి. మనం బైబిలు సూత్రాలను అన్వయించుకున్నప్పుడు, దేవుని ఉపదేశం పనిచేస్తుందని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాము. సామెతలు 3:​5, 6 ఇలా చెబుతోంది: “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.” చాలామంది అనుసరించిన అనైతిక మార్గాలు, మానసికమైన, భావోద్రేకమైన, శారీరకమైన సమస్యలకు ఎలా దారి తీశాయో ఆలోచించండి. అలాంటి ప్రజలు క్షణికమైన ఆనందాలలో మునిగితేలడం ద్వారా ఎన్నో సంవత్సరాలపాటు​—⁠ఒక జీవితకాలంపాటు కూడా​—⁠తీవ్రమైన వ్యథను అనుభవిస్తారు. దానికి పూర్తి విరుద్ధంగా ‘ఇరుకు దారిలో’ నడిచే ప్రజలు నూతన వ్యవస్థలో జీవితం ఎలా ఉంటుందో చవిచూస్తారు, వాళ్ళు జీవ మార్గంలో నడవడానికి అది వారిని ప్రోత్సహిస్తుంది.​—⁠మత్తయి 7:13, 14; కీర్తన 34:⁠8.

బైబిలు సూత్రాలను అన్వయించుకోవడం సవాలుగా ఉండవచ్చు. కొన్నిసార్లు మనం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు, లేఖనాధారితం కాని పరిష్కారం తక్షణ ఉపశమనాన్ని కలుగజేసేదిగా కనిపించవచ్చు. ఉదాహరణకు ఆర్థిక కష్టాలు ఎదురైనప్పుడు రాజ్యానికి సంబంధించిన విషయాలను రెండవ స్థానంలోకి నెట్టివేయడానికి శోధింపబడవచ్చు. అయితే విశ్వాసంతో ప్రవర్తించేవారు, తమ ఆధ్యాత్మిక దృష్టిని సరైన స్థానంలో ఉంచుకునేవారు ‘దేవునియందు భయభక్తులు గలవారు క్షేమముగా నుందురు’ అని హామీ ఇవ్వబడింది. (ప్రసంగి 8:​12) ఒక క్రైస్తవుడు కొన్నిసార్లు ఎక్కువ గంటలు పనిచేయవలసి రావచ్చు, అయితే ఆయన ఆధ్యాత్మిక విషయాలను తృణీకరించి అవి అంత ప్రాముఖ్యమైనవి కావని వాటిని పక్కకు నెట్టేసిన ఏశావువలే ఎన్నడూ తయారుకాకూడదు.​—⁠ఆదికాండము 25:34; హెబ్రీయులు 12:16.

క్రైస్తవులుగా మనకుండవలసిన బాధ్యతల గురించి యేసు స్పష్టంగా వివరించాడు. మనం ‘రాజ్యమును దేవుని నీతిని మొదట వెదుకుతూ’ ఉండాలి. (మత్తయి 6:​33) మనమలా చేస్తే, యెహోవా మన భౌతిక అవసరాలు తీరేలా చేయడం ద్వారా తండ్రిగా ఆయనకు మనపట్ల ఉన్న ప్రేమను ప్రదర్శిస్తాడు. తాను చూసుకుంటాను అని చెప్పిన విషయాల గురించి మనం చింతించాలని ఆయన ఎంతమాత్రం కోరుకోవడం లేదు. అలా అధికంగా చింతించడం ఆధ్యాత్మిక గ్లుకోమావంటిది​—⁠దానిని నిర్లక్ష్యం చేస్తే అది క్రమంగా మన కంటిచూపును తగ్గించి మనం కేవలం భౌతిక విషయాలను మాత్రమే చూసేలా చేస్తుంది, చివరకు అది మనకు ఆధ్యాత్మిక అంధత్వం కలుగజేస్తుంది. మనం అదే పరిస్థితిలో కొనసాగితే యెహోవా దినము మనమీదికి “ఉరివచ్చినట్టు” వస్తుంది. అది ఎంత వినాశనకరమో కదా!​—⁠లూకా 21:34-36.

యెహోషువలా మీ దృష్టిని కేంద్రీకరించుకోండి

మనం మన మహిమాన్వితమైన రాజ్య నిరీక్షణపై దృష్టిని కేంద్రీకరించి, ఇతర బాధ్యతలను సరైన స్థానంలో ఉంచుదాం. క్రమబద్ధంగా అధ్యయనం చేయడంలోను, ధ్యానించడంలోను, బైబిలు సూత్రాలను అన్వయించుకోవడంలోను కొనసాగితే మనం యెహోషువలాగే మన నిరీక్షణ విషయంలో దృఢ నమ్మకం కలిగివుండవచ్చు. ఇశ్రాయేలును వాగ్దాన దేశంలోకి నడిపించిన తర్వాత ఆయన ఇలా అన్నాడు: “మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటియైనను తప్పియుండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు; అవి అన్నియు మీకు కలిగెను, వాటిలో ఒక్కటియైనను తప్పియుండలేదు.”​—⁠యెహోషువ 23:14.

రాజ్య నిరీక్షణ మీకు బలాన్నిచ్చి, అది మీ తలంపుల్లోను, భావాల్లోను, నిర్ణయాల్లోను, కార్యకలాపాల్లోను ప్రతిబింబిస్తుండగా అది మిమ్మల్ని సంతోషపరచును గాక.​—⁠సామెతలు 15:15; రోమీయులు 12:12.

[21వ పేజీలోని చిత్రం]

నూతనలోకంలోకి నేను ప్రవేశిస్తానా లేదా అని మీరెప్పుడైనా సందేహించారా?

[22వ పేజీలోని చిత్రం]

ధ్యానించడం, బైబిలు అధ్యయనం చేయడంలో ఒక ముఖ్య భాగం

[23వ పేజీలోని చిత్రాలు]

రాజ్య సంబంధ విషయాలపై దృష్టి నిలపండి