కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సహాయం కోసం మనం దేవదూతలకు ప్రార్థించాలా?

సహాయం కోసం మనం దేవదూతలకు ప్రార్థించాలా?

సహాయం కోసం మనం దేవదూతలకు ప్రార్థించాలా?

కష్టాల్లోవున్నప్పుడు దేవదూతలకు ప్రార్థించడం సరైనదేనా? చాలామంది ప్రజలు అది సరైనదేనని భావిస్తారు. నిజానికి న్యూ క్యాథలిక్‌ ఎన్‌సైక్లోపీడియా ఇలా చెబుతోంది: “దేవదూతలు . . . మన తరఫున దేవుని ఎదుట వేడుకుంటారన్న ఉద్దేశంతోనే . . . ఎవరైనా వాళ్ళకు ప్రార్థన చేస్తారు.” మన తరఫున దేవుణ్ణి వేడుకోవడానికి మనం దేవదూతలకు ప్రార్థించాలా?

దేవుని వాక్యంలో, దేవునికి విశ్వసనీయులైన దేవదూతల్లో కేవలం ఇద్దరి పేర్లు మాత్రమే అంటే మిఖాయేలు, గబ్రియేలు దూతల పేర్లు మాత్రమే ఇవ్వబడ్డాయి. (దానియేలు 8:16; 12:1; లూకా 1:26; యూదా 9) ఈ పేర్లు బైబిల్లో ఇవ్వబడ్డాయి కాబట్టి, ప్రతీ దేవదూత ఒక పేరుగల ప్రత్యేకమైన ఆత్మ ప్రాణి అని, ఎలాంటి వ్యక్తిత్వమూ లేని శక్తి కాదని మనం గ్రహించవచ్చు. అయితే ఇతర దేవదూతలు తమ పేర్లను వెల్లడి చేయడానికి నిరాకరించారు. ఉదాహరణకు, యాకోబు తనను సందర్శించిన దేవదూతను పేరు చెప్పమని అడిగితే, ఆ దూత తన పేరు చెప్పడానికి నిరాకరించాడు. (ఆదికాండము 32:29; న్యాయాధిపతులు 13:​17, 18) మానవులు దేవదూతలకు అనవసరమైన అవధానం ఇవ్వడానికి వీలులేకుండా బైబిల్లో దేవదూతల పేర్ల పట్టిక ఇవ్వబడలేదు.

దేవదూతలకు ఉండే బాధ్యతల్లో ఒకటి, దేవుని సందేశాలను మానవులకు అందజేయడం. నిజానికి “దేవదూత” అని అనువదించబడిన హీబ్రూ మరియు గ్రీకు మూలపదాలకు అక్షరార్థంగా “రాయబారి” అని అర్థం. అయితే మానవుల ప్రార్థనలను సర్వోన్నతుని సింహాసనం వద్దకు తీసుకునివెళ్ళే మధ్యవర్తులుగా దేవదూతలు పనిచేయరు. ప్రార్థనలు తనకే చేయబడాలని, తన కుమారుడైన యేసుక్రీస్తు నామమున మాత్రమే చేయబడాలని దేవుడు నిర్ణయించాడు. యేసుక్రీస్తు ఇలా చెప్పాడు: “మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకనుగ్రహించును.”​—⁠యోహాను 15:16; 1 తిమోతి 2:⁠5.

మనం యెహోవా దేవునికి సరైన విధంగా ప్రార్థిస్తే, ఆయన ఎన్నడూ మన ప్రార్థనలను వినలేనంత తీరిక లేకుండా ఉండడు. బైబిలు మనకు ఇలా హామీ ఇస్తోంది: “తనకు మొఱ్ఱపెట్టువారి కందరికి తనకు నిజముగా మొఱ్ఱపెట్టువారి కందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు.”​—⁠కీర్తన 145:18.