కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లైబీరియా యుద్ధకాలంలోనూ రాజ్య విస్తరణ

లైబీరియా యుద్ధకాలంలోనూ రాజ్య విస్తరణ

లైబీరియా యుద్ధకాలంలోనూ రాజ్య విస్తరణ

లైబీరియాలో ఒక దశాబ్దం కంటే ఎక్కువకాలంపాటు తీవ్రమైన అంతర్యుద్ధం కొనసాగింది. 2003వ సంవత్సరం మధ్యకాలానికల్లా, తిరుగుబాటుదారులు రాజధాని నగరమైన మన్రోవియాకు చేరుకున్నారు. చాలామంది యెహోవాసాక్షులు తమ ఇళ్ళను వదిలి పారిపోవలసి వచ్చింది, కొన్ని సందర్భాల్లోనైతే వాళ్ళు ఒకసారి కాదుగానీ చాలాసార్లు అలా పారిపోవలసి వచ్చింది. పదేపదే వాళ్ళ ఆస్తులు దోచుకోబడ్డాయి.

విచారకరమైన విషయమేమిటంటే, రాజధానిలో జరిగిన పోరాటంలో వేలాదిమంది హతమయ్యారు. వాళ్ళలో ఇద్దరు సాక్షులు కూడా ఉన్నారు, ఒక సహోదరుడు, ఒక సహోదరి. ఇతర సహోదరులు ఆ కష్టాలను ఎలా ఎదుర్కొన్నారు, వాళ్ళ సహాయార్థం ఏమి చేయబడింది?

అవసరంలోవున్నవారికి సహాయం

ఇలా అంతర్యుద్ధం జరిగిన కాలమంతటిలోను, లైబీరియాలోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయం అవసరంలోవున్నవారి కోసం సహాయ కార్యకలాపాలను వ్యవస్థీకరిస్తూనే ఉంది. ఆహారం, అవసరమైన గృహ సామాగ్రి, మందులు అందజేయబడ్డాయి. తిరుగుబాటుదార్లు ఓడ రేవు ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నప్పుడు, ఆహార కొరత ఏర్పడింది. అలా జరుగుతుందని ముందే ఊహించిన బ్రాంచి కార్యాలయం, నగరమంతటావున్న రాజ్యమందిరాల్లో ఆశ్రయం పొందిన రెండువేల మంది సాక్షుల కోసం అవసరమైనవాటిని సిద్ధంగా ఉంచుకుంది. ఓడరేవు మళ్ళీ తెరవబడేంతవరకూ సరుకులు సరిపోయేలా సహోదరులు ఆహారాన్ని పరిమితంగా అందజేశారు. బెల్జియం మరియు సియర్రాలియోన్‌ బ్రాంచీలు విమానాల ద్వారా మందులు పంపించాయి, బ్రిటన్‌ మరియు ఫ్రాన్స్‌ బ్రాంచీలు ఓడల ద్వారా బట్టలను సరఫరా చేశాయి.

నిరాశాభరితమైన పరిస్థితుల్లోనూ మన సహోదరులు ఆశాభావంతో, సంతోషంగా ఉన్నారు. తన ఇంటినుండి మూడుసార్లు పారిపోయిన ఒక సహోదరుడు చేసిన వ్యాఖ్యానం చాలామంది సహోదరుల అభిప్రాయాన్ని వెల్లడిచేస్తుంది. ఆయన ఇలా అన్నాడు: “ఈ పరిస్థితుల గురించే మనం ప్రకటిస్తాం; మనం అంత్యదినాల్లోనే జీవిస్తున్నాము.”

సువార్తకు లభించిన ప్రతిస్పందన

దేశవ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులు ఉన్నప్పటికీ, పరిచర్యలో సాక్షులు అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారు. 2003, జనవరి నెలలో రాజ్య ప్రచారకుల సంఖ్య సర్వకాల శిఖరాగ్ర సంఖ్యకు అంటే 3,879కి చేరుకుంది, ఫిబ్రవరిలో వాళ్ళు 15,227 గృహ బైబిలు అధ్యయనాలను నిర్వహించారు.

ప్రజలు సువార్తకు వెంటనే ప్రతిస్పందిస్తున్నారు. ఆ దేశపు ఆగ్నేయ ప్రాంతంలోని ఒక గ్రామంలో జరిగిన సంఘటన ఆ విషయానికి ఉదాహరణగా ఉంది. ఒక సంఘం కూటాల కోసం సాధారణంగా కలుసుకునే ప్రాంతంలో కాకుండా అక్కడనుండి ఐదు గంటలు నడిచి వెళ్ళవలసినంత దూరంలోవున్న ఒక పెద్ద గ్రామమైన బ్వాన్‌లో క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణ జరుపుకోవాలని నిశ్చయించుకుంది. సహోదరులు ఆ గ్రామంలోని ప్రజలను జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానించడానికి వెళ్ళేముందు, బ్వాన్‌ గ్రామ మేయర్‌కు ఆహ్వానం ఇవ్వబడింది. ఆయన ఆ ఆహ్వానాన్ని అందుకొన్న తర్వాత తన బైబిలు తీసుకొని, గ్రామస్థుల వద్దకు వెళ్ళి, ఆహ్వాన పత్రంలో ఇవ్వబడిన ఒక లేఖనాన్ని చదివి వినిపించి, జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవ్వమని వారిని ప్రోత్సహించాడు. కాబట్టి ప్రచారకులు గ్రామస్థులను ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు, తాము చేయాల్సిన పనిని తమకోసం మేయర్‌ చేసిపెట్టాడని తెలుసుకున్నారు! మేయర్‌ తన ఇద్దరు భార్యలు, పిల్లలతోపాటు జ్ఞాపకార్థ ఆచరణకు హాజరయ్యాడు. మొత్తం 27 మంది హాజరయ్యారు. ఆ తర్వాత మేయర్‌ మెథడిస్టు చర్చిని వదిలిపెట్టి సాక్షులతో అధ్యయనం చేయడం ప్రారంభించి, రాజ్యమందిర నిర్మాణం కోసం స్థలాన్ని కూడా ఇచ్చాడు.

దృక్పథంలో మార్పు

మన సహోదరుల ప్రవర్తన, సత్యం గురించి కొంతమంది వ్యతిరేకులకున్న దృక్పథాన్ని మార్చడానికి కూడా సమర్థవంతంగా పనిచేసింది. ఒపొకు అనే వ్యక్తి ఉదాహరణను పరిశీలించండి. ఒక ప్రత్యేక పయినీరు ప్రచారకుడు ఆయనను క్షేత్ర సేవలో కలిసి, ఆయనకు కావలికోట పత్రికను ఇచ్చాడు. ఆ పత్రికలోని ఒక ఆర్టికల్‌ ఒపొకుకు నచ్చింది, కాని దానిని తీసుకోవడానికి తన దగ్గర డబ్బు లేదని ఆయన చెప్పాడు. ఆ పత్రికను డబ్బులకు ఇవ్వడంలేదని వివరించిన తర్వాత ఆ పయినీరు దానిని ఆయనకు ఇచ్చి మళ్ళీ కలుసుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆయనను పునర్దర్శించినప్పుడు ఒపొకు పయినీరును ఇలా ప్రశ్నించాడు: “నేను ఎవరో మీకు తెలుసా? హార్పర్‌ పట్టణంలోవుండే మీ వాళ్ళు చాలామంది నన్ను గుర్తుపడతారు. నేను మీ పిల్లలను స్కూలునుండి బహిష్కరించేవాడిని!” ఆ పట్టణంలోని ఒక హైస్కూలుకు తాను ప్రిన్సిపాల్‌గా ఉండేవాడినని, జెండా వందనం చేయనందుకు యెహోవాసాక్షుల పిల్లలను తాను హింసించేవాడినని ఆయన వివరించాడు.

అయితే యెహోవాసాక్షులు క్రైస్తవ ప్రేమను ప్రదర్శించిన మూడు సంఘటనలు, ఒపొకు తన వైఖరిని తిరిగి పరిశీలించుకునేలా చేశాయి. మొదటిగా, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న ఒక ఆధ్యాత్మిక సహోదరుడిని సాక్షులు ఎంతో బాగా చూసుకోవడాన్ని ఆయన గమనించాడు. ఆ సహోదరుడు పొరుగు దేశానికి వెళ్ళి చికిత్స చేయించుకోవడానికి కూడా వాళ్ళు ఏర్పాట్లు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆ సహోదరుడు బహుశా సాక్షుల్లో “ప్రముఖుడై” ఉండవచ్చు అని ఒపొకు తలంచాడు, కాని ఆయన ఒక సాధారణ సాక్షే అని తర్వాత తెలుసుకున్నాడు. రెండవదిగా, 1990ల కాలంలో ఒపొకు కోటె డి ఐవరీలో శరణార్థిగా ఉండేవాడు. ఒకరోజు ఆయనకు దాహం వేసినప్పుడు ఆయన ఒక యువకుడి దగ్గర నీళ్ళు కొనుక్కోవడానికి వెళ్ళాడు. ఒపొకు దగ్గర కేవలం ఒకే పెద్ద నోటు ఉండింది, కానీ ఆ యువకుడి దగ్గర చిల్లర లేకపోవటంతో ఆయన ఒపొకుకు నీళ్ళు ఉచితంగా ఇచ్చాడు. ఆ యువకుడు ఒపొకుకు నీళ్ళు అందిస్తూ ఇలా ప్రశ్నించాడు: “మీలాంటి నాలాంటి ప్రజలు డబ్బులు అడక్కుండానే ఒకరికొకరు వస్తువులు ఇచ్చిపుచ్చుకునే సమయం ఎప్పటికైనా వస్తుందంటారా?” ఆ యువకుడు యెహోవాసాక్షి అయివుంటాడు అని ఒపొకు ఊహించాడు, తాను యెహోవాసాక్షినేనని ఆ యువకుడు చెప్పాడు. ఆ సహోదరుని ఉదారత, దయ ఒపొకును ప్రభావితం చేశాయి. చివరకు, డబ్బులు చెల్లించక్కరలేకుండానే తనకు పత్రిక ఇవ్వడానికి ప్రత్యేక పయినీరు చూపించిన సుముఖత, సాక్షుల గురించిన తన దృక్పథం తప్పని తాను దానిని మార్చుకోవలసిన అవసరం ఉందని ఒపొకును ఒప్పించింది. ఆయన ఆధ్యాత్మికంగా అభివృద్ధి సాధించి ఇప్పుడు బాప్తిస్మం తీసుకోని ప్రచారకునిగా ఉన్నాడు.

లైబీరియాలోని సహోదరులు ఎంతో కష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ, వాళ్ళు దేవునియందు విశ్వాసముంచి, దేవుని రాజ్యంలో నీతియుక్తమైన పరిపాలన క్రింద ఉండే మంచి పరిస్థితుల గురించిన సువార్తను విశ్వసనీయంగా ప్రకటిస్తూనే ఉన్నారు. వారి శ్రమను, తన నామంపట్ల వారు చూపించిన ప్రేమను యెహోవా ఎన్నటికీ మరచిపోడు.​—⁠హెబ్రీయులు 6:10.

[30వ పేజీలోని మ్యాపులు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

మన్రోవియా

[31వ పేజీలోని చిత్రాలు]

కష్టకాలాల్లో, అవసరంలోవున్నవారికి యెహోవా ప్రజలు ఆధ్యాత్మిక, భౌతిక సహాయాన్ని అందజేస్తారు