666 కేవలం ఒక ప్రహేళిక కాదు
666 కేవలం ఒక ప్రహేళిక కాదు
“ఆ ముద్ర, అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్యయైనను గలవాడు తప్ప, క్రయ విక్రయములు చేయుటకు మరి యెవనికిని అధికారము లేకుండునట్లు అది . . . చేయుచున్నది. బుద్ధిగలవాడు మృగముయొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము; అది యొక మనుష్యుని సంఖ్యయే; ఆ సంఖ్య ఆరువందల అరువది యారు; ఇందులో జ్ఞానము కలదు.”—ప్రకటన 13:17, 18.
మర్మగర్భంగావున్న ‘మృగపు’ ముద్ర లేదా పేరు అంటే 666కు సంబంధించిన ప్రవచనం రేకెత్తించినంత ఆసక్తిని, చింతను కొన్ని బైబిలు అంశాలు మాత్రమే రేకెత్తించాయి. టెలివిజన్లో, ఇంటర్నెట్లో, సినిమాల్లో, పుస్తకాల్లో, పత్రికల్లో ఆ మృగపు ముద్ర అంతులేని ఊహాగానాల చర్చాంశమైంది.
బైబిల్లో చెప్పబడ్డ క్రీస్తువిరోధి ముద్రే 666 అని కొందరు నమ్ముతున్నారు. ఒక వ్యక్తి మృగపు సేవకుడని గుర్తించే పచ్చబొట్టు లేదా డిజిటల్ కోడ్‌తో చర్మంక్రింద ఉంచబడ్డ మైక్రోచిప్ వంటి తప్పనిసరి గుర్తింపు ముద్రలాంటి దానిని అది సూచిస్తుందని మరికొందరు చెబుతున్నారు. ఇంకా కొందరైతే ఆ 666 క్యాథలిక్ పోపు అధికార వ్యవస్థ గుర్తని నమ్ముతున్నారు. పోప్‌కు ఉన్న వికారియస్ ఫిల్లీ డీ (దేవుని పుత్ర ప్రధానాధికారి) అనే సాధికార బిరుదు రూపంలోని అక్షరాలకు ప్రత్యామ్నాయంగా రోమన్ అంకెలుచేర్చి, సంఖ్యలను కాస్త తారుమారుగా లెక్కలుకట్టి అది 666 అని వారు పేర్కొంటున్నారు. అదే సంఖ్యను రోమా చక్రవర్తి డైక్లీషియన్ పేరు నుండి, హీబ్రూ భాషలో నీరో సీసర్ పేరు నుండి లెక్కించవచ్చని కూడా కొందరు వాదిస్తున్నారు. *
అయితే మనం తర్వాతి ఆర్టికల్‌లో చూడబోతున్నట్లు ఈ ఊహాకల్పిత భాష్యాలు, ఆ మృగపు ముద్ర గురించి బైబిలు చెప్పేదానికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. దేవుడు ప్రస్తుత విధానాన్ని అంతమొందించినప్పుడు ఆ ముద్రగలవారు దేవుని ఉగ్రత తప్పక చవిచూస్తారని బైబిలు వెల్లడిస్తోంది. (ప్రకటన 14:9-11; 19:20) కాబట్టి 666 భావాన్ని అర్థం చేసుకోవడం ఆసక్తికరమైన ఒక ప్రహేళికను పరిష్కరించడం కంటే ఎక్కువే. సంతోషకరమైన విషయమేమిటంటే, ప్రేమామయుడు, ఆధ్యాత్మిక వెలుగుకు మూలాధారుడైన యెహోవా దేవుడు ఈ ప్రాముఖ్యమైన విషయంలో తన సేవకులను అంధకారంలో ఉంచలేదు.—2 తిమోతి 3:16; 1 యోహాను 1:5; 4:8.
[అధస్సూచి]
^ పేరా 4 సంఖ్యాశాస్త్రంపై చర్చకోసం తేజరిల్లు! (ఆంగ్లం) సెప్టెంబరు 8, 2002 సంచిక చూడండి.